Thursday, July 20, 2017

షికాగో సౌత్ లూప్ లో ఆ రోజు ....రెండో పూట
ఇంక చేసేది లేక మూన్ రూఫ్ తెరిచి బంకర్ నించి తప్పించుకున్న భారతీయుడిలా బయటకి వచ్చా.
ఎక్కడినించీ బయటికి వచ్చా ఏం కథా తెలుసుకోవాలంటే ముందు మొదటి పూట ఏం జరిగిందో మొదటి పుట లో చదివి రండి.నేరుగా ఫ్రెష్ ఫార్మ్స్ పక్కనే ఉన్న పటేల్ బ్రదర్స్ అనే గుజ్జూ కొట్టు ముంగిట్లోకి చేరుకున్నా. కొట్టు నిండా పెళ్ళాలు వదిలేసిన మొగుళ్ళే. మీరు పెడార్థం తియ్యక ముందే మీకొక యదార్థం చెప్పాలి. డెవాన్ లో బ్యూటీ పార్లర్ సేవలు మహా అప్రియమని, భలే మంచి చౌక బేరమని బోరుమని ఏడ్చే పిల్లలని, మొగుళ్ళని (మళ్ళీ పెడార్థం, ఎవరి మొగుడిని వారు) గంటల తరబడి పచారీ కొట్లలో వదిలేసి క్యూలు కట్టి మరీ సేవలు పొందుతారు మహిళలు.

అందుచేత పిల్లలని చూడవలిసి వచ్చిందని చిరాకు, భార్య పక్కన లేదని ఆనందం, పచారీ సామాను కొనాలని బాధ కలగలసిన మిశ్రమ స్పందన తో కనిపిస్తారు ఎక్కువగా మగంగులు. అన్నట్టు ఎక్కడున్నాను.. ఆ .. పటేల్ బ్రదర్స్ మునివాకిట్లో. మొత్తానికి జనాలను తోసుకుంటూ కావాల్సినవి తీసుకున్నాను. సేల్ లో ఉన్న రైస్, ఎక్ష్పైరీకి దగ్గరలో ఉన్న మ్యాగీ, ఆగస్టు పదేహేను న ఒక స్కూలు మొత్తానికి పంచడానికి సరిపోయే బిస్కెట్స్, ఫిలిపినో కొబ్బరికాయలు , మెక్సికో మావిడి పళ్ళు, ఎండిపోవడానికి అరడుగు దూరంలో ఉన్న కరివేపాకు, పండిపోయిన పచ్చిమిర్చి , అరటి కాయకి పండుకి మధ్యస్థంగా ఉన్న అరిటికాయలు, ఆవు నెయ్యి, అగ్గిపెట్టెలు, అగరబత్తి , పత్తి వత్తి, పూల గుత్తి ఇలా నానా విధ ఫల పుష్ప తోయ ద్రవ్య ద్రవ , ఘన పదార్థాలతో కదులుతున్న రైతు బజార్ లా బయటకి వచ్చాను. కార్ట్ ని కార్ దాకా పట్టికెళ్ళడానికి క్యాష్ డిపాజిట్ చెయ్యాలి. నా దగ్గర సమయానికి క్యాష్ లేక , నా ఐ డి కార్డు , లైసెన్స్, విజిటింగ్ కార్డ్, క్రెడిట్ కార్డ్ గట్రా ఇచ్చి, జనాలని తోసుకుంటూ , తప్పించుకుంటూ కార్ కేసి పరుగెత్తాను. హమ్మయ్య బయటపడ్డాను అనుకునే లోపు అక్కడ కార్ కనపడలేదు. నా మతిమరుపు తో వేరే ఎక్కడన్నా పెట్టానా అని కీ నొక్కి చూస్తే ఎక్కడి నించో చిన్న కోత విన్పించింది. అది కూడా నా నించి దూరంగా వెడుతున్నట్టు మూలుగు లోకి పరివర్తనం చెండుతూండడం చూసి అటు వైపు చూశాను. అల్లారు ముద్దుగా చూసుకున్న నా కామ్రీని కామన్ సెన్స్ లేకుండా కాలర్ (అదే బంపర్) పట్టుకుని కాళ్ళీడ్చు(అదే టైర్లీడ్చు) కుంటూ టవింగ్ ట్రక్ తీసుకెళ్తుంటే కడుపు తరుక్కు పోయింది. ఎగసిపడుతున్న అల , ఎగురుతున్న పక్షి , నడుస్తున్న జనం, కురుస్తున్న మంచు అన్నీ స్తంబించి పోయాయి (అనిపించింది). ఆ బాధ లోంచి తేరుకుని కార్ట్ కొట్టులోకి ఈడ్చుకెళ్ళి, అక్కడ వదిలేసి, ఆ టవింగ్ ట్రక్ వెనక వసంత కోకిల చివరి సీన్ లో కమల్ హాసన్ లా పరిగెత్తాను.


నన్ను చూసాడో ఏమో ఆ డ్రైవర్ ఇంకా వేగంగా పోనిచ్చాడు . చేసేది లేక క్యాబ్ తీసుకుని ఆ ట్రాక్ ని ఫాలో అయ్యా. అక్షరాల రెండు వందల.. డాలర్లే.. జరిమానా కట్టి నా కార్ ని చర విడిపించా. ఈ సారి పార్కింగ్ స్పేస్ వెతికి రెండు గంటలకి టికెట్ తీసుకుని కొట్టు లో వదిలేసిన కార్ట్ తీసుకుని సామాన్లు తీసుకుని ఇంటికి పరిగెట్టించాను. టోరీ లో "నువ్వేమి చేసావు నేరం " పాట వస్తోంది.

డెవాన్ స్ట్రీట్ ని పార్కింగ్ స్పేస్ లా చేసిన దేశీ కార్లని తప్పించుకుని లేక్ షోర్ ఎక్కి గడ్డ కట్టిన మిషిగన్ సరస్సు ను చూసుకుంటూ గంట లో ఇల్లు చేరుకున్నాను. మూడు తాళాలతో ఆరు తలుపులు తీసి మూవింగ్ కార్ట్ ఒకటి తెచ్చుకున్నాను లోపలి స్టోర్ రూం నించి. అండర్ గ్రౌండ్ పార్కింగ్ నించి లిఫ్ట్ లేదు మరి. పార్కింగ్ లైట్స్ వేసి గబా గబా రైతు బజార్ ని కార్ లోంచి కార్ట్ లోకి ఎక్కించా. మళ్ళీ ఒక్కొక్కటే తలుపు తీసుకుని లిఫ్ట్ లో చేర్చి, తొమ్మిదో ఫ్లోర్ లో నా ఇంటికి చేర్చే సరికి తల ప్రాణం తోకకి వచ్చింది.
అంతర్యామి అలసితి సొలసితి అనుకుంటూ నిదుర లోకి జారుకున్నా. సౌందర్య లహరి .. స్వప్న సుందరీ .. పాట బాక్గ్రౌండ్ లో వినిపిస్తోంది. ఆ అమ్మాయి ట్రాలీ మీద కాకుండా కార్ మీద నించుని అటూ ఇటూ నడుస్తోంది . ఒక్కసారి కిందకు చూశా తాళాల గుత్తి వేలాడుతోంది .. దగ్గరికి వెళ్లి చటుక్కున తీప్పా .. కార్ డోర్ తో పాటు కళ్ళు తెరిచాను. ఎదో మరిచాను ..

పరుగు పరుగున కింద ఎమర్జెన్సీ పార్కింగ్ దగ్గరికెళ్ళా .. కార్ లేదు ..
డోర్ మాన్ ని అడిగా .. చావు కబురు చల్లగా చెప్పాడు. .. ఆ పార్కింగ్ 15 నిమిషాలకే.. అది దాటితే ఫోన్ వస్తుందని , ఎత్తకపోతే టికెట్ అతికిస్తారని, చూసుకోకపోతే tow చేస్తారని ..
ఇంకా నయం జైల్ లో పెడతారని కోర్టుకి తీసుకెళ్తారని చెప్పలేదనుకుని .. ఈ అతి రూల్స్ కో దండం పెట్టి, స్వదేశం లో స్వేఛ్చని తలుచుకుని కన్నీరు తుడుచుకుని నీరసం స్వాశగా షికాగో సౌత్ సైడ్ కి సాగిపోయా.. క్యాబ్ లో .. అక్కడ సొట్టపడ్డ , విరిగిపోయి, వదిలించుకోడానికే పార్కింగ్ లో పెట్టినట్టున్న కార్ల మధ్య Orange is the new black లో హీరోయిన్ లా బిక్కు బిక్కు మంటూ పిచ్చి చూపులు చూస్తోంది నా cute క్యామ్రీ. బాధ, కోపం తో పాటు ధ్వని, కన్నీరు తో కూడిన ఏడుపొకటి వచ్చింది.. ఆ tow mater మొహాన రెండొందల డాలర్లు కొట్టి మళ్ళీ విడిపించి నా క్యామ్రీ ని ఇంటికి నడిపించాను.. పార్కింగ్ దగ్గరికొచ్ఛేసరికి ఆకలి భగ్గుమంది.
హడావుడిగా కార్ పార్కింగ్ లో పెట్టి, లిఫ్ట్ లో ఇంటికి పరుగెత్తాను

అప్పటికే ఇంగువ ఘాటు లిఫ్ట్ లోకి వస్తోంది. మావిడికాయ పప్పు, బంగాళా దుంప వేపుడు, పెరుగన్నం లాగించి మళ్ళీ ఓ కునుకు తీసా..
                              

లేచేసరికి ఉదయం ఆరు. త్వరగా ముస్తాబై ఆఫీస్ కని కిందకు పరిగెత్తాను. నా పార్కింగ్ స్పాట్ లో కారు లేదు. covered పార్కింగ్ లో కారు ఎవరు ఎత్తుకెళ్లారు? ఎలా మాయమైంది ? నీకు తెలుసా ? అని డోర్ మాన్ ని నిలదీస్తే వాడు నా చెమటలు తుడుచుకోడానికి ఒక కర్చీఫ్ ఇచ్చి , లాగ్ రిజిస్టర్ తెచ్చి చూపించాడు.. నాది పార్కింగ్ 26 పక్కది 28.. నాదనుకుని 28 లో పెట్టాను. బోల్తా కొట్టాను ..

ఇంకేముంది .. శ్రీ మద్రమణ గోవిందో హరి అనుకుని .. రెండొందల ఫైన్ కట్టడానికి towmater దగ్గరికి పరిగెత్తాను ..

Tuesday, November 25, 2014

లాస్ వేగాస్ 'తీర్థ' యాత్ర - 1-------------------------- ఒక యదార్థ కథ ----------------------------------
జూలై 2,2009;


ఉదయం ఆరింటి నించి ఆకాశంలో అలిసిపోయిన సూరీడు ఓవర్ టైం చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాడు. అలాటి విషయాల్లో నేనైతే ఆలోచించను. నేనెక్కిన United ఫ్లైట్ అమెరికా అంతా తిరిగి, San Fransisco లో దిగింది. నేను ఫ్లైట్ దిగి, పిక్ అప్ చేసుకునే నా స్నీహితుడు ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తున్నాను. ఇంతలొ నా సతీమణి ఫోన్. ఫ్లైట్ దిగారా, లగేజి వచ్చిందా, ఎయిర్ హోస్టెస్ బావుందా, పక్కన సీట్లో అమ్మాయి కూర్చుందా, ఫ్లైట్ లో సీట్లెన్ని, ఇతరత్రా ప్రశ్నలకు బదులిచ్చి (ఫోన్ లో అవసరమైన విషయాలు మాట్లాడేవాళ్ళు అరుదు. మేము ఆ అరుదైన వారిలో లేము) గంట లో ఇంటికొస్తానని చెప్పాను. నా స్నేహితుడు రాగానే ఇంటికి బయల్దేరాను. ప్రయాణం లో గత వారం విషయాలు గిర్రున తిరిగాయి. 


అది గురువారం సాయంత్రం. 

                       రాత్రికి నా ఫ్లైట్ ఇంటికి ఈస్ట్ కోస్ట్ నించి. ఇంతలో ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు, మా బాస్, మా క్లైంట్ వాదించుకుని, నేను ఆ వారాంతం అక్కడే ఉండాలని డిసైడ్ చేసారు. చేసేది లేక అక్కడే ఉన్నాను. శుక్రవారం అక్కడ దగ్గర్లో మా బావగాడు ఉంటే కలుద్దామని బయల్దేరాను. నేను బస చేసిన ప్రదేశం Hershey (Hershey Chocolates పుట్టినూరు). అక్కడ నా దురదృష్టం కొద్దీ దేశి మేనేజర్ అవ్వడం వల్ల, ఆయన తనతో పాటు నన్ను గాడిద చాకిరీ చేయించి, సాయంత్రం ఆరున్నరకి వదిలిపెట్టాడు. నేను ఆ ఉదయాన్నే రెంట్ చేసిన, కారులో జోరుగా హుషారుగా మా బావగాడింటికి బయల్దేరాను.

                           వాడింటికి రూట్ చాలా ఈజీ అని నాకనిపించి రెండు గూగెల్ మ్యాప్ లు పట్టుకుని, జి పి ఎస్ లేకుండా ధైర్యంగా బయల్దేరాను. అది నేను చేసిన మొదటి తప్పు. ఆకాశం మేఘావృతమై చినుకులతో చిన్న సంకేతం పంపింది కానీ నేను లెక్కచెయ్యలేదు. మ్యాప్ జాగ్రత్తగా చూసుకుంటూ, మధ్య మధ్యలో ఇంటికి కాల్ చేసి confirm చేసుకుంటూ జాగ్రత్తగానే వెళ్లాను. మధ్యలో ఏదో నేను ఆలోచనలో పడి కార్ పరిగెత్తింది. కట్ చేస్తే నేను రూట్ తప్పాను, కానీ నాకింకా తెలియలేదు. సెల్ లో సిగ్నల్ లేదు. కార్ లో జి పి ఎస్ లేదు. పరిస్తితి ఏం బాలేదని, అక్కడ ఒక కొట్టు దగ్గర ఆపి, కాఫీ తాగి తాపీ గా ఉన్న మీ బోటి పెద్ద మనిషిని రూట్ అడిగా. అది నేను చేసిన రెండో తప్పు. ఆయన పుణ్యమా అని ఆ తప్పుదారంపటే ఇంకో అరగంట వెళ్లాను. తప్పు తెలుసుకుని, రూట్ కనుక్కుని ఒక మూడు గంటలు పైగా పడుతుంది ఇల్లు చేరేసరికి అనుకొని గుండె నిబ్బరం చేసుకున్నాను. 


        కిందా మీద పడి ట్రై చేస్తున్నాను కానీ కరెక్ట్ రూట్ లో పడలేదు. ఒక పక్క విపరీతంగా వర్షం. దారిలో చాలా చోట్ల ఎన్నో కొట్ల దగ్గర ఆగాను కాని జి పి ఎస్ దొరికలేదు ఎక్కడా. చేసేది లేక సాహసం శ్వాసగా సాగిపోయాను. ఇంచు మించు అర్థ రాత్రి అయినా తూలకుండా కారు తోలుతున్నాను. ఏదో ఆలోచిస్తుంటే సడన్ గా రెడ్ లైట్ పడింది. సర్రున బ్రేకేసా (ఇది నేను చేసిన మూడో తప్పు). అంతే హెడ్ లైట్ పగిలింది. నా ఫ్రంట్ బంపర్, ముందు కారు బ్యాక్ బంపర్ ఊడి రోడ్డుని ముద్దాడాయి. ముందు బ్రేకేసున్న కార్ ఆమడ దూరం ముందు జరిగింది(అన్నట్టు మర్చిపోయా నేను రెంట్ చేసిన కార్ ఆ రోజే కొత్తగా దిగిన పోనియాక్ ౫. దిష్టి బాగా తగిలినట్టుంది ) . నా గుండెలో బాంబు పేలింది. వెంటనే దిగి పరుగు పరుగున వెళ్లి, ముందు కార్ లో ఉన్నవాళ్లు ఎలా ఉన్నారో చూసాను. ఇద్దరు తెల్ల పండు ముసలమ్మలు 60 కి దూరంగా 70 కి దగ్గరగా (నా దురదృష్టానికి దగ్గరగా) ఉన్నారు. నా అదృష్టం కొద్ది ఎవరికీ ఏం కాలేదు. దురదృష్టం కొద్దీ కార్లకి damage బాగా ఐంది. ఈ లోపు కాప్స్ (పోలీసు లకి ) ఎవడో ఉత్తముడు కాల్ చేసాడు. చిన్న ఊరు రాకరాక వచ్చిన ఫోన్ ఏమో 5 నిమిషాలలో వచ్చేసారు . వాళ్ళు వచ్చి రకరకాల ప్రశ్నలు వేసి, ఏం చెయ్యాలో చెప్పి, తప్పు నాదని నిర్దారణ చేసి (అది తేటతెల్లమని మీకు నాకు తెలుసనుకోండి) సంతకాలు తీసుకుని, ధైర్యం చెప్పి, ఇది చాలా మామూలు విషయం, ఆ రోజుల్లో ఇలాటివి మేము ఎన్ని చేసామో, నువ్వేం బాధ పడకు అని ఓదార్చి, నా బంపర్ ని తాడుతో కట్టి, నా భుజం తట్టి, వీధి చివరి వరకూ వచ్చి సాగనంపారు (కాప్స్ ఇక్కడ ఇంత మంచి వాళ్ళని నాకప్పుడు తెలిసింది. ఆ అనుభవం తెలియడానికైనా మీరు ఒక్క accident చెయ్యాలి. ఇది నా మనవి, డిమాండ్ ). ఇంకో మూడు గంటలు, నాలుగైదు స్టేట్ లు తిరిగి, పక్క స్టేట్ లో (న్యూ జెర్సీ ) లో ఉన్న మా బావగాడింటికి , రాత్రి మూడింటికి చేరుకున్నా. మా వాడితో న్యూ యార్క్ అవి తిరిగి మల్లి వర్క్ కి వచ్చేసా. ఆ తరువాత అంత విశేషాలు ఏం లేవు కాబట్టి ప్రెసెంట్ కి వచ్చేద్దాం.

రీకాప్ : ఎయిర్ పోర్ట్ నించి ఇంటికి వస్తున్నాను. 


మర్నాడే మా వేగాస్ ప్రయాణం. ఎప్పుడో రెండు నెలల ముందు ప్లాన్ చేసినది. నేను ఇంటి కొచ్చి, ౩ వారాలుగా చప్ప తిండి తో చచ్చుపడిన నోటికి ఆంధ్ర వంట రుచి చూపించా. ప్రాణం లేచొచ్చింది. ప్రయాణం బడలిక తీరి, మర్నాటి ప్రయాణానికి ఊపోచ్చింది. ఇంకో 5 గంటలలో (7:30 కి ) ఫ్లైట్ (అని అనుకున్నాం - 4 వ తప్పు). బట్టలన్నీ సద్దుకుని, కబుర్లు చెప్పుకుని, కునుకు తీసేసరికి, ౫వ గంట మోగింది. త్వరగా తయారయ్యి , మా ఫ్రెండ్స్ తో కలిసి ఎయిర్ పోర్ట్ కి బయల్దేరాం. ఎక్కడో ఊరవతల పార్క్ చేసి, ఎయిర్ పోర్ట్ వాన్ లో టెర్మినల్ చేరుకున్నాం. తీరా చూస్తే మేము వెళ్ళాల్సిన దానికి (American Airlines కి) కాకుండా (United కి ) వేరే టెర్మినల్ లో దిగాం (5 వ తప్పు) . అప్పుడే తెలిసిన ఇంకో విషయమేమిటంటే ఎక్కాల్సిన ఫ్లైట్ ఇంకో 30 నిమిషాలలో ఎగిరిపోతోంది. వేరే టెర్మినల్ నించి (అంటే మేము అనుకున్న దాని కంటే అరగంట ముందు - 6 వ తప్పు ). చేసేది లేక పరుగు పరుగున పరుగెత్తాం. 10 నిమిషాలలో చేరుకున్నాం. కానీ అక్కడ అరగంటే కంటే తక్కువ ఉంది take off కి ససేమిరా పంపమని నొక్కి వక్కానించింది అక్కడున్న తెల్లావిడ . మేము కాళ్ళు జడ, చేతులు మెడ పట్టుకుని బతిమాలితే, మొత్తానికి చెకిన్ చేసి పంపింది. సెక్యూరిటీ చెక్ అన్ని అయ్యి, బోర్డింగ్ చేసాం. మూడు ముప్పులూ, ఆరు తప్పులతో వేగాస్ కి మా ప్రయాణం మొదలైంది.

రెండవ భాగం లో.

Tuesday, September 2, 2014

అక్కడ బాపు - రమణ


అల 
వైకుంఠ పురంబున

జయ విజయులు వైకుంఠ ద్వారం దగ్గర ఆయనకి ఘన స్వాగతం పలికారు


శేష తల్పం మీద శయన ముద్ర లో ఉన్న స్వామి వారి దగ్గరికి ఆయనని తీసుకెళ్ళారు.   లక్ష్మీదేవి నారాయణుడి పాదాలొత్తుతోంది.

స్వామి వారు లోపలికి  వస్తున్న ఆయనని చూసి..  అదేమిటి బాపు. అప్పుడే వచ్చేశావన్నారు

ఏం చెప్పను రామయ్యా.. (స్వామి వారి పాదాల వంక ఆశ్చర్యంగా చూస్తూ)

ఇంకా రామయ్య ఏంటి ? ఆ అవతారం చాలించాను కదయ్యా

అంతా విష్ణు మాయ. నాకు నువ్వెప్పుడూ రామయ్యవేనయ్యా

అది సరే. ఏంటి అప్పుడే ?

అప్పుడే ఏంటి రామయ్యా ? వెంకట్రావు వచ్చి మూడున్నరేళ్ళయింది. రోజు కలలోకి వచ్చి ఏమిటి ఎప్పటికీ రావు. నాకు ఏమీ తోచట్లేదు అంటాడు. అక్కడ నాకు అంతే. చక్కబెట్టాల్సిన పనులు ఉండి ఎలాగో కష్టపడి ఉన్నా ఇన్నాళ్ళు. (ఇంకా పాదాల వంక ఆదిశేషు పడగల వంక చూస్తూ)

మరి నా పరిస్థితి ఏంటి బాపు?

నీకేమయ్యా. ఆ తల్లి తోడు ఉండగా. లక్ష్మ నీడ ఉండగా.  హనుమ వంటి బంటు ఉండగా.

నా బొమ్మలు ఎవరు గీస్తారు.  కథలు ఎవరు తీస్తారు. ఈ మనుషులని  దారిలో ఎవరు పెడతారు.

నీ దయ ఉంటే ఎవరైనా చేయగలరు. అది సరే మా వెంకట్రావు ఏడి. ఎక్కడా కనపడడే.  పాపం చిన్నప్పుడు ఎప్పుడో నా దగ్గర అప్పు చేసాడని శిక్ష వేసారా ఏంటి ?


అదేమీ లేదు బాపు. వాణి మీ వాణ్ణి అసలు ఇటు రానిస్తేగా. మా వెంకట్రావు మా వెంకట్రావు అని అక్కడే అట్టే పెట్టేసుకుంది. గోరు ముద్దలు తినిపిస్తూ చిన్న పిల్లాడిలా చూసుకుంటోంది. పొద్దస్తమానూ పోతనతో సాహిత్య గోష్టి, త్యాగయ్యతో సంగీత చర్చలు, మధ్యాహ్నం వేటూరితో పాటల కబుర్లు.  సాయంత్రం అయితే దేవతల మీద సటైర్లు వేస్తూ అందరికీ కాలక్షేపం చేస్తున్నాడుట.

మా వెంకట్రావు అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా ఒకటే. నన్ను అక్కడికి పంపించే మార్గం చూడు  స్వామీ. ఆనక వచ్చి నీతో మాట్లాడతా.


సరే. పంపుతా గానీ. వచ్చినప్పటి నుంచీ ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి ఆదిశేషుడి  వంక. 

అదే అడుగుదామనుకుంటున్నాస్వామీ. అన్ని పురాణాల్లో మీరు ఆదిశేషు పడగల కింద తలాంచి శయనిస్తారు అని చదివాను. అక్కడ మీ పాదాలు ఉన్నాయేంటి చెప్మా. 

ఇంకా గుర్తు రాలేదా. ఇది నీ చలవేనయ్యా.  నీ కొంటె ఆలోచనల  పుణ్యమా అని సిరి కోరినది ఈ విధంగా నెరవేరినది.  

చిరు మందహాసంతో బాపు వైకుంఠం లో సెలవు తీసుకున్నాడు. 


సత్య లోకం 

వెంకట్రావు అమ్మ పక్కన కూర్చుని అప్పుడే ఏదో చెప్తున్నాడు. అందరూ గొల్లుమన్నారు.
వెంకట్రావు ని చూడగానే బాపుకి కళ్ళ నీళ్ళు తిరిగాయి. మాట మూగబోయింది.  వెంకట్రావు వేరే వైపు తిరిగి ఉన్నా బాపు వచ్చినట్టు తెలిసిపోయింది . బాపు ని చూసి చమ్మగిల్లిన కళ్ళతో వచ్చి కౌగిలించు కున్నాడు వెంకట్రావు.

ఏం? ఇన్నాళ్ళు?

నువ్వేమో రామ కథ మొదలెట్టి మధ్యలో వచ్చేశావు. పూర్తి చెయ్యద్దూ. నువ్వు వచ్చేసాకా ఒకటే ఏడుపులు తెలుగు లోకమంతా. బుడుగుని బుజ్జగించి, సీగాన పసూనాంబ ని ఊరుకోబెట్టి, అప్పులప్పారావుకి అప్పులిప్పిచ్చి 
అందరికీ సర్ది చెప్పి, మిగతా పనులన్నీ చక్కబెట్టి వచ్చేసరికి ఇదిగో.. ఈ వేళైంది. రోజూ రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాను తెలుసా.

ఇంతలో వెంకట్రావు ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు

ఏమిటి ?

మేము ఇదే మాట్లాడు కుంటున్నాం.

ఏమని ?

అదే ఈ సంతాప సభలు. చర్చలు. ఎలిజీలు. టి వి ల లో నిన్న పోగిడేవాళ్ళు.వగైరా   రా.. కూర్చో. అని వేటూరి పక్కన ఒక కుర్చీ చూపించాడు.

వాగ్దేవి కి పాదాభివందనం చేసి, పోతనకి, త్యాగయ్య , వేటూరి తడితురలకి  నమస్కారం చేసి కూర్చున్నాడు బాపు.

"ఏం బాపు. ఎప్పుడూ మీ రామయ్య నేనా. నా  మీద కథలు తియ్యలేదు. బొమ్మలు కూడా పెద్దగా గీసినట్టు లేవ" నడిగింది శారదాంబ

అదేమిటమ్మా. అమ్మను తలుచుకోకుండా ఉంటామా. అయినా నేను ఏం గీసినా వెంకట్రావు ఏం రాసినా మొదటి దండం నీకేగా.

అవునులే. మా పోతన కూడా ఇదే అన్నాడు. సరే. మీ వెంకట్రావు నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఏం కబుర్లు చెప్పినా పక్కన వెతుక్కుంటూ ఉంటాడు.  పేరుకి నవ్వుతున్నా నువ్వు లేవని చిన్నబోతాడు.


బాపు వెంకట్రావులు కళ్ళు తుడుచుకున్నారు.

ఇంతలో పోతన  "భావగావతాన్ని దృశ్య రూపకంగా మలిచావని, ఇంతింతై వటుడింతై అద్భుతంగా మలచి పామరులకి కూడా నారాయణుడిని ప్రత్యక్షం చేసావని విన్నాన" న్నాడు.

అంతా మీ దయ.  మీరు రాసినది వెంకట్రావు చెప్పినది నా శక్తి మేర చూపించా. అంతే . 


లవకుశుల కథని మళ్ళీ తెరకెక్కించి ధన్యుడి వయ్యావు బాపు. సీతమ్మ వారికెన్ని కష్టాలయ్యా అని గద్గదమైంది వేటూరి గొంతు. హనుమను సహాయానికి రప్పించి కొంతైనా ఊరట కలిగించి, అపర వాల్మీకివయ్యావు రమణ. 

"వాల్మీకి ముందు నేనెంత. సీతమ్మ కష్టాలు చూడలేక నా వంతు చేశా. ఆపై రామభద్రుడి దయ. "

మౌనం అలుముకుంది. బాపు తేలిక పరచడానికి "ఔను వెంకట్రావు. ఇందాక ఏదో చెప్తున్నావ." న్నాడు.  

వెంకట్రావు కళ్ళు తుడుచుకుని ఏం లేదు బాపు. సంతాప సభలు, నివాళ్ల  గురించి. నువ్వున్నావని  కూడా ఎప్పుడూ తలుచుకోనివాళ్ళు, కలుసుకోనివాళ్ళు నీకో..  నివాళ్ళు  అర్పించేస్తూ ఉంటే అవి చూసి విని నవ్వుకుంటున్నాం ఇందాకా .

బాపు తేలికగా నవ్వాడు.

జనవరి 30న అందరికీ గాంధీ గారు గుర్తొచ్చినట్టు. ఎక్కడెక్కడ టెల్గూస్ కి నువ్వు గుర్తొచ్చేసావు. నన్ను అప్పట్లో ఎలిజీల తో వదిలిపెట్టారు. నువ్వు కార్టూన్లు, బొమ్మలు వేశావ్ కదా. నిన్ను ఆ రోజు టివి లలో, పేపర్లలో, జాతీయ వార్తల్లో, ఇంటర్నెట్ లో ఆకాశానికి ఎత్తేసి మర్నాటికి  మరిచిపోయారు. భరించలేని దు:ఖంతో నిద్ర పట్టలేదు, ఆకలి పుట్టలేదు అని చెప్పి, మరు నిమిషం మరేదో చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అది తప్పు కాదు లే. కానీ ఈ ఎలిజీలు మరీనూ.

బాపు ఎదో చెప్ప బోయి ఆగిపోయాడు.

ఎక్కువగా ఈ ఎలిజీలు ఇంచు మించు ఒకే లా ఉంటున్నాయి. పేరు మనది పెడతారు. ఏదో బానే మొదలెడతారు. మూడు లైన్లు అవ్వగానే విషయమంతా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. రాసింది మన గురించో వాళ్ళ గురించో అర్థం కాదు. విశ్వనాథ వారు వాళ్ళ గురువుగారిని పొగిడినట్టు ఉంటుంది.
కొందరైతే వాళ్ళెంత గొప్ప వాళ్ళో వాళ్ళ అతి విలువైన సమయాన్ని మనకి వెచ్చించి మనల్ని ఎంత ధన్యులని చేసారో సంక్షిప్తంగా సవివరిస్తారు.

(అందరూ ఫక్కున నవ్వేశారు)

నాకు భయమేస్తోంది అన్నాడు బాపు

ఏం ?

ఈ ఊపు లో నాకు పద్మ విభూషణో భారత రత్నో ఇచ్చేస్తారేమోనని.

నాకూ అదే భయం.

ఎందుకు.

నీతో పాటు నాకు పద్మశ్రీనో పద్మ విభుషణో  ఇస్తారేమో నని.

అందరూ గొల్లుమన్నారు.

( ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదు. బాపు రమణలు అక్కడ ఏమనుకుంటున్నారోనని ఊహించి రాసినది. ఎక్కువ మటుకు నేను రాద్దాం అని మొదలెట్టి ఆపేసిన ఎలిజీని ఉద్దేశించినది. బాపు - రమణ గారు తెలుగు వారికి నేర్పిన వాటిలో మొదటిది మన మీద మనం జోకులేసుకోవడం. ఆ ఆనవాయితీని పాటించే  ప్రయత్నం ఇది. అంతే!!)

Saturday, August 30, 2014

షికాగో సౌత్ లూప్ లో ఆ రోజు ....         


              దవ అంతస్తు లో పరాగ్గా పడుకున్న నన్ను రవి కిరణాలు బ్లైండ్స్ ని పొడుచుకుంటూ వచ్చి గుచ్చి గుచ్చి లేపాయి  చిరాగ్గా. తప్పక లేచి ఫోన్ దేవుడికి దండం పెట్టుకుని ఈ మెయిల్స్ ఫేస్బుక్ ట్విట్టర్ చెక్ చేసి బ్లైండ్స్ పూర్తిగా తెరిచా. కిటికీ నుంచీ డియర్ బార్న్ స్టేషన్ లో ఎర్రని క్లాక్ టవర్ ఉదయ కాంతిలో మెరిసిపోతోంది. టైం పది. కిందకి చూస్తే ఎటు చూస్తే అటు మంచు అటు షవెళ్ళు ఇటు స్నో ప్లవర్లు  ఎండిన మానులు విరిగిన కొమ్మలు శీతల పీడితులారా మిడ్ వెస్ట్ బాధితులారా మీ బాధలు నేనెరుగుదును అని శ్రీశ్రీ రేంజ్ లో ఆవేశం పొంగింది . అప్పుడే కాఫీ తాగాలని గుర్తొచ్చింది. శనివారం కూడా తెల్లవారు జామునే లేపితే గొడవలై పోతాయని రాత్రి ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి స్టార్ బక్స్ కి పరిగెత్తాను.. ఈ మంచు లో ఆ సంబడం కూడానా..  ముందు కళ్ళు తప్ప అన్ని అవయవాలను అరడుగు మందం కోట్లలో ఉన్నిలో గిన్నెలా గిఫ్ట్ ప్యాక్ చేసి,  తెలుపు-నలుపు సినిమాలలో బంది పోటు దొంగలా కాఫీ ప్రియుల పుణ్య క్షేత్రం స్టార్ బక్స్ కి బయల్దేరాను.


ఉండడానికి రెండు బ్లాక్లు దూరం కానీ  ఆచి తూచి మంచు చూసుకుంటూ నడవడానికి పావుగంట పట్టింది. వెళ్లేసరికి కోలాహలం గా ఉంది. జానాలు గుమిగూడారు. కొంప దీసి ఇది హ్యాపీ అవర్ కాదు కదా అని వాకబు చేశాను. ఈ అమెరికన్లు 
మనకంటే పరమ బద్దకిస్ట్లు అని తిట్టుకుంటూ తిరుపతి దర్శనం కోసం వేచి వున్న భక్తుడిలా వెయిట్ చేశాను. అరగంట లో నా వంతు రానే వచ్చింది. డబల్ టాల్ ఎక్స్ట్రా హాట్ హోల్ మిల్క్  కారమెల్  మాకియాటో అని ఎక్స్ట్రాలు పోతూండగా జేబు తడిమి చూసుకున్నాను. ఫోన్ లేదని తెలుసుకున్నాను. ఎవడినన్నా అడుగుదామంటే ముష్టివాడి కింద జమ కడతారు మన మొహం చూసి అని చచ్చినట్టు లైన్ తప్పించుకుని ఇంటికొచ్చాను. ఫోన్ తీసుకుని చక చకా మళ్ళీ వెళ్లాను. ఈ సారి కొంచం లైన్ తగ్గింది. త్వరగానే ఆర్డర్ ఇవ్వడానికి రెడీ అయ్యాను. ఇచ్చి ఫోన్ తీసి చూస్తే  స్టార్ బక్స్ కార్డు లో నిల్ బాలెన్స్. పర్స్ లేదని గ్రహించాను. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళే ఓపిక లేక, ఫోన్ చేసి శ్రీమతిని నిద్ర లేపి, బాలెన్స్ యాడ్ చెయ్యమంటే. అయిదు డాలర్లు పెట్టి ఇప్పుడు అక్కడ తాగాలా. మొన్న డికాషన్ ఫ్రిడ్జ్ లో ఫ్రెష్ గా ఉంది ఇంటికి రమ్మని ఆర్డర్ వేసింది. చేసి చచ్చేది లేక ఆ షాప్ వాడు నన్ను తిట్టుకోక ముందే బయట పడ్డాను. కాళ్ళీడ్చు కుంటూ ఇంటికి వచ్చి పడ్డాను. రెండు వారల కిందటి చక్కటి ఫ్రెష్ పాలు మైక్రో వేవ్ చేసి, మొన్నటి డికాషన్ లో పోసి, పొగలు కక్కుతున్న చల్లటి కాఫీ ఇచ్చింది. శ్రీమతి అంటే ప్రేమ ఉన్నవారు కాఫీ ఎలా ఉన్నా ఎలా కాదన గలరు అని అనుకుని అయినాపురం ఆయుర్వేదం డాక్టర్ గారి మందులా గుటుక్కున మింగేసా.

క్లాక్ టవరు లో టైం పన్నెండు.

ఇప్పుడు ఇక్కడే ఉంటే బ్రంచ్ కాదు లిన్నరే అని తేల్చుకుని, కూరగాయలు తేవాలని వంక పెట్టి డెవాన్ కి ప్రయాణమయ్యాను.  ఈ సారి మరిచిపోకుండా వాలెట్ , ఫోన్, కార్ తాళాలు గుర్తు పెట్టుకున్నాను. వాటితో పాటు ఒక షవెల్, స్నో మెల్టింగ్ లిక్విడ్ పట్టుకుని పని కెళ్తున్న సానిటరీ వర్కర్ లా మా ఇంటికి అర మైలు అవతలున్న పార్కింగ్ లాట్ కి పయనమయ్యాను. రెండు రెస్ట్ స్టాప్లు మూడు పిట్ స్టాప్ల తరువాత పార్కింగ్ లాట్ కి చేరాను. తీరా  చూస్తే నా కార్ పార్క్ చేసిన స్పాట్ లో కనపడలేదు. వేరే ఎక్కడన్నా పెట్టనేమో అని కలయతిరిగాను. కీ నొక్కితే ఎక్కడో సన్నగా చిన్నగా ఒక మూలుగు లాటి కూత వినిపించింది. షెర్లాక్ హోమ్స్ లా ఫీల్ అయిపోయి నా శబ్ద భేరి విద్యనంతా  ఉపయోగించి స్పాట్ పట్టుకుని పురావస్తుశాఖలా షవెల్తో తవ్వడం ఆరంభించా. తవ్వగా తవ్వగా టన్ను మంచు పక్కకి పోగా, నేను కేజీ బరువు తగ్గగా, నా కామ్రీ కంట పడింది. నా కళ్ళు ఆనంద బాష్పాలతో, చొక్కా చెమటతో తడిసిపోయింది ఆరు డిగ్రీల చలిలో కూడా. ఐస్ మెల్టింగ్  లిక్విడ్ కామ్రీ మీద పోశాను. మంచు కరిగి, మట్టి విరిగి తలంటిన తమన్నాలా మెరిసిపోయింది.

షికాగో ని తిట్టుకుంటూ, చెమట కంపు కొట్టుకుంటూ, ఎప్పుడో కారు కొన్న కొత్తలో పెట్టిన పాటలు వింటూ లేక్ షోర్ ఎక్కాను. గడ్డ కట్టిన మిషిగన్ సరస్సు పక్కన మెలికెలు తిరుగుతూ షెరిడన్ దగ్గర ముడుచుకుంది లేక షోర్ రోడ్. అక్కడినించి ఒకటే ట్రాఫిక్. నిమిషానికి నాలుగడుగుల చప్పున కార్ దూసుకెళ్తోంది ఈ మధ్య బ్లాక్బస్టర్ తెలుగు సినిమాలలా. ముప్పావుగంట లో డెవాన్ ఎవెన్యూ మీదకి చేరుకున్నా. ఇక్కడికి రాగానే హైదరాబాద్ వచ్చినట్టు నాస్టాల్జిక్ గా ఫీల్ అవుతారో ఏమో మునిసిపాలిటీ బళ్ళలా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు కార్లు. హార్న్ కొట్టి కొట్టి విసుగొచ్చి కూర్చున్నాను. చెత్త చెదారం దాటుకుంటూ నత్త నడకన ఎలాగో సాయంత్రం లోపు  డెవాన్ సెంటర్ కి జేరాను. ఫ్రెష్ ఫార్మ్స్ వెనకాల పార్కింగ్ ఉంది కదా అని తల్మా అవెన్యూ మీదకి టర్న్ తీసుకున్నాను. అక్కడ నా ముందు మూడు కార్లు గోతి కాడ నక్కలా పార్కింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక పావు గంట ఆగితే నానో కార్ సరిపోయేంత పార్కింగ్ స్పాట్ దొరికింది. అందులో నా కామ్రీ ని ఎలాగో అతి కష్టం మీద ఇరికించా. నా డోర్ తీసేలోపు సివిక్ సెన్స్ లేకుండా ఎవడో సివిక్ లో వచ్చి సందు లేకుండా పార్క్ చేసేశాడు. వాడి వెనక రెండు కార్లు. ఇంకా చేసేది లేక మూన్ రూఫ్ తెరిచి బంకర్ నించి తప్పించుకున్న భారతీయుడిలా బయటకి వచ్చా. 


(సశేషం)


ఇది లాజికల్ బ్రేక్ కాదని తెలుసు కానీ ఇది లాజికల్ కథ కాదు కామికల్ సొద. 

అదీ కాక నేనొక  బద్దకిస్టు . 

అందుకే ఎప్పుడో మొదలెట్టినది  ఇప్పటి దాక పోస్ట్ చెయ్యలేదు బద్దకిస్తూ.    

Wednesday, June 4, 2014

అలవాటుగా కాసేపుహలో నాన్న! ఏం చేస్తున్నారు ?

ఏం లేదు. ఉదయం నించి కుదరలేదు. పేపర్ చదువుతున్నా. అవును మీకు టైం ఎంతైంది ?

అదేంటి నాన్నా రోజూ ఫోన్ చేసిన టైం అడుగుతారు. ఎన్ని గంటలు తగ్గించుకోవాలో తెలుసు కదా

ఏమో రా. మీ టైం పెద్ద గొడవ నాకు. ఒక సారి డే లైట్ సేవింగ్స్ అంటావ్. ఒకసారి వేరే టైం జోన్ లో ఉన్నానంటావ్. 4 X 2 = 8 రకాలు ఉండచ్చు కదా. అవి గుర్తు పెట్టుకుని లేక్కేసుకునే ఓపిక లేదు. అయినా రోజూ చేస్తే మాటలు ఏం ఉంటాయిరా ?

ఏవో ఒకటి ఉంటాయ్.

నువ్వు బావున్నావా నేను బావున్నానా ఇవేగా ?

అవే చెప్పచ్చ్చు కదా

చెప్పడానికి ఏముంటుంది. ఏదో గడిచిపోతోంది. బావోలేకపోయినా నువ్వేం చెయ్యగలవ్ అక్కడి నించి? బాధ పాడడం తప్ప ? అయినా ఇప్పుడు పెద్దగా  ఏం లేవు? ఈ వయసు వచ్చాక చిన్న చిన్నవి ఏవో ఒకటి ఉంటాయ్

షుగర్ బి పి ఎలా ఉంది ?

బావుంది?

అంటే ? బాగా ఉందా? కంట్రోల్ లో పెట్టుకోవచ్చు కద నాన్నా

బి పి షుగర్ కొలెస్ట్రాల్ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఈ పంచ భూతాలూ లేకుండా ఇక్కడ నా వయసు వాళ్ళు బతకలేరురా

మరి ఇక్కడ డబ్బై వచ్చినా దుక్కల్లా ఉంటారు ? ఏం లేకుండా ?

అక్కడ ఇక్కడికి సామ్యం లేదు రా? వాళ్ళకి ఇక్కడి టెన్షన్లు లేవు. ఇంత కష్టమూ కాదు

ఏ ఇక్కడి వాళ్ళకు బాధలు ఉండవా ? ఎక్కడి బాధలు అక్కడ ఉంటాయ్ ?

అవును. కాని అక్కడ ఎవడి గొడవ వాడిది. అందుకే ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ అందరి గొడవా అందరికీ కావాలి. అలా అని  సహాయం చెయ్యడానికా అంటే కాదు. అందుకే ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు.
ఇక బాధ్యతలు అన్నీ  గట్టెక్కి ఒడ్డుకు చేరేసరికి పిల్లలు ఇంకో ఒడ్డుకి. మేము అటు రాలేము. మిమ్మల్ని ఇటు రమ్మనలేము.

ఇంకెంత నాన్నా ఒక రెండేళ్ళ లో వచ్చేస్తా.

ఈ మాట నాలుగేళ్ళ నించి చెప్తున్నావు. అయినా నీ కెరీర్ చూసుకోరా. అమ్మ వచ్చేయ్ మంటోంది  నాన్న బాధ పడుతున్నాడు అని కాదు నీకు మీ భవిష్యత్తుకి ఏది మంచిది అనిపిస్తే అది చెయ్ .

అదే నాన్న. ఇక్కడ ఈజీ లైఫ్ స్టైల్ అలవాటై అక్కడికి రావాలంటే కొంచం భయం వేస్తోంది.

హ్మ్స . సర్లే కానీ  ఏం చేస్తున్నావ్

డిషెస్

ఎప్పుడు చేసినా అంట్లు తోముతున్నా అంటావేంట్రా. ఇక్కడ గ్లాసు కూడా పక్కన పెట్టేవాడివి కాదు.

అంట్లు కాదు నాన్న.

తిలకాష్టమహీశ బంధనం లా .. ఇంగ్లీష్ లో చెబితే అర్థం మారిపోతుందా ? సర్లే అమ్మాయ్ ఏం చేస్తోంది?

ఇల్లు క్లీనింగ్ నాన్నా. రేపు ఫ్రెండ్స్ వస్తున్నారు లంచ్ కి. అందుకని వాక్యూం , బాత్రూమ్స్ వగైరా

సరిపోయింది. ఆదివారం డెవాన్ కి వెళ్ళాలా ?

అవును నాన్న. అలాగే కాస్ట్ కో కి వెళ్ళాలి. కార్ క్లీన్ చేయించాలి. పిల్లకి మధ్యాహ్నం సంగీతం క్లాసు ఉంది. పిల్లాడికి స్విమ్మింగ్ క్లాసు. తను అటు నేను ఇటు.

అన్నట్టు ఈ వారం లో నవమిట. కనీసం పానకమైనా చేసుకోండి.

అవునా ? నేను బే ఏరియా వెళ్ళాలి నాన్నా ఈ వారం. కుదిరితే ఆదివారం గుడికి వెళ్తాం లే

ఏంటో పండగకి చుట్టాల మాట దేవుడెరుగు, పెళ్ళాం పిల్లల్ని  కలవడం కూడా కష్టం ఐపోతోంది నీకు . సర్లే అమ్మ మాట్లాడుతుంది ట .

సరే .....     ...    ఎలా ఉన్నావ్ అమ్మా ? షుగర్ బి పి కంట్రోల్ లో ఉందా?

నీకు లక్ష సార్లు చెప్పాను. రోగిష్టి వాళ్ళని పరామర్శించి నట్టు  ఎప్పుడు చూడు షుగర్ బి పి గురించేనా ? అవి ఇక్కడ కామన్. అమ్మాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ?

బానే ఉన్నారమ్మా. తను కొంచం లావైంది. యోగాకి వెళ్తుంది ట. వచ్చే వారం నించి.

ఎలా ఉంది అంటే .. ఆరోగ్యం ఎలా ఉంది అని బరువు వెడల్పు కాదు . అయినా మొన్న పేస్ టైం లో చూసా. మొహం పీక్కుకు పోయి ఉంది. అది లావు ఏంటి. ఏ ఏమన్నా మిస్ USA పోటీలకు వెళ్తుందా ఏంటి ? శుభ్రంగా తినమను. మా వయసు వచ్చే సరికి ఎలాగూ తినలేరు? ఇప్పుడైనా సరిగ్గా తినండి

నువ్వు అలాగే అంటావ్ అమ్మ. ఇక్కడ గాలి పీల్చిన లావు ఊరిపోతాం. అక్కడ తిన్నట్టు తింటే మిస్ USA కాదు. బిగ్గెస్ట్ లూసర్ కెళ్ళాలి.  నేను కూడా రైస్ మానేద్దాం అనుకుంటున్నా?

ఇదేం ఖర్మ రా? మీకు అన్నీ అతి! తిన్నా మానినా.ఆ మిల్క్ షేక్ లు మానేసి మజ్జిగ తాగు, కూల్ డ్రింకులు  మానేసి మంచి నీళ్ళు తాగు, లిఫ్ట్ మానేసి మెట్లు దిగు, టి వి మానేసి వాకింగ్ కెళ్ళు,  అర్థ రాత్రి వరకు లాప్ టాప్ పట్టుకోకుండా పిల్లలతో ఆడు,  పదింటికి పడుకో, పెందరాడే లే. ఏ డైటింగ్ లు అక్కర్లేదు. మా అమ్మమ్మ మొన్నే సెంచరీ కొట్టింది. ఇప్పటికీ ఆవకాయ లేకుండా అన్నం ముట్టదు. అన్నం తినకుండా పూట ఉండదు.

నీ పిచ్చి గానీ. అవన్నీ కుదరవు అమ్మా. మిమ్మల్ని  వైట్ రైస్ మాని బ్రౌన్ తినమంటే తిన్నారా? యోగకి వెళ్ళమంటే వెళ్ళారా? ఉపవాసాలు, తల స్నానాలు మానమంటే మానారా? ఎందుకూ అంటే ? అలాగే ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయిపొయింది మాకు. ఇప్పుడు కష్టం.

హ్మ్ . ఏం లైఫ్ స్టైలో. నాకు అందులో లైఫ్ ఏం కనిపించలేదు.

సర్లే. ఇంకేంటి ?

ఊ .. అన్నట్టు మన అపార్ట్ మెంట్ కే బ్లాక్ లో నా ఫ్రెండ్ వాళ్ళు వచ్చే నెలలో సెంట్ లూయిస్ వస్తున్నారు. మీకు దగ్గరట కదా? నాన్న చెప్పారు . ఏమన్నా కావాలా ?

ఏం వద్దమ్మా. మొన్నే కదా పంపించారు. అయినా వాళ్ళు మొహమాట పడుతూ పట్టుకురావడం. వాళ్ళ బిజీ లో ఎప్పటికో పంపించడం. అవి తిరిగి తిరిగి వచ్చేసరికి పాడైపోతాయ్ కూడా. ఏం వద్దు.

అమ్మాయ్ ని కూడా కనుక్కో. ఏవో టాప్ లు చింతపండు వడియాలు పంచ తులసి అవీ కావాలంది మొన్న.

తను  అలాగే అంటుంది లే. ఏం వద్దు.

సరే అమ్మ నేను ఉంటా. పిల్లల్ని స్లీప్ ఓవర్ కి దింపి రావాలి. ఇంకా కొంచం క్లీనింగ్ కూడా ఉంది.
రేపు మళ్ళీ ఫ్రెండ్స్ వస్తున్నారు. మళ్ళీ పొద్దున్నే వీళ్ళను తీసుకొచ్చి తనకి వంట లో హెల్ప్ చెయ్యాలి
మీరు  ఆరోగ్యం జాగ్రత్తగా చోసుకోండి.

సరే. పడుక్కో మీకు లేట్ అయినట్టుంది. నేను అమ్మాయితో  ఫేస్ టైం  చేస్తాలే****************
ఫోన్ పెట్టేసిన అర సెకనుకు అయోమయం గా  .....


"ఏంటో ఆ జీవితం నాకర్థం కాదు."

అవునే. అమెరికా లైఫ్ స్టైల్ ఈజీ అంటాడు ఏంటో నాకు అసల అర్థం కాదు .


***************************

ఫోన్ పెట్టేసిన అర సెకనుకు ఆశ్చర్యంగా ... ..


ఏంటీ ఈ రోజు గంట పూర్తవకుండా పెట్టేశారు? ఫోన్ చార్జ్ అయిపోయిందా ?

లేదు ఈ రోజు క్లాస్ అయిపోయింది . వీళ్ళకి ఇక్కడి బాధలే కనపడతాయ్. నాకు అక్కడికెళ్తే వచ్చే బాధలూ కనపడతాయ్.  ఏమిటో ?Sunday, January 26, 2014

అయితే జె పి తెలంగాణ గురించి ఏం సెప్పాడు ?


ఏంటి బా అలగున్నావ్ ? ఎవడు సినిమా కానీ సూసేసినా వేటి

అదేం లేదు బా. వార్తలు సూస్తే సీకాకుగుంది

ఓసోస్ ఇప్పుడు ఏటై పోనాది

జె పీ కూడా ఇలగ మాట మార్సేసినాడేటి బా . ఎలచ్చన్లు వచ్చే సరికి  ఎవరైనా  ఇంతేనా బా.

ఎలచ్చన్లు పక్కకి  పెట్టేస్. ఇప్పుడు ఏం మాట మార్సేసాడు జె పి

అదేంటి బా అలగంటావ్. తెలంగాణా ఇచ్చేయ్ మన్నాడు  కదేస్

అదా.. ఇప్పుడు కొత్తగా సెప్పే దేటి  ఎప్పుడూ అదే చెప్తున్నాడు కదరా 

ఎప్పుడు చెప్పాడు బా

ఆరేళ్ళ గా చెబుతున్నాడు గా యిభజనతో సమస్యలు అన్నీ తీరిపోవు.  ఇభజన సేసినా వచ్చేది లేదు సెయకపొయినా పొయ్యేది లేదు అని

అవును. మరి ఇప్పుడు సెయ్యమని ఎందుకు సెప్పాడు

ఇంకెన్నాళ్ళు రా ఇలా. ఇప్పటికే ఎంత నట్టం జరిగింది. మన లాటోళ్ళకి పనులు ఉండట్లేదు సరిగ్గా. ధరలు పెరిగిపోతున్నాయి. ఇల్లు గడవట్లేదు. బయట గొడవలు ఎక్కువై పోతున్నాయి. అంతెందుకు రా మా ఇంటి పక్కన మల్లేస్ స్నేహంగా ఉండేవాడు. ఈ గొడవలు మొదలయ్యాకా మాటల్లేవు.ఇడిపోవాలని ఇంత ఇదిగా అన్ని చోట్లా వచ్చాకా ఎంత తొరగా ఇడిపోతే అంత మంచిది. బలవంతంగా ఉంచితే ఎవరూ సుఖంగా ఉండలేరు, పోరు పెద్దదవుతాది. పేమ సిన్నదవుతాది. అందుకని తొరగా ఇది తేల్చ మన్నాడు జె పి. ఇంత రాద్దాంతం జరుగుతుంటే ఏమీ జరగనట్టు ఉండద్దు అన్నాడు.  

అయినా ...  

హ్మ్ .. పోనీ నీ రూట లోనే ఆలోసిద్దామ్.   ఈయన సెప్ప లేదు అనుకుందాం. సొనియమ్మ యిభజన సేయ కుండా వదిలేత్తుందా.

మానదనుకో

పోనీ సొనియమ్మ , కాంగ్రెసు ఇచ్చే లోపే ఈ యెలచ్చన్లో ఓడి పోయిందనుకో వచ్చే బి జె పి నో,  మోడీ నో తెలంగాణా ఇవ్వకుండా ఉంటాడా

అవుననుకో

పోనీ ఇప్పుడు కొంపలు ముంచేసాడని గగ్గోలు ఎట్టేత్తున్ననాయకులు ఆపడానికి ఏం సేశారు. పోనీ వీళ్ళకి ఆపే  సత్తా ఉందా. హమ్మయ్య ఇంకో రోజు దాటెయ్యచ్చు అని నాన్చడం తప్ప ఒక్క కొలిక్కి తెచ్చారా అయిదేళ్ళు గా. 

అవును బా

ఇప్పుడు ఈయన సెప్పిందేటి? ఇచ్చేది ఎలాగు ఇత్తున్నారు గా. ఇచ్చేదేదో సక్కగా పద్దతిగా ఇమ్మని కదా. రాయలసీమ వాళ్ళకి పన్ను ఉండకపోతే అదేదో స్పెసల్ టేటస్ యిత్తే  బోలెడు పెట్టుబడి పెట్టి యాపారాలు పెడతారు. కరువు తీరిపోద్ది.  కోస్తాకి పోలవరం ప్రాజెక్టు, రామయపట్నం పోర్టు, సదుకోడానికి మంచి కాలేజీలు. ఇక తెలంగాణా కి హైదరాబాదు ఎలాగో ఉంది కదా.   

బావుంది బా. కానీ ఇవన్నీ ఎప్పటికి వచ్చేను ? వాళ్ళు ఇచ్చేనా చచ్చేనా 

అది కాదు రా.  ఇప్పుడు తెలంగాణా కి ఒప్పుకుంటే ఇవి అడగడానికి ఈలు ఉంటాది. ఇప్పుడు  తెలంగాణా 
వల్ల కాదు అని మొండికేసుకుని కూకుంటే వాళ్ళు మొండికేసి ఇభజన సేసేత్తే . ఏంటి పరిత్తితి ?
ఇప్పుడు కాకపోతే ఇంకో మూడేళ్ళ లో లేక అయిదేళ్ళలో లేక పదేళ్ళలో ఇభజన అయిందనుకో. అప్పుడు ఇంకా నట్టమే కదా .. అదేదో ఇప్పుడే అయితే ఈ లోపు వేరేవి ఒకటో రెండో పతనాలు బాగు పడతాయి  కదా. 
అదీ కాక  ఈ గొడవలు తగ్గడం వల్ల ఇంకొన్ని ఊర్లు , మూడు ప్రాంతాలూ  బాగు పడతాయేమో? 

అలగయితే బా , మీ సావు మీరు సావండి . నేనిచ్చి తీరుతా అన్న సొనియమ్మని, మీరు కాకపోతే నేనిస్తా అన్న మోడీ ని, ఒక గడియ "అయితే  ఓకే"  , ఒక గడియ "నేనొప్పుకోను" అనే బాబుని,  యిభజిస్తే సి ఎమ్ అయిపోదామనే ఓదార్పన్నని వదిలేసి జె పి  మీద పడ్డారేటి  బా అందరూ 
అదేరా  మరి . మెత్తగా ఉంటే మొత్త  బుద్ది అనిhttps://www.youtube.com/watch?v=vQKFGtNmxMw
Monday, August 19, 2013

కొక్కురు వానచినుకులు


నిశి మిత్రమా నీతో మళ్లీ మాట్లాడాలని వచ్చా
ఒక్క అందమైన స్వప్నం మెల్లగా నా మనసు మీద తన పాద ముద్రలు వేసి చీకట్లోకి జారుకుంది
పాద ముద్రలింకా మౌన రాగంలో పదిలంగా ఉన్నాయి నా మనసులో

మధన పడు ఆ స్వప్నాల్లో
నేను ఒంటరిగా ఇరుకు సందులలో
ఉరకలేస్తున్నాను వీధి దీపాల వెలుగులో
చిక్కగా కురుస్తున్న చీకటిలో 
మంచు పడిన వాకిట్లో 
చలికి చెవులను కప్పుకుంటుంటే
రాతిరిని చీల్చే తొలి వేకువ రేఖలు
కళ్ళను తట్టి ఈ మౌనమేంటి అని  ప్రశ్నించాయి

వెలుతురులో వేల  మందిని చూశాను
మాట్లాడుతున్నారు కాని ఏం చెప్పట్లేదు
వింటున్నారు కానీ అర్థం చేసుకోవట్లేదు
పాటలు రాస్తున్నారు కానీ పాడి వినిపించట్లేదు
ఎందుకంటే ఎవరికీ మౌనాన్ని భంగపరిచే ధైర్యం లేదు

మూర్ఖులారా నా మాట వినండి 
మౌనం వ్యాధిలా సోకుతోంది 
చాచిన నా చేతులు అందుకోండి
నాతో చేయి కలపండి అన్నాను కానీ
నా మాటలు కొక్కురు వాన చినుకుల్లా కురిసి కిక్కిరిసిన రాతిరి లో కలిసాయి  

కొందరు కనపడని దేవుడిని వెతుకుతున్నారు
కొందరు కనపడిన రాయిని దేవుడని మొక్కుతున్నారు
కొందరు మనిషిగా ఎదిగిన వాడినల్లా దేవుడిని చేసేస్తున్నారు
పచ్చి నిజాన్ని భరించలేక పిచ్చి 'ఇజా'లని పట్టుకు వేలాడుతున్నారు
తీర్థాన్ని వదిలేసి శంఖం కోసం వెంపర్లాడుతున్నారు
అందుకే నా మాటలు కొక్కురు మంచు తునకల్లా కురిసి కిక్కిరిసిన రాతిరి లో కలిసాయి

P.S.ఒక ప్రసిద్ధ ఆంగ్ల గీతానికి (బహుశా) ఒక పేలవమైన స్వేచ్ఛానువాదం .

P.S 2: కొక్కురు (నిశ్శబ్దం) అనే దేశ్య పదానికి విశేషణ పదం ఏదన్నా ఉందా ? నే వాడినట్టు కొక్కురునే   విశేషణ పదం కింద వాడచ్చా 


P.S 3: నిశ్శబ్ద వాన చినుకులు రాక్షస సమాసం కదా ?