Sunday, August 14, 2011

స్వాతంత్ర దినోత్సవం.. అయితే


హ్మ్.

స్వాతంత్ర దినోత్సవం అనగానే జెండాలని, దేశభక్తి గీతాలని లారీల్లో తెచ్చి పేజీల్లో నింపేస్తారు. మోడొందల  అరవై నాలుగు రోజులు నిదురోయిన దేశభక్తి ఈ  రోజు  ఉప్పొంగిపోయి ఉరకలేస్తుంది.

మెయిల్  తెరిస్తే మీరు  భారతీయులైతే గర్వపడిపోయి ఈ మెయిల్ చదివి ఫార్వర్డ్ చెయ్యాల్సిందే అంటూ తామర తుంపరలా సందేశాలు. బజ్ , ఫేస్ బుక్ లు  భారత దేశాన్ని గురించి మహోపన్యాసాల , ఆవేశ పూరిత ప్రసంగాల వీడియోలతో నిండిపోయాయి. (స్వాతంత్ర దినోత్సవాన్ని శెలవుగా  మాత్రమే గుర్తించి కొత్త సినిమాలు, చెత్త ఇంటర్వ్యూలు  వేసే టీవీ చానెళ్ళ గురించి ఎంత తక్కువ మాటాడుకుంటే అంత మంచిది).

నాకు వెంటనే ఒక చిన్న సందేహం వచ్చింది. నేను ఎందుకు గర్వపడాలి. అసలెందుకు పండగ జరుపుకోవాలి.
ఏం చూసి గర్వపడాలి.  ఎవరిని చూసి గర్వపడాలి.


  • లక్షల కోట్ల కుంభకోణాల్లో దేశం కొట్టుమిట్టాడు తుంటే నోరువిప్పలేని ప్రధానినా , ఏమీ చేయలేని సిగ్గుమాలిన ప్రభుత్వాన్నా
  • ప్రజలు తిడుతూ కూర్చోకుండా, మునుపెన్నడూ లేని విధంగా కదిలి వచ్చి, చేయి కలిపి, నోరు విప్పి , పోరు సలిపి ప్రభుత్వం కొమ్ములు వంచి ఒక బిల్ ని తెస్తామని మాట తీసుకున్నా ,  అది నిలపెట్టుకోలేని దిక్కుమాలిన ప్రభుత్వాన్నా, దాన్ని ఎన్నుకుని ఏం చెయ్యాలో తెలియని అసహాయ సమాజన్నా,
  • సుమారు రెండు వందల మంది అమాయకులని పొట్టన బెట్టుకుని, మూడొందల కుటుంబాలని దిక్కులేని వాళ్ళని చేసిన నికృష్టుడు    ప్రజల ధనం తో రెండేళ్ళగా జైల్లో కులుకుతూ ఉంటే సిగ్గులేకుండా చేతలుడిగి చూస్తున్న దేశాన్ని చూసా
  • ఎవడిష్టం వచ్చినట్టు వాడు రాస్తూ,  ఎవడిష్టం వచ్చినట్టు వాడు కూస్తూ జనాల సెన్సిటివిటీ లని కూడా ఖాతరు చెయ్యని మీడియాని ఈ  హక్కు మీకవేరిచ్చారని రెండు చెంపలు వాయకొట్టి  అడగ(లే)ని  సమాజాన్ని చూసా అందులో నేనూ ఒకడినని తెలిసా .
  • అసలు ఈ ఆలోచనలే రాని "వడ్డించిన విస్తరి మా జీవితం" అనుకుని వోటు కూడా వేయడానికి తీరకలేదనుకునే సోమరి సమాజాన్నా(వీరు నలభై శాతానికి పైగా ఉన్నారు)  
  • పోనీ ఇవన్నీ కాదు .. కనీసం ఒక్క రోజైనా స్వాతంత్ర సమర యోధుల్ని తలుచుకోడానికి, భారతీయ ఆత్మను పునరజ్జీవం చేసుకోడానికి అనుకుందామంటే.. అసల ఆ ఆత్మ ఉందా అని అనుమానం వస్తోంది. ఆ సమర యోధుల్ని తలుచుకుంటే ఇలాటి  నిస్సత్తువ  సమాజం  కోసం  వాళ్ళు ప్రాణ త్యాగాలు ఎందుకు చేశారని బాధేస్తోంది.

ఔను. ఇలా  దేశంలో  లేకుండా  దేశాన్ని  తూలనాడడం  కూడా  నా  మీద  నాకే  అసహ్యమేస్తోంది.  


"ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి
నెత్తురు మండే శక్తుల నిండే సైనికులారా రారండి" 

అన్నాడు శ్రీశ్రీ 

నేను మొదటి రకమో రెండో రకమో తేల్చుకోవాలి. మరి మీరో ??    

Thursday, August 11, 2011

మా తెలుగు తల్లికి


నిన్న ఉదయం లీడర్ లో మా తెలుగు తల్లికి పాత వింటుంటే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. మా ఇంటి దగ్గర ఒక స్కూల్ (వివేక్ మోడల్) లో రోజూ ఆ గీతం తోనే అసెంబ్లీ మొదలయ్యేది.
పాత వింటూంటే  ఒక గర్వం (అప్పుడు అదని తెలియదు ), ఆనందం, తెలియని శక్తి వచ్చినట్టుండేది.  అదేం కర్మో మా స్కూల్లో తెలుగు లో మాట్లాడితే తప్పనేవారు, తన్నేవారు (అయినా తెలుగు లో మాట్లాడుతూనే ఉండే  వాళ్ళం అది వేరే విషయం.  ).  అలా తెలుగు మాటలాడ నివ్వకపోవడం  తప్పని అనిపించేది కాదు అదేంటో .

ఇప్పుడు ఎంచక్కా గొడవ లేదు, సగం స్కూళ్ళలో తెలుగే ఉండట్లేదు తప్పనిపించడానికి.  పోనీ బయట జనాలు మాట్లాడే దాంట్లో బూతద్దం వేసి తెలుగు పదాలు వెదకాలి. మాల్, రెస్టారంట్, ఎయిర్ పోర్ట్, మల్టీ ప్లెక్స్  ఎక్కడికెళ్ళినా తెలుగు మాట్లాడడం నేనైతే చూడలేదు. స్వయం వరం సినిమాలోలా "తెలుగులో మాట్లాడుకుందాం. సుఖంగా ఉంటుంది"  అని ఎందుకు అనలేము?

ఇక్కడ అయితే తెలుగు మిత్రులతో మాట్లాడినపుడు ఒక్కోసారి తెలుగు పదం తట్టినా
ఆంగ్ల పదమే వాడడం పరిపాటి. ఈ తెగులు నాకు కూడా ఉండేది. ఇప్పుడు ఇంచు మించు వదిలింది.
కానీ అక్కడ కంటే నా తెలుగు ఇక్కడే బాగు పడింది. బోలెడు పుస్తకాలు, రచయితలూ, బ్లాగులు, బ్లాగరులు, బజ్జరులు (:))  పరిచయమయ్యారు.  రోజుకి రెండు మూడు  గంటలన్నా తెలుగు చదివేలా చేస్తున్నారు.

ఇక్కడి జనాల ఆసక్రి చూస్తే తెలుగు భాష అంతరించిపోతుందనే భయం ఏం లేదు అనిపిస్తుంది. శంకర శాస్త్రి గారు చెప్పినది తెలుగుకు చక్కగా అన్వయించుకోవచ్చు.
"తెలుగును పట్టించుకోడానికి నూటికి ఒక్క వ్యక్తీ ఉన్నా ..ఈ అమృత వాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది"
 
ఏమంటారు ??