Wednesday, June 4, 2014

అలవాటుగా కాసేపు



హలో నాన్న! ఏం చేస్తున్నారు ?

ఏం లేదు. ఉదయం నించి కుదరలేదు. పేపర్ చదువుతున్నా. అవును మీకు టైం ఎంతైంది ?

అదేంటి నాన్నా రోజూ ఫోన్ చేసిన టైం అడుగుతారు. ఎన్ని గంటలు తగ్గించుకోవాలో తెలుసు కదా

ఏమో రా. మీ టైం పెద్ద గొడవ నాకు. ఒక సారి డే లైట్ సేవింగ్స్ అంటావ్. ఒకసారి వేరే టైం జోన్ లో ఉన్నానంటావ్. 4 X 2 = 8 రకాలు ఉండచ్చు కదా. అవి గుర్తు పెట్టుకుని లేక్కేసుకునే ఓపిక లేదు. అయినా రోజూ చేస్తే మాటలు ఏం ఉంటాయిరా ?

ఏవో ఒకటి ఉంటాయ్.

నువ్వు బావున్నావా నేను బావున్నానా ఇవేగా ?

అవే చెప్పచ్చ్చు కదా

చెప్పడానికి ఏముంటుంది. ఏదో గడిచిపోతోంది. బావోలేకపోయినా నువ్వేం చెయ్యగలవ్ అక్కడి నించి? బాధ పాడడం తప్ప ? అయినా ఇప్పుడు పెద్దగా  ఏం లేవు? ఈ వయసు వచ్చాక చిన్న చిన్నవి ఏవో ఒకటి ఉంటాయ్

షుగర్ బి పి ఎలా ఉంది ?

బావుంది?

అంటే ? బాగా ఉందా? కంట్రోల్ లో పెట్టుకోవచ్చు కద నాన్నా

బి పి షుగర్ కొలెస్ట్రాల్ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఈ పంచ భూతాలూ లేకుండా ఇక్కడ నా వయసు వాళ్ళు బతకలేరురా

మరి ఇక్కడ డబ్బై వచ్చినా దుక్కల్లా ఉంటారు ? ఏం లేకుండా ?

అక్కడ ఇక్కడికి సామ్యం లేదు రా? వాళ్ళకి ఇక్కడి టెన్షన్లు లేవు. ఇంత కష్టమూ కాదు

ఏ ఇక్కడి వాళ్ళకు బాధలు ఉండవా ? ఎక్కడి బాధలు అక్కడ ఉంటాయ్ ?

అవును. కాని అక్కడ ఎవడి గొడవ వాడిది. అందుకే ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ అందరి గొడవా అందరికీ కావాలి. అలా అని  సహాయం చెయ్యడానికా అంటే కాదు. అందుకే ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు.
ఇక బాధ్యతలు అన్నీ  గట్టెక్కి ఒడ్డుకు చేరేసరికి పిల్లలు ఇంకో ఒడ్డుకి. మేము అటు రాలేము. మిమ్మల్ని ఇటు రమ్మనలేము.

ఇంకెంత నాన్నా ఒక రెండేళ్ళ లో వచ్చేస్తా.

ఈ మాట నాలుగేళ్ళ నించి చెప్తున్నావు. అయినా నీ కెరీర్ చూసుకోరా. అమ్మ వచ్చేయ్ మంటోంది  నాన్న బాధ పడుతున్నాడు అని కాదు నీకు మీ భవిష్యత్తుకి ఏది మంచిది అనిపిస్తే అది చెయ్ .

అదే నాన్న. ఇక్కడ ఈజీ లైఫ్ స్టైల్ అలవాటై అక్కడికి రావాలంటే కొంచం భయం వేస్తోంది.

హ్మ్స . సర్లే కానీ  ఏం చేస్తున్నావ్

డిషెస్

ఎప్పుడు చేసినా అంట్లు తోముతున్నా అంటావేంట్రా. ఇక్కడ గ్లాసు కూడా పక్కన పెట్టేవాడివి కాదు.

అంట్లు కాదు నాన్న.

తిలకాష్టమహీశ బంధనం లా .. ఇంగ్లీష్ లో చెబితే అర్థం మారిపోతుందా ? సర్లే అమ్మాయ్ ఏం చేస్తోంది?

ఇల్లు క్లీనింగ్ నాన్నా. రేపు ఫ్రెండ్స్ వస్తున్నారు లంచ్ కి. అందుకని వాక్యూం , బాత్రూమ్స్ వగైరా

సరిపోయింది. ఆదివారం డెవాన్ కి వెళ్ళాలా ?

అవును నాన్న. అలాగే కాస్ట్ కో కి వెళ్ళాలి. కార్ క్లీన్ చేయించాలి. పిల్లకి మధ్యాహ్నం సంగీతం క్లాసు ఉంది. పిల్లాడికి స్విమ్మింగ్ క్లాసు. తను అటు నేను ఇటు.

అన్నట్టు ఈ వారం లో నవమిట. కనీసం పానకమైనా చేసుకోండి.

అవునా ? నేను బే ఏరియా వెళ్ళాలి నాన్నా ఈ వారం. కుదిరితే ఆదివారం గుడికి వెళ్తాం లే

ఏంటో పండగకి చుట్టాల మాట దేవుడెరుగు, పెళ్ళాం పిల్లల్ని  కలవడం కూడా కష్టం ఐపోతోంది నీకు . సర్లే అమ్మ మాట్లాడుతుంది ట .

సరే .....     ...    ఎలా ఉన్నావ్ అమ్మా ? షుగర్ బి పి కంట్రోల్ లో ఉందా?

నీకు లక్ష సార్లు చెప్పాను. రోగిష్టి వాళ్ళని పరామర్శించి నట్టు  ఎప్పుడు చూడు షుగర్ బి పి గురించేనా ? అవి ఇక్కడ కామన్. అమ్మాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ?

బానే ఉన్నారమ్మా. తను కొంచం లావైంది. యోగాకి వెళ్తుంది ట. వచ్చే వారం నించి.

ఎలా ఉంది అంటే .. ఆరోగ్యం ఎలా ఉంది అని బరువు వెడల్పు కాదు . అయినా మొన్న పేస్ టైం లో చూసా. మొహం పీక్కుకు పోయి ఉంది. అది లావు ఏంటి. ఏ ఏమన్నా మిస్ USA పోటీలకు వెళ్తుందా ఏంటి ? శుభ్రంగా తినమను. మా వయసు వచ్చే సరికి ఎలాగూ తినలేరు? ఇప్పుడైనా సరిగ్గా తినండి

నువ్వు అలాగే అంటావ్ అమ్మ. ఇక్కడ గాలి పీల్చిన లావు ఊరిపోతాం. అక్కడ తిన్నట్టు తింటే మిస్ USA కాదు. బిగ్గెస్ట్ లూసర్ కెళ్ళాలి.  నేను కూడా రైస్ మానేద్దాం అనుకుంటున్నా?

ఇదేం ఖర్మ రా? మీకు అన్నీ అతి! తిన్నా మానినా.ఆ మిల్క్ షేక్ లు మానేసి మజ్జిగ తాగు, కూల్ డ్రింకులు  మానేసి మంచి నీళ్ళు తాగు, లిఫ్ట్ మానేసి మెట్లు దిగు, టి వి మానేసి వాకింగ్ కెళ్ళు,  అర్థ రాత్రి వరకు లాప్ టాప్ పట్టుకోకుండా పిల్లలతో ఆడు,  పదింటికి పడుకో, పెందరాడే లే. ఏ డైటింగ్ లు అక్కర్లేదు. మా అమ్మమ్మ మొన్నే సెంచరీ కొట్టింది. ఇప్పటికీ ఆవకాయ లేకుండా అన్నం ముట్టదు. అన్నం తినకుండా పూట ఉండదు.

నీ పిచ్చి గానీ. అవన్నీ కుదరవు అమ్మా. మిమ్మల్ని  వైట్ రైస్ మాని బ్రౌన్ తినమంటే తిన్నారా? యోగకి వెళ్ళమంటే వెళ్ళారా? ఉపవాసాలు, తల స్నానాలు మానమంటే మానారా? ఎందుకూ అంటే ? అలాగే ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయిపొయింది మాకు. ఇప్పుడు కష్టం.

హ్మ్ . ఏం లైఫ్ స్టైలో. నాకు అందులో లైఫ్ ఏం కనిపించలేదు.

సర్లే. ఇంకేంటి ?

ఊ .. అన్నట్టు మన అపార్ట్ మెంట్ కే బ్లాక్ లో నా ఫ్రెండ్ వాళ్ళు వచ్చే నెలలో సెంట్ లూయిస్ వస్తున్నారు. మీకు దగ్గరట కదా? నాన్న చెప్పారు . ఏమన్నా కావాలా ?

ఏం వద్దమ్మా. మొన్నే కదా పంపించారు. అయినా వాళ్ళు మొహమాట పడుతూ పట్టుకురావడం. వాళ్ళ బిజీ లో ఎప్పటికో పంపించడం. అవి తిరిగి తిరిగి వచ్చేసరికి పాడైపోతాయ్ కూడా. ఏం వద్దు.

అమ్మాయ్ ని కూడా కనుక్కో. ఏవో టాప్ లు చింతపండు వడియాలు పంచ తులసి అవీ కావాలంది మొన్న.

తను  అలాగే అంటుంది లే. ఏం వద్దు.

సరే అమ్మ నేను ఉంటా. పిల్లల్ని స్లీప్ ఓవర్ కి దింపి రావాలి. ఇంకా కొంచం క్లీనింగ్ కూడా ఉంది.
రేపు మళ్ళీ ఫ్రెండ్స్ వస్తున్నారు. మళ్ళీ పొద్దున్నే వీళ్ళను తీసుకొచ్చి తనకి వంట లో హెల్ప్ చెయ్యాలి
మీరు  ఆరోగ్యం జాగ్రత్తగా చోసుకోండి.

సరే. పడుక్కో మీకు లేట్ అయినట్టుంది. నేను అమ్మాయితో  ఫేస్ టైం  చేస్తాలే



****************
ఫోన్ పెట్టేసిన అర సెకనుకు అయోమయం గా  .....


"ఏంటో ఆ జీవితం నాకర్థం కాదు."

అవునే. అమెరికా లైఫ్ స్టైల్ ఈజీ అంటాడు ఏంటో నాకు అసల అర్థం కాదు .


***************************

ఫోన్ పెట్టేసిన అర సెకనుకు ఆశ్చర్యంగా ... ..


ఏంటీ ఈ రోజు గంట పూర్తవకుండా పెట్టేశారు? ఫోన్ చార్జ్ అయిపోయిందా ?

లేదు ఈ రోజు క్లాస్ అయిపోయింది . వీళ్ళకి ఇక్కడి బాధలే కనపడతాయ్. నాకు అక్కడికెళ్తే వచ్చే బాధలూ కనపడతాయ్.  ఏమిటో ?



5 comments:

  1. "ఎలా ఉంది అంటే .. ఆరోగ్యం ఎలా ఉంది అని బరువు వెడల్పు కాదు"

    కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

    "వీళ్ళకి ఇక్కడి బాధలే కనపడతాయ్.నాకు అక్కడికెళ్తే వచ్చే బాధలూ కనపడతాయ్.ఏమిటో?"

    ఈ విషయం చాలామందికి అమెరికన్‌భారతీయులకి కామనే అనుకుంటాకదండీ

    ReplyDelete
  2. pillalu ane maata chadiventha varaku uncle ki neeku jarigina conversation emo anukunna :P bavundi!

    ReplyDelete
    Replies
    1. అవును ఇంకొంచం జెనెరిక్ గా రాయాల్సింది. కోల్డ్ స్టోరేజ్ లోంచి తీసి microwave చేసి వడ్డించేశా .
      Lazy writing I guess.

      Delete
  3. Pillalu aney mukka chadive daka neeku uncle ki madha sambhashana anukunnanu! inthakee rendellallo vachchestunnava? :)

    ReplyDelete