Showing posts with label తెలుగు. Show all posts
Showing posts with label తెలుగు. Show all posts

Tuesday, February 26, 2013

తెలుగు పాట వ్రాయడం ఎలా For Dummies


ఈ టపా లోని పాత్రలు , పాటలు , పేర్లు ఎవరినో ఉద్దేశించినవే అని మీకు అనిపిస్తే మీకు కనీస తెలుగు సినిమా నాలెడ్జ్ ఉన్నట్టే 


ఒక్క ఛాన్స్ వస్తే చాలు తనేంటో నిరూపించేసుకుని, సినిమా క్రెడిట్స్ లో పాటలు అన్న మాట కింద తన పేరుని చూసేసుకుని, సింగల్ కార్డ్ గా ఎదిగి , తెలుగు గేయ రచయితగా స్థిర పడిపోవాలని పగటి కలలు కంటున్నాడు మన వాడు (రాత్రి రాతలతో నిద్ర లేక పొద్దున్నే పడుకుంటున్నాడు మరి ) . ఒకడు  చేసేది ఏదైనా, అందులో వాడి భవిష్యత్తు ఉన్నా లేకపోయినా  వాడిని ప్రోత్సహించే స్నేహితుడు ఒకడు ఉంటాడు.  అలాటి వాడే మనవాడి స్నేహితుడు ..  మన వాడి బాధ చూడలేక ఎవరెవరివో కాళ్ళు , గడ్డం, చేతులు , మెడ   పట్టుకుని ప్రముఖ గేయ రచయిత ఇంద్ర హాస్ అపాయింట్ మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళాడు .

అప్పుడే  నోకియా వరస్ట్ సింగర్  కార్యక్రమం గ్రాండ్ సెమీ క్వార్టర్ ఫైనల్ షూటింగ్ ముగించుకుని వస్తున్నారు ఇంద్ర హాస్. అమెరికా టూర్ వెళ్ళినపుడు తెచ్చుకున్న ఆబర్కాంబీ టీషర్టు చూసి ఆయనే అని నిర్దారించుకున్నాడు మన వాడి ఫ్రెండ్ .

ఆయన్ని కలిసి మా వాడు గీత రచయిత గా ప్రయత్నాలు చేస్తున్నాడు  సార్ . అందరూ వీడి పాటలు బావున్నాయి అంటున్నారు కానీ ఎవరూ తీసుకోవట్లేదు ..  బోలెడు భవిష్యత్తు ఉంది అంటున్నారు కానీ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అని బోరుమన్నాడు  . మన వాడు అయిష్టంగా వచ్చాడు, అయినా ఇంద్రహాస్  ఏం చెప్తాడో అయిష్టం గానే వింటున్నాడు .

ఇంద్రహాస్ నవ్వి .. "తెలుగు పాట అన్నారు కదా అని నీకు వచ్చిన తెలుగంతా ఉపయోగించేస్తే ఎలాగయ్యా!
అసల నన్నడిగితే తెలుగు పాట రాయడానికి తెలుగే  అక్కర్లేదు , తెలివీ అక్కర్లేదు , ఊహ అక్కర్లేదు , వ్యాకరణం అక్కర్లేదు.. కాకపోతే కిటుకు తెలియాలి .. కాన్ఫిడెన్స్ ఉండాలి .. ఉత్తరం ముక్కో, ఇంటి పద్దో రాసినా అదొక మహా కావ్యం లాగ ప్రెసెంట్ చెయ్యగల కాన్ఫిడెన్స్ .. నువ్వు రాసేది ప్రతీది కావ్యం లా ముందు నువ్వు ఫీల్ అవ్వాల"న్నాడు.


మనవాడు అయోమయంగా కొంచం ఇబ్బందిగా చూశాడు ..








ఇంద్రహాస్ అవేమీ పట్టించుకోకుండా..
కిటుకు విషయానికొస్తే ముందుగా నేనెక్కువ వాడే, హంసధ్వని గారు అతిగా ఇష్టపడే , వినగానే ఎగిరి గంతేసే లిస్టు కాన్సెప్ట్ చెప్తా ..అంటూ ఫ్లో లో చెప్పుకుంటూ పోయాడు ..

"ఇచ్చిన సన్నివేశం ఒక సెంట్రల్ థీమ్ గా అనుకో దాని మీద లిస్టు అల్లుకుంటూ పో అంతే
ఉదాహరణకి నిన్ను ఏదో పిల్లల పాట ఏదో పుట్టిన రోజుకి పాటో  రాయమన్నారు అనుకో .. అప్పుడు ముఖ్యంగా ఇచ్చేది ఆశీర్వాదం , తీసేది  దిష్టి . ఇందులో ఏదో ఒకటి తీసుకుని .. అల్లెయ్యడమే "

ఒక్కొక్కళ్ళ ఆశీర్వాదం అలా ఉండాలి ఇలా ఉండాలి అప్పుడు ఉండాలి ఇప్పుడు ఉండాలి అని రాసుకుంటూ పొతే అయిదారు పేజీలు అవుతుంది .. చిన్న పాట  అనుకో ముఖ్యమైన వాళ్ళవి పెట్టు .. పెద్దది అనుకో ..వీటితో పాటు ప్రకృతివి, జంతువులవి , పక్షులవి కూడా కలుపు ..అంతే ... నేనెన్ని రాయలేదు ఇలా ..లిస్టు కాన్సెప్ట్ తో రాసినవన్నీ చెబితే ఒక దర్శకచంద్రుడి సినిమా పాటలకి (కనీసం పదయినా  ఉంటాయి కదా) సరిపోయేంత  లిస్టు అవుతుంది .

నేను చెన్నై మొగుడు సినిమా నించి నిన్న యమునోత్రి నేటి కేదార్నాథ్ సినిమా వరకూ ఈ టెక్నిక్కే వాడాను ..

మనవాడి  ముఖ కవళికలు ఇబ్బంది లోంచి కోపం లోకి పరిణతి చెందుతున్నాయి ..
ఇంద్రహాస్ మాత్రం అంతులేని తన పాటలా .. అదే పనిగా చెబుతున్నాడు ..

అదే దేశం మీద రాయమన్నారు అనుకో ..
ఒక రెండు మూడు నెలల పేపర్లు తిరగేసి ముఖ్యాంశాలు పట్టుకో .. వాటికి  నీకు తెలిసినవి కలిపి .. బావోలేని విషయాలైతే దేశం అంటే అది కాదు అని  రాసేయ్ ..మంచి విషయాలనుకో దేశమంటే అదే అని రాసేయ్ ..ఫినిష్ .
మన హంసధ్వని గారి ట్యూన్ వేయించి ఏ బాలూ  చేతో  పాడిస్తే అవార్డు సాంగ్ అయి కూర్చుంటుంది ..

నేను మొన్న వ్రాసిన  "సయ్యంది పాదం" సినిమా పాట వినలేదా .అది అలా రాసిందే ..

ఒక్కోసారి ఈ మాత్రం కూడా అవసరం ఉండదు. మాస్ పాట రాయమన్నారు అనుకో .. నీ ఇష్టం .. ఒక మంచి నాటు పదం పట్టుకో దానికి అంత్య ప్రాస పెట్టుకుంటూ పో .అంత్యప్రాస అంటే అదే రైమింగ్.. అది  ఉంటే చాలు ఆంధ్ర జ్యోతి ఆర్టికల్ ని కూడా అందమైన పాటగా ట్యూన్ కట్టేస్తారు మన హంసధ్వని గారు, అందులో ఈ మధ్య ఆఫ్రికా, అంటార్క్టికా, నార్వీజియన్ , ఐస్లాండిక్ ఆల్బమ్స్ కూడా వదిలిపెట్టకుండా వింటున్నారు. చేతిలో మన వాళ్ళు కాపీ అని కనిపెట్టలేని బోలెడు ట్యూన్స్ ..

గుడ్డి , బడ్డీ , బుడ్డీ , వడ్డీ ..; ఈక - మేక - తోక - పాక ..ఇలా అన్నమాట .. నావి ఇలా ఎన్ని సూపర్ డూపర్ హిట్లు అవ్వలేదు ..కావాలంటే అప్పట్లో నేను వృషబాద్రి సినిమాకి రాసిన పాట ఇంకో పది సార్లు విను .

మనవాడి ఫ్రెండ్ కి కూడా ముఖం శాంతం నించి బీబత్సానికి మారిపోయింది .

ఇంద్ర హాస్  మాత్రం  ఇంకా అద్భుతం (రసం )  లోనే ఉన్నాడు .

కవితకి కాదేది అనర్హం అని ఊరుకున్నాడు కానీ శ్రీ శ్రీ .. పాటకు కూడా అది వర్తిస్తుంది ..నేను ఈ విషయం లో ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను ..పాటలు కట్టాను పాడాను ... కేవలం తిట్లు బండ బూతులతో  ఒక పొడవాటి పాట రాశాను.. ఒకటో నెంబర్ ఓబులేసు సినిమాకనుకుంటా ..  అది ఒక ట్రెండ్ సెట్ చేసి .. హీరో హీరోయిన్లు అలాగే పిలుచుకోవడం ఫాషన్ అయ్యి .కూర్చుంది . ఇది టి వి లకి కూడా పాకి ఇప్పుడు తెలుగు మాటలకంటే తిట్లు ఎక్కువ వినపడ్తున్నాయి ఎక్కడవిన్నా . మరి అదంతా నా ప్రతిభే ..

ఇంద్రహాస్ ఇంకా ఏదో చెప్పేలోపే  పాటల గురించి పెద్దగా తెలియని  మనవాడి ఫ్రెండ్ కి కూడా అసహ్యమేసి ..
గబాలున లేచి ,  "కోడ్తే దిమ్మ దిరిగి బొమ్మ కనపడుతుంది" అన్నట్టు లుక్కిచ్చ్చి మనవాడితో  కలిసి బయటకి వచ్చేసాడు ..

తొలాట ఇంటర్వెల్ బ్లాక్ దగ్గరే శుభం కార్డనుకుని వెళ్ళిపోతున్న ప్రేక్షకులను చూసిన తొలి సినిమా దర్శకుడిలా బిక్క మొహం వేశాడు, బాధగా చూశాడు .. వెంటనే .మనసులో బాధ యెదలో దురద మట్టిలో బురద అది గోక్కో ఇది కడుక్కో అని ఏదో పాట తట్టింది .. హంసధ్వని కి ఫోన్ కొట్టి ..మూతి అదోలా పెట్టి పాడడం మొదలు పెట్టాడు ..

(...చదివే వాళ్ళు ఉంటే ఇంకా ఉంటుంది ..)

Thursday, January 21, 2010

సిరివెన్నెల - నా కన్నుల





నేను కూడలి లో జేరక మునుపు రాసుకున్న కవితని మీ మీదకి వదులుతున్నాను. మీ అక్షింతలు వెయ్యండి మరి.




అంబర నీలంబరమున అద్దిన శశాంక శ్వేత వజ్రకాంతులో
కాలమెల్ల వేచి చూచి అలసి సొలసిన చకోరములకు ఊరడింపులో
కలయిక కల ఇక యని విరియని కలువలకు ఓదార్పులో
కవి డెందము స్పందింపజేయు శశి కందర్పుడు సంధించు సుమశరములో
గాన గంధర్వుల గళముల మృదు స్వర మాధురులు నింపు సుధాపాతములో
ప్రేమికుల హృదయాల విరహాగ్ని జ్వాలలు రేపు శృంగార అగ్ని కణములో
ముత్యాల దొంతరలో శ్వేత సుమ మాలికలో మల్లియలో మకరంద మాధురులో
హిమకరములో చర్మచక్షువులు చూడనలవి కాని శ్వేత రాసులో కానీ
ఈ రేయినెల్ల దివము చేసె శశి మయూఖ కాంతులు



ఇది తెలుగు పీపుల్ డాట్ కామ్ లో అప్పుడెప్పుడో ప్రచురితమైంది.
Click here to see this post in telugupeople.com



Wednesday, October 28, 2009

టి వి చానళ్ళ అత్యుత్సాహం - కొత్తగా పుట్టుకొచ్చిన భాషాభిమానం

ప్రసార మాధ్యమాల పుణ్యమా అని ఈ పాటికి మైదకూరు లో జరిగిన ఉదంతం, దాని మీద చేసిన రాగ్దాంతం చూసి ఉంటారు. తెలుగులో మాట్లాడిన విద్యార్థులు మెడలో I never speak in telugu అని రాసి ఒక బిళ్ళ తగిలించడం.  


ఈ టీవి చానల్లు తెలుగు భాషను ఉద్ధరించేస్తున్నట్టు, తెగ బాధ పడిపోతున్నాయి. ఇప్పుడే టి వి 9 ఒక కార్యక్రమం చూసాను (అమ్మకి అవమానం) కొంచం చూసి ఇంత సిగ్గులేకుండా ఎలా మాట్లాడతారా అనిపించింది. ప్రతీది రచ్చ చెయ్యడం వీళ్ళకి అలవాటైపోయింది. ముందు ఎవరన్న వీళ్ళ మీద ఒక ఉద్యమం మొదలెట్టాలి. పరబాష లో కార్యక్రమాలు, వాటి పేర్లు ఉండకూడదని. ఒక్కళ్ళకి 'ళ' 'ణ' పలకడం రాదు. ఒక వాక్యం మాట్లాడితే దాంట్లో 90% ఆంగ్ల పదాలే. టీవీ 9 లో ఐతే బూతద్దం పెట్టి వెతికినా ఒక్క తెలుగు కార్యక్రమం పేరుండదు.  


ఇక ఆ పాఠశాలలో జరిగిన విషయమైతే చాలా శోచనీయం. కానీ అలాటివి బోళ్ళు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ పిల్లలు తెలుగులో మాట్లాడాలని తల్లి తండ్రులకు ఉంటే తప్ప చెయ్యకలిగిందేమి లేదనిపిస్తుంది నాకు. వాళ్ళేమో ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే, ఫ్యూచర్ లో కష్టం అని అంటారు. మైదుకూరు లాటి సంఘటనలు జరిగే సరికి, జనాల్లో రగ్గు కప్పుకుని నిదరపోతున్న భాషాభిమానం, మాతృ బాష మీద ప్రేమ పొంగుకొచ్చేస్తాయ్ . సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఏవేవో ప్రతిపాదించేస్తారు . ఆంగ్లం రద్దు చెయ్యాలి, తెలుగు ని ముద్దు చెయ్యాలి అని. తెలుగు నేర్చుకోడానికి , కేవలం తెలుగు లో బోధన, ఆంగ్లం వాడకపోవడం కాదు కావాల్సింది. తెలుగు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగచెయ్యాలి పిల్లలకి. ఇష్టంగా పిల్లలు చదివేడట్టు పుస్తకాలు, లేక సి డి లు (ఇవి కొన్ని ఇప్పటికే ఉన్నాయి కానీ ఇంకా ఎక్కువగా) రావాలి. చందమామ లాటివి చదవడం అలవాటు చేస్తే, వాటి కంటే మేలు చేసేవి ఉండవు భాషా వికాసానికి. పెదబాల శిక్ష ఉంటే బూజు దులిపి, లేకపోతె కొని, పిల్లలకి చదివి చెప్పాలి, చదివించాలి. హ్యారీ పాటర్ (నేను చదవలేదు, మంచి పుస్తకమని విన్నాను)ని తలదన్నే పుస్తాకాలు తెలుగులో ఉండి ఉంటాయ్. కాకపొతే ఇంగ్లీష్ పుస్తకాల మీద ఉన్నంత ఆసక్తి తెలుగు పుస్తకాల మీద ఉండేడట్టు తల్లి తండ్రులు చెయ్యాలి. ఈ భాషా సంఘాలు,తెలుగు విశ్వవిద్యాలయాలు నిజంగా ఎమన్నా చేయదల్చుకుంటే, కొంత డబ్బు వెచ్చించి, బాలల సాహిత్యాన్ని మంచి నాణ్యతతో, ప్రమాణాలతో ప్రచురించాలి. (తినాలంటే రుచి తో పాటు రూపు కూడా అవసరం కదా ). వీలయితే పాఠశాలలకి ఉచితంగా కాపీలని ఇవ్వాలి. తరచూ పిల్లల కోసం తెలుగు భాష కి సంబంధించిన  వినోద కార్యక్రమాలు నిర్వహించాలి . ముఖ్యంగా ఇలాటి వాటిలో సుదీర్ఘ ఉపన్యాసాలు అవి ఇచ్చి బెదరగొట్టకుండా , వారికి నచ్చే రీతిలో చెయ్యాలి. వాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండేడట్టు చూడాలి. నాకు టీవీ లో పాటల పోటీలు అవి చూసినప్పుడు, తెలుగు భాషకేం ఢోకా లేదు అనిపిస్తుంది, అంత స్పష్టంగా పాడుతున్నారు, మాట్లాడుతున్నారు. కాకపోతే ఈ సంఖ్య తక్కువనుకోండి.  


మాతృ భాషలో విద్యా బోధన ఇవన్ని ఇప్పటి కాలమాన పరిస్థితులలో అసాధ్యం కానీ, కనీసం తెలుగు ఖచ్చితంగా తీసుకోవాలి అని హైస్కూల్ వరకు అన్నా పెడితే బావుంటుంది (ఇది ఇప్పటికే ఉందేమో నాకు తెలియదు. ఉంటే పాటించట్లేదని మాత్రం చెప్పగలను .)  


మైదకూరు ఉదంతం వల్ల జరిగిన మంచి ఎమన్నా ఉంటే, అది జనాలు ఓ నాలుగు రోజులు తెలుగు గురించి మాట్లాడుకుంటారు. ఆ తరువాత మల్లి మామూలే, మర్చిపోతారు.  


ఈ సందర్భం లో నేను రాసిన పాత టపా ఒకటి గుర్తుకొచ్చింది. టి వి చానల్లు, సినిమాలలో తెలుగు గురించి. http://maanasasanchara.blogspot.com/2008/06/blog-post.html




P.S. రాము గారు ఈ అతిని ఇంకా బాగా ఎండగట్టారు. చూడండి.
http://apmediakaburlu.blogspot.com/2009/10/blog-post_2



Monday, June 16, 2008

తప్పెవరిది

- వాసు

ప్పుడప్పుడు మన తెలుగు సినీ పరిశ్రమని చూస్తే జాలి వేస్తుంది, తెలుగు ప్రచార మాధ్యమాలని చూస్తే భయం వేస్తుంది.

తెలుగు సినీ పరిశ్రమ లో కొంత మంది దర్శక నిర్మాతలకు భాషాభిమానం, ఆత్మాభిమానం లాంటివి చాలా పెద్ద పదాలు, అసల తెలుగు వాళ్ళమని గుర్తుందా అనిపిస్తుంది. యేటా వచ్చే చిత్రాల్లో మూడో వంతు తమిళానువాద చిత్రాలుఉన్నాయంటే ఆందోళన పడాల్సిన సమయం, అలోచించవలసిన అవసరం ఉన్నాయని తేటతెల్లమవుతోంది. శంకర్, మణిరత్నం లాటి పెద్ద దర్శకుల చిత్రాలే కాక కొత్తవారి చిత్రాలకు (డబ్బింగ్) తమిళ నాడు కంటే మన రాష్ట్రం పెద్ద మార్కెట్అంటే మనవారి విశాల హృదయానికి ఆనంద పడాలొ, మన తెలుగు పరిశ్రమ కొల్పోతున్న అవకాశాలకు బాధ పడాలోఅర్థం కావట్లేదు.

ఏ మాత్రం బావున్నా వచ్చిన ప్రతీ అనువాద చిత్రాన్ని హిట్ చేసే మన తెలుగు వాళ్ళు, మన చిత్రాలు పక్క రాష్త్రంలోఆడడం పక్కన పెట్టండి, కనీసం డబ్బింగ్ కి కూడా నోచుకొవట్లేదని అలోచించరెందుకో? కారణం మనకు లేనిది, వాళ్ళకిఉన్నది - భాషాభిమానం. మంచి సినిమాని ఆదరించడం తప్పని నేననట్లేదు, కాని మనం వారి చిత్రాన్ని ఎలా ఉన్నాచూసేస్తాం అని వారనుకునే స్థాయికి దిగజారడం ముమ్మాటికి మంచిది కాదు.


ఈ వాదన అసమంజసం అని అనుకునే వారికి రెండు ఉదాహరణలు. మొన్న నేను దశావతారం సినెమాకి వెళ్ళాను. సినిమా పేర్లు మొత్తం తమిళం లో ఉన్నాయి. పొరపాటున తమిళ సినిమా వేసారేమో అని కనుక్కుంటే, ఇంతకీ అదితెలుగు దే. ఇక ఆ సినిమాలో ఒక పాత్ర సినిమా పొడవునా తమిళం లోనే మట్లాడుతుంటాడు, చూసేది తెలుగుసినిమానా తమిళ సినిమానా అని అర్థం కానంతగా. ఇది మనం సినిమా ఎలా వేసినా ఎం తీసిన చూసేస్తామనే చులకనభావం అనడానికి ఏం సందేహం లేదు.

ఇది చాలనట్టు, మన దర్శక నిర్మాతలే తొలుత తమిళం లో తీసి తెలుగు లొకి అనువదించడం ఈ పరిణామానికి పరాకష్ట. ఎ.ఎం రత్నం గారు తెలుగు వారయ్యుండి తమిళం లో సినిమాలు తీసి తెలుగు లోకి అనువదించాల్సిన అగత్యమేంటి? తమిళ ప్రేక్షకుల మీద అభిమానమా, తెలుగు వారి మీద హేయ భావమా?? దీనికి తోడు మన దర్శకులు కొందరికి కొత్తపైత్యం మొదలైంది. బుజ్జిగాడు సినిమానే తీసుకోండి. సినిమాలొ హీరో సగం మాటలు తమిళం లోనే ఉంటాయి. ఇదిచలదన్నట్టు ఏకంగా ఒక తమిళ పాట. ఈయనకి అంతకు ముందు తీసిన అమ్మ నాన్న ఒక తమిళమ్మాయి నించే ఈపైత్యం ఉన్నట్టుంది. పూరీ గారు! మీరు మరీ అంత తమిళ వీరాభిమనులైతే, తమిళ సినిమాలే తీసుకోంది. మీ పైత్యాన్నిమా మీద రుద్దకండి.




సమయం ఉన్నప్పుడు, సమావేశాళ్ళో మైకు దొరికినప్పుడు తెలుగు భాషాభ్యున్నతికి నడుం బిగించాలని గుక్కతిప్పుకొకుండా ఉపన్యాసాలిచ్చే సినీరంగ ప్రముఖులు, ఆ పనికి ఏ మాత్రం పూనుకున్నారో ప్రస్తుతం వస్తున్న సినిమాలుచూస్తేనే తెలుస్తోంది.



ఇది కేవలం సినీ రంగానికే పరిమితం కాదు. అన్ని రకాల ప్రసార మాధ్యమాళ్ళో ఈ దుస్థితి దాపురించింది. ఉదాహరణకిమన నిరంతర వార్తా స్రవంతి టివి9 నే తీసుకోండి.

పస లేని కథనాలని, వార్తలు కాని వార్తలని పక్కన పెట్టినా, వార్తల్లో వాడే భాషని వింటే జన్మ ధన్యమైపోతుంది . ఒక్కళ్ళకీళ ' , 'ణ ' ఉచ్ఛరించడం రాదు. ఇక రచన కర్ణ కఠోరం. "ఇరగదీసాడు", "బాక్సు బద్దలయ్యింది" ఇలాటి పదాలుధారాళంగా, గర్వంగా వాడడం వీరి ప్రత్యేకత. ఇక కార్యక్రమాల పేర్లంటారా - భూతద్దంతో వెతికినా ఒక్క తెలుగు పేరూకనపడదు. ఇవన్నీ ఈ ఛానల్ లొపాలు కాదు, టి.ఆర్.పి లలొ ప్రథమ స్థనం లొ ఉండడానికి కారణాలు.


ఇప్పుడు చెప్పండి తప్పెవరిది? ఏం చెప్తే అది విని, ఏం చూపెడితే చూసి, ఏం మాట్లాడని మనదా, మనకు కావల్సింది ఇదేఅని చూపెడుతున్న వాళ్ళదా??
'

Monday, March 24, 2008

telugu kavita

- Vasu

mrudulalita pada suma lata
madi saagaramadana janita
bhaashaamruta samhita
anirvachaneeya swara sahita
bhaava sammohita
rasabharita
telugu kavita
neeku sirasaaa swarasaaa namata