Tuesday, February 26, 2013

తెలుగు పాట వ్రాయడం ఎలా For Dummies


ఈ టపా లోని పాత్రలు , పాటలు , పేర్లు ఎవరినో ఉద్దేశించినవే అని మీకు అనిపిస్తే మీకు కనీస తెలుగు సినిమా నాలెడ్జ్ ఉన్నట్టే 


ఒక్క ఛాన్స్ వస్తే చాలు తనేంటో నిరూపించేసుకుని, సినిమా క్రెడిట్స్ లో పాటలు అన్న మాట కింద తన పేరుని చూసేసుకుని, సింగల్ కార్డ్ గా ఎదిగి , తెలుగు గేయ రచయితగా స్థిర పడిపోవాలని పగటి కలలు కంటున్నాడు మన వాడు (రాత్రి రాతలతో నిద్ర లేక పొద్దున్నే పడుకుంటున్నాడు మరి ) . ఒకడు  చేసేది ఏదైనా, అందులో వాడి భవిష్యత్తు ఉన్నా లేకపోయినా  వాడిని ప్రోత్సహించే స్నేహితుడు ఒకడు ఉంటాడు.  అలాటి వాడే మనవాడి స్నేహితుడు ..  మన వాడి బాధ చూడలేక ఎవరెవరివో కాళ్ళు , గడ్డం, చేతులు , మెడ   పట్టుకుని ప్రముఖ గేయ రచయిత ఇంద్ర హాస్ అపాయింట్ మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళాడు .

అప్పుడే  నోకియా వరస్ట్ సింగర్  కార్యక్రమం గ్రాండ్ సెమీ క్వార్టర్ ఫైనల్ షూటింగ్ ముగించుకుని వస్తున్నారు ఇంద్ర హాస్. అమెరికా టూర్ వెళ్ళినపుడు తెచ్చుకున్న ఆబర్కాంబీ టీషర్టు చూసి ఆయనే అని నిర్దారించుకున్నాడు మన వాడి ఫ్రెండ్ .

ఆయన్ని కలిసి మా వాడు గీత రచయిత గా ప్రయత్నాలు చేస్తున్నాడు  సార్ . అందరూ వీడి పాటలు బావున్నాయి అంటున్నారు కానీ ఎవరూ తీసుకోవట్లేదు ..  బోలెడు భవిష్యత్తు ఉంది అంటున్నారు కానీ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అని బోరుమన్నాడు  . మన వాడు అయిష్టంగా వచ్చాడు, అయినా ఇంద్రహాస్  ఏం చెప్తాడో అయిష్టం గానే వింటున్నాడు .

ఇంద్రహాస్ నవ్వి .. "తెలుగు పాట అన్నారు కదా అని నీకు వచ్చిన తెలుగంతా ఉపయోగించేస్తే ఎలాగయ్యా!
అసల నన్నడిగితే తెలుగు పాట రాయడానికి తెలుగే  అక్కర్లేదు , తెలివీ అక్కర్లేదు , ఊహ అక్కర్లేదు , వ్యాకరణం అక్కర్లేదు.. కాకపోతే కిటుకు తెలియాలి .. కాన్ఫిడెన్స్ ఉండాలి .. ఉత్తరం ముక్కో, ఇంటి పద్దో రాసినా అదొక మహా కావ్యం లాగ ప్రెసెంట్ చెయ్యగల కాన్ఫిడెన్స్ .. నువ్వు రాసేది ప్రతీది కావ్యం లా ముందు నువ్వు ఫీల్ అవ్వాల"న్నాడు.


మనవాడు అయోమయంగా కొంచం ఇబ్బందిగా చూశాడు ..








ఇంద్రహాస్ అవేమీ పట్టించుకోకుండా..
కిటుకు విషయానికొస్తే ముందుగా నేనెక్కువ వాడే, హంసధ్వని గారు అతిగా ఇష్టపడే , వినగానే ఎగిరి గంతేసే లిస్టు కాన్సెప్ట్ చెప్తా ..అంటూ ఫ్లో లో చెప్పుకుంటూ పోయాడు ..

"ఇచ్చిన సన్నివేశం ఒక సెంట్రల్ థీమ్ గా అనుకో దాని మీద లిస్టు అల్లుకుంటూ పో అంతే
ఉదాహరణకి నిన్ను ఏదో పిల్లల పాట ఏదో పుట్టిన రోజుకి పాటో  రాయమన్నారు అనుకో .. అప్పుడు ముఖ్యంగా ఇచ్చేది ఆశీర్వాదం , తీసేది  దిష్టి . ఇందులో ఏదో ఒకటి తీసుకుని .. అల్లెయ్యడమే "

ఒక్కొక్కళ్ళ ఆశీర్వాదం అలా ఉండాలి ఇలా ఉండాలి అప్పుడు ఉండాలి ఇప్పుడు ఉండాలి అని రాసుకుంటూ పొతే అయిదారు పేజీలు అవుతుంది .. చిన్న పాట  అనుకో ముఖ్యమైన వాళ్ళవి పెట్టు .. పెద్దది అనుకో ..వీటితో పాటు ప్రకృతివి, జంతువులవి , పక్షులవి కూడా కలుపు ..అంతే ... నేనెన్ని రాయలేదు ఇలా ..లిస్టు కాన్సెప్ట్ తో రాసినవన్నీ చెబితే ఒక దర్శకచంద్రుడి సినిమా పాటలకి (కనీసం పదయినా  ఉంటాయి కదా) సరిపోయేంత  లిస్టు అవుతుంది .

నేను చెన్నై మొగుడు సినిమా నించి నిన్న యమునోత్రి నేటి కేదార్నాథ్ సినిమా వరకూ ఈ టెక్నిక్కే వాడాను ..

మనవాడి  ముఖ కవళికలు ఇబ్బంది లోంచి కోపం లోకి పరిణతి చెందుతున్నాయి ..
ఇంద్రహాస్ మాత్రం అంతులేని తన పాటలా .. అదే పనిగా చెబుతున్నాడు ..

అదే దేశం మీద రాయమన్నారు అనుకో ..
ఒక రెండు మూడు నెలల పేపర్లు తిరగేసి ముఖ్యాంశాలు పట్టుకో .. వాటికి  నీకు తెలిసినవి కలిపి .. బావోలేని విషయాలైతే దేశం అంటే అది కాదు అని  రాసేయ్ ..మంచి విషయాలనుకో దేశమంటే అదే అని రాసేయ్ ..ఫినిష్ .
మన హంసధ్వని గారి ట్యూన్ వేయించి ఏ బాలూ  చేతో  పాడిస్తే అవార్డు సాంగ్ అయి కూర్చుంటుంది ..

నేను మొన్న వ్రాసిన  "సయ్యంది పాదం" సినిమా పాట వినలేదా .అది అలా రాసిందే ..

ఒక్కోసారి ఈ మాత్రం కూడా అవసరం ఉండదు. మాస్ పాట రాయమన్నారు అనుకో .. నీ ఇష్టం .. ఒక మంచి నాటు పదం పట్టుకో దానికి అంత్య ప్రాస పెట్టుకుంటూ పో .అంత్యప్రాస అంటే అదే రైమింగ్.. అది  ఉంటే చాలు ఆంధ్ర జ్యోతి ఆర్టికల్ ని కూడా అందమైన పాటగా ట్యూన్ కట్టేస్తారు మన హంసధ్వని గారు, అందులో ఈ మధ్య ఆఫ్రికా, అంటార్క్టికా, నార్వీజియన్ , ఐస్లాండిక్ ఆల్బమ్స్ కూడా వదిలిపెట్టకుండా వింటున్నారు. చేతిలో మన వాళ్ళు కాపీ అని కనిపెట్టలేని బోలెడు ట్యూన్స్ ..

గుడ్డి , బడ్డీ , బుడ్డీ , వడ్డీ ..; ఈక - మేక - తోక - పాక ..ఇలా అన్నమాట .. నావి ఇలా ఎన్ని సూపర్ డూపర్ హిట్లు అవ్వలేదు ..కావాలంటే అప్పట్లో నేను వృషబాద్రి సినిమాకి రాసిన పాట ఇంకో పది సార్లు విను .

మనవాడి ఫ్రెండ్ కి కూడా ముఖం శాంతం నించి బీబత్సానికి మారిపోయింది .

ఇంద్ర హాస్  మాత్రం  ఇంకా అద్భుతం (రసం )  లోనే ఉన్నాడు .

కవితకి కాదేది అనర్హం అని ఊరుకున్నాడు కానీ శ్రీ శ్రీ .. పాటకు కూడా అది వర్తిస్తుంది ..నేను ఈ విషయం లో ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను ..పాటలు కట్టాను పాడాను ... కేవలం తిట్లు బండ బూతులతో  ఒక పొడవాటి పాట రాశాను.. ఒకటో నెంబర్ ఓబులేసు సినిమాకనుకుంటా ..  అది ఒక ట్రెండ్ సెట్ చేసి .. హీరో హీరోయిన్లు అలాగే పిలుచుకోవడం ఫాషన్ అయ్యి .కూర్చుంది . ఇది టి వి లకి కూడా పాకి ఇప్పుడు తెలుగు మాటలకంటే తిట్లు ఎక్కువ వినపడ్తున్నాయి ఎక్కడవిన్నా . మరి అదంతా నా ప్రతిభే ..

ఇంద్రహాస్ ఇంకా ఏదో చెప్పేలోపే  పాటల గురించి పెద్దగా తెలియని  మనవాడి ఫ్రెండ్ కి కూడా అసహ్యమేసి ..
గబాలున లేచి ,  "కోడ్తే దిమ్మ దిరిగి బొమ్మ కనపడుతుంది" అన్నట్టు లుక్కిచ్చ్చి మనవాడితో  కలిసి బయటకి వచ్చేసాడు ..

తొలాట ఇంటర్వెల్ బ్లాక్ దగ్గరే శుభం కార్డనుకుని వెళ్ళిపోతున్న ప్రేక్షకులను చూసిన తొలి సినిమా దర్శకుడిలా బిక్క మొహం వేశాడు, బాధగా చూశాడు .. వెంటనే .మనసులో బాధ యెదలో దురద మట్టిలో బురద అది గోక్కో ఇది కడుక్కో అని ఏదో పాట తట్టింది .. హంసధ్వని కి ఫోన్ కొట్టి ..మూతి అదోలా పెట్టి పాడడం మొదలు పెట్టాడు ..

(...చదివే వాళ్ళు ఉంటే ఇంకా ఉంటుంది ..)

50 comments:

  1. అప్పట్లో నోకియా వరస్ట్ సింగర్ కార్యక్రమంలో ఇంద్రహాస్ తను రాసిన పాట ఒకదాని గురించి మాట్లాడడులే! ఇంగ్లీషు అక్షరాలు ఒకదానిపై ఒకటి వాలిపోయాయి ఆ పాటలో! అదో అద్భుతమైన ప్రక్రియ అట! పోయిన వారం ప్రోగ్రాం లో... గ్రేటాది గ్రేటుడా అనే పదం యొక్క వైవిధ్యాన్నికూడా వివరించాడు..అలాంటి గొప్పవాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది పోయి .... ఇలా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తావా???

    ReplyDelete
    Replies
    1. అదే అదే . ఇలాటి పాటలు రాసి ఏదో కుమార సంభవం పూర్తి చేసిన కాళిదాసు లా ఫీల్ అయిపోయి .. మూతి ఒక రకంగా పెట్టి పాడి విన్పించేసి దాని గొప్పతనం తెలియ చేసేస్తూ ఉంటారు ..

      Delete
  2. నాకు కొంచెం సినిమా నాలెడ్జ్ తక్కువ అని అర్ధం అయ్యింది, కానీ మీరు ఎవరి గురించో రాసారో తెలుసు అనిపిస్తుంది :-) బావుదండి !

    ReplyDelete
    Replies
    1. Thanks.

      చాలా మటుకు గుర్తు పట్టే ఉంటారు .. ఒకటి రెండు మాత్రం తెలుగు సినిమాలు మరీ ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళకే తెలుస్తాయి .

      Delete
  3. chala baga rasaaru, indulo vyangyam kani mana cinema valla kanta padite, nijangane dimma tirugutundi :)

    ReplyDelete
  4. annaya satire ni baaga pandinchavu. Neeku nuvve thopu :P

    ReplyDelete
  5. super ga raasavu. Neeku nuvve thopu :P.

    Akkadakkada akshara dosham undi koncham adi check chesuko rest of it is amazing :)

    ReplyDelete
    Replies
    1. Thanks ra. ఇంకో సారి చెక్ చేస్తా అక్షర దోషాలు ఉండి ఉండచ్చు . హడావుడిగా రాశాను .

      Delete
  6. Okato number Obulesi ki oka +1. Chala mandiki artham kaledanukuta :)

    ReplyDelete
    Replies
    1. Thanks RG.

      పాటని బట్టి గుర్తు పడుతారనుకున్నా

      Delete
  7. ఇంకా సంస్కృతాన్ని, తెలుగుని కలిపేసి దుష్ట సమాసాలు సృష్టించడం, తన పాటల మీద ఏయే యూనివర్సిటీల్లో రీసెర్చ్ జరుగుతున్నాయో చెప్పడం...ఇంకా చాలా ఉన్నాయ్ వాసు గారూ :-)

    ReplyDelete
    Replies

    1. ఔను మురళి గారు .. ఇంకా చాలా ఉన్నాయి ..అందుకే ఆఖర్లో ఇంకా ఉంటే ఉండచ్చు అని డిస్క్లైమర్ పెట్టాను :)

      ఆ దుష్ట సమాసాలు మరీ దారుణం .. అందరూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేసే "నా వేలిముద్ర" పాట కూడా దీనికి ఎక్సెప్షన్ కాదు ..

      రీసెర్చ్ గురించి వినలేదు .. ఇలా ఎందుకు రాస్తున్నారు అని, లేక తెలుగు పాట ఎలా రాయకూడదు అని రిసెర్చ్ చేస్తున్నారు కాబోలు ..:)

      Delete
  8. చాలా బాగుంది...
    మాట్లాడేటప్పుడు కేవలం తెలుగు మాటలే వాడుతూ, పాటల్లో ఏమాత్రం తెలుగు పదాలు లేకుండా జాగ్రత్తగా రాస్తూ సాహితీ సేవ చేసే ఇంద్రహాస్ గారు ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు.

    ReplyDelete
  9. హ హ హ మీరు ఎవరు గురించి మాట్లాడుతున్నారొ నాకు అర్థం అయ్యింది సుమీ!!! :D

    ReplyDelete
    Replies
    1. :) .. ఎవరి గురించి మాట్లాడుతున్నానో తేలికగానే గుర్తు పట్టేసి ఉంటారు .. పాటలు కూడా గుర్తు పట్టారు అనుకుంటున్నా

      Delete
  10. LOL .. still laughing as I type this.

    ReplyDelete
  11. హహహహ :) పుస్తకంతో పాటు CD కూడానా??? ఒకటో నెంబరు ఓబులేసు లో తిట్ల పాట వ్రాసిన ఇంద్రహాసే నోకియా వరస్ట్ సింగర్ కార్యక్రమంలో భర్తని స్వామీ అని పిలిచే రోజులు పోయాయి అని వాపోయాడు. దుష్ట సమాసాలు, యమకాలంకారం, మొ., వాటి గురించి కూడా వ్రాస్తారని ఆశిస్తూ (చదివేవాళ్ళు వుంటే వుంటుంది అన్నారుగా)...

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ రసజ్ఞ్య గారు . దుష్ట సమాసాలు గురించి రాద్దాం అనుకున్నా .., యమకాలంకారం గురించి మాత్రం నాకు తెలియదు.. అదేంటో చదివి అప్పుడు రాయగలనేమో చూస్తా

      Delete
  12. వాసు గారు,
    నేను కూడా గొప్పాధిగొప్పడు పదం వ్రాయడం గురించి చెప్పుకుంటుంటే విని తెల్లబోయాను.
    మీరు బాగా నవ్వించారు. చదివే వాళ్ళున్నారు కదా, వ్రాయండి మరి.

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ లక్ష్మీ దేవి గారు . రాయడానికి ప్రయత్నిస్తాను .

      కామెంట్ల రూపం లో చాలా వరకూ చెప్పేశారు అందరూ .. ఇంకా ఎమన్నా గుర్తొస్తే రిపిటీషన్ కాదవనిపిస్తే రాస్తా ..

      Delete
  13. బిస్కట్ భట్ల గురించి కుడా చెప్పాల్సింది, ఫుల్ బాటిల్ కొట్టినట్టుంది అని, కొట్టకుండా ఎక్కింది అని రాస్తున్నాడు. బిస్కట్లు వేసి అవకాశాలు పట్టడంలో దిట్ట.

    ReplyDelete
    Replies
    1. :) బిస్కెట్ భట్ల .. నేను ఆయన్ని ఫాలో అవ్వలేదు .. ఇడ్లీ విశ్వనాధ్ అనగానే పాటలు గురించి పెద్దగా పట్టించుకోను ..ఆయనకే ఎక్కువగా రాస్తాడు కదా ఈయన .

      Delete
  14. హహహ అదరగొట్టేశారండీ :-))

    ReplyDelete
  15. బావుంది . ఇలాంటి తెగులు చూడలేక తెలుగు చానల్స్ తీయించెసాను . ఇంకా సినిమా అంటే మద్యలో గోల ఎలాగో తప్పదు

    ReplyDelete
  16. ఉంటాను హై వస్తాను హై అని తెగ రాసేస్తూ మళ్ళీ దానిలో భావుకత్వం పొంగిందంటూ ఉప్పొంగిపోయే ఇంద్రహాస్లాంటి వాళ్ళు,
    ఇక బిస్కట్ భట్ల సాహిత్య సేవ ఎలాంటిదంటే ఒక తండ్రి కుతూరు కూర్చొని ఆ పాట వింటే సిగ్గుతో చచ్చిపోవాల్సిందే..
    టపా బాగుంది..కనీసం ఇలాంటి టపాలు వాళ్ళు చదివితే బాగుండు..:(

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ ధాత్రి గారు . వాళ్ళు ఈ టపా చదివితే ఎలా ఉంటుందో అని నాకూ కుతూహులంగా ఉంది :)

      Delete
    2. అఖిల భారత ఇంద్రహాస్ అభిమాన సంఘం వారు ( అలాంటి సంఘం ఖర్మకాలి ఉంటే), ఈ టపా చదివితే, మీ మీద కూడా ఒక పాట రాసేస్తారేమో

      Delete
  17. బాగా రాసారు. ఎవరి గురించి రాసారో అర్థం అయ్యింది కానీ అందరూ చెప్తున్న ఆ పాటలు నాకు అస్సలు తెలియదు. దయచేసి ఆ పాటలేంటో చెప్దురూ? ఇడ్లీ విశ్వనాధ్ ఎవరండీ?

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ .. అవి చెప్పేడట్టు అయితే ఈ నకిలీ పేర్లెందుకండీ.

      ఇడ్లీ విశ్వనాధ్ అంటే ఇట్లు పావని పరమానందం; రాస్కెల్, అక్క బావా ఒక ఒరియా అమ్మాయి, కిరికిరి లాటి చిత్ర రాజాలు తీసిన డైరెక్టర్

      పాటల కూడా పేర్లు ఇంకో సారి చూస్తే అర్థం అయిపోతుంది ..

      Delete
    2. Vasu, "ఇట్లు పావని పరమానందం; రాస్కెల్, అక్క బావా ఒక ఒరియా అమ్మాయి... " - adiripoyayi perlu :D :D :D

      Delete
  18. :D

    P.S.: అవసరమైన పాటలవీ, ఇంటర్వ్యూలవీ యూట్యూబు లింకులు కనీసం వ్యాఖ్యల్లోకూడా ఇవ్వకపోవడాన్ని ఖండిస్తున్నాం.

    ReplyDelete
    Replies
    1. పాటల లింక్స్ అవీ ఇచ్చేడట్టు అయితే ఇంత కష్టపడి వేరే పేర్లు పెట్టడం ఎందుకండీ. అయినా ఈ విధంగా నైనా ఆ రచయిత మీద మీ వంతు రీసెర్చ్ చేస్తారని ఆశ :)

      Delete
  19. హ హ్హ హ్హ హ...అయ్య బాబోయ్. నవ్వలేక చస్తున్నా బాబోయ్.
    ఇంతకాలం...ఇంద్రహాస్ పాటలు విని నా బాధ పంచుకునే వాళ్ళు దొరక్క బాధపడ్డాను.

    పనైపోతుంది( విడిపోదాం రా..లో) అంటూ మొదలైన ఆ లిస్ట్ పాటల్లో..తెడ్డూరం,అంటూ చితవిచిత్ర విన్యాసాలు చేశారు. మీరు ఆయన్ని బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. ( మూతి అదోలా పెట్టి..!)హ హ్హ హ్హ..ఆయన మీద దరిద్రా---విడ యూనివర్సిటీలో పరిశోధన జరిగింది లెండి..
    ఇక ఆయన గొప్పగా చెప్పుకునే మొక్క పాట( మధుర అనుభవాలు లోది ) తమిళం పాటకు అనువాదం లాంటిదే..

    ఇక బిస్కెట్ భట్ల రాసిన ఒక ఆణిముత్యం...

    "ఎండే వస్తే ఏండే కాలం...వానే వస్తే వానా కాలం..."

    మనకు తెలుసో లెదో అని ఆయన కాలాల గురించి చెపుతున్నాడు.

    ReplyDelete
  20. chala alasyamga choostunnanu..kshaminchandi..
    taapaa adiripoyindi. konasaginchandi..chadive vallamu unnamu :)

    ReplyDelete
  21. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక ;)

    ReplyDelete
  22. చాలా బాగా రాసారండి. ఇంద్రహాస్ - హంసధ్వని పాటలు విన్నాను కానీ అందులో ఇన్ని లిస్ట్లు ఉన్నాయని గమనించలెదు. మీ analysis కి hats off :)

    ఇంద్రహాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దుష్ట సమాసాల సంగతి దేవుడెరుగు. అచ్చమైన తెలుగు పదాలనే ఇష్టం వచ్చినట్టు మార్చి పారేసి చేసే ప్రయోగాలైతే మరీ దారుణం . (ఉదా: బబ్బర్ షేర్ లోని సముద్రం సన్నాయి అయితే .. పాట). ఇక ఆ అక్షరాలు వాలిపోయే పాట అయితే అద్భుతం . ఒక వాక్యానికి ఇంకో వాక్యానికి సంబంధం లేకుండా, అస్సలు అర్ధం పర్ధం లేకుండా ఒక పాట మొత్తం రాసేయచ్చు అని ఇంద్రహాస్ గారు నిరూపించారు ఆ పాటతో. :)

    ReplyDelete
  23. కేకాది కేక .... సుపరాది సుపరు ....
    ఆ చంద్రహా(బొ)స్ గారికి ఎవరైన ఈ లింక్ పంపిస్తె, చదివి ఈ సారి నుంచైన పాటలు పాటలలా రాస్తాడేమో ...

    ReplyDelete