Tuesday, February 26, 2013

తెలుగు పాట వ్రాయడం ఎలా For Dummies


ఈ టపా లోని పాత్రలు , పాటలు , పేర్లు ఎవరినో ఉద్దేశించినవే అని మీకు అనిపిస్తే మీకు కనీస తెలుగు సినిమా నాలెడ్జ్ ఉన్నట్టే 


ఒక్క ఛాన్స్ వస్తే చాలు తనేంటో నిరూపించేసుకుని, సినిమా క్రెడిట్స్ లో పాటలు అన్న మాట కింద తన పేరుని చూసేసుకుని, సింగల్ కార్డ్ గా ఎదిగి , తెలుగు గేయ రచయితగా స్థిర పడిపోవాలని పగటి కలలు కంటున్నాడు మన వాడు (రాత్రి రాతలతో నిద్ర లేక పొద్దున్నే పడుకుంటున్నాడు మరి ) . ఒకడు  చేసేది ఏదైనా, అందులో వాడి భవిష్యత్తు ఉన్నా లేకపోయినా  వాడిని ప్రోత్సహించే స్నేహితుడు ఒకడు ఉంటాడు.  అలాటి వాడే మనవాడి స్నేహితుడు ..  మన వాడి బాధ చూడలేక ఎవరెవరివో కాళ్ళు , గడ్డం, చేతులు , మెడ   పట్టుకుని ప్రముఖ గేయ రచయిత ఇంద్ర హాస్ అపాయింట్ మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళాడు .

అప్పుడే  నోకియా వరస్ట్ సింగర్  కార్యక్రమం గ్రాండ్ సెమీ క్వార్టర్ ఫైనల్ షూటింగ్ ముగించుకుని వస్తున్నారు ఇంద్ర హాస్. అమెరికా టూర్ వెళ్ళినపుడు తెచ్చుకున్న ఆబర్కాంబీ టీషర్టు చూసి ఆయనే అని నిర్దారించుకున్నాడు మన వాడి ఫ్రెండ్ .

ఆయన్ని కలిసి మా వాడు గీత రచయిత గా ప్రయత్నాలు చేస్తున్నాడు  సార్ . అందరూ వీడి పాటలు బావున్నాయి అంటున్నారు కానీ ఎవరూ తీసుకోవట్లేదు ..  బోలెడు భవిష్యత్తు ఉంది అంటున్నారు కానీ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అని బోరుమన్నాడు  . మన వాడు అయిష్టంగా వచ్చాడు, అయినా ఇంద్రహాస్  ఏం చెప్తాడో అయిష్టం గానే వింటున్నాడు .

ఇంద్రహాస్ నవ్వి .. "తెలుగు పాట అన్నారు కదా అని నీకు వచ్చిన తెలుగంతా ఉపయోగించేస్తే ఎలాగయ్యా!
అసల నన్నడిగితే తెలుగు పాట రాయడానికి తెలుగే  అక్కర్లేదు , తెలివీ అక్కర్లేదు , ఊహ అక్కర్లేదు , వ్యాకరణం అక్కర్లేదు.. కాకపోతే కిటుకు తెలియాలి .. కాన్ఫిడెన్స్ ఉండాలి .. ఉత్తరం ముక్కో, ఇంటి పద్దో రాసినా అదొక మహా కావ్యం లాగ ప్రెసెంట్ చెయ్యగల కాన్ఫిడెన్స్ .. నువ్వు రాసేది ప్రతీది కావ్యం లా ముందు నువ్వు ఫీల్ అవ్వాల"న్నాడు.


మనవాడు అయోమయంగా కొంచం ఇబ్బందిగా చూశాడు ..








ఇంద్రహాస్ అవేమీ పట్టించుకోకుండా..
కిటుకు విషయానికొస్తే ముందుగా నేనెక్కువ వాడే, హంసధ్వని గారు అతిగా ఇష్టపడే , వినగానే ఎగిరి గంతేసే లిస్టు కాన్సెప్ట్ చెప్తా ..అంటూ ఫ్లో లో చెప్పుకుంటూ పోయాడు ..

"ఇచ్చిన సన్నివేశం ఒక సెంట్రల్ థీమ్ గా అనుకో దాని మీద లిస్టు అల్లుకుంటూ పో అంతే
ఉదాహరణకి నిన్ను ఏదో పిల్లల పాట ఏదో పుట్టిన రోజుకి పాటో  రాయమన్నారు అనుకో .. అప్పుడు ముఖ్యంగా ఇచ్చేది ఆశీర్వాదం , తీసేది  దిష్టి . ఇందులో ఏదో ఒకటి తీసుకుని .. అల్లెయ్యడమే "

ఒక్కొక్కళ్ళ ఆశీర్వాదం అలా ఉండాలి ఇలా ఉండాలి అప్పుడు ఉండాలి ఇప్పుడు ఉండాలి అని రాసుకుంటూ పొతే అయిదారు పేజీలు అవుతుంది .. చిన్న పాట  అనుకో ముఖ్యమైన వాళ్ళవి పెట్టు .. పెద్దది అనుకో ..వీటితో పాటు ప్రకృతివి, జంతువులవి , పక్షులవి కూడా కలుపు ..అంతే ... నేనెన్ని రాయలేదు ఇలా ..లిస్టు కాన్సెప్ట్ తో రాసినవన్నీ చెబితే ఒక దర్శకచంద్రుడి సినిమా పాటలకి (కనీసం పదయినా  ఉంటాయి కదా) సరిపోయేంత  లిస్టు అవుతుంది .

నేను చెన్నై మొగుడు సినిమా నించి నిన్న యమునోత్రి నేటి కేదార్నాథ్ సినిమా వరకూ ఈ టెక్నిక్కే వాడాను ..

మనవాడి  ముఖ కవళికలు ఇబ్బంది లోంచి కోపం లోకి పరిణతి చెందుతున్నాయి ..
ఇంద్రహాస్ మాత్రం అంతులేని తన పాటలా .. అదే పనిగా చెబుతున్నాడు ..

అదే దేశం మీద రాయమన్నారు అనుకో ..
ఒక రెండు మూడు నెలల పేపర్లు తిరగేసి ముఖ్యాంశాలు పట్టుకో .. వాటికి  నీకు తెలిసినవి కలిపి .. బావోలేని విషయాలైతే దేశం అంటే అది కాదు అని  రాసేయ్ ..మంచి విషయాలనుకో దేశమంటే అదే అని రాసేయ్ ..ఫినిష్ .
మన హంసధ్వని గారి ట్యూన్ వేయించి ఏ బాలూ  చేతో  పాడిస్తే అవార్డు సాంగ్ అయి కూర్చుంటుంది ..

నేను మొన్న వ్రాసిన  "సయ్యంది పాదం" సినిమా పాట వినలేదా .అది అలా రాసిందే ..

ఒక్కోసారి ఈ మాత్రం కూడా అవసరం ఉండదు. మాస్ పాట రాయమన్నారు అనుకో .. నీ ఇష్టం .. ఒక మంచి నాటు పదం పట్టుకో దానికి అంత్య ప్రాస పెట్టుకుంటూ పో .అంత్యప్రాస అంటే అదే రైమింగ్.. అది  ఉంటే చాలు ఆంధ్ర జ్యోతి ఆర్టికల్ ని కూడా అందమైన పాటగా ట్యూన్ కట్టేస్తారు మన హంసధ్వని గారు, అందులో ఈ మధ్య ఆఫ్రికా, అంటార్క్టికా, నార్వీజియన్ , ఐస్లాండిక్ ఆల్బమ్స్ కూడా వదిలిపెట్టకుండా వింటున్నారు. చేతిలో మన వాళ్ళు కాపీ అని కనిపెట్టలేని బోలెడు ట్యూన్స్ ..

గుడ్డి , బడ్డీ , బుడ్డీ , వడ్డీ ..; ఈక - మేక - తోక - పాక ..ఇలా అన్నమాట .. నావి ఇలా ఎన్ని సూపర్ డూపర్ హిట్లు అవ్వలేదు ..కావాలంటే అప్పట్లో నేను వృషబాద్రి సినిమాకి రాసిన పాట ఇంకో పది సార్లు విను .

మనవాడి ఫ్రెండ్ కి కూడా ముఖం శాంతం నించి బీబత్సానికి మారిపోయింది .

ఇంద్ర హాస్  మాత్రం  ఇంకా అద్భుతం (రసం )  లోనే ఉన్నాడు .

కవితకి కాదేది అనర్హం అని ఊరుకున్నాడు కానీ శ్రీ శ్రీ .. పాటకు కూడా అది వర్తిస్తుంది ..నేను ఈ విషయం లో ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను ..పాటలు కట్టాను పాడాను ... కేవలం తిట్లు బండ బూతులతో  ఒక పొడవాటి పాట రాశాను.. ఒకటో నెంబర్ ఓబులేసు సినిమాకనుకుంటా ..  అది ఒక ట్రెండ్ సెట్ చేసి .. హీరో హీరోయిన్లు అలాగే పిలుచుకోవడం ఫాషన్ అయ్యి .కూర్చుంది . ఇది టి వి లకి కూడా పాకి ఇప్పుడు తెలుగు మాటలకంటే తిట్లు ఎక్కువ వినపడ్తున్నాయి ఎక్కడవిన్నా . మరి అదంతా నా ప్రతిభే ..

ఇంద్రహాస్ ఇంకా ఏదో చెప్పేలోపే  పాటల గురించి పెద్దగా తెలియని  మనవాడి ఫ్రెండ్ కి కూడా అసహ్యమేసి ..
గబాలున లేచి ,  "కోడ్తే దిమ్మ దిరిగి బొమ్మ కనపడుతుంది" అన్నట్టు లుక్కిచ్చ్చి మనవాడితో  కలిసి బయటకి వచ్చేసాడు ..

తొలాట ఇంటర్వెల్ బ్లాక్ దగ్గరే శుభం కార్డనుకుని వెళ్ళిపోతున్న ప్రేక్షకులను చూసిన తొలి సినిమా దర్శకుడిలా బిక్క మొహం వేశాడు, బాధగా చూశాడు .. వెంటనే .మనసులో బాధ యెదలో దురద మట్టిలో బురద అది గోక్కో ఇది కడుక్కో అని ఏదో పాట తట్టింది .. హంసధ్వని కి ఫోన్ కొట్టి ..మూతి అదోలా పెట్టి పాడడం మొదలు పెట్టాడు ..

(...చదివే వాళ్ళు ఉంటే ఇంకా ఉంటుంది ..)

Thursday, February 14, 2013

వాలెంటైన్స్ డే


ఆర్చీస్ లో 
అటు చూస్తే టెడ్డీ బేరూ ఇటు చూస్తే తాజ్ మహలు 
ఏది కొనాలో సమస్య తగిలిందొక యువ ప్రేమికుడికి 

ఆమెని 
స్పైస్ జెట్ లో గోవా కో 
లాంగ్ డ్రైవ్ లో కూర్గ్ కో 
తేల్చుకోలేని సమస్య ఒక నవవరుడికి 

ఆవిడతో 
మల్టీప్లెక్స్ లో మహేష్ సినిమా కో 
ఒహ్రీస్ లో డిన్నర్ బఫేకో 
ఎటు పోవాలో సమస్య కలిగిందొక మధ్య వయస్కుడికి 

ఆయన కిష్టమైన అల్లం ఉప్మా? నాకు నచ్చే పూరీ కూరా? 
ఆవిడ చూసే వసంత కోకిలా నే చూసే టి వి న్యూసా 
ఆలోచించే సమస్య లేదు ఆ వృద్ధ మిథునానికి 



శ్రీ శ్రీ గారికి క్షమాపణలతో