Showing posts with label సినిమాలు. Show all posts
Showing posts with label సినిమాలు. Show all posts

Tuesday, February 26, 2013

తెలుగు పాట వ్రాయడం ఎలా For Dummies


ఈ టపా లోని పాత్రలు , పాటలు , పేర్లు ఎవరినో ఉద్దేశించినవే అని మీకు అనిపిస్తే మీకు కనీస తెలుగు సినిమా నాలెడ్జ్ ఉన్నట్టే 


ఒక్క ఛాన్స్ వస్తే చాలు తనేంటో నిరూపించేసుకుని, సినిమా క్రెడిట్స్ లో పాటలు అన్న మాట కింద తన పేరుని చూసేసుకుని, సింగల్ కార్డ్ గా ఎదిగి , తెలుగు గేయ రచయితగా స్థిర పడిపోవాలని పగటి కలలు కంటున్నాడు మన వాడు (రాత్రి రాతలతో నిద్ర లేక పొద్దున్నే పడుకుంటున్నాడు మరి ) . ఒకడు  చేసేది ఏదైనా, అందులో వాడి భవిష్యత్తు ఉన్నా లేకపోయినా  వాడిని ప్రోత్సహించే స్నేహితుడు ఒకడు ఉంటాడు.  అలాటి వాడే మనవాడి స్నేహితుడు ..  మన వాడి బాధ చూడలేక ఎవరెవరివో కాళ్ళు , గడ్డం, చేతులు , మెడ   పట్టుకుని ప్రముఖ గేయ రచయిత ఇంద్ర హాస్ అపాయింట్ మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళాడు .

అప్పుడే  నోకియా వరస్ట్ సింగర్  కార్యక్రమం గ్రాండ్ సెమీ క్వార్టర్ ఫైనల్ షూటింగ్ ముగించుకుని వస్తున్నారు ఇంద్ర హాస్. అమెరికా టూర్ వెళ్ళినపుడు తెచ్చుకున్న ఆబర్కాంబీ టీషర్టు చూసి ఆయనే అని నిర్దారించుకున్నాడు మన వాడి ఫ్రెండ్ .

ఆయన్ని కలిసి మా వాడు గీత రచయిత గా ప్రయత్నాలు చేస్తున్నాడు  సార్ . అందరూ వీడి పాటలు బావున్నాయి అంటున్నారు కానీ ఎవరూ తీసుకోవట్లేదు ..  బోలెడు భవిష్యత్తు ఉంది అంటున్నారు కానీ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అని బోరుమన్నాడు  . మన వాడు అయిష్టంగా వచ్చాడు, అయినా ఇంద్రహాస్  ఏం చెప్తాడో అయిష్టం గానే వింటున్నాడు .

ఇంద్రహాస్ నవ్వి .. "తెలుగు పాట అన్నారు కదా అని నీకు వచ్చిన తెలుగంతా ఉపయోగించేస్తే ఎలాగయ్యా!
అసల నన్నడిగితే తెలుగు పాట రాయడానికి తెలుగే  అక్కర్లేదు , తెలివీ అక్కర్లేదు , ఊహ అక్కర్లేదు , వ్యాకరణం అక్కర్లేదు.. కాకపోతే కిటుకు తెలియాలి .. కాన్ఫిడెన్స్ ఉండాలి .. ఉత్తరం ముక్కో, ఇంటి పద్దో రాసినా అదొక మహా కావ్యం లాగ ప్రెసెంట్ చెయ్యగల కాన్ఫిడెన్స్ .. నువ్వు రాసేది ప్రతీది కావ్యం లా ముందు నువ్వు ఫీల్ అవ్వాల"న్నాడు.


మనవాడు అయోమయంగా కొంచం ఇబ్బందిగా చూశాడు ..








ఇంద్రహాస్ అవేమీ పట్టించుకోకుండా..
కిటుకు విషయానికొస్తే ముందుగా నేనెక్కువ వాడే, హంసధ్వని గారు అతిగా ఇష్టపడే , వినగానే ఎగిరి గంతేసే లిస్టు కాన్సెప్ట్ చెప్తా ..అంటూ ఫ్లో లో చెప్పుకుంటూ పోయాడు ..

"ఇచ్చిన సన్నివేశం ఒక సెంట్రల్ థీమ్ గా అనుకో దాని మీద లిస్టు అల్లుకుంటూ పో అంతే
ఉదాహరణకి నిన్ను ఏదో పిల్లల పాట ఏదో పుట్టిన రోజుకి పాటో  రాయమన్నారు అనుకో .. అప్పుడు ముఖ్యంగా ఇచ్చేది ఆశీర్వాదం , తీసేది  దిష్టి . ఇందులో ఏదో ఒకటి తీసుకుని .. అల్లెయ్యడమే "

ఒక్కొక్కళ్ళ ఆశీర్వాదం అలా ఉండాలి ఇలా ఉండాలి అప్పుడు ఉండాలి ఇప్పుడు ఉండాలి అని రాసుకుంటూ పొతే అయిదారు పేజీలు అవుతుంది .. చిన్న పాట  అనుకో ముఖ్యమైన వాళ్ళవి పెట్టు .. పెద్దది అనుకో ..వీటితో పాటు ప్రకృతివి, జంతువులవి , పక్షులవి కూడా కలుపు ..అంతే ... నేనెన్ని రాయలేదు ఇలా ..లిస్టు కాన్సెప్ట్ తో రాసినవన్నీ చెబితే ఒక దర్శకచంద్రుడి సినిమా పాటలకి (కనీసం పదయినా  ఉంటాయి కదా) సరిపోయేంత  లిస్టు అవుతుంది .

నేను చెన్నై మొగుడు సినిమా నించి నిన్న యమునోత్రి నేటి కేదార్నాథ్ సినిమా వరకూ ఈ టెక్నిక్కే వాడాను ..

మనవాడి  ముఖ కవళికలు ఇబ్బంది లోంచి కోపం లోకి పరిణతి చెందుతున్నాయి ..
ఇంద్రహాస్ మాత్రం అంతులేని తన పాటలా .. అదే పనిగా చెబుతున్నాడు ..

అదే దేశం మీద రాయమన్నారు అనుకో ..
ఒక రెండు మూడు నెలల పేపర్లు తిరగేసి ముఖ్యాంశాలు పట్టుకో .. వాటికి  నీకు తెలిసినవి కలిపి .. బావోలేని విషయాలైతే దేశం అంటే అది కాదు అని  రాసేయ్ ..మంచి విషయాలనుకో దేశమంటే అదే అని రాసేయ్ ..ఫినిష్ .
మన హంసధ్వని గారి ట్యూన్ వేయించి ఏ బాలూ  చేతో  పాడిస్తే అవార్డు సాంగ్ అయి కూర్చుంటుంది ..

నేను మొన్న వ్రాసిన  "సయ్యంది పాదం" సినిమా పాట వినలేదా .అది అలా రాసిందే ..

ఒక్కోసారి ఈ మాత్రం కూడా అవసరం ఉండదు. మాస్ పాట రాయమన్నారు అనుకో .. నీ ఇష్టం .. ఒక మంచి నాటు పదం పట్టుకో దానికి అంత్య ప్రాస పెట్టుకుంటూ పో .అంత్యప్రాస అంటే అదే రైమింగ్.. అది  ఉంటే చాలు ఆంధ్ర జ్యోతి ఆర్టికల్ ని కూడా అందమైన పాటగా ట్యూన్ కట్టేస్తారు మన హంసధ్వని గారు, అందులో ఈ మధ్య ఆఫ్రికా, అంటార్క్టికా, నార్వీజియన్ , ఐస్లాండిక్ ఆల్బమ్స్ కూడా వదిలిపెట్టకుండా వింటున్నారు. చేతిలో మన వాళ్ళు కాపీ అని కనిపెట్టలేని బోలెడు ట్యూన్స్ ..

గుడ్డి , బడ్డీ , బుడ్డీ , వడ్డీ ..; ఈక - మేక - తోక - పాక ..ఇలా అన్నమాట .. నావి ఇలా ఎన్ని సూపర్ డూపర్ హిట్లు అవ్వలేదు ..కావాలంటే అప్పట్లో నేను వృషబాద్రి సినిమాకి రాసిన పాట ఇంకో పది సార్లు విను .

మనవాడి ఫ్రెండ్ కి కూడా ముఖం శాంతం నించి బీబత్సానికి మారిపోయింది .

ఇంద్ర హాస్  మాత్రం  ఇంకా అద్భుతం (రసం )  లోనే ఉన్నాడు .

కవితకి కాదేది అనర్హం అని ఊరుకున్నాడు కానీ శ్రీ శ్రీ .. పాటకు కూడా అది వర్తిస్తుంది ..నేను ఈ విషయం లో ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను ..పాటలు కట్టాను పాడాను ... కేవలం తిట్లు బండ బూతులతో  ఒక పొడవాటి పాట రాశాను.. ఒకటో నెంబర్ ఓబులేసు సినిమాకనుకుంటా ..  అది ఒక ట్రెండ్ సెట్ చేసి .. హీరో హీరోయిన్లు అలాగే పిలుచుకోవడం ఫాషన్ అయ్యి .కూర్చుంది . ఇది టి వి లకి కూడా పాకి ఇప్పుడు తెలుగు మాటలకంటే తిట్లు ఎక్కువ వినపడ్తున్నాయి ఎక్కడవిన్నా . మరి అదంతా నా ప్రతిభే ..

ఇంద్రహాస్ ఇంకా ఏదో చెప్పేలోపే  పాటల గురించి పెద్దగా తెలియని  మనవాడి ఫ్రెండ్ కి కూడా అసహ్యమేసి ..
గబాలున లేచి ,  "కోడ్తే దిమ్మ దిరిగి బొమ్మ కనపడుతుంది" అన్నట్టు లుక్కిచ్చ్చి మనవాడితో  కలిసి బయటకి వచ్చేసాడు ..

తొలాట ఇంటర్వెల్ బ్లాక్ దగ్గరే శుభం కార్డనుకుని వెళ్ళిపోతున్న ప్రేక్షకులను చూసిన తొలి సినిమా దర్శకుడిలా బిక్క మొహం వేశాడు, బాధగా చూశాడు .. వెంటనే .మనసులో బాధ యెదలో దురద మట్టిలో బురద అది గోక్కో ఇది కడుక్కో అని ఏదో పాట తట్టింది .. హంసధ్వని కి ఫోన్ కొట్టి ..మూతి అదోలా పెట్టి పాడడం మొదలు పెట్టాడు ..

(...చదివే వాళ్ళు ఉంటే ఇంకా ఉంటుంది ..)

Saturday, January 12, 2013

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు


"సినిమా ఎలా ఉంది రా ?"

" రకరకాలుగా ఉంది "

"అంటే బావుందా బాలేదా "

" మరీ గొప్పగా లేదు అలా అని చెత్తగా లేదు "

"నాకైతే చాలా రోజుల తరువాత చాలా నాచురల్ గా ఉందనిపించింది . వయోలెన్స్ , అక్కర్లేని డాన్సు లు, ఐటెం సాంగ్స్ లేకుండా రొటీన్ కమర్షియల్ తెలుగు సినిమా నించి రిలీఫ్ లా ఉంది ఈ సినిమా "

" ఇవన్నీ లేకుండా కూడా ఇంకా బాగా తియచ్చు కదరా . మరీ సీరియల్ లా సాగ తీసాడు సెకండ్ హాఫ్ "



"అవుననుకో కానీ ఫస్ట్ హాఫ్  చాలా బావుంది .. బాపు సినిమా లా ఎక్కడా ఆర్భాటం లేకుండా కాస్ట్యూమ్స్ , ఇల్లు , మాటలు అన్నీ చాలా సహజంగా ఉన్నాయి .. సినిమా లో పాత్రల్లా కాకుండా ఏదో మన పక్కింట్లో జరిగే కథలా ఉంది "

" మన పక్కింట్లో ఉన్నంత సహజంగా ఉంటే పదిహేను డాలర్లు పెట్టి సినిమా హాల్ కెళ్ళి  చూడడం ఎందుకు రా., పది నిమిషాలు కిటికీ తీస్తే సరి .. పోనీ మనమంటే అలాటి వాతావరణం ఇక్కడ ఉండదు కాబట్టి పదిహేను డాలర్లు ఖర్చు పెట్టి అన్నీ గుర్తు తెచ్చుకుని  గా nostalgic గా   ఫీల్ అవ్వచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు ఈ సినిమా చూడడానికి  హాల్ కి రావడం ఎందుకు అనేడట్టు  లేదు. సినిమాకి  కాస్ట్యూమ్ డిజైనర్ కూడా పెట్టలేదేమో :)   "

" ఆహా .. హీరో కాబట్టి గుడిసెలో ఉన్నా సూట్ వెయ్యాలి అంటావ్ .. మధ్య తరగతి వాడైనా  హైటెక్స్ లో పెళ్లి చేసుకున్నట్టు , స్విస్ లో హనీమూన్ చేసుకున్నట్టు చూపెట్టాలి కదా ..

" లేకపోతె నాలాంటి కామన్ ఆడియన్ (:)) ఎలా ఎంజాయ్ చెయ్యగలుగుతాడు సినిమాని "

" ఎడిసావ్ లే ..అది సరే.. మహేష్ మాత్రం బా చేసాడు కదా. "

"మహేష్ ఇరగదీసాడెహే. అసలా ఈ మధ్య భలే చేస్తున్నాడు రా .. ఇది వరకు ఏదో ఆ ముక్కు ఎగపీల్చే ఎక్స్ప్రెషన్ తప్ప ఇంకోటి ఉండేది కాదు .మరీ చెట్టు చేమ లా ఎమోషన్స్ లేకుండా ఉండడం హీరోయిజం అనుకునేవాడు ఒక్కడు పుణ్యమా అని .. అండర్ ప్లే చేసేవాడు .ఖలేజా నించి  సినిమా హిట్ అయినా ఫట్ అయినా యాక్టింగ్ మాత్రం భలే చేస్తున్నాడు . ఈ సినిమా లో గోదావరి యాస భలే పట్టుకున్నాడు .. సినిమా నిలబడితే అది మహేష్ వల్లే . పొతే డైరెక్టర్ వల్ల  అన్నట్టుంది ఈ సినిమా .."

"సమంతా కూడా బావుంది మహేష్ పక్కన"




" సమంతా డార్లింగ్ కేకెహే.. తెగ మొద్దొచ్చేసింది .. మహేష్ కి భలే పెయిర్ రా ..  "


" మిగతా వాళ్ళు కూడా బానే  చేసారు .. వెంకీ , అంజలి .ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్ "

"
వెంకీ కి ఏడవడం సెంటిమెంట్ పిండడం వెన్నతో పెట్టిన విద్య .. బా చేశాడు .. అంజలి జర్నీ సినిమా లో అమ్మాయి కదా భలే సరిపోయింది ఆ రోల్ కి ..
ఇంక ఆ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏంటో నాకర్థం కాలేదు . అతనేం చేస్తాడో  బతకడానికి నవ్వడం కాకుండా  .. డబ్బెలా వస్తోందో  వాళ్ళకి .. ఇవన్నీ దేవుడి కెరుక .. హీరో పాత్రలు  కూడా ఏదో వాక్యూం లో ఉంటాయి  .. వాళ్ళ చదువు ఏంటి  ఉద్యోగం ఏంటి ఏదీ తెలియదు ..   ఇక మిగతా వాళ్ళంతా ఏదో వాళ్ళ పరిమితి  లో బానే చేశారు .. రావు రమేష్ మాత్రం చాలా బాగా సరిపోయాడు రోల్ కి .. అతి లేకుండా బాలెన్సడ్  గా చేసాడు .

"

" ప్రకాష్ రాజ్ క్యారెక్టకి డబ్బంటావా  ..  అమ్మాయి పెళ్లి అయ్యాక చూపిస్తాడు గా ఊర్లో వాడెవడో  ఇది నేను సెటిల్ చేస్తా అంటాడు  .. ఆ విధంగా తలొకరు సహాయం చేస్తూ ఉంటారేమో వాళ్ళ కుటుంబానికి .. ".

"ఆహా ..నాకు మరీ అంత దూరాలచన లేదు బాబు.  తెలుగు సినిమాకి కూడా అంత  ఊహించి అర్థం చేసుకోవాడం   నా వల్ల  కాదు. "

" నా ఉద్దేశ్యం వాళ్ళకి డబ్బు ఎలా వచ్చింది అనేది  పెద్ద పాయింట్ కాదు అని "

"నేనొప్పుకోను .. అదీ కాకుండా  చివర్లో కూడా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినట్టా రానట్టా  నాకర్థం కాలేదు . బామ్మకి గాజులు చేయించే డబ్బెలా వచ్చింది .. అది కూడా ఊర్లో వాళ్ళే  ఇచ్చారా   "

"వాళ్ళ మంచితనం చూసి పిల్లనిచ్చి పెళ్లి చేసి, కట్నంగా డబ్బు ఇచ్చి ఉండచ్చు కదా "

"వామ్మో ఆ డైరెక్టర్ కూడా ఇంత అలోచించి ఉండదేమో .. ఫాన్స్ ఎలా కావాలంటే అలా ఊహించుకోవచ్చు .
సో నీ లెక్క ప్రకారం నాకర్థం ఐంది ఏంటంటే సినిమా కథ ఇది - ఇద్దరు డబ్బు , ఆస్తి , ఉద్యోగాలు లేని అన్నదమ్ములు వాళ్ళ నాన్న మంచితనం తో గొప్పింటి అమ్మాయిలని లైన్ లో పెట్టి ఎలా పెళ్లి చేసుకున్నారు ..సో మంచితనం ఉంటే డబ్బు , ఆస్తి , ఉద్యోగం ఏమక్కరలేదు (కుర్రాడు మహేష్ బాబంత  అందంగా ఉండకపోయినా ) అని దర్శకుడి ఉవాచ.  "



" నువ్వు మరీ అలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేనేం చెప్పలేను "

" మరి నువ్వు అలా ఏవేవో ఊహించుకుని కథలు అల్లెసుకుంటే .. నేనేం చెప్పలేను ."

"ఎన్ని సినిమాలోస్తున్నాయ్ రా ఇలా .. ఎప్పుడు చూడు ఒకటే రకం - అయితే యాక్షన్, లేకపోతె ప్రేమ కథ . వచ్చే ఒకటీ అరా డిఫరెంట్ సినిమాలు కూడా ఆదరించకపోతే ఎలా .."

"అదే ప్రాబ్లం అయిపొయింది .. డిఫరెంట్ అని పేరు చెప్పి ట్రైలర్ లో ఊదర గొట్టేయ్యడం తీరా చూస్తే   పస ఉండట్లేదు సినిమా లో . చాలా హాలీవుడ్ సినిమాలు ట్రైలర్ కొత్త సినిమా చెత్త , అదే తరహా ఇప్పుడు బాలీవుడ్ కి మన తెలుగు కి కూడా పాకుతోంది ..ఏదో ఒక చిన్న ఐడియా పట్టుకోవడం .. దాన్ని రెండున్నర గంటలకి సరిపడా పెంచలేకపోవడం . పోనీ నిడివి తగ్గిస్తారా అంటే అదీ లేదు రెండున్నరా మూడు గంటలు ఉండాల్సిందే ..  అరగంట  అయ్యేసరికి వాళ్ళు కొత్తగా అనుకున్న ఆరు సీన్లు అయిపోతాయి  .. తరువాత ఏదో చెత్త ."

" ఫార్ములా కంటే ఇది నయం కదా .. అయినా  టాపిక్ కి Tangential గా వెళ్తున్నాం. .ఎవరైనా అడిగితే  సినిమా చూడమని చెప్తావా  చూడద్దని చెప్తావా "

"నయమే లే అందుకే పదిహేను డాలర్లు పోయినా  బాధ పడట్లేదు కదా . డైరెక్టర్ ని మూడు విషయాల్లో మాత్రం మెచ్చుకోవాలి - మంచి సాహిత్యం , చక్కని మాటలు , గుండెల్ని హత్తుకునే కొన్ని సీన్స్, ఆత్మ వంచన లేకుండా  అనుకున్నట్టు సినిమా తియ్యడం (ఇది  దిల్ రాజు సపోర్ట్ వల్ల ).
ఇక వేరే వాళ్ళకి చెప్పడం అంటావా అందరినీ  చూడమనే  చెప్తా ."

"సో అటు ఇటు గా నీకు సినిమా నచ్చినట్టే.. నువ్వు నా గ్రూప్ లోకి వచ్చినట్టే  "

"కాదెహే . నాతో   పాటు ఇంకో నలుగురు బాధ పడితే అదో తుత్తి ."

"నువ్వు మారవెహే "

"నవ్వుతాలికి అన్నా గానీ, అమృతాంజన్ రాసుకునే అంత  తలనొప్పి రాకుండా , సినిమా మధ్యలో లేచెయ్య కుండా  సినిమాని సర్వైవ్ అయ్యానంటే  .. అది ఇంకోళ్ళని   చూడమని చెప్తా. అది నా పాలిసీ .. తెలుగు సినిమాల వరకు  "

"నువ్వు ఇంకో సారి చూస్తావా మరి ."

"నీకో దండం రా సామీ ! "

"ఇంకో సారి చూసే ప్రశ్నే లేదంటావ్  "

"రెండో సగం లో ఓ సగం కత్తిరించి రెండు పాటలు తీసేసి ఓ మూడు మంచి పాటలు (రెహమాన్ వో కనీసం దేవిశ్రీ వో )  పెడితే ఇంకోసారి  డి వి డి లో చూస్తా .."

"పాటలు కొత్త బంగారు లోకం అంత బాగా ఇస్తాడ నుకున్నా ..చాలా  disappoint చేశాడు  "

" లిరిక్స్ బావున్నాయి లే .. ఓ మూడు పాటలు మ్యూజిక్  కూడా బావుంది .. ఆ వెంకీ పాట మాత్రం ఘోరమయా.. "

" అది ఒప్పుకుంటా .. కానీ వినగా వినగా బావున్నాయి రా. బహుశా సాహిత్యం వల్లేమో . నువ్వు విను నచ్చుతాయ్. నేను రేపు షో కి టికెట్స్ బుక్ చేసుకుంటున్నా .. నీకు డి వి డి వచ్చాక చెప్తా :) "

" జిహ్వకో రుచి .. మనిషికో పిచ్చి .. అలాక్కానీ .."


(Images - Courtesy: Google images, idlebrain.com )

Sunday, June 6, 2010

వేదం - ఇలాటి సినిమా తెలుగులో రాలేదు


గమ్యం సినిమా నాకు పెద్ద గొప్ప సినిమాలాగా అనిపించలేదు. కొంచం విభిన్నంగా ఉన్నఒక మామూలు సినిమా.
ఎందుకు ఈ దర్శకుడిని ఇంత ఎత్తేస్తున్నారు? బహుశా అతనికి సినిమా వాళ్లతో ఉన్న పరిచయం వల్లనేమో అనుకున్నాను. సాధారణంగా మొదటి సినిమా తో పైకెగిరి రెండవ సినిమాకి చతికిల పడే దర్శకుల్లో చేరిపోతాడేమో అనుకున్నాను. కానీ వేదం చూశాక ఇతను మంచి విషయం ఉన్న దర్శకుడు అని తెలిసింది.
అయిదు పాత్రలు, వారి కథలు ఒక చోట కలవడం. అది వారి జీవితాలని మలుపు తిప్పడం వేదం కథ అని చూచాయిగా తెలిసింది మీడియా లో సినిమా గురించి ఊదరకొట్టడం వల్ల. ఆడియో నాకు వినగానే బాగా నచ్చింది ముఖ్యంగా "మళ్ళీ పుట్టనీ", "ఏ చీకటీ" పాటలు. సాహిత్యం కూడా చాలా చక్కగా ఉంది. సరిగ్గా వాడుకుంటారా సినిమాకి అన్న అనుమానం మొదలైంది.
రకరకాల సమీక్షల  ద్వారా పాజిటివ్ టాక్ చూసి సినిమా బానే ఉంటుందిలే అనుకునే బయల్దేరాం. బే ఏరియా లో తెలుగు సినిమాకి  హాలు నిండడం, టికెట్ లు అయిపోయాయని ఇంకో ఎక్స్ట్రా షో వెయ్యడం మగధీర తరువాత ఇదేనేమో. 



సినిమా మొదలైంది. ఒక్కొక్క పాత్రని ప్రవేశపెట్టడం మెల్లగా కథని ఆవిష్కరించడం బావుంది. మనోజ్ పాత్రకి ఇంకెవరి నయినా పెట్టాల్సింది.  ఇంటర్వల్ సమయానికి బాగా తీసాడు, ఎక్కడా బోర్ కొట్టలేదు అనుకున్నాం (ఈ మధ్య ఇది కూడా కష్టం అయిపోయింది తెలుగు సినిమాలలో). ఇంటర్వల్ తరువాత ఇక కథలో లీనమయిపోయాం.క్లైమాక్స్ కి జనం నించి మంచి రెస్పాన్స్ వచ్చింది.

పాత్రలు తప్ప నటులు కనపడలేదు. ముఖ్యంగా అనుష్కా, అల్లు అర్జున్ బాగా చేశారు. అనుష్కా కి స్నేహితురాలి(/స్నేహితుడి)గా చేసిన నటుడు అద్భుతంగా చేశాడు. నాకు మధుర్ బండార్కర్ సినిమాలలో కనిపించే పాత్రలు గుర్తొచ్చాయ్. ఇంచు మించు అందరు నటులు తమ పాత్రలకి ప్రాణం పోశారు.
ఈ సినిమాకి నిజమయిన హీరో క్రిష్. ఇతను ఇలాటి కొత్త రకం తెలుగు సినిమాలు తీసి మున్ముందు కొత్త శకం తెలుగు సినిమాకి ప్రతినిధి అవుతాడని ఒక ఆశ కలిగింది. నాకు కొత్త వారిలో (గత దశాబ్దం అనుకోండి) శేఖర్ కమ్ముల, సుకుమార్, చంద్ర శేఖర్  యేలేటి  సినిమాలు నచ్చుతాయ్. కానీ  అన్నిటిలోనూ ఏదో వెలితి ఉంటుంది.    శేఖర్ కమ్ముల సినిమాలలో టెక్నికల్ గా పర్ఫెక్షన్ ఉండదు. సినిమా మాధ్యమాన్ని బాగా వాడుకుని కథని ఎలివేట్ చేసే శక్తి లేదు కమ్ములకి. సుకుమార్ టెక్నికల్ గా పెర్ఫెక్షన్ ఉంటుంది, టేకింగ్ స్టైలిష్గా  ఉంటుంది   కానీ కథ లో ఏదో లోపం , వెలితి కనిపిస్తాయ్.లేకపోతె ఏదో ఎక్కడో తేడా చేసేస్తాడు.  ఇక చంద్రశేఖర్ యేలేటి. నాకు అనుకోకుండా ఒక రోజు చూసి మైండ్ బ్లాక్ ఐంది. తెగ నచ్చింది. ఇతని సినిమాలు ప్రయాణం తప్ప అన్నీ ఇష్టం నాకు. కాకపోతే కొంచం స్లో గా ఉంటాయ్.
వేదం లో మాత్రం క్రిష్ అనీ బాగా బ్యాలెన్స్ చేసాడు అనిపించింది. టెక్నికల్ గా పేరు పెట్టడానికి ఏం లేదు. కథ, కథనం, మాటలు చక్కగా రాసాడు. ఆర్ట్ ఫిలిం లా కాకుండా కమర్షియల్ సినిమా తీసాడు కొత్త కథ అయినా. ఇలాటి సినిమాలు మున్ముందు బోలెడు వచ్చి ఆరు పాటలు ఏడు ఫైటులు, పాత చింతకాయ పచ్చాడి కథలు, తాతల నాటి కథనాల నించీ తెలుగు సినిమాలు బయటపడాలని ఆశిస్తున్నాను.

Tuesday, December 22, 2009

షిండ్లర్స్ లిస్ట్ - నా అనుభవం


                            నేను తొమ్మిదవ తరగతి లో ఉన్నప్పుడు అనుకుంటా, మా సోషల్ టీచర్ సెకండ్ వరల్డ్ వార్, హిట్లర్ గురించి చెబుతూ, వీటి మీద షిండ్లర్స్ లిస్టు అనే అద్భుతమయిన సినిమా ఉంది స్పీల్బర్గ్ (జుర్రాసిక్ పార్క్ పుణ్యమా అని ఆయన పేరు విన్నా  అప్పటికి). దాంట్లో హిట్లర్ చేసిన అరాచకం గురించి బాగా చెప్తాడు అని చెప్పినట్టు చూచాయి గా గుర్తుంది. ఎన్నో సార్లు చూద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మొత్తానికి ఆ శుభ తరుణం నిన్న ఆసన్న మయినది.
ఆంగ్ల సినిమాలు చూసే వారు ఇది మిస్ అయ్యి ఉండరు. కానీ అయి ఉంటే వెంటనే అద్దెకో, డౌన్లోడ్ చేసో, ఆఖరికి కొని అయినా చూడాల్సిన సినిమా.
కథ - రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల అరాచకత్వానికి దారుణంగా బలి అవుతున్న జూస్ తో ఒక పరిశ్రమను ప్రారంబించి  (మొదట్లో కేవలం లాభాల కోసమే) మెల్లగా వాళ్ళని ఆదుకునే నాథుడుగా  ఎదిగిన షిండ్లర్ కథ. ఒక పక్క నాజీల అరాచాకత్వాన్ని,  ఉన్మాదాన్ని, జూస్ నిస్సహాయతని, షిండ్లర్ మానవత్వాన్ని అత్యద్భుతంగా చిత్రకరించాడు స్పీల్బర్గ్.


చూస్తున్నంత సేపు ఆ సమయంలో మనమక్కడ ఉన్నట్టే, ఆ అమానుషం మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉంటుంది. ఒకసారి బాధతో కళ్ళల్లో నీళ్ళు తిరిగితే, ఒకసారి కోపంతో గుండె రగిలిపోతుంది. ఒకసారి జాలితో గుండె కరిగిపోతే, ఒకసారి మానవత్వానికి ఉప్పొంగిపోతుంది.సినిమా మొత్తం  హిట్లర్ ని, జూస్ ని ఊచకోత కోసిన నాజీలని  బతుకుంటే వెంటనే గొంతు నులుమి చంపెయ్యలనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను చూసిన, విన్న చరిత్రలో ఇంత దారుణంగా, ఎందుకు చంపుతున్నారో కూడా తెలియకుండా ఇన్ని లక్షల మందిని  చంపిన ఉదంతం లేదు. అన్నిటికంటే బాధపెట్టినవి రెండు  ప్రశ్నలు ,  ఇంత జరుగుతుంటే, ప్రపంచమంతా చూస్తూ ఎలా ఊరుకుంది. ఇంత దారుణాన్ని ఆరేళ్ళు ఎలా ఉపేక్షించింది.  ఇంత చేసినా బరిస్తూ ఎందుకు ఉన్నారు జూస్, కనీసం కొంత మంది అయినా  ఎందుకు తిరగబడలేదు (అలా తిరగ బడ్డట్టు నేను ఎక్కడ చదవలేదు).
 నన్ను కలిచివేసిన, నా గుండెలు బరువెక్కిన, నన్నింకా  haunt చేస్తున్న కొన్ని సీన్లు ఈ సినిమాలో..




  • పోలాండ్ (క్రకవ్) జూస్ అందరినీ కలిపి ఒక చిన్నపాటి  ప్రదేశంలో (ఘెట్టో లంటారు) పడేస్తారు నాజీలు. అక్కడ నించీ వారి చేత రకరకాల పనులు చేయిస్తూ ఉంటారు. ఒక సరి ఏదో ఒక నిర్మాణం జరుగుతూ ఉంటే ఒక జూ సివిల్ ఇంజనీర్ (స్త్రీ) వచ్చి నాజి కమాండర్ (అమాన్) తో అలా కడితే ఇది పడిపోతుంది. మళ్ళీ ఫౌండేషన్ వేసి కట్టాలి అని చెప్తుంది. అన్నీ కనుక్కుని అమాన్ ఆమెని కల్చేయ్యమంటాడు. ఆ స్త్రీ నేనేం తప్పు చేసాను, ఇది నా పని అంటే, అమాన్ ఆమెని షూట్ చేసి ఇది నా పని అంటాడు.
  • అమాన్ పొద్దున్నే లేచి బాల్కనీ లోకి వచ్చి వొళ్ళు  విరుచుకుంటాడు. సిగరెట్ వెలిగిస్తాడు.  ఘెట్టో దగ్గర చాలా మంది జూస్ పని చేస్తుంటారు. కూర్చుని ఉన్న  ఇద్దరు జూస్ ని షూట్ చేస్తాడు. లోపలి వచ్చి మూత్ర విసర్జన చేస్తూ పెళ్ళాం ని కాఫీ నువ్వే పెట్టు అంటాడు.  నాజీలు జూస్ ని చంపడం వారి దినచర్య లో ఎంత సర్వ సాధారనమో, వాళ్ళకి ఇది ఎంత తేలికో ఇంత కంటే బాగా ఎవరు చెప్పగలరు. 
  • షిండ్లర్ హెలెన్ అనే జూ (నాజీ కమాండర్ అమాన్ కి సేవకురాలు ) స్త్రీని ఓదారుస్తూ ఉంటాడు అమాన్ ఆమెని చంపడని. దానికి ఆమె "నాకు నమ్మకం లేదు. ఈ రోజు మేము చూస్తుండగా దారిన పోతున్న ఒకామెని గొంతులో షూట్ చేసాడు. ఆమె మిగతా వారికంటే మెల్లాగా వెళ్ళట్లేదు, తొందరగా వెళ్ళట్లేదు, ఆమె సన్నగా లేదు లావుగానూ లేదు. ఆమె చేసిందేమీ లేదు అలా వెళ్తోంది. అమాన్ నేను ఇవి పాటిస్తే  చంపడు అనుకోడానికి లేదు" అని నిస్సహాయంగా వాపోతుంది.
  • కొత్తగా వర్కర్స్ వేరే దేశాల నించీ వచ్చినప్పుడు, నాజీలకి  తోచినప్పుడు, కొందరి జూస్ ని ఏరి (కూరలు, రాళ్ళూ, రప్పలు లాగ ) ట్రైన్లలో తీసుకెళ్ళి  సెల్లలో సామూహికంగా చంపేస్తుంటారు నాజీలు (కొందరికి విషవాయువులు ఇచ్చి, కొందరిని కాల్చేసి, కొందరి మీద ప్రాణాంతక పరీక్షలు చేసి). అలా తీసుకెళ్ళే వాళ్ళని గూడ్స్ బండి లాటి దాంట్లో (గాలాడడానికి  పెట్టె మొత్తానికి ఒక చిన్న కిటికీ ఉంటుంది) పంపుతూ ఉంటారు. ఆ పెట్టెలలో గాలాడక, దాహంతో ప్రాణాలు పోయేడట్టు ఉంటుంది లోపల ఇరుక్కుని నించున్న జూస్కి . అప్పుడు షిండ్లర్ నాజీ కమాండర్ లతో మాట్లాడి, ఫైర్ హోస్ తో పెట్టలకి నీళ్ళు కొట్టిస్తాడు. ఆ కిటికీలలో నించీ, రూఫ్ నించీ  కారే నీళ్ళతో ఎండిన గొంతులు తడుపు  కుంటారు జూస్.
  • సినిమా అంతా బ్లాకు అండ్ వైట్. కానీ కొన్ని సన్నివేశాలలో ఒక పాప డ్రెస్ ని మాత్రం ఎరుపు లో చూపిస్తారు. ఎందుకో అర్థం కాలేదు. ఈ పాప బ్రతుకుందేమో  అనుకున్నాను.అలా చిన్న ఆశ కలుగుతుంది  .  చివరికి ఆ ఆశ కూడా నిరాశే అని తేలుతుంది. అక్కడున్న జూస్ బతుకుతామని  ఆశ పడడం వృధా అని నొక్కి చెప్తుంది.
  • ఇక గుండెలు పిండేసే క్లైమాక్స్. కిందామీదా నానా  తంటాలు పడి, అతి కష్టం మీద తనకున్నదంతా వెచ్చించి ఒక పదకుండు వందల    యాభై మంది జూస్ ని కాపాడతాడు షిండ్లర్. వారికి  ఏడు నెలలు పాటు తల దాచుకోడానికి చోటివ్వడానికే తన పుట్టినూరులో    ఫ్యాక్టరీని  పెడతాడు. చివరికి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి, సోవియట్ రష్యా చేతిలో నాజీలు ఓడిపోతారు. అప్పుడు ఈ జూస్ (షిండ్లర్ కాపాడిన జూస్ ) కి విముక్తి కలుగుతుంది. నాజి పార్టీ వారిని అర్రెస్ట్ చేస్తారు. ఇతను నాజీ పార్టీ వదవ్వడం వల్ల  దేశం వదిలి వెళ్ళే షిండ్లర్ ని జూస్ అందరూ  సాగానంప వస్తారు. వాళ్ళని చూసి నేను ఇంకా కొంత మందిని కాపాడుండ వలసింది. కపాదగాలిగీ  కాపడలేదు. బోలెడు డబ్బు వృధా చేసాను. ఈ కార్ ఎందుకు - ఇది ఒక ఇంకో పడి మందిని కపాడేదేమో, ఈ బంగారపు బ్యాడ్జు ఎందుకు ఇది ఇంకో ఒక్కరినైనా కపాడేదేమో  అని చాలా బాధపడతాడు. అక్కడ అప్రయత్నంగా గుండె కరిగి గొంతులోకి వచ్చేస్తుంది ప్రేక్షకులకి (నాకైతే జరిగింది)
             ఈ మారణహోమం (holocast) విన్న ఎవరికయినా గుండె రగిలిపోతుంది. అందులో స్పీల్బర్గ్ దర్శకుడు, అందునా జూ.ఇంకెంత రగిలిపోయి ఉంటాడు, ఎంత వేదన చెంది ఉంటాడు. ఆ బాధ ప్రతీ ప్రేక్షకుడికి గుండెలో పలికించ గలగడం, ప్రతీ మనిషిని ఒక ఘడియ ఆపి ఆలోచింప చెయ్యడం, ఒక కన్నీటి బొట్టు నివాళిగా రాల్చ గలిగేలా చెయ్యడం లో స్పీల్బర్గ్ కృత కృత్యుడు అయ్యాడని నా నమ్మకం.
P.S.



  • ఈ సినిమాకి స్పీల్బర్గ్ ఒక్క డాలర్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు
  • సినిమా అంతా   నాజీల అరాచకం గురించి అయినా, ఎక్కడా హిట్లర్ కనపడడు, అతని గొంతు వినపడదు.
  • ఈ మధ్య నేను చూసిన హోటల్ రవాండా కూడా ఇలాటి మారణహోమాన్ని, అందులో ఒక సామాన్యుడు  పరిస్తుతలని బట్టి, కొన్ని వందల మంది జనాల పాలిట రియల్  హీరోగా ఎలా పరిణత చెందుతాడో చూపెడుతుంది. దారుణ మరణ హోమాన్ని కళ్ళకు కట్టినట్టు చూపెడుతూనే, ఆ ప్రతికూల పరిస్థితులని  పోరాడే  మానవత్వాన్ని, ఆశావాదాన్ని చాటుతుంది. 

Sunday, December 20, 2009

అవతార్ - పెద్ద గొప్ప సినిమా కాదు - నాకు నచ్చనివి


జేమ్స్ కామెరూన్, భారీ బడ్జెట్, కొత్త టెక్నాలజీ , ఆరు నెలల ముందు నించి ఇచ్చిన హైప్ ఇవన్నీ చూసి చాలా అనుకున్నా ఈ సినిమా గురించి. రివ్యూలు కూడా కొంచం పాజిటివ్ గ ఉండే సరికి, ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహ లాడాను. IMAX లో అదీ 3D లో చూడాలని రెండు రోజులు ముందు బుక్ చేసి టికెట్లు, గంట డ్రైవ్ చేసి, రెండు గంటలు  లైన్ లో వెయిట్ చేసి   (మంచి సీట్ల కోసం) చాలా ఆత్రంగా ఈ సినిమాకి వెళ్లాను.
సినిమా నేను అనుకున్నంత కాకపోయినా బానే ఉంటే ఇంత గోల పెట్టేవాడిని కాను. సినిమాకి  ఇచ్చిన హైప్ కి, నేను చూడడానికి వెచ్చించిన సమయానికి, టికెట్కుకు  పెట్టిన  వెలకి (19$) సినిమా న్యాయం చెయ్యలేదని నిస్సంకోచంగా చెప్పగలను. అలాని సినిమా అసల బావోలేదు అని అనను. కామెరూన్ ఊహా శక్తికి, కార్యాచరణకి, సృష్టించిన కొత్త ప్రపంచానికి సలాం కొట్టాలి.
ఇక నాన్చకుండా నాకు నచ్చనివి చెప్పేస్తా. ఇవి మరీ చిన్న విషయాలు అనిపించవచ్చు కొందరికి.  కానీ నాకు మాత్రం సినిమాలో ఏదో వెలితి, అవి వీటి వల్లనేమో అనిపించింది.


  • సినిమా ఇంట్రడక్షన్, మొదటి సీన్లు పేలవంగా ఉన్నాయి . నేనింకా సినిమా మొదలు కాలేదు అనుకున్నా ఆ సీన్లు  అయ్యేవరకు. హీరో వాయిస్ narration కి అసల సూట్ కాలేదు. 
  • హీరో అసల నచ్చలేదు. ఎనర్జీ లేదు, నటన అంతంత మాత్రం. ఎంత అవతార్ నే ముఖ్యంగా చూపించినా, ఇతను ఉన్న సీన్లలో ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లా ఉన్నాడు
  • కొంత మంది నావి లు (నెయ్తిరి ముఖ్యంగా ) మొదటి సీన్ నుండే ఆంగ్లంలో మాట్లాడతారు  . ఆ మాత్రం దానికి నావి భాష మాట్లాడినట్టు చూపెట్టడం ఎందుకు ఇంక.
  • ఎమోషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళ బాధ మనకి బాధ కలిగించేడట్టు చూపించలేక పోయాడని పించింది (ఒకటి రెండు సీన్లు మినహా)
  • మంచి ఇంగ్లీష్ సినిమా అంటే నా వరకు నాకు, సినిమా అయిపోయినా బుర్రలో తిరుగుతూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. (It should haunt me). అలా ఉంటుంది అనుకున్నా కానీ అసల లేదు. చూసి రెండు గంటలైంది. ఒక్క సీన్ కూడా స్ఫురణ కి రావట్లేదు విషువల్గా. 
  • పండోర లో చాలా భాగం లార్డ్ అఫ్ ది రింగ్స్ లో చూసినట్టు అనిపించింది. దాని వల్ల ఒక కొత్త ప్రపంచాన్ని చూసే ఆనందం పూర్తిగా పొందలేదు.
  • 3D ని పెద్దగా వాడుకున్నట్టు అనిపించలేదు. ఉదాహరణకి ఫైనల్ డెస్టినేషన్ లో ఇంకా బాగా వాడుకున్నాడు ౩D ని. యాక్షన్ లో మనం అక్కడున్న ఫీలింగ్ కలగలేదు. 
  • ఉన్నవి రెండో మూడో యాక్షన్ సీక్వెన్స్ లు అవి కూడా వాళ్ళు గగురు పోడిచేడట్టు ఏం లేవు. ఆ విధంగా కూడా నిరుత్సాహ పరిచింది.
  • కామెరూన్ గారు అంత ఖర్చెందుకు పెట్టారు అన్న విషయం (అని అడగాలని ఉన్నా) పక్కన పెట్టినా, నా టికెట్ కి పైసా వసూల్ మాత్రం కాలేదు. 
  • ముఖ్యం గా జనాలు చెప్పినంత ఏం లేదు సినిమాలో. నేను రామ్ గోపాల్ వర్మ టపా చూసి అసల తెగ ఊహించుకున్నా సినిమాని. అంత లేదు. నాకు దీని కంటే ఈ ఏడాది వచ్చిన అప్, 2012  (ఇల్లోజికాల్ అయినా )  ఎక్కువ నచ్చింది.