ఏమిటి ?
స్వాత్రంత్రం వచ్చి 63 ఏళ్ళు అయినా, మన దేశం శక్తికి తగ్గ అభివృద్ది జరగలేదు. ఎంత పురోగమించినా సగటు భారతీయుని ఆదాయం పెద్దగా పెరగలేదు. ఇందుకు అవినీతి ఒక ముఖ్య కారణం. దేశం లో అడగడుగునా అవినీతి ఉందని కాదనలేని సత్యం. రాజకీయ నాయకులలో అధిక శాతం అవినీతి పరులని పసి పిల్లవాడిని అడిగినా చెబుతాడు. అవినీతి అంత సర్వ సాధారణం అయినా , గత రెండు సంవత్సరాలలో ఇది కనీ వినీ ఎరుగని స్థాయిలో, సంఖ్యలు చూస్తే కళ్ళు భైర్లు కమ్మే స్థాయిలో పెరిగింది. ఆదర్శ, కామన్ వెల్త్ , 2G స్కామ్లు దేశాన్ని కుదిపేస్తున్నాయి. అవినీతి ఎంతకి పేరుకుపోయిందంటే, ఆ సొమ్మును మనం విదేశీ బ్యాంకుల నించీ వెనక్కి తీసుకు రాగలిగితే ముప్పై ఏళ్ళు ... అక్షరాలా ముప్పై ఏళ్ళు పైసా పన్ను లేకుండా దేశం నడవచ్చు అన్న స్థాయిలో.
ఉపోద్ఘాతం సరే .. అయితే ఇప్పుడేంటి అంటావ్ ?
ఇది భరించలేని కొందరు ఇలా చూస్తూ ఊరుకోవడం సరి కాదని నడుం బిగించారు. గళం వినిపించారు. విద్యాధికులు, న్యాయ మూర్తులు తదితరులు తయారుచేసిన జన్ లోక్ పాల్ బిల్ ను పార్లమెంట్ లో ప్రవేశ పేట్టే వరకూ India against Corruption ఉద్యమం చేపట్టారు. అదే సమయం లో భారత దేశం లో అవినీతి కి విసుగెత్తిన ప్రవాస భారతీయులు కొందరు "దేశం ఇంతే దీన్ని బాగుచెయ్యడం ఎవరి వల్లా కాదు" అని కూర్చోకుండా ఒక ఉద్యమం చేపట్టారు. Jan Lokpal Bill అమలు చెయ్యడం ప్రధమ లక్ష్యంగా, అవినీతి వ్యతిరేక పోరాటాన్ని జనాలలోకి తీసుకెళ్ళే దిశగా ఒక బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఏంటది ?
అదే రెండవ దండి పాదయాత్ర (Dandi March 2).
అప్పుడు:
గాంధీజీ చేసిన దండి పాదయాత్ర 1930 మర్చి 12న సబర్మతి ఆశ్రమం దగ్గర మొదలై దండి వరకూ 24 రోజులపాటు 240 మైళ్ళు సాగింది ఆ పాదయాత్ర.. దేశ స్వాతంత్ర్య పోరాటం లో ఇదొక కీలకమైన మలుపు.
ఇప్పుడు:
అదే స్ఫూర్తి తో, అవే తేదీలలో అంటే మర్చి 12 న మొదలై మర్చి 26 వరకు దక్షిన కాలిఫోర్నియా లోని శాన్ డియాగో లో మార్టిన్ లూదర్ కింగ్ విగ్రహం దగ్గర మొదలై అక్షరాల 24 రోజుల పాటు కాలిఫోర్నియా లో ప్రముఖ పట్టణాలలో సాగి 26న శాన్ ఫ్రాన్సిస్కో లోని గాంధీ విగ్రహం దగ్గర ముగుస్తుంది. అదే రోజున ప్రపంచం నలు మూలలలో వివిధ పట్టణాలలో భారతీయులు ఈ పాద యాత్రకి సంఘీ భావంగా పాదయాత్రలు చేస్తున్నారు.
ఈ రెండవ దండి యాత్రలో ఆరుగురు ప్రవాసులు మొత్తం నుండి చివరి దాకా అంటే 24 రోజులూ, 240 మైళ్ళూ నడుస్తునారు. వారు జవహర్ కంబంపాటి , శ్రీహరి అట్లూరి, సుభాష్ కర్రి,
వర్మ దంతులూరి, కేవల్ పర్నామి, శ్రీనివాసరావు నందివాడ (కింద ఫోటోలో చూడవచ్చు) .
వీరు ఉద్యోగాలకి శెలవు పెట్టి, కేవలం అవినీతిని ప్రతిఘటించడానికి, జనాలలో జన్ లోక్ పాల్ బిల్ (Jan Lokpal Bill) వస్తే కానీ దీనికి అంతం లేదనే అవగాహన పెంపొందించడానికి, ఆలోచన రేకెత్తించడానికి , నిజానికి దేశం లో అవినీతి అంతమొందాలి అనుకునే ప్రతీ ఒక్కరి గురించి నిస్వార్థంగా నడుస్తున్నారు. కేవల్ పర్నామి గారి వయస్సు 70 ఏళ్ళు అని వినగానే ఆశ్చర్యం, ఆయనంటే గౌరవం కలగక మానదు.
సరే!... అయితే??....:
దేశం లో అవినీతి పోవాలి, కనీసం ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి, దేశాన్ని తిట్టుకుంటే సరిపోదు, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకునే వాళ్ళందరూ జన్ లోక్ పాల్ బిల్ అమలు చేయడం ఒక గొప్ప పరిష్కారం అని గుర్తించాలి.
"నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చి మ్రోస్తానూ " అంటూ ముందుకు రావాలి.
మీ గొంతు వినిపించాలి. మీ వంతు కృషి చెయ్యాలి.
రెండవ దండి పాదయాత్ర (Dandi March2) ప్రయత్నం మీకు నచ్చితే, మీ భావాలకి దగ్గరగా ఉంటే మీ సహకారం, మీ సంఘీభావం తెలపండి. ఈ పాదయాత్రలో మొత్తం 240 మైళ్ళూ నడవడానికి పూనుకున్న ఆరుగురు ఎండనకా వాననకా రెండు వారాలగా నడుస్తూనే ఉన్నారు. ఇంకా ఎక్కువగా జనాలు సపోర్ట్ చేస్తే ఈ ప్రయత్నం జనం లోకి వెళ్తోంది అన్న ఆనందం తో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి ఉపకరిస్తుందని గమనించండి.
అందుకని కాలిఫోర్నియా లో ఉన్నవారైతే మీ శక్తి కొలదీ 1,2,3,5,.. మైళ్ళు వీరితో కలిసి నడవండి. వీలు కాకపోతే మీ పట్టణం లో పాదయాత్ర జరుగుతున్నప్పుడు వాళ్ళని పలకరించి మీ సపోర్ట్ తెలపండి. అదీ వీలుకాకపోతే 26 న మీ పట్టణం లో జరిగే సమావేశం లో పాల్గొనండి.
అది కూడా వీలుకాకపోతే ఇలాటి వాటిలో ఆసక్తి ఉన్న మిత్రులకి తెలియజేయండి.
అది కూడా వీలుకాకపోతే.. ఇదంతా ఒక వెర్రి వాడి బాధని వదిలెయ్యండి. అనవసరంగా చదివామనుకొని ఊరుకోండి .
దేశం ఇంతే అని నిట్టూర్చి హాయిగా నిదరపొండి. శ్రీశ్రీ అన్నట్టు "... ప్రపంచం ఎట్లా పొతేనేఁ మీకెందుకు లెండి ... అదృష్ట వంతులు మీరు వడ్డించిన విస్తరులు మీ జీవితం."
గమనిక:
1. ఈ ఆలోచన లోక్ సత్తా కార్య కర్తల దైనా, ఇందులో పార్టీలకి సంబంధం లేకుండా ఎవరన్నా పాలుపంచుకోవచ్చు. చాలా సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతుగా నడుస్తున్నాయి, సహకరిస్తునాయి.
2. రాజకీయ నాయకుల అవినీతి గురించి మాట్లాడుతున్నాం కానీ, మనం లంచాలని ఇవ్వట్లేదా, తీసుకోవట్లేదా అనేది చొప్పదంటు ప్రశ్న కాకపోయినా (ఈ మీమాంస లోనే ఇన్నాళ్ళు దీని గురించి రాయలేదు ) ఈ వ్యాస పరిమితి మించిన ప్రశ్న అని నా ఉద్దేశ్యం. లంచం ఇవ్వడం తీసుకోవడం తప్పే కానీ తప్పక, గత్యంతరం లేక ఇస్తున్నవారే ఎక్కువ. ఇప్పుడు కోరుకునే మార్పు ఆ అవకాశం లేని సమాజం ఏర్పరిచే దిశగా వెళ్తుందనే పాజిటివ్ ఆలోచనతోనే రాయదలచుకున్నాను.
చివరిగా ఇందులో చరిత్ర పరంగా కానీ ఫాక్ట్స్ కానీ ఏమన్నా తప్పులుంటే చెప్పగలరు. సరి చేసుకుంటాను