మొదటి భాగం - ఇక్కడ
నిడదవోలు - చాగల్లు - పట్టిసీమ - పాపి కొండలు - పోచవరం మీదుగా జీడికుప్ప చేరుకున్నాం.
జీడికుప్ప నించీ ఆటో బయల్దేరింది. చిమ్మ చీకటిలో, కారడివిలో (అదంతా ఏజెన్సీ ప్రాంతం), ఆ పిల్లాడు వేస్తున్న టార్చీ లైట్ వెలుగులో, దారి పొడవునా గుంటలు పడిన ఆ రోడ్డు మీద ఆటో సాగిపోతోంది. అసలే బెదిరి పోయిన మమ్మల్ని ఆ ఆటో వాడు, ఇక్కడ కూంబింగ్ జరుగుతోందని, అన్నలు, పోలీసులు తెగ తిరుగుతున్నారని చెప్పి ఇంకా భయపెట్టాడు. పక్కనే ఉన్న పిల్లాడు దానికి వత్తాసుగా అప్పుడప్పుడు పులులు కూడా వస్తూ ఉంటాయని గుండెల్లో విమానాలు పరిగెత్తించాడు.
ఈ లోపు వెనకన కూర్చున్న నాకు తల మీద, ఆటో పైన ఏదో కదులుతూ ఉన్నట్టనిపించింది. నా భ్రమేమో, చెప్తే నవ్వుతారని ఏమీ మాట్లాడలేదు. ఇంతలో రోడ్డు మీద ఒక గతుకొచ్చింది. అంతే గబాలున ఎవరో నెత్తి మీదకి ఉరికారు.కెవ్వున కేక వెయ్యబోయి, భయాన్ని గొంతులోకి మింగి, ఆటో ఆపమని అరిచాను. డ్రైవర్ అదో రకం లుక్ ఇచ్చి బ్రేక్ వేసాడు ..
అందరూ నన్ను వింతగా చూసారు. "పైన ఎవడో ఉన్నాడు రా ఖచ్చితంగా. నా నెత్తి మీద ఎగిరి పడ్డాడు. అన్నలేమోరా" అన్నాను.
అన్నలకి పనేం లేదా ఆటోమీదకి ఉరికి నిన్ను పట్టుకోడానికి నువ్వేమన్నా రాజకీయ నాయకుడివా, కనీసం వీధి రౌడీవి కూడా కావు అని రియాక్షన్.నాకు ఒళ్ళు మండింది. పుండు మీద కారం జల్లినట్టు ఆటో డ్రైవర్ పకపకా నవ్వుతున్నాడు. వీడికి ఓంకార్ షో లు రోజంతా చూపించినా పాపం లేదన్నంత కోపం వచ్చింది. వాడు నవ్వాపి, తోడుకని ఇంకో పిల్లాడిని తెచ్చుకున్నానని, ఆటోలో చోటు లేదని పైనే కూర్చోపెట్టానని చెప్పాడు.
నేను సీరియస్ గా వెళ్లి ఏమీ జరగనట్టు ఆటో లో కూర్చున్నా. మిగత వాళ్ళంతా కామెడీ గా వచ్చి కూర్చున్నారు.
డ్రైవర్ గేర్ రాడ్ వెనక్కి లాగాడు. ఆటో ముందు కెళ్ళింది. చిమ్మ చీకటిలో చిన్న కాంతి లో దారిని చూస్తుంటే, మా పరిస్తితికి సింబాలిక్ గా ఉన్నట్టనిపించింది. ఈ ఆటో దొరకకపోతే ... తలుచుకుంటేనే భయం వేసింది.
ఇలా ఒక గంట ఆటో అడవిలో, నేను ఆలోచనల్లో ప్రయాణించాక కూనవరం రానే వచ్చింది. కాకపోతే అర్థరాత్రి అయ్యింది. ఊహించి నట్టే ఆఖరి బస్సు కూడా వెళ్లి పోయింది. అక్కడ తినడానికే హోటల్స్ లేవు. ఇక ఉండడానికి ఏముంటాయి. ఏదైతేనేఁ అడివి నించి ఊర్లోకి వచ్చాం. ఆటో డ్రైవర్ కి బోలేడ్ థాంక్సులు చెప్పి, డబ్బిచ్చి పంపేశాం.
భద్రాచలానికి ఇంకో వాహనం కోసం ప్రయత్నం మొదలెట్టాం.
ఆటో స్టాండ్ లో సగం మంది బళ్ళు ఆపేసి, కల్లు తాగేసి తూలుతున్నారు. మిగతా సగానికి బళ్ళు లేవు. ఎవరో ఒకతను తనకు ఆటో డ్రైవర్ ఒకడు తెలుసనీ ఊర్లోకి తీసుకెళ్తానన్నాడు. నేను నా స్నేహితుడు కిరణ్ వాడిని ఫాలో అయ్యాం. అయిదు, పది , పదిహేను , ఇరవై (మగధీర లో శ్రీహరి లా లెక్కెట్టుకోండి) నిమిషాలు నడుస్తూనే ఉన్నాం. ఇంకొంచం ముందుకు ఇల్లు అని తీసుకెళ్తూనే ఉన్నాడు . ఆయాసం, అసహనం వస్తున్నాయి కానీ ఇల్లు రాలేదు. ఈ లోపు వాడు ఇంకా ఇంకా ముందుకు పోదాం అంటూ పోయాడు. మాయమైపోయాడు. హ్యాండ్ ఇచ్చాడని డిసైడ్ అయ్యి ఉసూరు మంటూ వెనక్కి బయల్దేరాం.
ఆటో స్టాండ్ కి వచ్చేసరికి నా స్నేహితులు ఒకడితో బేరం కుదిర్చారు. రెండు వందలు కాబోలు. ఆ డ్రైవర్ చూస్తే కొంచం తూలుతూ ఉన్నాడు. వీడిని నమ్ముకుంటే మనల్ని ముందుకు కాదు పైకి పంపించే డట్టు ఉన్నాడని డిసైడ్ అయ్యి, వద్దని చెప్పేసాం. ఈ లోపు ఆ పక్కన వైన్ షాపు లో లోడ్ దించుతున్న మినీ ట్రక్ డ్రైవర్ మా పాలిట రాముడిలా వచ్చి, లోడ్ దించాక భద్రాచలం వెళ్తానని చెప్పాడు. పది నిమిషాలు ఆగితే మమ్మల్ని తీసుకెళ్తా నని హామీ ఇచ్చాడు .
ఇది విన్న తాగున్న ఆటో డ్రైవర్ కళ్ళు తాగిన కోతిలా గంతులేసి గొడవకి దిగాడు. సారా ఆటో క్లబ్ అంతా వాడికి వత్తాసు పలికింది. ఏదో కొంచం సేపు వాదించినా, అందరం పోకిరీలం కాదు కదా , బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్లమి. కనుక బేరం ఆడిన మొత్తం వాడికి సమర్పించుకున్నాం. దిగాక ఇచ్చే ఆటో డబ్బులు ఎక్కకుండానే ఇచ్చాం ( పోను పోను ఇదే పద్ధతి జిం లో అలవాటయ్యింది. నెలకోసారి కూడా ట్రెడ్మిల్ ఎక్కకపోయినా నెల నెలా చందా మాత్రం కడతాను)
ఆటోవాడిని వదిలించుకుని వైన్ షాప్ లోడింగ్ ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాం. పది నిమిషాలు అన్నది గంటకి పైగా పట్టింది. ఇంత చీకాకు లోనూ షాప పేరు చూసి నవ్వొచ్చింది - గాంధీ వైన్స్. ముందు మహాత్మా పెట్టకుండా మేలు చేశాడనుకున్నాం.
వైన్ షాప్ పనవ్వగానే (వాడికి), అందరం లగేజీ తో ఆ చిన్నట్రక్ లో ఎలాగో ఇరుకున్నాం. పవిత్రంగా సారా బండిలో భద్రాచలం బయల్దేరాం. అర్థరాత్రి లో అడవి ప్రాంతం లో చిక్కటి చీకటిలో చక్కటి చుక్కల్ని చూస్తూ కాళ్ళ నొప్పులు, కళ్ళ నొప్పులు (నిద్రలేక), మందు కంపు, వంటికి గుచ్చుకుంటున్న విరిగిన సీసాముక్కలు అన్నీ మరిచిపోయాం.
గంటలో భద్రాచలం చేరాం. గుడ్డిలో మెల్ల హోటల్ ఒక్కటీ ముందే బుక్ చేసుకున్నాం. హోటల్ దగ్గరికి రాగానే డ్రైవర్ బేరం మొదలెట్టాడు. లిఫ్ట్ అనుకున్నామే అంటే నాకిచ్చే డబ్బు గిఫ్ట్ అనుకోండి అన్నట్టు చూసాడు. అడిగినది ఇచ్చి హోటల్ రూమ్స్ చేరుకున్నాం. ఆ టైం లో కూడా మాకు తినడానికి ఏర్పాటు చేసిన ఆ హోటల్ బాయ్ ని మర్చిపోలేం.
మర్నాడు ఆలస్యంగా వెళ్ళినా దర్శనం బ్రహ్మాండంగా ఐంది.ఈ ప్రయాణం అనుభవం తో హైదరాబాద్ తిరిగి వెళ్ళేటప్పుడు భద్రాచలం నించి ట్రైన్ బుక్ చేసుకున్నాం. ట్రైన్ టైం కి రెండు గంటలు ముందే స్టేషన్ చేరుకున్నాం ప్రయాణం నేర్పిన పాఠం వల్ల .
ఒక వారం పోయాకా "గోదావరిలో గల్లంతయిన తాతాజీ. గుర్తు తెలియని వ్యక్తుల పని అని అనుమానం" అని పేపర్ లో పడిందని నాకు కలొచ్చింది (కాబోలు).