Sunday, January 17, 2010

భోగి పిడక (అయినాపురం కథలు)


"వచ్చారా ! ప్రయాణం బాగా జరిగిందా." అరుగెక్కుతున్న  మమ్మల్ని ఆప్యాయంగా అడిగింది మా  అమ్మమ్మ.
"ఆ పెట్టెలు అవీ లోపల పెట్టు" అని మా  పాలేరు వెంకతరత్నాన్ని ఆజ్ఞాపించి అందరినీ  చెయ్యిపట్టుకుని లోపలకి తీసుకెళ్ళాడు తాతయ్య  " బోలెడు ప్రయాణం చేసొచ్చారు. మొహం కడుక్కుని కాఫీలు తాగుదిరిగాని. " అంటూ
కుశల ప్రశ్నలయ్యాకా   అందరికీ కాఫీలు పట్టుకొచ్చి,  "నువ్వు వంకలు పెడతావని నీకు మాత్రం మీ అమ్మమ్మే  పెట్టారు." అని  నన్ను  చూసి నవ్వుతూ అంది మా అత్తయ్య .


నాకు   ఊహ తెలిసినప్పటినించీ  ఏ ఏడాదీ సంక్రాంతికి ఊరెళ్ళకుండా లేను. పుట్టినూరు కావడం వల్ల  ఏడాది తిరిగేసరికి మనసు పీకేస్తుంది ఎప్పుడు వెళదామా అని. కోనసీమ లో అయినాపురమని అదొక   చిన్న పల్లెటూరు. పచ్చని పంట పొలాలు, వాటి గట్టు వార కొబ్బరి చెట్లు, సైడ్  కాలువలు,  చెరువు, చెరువు ఒడ్డున  పెద్ద మర్రి చెట్టు, దాని కింద రచ్చబండ. చెరువుకి ఒక వైపు గ్రామ దేవత నీలాలమ్మ గుడి, ఇంకో వైపు విష్ణాలయం, శివాలయం  చూడ ముచ్చటగా ఉంటుంది. ఇక మా తాతయ్య వాళ్ళ ఇల్లు ఇదిగో ఇంత చూడ ముచ్చటగా ఉంటుంది. వచ్చే ఏడాది వజ్రోత్సవాలు జరుపుకునే హోదా వస్తుంది ఈ ఇంటికి.


మేము వెళ్ళే ప్పటికే   మా పెద్దమ్మ, మావయ్యలు,పిన్నిలు  కుటుంబ సమేతంగా వచ్చేసారు.
కాఫీ నోట్లో పోసుకుని, బావలతో కలిసి ఊరుమీద పడ్డాను నేను . ఇంటి బయటకి రాగానే మా పక్కింటి  రాజు గారు దర్శనమిచ్చారు .
"ఏం బాబు ఎలా ఉన్నారు. మీకేంటి మీరు బాగా చదువుతారు.  ఫష్టుగా  మార్కులు తెచ్చుకుంటారు. మా అబ్బాయి చూడు .. ఏమీ లాభం లేదు..  మేమేదో ఇలా గడిపెస్తున్నాం. పోనిలే పోనిలే మీరు బావున్నారు." అని ప్రశ్న సమాధానం ఆయనే చెప్పేసుకున్నారు.

మా ఇంటి దగ్గరే కాఫీ పోడెం పంతులు గారు ఉండేవారు. ఆయనకీ ఇద్దరు పిల్లలు. వాళ్ళావిడ సత్య ఆంటీ. రోజూ రాత్రి  అయ్యేసరికి వాళ్ళ పిల్లలిద్దరికీ పెరడులో అరుగు మీద కూర్చోపెట్టుకుని కథలు చెబుతూ అన్నం తినిపించేవారు. కథలు వినడానికి మేమూ వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడు మాకు కూడా ముద్దలు కలిపి పెట్టేవారు ఆంటీ.  వాళ్ళిద్దరి పిల్లలూ మా ఈడు వాళ్ళే. మా గ్యాంగ్ తోనే ఉండేవాళ్ళు.
ఇంకో నాలుగు రోజులలో భోగి. సత్య ఆంటీ వాళ్ళ పిల్లలు, తొరకల రాజు  అప్పుడే భోగి దండలు కూడా తయారు చేసేసుకున్నారు. ఇక మేము కూడా త్వరపడాలి అని నిర్ణయించుకున్నాం  . ఆవు పేడ వెతికి పట్టుకుని, పిడకల తయారీ కి నడుం కట్టాం. పేడ ని ముట్టుకోవడం, దాని వాసన   కొంచం చికాకుగా అనిపించినా, భోగి మంట సరదా ముందు అది పేద్ద లెక్కలోకి రాలేదు. మా తాతయ్య వాళ్ల ఇంటి చుట్టూ  కోట గోడలాటి పేద్ద గోడ ఉండేది. దాని మీద రకరకాల ఆకారాలతో పిడకలు వెయ్యడం మొదలెట్టాం.  దండ కట్టడానికి కావాల్సిన గారిలాగా కన్నం ఉండే పిడకలతో పాటు, అరటి పండు, బస్సు , యాపిల్ పండు, హరి కృష్ణ, టి. రాజేందర్ ఇలా మా ఊహా శక్తికి  పదును పెట్టి రకరకాల పిడకలతో గోడను నింపాము.  ఇక రోజూ మూడు పూటలా పిడకల  పర్యవేక్షణ చేసేవాళ్ళం. ఎండ బాగా రావాలని పూజలు చేసేవాళ్ళం. అవి  ఎందుకు త్వరగా ఎండట్లేదో కోర్ కమిటి తో సమావేశాలు జరిపేవాళ్ళం. రాత్రిళ్ళు వర్షం పడి పిడకలు కరిగిపోయినట్టు పీడకలలు కూడా వచ్చేవి. ఇలా అవి మా ఇంటెన్సివ్ కేర్ లో మూడొంతులు ఎండాయి భోగి ముందు రోజుకి. ఆ తరువాత వాటిని మంట మీద వేడి చేసి ఇంచు మించి ఎండాకా దండ కట్టి దాచిపెట్టుకున్నాం మర్నాటి మంటకి.


మర్నాడే భోగి. ఊళ్ళల్లో భోగి ఎంత బాగా చేస్తారంటే, ముందు రోజు రాతిరి ఊళ్ళో ఉన్న బళ్ళు, పాకల్లో  వాసాలు (పక్కింటి, పొరుగింటి  వాళ్ళవి లెండి) ఇవన్నీ లేపేసి పోగేసి భోగేస్తారు. అందుకని ఆ రాత్రంతా పెరట్లో పాకకి, ఎడ్ల బళ్ళకి బోలెడు కాపలా. అందువలన ఆ రాత్రి మా తాతయ్య నైట్ షిఫ్ట్ చెయ్యాల్సొచ్చింది అన్నమాట. మేము కూడా మహా  సరదాపడి (దూల అని కూడా చదువుకోవచ్చు) మా తాతయ్యతో పాటు పెరటి అరుగు మీద  గూర్ఖాగిరి లో ఉత్సాహంగా  పాల్గొన్నాం. సాధారణంగా కథలు చెప్పడం లో  బామ్మలు, అమ్మమ్మలు ప్రసిద్ది. కానీ మా తాతయ్య  అదంతా స్త్రీ ఆధిక్య సమాజం చేసిన కుట్ర అని నిరూపించేన్త బాగా కథలు చెప్పేవాడు. కాకపోతే ఒకటే షరత్తు, చెప్తూ ఉన్నంత సేపు  ఆయన కాళ్ళు పట్టాలి.  ఆయన చెప్పే కథలకి, చెప్పే తీరుకి వీరభిమానులమయిన మేము అవి వినడానికి ఏం  చేయడానికయినా  సిద్ధపడే వాళ్ళం .  ఇక కాశీమజిలీ కథలైతే ఒక్క కథే  మా వేసవి శెలవలు మొత్తం ఆక్రమించేది. సాయంత్రం వీధి అరుగు మీద కూర్చుని, మా చేతులరిగిపోయేలా  కథలు చెప్పించుకునేవాళ్ళం. భోగి ముందు రోజు రాత్రి కూడా అలాగే కథలు వింటూ మెలకువ  ఉండచ్చులే అనుకున్నాం. కానీ ఆయన మాకు ఒక కొత్త విద్య నేర్పించారు. అదే మన జాతీయ క్రీడ - హాకీ అనుకునేరు (సినిమా పరిజ్ఞానం బొత్తిగా లేదు సుమీ మీకు) , కాదండీ బాబూ - చతుర్ముఖ పారాయణం. దీన్నే కొంత మంది సీప్ గా పేక అనికూడా అంటారు. ఆ రోజు మాకు సీక్వెన్స్ (రమ్మీ), క్లియరెన్స్ లాటి జీవితానికి పనికొచ్చే ఆటలన్నీ నేర్పారు. దాంట్లో మాకు నేర్పు వచ్చేసింది  కానీ సమయం గడవట్లేదు.  సూరీడు ఇంకా డీప్ స్లీప్ లో ఉన్నాడు  చంద్రుడి షిఫ్ట్ కదా అని. ఇంకా ఆయన నిదురలేవాలి, బయల్దేరాలి, రావాలి. మాకు విముక్తి కలగాలి.
"శ్రీ సూర్య నారాయణ మేలుకో" అని సాఫ్ట్ గా మొదలెట్టి "రా దిగి రా  దివి నుండి భువికి దిగిరా" రేంజ్ వరకూ మా నిరీక్షణ సాగింది సూరీడు కోసం. ఆయన రాలేదు కానీ మాకు నిద్దర కుమ్ముకుంటూ వచ్చేసింది. లేచి చూసే సరికి బారెడు పొద్దెక్కింది. పక్కన చూస్తే పక్కలో మత్తుగా పడుకున్న మా బావలు . తాతయ్య ఎప్పుడో వెళ్ళిపోయి స్నానం చేసి  పూజ కూడా చేసేసుకున్నారు. మా బావలని నాలుగు తన్ని లేపి, పరుగు పరుగున భోగి మంట వెయ్యడానికి బయల్దేరాం. పిడకల దండలు, ఒక లీటరు కిరోసిను, అగ్గిపెట్టె తీసుకుని మా  పే.... ద్ద  పెరట్లోకి వెళ్ళాం.


అన్నీ సిద్ధం చేసుకుని మంటెయ్య బోతుంటే మా తాతయ్య అక్కడ వద్దు, అసలే తాటాకు పాక నిప్పంటుకుంటే ఇంకేం లేదని చెప్పాడు. సరే కదా అని ఇంకో వైపు కెళ్ళాం. అక్కడేమో గడ్డిమేట్లు నిప్పంటు కుంటే ఇంకేమన్నా ఉందా అని ఆ మంట మీద నీళ్ళు చల్లారు. కానీ మాకు మంటెత్తి, పక్కింటి రాజు గారింటి కెళ్ళాం. ఆయన మమ్మల్ని "బాబూ! నాది అసలే చిన్న పాక, ఒకటే ఆవు, చిన్న గడ్డిమేటు, ఒకర్తే  భార్య, ఒకడే పిల్లాడు"  అని ఏడుపు మొదలెట్టాడు. ఇలా కాదని రోడ్డు మీద కెళ్ళాం అక్కడ  వేద్దాం అని అక్కడ అప్పటికే మంటలు చల్లారి, జన సంచారం మొదలైపాయింది. మా నాలుగు రోజులు శ్రమ వృధా కానివ్వం. మా టి రాజేందర్ పిడక కి నిప్పంటించే దాక నిద్రపోమని డిసైడ్ జేసి మా తాతయ్య తో పెద్ద యుద్ధం చేస్తే, ఇంట్లో ఒక గాడిపొయ్య చూపించి - అందులో వెయ్యండి, భోగి మంట ఐపోయాక నీళ్ళు కూడా కాచుకోవచ్చు ఎంచక్కా అని సద్ది చెప్పాడు. చేసేది లేక అయిష్టంగా అందులోనే వేశాం మా దండలు. చెప్తే నమ్మరు అవి ఏకంగా గంట  మండాయి ముఖ్యంగా టి రాజేందర్ పిడక.

పోనీ ఇది ఇలా అయ్యింది మిగతా రోజన్నా సరదాగా గడుపుదాం అని అనుకున్నాం. ఇంతలోనే తలంటు పోయించుకోవాలని మా గొంతులో వెల్లక్కాయ వేసారు అమ్మ వాళ్ళు . దానికి ముందు నలుగు. ఏంటో అపురూపంగా పెంచుకున్న మా వంటిని అయిష్టంగా మా పాలేరు వెంకటరత్నం చేతిలో పెట్టాం. అతను  గేదెల్ని  పీచెట్టి తోమినట్టు మమ్మల్ని తెగ తోమేసాడు (పెద్దగా తేడా తెలియలేదేమో పాపం). అతని చేతి నలుగులో మేము నలుగురం నలిగిపోయాం. మేము గోల పెడుతుంటే మా అమ్మ వాళ్ళు  "శుభ్రంగా నలుగు పెట్టించుకోండి , మట్టంతా పోయి వళ్ళు నిగనిగలాడే రంగొస్తుంది" అంటూ మా వెంకతరత్నానికి ఊపుని, మాకు సలుపుని పెంచారు. మట్టిపోయి రంగు కాదు, తోలు పోయి రక్తం వచ్చేడట్టు ఉంది అని నసుగుకున్నాం.   మాకైతే గత ఏడాది చేసిన అల్లరంతటికీ ఒకే సారి పగ తీర్చుకుంటున్న ఫీలింగ్ వచ్చింది. ఆ పగకి ఫినిషింగ్ టచ్ ఆ తరువాత కుంకుడు రసంతో తలంటు. పరిగెడుతున్న మమ్మల్ని  బలి ఇచ్చే పశువులా కాళ్ళు చేతులు తలొకరూ  పట్టుకుని బలవంతంగా కుంకుడు పులుసుతో తలంటే శారు.  పైగా తల వెనక్కిపెట్టండి లేకపోతె పులుసు కళ్ళల్లో పడుతుందని ముందు జాగ్రత్త లొకటి. కళ్ళల్లోకి పడకుండా పులుసు పొయ్యడం, చంద్రబోస్ మాంచి పాటలు రాయడం, టీవీ 9 లో తప్పులు లేకుండా చదవడం  సాధ్యమేనా చెప్పండి మీరసల ? ఆ తంతు పూర్తి కాగానే, ఉప్పురాళ్ళ*  తో సిద్ధంగా ఉన్నాడు మా మావయ్య, ఆర్య 2 లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తో ఉన్న అర్జున్ లాగ.

ఎరుపెక్కిన కళ్ళతో, ఉప్పెక్కిన నోటితో , బరువెక్కిన హృదయంతో కొత్త బట్టలేసుకుని మత్తుగా నిదరపోయాం మేమందరం. ఆ కొత్త బట్టలు మాకు అతికినట్టు సరిపోయాయి (స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కాస్ట్యూమ్ లాగ  అన్నమాట).    అన్నట్టు ఆ బట్టలు కుట్టింది మా ఊరిలో ఏకైక (లేడీస్ ) టైలర్ కాంతారావు. ఇంట్లో ఉన్న  ఆడ లేడీస్ అక్కడే కుట్టించేవారు, వాటితో పాటు పనిలో పని మావి కూడా అక్కడే కుట్టించేసేవారు డెడ్ సీప్ అని.  
ఆ గాఢ నిద్రలో  పులిహోర, బొబ్బట్లు తింటునట్టు  ఒకటే మెరుపు కలలు. ఉలిక్కిపడి లేచాను. పులిహోర ఘాటు, నేతి బొబ్బట్టు కలగలిపిన  ఒక కమ్మటి సువాసన నను పిలిచింది రా రమ్మంటూ. పట్టాను  ఒక పట్టు. వంటలో మా అమ్మమ్మ కి సాటి లేదంటూ. కవిత్వం పొంగింది కదూ నాలో దాన్ని తలుచుకుంటూ.
ఆ రోజు మా ఇల్లు చుట్టాలతో, మా పెరటి సావిడి పేకాట రాయుళ్ళతో నిండిపోయింది. మీరు పేకాట సరదాగా ఆడేవాళ్ళు చూసుంటారు, డబ్బులకి ఆడే వాళ్ళని చూసుంటారు, క్లబ్బుల్లో ఆడే వాళ్ళనీ చూసుంటారు. కానీ నేను పేకాటే  వృత్తిగా  ఆడే వాళ్ళని చూసాను. వాళ్ళు కేవలం పేకే ఆడతారు. అదే వారి జీవిత లక్ష్యం, ఆశయం, కర్తవ్యం. ఈ బ్యాచ్ మా ఊరిలో ఏ  శుభకార్యానికెళ్ళినా, చుట్టాలు దండిగా ఉన్న  ఏ ఇంటికెళ్ళినా  కనపడేది. ఇలా పండగలు, పెళ్ళిళ్ళు  ఏవీ  లేనప్పుడు వీళ్ళ   పరిస్థితి ఏంటని నాకు బోలెడు జాలి వేసేది. ప్రభుత్వం పేకాటని స్వయం ఉపాది పధకంగా ఎప్పుడు గుర్తిస్తుందో, పావలా వడ్డీ రుణాలు ఎప్పుడిస్తుందో  అని నేను బెంగ పెట్టుకునే వాడిని.
ఆ .. ఎక్కడున్నాను... ఆ .. నేను నిద్ర లేచి, కాస్త ఎంగిలి పడి, మా గ్యాంగ్ తో కలిసి, గుడికి బయల్దేరా. అరుగు దిగుతూండగానే ఎక్కడినించో ఒక ఘాటయిన సువాసన ముక్కులదిరిపోయేలా వచ్చింది.  ఈడెవడ్రా బాబూ   అత్తరులో బట్టలుతుకున్నట్టు ఉన్నాడు. ఇంత ఘాటేంటి రా అనుకునేంత లోపు మా తాతయ్య స్నేహితుడు సూర్యనారాయణ గారు ప్రత్యక్షమయ్యారు. ముసలోడే కానీ మహా రసికుడు అనుకుని అరుగు దిగుతున్నాం.
ఆయన నన్ను చూసి " ఏరా అబ్బీ , ఎలా ఉన్నావ్రా. మీ నాన్న నా కళ్ళ  ముందు పెరిగిన వాడు. నేనంటే మహా గౌరవం. ఎరుగుదువా" అని అడిగాడు. ఆయన వ్యవహారం, పిలుపు కూడా నాకు నచ్చలేదు. నాకు వళ్ళు మండి "అయితే మీరు ఈ శతాబ్దం లో పుట్టలేదా తాతయ్యా" అని అన్నాను. ఆయనకీ చిర్రెత్తి "ఔన్రా అబ్బీ నీ బట్టలేంటి బాగా బిగ్గా ఉన్నాయి, మీ తమ్ముడివా " అనడిగి తిక్క కుదిరిందా అన్నట్టు నవ్వుతున్నారు. నాకు మా కాంతారావు టైలర్ గాడిని కాలికింద పురుగులా నలిపేయాలనిపించింది. మా అమ్మ మీద కూడా పీకల దాకా  కోపం వచ్చింది.
ఆ కోపంలో  అరుగు మెట్లు గబా గబా దిగుతున్నా. ఆఖరి మెట్టు దిగగానే స్కేట్ బోర్డు మీద కాలేసినట్టు రోడ్డుమీద జారడం మొదలెట్టాను . ఆ జారడం జారడం మా పక్కింటి కర్ణం గారింటి దగ్గర ఆగాను...కాదు పడ్డాను.. ఇంచు మించు నడ్డి విరిగేడట్టు పడ్డాను .  ఒకపక్క నే తొక్కిన గొబ్బిళ్ళు, ఇంకోపక్క మా వీధిలో వాళ్ళ నవ్వులు. గుండె భోగి మంట మండింది. అప్పుడు తెలిసింది నాకు, కాలు జారిన మగాడంటే ఈ సంఘానికి ఎంత కామెడీనో. సిగ్గుతో మొహం చొక్కాలో దాచుకుని, కాలికున్న గొబ్బిల్లను తుడుచుకుని ఇంటికి పరిగెత్తాను.అవమానంతో, ఇంటికెళ్ళగానే కాంతారావు కుట్టిన ప్యాంటు ని గాడిపోయ్యలో  పడేసి, బెడ్రూం కి  గడేసి ఆ రోజంతా అక్కడే పడుకున్నాను.అయినా అవమానం మర్చిపోలేక రాత్రికి ఆత్మహత్యా యత్నం కూడా చేశా.
ఆ ప్రయత్నమే - నేను రాజశేఖర్ నటించిన "మొరటోడే  నా మొగుడు"  సినిమా చూడడం.
* కుంకుడు పులుసుతో తలంటు ఎరుగని అదృష్టవంతులు, అజ్ఞానుల కోసం  --

 ఉప్పురాళ్ళు కుంకుడు రసం కంట్లో పడిన వాళ్ళకి ఇస్తారు. అవి  నోట్లో పెట్టుకుంటే కళ్ళ మంట, కంట్లో నలుసులు పోతాయని  ఒక నమ్మకం. నిజానికి ఉప్పరాయిని చప్పలిస్తే ఆ ఉప్పుని తట్టుకోలేక ఆ బాధలోకి డైవర్ట్ అయ్యి కంట్లో బాధను మర్చిపోతాం అని నా నమ్మకం.అసల  వేమన చెప్పులో రాయి, కంటిలో నలుసు కాదు - నోటిలో రాయి  కంటిలో పులుసు అని రాసుంటే బావుండేది.


19th Jan సవరణ : అసల ఈ టపా రాయాలని ఆలోచన మొలకెత్తించినది నెమలికన్నులో టపా. నెమలికన్ను మురళి గారికి ప్రత్యేక కృతజ్ఞ్యతలు.41 comments:

 1. బావా....నీ టపా ..అద్దిరింది అనుకొ....నువ్వు మన ఊరిలొ జరిగె సంక్రాంతి తంతు బహు బాగా మరియు వ్యంగ్యంగా వివరించావు ....నాకు ఇధి చదువుతుంటె ....అక్కడికి వెల్లి...పొలం లొ మావిడి చెట్టు ఎక్కి, దింపు తీస్తుండగా బొండాలు తాగి, మన ఎడుపుల్రాజు వెసె చెత్త ప్రస్నలకి తిక్క సమాధానలు చెప్పలని, మన వీధి చివర్లొ హొటెల్ నుండి ..ఎర్ర (కారం) చట్నీ తినాలనీ, పిండి వంటలతొ తిన్న తరువాత భుక్తాయసం తొ కుర్చుని ప్రపంచ రాజకీయాలు మత్లాడాలనీ....ఇంకా ..చల చెయ్యలని ఉంది అనుకో....
  కాకపొతె ..నువ్వు ఇంకా మన మందుల కొట్టు వాణి ని, ఎదురింటి ' ఫ్రీ షొ ' గంగులు ని ....పఛారీ కొత్తు మన్యం గరిని...మర్చిపొయవొ...లెక లెంగ్థ్ ఎక్కువ అయ్యి నరికావొ ..మరి. ..
  బావుంది రా వాసుగా ....ఇప్పుడు నేను '' గుర్తుకొస్తున్నాయీ.......గుర్తుకొస్తున్నాయీ .....'' అని సాంగ్ ఎస్కుంటున్నా... నీ టపా వల్ల....

  ReplyDelete
 2. థాంక్స్ రా బావా. ఇంకా బోలెడు కవర్ చెయ్యలేకపోయా. లెంగ్త్ వలెనే తగ్గించా. ఇంకొన్ని రాద్దాం అనుకుంటున్నా లే అవన్నీ కవర్ చెయ్యడానికి.
  అన్నట్టు నేను మర్చిపోయినవి కూడా కొన్ని గుర్తు చేసావ్. మళ్లీ థాంక్సులు.

  ReplyDelete
 3. పాపం వాసు గారు. ఎన్ని బాధలో.. ఆఖరు లోని సామెత బాగుందండి. ఇక నుంచి మేము కూడా వాడుకోవొచ్చా ఏమైనా ట్రేడ్ మార్క్ సూ లు అవి వుంటాయా..

  ReplyDelete
 4. @ భావన: నిరభ్యంతరంగా వాడుకోండి. రాయల్టీ గా అప్పుడప్పుడు నా బ్లాగ్ చూసి కామెంటండి చాలు :)

  ReplyDelete
 5. bhale bhale...!!
  Aina vasu, ee kaburlannee chinnappudu okka saaraina cheppavaa?? cheppuntey enchakka meetho pandakki nenuuu vachchedaanni ga...!!!! ee vishayamga nenu chaaaala hurt!! :(

  ReplyDelete
 6. సారీ శుభా. ఏంటో అప్పుడు ఇంత కళాపోషణ ఉండేది కాదు. వాటి విలువ అప్పటి కంటే ఇప్పుడే, తలచుకున్నప్పుడే బాగా తెలుస్తోంది. ఈ సారి మేము వచ్చినప్పుడు నువ్వు పతీ సమేతంగా వద్దిగాని, మా ఊరి సంక్రాంతి సంబరాలలో పాల్గొంది గాని. నాకూ వచ్చే సంక్రాంతికి ఊరెళ్ళాలని ఉంది విధి అనుకూలిస్తే .

  ఔను నీ కామెంట్ రెండో సారి చదువుతుంటే గమనించా, నాకు అంత అవమానం జరిగితే నువ్వు సంబరపడుతున్నావు.అన్నన్నా.. నేను కూడా హార్టెడ్ (hurted).

  ReplyDelete
 7. hmmmm.... chuuddam chuuddam...!!!
  aina... mee veedhilo andaruu navvaarugaa... vallaloo nenuu unnananuko :D

  ReplyDelete
 8. అసలే పండక్కి ఊరికెళ్ళకుండా ఈ దిక్కుమాలిన హైద్రాబాదులోనే ఉన్నానని బాధ పడుతూ ఉండగా మీ టపా కంటిలో కుంకుడు పులుసులా మంటెక్కించింది. కుళ్లుకున్నా కాసేపు!

  నలుగురూ చేరినపుడు పేకాడ్డం మీ ఇంట్లో కూడా సంప్రదాయమేనా? వావ్, మా ఇంట్లో కూడా!

  చాలా చాలా బావుంది మీ సంక్రాంతి టపా!

  కంట్లో పులుసు పడినపుడు నోట్లో ఉప్పు ఎందుకు వేసుకోమంటారో చిన్నపుడు నాకూ అర్థమయ్యేది కాదు కానీ తర్వాత తెల్సింది అదో కుట్ర అని!

  ReplyDelete
 9. @ సుజాత గారు - నాకు కూడా భలే బాధగా ఉంది. పండగకి మళ్లీ ఎప్పుడు వెళ్తానా అని మా ఊరు.

  నాకు తెలిసి ఊళ్ళల్లో పూజారులు లేను గుళ్ళు, మాష్టారు లేని బళ్ళు ఉంటాయేమో కానీ పేకాడే వాళ్ళు లేని ఇళ్ళు మాత్రం ఉండవు. భారత క్రికెట్ కి సచిన్ ఎలాగో పేకాట లో మా ఊరికి మా మావయ్యలు అలా అన్నమాట మా ఊరికి (కేవలం సరదాకే ఆడేవాళ్ళు లెండి. వృత్తి అనుకునేరు).

  ReplyDelete
 10. చాలా బాగా రాశారు. ఐనాపురం కథలు గొలుసు అవుతుందని ఆశించొచ్చా?

  ReplyDelete
 11. inka chinnappati sangathulu boldu unduntayi gaa avannee kuda raasthey santhoshistamu...!
  mana chinnappatidi oka saradaa sanghatana maatram naku chala saarlu gurthostuu untundi... naa tapa lo raayataniki prayatnistanu...! :)

  ReplyDelete
 12. @ కొత్తపాళీ: నెనర్లు. ఆలోచన ఐతే అదేనండి. కానీ ఎంత వరకూ కార్య రూపం దాల్చుతుందో చెప్పలేను :).

  @శుభప్రద - గుర్తొచ్చినవి, బోర్ కొట్టకుండా చెప్పగలిగినవి రాస్తాను.
  నువ్వు చెప్పే సంఘటన మాత్రం గుర్తు రావట్లేదు. వెంటనే రాసేయ్యి. వెయిటింగ్ ఇక్కడ ఎప్పుడెప్పుడు చదువుదామా అని.

  ReplyDelete
 13. @ రాధిక గారు - థాంక్స్

  ReplyDelete
 14. .చాల చాల బావుంది ఐనాపురం కధలు especially "పొలాలు, వాటి గట్టు వార కొబ్బరి చెట్లు, సైడ్ కాలువలు, చెరువు, చెరువు ఒడ్డున పెద్ద మర్రి చెట్టు, దాని కింద రచ్చబండ. చెరువుకి ఒక వైపు గ్రామ దేవత నీలాలమ్మ గుడి, ఇంకో వైపు విష్ణాలయం, శివాలయం" ఇవని నేను చూడలేదు సో ఎ సరి ట్రిప్ కి నేను రెడీ ..

  ReplyDelete
 15. ఫొటోస్ పెతావు చాల బావునై.

  ReplyDelete
 16. hmm... raaddaamani tega alochinchaanu Vasu... but definitely.. neela hrudyamga raayalenu anipinchindi.. so neekey gurthu chestaa adento... tapatapaaa oo tapaa raseyyi :)

  ReplyDelete
 17. bagundi ..vasu ..maa vallu sankranti ki raledani ani compliant chesinapudu kanna ni tapa chadivinapudae ekuva feel ayya...small suggestions vasu .. cheruvu ,cheruvu oduna mari chettu .. repitition kada .. cheruvu ..a pakkana mari chettu saripotundi...deep sleep antae ever to wake up ani kada...so sound sleep anna mata...chandra bose manchi pata lu rayandam asadyama.. enti vasu anta mata anesav... i hurt ..malanti fans emanukuntaru ani oosare alochinchi untae bagundaedi..memu vilaitae core committee meeting lo ee visayam discuss chesi tagu charya tesukuntam...B READY....emaina oosare ainapuram choodali ani undi.....anyways good ones vasu...

  ReplyDelete
 18. @ Manju - థాంక్స్. సూచనలు స్వీకరించడ మైనది.

  చంద్రబోస్ గురించి మీద ఆ చురకకి కారణాలు సుదీర్ఘంగా ఒక టపా లో వేస్తా త్వరలో.
  అమ్మో ఐనాపురం కి టూరిసం పెరిగిపోయేడట్టు ఉంది నేనొక స్పెషల్ బస్సు వేయించాలో ఏంటో.

  ReplyDelete
 19. వాసుగారూ, చాలా ఆలస్యంగా చదివాను మీ టపా.. పండుగని కళ్ళకి కట్టారు కదా.. మాకు హరికృష్ణ పిడక, రాజేందర్ పిడకా తెలీవండీ :( .. అరిటిపండు, విష్ణుచక్రం, భూచక్రం మాత్రమే తెలుసు.. నిద్ర లేపనందుకు తాతగారిని ఏమీ అనలేదా మీరు?? తలంటు తర్వాత కేవలం ఉప్పేనా? మాకైతే చింతపండు మీద ఉప్పుకల్లు అద్ది ఇచ్చే వాళ్ళు.. (మనలో మనమాట, నేను ఇష్టంగా తినేవాడిని) ..నలుగంటే చెవుల్లో నూనె పోయడం అవీ ఉండేవి కాదా? అదృష్టవంతులే.. పేకాట వాళ్ళతోనూ, టైలర్ తోనూ నాకూ బోల్డన్ని జ్ఞాపకాలున్నాయి.. భలేగా గుర్తు చేశారు మీరు.. ఈ సిరీస్ కొనసాగాలని కోరుకుంటున్నాను..

  ReplyDelete
 20. వాసు గారు మీ పండుగ టపా భలే ఉందండీ ...సిటీకి రాకముందు రోజులు గుర్తుకొచ్చాయి .ఐతే ఒక్కటి మాత్రం యధావిధిగా ఉంటుంది అది బంధువులు , పేకాట :)

  ReplyDelete
 21. వాసూ! ఇన్నాళ్ళ వరకూ నీ బ్లాగు చూసెస్తాననే చెప్పడం మానేసారా?
  చూచాను. చాలా అహ్లాదజనకంగా ఉంది.
  ఐతే మీరన్న కారణం ఏదైనా , అది మూఢనమ్మకమే అనుకోడి, లేక పెద్దల నమ్మకమే అనుకోండి, కుంకుడు పులుసు కంటిలో పడినప్పుడు పెద్దలు చెప్పిన ప్రతిక్రియ సత్ఫలదాయకంగా ఉంది కాబట్టి దానిని మూఢ నమ్మకం అనే బదులు అచారం అంటే బాగుంటుంది.
  ఆ మూఢనమ్మకమనే పదం మనలను వాటికి దూరంగా తొలగించే ప్రమాదముంది.
  ఆ పెద్దలు కట్టిన ఆప్రాచీన గృహాలు,
  ఆ పెద్దలు పెట్టిన పండుగ పబ్బాలు, మనకి అత్యంత ఆనంద కారకా లైనప్పుడు వారు చెప్పిన విషయాలు కూడా మనకి శిరో ధార్యాలే కాని, మూఢాచారాలు మాత్రం కాదని నా నమ్మకం.
  ఏది ఏమైనా పద్యాలలో మునిగే నన్ను ఒక్క సారిగా చక్కని పల్లెటూరికి తీసుకుపోయి పండుగ సందడితో నాహృదయం పొంగేలా చేసిన మీకు ధన్యవాదములు.

  ReplyDelete
 22. chaalaa baagundi ..bagaa raasaru....thanx andi subhaakankshalu cheppinanduku

  ReplyDelete
 23. @ ఊకదంపుడు , వంశీ కృష్ణ - థాంక్స్.

  @శుభ - నువ్వు నాలా కాదా ఇంకా బాగా రాయగలవు. కవిత రాయి అది అయితే కుమ్మేస్తావు నువ్వు.

  @ మురళి: థాంక్స్హ.
  హరికృష్ణ , రాజేందర్ అప్పటికి నాకు వాళ్ళ పేరు కూడా తెలియవు. వాళ్ళ మీద నా కచ్చి ఇలా తీర్చుకున్నా అంతే :)

  చింతపండు కు అద్దివ్వడం గుర్తు లేదే. చెవిలో నూనె మీరు చెప్తూంటే గుర్తొస్తోంది. మీ పేకాట, టైలర్ అనుభవాలు చెప్పండి మరి.

  @ పరిమళం - థాంక్స్. చూడబోతే పేకాట నిజంగానే జాతీయ క్రీడా లాగ ఉంది. అందరి ఇల్లల్లలోనూ ఉందని వింటున్నాను.

  @ రామకృష్ణ మాష్టారూ - క్షమించాలి. మీరు చూశారనుకున్నాను నా బ్లాగ్ ఇది వరకే.

  నాకు పెద్దవాళ్ళు చెప్పేవి కారణం తెలియకపోయినా పాటించడం ఇష్టం. అలా పాటించేవి ఇప్పటికీ చాలా ఉన్నాయి. ఉప్పు రాయి గురించి ఏదో హాస్యం కోసం రాసాను అంతే. అయినా మీరు చెప్పాక తప్పే అనిపించింది. వెంటనే మార్చాను. గమనించగలరు. మొట్టికాయ వేసినందుకు ధన్యవాదాలు. మీరు ఇలాగే అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ ఉండండి. నా టపాలు కూడా మెరుగుపడతాయి

  ReplyDelete
 24. ఎంతైనా పల్లెటూళ్ళలోని పండగ సంబరాలే వేరు. మీ పిడకల కథ కూడా బాగుంది.గొబ్బెమ్మ కథ కూడా బాగానే ఉంది.:) సూరీడు కోసం చేసిన మీ నిరీక్షణ చాలా బాగుంది. హాయిగా చదివేసుకున్నాను.

  ReplyDelete
 25. రెయ్ అన్నయా మళ్ళి మన కోనసీమ సంక్రాంతి అందాలని గుర్తు తెచవు. ఏదో ఫోరిన్ అని ఏగబడి రావడమె కని మన కొనసీమ అందాల ముందర ఈ ఫోరిన్ డెసలు బలాధుర్. లంగ వోనీలు, పట్టుచీరలు, పేకాట రాయ్యుళ్ళు, కోడి పందాలు అబ్బో ఆలో చిస్తొన్టె సూపర్ ఓ సూపర్. మళ్ళీ ఒక్క సారి మన కోనసీమ వాతావర్నాని గుర్తు తెప్పిన్చావు. నాకు తెలిసి నువ్వు కవితలు కూడా రాస్తావు గా. సో మన పేకాట రాయ్యుళ్ళ పైన మంచి పాట రాయి. నేను ట్యూన్ కట్టిస్తాను.

  ReplyDelete
 26. @ జయ - ఔనండి. సంబరాలంటే పల్లెల్లోనే చూడాలి. థాంక్స్.

  @ మహేష్ - అవిడియా బానే ఉంది. ప్రయత్నిస్తా. ఒక వేళ రాస్తే ట్యూన్ చేసే బాధ్యత మాత్రం నీకే ఇస్తాలే :)

  ReplyDelete
 27. నెనే లేటా :-)
  చాలా బావుంది వాసుగారు.. నేను సంక్రాంతి చిన్నప్పుడు పల్లెటూల్లొనే జరుపుకునే వాడిని.. .. వాణీ గురించి కూడ కొంత చెప్పుంటె బావుండెది.. :-)

  ReplyDelete
 28. @ మంచుపల్లకీ: బాగా లేటు :). వాణి మరియూ ఇతర తారాగణాన్ని మున్ముందు టపాలలో కవర్ చేస్తా. మా ఊరిలో (ఏ ఊళ్ళో లైనానేమో) రకరకాల క్యారెక్టర్లు. ఒక టపా లో ఇరికించడం కష్టం అన్నీ.

  ReplyDelete
 29. This is very nice and your sister enjoyed alot.
  Padmavathi: "Akkalu, Chellillu, Bogi Perantallu undaraa?? OH!! boys show. It is good. Unforgettable Sweet memories."

  ReplyDelete
 30. @ Akka - Good point. Dont you remember, I used to hang out more with them. Also, I didnt mention any of their names or characters. Coming to Raju garu, he is a peculiar character and needs some space to generate humour:) Anyways I'll sure right about you all too some day.

  ReplyDelete
 31. @వాసుగారూ, తెలుగేదీ అని నీరసపడిపోడమే కానీ, చూడవలసినచోట చూడడంలేదని నాకు ఇప్పుడే అర్థమయింది. మీరు నాబ్లాగుకొచ్చి, మీబ్లాగు గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీభోగికబుర్లు చదువుతుంటే నాకెంతో హాయిగా అనిపించింది. నేను అయినాపురం చూడలేదు కానీ అలాటి పరిసరాలు పరిచయమే నాకు. తప్పకుండా అప్పుడప్పుడు మీబ్లాగు దర్శనం చేసుకుంటాను. :))

  ReplyDelete
 32. @ మాలతి గారు - నెనర్లు. మీ బోటి వారికి నా రాతలు నచ్చడం ఆనందంగా, కొంచం గర్వంగా ఉంది.

  ReplyDelete
 33. వాసు గారు ,మీరు రాసిన కధ చాల బాగుంది .ఈ సంక్రాంతి కి కొత్త కధ తో మమ్మల్ని అలరిస్తారని ఆశిస్తున్న .

  ReplyDelete
 34. ఆదిత్య గారు : చాలా సంతోషం. రాయడానికి ప్రయత్నిస్తాను ఈ లోపే.

  ReplyDelete
 35. hi vasugaru,mee ainapuram kathalu chala bagunnai.ee sari urilo unnavallu andarini cover chustu kotta katalato mammalni alaristarani asistunnam.neelalama talli sumbaralu,road meeda terapi vese sinimalu anni...

  ReplyDelete
 36. థాంక్స్ KVN గారు

  మీరు పూర్తి పేరేంటో తెలుసుకోవచ్చా ?

  ReplyDelete
 37. nannu ainapuramlo "venu" ani pilustaru.....

  ReplyDelete
 38. hi vasu how are you i am kiran mi satya anti kodukuni mi ganag lo oka

  ReplyDelete
 39. బాగుందండి మీ బ్లాగ్ .మీ పోస్ట్లు చాలా బాగున్నాయి

  ReplyDelete