Sunday, June 6, 2010

వేదం - ఇలాటి సినిమా తెలుగులో రాలేదు


గమ్యం సినిమా నాకు పెద్ద గొప్ప సినిమాలాగా అనిపించలేదు. కొంచం విభిన్నంగా ఉన్నఒక మామూలు సినిమా.
ఎందుకు ఈ దర్శకుడిని ఇంత ఎత్తేస్తున్నారు? బహుశా అతనికి సినిమా వాళ్లతో ఉన్న పరిచయం వల్లనేమో అనుకున్నాను. సాధారణంగా మొదటి సినిమా తో పైకెగిరి రెండవ సినిమాకి చతికిల పడే దర్శకుల్లో చేరిపోతాడేమో అనుకున్నాను. కానీ వేదం చూశాక ఇతను మంచి విషయం ఉన్న దర్శకుడు అని తెలిసింది.
అయిదు పాత్రలు, వారి కథలు ఒక చోట కలవడం. అది వారి జీవితాలని మలుపు తిప్పడం వేదం కథ అని చూచాయిగా తెలిసింది మీడియా లో సినిమా గురించి ఊదరకొట్టడం వల్ల. ఆడియో నాకు వినగానే బాగా నచ్చింది ముఖ్యంగా "మళ్ళీ పుట్టనీ", "ఏ చీకటీ" పాటలు. సాహిత్యం కూడా చాలా చక్కగా ఉంది. సరిగ్గా వాడుకుంటారా సినిమాకి అన్న అనుమానం మొదలైంది.
రకరకాల సమీక్షల  ద్వారా పాజిటివ్ టాక్ చూసి సినిమా బానే ఉంటుందిలే అనుకునే బయల్దేరాం. బే ఏరియా లో తెలుగు సినిమాకి  హాలు నిండడం, టికెట్ లు అయిపోయాయని ఇంకో ఎక్స్ట్రా షో వెయ్యడం మగధీర తరువాత ఇదేనేమో. 



సినిమా మొదలైంది. ఒక్కొక్క పాత్రని ప్రవేశపెట్టడం మెల్లగా కథని ఆవిష్కరించడం బావుంది. మనోజ్ పాత్రకి ఇంకెవరి నయినా పెట్టాల్సింది.  ఇంటర్వల్ సమయానికి బాగా తీసాడు, ఎక్కడా బోర్ కొట్టలేదు అనుకున్నాం (ఈ మధ్య ఇది కూడా కష్టం అయిపోయింది తెలుగు సినిమాలలో). ఇంటర్వల్ తరువాత ఇక కథలో లీనమయిపోయాం.క్లైమాక్స్ కి జనం నించి మంచి రెస్పాన్స్ వచ్చింది.

పాత్రలు తప్ప నటులు కనపడలేదు. ముఖ్యంగా అనుష్కా, అల్లు అర్జున్ బాగా చేశారు. అనుష్కా కి స్నేహితురాలి(/స్నేహితుడి)గా చేసిన నటుడు అద్భుతంగా చేశాడు. నాకు మధుర్ బండార్కర్ సినిమాలలో కనిపించే పాత్రలు గుర్తొచ్చాయ్. ఇంచు మించు అందరు నటులు తమ పాత్రలకి ప్రాణం పోశారు.
ఈ సినిమాకి నిజమయిన హీరో క్రిష్. ఇతను ఇలాటి కొత్త రకం తెలుగు సినిమాలు తీసి మున్ముందు కొత్త శకం తెలుగు సినిమాకి ప్రతినిధి అవుతాడని ఒక ఆశ కలిగింది. నాకు కొత్త వారిలో (గత దశాబ్దం అనుకోండి) శేఖర్ కమ్ముల, సుకుమార్, చంద్ర శేఖర్  యేలేటి  సినిమాలు నచ్చుతాయ్. కానీ  అన్నిటిలోనూ ఏదో వెలితి ఉంటుంది.    శేఖర్ కమ్ముల సినిమాలలో టెక్నికల్ గా పర్ఫెక్షన్ ఉండదు. సినిమా మాధ్యమాన్ని బాగా వాడుకుని కథని ఎలివేట్ చేసే శక్తి లేదు కమ్ములకి. సుకుమార్ టెక్నికల్ గా పెర్ఫెక్షన్ ఉంటుంది, టేకింగ్ స్టైలిష్గా  ఉంటుంది   కానీ కథ లో ఏదో లోపం , వెలితి కనిపిస్తాయ్.లేకపోతె ఏదో ఎక్కడో తేడా చేసేస్తాడు.  ఇక చంద్రశేఖర్ యేలేటి. నాకు అనుకోకుండా ఒక రోజు చూసి మైండ్ బ్లాక్ ఐంది. తెగ నచ్చింది. ఇతని సినిమాలు ప్రయాణం తప్ప అన్నీ ఇష్టం నాకు. కాకపోతే కొంచం స్లో గా ఉంటాయ్.
వేదం లో మాత్రం క్రిష్ అనీ బాగా బ్యాలెన్స్ చేసాడు అనిపించింది. టెక్నికల్ గా పేరు పెట్టడానికి ఏం లేదు. కథ, కథనం, మాటలు చక్కగా రాసాడు. ఆర్ట్ ఫిలిం లా కాకుండా కమర్షియల్ సినిమా తీసాడు కొత్త కథ అయినా. ఇలాటి సినిమాలు మున్ముందు బోలెడు వచ్చి ఆరు పాటలు ఏడు ఫైటులు, పాత చింతకాయ పచ్చాడి కథలు, తాతల నాటి కథనాల నించీ తెలుగు సినిమాలు బయటపడాలని ఆశిస్తున్నాను.