Showing posts with label కబుర్లు. Show all posts
Showing posts with label కబుర్లు. Show all posts

Sunday, January 3, 2010

కబుర్లు - జనవరి 3, 2010


ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.
ఈ న్యూ ఇయర్స్ ఈవ్ మనం చేసుకోవడమేంటి అని ఒక్కొక్క సారి అనిపించినా, మిగతావన్నీ (క్యాలెండర్, పుట్టిన రోజు ఆంగ్ల తేదీ ప్రకారం జరుపుకోవడం, కొన్ని అలవాట్లు)  ఓన్ చేసుకున్నప్పుడు ఇది మాత్రం వదిలి పెట్టడం ఎందుకని నాకనిపిస్తుంది. ఇలా ఫిక్స్ అయ్యి ప్రతీ యేడూ  శక్తి కొలదీ :) బానే జరుపుకుంటున్నాం  ఇది కూడా.
ఇక ఈ మధ్య  త్రీ ఈడియట్స్   సినిమా చూసాను. అద్భుతంగా ఉంది. మున్నా భాయి, లగే రహో మున్నా భాయి  తీసిన రాజ్కుమార్ హిరాణి హైప్   కి తగ్గ (ఇంకా చెప్పాలంటే దాని కంటే ఎక్కువ ) సినిమాని అందించాడు.ఆమిర్ ఖాన్ సినిమా సినిమాకి తనలోని నటనని సాన బెట్టే విబిన్నమయిన పాత్రలు చేస్తూ తనకు పోటీ ఎవరూ లేరని నిరూపిస్తున్నాడు. ఇక సినిమా చేతన్ భగత్ నవల ఫైవ్ పాయింట్ సంవన్ (Five Point Someone) ఆధారంగా తీసినది. ఆ నవల నాకు బాగా నచ్చిన వాటిలో ఒకటి.నవలని  సినిమా లోని  ప్రధాన పాత్రలు, కొన్ని సన్నివేశాలు, కొంత కథ వరకే వాడుకున్నారు. ఆ పైన అంతా  రాజ్కుమార్ హిరాణి రచనా పటిమ, దర్శకత్వ ప్రతిభే. భారతీయ విద్య విధానంలో కొట్టొచ్చినట్టు కనిపించే లోపాలు ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా చెప్పే కథ. ఆ ముగ్గురిలో ఒకడు మిగతా ఇద్దరి జీవితాలను  ఎలా ప్రభావితం చేసాడు, వారితో పాటు తోటి విద్యర్తులని ఎలా ఆకట్టుకున్నాడో ,వారి కాలేజీ డీన్ ని ఎలా మార్చాడు  అన్న విషయాన్ని    తనదయిన శైలిలో  మంచి కథనం తో,  మంచి హాస్యంతో,  హృద్యంగా మలిచాడు హిరాణి.
ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి వాళ్ళకిచ్చిన  పాత్రలలో పరకాయ ప్రవేశం చేసారు.  బోమన్ ఇరానీ ఎప్పటిలాగే చించేసాడు.    శంతను మొయిత్రా  సంగీతం చక్కగా సమకూర్చాడు. ముఖ్యంగా నాకు "बहती हवा सा था वो ", Give me some Sunshine (ఈ పాట గురించి నీ రాసిన టపా ఇక్కడ చూడచ్చు)  చాలా చాలా నచ్చాయి. ఎటొచ్చి(సినిమా టైటిల్స్ లో ) చేతన్ భగత్ క్రెడిట్ మీద  జరుగుతున్న గొడవ చూస్తే విదు వినోద్ చోప్రా, అతని తో పాటు హిరాణి కూడా అతి చేసారనిపించింది. ఈ విషయం లో  ఇక్కడ  చెప్పింది నిజమనిపించింది.
గత వారాంతం Los Angeles కి వెళ్లాం. క్రిస్మస్ వారాంతమేమో జనం జాతర లా ఉన్నారు. ఒక  రోజు యూనివర్సల్ స్టూడియోస్ కి , ఇంకొక రోజు డిస్నీ కి వెళ్లాం. మొదటిది బానే పూర్తీ చేసాం కానీ, డిస్నీ మాత్రం సగం కూడా చూడటం కుదరలేదు. విపరీతమయిన జన ప్రవాహం, ఎక్కడ చూసినా పొడవాటి క్యూలూనూ. ఇంకెప్పుడూ వారంతం అందులో ఇలాటి పొడవు వారంతం (long weekend :))  లో వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం. చాలా మంది డిస్నీ వరల్డ్, కాలిఫోర్నియా అడ్వెంచర్ (రెండు పార్క్లు ఎదురెదురుగా ఉంటాయ్, ఒకే  టికెట్ కూడా తీసుకోవచ్చు)   రెండూ చూడటానికి రెండు రోజులుండాలి అంటారు కానీ సరిగ్గా ప్లాన్ చేస్తే ఒక్కరోజులో ముగించచ్చు అనిపించింది. కాకపోతే కాస్త పెందరాడే వెళ్ళాలి. వీటిలో మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఐతే రెండు షోస్ (ఏడింటికి ఒక పార్క్ లో ఎనిమిదింటికి ఒక దాంట్లో అనుకుంటా) , ఇండియానా జోన్స్, స్ప్లాష్ మౌంటైన్, సోరింగ్ ఓవర్ కాలిఫోర్నియా , టవర్ అఫ్ టెర్రర్, స్పేస్ మౌంటైన్ తప్పకుండా చూడాల్సినవి.
ఈ రోజు ఒక మంచి కార్యక్రమం చూసా టీవీ 9 లో. మీరు సరిగ్గానే విన్నారు టీవీ ౯ లోనే. అరుణ్ సాగర్ గారి "మేల్ కొలుపు" మీద పుస్తక సమీక్ష . నాకు టీవీ ౯ వారు   ఇలాటి కార్యక్రమాలు  కూడా చేస్తారని తెలియదు. ఇంతకు ముందు  ఈ పుస్తకం గురించి పుస్తకం డాట్ నెట్ లో కత్తి మహేష్ గారు రాసినది చూసా. ఈ కార్యక్రమం కూడా చూసాక ఎలాగయినా చదవాలనిపించింది.  తనికెళ్ళ భరణి గారు అద్భుతంగా  చెప్పారు ఈ పుస్తకం గురించి. హోస్ట్ బద్రి కాకుండా కొంచం పుస్తక పరిజ్ఞానం ఉన్న వాళ్ళైతే   (అసలు  టీవీ ౯ లో ఉంటే ) ఇంకా బావుండేది.
ఈ మధ్య ఒక బ్లాగ్మిత్రుడి పుణ్యమా అని నేను శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారి మార్గదర్శి , వడ్లగింజలు చదువుతున్నాను. త్వరలో నా ఆ  అనుభూతి  (శ్రీపాది వారి కథలు చదవలేం అనుభవించాలి అంతే ) గురించి రాయాలని ఉంది.  అన్నట్టు పద్యాలంటే చెవి కోసుకునే వాళ్ళకి , రాయాలని ఉత్సాహ పడేవాళ్ళకి ఆంధ్రామృతం అనే ఒక అద్భుతమయిన బ్లాగ్ నిర్వహిస్తున్నారు మా రామకృష్ణ మాష్టారు. బ్లాగ్లోకంలో ఈయన చిరపరిచితులనుకోండి. పద్యాలంటే ఆసక్తి ఉన్నవారు ఎవరన్నా  పొరపాటున మిస్ అయ్యి ఉంటే  తప్పక చూడాల్సిన బ్లాగ్ ఇది .    




Monday, November 9, 2009

కబుర్లు - నవంబర్ 9


నిన్న టీవీ 9 లో స్టార్ నైట్ చూస్తూ కూర్చున్నాం. తెలుగు సినిమా పరిశ్రమ కి పెద్ద దిక్కు (అని ఆయనే చెప్పుకునే) దాసరి నారాయణ రావు గారు ఒంటి చేత్తో కార్యక్రమాన్ని సజావుగా జరగనివ్వకుండా చేసారు. మైక్ చేతిలో ఉంటె ఆయన భూమ్మీద ఉండరు కదా. ఆయన ఇంగ్లీష్ వింటే మనసు పులకించింది. మైదకూరు  లో స్కూల్  పిల్లలకి I never speak in Telugu అని  పలక మెడలో వేసినట్టు, ఈయనకి  I will never speak in English  అని మెడలో వేయించాలనిపించింది. సంగీత విభావరులు బానే ఉన్నాయి కానీ, మధ్య మధ్య లో దాసరి గారు, జస్ట్ వన్  సాంగ్, థాంక్స్ యు అని వాళ్ళని కట్ చెయ్యడం చాలా బాధేసింది. సభ మర్యాద కూడా లేకుండా, పాడుతుంటే  మధ్యలో ఆపెయించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

సుశీల గారి జనని శివకామిని పాటతో మొదలు పెట్టారు కార్యక్రమాన్ని. సుశీల గారు పాడడానికి కొంచం కష్టపడ్డారు. ఆవిడ  గొంతు ఉన్నంత నిండుగా ఇంకెవరిదీ లేదు ఆ స్టేజి మీద (బయట  కూడా)  . ఆవిడ కూడా లత గారి లాగా ఇంకొన్నాళ్ళు పాడగలిగి   ఉంటే ఎంత బావుండేదో అనిపించింది.  సుశీల గారి పాట  తరువాత కోటి, కీరవాణి, మణిశర్మ తదితరులు  సంగీత విభావరి కొనసాగించారు.

కీరవాణి గారు 'బంగారు కోడి పెట్ట సాంగ్' గురించ చెప్తూ, 'అప్ అప్ హాండ్స్ అప్' అని ఎవరూ మీలాగా అనలేకపోయారు అందుకే మీరు పాడినదే ఈ కొత్త పాటలో(మగధీర లో ) పెట్టాం అని బాలు గారికి చెప్పారు. దానికి బాలు ఇలా నేను పాడినవి పెట్టి, నన్ను పిలవడం మానేయకండి అని చురక వేసారు. నాకు నచ్చని విషయం ఏంటంటే, తెలుగు లో కొన్ని పాటలని పాడడానికి అనర్హాం ( సూపర్ లో  మిల మిల మెరిసిన కనులకి  పాట గురించి క్లాసు పీకరులెండి ఒక షో లో ) అన్న రీతిలో తిట్టిపోసిన బాలు గారు  బంగారు కోడి పెట్ట పాటని అదేదో కీర్తన లాగ పోటి పడి మరీ పాడారు. అప్పట్లో (ఒరిజినల్ పాడిన టైం లో ) ఐతే వేరే విషయం అనుకోండి. ఇప్పుడు కూడా (స్టార్ నైట్) లో పాడవలసిన అవసరమేముంది.

దేవిశ్రీ ఎప్పటిలాగే పాడలేకపోయినా హడావుడి చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దేవిశ్రీ పెద్ద గాయకుడు కాదు కానీ మాంచి స్టేజి పెర్ఫోర్మేర్. ఊపు తీసుకొస్తాడు ఏ  షో లో అయినా సరే. Excuse me Mr. Mallannaa పాటని  సుహాసిని చాలా బాగా పాడింది. అల్లు అర్జున్, దేవి శ్రీ , మమత మోహన్దాస్ డాన్స్ కూడా బావుంది.  ఇంకోటి విద్యాసాగర్ గారు  ఈ విభావరి లో కనిపించలేదు. కారణాలు నాకు తెలియవు   కానీ, తమిళులు ఎంతో గౌరవించి, అవకాశాలు ఇచ్చే ఆయనని   మన తెలుగు సినిమా వాళ్ళు ఎందుకు పట్టించుకోరో నాకర్థం కాదు.

ఆ తరువాత డాన్స్ లు,  స్కిట్లు చాలానే ఉన్నాయి. ఒకటి రెండు తప్ప స్కిట్లు పెద్ద గొప్పగా లేవు. కుక్క- టి వి ఛానల్  మీద స్కిట్ కొన్ని బ్లాగ్లలో  చదివిన టపాకి  దగ్గరగా  ఉన్నా బానే నవ్వించింది.  భువన విజయం స్కిట్ మిస్ అయ్యాను. కార్యక్రమం చివరిలో దాసరి ఇదే అదును చూసుకుని, మోహన్ బాబు ని, బాల కృష్ణ ను బాగా  ఎత్తేసారు. మోహన్ బాబుకి మైక్, మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం  నన్ను చాలా నిరశాపరించింది  . వజ్రోత్సవాలలో లాగ ఆయన కొంచం వేడి పుట్టిస్తే బావుండేది. చాలా రోజులు చెప్పుకోడానికి. ఇంకొక విషయం గమనించాను. రజనీ కాంత్ ప్రత్యేక అతిధి గా  హాజరు అయ్యారు. ఆయన వచ్చేసరికి రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున  ఒక చోట కూర్చుని ఉన్నారు. రజని కాంత్ రాగానే, గౌరవంగా నాగార్జున లేచి ఆయన సీట్ ఇచ్చి వేరే చోట కూర్చున్నారు.అక్కడే ఉన్న రామ్ చరణ్ లేచి ఆయనకు గౌరవం ఇచ్చి వేరే చోట కూర్చవాలన్న ఇంగిత గ్న్యానం లేదేంటా అనుకున్నాను. అయినా ఒక పక్కన అల్లు అర్జున్ వాళ్ళ వయసు వాళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తుంటే పెద్దవాళ్ళ దగ్గర రామ్ చరణ్ కూర్చోవాల్సిన అవసరం ఏంటి? చూడబోతే ఈయన కూడా పెద్దగ కలవదేమో ఎవరోతోనూ. చిరంజీవి ఉన్నంత సేపు ఏదో తప్పక వచ్చినట్టు కూర్చున్నారు. నాకైతే మోహన్ బాబు ఎప్పుడు వచ్చి ఏమంటాడో అన్న కంగారు తో కూర్చున్నవాడిలా అనిపించారు. మహేష్ బాబు ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి కూడా రాలేదు. ఊరంతా ఒక దారయితే ఉలిపిగడ్డ దొక దారని అసల ఎక్కడా దర్శనమివ్వడు బాబు. మహేష్ బాబు కి  బొత్తిగా PR లేదు(లేవు).

ఈ రోజు రామ్ గోపాల్ వర్మా  'అజ్ఞాత్'  అనే కళాఖండం చూసి తరించాను. పచ్చగా ఉన్న అడవి, పిచ్చి పిచ్చి శబ్దాలు, నితిన్ సిక్స్ ప్యాక్ , నిషా కొఠారి (ఇప్పుడు ప్రియాంక ఏమో) ఎక్ష్పోసింగ్  తప్ప సినిమాలో ఏం లేదనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్  చెత్తగా ఉంది (అజ్ఞ్యాత్ ౨ కి ట్రైలర్  లాగా ). డైరెక్టర్ ప్రేక్షకులు  ఫూల్స్ అని అస్స్యూం  చేసుకుని తీసినట్టు ఉంది (నిజానికి అతను లాభ నష్టాలు, ఆడియన్స్ ఇష్టైష్టాలు  అవన్నీ పట్టించుకోడుట. తనకి నచ్చింది తీసేస్తాడుట) . రామ్ గోపాల్ వర్మ కి ఎప్పుడూ చూడనంత భయానకమయిన  అడవి శ్రీ లంక లో కనపడిందిట. అందుకని ఒక సినిమా తీసేసి మన మీదకి వేదిలేసారు. పోనీ భయపెట్తిందా అంటే అదీ లేదు. నేను రామ్ గోపాల్ వర్మ అభిమానినే అలా అని ప్రతీ చెత్త సినిమాను సమర్థించాను  . ఈ సినిమాకిచ్చిన హైప్ కి హాల్ లో చూద్దాం అనుకున్నా కానీ US  లో రిలీజ్ కాలేదు అదృష్టవశాత్తు.

లాస్ట్ వీక్ హాలోవీన్ కి పిల్లలోస్తారేమో లైట్స్ పెట్టి,  క్యాండిలు అవీ  రెడీ గా  పెట్టుకున్నాం. ఒక్కళ్ళూ రాలేదు. గత యేడాది బోలెడు మంది  పిల్లలు వచ్చారు. ఈ సారేంటో అసల రాలేదు.  వస్తే బోలెడు ఫోటోలు తీద్దాం అనుకున్నా.  కాలిఫోర్నియా లో చలి బానే పెరిగింది.  థాంక్స్గివింగ్ దగ్గర పడుతోంది కదా.  సాయంత్రం కూడా ఇంటి దగ్గరే ఉండాల్సోస్తోంది యాక్టివిటీ ఏం లేకుండా. ఇంక పాపం ఈస్ట్ కోస్ట్ వాళ్ళ పరిస్తితి ఏంటో.

అన్నట్టు  మా ఫ్రెండ్స్ హాలోవీన్ కని ఈ స్కేరీ వీడియో పంపారు.చూసి భయపడకుండా ధైర్యంగా ఉన్నవాళ్లు చెయ్యి  ఎత్తండి.
భయపడినవాళ్ళు కామెంటండి.


Monday, November 2, 2009

ఇవీ సంగతులు - నవంబర్ 2



కార్తీక మాసం అనగానే తెలియని ఆనందం కలుగుతుంది నాకు . ఇండియా లో ఉంటే ఈ మాసం లో ప్రతీ సోమవారం ఉదయాన అభిషేకం, ఉపవాసం భలే ఉండేది. నాకు కార్తీక మాసం మొత్తం పండగ లా అనిపించేది. ముఖ్యంగా ఉపవాసం ఉన్నప్పుడు, సాయంత్రం వరకు వేచి వేచి తినడం భలే ఆనందం గా ఉండేది. (అన్నట్టు ఉపవాసం అంటే దగ్గరగా (ఉప ) ఉండటం (వాసం) దేవుడికి దగ్గరా ఉండటంట). అందులో కార్తీక మాసం లో ఉదయాన చలి ఎక్కువగా ఉంటుందేమో, ఆ చలిలో తెల్లవారకుండా తల స్నానం, సూర్యుడి తొలి కిరణాలు కూడా రాకుండా గుడి వరకు నడక, గుడిలో అభిషేకం, అది అయ్యాక అప్పుడప్పుడే వస్తున్నా వెచ్చని కిరణాల వేడికి చలి కాచుకుంటూ ఇంటికి రావడం, శివ స్తుతి వినడం, సాయంత్రం వరకు ఉపవాసం చేసి, సాయంత్రం పూజ చేసి, చంద్రుణ్ణి , నక్షత్రాలని చూసి, వేడి వేడి పులిహోర, కంద బచ్చలి కూర (నాకు ఇదంటే ప్రాణం) తినడం - ఒక చక్కని అనుభూతి. దీంట్లో ఏది తక్కువైనా అసంపూర్ణంగా ఉన్నట్టు అనిపించేది (ముఖ్యంగా కందా బచ్చలి :) ). ఇక్కడికొచ్చాక ఉపవాసం ఐతే కుదురుతోంది కాని, మిగతావన్నీ కష్టమే. అయినా వీలున్నంత లో చేసి మమ అనిపిస్తున్నాం. ఇక ఇవి కాకుండా, వన భోజనాలు. ఈ సారి కనీసం దీనికైనా ప్లాన్ చెయ్యాలి మేము.  

మధ్య టివి పెడితే (తెలుగు చానళ్ళు ) తెగ చిరాకోస్తోంది. ఒకటి రెండు మినహా అన్ని కార్యక్రమాలు కాంపిటీషన్ - ఎలిమినషన్ - డేంజర్ జోన్ లేదా డబ్బు- సినిమాలు. నిన్న యు ట్యూబ్ లో మాల్గుడి డేస్ కంట పడింది. అది చూస్తే చిన్నప్పుడే, ఒక్క డి డి ఉన్నప్పుడే ఎంత మెరుగ్గా ఉన్నాయి కార్యక్రమాలు అనిపించింది. దానికి తొడు నిన్న నాకు తెలిసిన ఓ బ్లాగ్ లో వీటి గురించి చదువుతుంటే చిన్నప్పటి వన్నీ మరీ ఎక్కువగా గుర్తొచ్చి నెమరు వేసుకుంటున్నాను. వారాంతం లో వచ్చే సినిమా కోసం వేచి చూడడం, శుక్రవారం ఐతే చిత్రలహరి, బుధవారం చిత్రహార్, ఆది వారం రంగోలి. ఇంకా సురభి, ఉడాన్, తెహ్కికాత్, గుల్ గుల్షన్ గుల్ఫా, చాణక్య, మహాభారత్, రామాయణ్ ఇలా బోలెడు, అన్ని చూసి ఆనందించగలిగేవే. ఆఖరికి మధ్యలో వచ్చే యాడ్స్ కూడా చాలా చక్కగా ఉండేవి . ముఖ్యంగా ఏక్ తిత్లీ, మిలే సుర్ మేరా ఇప్పుడు చూసినా ఎంత బావున్నాయో అనిపిస్తాయ్.పుట్ట గొడుగుల్లా వస్తున్నా చానల్స్, హాయిగా చూడగల కార్యక్రమాలు అసల లేవనిపిస్తుంది. ఉప్పెక్కువై రుచి చెడినట్టు, చానల్స్ ఎక్కువై నాణ్యత పోయింది.





నిన్న మై కజిన్ విన్నీ అనే ఒక సినిమా చూసాను. పేరు కూడా వినలేదు ఇంతకూ ముందెప్పుడూ నేను. మిత్రుడొకడు మరీ మరీ చెప్తే చూసాను. భలే ఉంది. ఆద్యంతమూ హాస్యం, అలా అని కథ, కథనం గాలికి వదిలెయ్యలేదు. చిన్న కథ, ఆసక్తికరమైన కథనం. చిన్న దొంగతనం చేసిన ఇద్దరిని పొరపాటున హంతకులనుకుని అరెస్టు చేస్తారు. వాళ్ళలో ఒకడి కజిన్ (విన్నీ) ని అటార్నీ కింద పెట్టుకుంటారు. అతని చేష్టలు, జడ్జి కి అతనికి మధ్య కోర్టు సన్నివేశాలు, అతను పడే పాట్లు, చేసే ఫీట్లు - ప్రతీ సీన్ భలే నవ్వు తెప్పిస్తుంది . చివరికి కేసు ను వాదించడం కూడా చాలా బాగా చిత్రీకరించాడు దర్శకుడు . కుదిరితే తప్పక చూడండి.తరువాత మీరే ఇది ఎలా మిస్ అయ్యానా అనుకుంటారు.
ప్రస్తుతానికి ఇంతే సంగతులు. మళ్ళీ కలుద్దాం.
P.S. ఈ టపాకి (ఇక పై ఈ బ్లాగ్ లో ఈ క్రమం లో, ఈ పేరుతొ వచ్చే టపాలకి) కొత్తపాళీ గారి కబుర్లు ప్రేరణ. ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు.