Friday, October 30, 2009

సంఘర్షణఏవేవో ఆలోచనలు.. 
ఏవేవో ఆవేదనలు .. 

నరాలు తెగిపోతున్నాయి స్వరాలు విడిపోతున్నాయి 
మెదడు అగ్ని పర్వతంలా బద్దలవుతోంది 
ఆలోచనలు లావాలా పొంగుతున్నాయి  


నాకూ మనసుకు జరిగే పోరులో మాటలు మర ఫిరంగుల్లా పేలుతున్నాయి
చెవిలో శబ్దాలు రింగుమంటున్నాయి 
కలల్లో పొగలా కమ్ముకుంటున్నాయి 
కనుల్లో నదిలా పొంగిపోతున్నాయి  


ఆధీనంలో లేవు ఏవి 
చెబితే వినదు ఏదీ 
నిరంతరం జరిగే సంఘర్షణలో మనసు గెలిచినా మెదడు గెలిచినా మనిషిగా నేనే ఓడిపోతున్నాను

Wednesday, October 28, 2009

టి వి చానళ్ళ అత్యుత్సాహం - కొత్తగా పుట్టుకొచ్చిన భాషాభిమానం

ప్రసార మాధ్యమాల పుణ్యమా అని ఈ పాటికి మైదకూరు లో జరిగిన ఉదంతం, దాని మీద చేసిన రాగ్దాంతం చూసి ఉంటారు. తెలుగులో మాట్లాడిన విద్యార్థులు మెడలో I never speak in telugu అని రాసి ఒక బిళ్ళ తగిలించడం.  


ఈ టీవి చానల్లు తెలుగు భాషను ఉద్ధరించేస్తున్నట్టు, తెగ బాధ పడిపోతున్నాయి. ఇప్పుడే టి వి 9 ఒక కార్యక్రమం చూసాను (అమ్మకి అవమానం) కొంచం చూసి ఇంత సిగ్గులేకుండా ఎలా మాట్లాడతారా అనిపించింది. ప్రతీది రచ్చ చెయ్యడం వీళ్ళకి అలవాటైపోయింది. ముందు ఎవరన్న వీళ్ళ మీద ఒక ఉద్యమం మొదలెట్టాలి. పరబాష లో కార్యక్రమాలు, వాటి పేర్లు ఉండకూడదని. ఒక్కళ్ళకి 'ళ' 'ణ' పలకడం రాదు. ఒక వాక్యం మాట్లాడితే దాంట్లో 90% ఆంగ్ల పదాలే. టీవీ 9 లో ఐతే బూతద్దం పెట్టి వెతికినా ఒక్క తెలుగు కార్యక్రమం పేరుండదు.  


ఇక ఆ పాఠశాలలో జరిగిన విషయమైతే చాలా శోచనీయం. కానీ అలాటివి బోళ్ళు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ పిల్లలు తెలుగులో మాట్లాడాలని తల్లి తండ్రులకు ఉంటే తప్ప చెయ్యకలిగిందేమి లేదనిపిస్తుంది నాకు. వాళ్ళేమో ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే, ఫ్యూచర్ లో కష్టం అని అంటారు. మైదుకూరు లాటి సంఘటనలు జరిగే సరికి, జనాల్లో రగ్గు కప్పుకుని నిదరపోతున్న భాషాభిమానం, మాతృ బాష మీద ప్రేమ పొంగుకొచ్చేస్తాయ్ . సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఏవేవో ప్రతిపాదించేస్తారు . ఆంగ్లం రద్దు చెయ్యాలి, తెలుగు ని ముద్దు చెయ్యాలి అని. తెలుగు నేర్చుకోడానికి , కేవలం తెలుగు లో బోధన, ఆంగ్లం వాడకపోవడం కాదు కావాల్సింది. తెలుగు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగచెయ్యాలి పిల్లలకి. ఇష్టంగా పిల్లలు చదివేడట్టు పుస్తకాలు, లేక సి డి లు (ఇవి కొన్ని ఇప్పటికే ఉన్నాయి కానీ ఇంకా ఎక్కువగా) రావాలి. చందమామ లాటివి చదవడం అలవాటు చేస్తే, వాటి కంటే మేలు చేసేవి ఉండవు భాషా వికాసానికి. పెదబాల శిక్ష ఉంటే బూజు దులిపి, లేకపోతె కొని, పిల్లలకి చదివి చెప్పాలి, చదివించాలి. హ్యారీ పాటర్ (నేను చదవలేదు, మంచి పుస్తకమని విన్నాను)ని తలదన్నే పుస్తాకాలు తెలుగులో ఉండి ఉంటాయ్. కాకపొతే ఇంగ్లీష్ పుస్తకాల మీద ఉన్నంత ఆసక్తి తెలుగు పుస్తకాల మీద ఉండేడట్టు తల్లి తండ్రులు చెయ్యాలి. ఈ భాషా సంఘాలు,తెలుగు విశ్వవిద్యాలయాలు నిజంగా ఎమన్నా చేయదల్చుకుంటే, కొంత డబ్బు వెచ్చించి, బాలల సాహిత్యాన్ని మంచి నాణ్యతతో, ప్రమాణాలతో ప్రచురించాలి. (తినాలంటే రుచి తో పాటు రూపు కూడా అవసరం కదా ). వీలయితే పాఠశాలలకి ఉచితంగా కాపీలని ఇవ్వాలి. తరచూ పిల్లల కోసం తెలుగు భాష కి సంబంధించిన  వినోద కార్యక్రమాలు నిర్వహించాలి . ముఖ్యంగా ఇలాటి వాటిలో సుదీర్ఘ ఉపన్యాసాలు అవి ఇచ్చి బెదరగొట్టకుండా , వారికి నచ్చే రీతిలో చెయ్యాలి. వాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండేడట్టు చూడాలి. నాకు టీవీ లో పాటల పోటీలు అవి చూసినప్పుడు, తెలుగు భాషకేం ఢోకా లేదు అనిపిస్తుంది, అంత స్పష్టంగా పాడుతున్నారు, మాట్లాడుతున్నారు. కాకపోతే ఈ సంఖ్య తక్కువనుకోండి.  


మాతృ భాషలో విద్యా బోధన ఇవన్ని ఇప్పటి కాలమాన పరిస్థితులలో అసాధ్యం కానీ, కనీసం తెలుగు ఖచ్చితంగా తీసుకోవాలి అని హైస్కూల్ వరకు అన్నా పెడితే బావుంటుంది (ఇది ఇప్పటికే ఉందేమో నాకు తెలియదు. ఉంటే పాటించట్లేదని మాత్రం చెప్పగలను .)  


మైదకూరు ఉదంతం వల్ల జరిగిన మంచి ఎమన్నా ఉంటే, అది జనాలు ఓ నాలుగు రోజులు తెలుగు గురించి మాట్లాడుకుంటారు. ఆ తరువాత మల్లి మామూలే, మర్చిపోతారు.  


ఈ సందర్భం లో నేను రాసిన పాత టపా ఒకటి గుర్తుకొచ్చింది. టి వి చానల్లు, సినిమాలలో తెలుగు గురించి. http://maanasasanchara.blogspot.com/2008/06/blog-post.html
P.S. రాము గారు ఈ అతిని ఇంకా బాగా ఎండగట్టారు. చూడండి.
http://apmediakaburlu.blogspot.com/2009/10/blog-post_2Saturday, October 24, 2009

ప్రేమంటే!
నేను ఎప్పుడో నా కాలేజీ రోజుల్లో (ఒక 7 ఏళ్ళు అయిఉంటుందేమో) రాసుకున్న కవిత. పాత పుస్తకాలు తిరగేస్తుంటే కనపడింది.


పూలన్నవి పూయకపోతే మొక్కకు అందం లేదు
ప్రేమన్నది విరియకపోతే మనసుకు అర్థం లేదు
బ్రతుకే వ్యర్థం కాదూ!

చివురించిన వసంతంలో చిగురాకుల గుండెల్లో చినుకులకై ఆలాపన ప్రేమ
గుబురైన పొదల్లో వికసించిన పూయదల్లో తుమ్మెద కై తపనే ప్రేమ
విరియని కలువ కనుల్లో చంద్రుడి కై ఆవేదన ప్రేమ
విరిసిన కమలం హృది లో సూర్యుడి కై ఆ వేదన ప్రేమ

ఎగిసే అల కోసం నీటి కన్నీటి ధార ప్రేమ
కురిసే వానలో ఒరిసే ఎండకి పుట్టే హరివిల్లు ప్రేమ
శిల మదిలో నిదురించే శిల్పం కనుల్లో యమయాతన ప్రేమ
తన యదనే చుంబించే ఉలి కోసం విరహాలాపన ప్రేమ

Monday, October 12, 2009

ఎన్నాళ్ళయింది


- వాసు


ఎన్నాళ్లైంది..
కమ్మని అమ్మ వంట తిని
నాన్నతో తీరికగా కబుర్లు చెప్పి
నా మేనకోడలు ముద్దు మాటలు విని
ఇష్టమ్లేని హిందీ సీరియల్స్ మా అక్కతో, తెలుగు సీరియల్స్ మా అమ్మతో సీరియస్గా చూసి ఎన్నాళ్లైంది

ఇరుకైన రోడ్లలో ఉరకలేస్తున్న బైక్ నడిపి
బారులు తీరిన లైన్లలో గంటల తరబడి నించుని సినిమా చూసి
అర్థ రాత్రులు నిద్ర పట్టక విరబూసిన వెన్నెలలో వూరంతా షికారు చేసి
కాలనీ చివర మా గ్యాంగ్తో మూడింటికి ఐస్ క్రీమ్ తిని ఎన్నాళ్లైంది


వాన తుమ్పరలో వీధి చివర బొగ్గుల్లో కాలుతున్న మొక్క జొన్న కండి
వేడి వేడి చాట్ ని వేళ్ళు ముంచి వేసిన పానీ పూరీని రుచిగా వడ్డించే బండి చూసి ఎన్నాళ్లైంది


గ్రూప్ స్టడీలని గ్యాప్ లేకుండా కబుర్లు చెప్పుకుని
గుడుంబా గాడి రూమ్ లో రాత్రంతా పేకాడి
మేడ మీద, ఆకాశం కింద తీరిగ్గా పడుకుని చుక్కలని లెక్కెట్టి
పోరుల గురించి సినిమాల గురించి డిస్కషన్లు పెట్టి
ఎన్నాళ్లైంది

పెద్దగా పని లేకపోయినా క్షణం కూడా తీరికలేని
జేబులో పది లేకపోయినా కొంచం కూడా బాధలేని
నడిచేది ఎంత దూరమైనా కాళ్ళకు నొప్పి రాని
నేస్తాలతో నడిచే ఆనందాన్ని
చవిచూచి ఎన్నాళ్లైంది