Saturday, May 21, 2011

ఎవడో గోదారి మీద లాంచీ లో భద్రాచలం వెళ్ళచ్చన్నాడు.. వాడిని !#%^^!@%& - రెండవ భాగం


మొదటి భాగం - ఇక్కడ  

నిడదవోలు - చాగల్లు - పట్టిసీమ - పాపి కొండలు - పోచవరం మీదుగా జీడికుప్ప చేరుకున్నాం.

జీడికుప్ప నించీ ఆటో బయల్దేరింది. చిమ్మ చీకటిలో, కారడివిలో (అదంతా  ఏజెన్సీ ప్రాంతం), ఆ పిల్లాడు వేస్తున్న టార్చీ లైట్  వెలుగులో, దారి పొడవునా గుంటలు పడిన ఆ రోడ్డు మీద ఆటో సాగిపోతోంది.   అసలే బెదిరి పోయిన మమ్మల్ని ఆ ఆటో వాడు, ఇక్కడ కూంబింగ్ జరుగుతోందని, అన్నలు, పోలీసులు తెగ తిరుగుతున్నారని చెప్పి ఇంకా భయపెట్టాడు. పక్కనే ఉన్న పిల్లాడు దానికి వత్తాసుగా అప్పుడప్పుడు పులులు కూడా వస్తూ ఉంటాయని గుండెల్లో విమానాలు పరిగెత్తించాడు.

ఈ లోపు వెనకన కూర్చున్న నాకు తల మీద, ఆటో పైన ఏదో కదులుతూ ఉన్నట్టనిపించింది. నా భ్రమేమో, చెప్తే నవ్వుతారని  ఏమీ మాట్లాడలేదు. ఇంతలో రోడ్డు మీద ఒక గతుకొచ్చింది. అంతే గబాలున ఎవరో నెత్తి మీదకి ఉరికారు.కెవ్వున కేక వెయ్యబోయి, భయాన్ని గొంతులోకి మింగి, ఆటో ఆపమని అరిచాను. డ్రైవర్ అదో రకం లుక్ ఇచ్చి బ్రేక్ వేసాడు ..

అందరూ నన్ను వింతగా చూసారు. "పైన ఎవడో ఉన్నాడు రా ఖచ్చితంగా. నా నెత్తి  మీద ఎగిరి పడ్డాడు. అన్నలేమోరా" అన్నాను.
  
అన్నలకి పనేం లేదా ఆటోమీదకి ఉరికి నిన్ను పట్టుకోడానికి నువ్వేమన్నా రాజకీయ నాయకుడివా, కనీసం వీధి రౌడీవి కూడా కావు అని రియాక్షన్.

నాకు ఒళ్ళు మండింది. పుండు మీద కారం జల్లినట్టు ఆటో డ్రైవర్ పకపకా నవ్వుతున్నాడు. వీడికి ఓంకార్ షో లు రోజంతా చూపించినా పాపం లేదన్నంత కోపం వచ్చింది. వాడు నవ్వాపి, తోడుకని ఇంకో పిల్లాడిని తెచ్చుకున్నానని, ఆటోలో చోటు లేదని పైనే కూర్చోపెట్టానని చెప్పాడు.  

నేను సీరియస్ గా వెళ్లి ఏమీ జరగనట్టు ఆటో లో కూర్చున్నా. మిగత వాళ్ళంతా కామెడీ గా వచ్చి కూర్చున్నారు.
డ్రైవర్ గేర్ రాడ్ వెనక్కి లాగాడు. ఆటో ముందు కెళ్ళింది. చిమ్మ చీకటిలో చిన్న కాంతి లో దారిని చూస్తుంటే, మా పరిస్తితికి సింబాలిక్ గా ఉన్నట్టనిపించింది. ఈ ఆటో దొరకకపోతే ... తలుచుకుంటేనే భయం వేసింది.

ఇలా ఒక గంట ఆటో అడవిలో, నేను ఆలోచనల్లో ప్రయాణించాక కూనవరం రానే వచ్చింది.  కాకపోతే అర్థరాత్రి అయ్యింది. ఊహించి నట్టే ఆఖరి బస్సు కూడా వెళ్లి పోయింది.  అక్కడ తినడానికే హోటల్స్ లేవు. ఇక ఉండడానికి ఏముంటాయి. ఏదైతేనేఁ అడివి నించి ఊర్లోకి వచ్చాం. ఆటో డ్రైవర్ కి బోలేడ్ థాంక్సులు చెప్పి, డబ్బిచ్చి పంపేశాం.
భద్రాచలానికి ఇంకో వాహనం కోసం ప్రయత్నం మొదలెట్టాం.


ఆటో స్టాండ్ లో సగం మంది బళ్ళు ఆపేసి, కల్లు తాగేసి తూలుతున్నారు. మిగతా సగానికి బళ్ళు లేవు. ఎవరో ఒకతను తనకు ఆటో డ్రైవర్ ఒకడు తెలుసనీ ఊర్లోకి తీసుకెళ్తానన్నాడు. నేను నా స్నేహితుడు కిరణ్ వాడిని ఫాలో అయ్యాం. అయిదు, పది , పదిహేను , ఇరవై (మగధీర లో శ్రీహరి లా లెక్కెట్టుకోండి) నిమిషాలు నడుస్తూనే ఉన్నాం. ఇంకొంచం ముందుకు ఇల్లు అని తీసుకెళ్తూనే  ఉన్నాడు .  ఆయాసం, అసహనం వస్తున్నాయి కానీ ఇల్లు రాలేదు. ఈ లోపు వాడు ఇంకా ఇంకా ముందుకు పోదాం అంటూ పోయాడు. మాయమైపోయాడు. హ్యాండ్ ఇచ్చాడని డిసైడ్ అయ్యి ఉసూరు మంటూ వెనక్కి బయల్దేరాం.

ఆటో స్టాండ్ కి వచ్చేసరికి నా స్నేహితులు ఒకడితో బేరం కుదిర్చారు. రెండు వందలు కాబోలు. ఆ డ్రైవర్ చూస్తే కొంచం తూలుతూ ఉన్నాడు. వీడిని నమ్ముకుంటే మనల్ని ముందుకు కాదు పైకి పంపించే డట్టు ఉన్నాడని డిసైడ్ అయ్యి, వద్దని చెప్పేసాం. ఈ లోపు ఆ పక్కన వైన్ షాపు లో లోడ్ దించుతున్న మినీ ట్రక్ డ్రైవర్ మా పాలిట రాముడిలా వచ్చి, లోడ్ దించాక భద్రాచలం వెళ్తానని చెప్పాడు. పది నిమిషాలు ఆగితే మమ్మల్ని తీసుకెళ్తా నని హామీ ఇచ్చాడు .

ఇది విన్న తాగున్న ఆటో డ్రైవర్ కళ్ళు తాగిన కోతిలా గంతులేసి గొడవకి దిగాడు.  సారా ఆటో క్లబ్ అంతా వాడికి వత్తాసు పలికింది. ఏదో కొంచం సేపు వాదించినా, అందరం పోకిరీలం కాదు కదా , బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్లమి. కనుక బేరం ఆడిన మొత్తం వాడికి సమర్పించుకున్నాం. దిగాక ఇచ్చే ఆటో డబ్బులు ఎక్కకుండానే ఇచ్చాం ( పోను పోను ఇదే పద్ధతి జిం లో అలవాటయ్యింది. నెలకోసారి కూడా ట్రెడ్మిల్ ఎక్కకపోయినా నెల నెలా చందా మాత్రం కడతాను)

ఆటోవాడిని వదిలించుకుని వైన్ షాప్ లోడింగ్ ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాం. పది నిమిషాలు  అన్నది గంటకి పైగా పట్టింది. ఇంత చీకాకు లోనూ షాప పేరు చూసి నవ్వొచ్చింది - గాంధీ వైన్స్. ముందు మహాత్మా పెట్టకుండా  మేలు చేశాడనుకున్నాం.

వైన్ షాప్ పనవ్వగానే (వాడికి), అందరం లగేజీ తో ఆ చిన్నట్రక్ లో ఎలాగో ఇరుకున్నాం. పవిత్రంగా సారా బండిలో భద్రాచలం బయల్దేరాం. అర్థరాత్రి లో అడవి ప్రాంతం లో చిక్కటి చీకటిలో చక్కటి చుక్కల్ని చూస్తూ  కాళ్ళ నొప్పులు, కళ్ళ నొప్పులు (నిద్రలేక), మందు కంపు, వంటికి గుచ్చుకుంటున్న విరిగిన సీసాముక్కలు అన్నీ మరిచిపోయాం.
గంటలో భద్రాచలం చేరాం. గుడ్డిలో మెల్ల హోటల్  ఒక్కటీ ముందే బుక్ చేసుకున్నాం. హోటల్ దగ్గరికి  రాగానే డ్రైవర్ బేరం మొదలెట్టాడు. లిఫ్ట్ అనుకున్నామే అంటే నాకిచ్చే డబ్బు గిఫ్ట్ అనుకోండి అన్నట్టు చూసాడు. అడిగినది ఇచ్చి హోటల్ రూమ్స్ చేరుకున్నాం. ఆ టైం లో కూడా మాకు తినడానికి ఏర్పాటు చేసిన ఆ హోటల్ బాయ్ ని మర్చిపోలేం.

మర్నాడు ఆలస్యంగా వెళ్ళినా దర్శనం బ్రహ్మాండంగా ఐంది.ఈ ప్రయాణం అనుభవం తో హైదరాబాద్ తిరిగి వెళ్ళేటప్పుడు భద్రాచలం నించి ట్రైన్ బుక్ చేసుకున్నాం. ట్రైన్ టైం కి రెండు గంటలు ముందే స్టేషన్ చేరుకున్నాం ప్రయాణం నేర్పిన పాఠం వల్ల .


ఒక వారం పోయాకా "గోదావరిలో గల్లంతయిన తాతాజీ. గుర్తు తెలియని వ్యక్తుల పని అని అనుమానం" అని  పేపర్ లో పడిందని  నాకు కలొచ్చింది (కాబోలు).



15 comments:

  1. వీడికి ఓంకార్ షో లు రోజంతా చూపించినా పాపం లేదన్నంత కోపం వచ్చింది.

    మిగత వాళ్ళంతా కామెడీ గా వచ్చి కూర్చున్నారు

    పోను పోను ఇదే పద్ధతి జిం లో అలవాటయ్యింది. నెలకోసారి కూడా ట్రెడ్మిల్ ఎక్కకపోయినా నెల నెలా చందా మాత్రం కడతా

    పవిత్రంగా సారా బండిలో భద్రాచలం బయల్దేరాం.__________You rock!

    వాసు గారూ, ఇంకా నవ్వుతూనే ఉన్నా:-)))))))

    ReplyDelete
  2. మొత్తానికి కథ సుఖాంతం అని ముందే తెలుసనుకోండి :)) ...ఈవిధంగా సుఖాంతం అయ్యిందన్న మాట!! అటు కల్లు ఆటోకీ, ఇటు మందు ట్రక్కుకీ బాగానే సమర్పించుకున్నారు మీరు!!

    ReplyDelete
  3. @ సుజాత: థాంక్స్ అండీ.బజ్ లో పెట్టినందుకు ఇంకొన్ని థాంక్స్.

    @ మురళి: ఔనండీ :)

    ReplyDelete
  4. వాసుగారూ,

    మీరు సెన్సారు చేసిన తిట్లు నేనూహించగలను కానీ, మొత్తమ్మీద నా కళ్ళు తెరిపించారు ఈ బ్లాగు పుణ్యమాని. ప్రవాసములో ఉండటమువల్ల ఆంధ్రావనిమీద పెరిగిన ప్రేమవల్లా, గోదావరి సినిమా (పాతిక ముప్ఫైసార్లు చూశాలెండి) ప్రభావంవల్లా గట్టిగానే తీర్మానించుకున్నాను భద్రాచలం పడవమీద వెళ్దామని. ఇప్పుడా ఆలోచన ఎంచక్కా విరమించుకుని, మా ఊరునుంచి నవజీవనుకు ఖమ్మం వరకూ, అక్కడనుంచీ మరో బండిలోనూ బుద్ధిగానూ రాములోరిని చూసివస్తా. మీ అనుభవం దృష్ట్యా తింగరివేషాలేయను. ధన్యోస్మి.

    ReplyDelete
    Replies
    1. సరిగా ప్లాన్ చేస్తే పర్లేదండీ ..ఎవరైనా ఇబ్బందిపడకుండా వెళ్ళిన వాళ్ళని కనుక్కుని వెళ్ళండి :)
      పైగా ఇప్పుడు ఇంకా బోలెడు సదుపాయాలు కూడా వచ్చి ఉంటాయి ..

      Delete
  5. పైన సుజాత గారు అన్నమాటే నాదీను! :)) పాపం మీరు నాలాగేనన్నమాట!! నాచేత మావాళ్ళు అప్పుడొకసారి అడవుల్లో అర్ధరాత్రి ట్రెక్కింగ్ చేయించారులేండి ;) అదీ ఎలుగుబంట్లు ఉండే చోట!! :(( కొంచెం నేను కంగారుగా చూస్తుంటే....నవ్వులు!! హుహ్!! వీళ్ళకి అర్ధంకాదుకదా!! హ్మ్! కాని మీరు రాసిన శైలి మాత్రం సూపర్! You rock!! :)

    ReplyDelete
  6. suspenseful narration.
    It is experiences like this that prove the adage, life is stranger than fiction.

    ReplyDelete
    Replies
    1. థాంక్స్. ఇప్పుడే చూశా ఇది :)

      Delete
  7. నేను పార్ట్ ౧ చదివాను కానీ అప్పుడే కామెంట్ పెట్టలేదు . ఎందుకంటే 2nd పార్ట్కో కోసం దారుణంగా వెయిట్ చేశా.
    త్రిల్లెర్ సుస్పెన్సు కూడా ఇలా ఉండవని అర్దమైంది.
    2nd పార్ట్ తో కంప్లేతే ఇది ఫాలో ఆయె ఫాన్స్ ఎంత హుర్త్ అవతారో మేకు తెలియంది కాదు..
    కానీ ట్రిప్ జరిగే తప్పుడు మీకు ఎలా వుందో ..కానీ మాకు మాత్రం చాల చాల నచ్చింది..
    మాకు రియల్ లైఫ్ కొన్ని scenes జరిగినా ఇంతలా రాయడం మాకు రాదు.. ur awesome !!
    నెక్స్ట్ ఎ త్రిల్లెర్ వస్తోందో అని waiting ఇక్కడ..

    ReplyDelete
  8. అసలింత మంచి టపా ఇన్నాళ్ళు నేనెలా మిస్ అయ్యాను??? హౌ?? మీకేదో అలా ఒకసారి జరిగిందని మా గోదావరిని అన్నన్ని మాటలనేస్తారా? ఊరుకునేది లేదు :( మొత్తానికి మాంచి అడ్వెంచర్ చేసారనమాట :):) మీ పరిస్థితికి తగ్గట్టు అది అమావాస్య కాదు కదా???

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ రసజ్న్య గారు ..
      మాది గోదావరే ..

      అమావాస్య కాదనుకుంటానండీ ..

      Delete
  9. Absolutely delightful peice andi Vasu garu (chadive vallaki)
    Mee Di"Vine" Bhadhrachalam yatra super dangerous ga sagindi.

    -Jyothy

    ReplyDelete
  10. హమ్మయ్య ఎలా ఐతే ప్రయాణం సుఖాంతం ఐంది సంతోషం .

    ReplyDelete
  11. వాసు గారు రాసింది ఇంత ఆలస్యంగా చదివానేమిటా అని తెగ బాధపడ్డాను. అలాగే అందరి రిప్లై లు కూడా చదివాను. చాలా బాగుంది. వాసు గారి భయానకమైన అనుభవం చదివి అయ్యో అన్పించింది.

    నేను 2011 లో వెళ్ళినప్ప్డుడు చక్కని అనుభవం అయ్యింది. పేరంటాల్లపల్లి నుంచి పాపికొండలవరకు ఓహ్! చాలా గొప్ప అనుభూతికి లోను మేము మొత్తం 30 మంది. పాపికొండల్నుంచి తిరిగి రాకుండా అట్నుంచి అటే భద్రాచలానికి ముందుగా మాట్లాడుకున్న ఒక అరడజను సుమోల్లో, (ఎస్‌బి‌ఐ వారి సౌజన్యం లెండి - మాదేమీ ఫాక్షన్ గ్యాంగ్ కాదు), వెళ్ళి బెంగళూరు వచ్చాం; ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా.!

    ReplyDelete