Sunday, January 30, 2011

కోతి కొమ్మచ్చి



ఈ సారి నా గొంతు వినిపించ దుస్సాహసం చేస్తున్నాను. నిజానికి వినడానికి మీరు సాహసం చేస్తున్నారంటే కరెష్టేమో.  మీకు డబల్ డోస్ అన్నమాట .



నిన్ననే ఒక మహత్కార్యం చేశాను. కోతి కొమ్మచ్చ్చి ఆడియో కొని వినడం.. కాదు పారాయణం చేయడం మొదలెట్టా. ఆపబుద్ధి కావట్లేదు. ఈ రోజు తో పారాయణం పూర్తవుతుంది. ఇంత అద్భుతమయిన పుస్తకం ఇప్పటి వరకు ఎందుకు చదవలేదా అనుకున్నాను. కానీ బాలు గొంతులో విన్నాక ఒక విధంగా ఇది కూడా మంచిదే అనుకున్నాను. కో. కొ. (పుస్తకం చదివిన వాళ్ళకి తెలుస్తుంది) అనట్టు బాలు అనగానే గుర్తొచ్చింది. మొత్తానికి బాలూ కి పద్మ భూషణ్ వచ్చింది (ఇప్పటికైనా). అనుకున్న్నట్టే ఇది కూడా (పద్మశ్రీ లాగే) తమిళ నాడే తెప్పించింది. సుశీల గారికి కూడా వాళ్ళే. ఇది తలచుకున్నప్పుడు మన ప్రభుత్వాలకి కళలంటే చిన్న చూపెందుకని అనుమానం వచ్చింది. మన వాళ్ళకి డబ్బు చేసిందని ముందనిపించింది. రియల్ ఎస్టేట్ మీద యావ స్టేట్ మీద స్టేట్ లాంగ్వేజ్ మీద లేదని స్నేహితుడొకడు స్టేట్ మెంట్ ఇచ్చేసాడు. ఇంకా ఆలోచించగా చించగా ఇది ఇప్పటిది కాదని మనకి తరతరాలుగా వస్తున్న అచారమేమో (గ్రహచారమేమో ) అని తోచింది.  కాకతీయులు, శాతవాహనులు వగైరా తెలుగు కవులకి పట్టం కట్టారో లేదో తెలియదు. అది తెలుస్కోవాలో లేదో కూడా తెలియదు. కానీ తెలుగు కవులని నెత్తికెత్తుకుని, తెలుగుకు పట్టం కట్టినదెవరంటే శ్రీ కృష్ణదేవరంటే (ప్రాస బావుందని ) కాదంటారా. మరి ఆ ఆంద్ర భోజుడి మాతృభాష తులు కదా! అంటే అనాదిగా తెలుగు కళాకారులని తెలుగువారికంటే, ఆ అదృష్టం లేని వారే (తెలుగు గా పుట్టడం అదృష్టమన్నానని నను భాషా దురాభిమానుల పంచన కట్టేయ్యకండీ . ముఖ్యంగా ఆ DMK పక్కన . అన్నట్టు ఇది ఒక అసభ్య పదానికి షార్ట్ గా వాడడం రివాజు అని నాకు గుర్తొచ్చినా చెప్పను) తలకెత్తు కుంటున్నారని నొక్కి వక్కానిస్తున్నాను . నాకు చరిత్ర, కళలు గురించి తెలిసినది తక్కువ కనుక, ఎక్కువ మాట్లాడే అధికారం ఉంది కనుక నన్ను ఆం ఆద్మీ గా జమకట్టి నాది మెజారిటీ గొంతుగా ఒప్పుకోండే మరి.
మళ్ళీ అసలు కథ. రమణ గారు వండిన అమృతాన్ని ..అదే ఆయన కష్టాలు-నష్టాలు,కన్నీళ్లు - కడగండ్లు కలిపి ..తయారు చేసిన టానిక్ ని ( కాపీ "రైట్" కనుక ఈ మాటను వాడేస్తున్నాను).. నిజానికి ఇది ఉప్పగా ఉండాలి .. కానీ ఆయన ఆకలి కేకలను జోకులతో కలిపి కొంటె తనపు కిసమిస్స్లను, యధార్థాలనే యాలకులను జల్లి.. అమృతం ఏం ఖర్మ దాని బాబులా తయారుచేసారు. బాలు దాన్ని వెండి పళ్ళెం లో వడ్డించారు. విందారగించాను.. కానీ భుక్తాయాసం రావట్లేదు. ఇంకా ఇంకా అంటూనే ఉంది. ముద్దపడితే మూత పడును కడుపు శాంతించి. తిన్నకొద్దీ ఎంత యావో మనసు కదో పిచ్చి.


కొ.కొ.-- 
అన్నట్టు ఇలాటివి రాయడానికి నాకు చంద్రబోసు గారే  inspiration, expiration, motivation.. ఎందుకంటారా నాకు సిరివెన్నల అన్నా వేటూరి అన్నా భయం (కొంత మంది దీన్ని భక్తీ అని కూడా అంటారు). Stanford professor ని చూసిన Tri valley విద్యార్ధి లాగా. కానీ చంద్రబోసు గారు అలా కాదు. ఆయన పాటంటే (పాటింటే ..) నేను చెవికోసుకుంట. అలా ఐతే ఆయన ఇంకో పాట వినక్కర్లేదనా అని ఎవరో పెడార్థం తీస్తే నేను ఏం చెప్పలేను మరి. ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడిని, భక్తుడిని. ఒక్కోసారి ఏమీ లేకపోతె సినిమా పాటలు రాసేయచ్చులే అనే ధైర్యం ఆయన పాట చలవే. ఉదాహరణకి నాకు ధైర్యాన్ని ఇచ్చిన రెండు మచ్చు తునకలు.
"అమ్మా తల్లే నోర్ముయ్యవే .. నోటి ముత్యాల్ జార్ నీయకే "
"వీచీ గాలి అందరి కోసం.. సూర్య కాంతి అందరి కోసం.." (దీనికి ఆయన టీ. కా . తాత్పర్యం కూడా ఇచ్చుంటారు ఎక్కడో )మాకు తెలుసుంటారా .. మరి.
"ఒక్కరికి మేలు చేస్తే అందరికీ మేలు జరుగుతుందిట .."
ఛా నిజమా అంటారా
అయ్యో .. ఐతే.. ఇది వినాల్సిందే "సఫలం లో నేతాజీ .. సఫలం లో గాంధీజీ "..
ఇది ఏంటి అంటే .. నాకు కూడా అర్థం కాలేదండీ . నన్ను involve చెయ్యకండీ.
-- కొ.కొ.


కొమ్మ వదిలేసి చాలా సేపైంది కదూ. సరే.. పాయింట్ లోకి. కొన్ని అధ్యాయాలు చదువుతున్నంత సేపు రమణ గారి కలవని వ్యక్తీ లేడు తెలియని కళాకారుడు లేడు, ఈయన వల్ల బోలెడు మంది నాకు కూడా తెలుస్తున్నారు అని ఒక పక్క ఆనందం. ఈ మహానుభావులు, కళాకారులు, కవులు కనీసం అన్నం కి నోచుకోలేని దుస్థితి ఏంటి. ఏమైపోయారు కవి రాజ పోషకులు అని బాధ కూడా వచ్చింది. ఇప్పుడు కూడా బోలెడు మంది ఉన్నారేమో ఆకలితో అలమటించే కళాకారులు తెలియదు నాకు .కానీ నాకు తెలిసిన ప్రఖ్యాత కళాకారులు, మహామహులు, సాహితీ వినీలాకాసం లో ధ్రువ తారలుగా వెలిగిన వారు ఇలా ఆకలి తో అలమటించారా అని గుండె తరుక్కు పోయింది.
కొన్ని విషయాలు వింటుంటే ఈయనేంటి అన్నీ చెప్పేస్తున్నారు అని ఆశ్చర్యం కూడా కలిగింది. ముఖ్యంగా కన్నప్పగారిది (ఒక వేళ నేను అనుకున్న వ్యక్తే కరెష్టే ఐతే). ఎవరన్నా పరువు నష్టం దావా వేస్తారేమో అని భయం వేసింది.బాపు రమణల గురించి నాకు తెలిసిన కొంచానికి బోలెడు గౌరవం ఉండేది ఇంతకు మునుపు. ఇంకా తెలుసుకున్నాకా అది ఇంతింతై అది ఇంతై . అంతంతై అది అంతై. అంతే లేనంతైంది.



కోటి కొమ్మచ్చి ఆడియో తో పేచి ఎమన్నా ఉందా అంటే .. అన్నీ బాలు ఏ పాడితే, మాటాడితే బావుండేది. మిగతావారు బానే చదివినా బాలు గొంతు విన్నాకా .. రాజు చూసిన కళ్ళతో మొగుడిని మొట్ట బుద్ది అని సామెత.
కోతి కొమ్మచ్చి.. కొమ్మకి రెమ్మోచ్చి.. రెమ్మకి పువ్వొచ్చి.. అని మొదలెట్టారు. 



నాకు ఇలా అనిపించింది.
ఎద లో వెతలోంచి ఎన్నో కథలు పంచి
ఏడ్పుతో నవ్వించి. నవ్వులో ఏడ్పించి.
ఆకలి లో జోకులు నంచి

ఆరారా తినిపించి
జీవన సాగరం మధించి
జీవిత సత్యం బోధించి
నను మనిషిగ పెంచి
ననీ ఋణం తీర్చుకోను ఏమిచ్చి

మొత్తానికి తప్పక వినాల్సిన / చదవాల్సిన పుస్తకం అని మీకు ఇప్పటికే తెలుసనుకోండి. నేనే ఆలస్యంగా విన్నాను. నా కంటే ఆలస్యం చేసిన వాళ్ళుంటే త్వరపడండి.
అన్నట్టు బాపు రమణ లకి పద్మాలు ఎప్పుడు వస్తాయో. పాపం వాళ్ళు తమిళం మరీ అంత ఎక్కువ పని చెయ్యలేదే.