Sunday, August 14, 2011

స్వాతంత్ర దినోత్సవం.. అయితే


హ్మ్.

స్వాతంత్ర దినోత్సవం అనగానే జెండాలని, దేశభక్తి గీతాలని లారీల్లో తెచ్చి పేజీల్లో నింపేస్తారు. మోడొందల  అరవై నాలుగు రోజులు నిదురోయిన దేశభక్తి ఈ  రోజు  ఉప్పొంగిపోయి ఉరకలేస్తుంది.

మెయిల్  తెరిస్తే మీరు  భారతీయులైతే గర్వపడిపోయి ఈ మెయిల్ చదివి ఫార్వర్డ్ చెయ్యాల్సిందే అంటూ తామర తుంపరలా సందేశాలు. బజ్ , ఫేస్ బుక్ లు  భారత దేశాన్ని గురించి మహోపన్యాసాల , ఆవేశ పూరిత ప్రసంగాల వీడియోలతో నిండిపోయాయి. (స్వాతంత్ర దినోత్సవాన్ని శెలవుగా  మాత్రమే గుర్తించి కొత్త సినిమాలు, చెత్త ఇంటర్వ్యూలు  వేసే టీవీ చానెళ్ళ గురించి ఎంత తక్కువ మాటాడుకుంటే అంత మంచిది).

నాకు వెంటనే ఒక చిన్న సందేహం వచ్చింది. నేను ఎందుకు గర్వపడాలి. అసలెందుకు పండగ జరుపుకోవాలి.
ఏం చూసి గర్వపడాలి.  ఎవరిని చూసి గర్వపడాలి.


  • లక్షల కోట్ల కుంభకోణాల్లో దేశం కొట్టుమిట్టాడు తుంటే నోరువిప్పలేని ప్రధానినా , ఏమీ చేయలేని సిగ్గుమాలిన ప్రభుత్వాన్నా
  • ప్రజలు తిడుతూ కూర్చోకుండా, మునుపెన్నడూ లేని విధంగా కదిలి వచ్చి, చేయి కలిపి, నోరు విప్పి , పోరు సలిపి ప్రభుత్వం కొమ్ములు వంచి ఒక బిల్ ని తెస్తామని మాట తీసుకున్నా ,  అది నిలపెట్టుకోలేని దిక్కుమాలిన ప్రభుత్వాన్నా, దాన్ని ఎన్నుకుని ఏం చెయ్యాలో తెలియని అసహాయ సమాజన్నా,
  • సుమారు రెండు వందల మంది అమాయకులని పొట్టన బెట్టుకుని, మూడొందల కుటుంబాలని దిక్కులేని వాళ్ళని చేసిన నికృష్టుడు    ప్రజల ధనం తో రెండేళ్ళగా జైల్లో కులుకుతూ ఉంటే సిగ్గులేకుండా చేతలుడిగి చూస్తున్న దేశాన్ని చూసా
  • ఎవడిష్టం వచ్చినట్టు వాడు రాస్తూ,  ఎవడిష్టం వచ్చినట్టు వాడు కూస్తూ జనాల సెన్సిటివిటీ లని కూడా ఖాతరు చెయ్యని మీడియాని ఈ  హక్కు మీకవేరిచ్చారని రెండు చెంపలు వాయకొట్టి  అడగ(లే)ని  సమాజాన్ని చూసా అందులో నేనూ ఒకడినని తెలిసా .
  • అసలు ఈ ఆలోచనలే రాని "వడ్డించిన విస్తరి మా జీవితం" అనుకుని వోటు కూడా వేయడానికి తీరకలేదనుకునే సోమరి సమాజాన్నా(వీరు నలభై శాతానికి పైగా ఉన్నారు)  
  • పోనీ ఇవన్నీ కాదు .. కనీసం ఒక్క రోజైనా స్వాతంత్ర సమర యోధుల్ని తలుచుకోడానికి, భారతీయ ఆత్మను పునరజ్జీవం చేసుకోడానికి అనుకుందామంటే.. అసల ఆ ఆత్మ ఉందా అని అనుమానం వస్తోంది. ఆ సమర యోధుల్ని తలుచుకుంటే ఇలాటి  నిస్సత్తువ  సమాజం  కోసం  వాళ్ళు ప్రాణ త్యాగాలు ఎందుకు చేశారని బాధేస్తోంది.

ఔను. ఇలా  దేశంలో  లేకుండా  దేశాన్ని  తూలనాడడం  కూడా  నా  మీద  నాకే  అసహ్యమేస్తోంది.  


"ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి
నెత్తురు మండే శక్తుల నిండే సైనికులారా రారండి" 

అన్నాడు శ్రీశ్రీ 

నేను మొదటి రకమో రెండో రకమో తేల్చుకోవాలి. మరి మీరో ??    

Thursday, August 11, 2011

మా తెలుగు తల్లికి


నిన్న ఉదయం లీడర్ లో మా తెలుగు తల్లికి పాత వింటుంటే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. మా ఇంటి దగ్గర ఒక స్కూల్ (వివేక్ మోడల్) లో రోజూ ఆ గీతం తోనే అసెంబ్లీ మొదలయ్యేది.
పాత వింటూంటే  ఒక గర్వం (అప్పుడు అదని తెలియదు ), ఆనందం, తెలియని శక్తి వచ్చినట్టుండేది.  అదేం కర్మో మా స్కూల్లో తెలుగు లో మాట్లాడితే తప్పనేవారు, తన్నేవారు (అయినా తెలుగు లో మాట్లాడుతూనే ఉండే  వాళ్ళం అది వేరే విషయం.  ).  అలా తెలుగు మాటలాడ నివ్వకపోవడం  తప్పని అనిపించేది కాదు అదేంటో .

ఇప్పుడు ఎంచక్కా గొడవ లేదు, సగం స్కూళ్ళలో తెలుగే ఉండట్లేదు తప్పనిపించడానికి.  పోనీ బయట జనాలు మాట్లాడే దాంట్లో బూతద్దం వేసి తెలుగు పదాలు వెదకాలి. మాల్, రెస్టారంట్, ఎయిర్ పోర్ట్, మల్టీ ప్లెక్స్  ఎక్కడికెళ్ళినా తెలుగు మాట్లాడడం నేనైతే చూడలేదు. స్వయం వరం సినిమాలోలా "తెలుగులో మాట్లాడుకుందాం. సుఖంగా ఉంటుంది"  అని ఎందుకు అనలేము?

ఇక్కడ అయితే తెలుగు మిత్రులతో మాట్లాడినపుడు ఒక్కోసారి తెలుగు పదం తట్టినా
ఆంగ్ల పదమే వాడడం పరిపాటి. ఈ తెగులు నాకు కూడా ఉండేది. ఇప్పుడు ఇంచు మించు వదిలింది.
కానీ అక్కడ కంటే నా తెలుగు ఇక్కడే బాగు పడింది. బోలెడు పుస్తకాలు, రచయితలూ, బ్లాగులు, బ్లాగరులు, బజ్జరులు (:))  పరిచయమయ్యారు.  రోజుకి రెండు మూడు  గంటలన్నా తెలుగు చదివేలా చేస్తున్నారు.

ఇక్కడి జనాల ఆసక్రి చూస్తే తెలుగు భాష అంతరించిపోతుందనే భయం ఏం లేదు అనిపిస్తుంది. శంకర శాస్త్రి గారు చెప్పినది తెలుగుకు చక్కగా అన్వయించుకోవచ్చు.
"తెలుగును పట్టించుకోడానికి నూటికి ఒక్క వ్యక్తీ ఉన్నా ..ఈ అమృత వాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది"
 
ఏమంటారు ??


Saturday, May 21, 2011

ఎవడో గోదారి మీద లాంచీ లో భద్రాచలం వెళ్ళచ్చన్నాడు.. వాడిని !#%^^!@%& - రెండవ భాగం


మొదటి భాగం - ఇక్కడ  

నిడదవోలు - చాగల్లు - పట్టిసీమ - పాపి కొండలు - పోచవరం మీదుగా జీడికుప్ప చేరుకున్నాం.

జీడికుప్ప నించీ ఆటో బయల్దేరింది. చిమ్మ చీకటిలో, కారడివిలో (అదంతా  ఏజెన్సీ ప్రాంతం), ఆ పిల్లాడు వేస్తున్న టార్చీ లైట్  వెలుగులో, దారి పొడవునా గుంటలు పడిన ఆ రోడ్డు మీద ఆటో సాగిపోతోంది.   అసలే బెదిరి పోయిన మమ్మల్ని ఆ ఆటో వాడు, ఇక్కడ కూంబింగ్ జరుగుతోందని, అన్నలు, పోలీసులు తెగ తిరుగుతున్నారని చెప్పి ఇంకా భయపెట్టాడు. పక్కనే ఉన్న పిల్లాడు దానికి వత్తాసుగా అప్పుడప్పుడు పులులు కూడా వస్తూ ఉంటాయని గుండెల్లో విమానాలు పరిగెత్తించాడు.

ఈ లోపు వెనకన కూర్చున్న నాకు తల మీద, ఆటో పైన ఏదో కదులుతూ ఉన్నట్టనిపించింది. నా భ్రమేమో, చెప్తే నవ్వుతారని  ఏమీ మాట్లాడలేదు. ఇంతలో రోడ్డు మీద ఒక గతుకొచ్చింది. అంతే గబాలున ఎవరో నెత్తి మీదకి ఉరికారు.కెవ్వున కేక వెయ్యబోయి, భయాన్ని గొంతులోకి మింగి, ఆటో ఆపమని అరిచాను. డ్రైవర్ అదో రకం లుక్ ఇచ్చి బ్రేక్ వేసాడు ..

అందరూ నన్ను వింతగా చూసారు. "పైన ఎవడో ఉన్నాడు రా ఖచ్చితంగా. నా నెత్తి  మీద ఎగిరి పడ్డాడు. అన్నలేమోరా" అన్నాను.
  
అన్నలకి పనేం లేదా ఆటోమీదకి ఉరికి నిన్ను పట్టుకోడానికి నువ్వేమన్నా రాజకీయ నాయకుడివా, కనీసం వీధి రౌడీవి కూడా కావు అని రియాక్షన్.

నాకు ఒళ్ళు మండింది. పుండు మీద కారం జల్లినట్టు ఆటో డ్రైవర్ పకపకా నవ్వుతున్నాడు. వీడికి ఓంకార్ షో లు రోజంతా చూపించినా పాపం లేదన్నంత కోపం వచ్చింది. వాడు నవ్వాపి, తోడుకని ఇంకో పిల్లాడిని తెచ్చుకున్నానని, ఆటోలో చోటు లేదని పైనే కూర్చోపెట్టానని చెప్పాడు.  

నేను సీరియస్ గా వెళ్లి ఏమీ జరగనట్టు ఆటో లో కూర్చున్నా. మిగత వాళ్ళంతా కామెడీ గా వచ్చి కూర్చున్నారు.
డ్రైవర్ గేర్ రాడ్ వెనక్కి లాగాడు. ఆటో ముందు కెళ్ళింది. చిమ్మ చీకటిలో చిన్న కాంతి లో దారిని చూస్తుంటే, మా పరిస్తితికి సింబాలిక్ గా ఉన్నట్టనిపించింది. ఈ ఆటో దొరకకపోతే ... తలుచుకుంటేనే భయం వేసింది.

ఇలా ఒక గంట ఆటో అడవిలో, నేను ఆలోచనల్లో ప్రయాణించాక కూనవరం రానే వచ్చింది.  కాకపోతే అర్థరాత్రి అయ్యింది. ఊహించి నట్టే ఆఖరి బస్సు కూడా వెళ్లి పోయింది.  అక్కడ తినడానికే హోటల్స్ లేవు. ఇక ఉండడానికి ఏముంటాయి. ఏదైతేనేఁ అడివి నించి ఊర్లోకి వచ్చాం. ఆటో డ్రైవర్ కి బోలేడ్ థాంక్సులు చెప్పి, డబ్బిచ్చి పంపేశాం.
భద్రాచలానికి ఇంకో వాహనం కోసం ప్రయత్నం మొదలెట్టాం.


ఆటో స్టాండ్ లో సగం మంది బళ్ళు ఆపేసి, కల్లు తాగేసి తూలుతున్నారు. మిగతా సగానికి బళ్ళు లేవు. ఎవరో ఒకతను తనకు ఆటో డ్రైవర్ ఒకడు తెలుసనీ ఊర్లోకి తీసుకెళ్తానన్నాడు. నేను నా స్నేహితుడు కిరణ్ వాడిని ఫాలో అయ్యాం. అయిదు, పది , పదిహేను , ఇరవై (మగధీర లో శ్రీహరి లా లెక్కెట్టుకోండి) నిమిషాలు నడుస్తూనే ఉన్నాం. ఇంకొంచం ముందుకు ఇల్లు అని తీసుకెళ్తూనే  ఉన్నాడు .  ఆయాసం, అసహనం వస్తున్నాయి కానీ ఇల్లు రాలేదు. ఈ లోపు వాడు ఇంకా ఇంకా ముందుకు పోదాం అంటూ పోయాడు. మాయమైపోయాడు. హ్యాండ్ ఇచ్చాడని డిసైడ్ అయ్యి ఉసూరు మంటూ వెనక్కి బయల్దేరాం.

ఆటో స్టాండ్ కి వచ్చేసరికి నా స్నేహితులు ఒకడితో బేరం కుదిర్చారు. రెండు వందలు కాబోలు. ఆ డ్రైవర్ చూస్తే కొంచం తూలుతూ ఉన్నాడు. వీడిని నమ్ముకుంటే మనల్ని ముందుకు కాదు పైకి పంపించే డట్టు ఉన్నాడని డిసైడ్ అయ్యి, వద్దని చెప్పేసాం. ఈ లోపు ఆ పక్కన వైన్ షాపు లో లోడ్ దించుతున్న మినీ ట్రక్ డ్రైవర్ మా పాలిట రాముడిలా వచ్చి, లోడ్ దించాక భద్రాచలం వెళ్తానని చెప్పాడు. పది నిమిషాలు ఆగితే మమ్మల్ని తీసుకెళ్తా నని హామీ ఇచ్చాడు .

ఇది విన్న తాగున్న ఆటో డ్రైవర్ కళ్ళు తాగిన కోతిలా గంతులేసి గొడవకి దిగాడు.  సారా ఆటో క్లబ్ అంతా వాడికి వత్తాసు పలికింది. ఏదో కొంచం సేపు వాదించినా, అందరం పోకిరీలం కాదు కదా , బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్లమి. కనుక బేరం ఆడిన మొత్తం వాడికి సమర్పించుకున్నాం. దిగాక ఇచ్చే ఆటో డబ్బులు ఎక్కకుండానే ఇచ్చాం ( పోను పోను ఇదే పద్ధతి జిం లో అలవాటయ్యింది. నెలకోసారి కూడా ట్రెడ్మిల్ ఎక్కకపోయినా నెల నెలా చందా మాత్రం కడతాను)

ఆటోవాడిని వదిలించుకుని వైన్ షాప్ లోడింగ్ ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాం. పది నిమిషాలు  అన్నది గంటకి పైగా పట్టింది. ఇంత చీకాకు లోనూ షాప పేరు చూసి నవ్వొచ్చింది - గాంధీ వైన్స్. ముందు మహాత్మా పెట్టకుండా  మేలు చేశాడనుకున్నాం.

వైన్ షాప్ పనవ్వగానే (వాడికి), అందరం లగేజీ తో ఆ చిన్నట్రక్ లో ఎలాగో ఇరుకున్నాం. పవిత్రంగా సారా బండిలో భద్రాచలం బయల్దేరాం. అర్థరాత్రి లో అడవి ప్రాంతం లో చిక్కటి చీకటిలో చక్కటి చుక్కల్ని చూస్తూ  కాళ్ళ నొప్పులు, కళ్ళ నొప్పులు (నిద్రలేక), మందు కంపు, వంటికి గుచ్చుకుంటున్న విరిగిన సీసాముక్కలు అన్నీ మరిచిపోయాం.
గంటలో భద్రాచలం చేరాం. గుడ్డిలో మెల్ల హోటల్  ఒక్కటీ ముందే బుక్ చేసుకున్నాం. హోటల్ దగ్గరికి  రాగానే డ్రైవర్ బేరం మొదలెట్టాడు. లిఫ్ట్ అనుకున్నామే అంటే నాకిచ్చే డబ్బు గిఫ్ట్ అనుకోండి అన్నట్టు చూసాడు. అడిగినది ఇచ్చి హోటల్ రూమ్స్ చేరుకున్నాం. ఆ టైం లో కూడా మాకు తినడానికి ఏర్పాటు చేసిన ఆ హోటల్ బాయ్ ని మర్చిపోలేం.

మర్నాడు ఆలస్యంగా వెళ్ళినా దర్శనం బ్రహ్మాండంగా ఐంది.ఈ ప్రయాణం అనుభవం తో హైదరాబాద్ తిరిగి వెళ్ళేటప్పుడు భద్రాచలం నించి ట్రైన్ బుక్ చేసుకున్నాం. ట్రైన్ టైం కి రెండు గంటలు ముందే స్టేషన్ చేరుకున్నాం ప్రయాణం నేర్పిన పాఠం వల్ల .


ఒక వారం పోయాకా "గోదావరిలో గల్లంతయిన తాతాజీ. గుర్తు తెలియని వ్యక్తుల పని అని అనుమానం" అని  పేపర్ లో పడిందని  నాకు కలొచ్చింది (కాబోలు).



Tuesday, March 22, 2011

అవినీతి లేని భారత దేశాన్ని చూడాలని కోరుకుంటున్నారా ?


ఏమిటి ?

స్వాత్రంత్రం వచ్చి 63 ఏళ్ళు అయినా,  మన దేశం శక్తికి తగ్గ అభివృద్ది జరగలేదు. ఎంత పురోగమించినా  సగటు భారతీయుని ఆదాయం పెద్దగా పెరగలేదు. ఇందుకు అవినీతి ఒక ముఖ్య కారణం. దేశం లో అడగడుగునా అవినీతి ఉందని కాదనలేని సత్యం. రాజకీయ నాయకులలో అధిక శాతం అవినీతి పరులని పసి పిల్లవాడిని అడిగినా చెబుతాడు. అవినీతి అంత సర్వ సాధారణం అయినా , గత రెండు సంవత్సరాలలో ఇది కనీ వినీ ఎరుగని  స్థాయిలో, సంఖ్యలు చూస్తే  కళ్ళు భైర్లు కమ్మే స్థాయిలో పెరిగింది. ఆదర్శ, కామన్ వెల్త్ , 2G  స్కామ్లు  దేశాన్ని  కుదిపేస్తున్నాయి. అవినీతి ఎంతకి  పేరుకుపోయిందంటే, ఆ సొమ్మును మనం విదేశీ బ్యాంకుల నించీ వెనక్కి తీసుకు రాగలిగితే ముప్పై ఏళ్ళు ... అక్షరాలా ముప్పై ఏళ్ళు  పైసా పన్ను లేకుండా దేశం నడవచ్చు అన్న స్థాయిలో. 

ఉపోద్ఘాతం  సరే .. అయితే ఇప్పుడేంటి అంటావ్ ?

ఇది భరించలేని కొందరు ఇలా చూస్తూ ఊరుకోవడం సరి కాదని నడుం బిగించారు. గళం వినిపించారు. విద్యాధికులు, న్యాయ మూర్తులు తదితరులు తయారుచేసిన జన్ లోక్ పాల్ బిల్ ను  పార్లమెంట్  లో ప్రవేశ పేట్టే వరకూ India against Corruption ఉద్యమం చేపట్టారు.  అదే సమయం లో భారత దేశం లో  అవినీతి కి విసుగెత్తిన ప్రవాస భారతీయులు కొందరు   "దేశం ఇంతే దీన్ని బాగుచెయ్యడం ఎవరి  వల్లా  కాదు" అని  కూర్చోకుండా  ఒక ఉద్యమం చేపట్టారు. Jan Lokpal Bill అమలు చెయ్యడం ప్రధమ లక్ష్యంగా,  అవినీతి వ్యతిరేక పోరాటాన్ని జనాలలోకి తీసుకెళ్ళే దిశగా ఒక  బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  






ఏంటది ? 

అదే రెండవ దండి పాదయాత్ర (Dandi March 2).  

అప్పుడు:

గాంధీజీ చేసిన దండి పాదయాత్ర 1930 మర్చి 12న సబర్మతి ఆశ్రమం దగ్గర మొదలై దండి వరకూ 24 రోజులపాటు 240 మైళ్ళు సాగింది ఆ పాదయాత్ర.. దేశ స్వాతంత్ర్య పోరాటం లో ఇదొక కీలకమైన మలుపు. 

ఇప్పుడు:

అదే స్ఫూర్తి తో, అవే తేదీలలో  అంటే  మర్చి 12 న మొదలై మర్చి 26 వరకు దక్షిన కాలిఫోర్నియా లోని శాన్ డియాగో లో  మార్టిన్ లూదర్ కింగ్ విగ్రహం దగ్గర మొదలై  అక్షరాల 24 రోజుల పాటు కాలిఫోర్నియా లో ప్రముఖ పట్టణాలలో సాగి 26న శాన్ ఫ్రాన్సిస్కో లోని గాంధీ విగ్రహం దగ్గర ముగుస్తుంది. అదే రోజున ప్రపంచం నలు మూలలలో  వివిధ పట్టణాలలో భారతీయులు ఈ పాద  యాత్రకి సంఘీ భావంగా పాదయాత్రలు చేస్తున్నారు.



ఈ  రెండవ దండి యాత్రలో   ఆరుగురు ప్రవాసులు మొత్తం నుండి చివరి దాకా అంటే 24 రోజులూ, 240 మైళ్ళూ  నడుస్తునారు. వారు జవహర్ కంబంపాటి , శ్రీహరి అట్లూరి, సుభాష్ కర్రి, 
వర్మ దంతులూరి, కేవల్ పర్నామి, శ్రీనివాసరావు నందివాడ (కింద ఫోటోలో చూడవచ్చు)  . 
వీరు ఉద్యోగాలకి శెలవు పెట్టి, కేవలం అవినీతిని ప్రతిఘటించడానికి, జనాలలో జన్ లోక్ పాల్ బిల్ (Jan Lokpal Bill) వస్తే కానీ దీనికి అంతం లేదనే అవగాహన పెంపొందించడానికి, ఆలోచన రేకెత్తించడానికి , నిజానికి దేశం లో అవినీతి అంతమొందాలి  అనుకునే ప్రతీ ఒక్కరి గురించి నిస్వార్థంగా నడుస్తున్నారు. కేవల్ పర్నామి గారి వయస్సు 70  ఏళ్ళు అని వినగానే ఆశ్చర్యం, ఆయనంటే గౌరవం కలగక మానదు.









సరే!... అయితే??....:



దేశం లో అవినీతి పోవాలి, కనీసం ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి, దేశాన్ని తిట్టుకుంటే సరిపోదు, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకునే వాళ్ళందరూ జన్ లోక్ పాల్ బిల్ అమలు చేయడం ఒక గొప్ప పరిష్కారం అని గుర్తించాలి.

"నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చి మ్రోస్తానూ " అంటూ ముందుకు  రావాలి. 

మీ గొంతు వినిపించాలి. మీ వంతు కృషి చెయ్యాలి.

రెండవ దండి పాదయాత్ర (Dandi March2)  ప్రయత్నం మీకు నచ్చితే, మీ భావాలకి దగ్గరగా ఉంటే   మీ సహకారం, మీ సంఘీభావం తెలపండి. ఈ  పాదయాత్రలో  మొత్తం 240 మైళ్ళూ  నడవడానికి పూనుకున్న ఆరుగురు ఎండనకా వాననకా రెండు వారాలగా నడుస్తూనే ఉన్నారు. ఇంకా ఎక్కువగా జనాలు సపోర్ట్  చేస్తే ఈ ప్రయత్నం జనం లోకి వెళ్తోంది అన్న  ఆనందం తో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి ఉపకరిస్తుందని గమనించండి.

అందుకని కాలిఫోర్నియా లో ఉన్నవారైతే మీ శక్తి కొలదీ 1,2,3,5,.. మైళ్ళు   వీరితో కలిసి నడవండి. వీలు కాకపోతే మీ పట్టణం లో పాదయాత్ర జరుగుతున్నప్పుడు వాళ్ళని పలకరించి మీ సపోర్ట్ తెలపండి.   అదీ వీలుకాకపోతే 26 న మీ పట్టణం లో జరిగే సమావేశం లో పాల్గొనండి. 






అది కూడా వీలుకాకపోతే ఇలాటి వాటిలో ఆసక్తి ఉన్న మిత్రులకి తెలియజేయండి. 

అది కూడా వీలుకాకపోతే.. ఇదంతా ఒక వెర్రి వాడి బాధని వదిలెయ్యండి.   అనవసరంగా చదివామనుకొని ఊరుకోండి . 
దేశం ఇంతే అని నిట్టూర్చి హాయిగా నిదరపొండి. శ్రీశ్రీ అన్నట్టు "... ప్రపంచం ఎట్లా పొతేనేఁ మీకెందుకు లెండి ... అదృష్ట వంతులు మీరు వడ్డించిన విస్తరులు మీ జీవితం." 



గమనిక
1.  ఆలోచన లోక్ సత్తా కార్య కర్తల దైనా, ఇందులో పార్టీలకి సంబంధం లేకుండా ఎవరన్నా పాలుపంచుకోవచ్చు. చాలా సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతుగా నడుస్తున్నాయి, సహకరిస్తునాయి.   
2. రాజకీయ నాయకుల అవినీతి గురించి మాట్లాడుతున్నాం కానీ, మనం లంచాలని ఇవ్వట్లేదా, తీసుకోవట్లేదా అనేది చొప్పదంటు ప్రశ్న కాకపోయినా (ఈ మీమాంస లోనే ఇన్నాళ్ళు దీని గురించి రాయలేదు )  ఈ వ్యాస పరిమితి మించిన ప్రశ్న అని నా ఉద్దేశ్యం. లంచం ఇవ్వడం తీసుకోవడం తప్పే కానీ  తప్పక, గత్యంతరం లేక  ఇస్తున్నవారే ఎక్కువ.  ఇప్పుడు కోరుకునే మార్పు ఆ అవకాశం లేని సమాజం ఏర్పరిచే దిశగా వెళ్తుందనే పాజిటివ్ ఆలోచనతోనే రాయదలచుకున్నాను.  

చివరిగా ఇందులో చరిత్ర పరంగా కానీ ఫాక్ట్స్ కానీ ఏమన్నా తప్పులుంటే చెప్పగలరు. సరి చేసుకుంటాను  



Sunday, March 20, 2011

ఎవడో రాజమండ్రి - భద్రాచలం లాంచీ లో వెళ్ళచ్చన్నాడు.. వాడిని !#%^^!@%& - మొదటి భాగం


"వారిని! ఇవేనా అలిపి బ్యాక్ వాటర్స్ అంటే. మా అయినాపురం లో మురిక్కాలువ అంత ఉంది దీని  వెడల్పు  . దీనికి పదకొండు వేలు, పెద్ద హడావుడి. కోనసీమ లో ఇలాటి బోట్లు  పెడితేనా "God's own county" అనేస్తార" న్నాను  

"అయితే ఈసారి తీసుకెళ్ళరా. మేమూ చాలా విన్నాం"

"సరే ఐతే ఈసారి అక్కడికే. మీరు కోనసీమ చూడలేదు. నేను పాపి కొండలు చూడలేదు. ఒకే ట్రిప్పుకి రెండు ... "

"సర్లే. ట్రై చేసింది చాలు. ఈ సారి సరిగ్గా ప్లాన్ చెయ్యి. " చిరాగ్గా సెలవిచ్చాడు కిరణ్.

ఆ కేరళ ట్రిప్ ఐపోయాకా,లీవ్ తీసుకున్న నేరానికి నాకు ఆర్నెల్లు కఠిన క్యూబికల్ శిక్ష పడి పనిలో మునిగి తేలి, యత్రాలంటే భయం, లీవంటే  వణుకు పట్టుకున్నాయి.

శిక్షా కాలం ముగిసాకా ఒకనాడు స్నేహితులతో  కలిసి అనుకోకుండా గోదావరి సినిమాకి వెళ్లాను.

కట్ చెయ్యకుండానే ... నెలలో ఒక లాంచీ యజమాని కాంటాక్ట్ దొరకడం అతను మమ్మల్ని బ్రహ్మి (సా. ఇ ) అని తెలిసి వాయించి వదలడం, రాజమండ్రి నించి భద్రాచలం కి లాంచీ కుదరడం  చక చకా జరిగి  పోయాయి.

                          
                  **********************************************


రెండు వారాల తరువాత...

మా ప్రయాణం రోజు రానే వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్ లో మేము ఏడుగురం స్నేహితులం కలుసుకున్నాం.

గౌతమీకీ గార్డ్ సిగ్నల్  ఇచ్చాడు. రైలు  బయల్దేరింది.

కానీ ముందు ఏదో జరగబోతోంది అన్నట్టు ట్రైన్ స్లో మోషన్ లో కదలలేదు, ఆకాశం మేఘావృతం కాలేదు, మెరుపులు మెరవలేదు, ఉరుములు ఉరమలేదు. ప్రకృతి బొత్తిగా ఏ క్లూ ఇవ్వలేదు.

మర్నాటి ఉదయం  మాలతి గారి ఊరిలో దిగాం. అదేనండీ నిడదవోలు.

అక్కడికి మా పెదనాన్న పంపిన సూమో ( ఈ మాట వినగానే ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అనేసుకోవడమే. ఇది కోనసీమ. రాయలసీమ కాదు.) ఎక్కి అరగంట లో చాగల్లు చేరుకున్నాం. ఈ ఊరు షుగర్ ఫ్యాక్టరీ కి ప్రసిద్ది మా అమ్మమ్మ వాళ్ళ వంశం లాగా. సీజన్ అనుకుంటా ఎక్కడ చూసినా చెరుకు కనపడుతోంది.
ఇంటికి చేరగానే మా గ్యాంగ్కి  ఇంటి టూర్ ఇచ్చి, కాఫీలిచ్చి, టిపినీలు పెట్టింది మా దొడ్డమ్మ. వేడి వేడి పెసరట్టుని  ఉప్మా తో ఒక పట్టు పట్టాం  అందరం. బుద్ధిగా స్నానం చేసి, శ్రద్ధగా దండం పెట్టుకుని పట్టి సీమకి  బయల్దేరాం.

ఆ రోజు ప్రయాణం ...పట్టి సీమ, గోదావరి మీద లాంచీ, పాపి కొండలు, భద్రాచలం.. తలుచుకుంటే కడుపు నిండి ఆ తిండి ఆకర్లేదని పించింది.

పట్టిసీమ ఇవతల ఒడ్డుకి చేరుకున్నాం. అక్కడే మా లాంచీ, దాని యజమాని/మా టూర్ గైడ్ తాతాజీ కనిపించాడు.    దగ్గరలో ఉన్న  ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహానికి  దండం పెట్టించి, లాంచీ ఎక్కించాడు (ఇందులో మతలబు బోధపడలేదు అప్పుడు ).  ఈ లాంచీ మొత్తం మీ కోసం, ఎవరిని ఎక్కించం, ఇందులో మీకు అన్నీ రెడీ - కాఫీలు, టిపినీలు, భోజనం అని చెప్పుకొచ్చాడు. మేము అనుకున్నంత కాకపోయినా బానే ఉందనిపించింది. ఫోటోలు తీసుకున్నాకా, లాంచీ రయ్యంది, అయిదు నిమిషాలలో అవతలి ఒడ్డున ఉన్న పట్టి సీమకి  చేరుకున్నాం. ఆ ఇసుక తెన్నెల్లో దిగగానే శంకరభరణం, వంశీ సినిమాలు గుర్తొచ్చాయి.  అద్భుతంగా ఉంది, గోదారి వడిలో, నీటి చప్పుడులో, సేద తీరడానికి భలే స్పాట్ సెలెక్ట్ చేసుకున్నావు కదయ్యా వీరేశ్వరా అనుకున్నాను.  

దర్శనం చేసుకుని లాంచీ చేరుకున్నాం. వాడిచ్చాడు కదా అని టిపినీ కొంచం టేస్ట్  చేసి లాంచీ పైకెక్కి  సై అన్నాం. క్లీనర్ రై రై అన్నాడు. లాంచీ నీటి తెరలను చీల్చుకుంటూ ముందు కెళ్ళింది. సూత్రధారులు సినిమాలో సత్య నారాయణ లాగా కూర్చిలో కూర్చుని గోదావరిని చూస్తూ కూర్చున్నాం. చూడడానికి ఇంకో రెండు కళ్లుంటే బావుండనిపిచింది. కొంత సేపయ్యాక కిందకు దిగి, లాంచీ వంచ మీద  కాళ్ళు నీళ్ళల్లో పెట్టి కూర్చుంటే, ఆ వడికి, నీటి తుంపరలు ఎగిరి పడుతుంటే, చల్లని ఏటి గాలి తడుతుంటే స్వర్గం దీనికి దిగదుడుపేమో  అనిపించింది.


ఆ హాయిలో గంటలు నిమిషాలు లా గడిచిపోయాయి. సుమారు ఒంటి గంటకి పాపి కొండల దర్శనం ఐంది.  "అల పాపి కొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా" అని వేటూరి చెప్పినట్టు, గోదారి నవ్వుతున్నంత ఆహ్లాదంగా ఉంటుంది, ఆ కొండలను కడుగుతునట్టే ఉంటుంది. చాలా సేపు చూడనిచ్చాక తాతాజీ లాంచీ ని  ఒక తాండా దగ్గర ఆపాడు. అక్కడే మా మధ్యాహ్న భోజన పధకం అన్నమాట. అసల ఒక్క పదార్ధం కూడా తినలేక పోయాము. కొంత సేపు ఆ వ్యూ పాయింట్ నించీ గోదారిని తనివి తీరా చూసి బయల్దేరాం.



గోదావరి లో నీరు అంత ఎక్కువగా లేకపోవడం వల్ల, భద్రాచలం వరకూ లాంచీ వెళ్ళదని చావు కబురు చల్లగా సెలవిచ్చాడు తాతాజీ. అందువల్ల మా ప్రయాణానికి చిన్న మార్పులు చేర్పులూ చేసి మమ్మల్ని పోచవరం లో దింపుతా  అన్నాడు.  అక్కడి నించీ బస్సు పట్టుకుంటే కూనవరం, అక్కడ ఇంకో  బస్సు పట్టుకుంటే భద్రాచలం.
ఓస్ ఇంతేగా అనుకున్నా, మా గత ప్రయాణాల అనుభవాల వల్ల ఏదో తేడా కొట్టింది. భారం రాముడి మీద వేసి  బయల్దేరాం.

పోచవరం చేరే సరికి సాయంత్రం ఆరయ్యింది. అదో చిన్న పల్లె. ఒక డజను ఇల్లుంటాయేమో. ఇక్కడికి బస్సు కూడా వస్తుందా అని ఆశ్చర్య పోయాం. కానీ మా ఆశ్చర్యాన్ని పటాపంచలు చేస్తూ మాకు భయం కలిగించే విషయం చెప్పాడు తాతాజీ - ఆఖరి బస్సు మూడింటికే వెళ్ళిపోయిందని. గుండెలో రాయపడినా, తాతాజీ ఏదో మార్గం చూస్తాడులే అని ధైర్యం. ఆటోలు ఎమన్నా ఉన్నాయేమో అని కనుకున్నాడు. ఆటో కాదు కదా కనీసం ద్విచక్ర వాహనం కూడా ఎవరికీ లేదు ఆ పల్లెలో. వాళ్ళనీ వీళ్ళని కనుక్కొని  అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఇంకో ఊరుందని, అక్కడ ఆటో లేమన్నా దొరకచ్చని, లాంచీ లో ఉన్న మా సామాను తీసుకోమని సెలవిచ్చాడు తాతాజీ.
మాకొచ్చిన కోపానికి తాతాజీ ని కాలు కిందేసి తొక్కేయాలని పించింది. కంట్రోల్ చేసుకుని, సమస్య సామరస్యం గా చర్చించి, భద్రాచలానికి ఏదో ఒక వాహనం దొరికే ఊరి వరకూ మాకు తను షెల్టర్ ఇవ్వడానికి, అతనికి మేము  కంపెనీ ఇవ్వడానికీ  ఒప్పందం చేసుకున్నాం.

ఈలోపు మా పరిస్థితికి సింబాలిక్ గా చీకటి పడింది. గోదావరి ఉదయం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో రాత్రి అంత భయపెడుతుందని మాకు అప్పుడే తెలిసింది. కనుచూపుమేర జనాలు లేరు. చిక్కటి రాత్రిలో నల్లటి ఆకాశం లో డిమ్ గా వెలుగుతున్న చుక్కల వెలుతురులో బోటు సాగుతోంది, భయం పెరుగుతోంది, గుండె వణుకుతోంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు రా సాగాయి. ఈత రాని మేము నీటిలో పడితే, ఇంధనం లేక పడవ ఆగిపోతే, మమ్మల్ని వీడు ఇక్కడే  వదిలిపోతే.... గోదావరిలో హైదరాబాద్ పిల్లలు గల్లంతు అనే న్యూస్ .. వరకూ వెళ్ళిపోయాయి ఆలోచనలు.

ఈలోపు ఇంకో చిన్న పల్లె వచ్చింది (అనుకున్నాం). తాతాజీ పడవని ఒడ్డు దాకా పోనివ్వడం, టార్చీ లైట్ ఊపడం, అక్కడినించీ ఎవరన్నా సిగ్నల్ ఇస్తారేమో అని. నాకైతే అన్వేషణ సినిమా గుర్తొచ్చింది. ఇలా రెండు మూడు చోట్ల ఆపగా ఒక చోట అటు నించీ సిగ్నల్ వచ్చింది. తాతాజీ, ఇంకో ఇద్దరం వెళ్లి కన్నుక్కోగా, ఆ ఊరు జీడికుప్పని,  ఒకే  ఆటో ఉందని, అక్కడినించీ కూనవరం ఒక గంట పడుతుందని తెలిసింది. చిన్న ఆశ చిగురించింది. ఆరుగురు మంది లగేజీ తో ఆటో లో ఎలా పడతాం అని కూడా ఆలోచించలేదు. తాతాజీ ని ఏం చేసినా పాపం లేదని అనుకుని ఎలాగో సద్దుకున్నాం. ఆ ఆటో వాడు ఒక పిల్లాడిని కూడా తెచ్చుకున్నాడు. తోడుకేమోలె అనుకున్నాం. కానీ  టార్చీ లైట్ పట్టుకోడానికాని   ఆ తరువాత తెలిసింది - ఆ ఆటోకి హెడ్ లైట్ లేదు.

ఆటో బయల్దేరింది. చిమ్మ చీకటిలో, కారడివిలో (అదంతా  ఏజెన్సీ ప్రాంతం), ఆ పిల్లాడు వేస్తున్న టార్చీ లైట్  వెలుగులో, దారి పొడవునా గుంటలు పడిన ఆ రోడ్డు మీద ఆటో సాగిపోతోంది.   అసలే బెదిరి పోయిన మమ్మల్ని ఆ ఆటో వాడు, ఇక్కడ కూంబింగ్ జరుగుతోందని, అన్నలు, పోలీసులు తెగ తిరుగుతున్నారని చెప్పి ఇంకా భయపెట్టాడు. పక్కనే ఉన్న పిల్లాడు దానికి వత్తాసుగా అప్పుడప్పుడు పులులు కూడా వస్తూ ఉంటాయని గుండెలో రైళ్ళు పరిగెత్తించాడు.


ఈ లోపు వెనకన కూర్చున్న నాకు తల మీద, ఆటో పైన ఏదో కదులుతూ ఉన్నట్టనిపించింది. నా బ్రహ్మేమో, చెప్తే నవ్వుతారని  ఏమీ మాట్లాడలేదు. ఇంతలో రోడ్డు మీద ఒక గతుకొచ్చింది. అంతే గబాలున ఎవరో నెత్తి మీదకి ఉరికారు.కెవ్వున కేక వెయ్యబోయి, భయాన్ని గొంతులోకి మింగి, ఆటో ఆపమని అరిచాను. డ్రైవర్ అదో రకం లుక్ ఇచ్చి బ్రేక్ వేసాడు ..



.............. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాం.....

రెండవ భాగం  - ఇక్కడ 

Sunday, January 30, 2011

కోతి కొమ్మచ్చి



ఈ సారి నా గొంతు వినిపించ దుస్సాహసం చేస్తున్నాను. నిజానికి వినడానికి మీరు సాహసం చేస్తున్నారంటే కరెష్టేమో.  మీకు డబల్ డోస్ అన్నమాట .



నిన్ననే ఒక మహత్కార్యం చేశాను. కోతి కొమ్మచ్చ్చి ఆడియో కొని వినడం.. కాదు పారాయణం చేయడం మొదలెట్టా. ఆపబుద్ధి కావట్లేదు. ఈ రోజు తో పారాయణం పూర్తవుతుంది. ఇంత అద్భుతమయిన పుస్తకం ఇప్పటి వరకు ఎందుకు చదవలేదా అనుకున్నాను. కానీ బాలు గొంతులో విన్నాక ఒక విధంగా ఇది కూడా మంచిదే అనుకున్నాను. కో. కొ. (పుస్తకం చదివిన వాళ్ళకి తెలుస్తుంది) అనట్టు బాలు అనగానే గుర్తొచ్చింది. మొత్తానికి బాలూ కి పద్మ భూషణ్ వచ్చింది (ఇప్పటికైనా). అనుకున్న్నట్టే ఇది కూడా (పద్మశ్రీ లాగే) తమిళ నాడే తెప్పించింది. సుశీల గారికి కూడా వాళ్ళే. ఇది తలచుకున్నప్పుడు మన ప్రభుత్వాలకి కళలంటే చిన్న చూపెందుకని అనుమానం వచ్చింది. మన వాళ్ళకి డబ్బు చేసిందని ముందనిపించింది. రియల్ ఎస్టేట్ మీద యావ స్టేట్ మీద స్టేట్ లాంగ్వేజ్ మీద లేదని స్నేహితుడొకడు స్టేట్ మెంట్ ఇచ్చేసాడు. ఇంకా ఆలోచించగా చించగా ఇది ఇప్పటిది కాదని మనకి తరతరాలుగా వస్తున్న అచారమేమో (గ్రహచారమేమో ) అని తోచింది.  కాకతీయులు, శాతవాహనులు వగైరా తెలుగు కవులకి పట్టం కట్టారో లేదో తెలియదు. అది తెలుస్కోవాలో లేదో కూడా తెలియదు. కానీ తెలుగు కవులని నెత్తికెత్తుకుని, తెలుగుకు పట్టం కట్టినదెవరంటే శ్రీ కృష్ణదేవరంటే (ప్రాస బావుందని ) కాదంటారా. మరి ఆ ఆంద్ర భోజుడి మాతృభాష తులు కదా! అంటే అనాదిగా తెలుగు కళాకారులని తెలుగువారికంటే, ఆ అదృష్టం లేని వారే (తెలుగు గా పుట్టడం అదృష్టమన్నానని నను భాషా దురాభిమానుల పంచన కట్టేయ్యకండీ . ముఖ్యంగా ఆ DMK పక్కన . అన్నట్టు ఇది ఒక అసభ్య పదానికి షార్ట్ గా వాడడం రివాజు అని నాకు గుర్తొచ్చినా చెప్పను) తలకెత్తు కుంటున్నారని నొక్కి వక్కానిస్తున్నాను . నాకు చరిత్ర, కళలు గురించి తెలిసినది తక్కువ కనుక, ఎక్కువ మాట్లాడే అధికారం ఉంది కనుక నన్ను ఆం ఆద్మీ గా జమకట్టి నాది మెజారిటీ గొంతుగా ఒప్పుకోండే మరి.
మళ్ళీ అసలు కథ. రమణ గారు వండిన అమృతాన్ని ..అదే ఆయన కష్టాలు-నష్టాలు,కన్నీళ్లు - కడగండ్లు కలిపి ..తయారు చేసిన టానిక్ ని ( కాపీ "రైట్" కనుక ఈ మాటను వాడేస్తున్నాను).. నిజానికి ఇది ఉప్పగా ఉండాలి .. కానీ ఆయన ఆకలి కేకలను జోకులతో కలిపి కొంటె తనపు కిసమిస్స్లను, యధార్థాలనే యాలకులను జల్లి.. అమృతం ఏం ఖర్మ దాని బాబులా తయారుచేసారు. బాలు దాన్ని వెండి పళ్ళెం లో వడ్డించారు. విందారగించాను.. కానీ భుక్తాయాసం రావట్లేదు. ఇంకా ఇంకా అంటూనే ఉంది. ముద్దపడితే మూత పడును కడుపు శాంతించి. తిన్నకొద్దీ ఎంత యావో మనసు కదో పిచ్చి.


కొ.కొ.-- 
అన్నట్టు ఇలాటివి రాయడానికి నాకు చంద్రబోసు గారే  inspiration, expiration, motivation.. ఎందుకంటారా నాకు సిరివెన్నల అన్నా వేటూరి అన్నా భయం (కొంత మంది దీన్ని భక్తీ అని కూడా అంటారు). Stanford professor ని చూసిన Tri valley విద్యార్ధి లాగా. కానీ చంద్రబోసు గారు అలా కాదు. ఆయన పాటంటే (పాటింటే ..) నేను చెవికోసుకుంట. అలా ఐతే ఆయన ఇంకో పాట వినక్కర్లేదనా అని ఎవరో పెడార్థం తీస్తే నేను ఏం చెప్పలేను మరి. ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడిని, భక్తుడిని. ఒక్కోసారి ఏమీ లేకపోతె సినిమా పాటలు రాసేయచ్చులే అనే ధైర్యం ఆయన పాట చలవే. ఉదాహరణకి నాకు ధైర్యాన్ని ఇచ్చిన రెండు మచ్చు తునకలు.
"అమ్మా తల్లే నోర్ముయ్యవే .. నోటి ముత్యాల్ జార్ నీయకే "
"వీచీ గాలి అందరి కోసం.. సూర్య కాంతి అందరి కోసం.." (దీనికి ఆయన టీ. కా . తాత్పర్యం కూడా ఇచ్చుంటారు ఎక్కడో )మాకు తెలుసుంటారా .. మరి.
"ఒక్కరికి మేలు చేస్తే అందరికీ మేలు జరుగుతుందిట .."
ఛా నిజమా అంటారా
అయ్యో .. ఐతే.. ఇది వినాల్సిందే "సఫలం లో నేతాజీ .. సఫలం లో గాంధీజీ "..
ఇది ఏంటి అంటే .. నాకు కూడా అర్థం కాలేదండీ . నన్ను involve చెయ్యకండీ.
-- కొ.కొ.


కొమ్మ వదిలేసి చాలా సేపైంది కదూ. సరే.. పాయింట్ లోకి. కొన్ని అధ్యాయాలు చదువుతున్నంత సేపు రమణ గారి కలవని వ్యక్తీ లేడు తెలియని కళాకారుడు లేడు, ఈయన వల్ల బోలెడు మంది నాకు కూడా తెలుస్తున్నారు అని ఒక పక్క ఆనందం. ఈ మహానుభావులు, కళాకారులు, కవులు కనీసం అన్నం కి నోచుకోలేని దుస్థితి ఏంటి. ఏమైపోయారు కవి రాజ పోషకులు అని బాధ కూడా వచ్చింది. ఇప్పుడు కూడా బోలెడు మంది ఉన్నారేమో ఆకలితో అలమటించే కళాకారులు తెలియదు నాకు .కానీ నాకు తెలిసిన ప్రఖ్యాత కళాకారులు, మహామహులు, సాహితీ వినీలాకాసం లో ధ్రువ తారలుగా వెలిగిన వారు ఇలా ఆకలి తో అలమటించారా అని గుండె తరుక్కు పోయింది.
కొన్ని విషయాలు వింటుంటే ఈయనేంటి అన్నీ చెప్పేస్తున్నారు అని ఆశ్చర్యం కూడా కలిగింది. ముఖ్యంగా కన్నప్పగారిది (ఒక వేళ నేను అనుకున్న వ్యక్తే కరెష్టే ఐతే). ఎవరన్నా పరువు నష్టం దావా వేస్తారేమో అని భయం వేసింది.బాపు రమణల గురించి నాకు తెలిసిన కొంచానికి బోలెడు గౌరవం ఉండేది ఇంతకు మునుపు. ఇంకా తెలుసుకున్నాకా అది ఇంతింతై అది ఇంతై . అంతంతై అది అంతై. అంతే లేనంతైంది.



కోటి కొమ్మచ్చి ఆడియో తో పేచి ఎమన్నా ఉందా అంటే .. అన్నీ బాలు ఏ పాడితే, మాటాడితే బావుండేది. మిగతావారు బానే చదివినా బాలు గొంతు విన్నాకా .. రాజు చూసిన కళ్ళతో మొగుడిని మొట్ట బుద్ది అని సామెత.
కోతి కొమ్మచ్చి.. కొమ్మకి రెమ్మోచ్చి.. రెమ్మకి పువ్వొచ్చి.. అని మొదలెట్టారు. 



నాకు ఇలా అనిపించింది.
ఎద లో వెతలోంచి ఎన్నో కథలు పంచి
ఏడ్పుతో నవ్వించి. నవ్వులో ఏడ్పించి.
ఆకలి లో జోకులు నంచి

ఆరారా తినిపించి
జీవన సాగరం మధించి
జీవిత సత్యం బోధించి
నను మనిషిగ పెంచి
ననీ ఋణం తీర్చుకోను ఏమిచ్చి

మొత్తానికి తప్పక వినాల్సిన / చదవాల్సిన పుస్తకం అని మీకు ఇప్పటికే తెలుసనుకోండి. నేనే ఆలస్యంగా విన్నాను. నా కంటే ఆలస్యం చేసిన వాళ్ళుంటే త్వరపడండి.
అన్నట్టు బాపు రమణ లకి పద్మాలు ఎప్పుడు వస్తాయో. పాపం వాళ్ళు తమిళం మరీ అంత ఎక్కువ పని చెయ్యలేదే.