Showing posts with label అయినాపురం కథలు. Show all posts
Showing posts with label అయినాపురం కథలు. Show all posts

Thursday, August 19, 2010

కౌముది లో నా కథ

                          

              మొన్నోరోజు మా బంధువులు  కౌముది లో నా కథ చదివాం అని చెప్పారు. అప్పటి దాకా నాకు ఆ కథను కౌముది వారు ప్రచురించారని తెలియదు. వంగూరి ఫౌండేషన్ ఉగాది పోటి లో బహుమతి పొందిన కథలు కౌముది లో వేస్తారని విన్నాను కానీ నా కథ  గత  సంచికలో రాకపోయేసరికి ప్రసంశా పత్రం వచ్చినవి వెయ్యరేమో అని సరిపెట్టుకున్నాను.

నేను  రాసిన  మొదటి కథకి (రాసినప్పుడు కథో కాదో కూడా నాకు తెలియదు)  గుర్తింపు రావడం ఆనందంగా  ఉంది. ఇంకా రాయాలని ఊపొచ్చింది.

ఈ కథని కౌముది ఆగస్టు సంచికలో  చదవచ్చు.

అన్నట్టు నా బ్లాగ్ లోని భోగి పిడక కథే ఇది.  ముగింపు మార్చి  పోటీకి పంపాను.

ఏది బావుందో చెప్పాలి మరి మీరు.

మనలోమన మాట. ఏదీ బావోకపోయినా చెప్పండి. మరేం  పర్లేదు.

.

Saturday, March 20, 2010

కారం చట్నీ (అయినాపురం కథలు)





నలభీమ పాకం అంటారు కానీ మా అమ్మమ్మ వంట కంటే అది గొప్పగా అయితే ఉండదని  నా  నమ్మకం. ఏ వంట అయినా అలవోకగా చేసేస్తుంది అమ్మమ్మ.  అద్భుతంగా ఉంటుంది. అది గుత్తొంకాయ అయినా , గుమ్మడి వడియాలయినా, కందా బచ్చలయినా.. కందిపొడి అయినా సరే.  ఇంత విద్య ఊరికే పోతోందే అమ్మమ్మా  అంటే,"ఊరి కే పోతోంది రా " అని చమత్కరించేది.  ఒక కుక్ బుక్ తయారుచేస్తే బావుంటుంది అనిపిస్తుంది నాకు.కానీ అంత వంట వచ్చిన మా  అమ్మమ్మ చేసే ఇడ్లీ మాత్రం మా సూరయ్య హోటల్ ఇడ్లీ.. కాదు కారం చట్నీవిత్ ఇడ్లీ (క్రమం కరెక్టే)  ముందు దిగదిడుపు.
మా వీధి చివర కుట్టు మిషను కాంతారావు కొట్టుకి ఎదురుగా పాకలో చిన్న హోటల్ సూరయ్యది. అయినాపురం మొత్తానికి ఏకైక హోటల్. అయినాపురం వచ్చినప్పుడు అది వెతకకండే.. దానికి బోర్డు గట్రా ఏమీ ఉండవు. ఊరిలో ఎవరినయినా  అడిగితే  మాత్రం జబ్బట్టుకుని తీసుకొచ్చేస్తారు. బోర్డు మీద పేరు లేకపోయినా ఊరిలో మాత్రం తెగ పేరుంది ఆ హోటల్ కి. అందరూ సూరయ్య హోటల్ (కొంత మంది ముద్దుగా సూరి గాడి హోటల్) అని అంటారు. హైదరాబాది బిరియానీకి ప్యారడైస్, బావర్చి లాగ మా ఊరిలో టిఫిన్లకి అది పెట్టింది పేరు.
నాలుగు చక్క బల్లలు, పాత సినిమా పోస్టర్లు (ఎక్కువగా ఎన్టీ వోడివే) కప్పుకున్న గోడలు,  ఒక బుల్లి వంట గది, బోలెడు జనం దాని ట్రేడ్ మార్క్.  ఉదయం అయిదు నించీ ఏడింటి వరకే తెరిచి ఉంటుంది. తాతయ్య తో వెళ్తే అక్కడే తినేవాళ్ళం. కానీ తాతయ్యేమో ఉదయాన్నే వెళ్ళిపోతాడు తినడానికి. మేము లేచేసరికి ఆయన తిని రావడం కూడా అయిపోయేది. అందుకని ఇంటికే తెచ్చుకునే వాళ్ళం.హోటల్ ఎప్పుడూ కిక్కిరిసి ఉన్నా మేము వెళ్ళగానే సూరయ్య పలకరించే వాడు. మేము ఏమీ చెప్పకుండానే "వాయవుతోంది బాబూ. యేడి యేడి గా యేసిస్తాను. కూకోండి" అని మేము తెచ్చిన స్టీల్ బకెట్, గ్లాసులు లాక్కునేవాడు. దేవత పోస్టర్ మీద పేర్లన్నీ చదివే లోపు బకెట్ నిండా ఇడ్లీలు, దాని మీద విస్తరాకులు, గ్లాసుల నిండా చట్నీలు నింపి తెచ్చేవాడు. ఇడ్లీల కన్నా ముందు చట్నీ ఉందో  లేదో చూసుకుని అతను  "మీ తాతయ్య ఖాతా లో వేసుకుంటా బాబూ" అని  అనగానే  ఇంటికి పరుగు తీసేవాళ్ళం. ఇలాటి ఇడ్లీలు రూపాయికి నాలుగా అని ఆశ్చర్యంగా ఉండేది.
ఇంటికి పరుగెడుతుంటే, ఒక్కోసారి పక్కింటి అరుగు మీద ఆయన సిగ్నేచర్ పంచెతో అర్థ దిగంబరంగా కూర్చునే రాజు గారు ఆపేవారు. "ఏంటి హోటల్ నించీ వస్తున్నారా. అచ్చియ్య (ఆయన భార్య) ఏమీ చెయ్యలేదు.  శివగాడు గోల పెడుతున్నాడు..............." అని ఆయన ఏడ్పుల చిట్టా విప్పేలోపు ఓ నాలుగు ఇడ్లీలు విస్తరాకులో పెట్టి ఆయనకిచ్చి శివకి ఇమ్మనేవాళ్ళం.ఒక్కోసారి మా టైం బావుంటే అయన పిలిచినా వినిపించుకోకుండా ఇంటికి పరిగెత్తే వాళ్ళం.
ఇంటికి రాగానే పెరటి అరుగు మీద కూర్చుని విస్తరాకులో ఇడ్లీ, దాని పక్కన కారపు చట్నీపెట్టుకుని ప్రారంభించే వాళ్ళం.మొదటి ఇడ్లీ ముక్క - నోట్టో పెట్టుకోగానే వేడి ఇడ్లీతో చల్లని పచ్చడి కలిసి నాలుక మీద ఒక రుచి, నాట్యం చేసేది. గాలిలో తెలిపోయే వాడిని. రెండవ ముక్క - చేతిలో ఉండగానే నాలుక ఆ రుచి కోసం తహతహలాడుతూ అర అడుగు బయటకి వచ్చి గబాలున లాక్కునేది. అది కరిగిపోయే లోపు త్రిశంకు స్వర్గం దాటేసేవాడిని. మూడవ ముక్క - ఎక్కడ..ఏది .. అప్పుడే గొంతులో - నేను స్వర్గపుటంచులో.
అలా ఆ రుచిని ఆస్వాదించే లోపు ఆకులో అరడజను ఇడ్లీలు, గ్లాసులో సగం చట్నీ అయిపోయేవి. నేనే తిన్నానా నేనెప్పుడు తిన్నాను ..అనుకునేవాడిని. మిగలిన కారం చట్నీని ఆకు మీద వేసి కొంచం కొంచం తింటుంటే ఆహా నా రాజా..  స్వర్గం లో ఇంద్రుడు పక్కన కూర్చుని కత్రీనా, కరీనా, తమన్నా,ఇలియానా రెహమాన్ సంగీతానికి నాట్యం చేస్తుంటే చూస్తున్నట్టు ఉండేది.
సూరయ్యా!.. ఈ కారం చట్నీలో ఏం కలిపావయ్య.. కుబేరుడి భార్య ఆడిన కారమా, ఇంద్రుడి ఇంట్లో వాడిన పచ్చిమిర్చా, వరుణుడు వేయించిన పోపా అని సూరయ్య మీద కారం చట్నీ కీర్తన ఒకటి పాడాలనిపించేది. నా సాహిత్యం చూసి, గొంతు విని మా ఊళ్ళో వాళ్ళంతా ఉప్పరి  డాక్టరుకి  పేషంట్లు అయిపోతారని ఆగిపోయాను.
ఇలా రోజూ ప్లేట్ ఇడ్లీ తో సీప్ గా స్వర్గానికి వెళ్ళే దారి తెలిసాక వదిలి పెట్టలేక పోయాను.చద్దనం లో ఆవకాయా, కారం చట్నీ తో ఇడ్లీనా  అంటే తేల్చుకోవడం కొంచం కష్టం అయినా ఎక్కువగా ఇడ్లీ చట్నీకే వోటు పడేది.
"అమ్మమ్మ శుభ్రంగా మడి కట్టుకుని రోట్లో పిండి రుబ్బి వేడి వేడి ఇడ్లీలు, కమ్మగా చట్నీ చేసి పెడితే ఎక్కదు మనకి. అక్కడ సూరయ్య వారం నుండీ పులిసిపోయిన పిండిని... ఏమేం పిండులు కలిసాయో.. ఏమేం చేతులు పడ్డాయో ... ఇడ్లీ వేస్తే నాక్కుంటూ తింటారు." అని మావయ్య, అమ్మ ఇడ్లీ తెచ్చినప్పుడల్లా అష్టోత్తరం చదివేవాళ్ళు. ఆ రుచి వీళ్ళకేం తెలుసు అని మనసులో నవ్వుకుని, మర్నాడు ఎప్పుడు తెరుస్తాడా సూరయ్య హోటల్.. ఎప్పుడెప్పుడా కారం చట్నీ .... అని ఆలోచిస్తూ ఉండేవాడిని

Sunday, January 17, 2010

భోగి పిడక (అయినాపురం కథలు)


"వచ్చారా ! ప్రయాణం బాగా జరిగిందా." అరుగెక్కుతున్న  మమ్మల్ని ఆప్యాయంగా అడిగింది మా  అమ్మమ్మ.
"ఆ పెట్టెలు అవీ లోపల పెట్టు" అని మా  పాలేరు వెంకతరత్నాన్ని ఆజ్ఞాపించి అందరినీ  చెయ్యిపట్టుకుని లోపలకి తీసుకెళ్ళాడు తాతయ్య  " బోలెడు ప్రయాణం చేసొచ్చారు. మొహం కడుక్కుని కాఫీలు తాగుదిరిగాని. " అంటూ
కుశల ప్రశ్నలయ్యాకా   అందరికీ కాఫీలు పట్టుకొచ్చి,  "నువ్వు వంకలు పెడతావని నీకు మాత్రం మీ అమ్మమ్మే  పెట్టారు." అని  నన్ను  చూసి నవ్వుతూ అంది మా అత్తయ్య .


నాకు   ఊహ తెలిసినప్పటినించీ  ఏ ఏడాదీ సంక్రాంతికి ఊరెళ్ళకుండా లేను. పుట్టినూరు కావడం వల్ల  ఏడాది తిరిగేసరికి మనసు పీకేస్తుంది ఎప్పుడు వెళదామా అని. కోనసీమ లో అయినాపురమని అదొక   చిన్న పల్లెటూరు. పచ్చని పంట పొలాలు, వాటి గట్టు వార కొబ్బరి చెట్లు, సైడ్  కాలువలు,  చెరువు, చెరువు ఒడ్డున  పెద్ద మర్రి చెట్టు, దాని కింద రచ్చబండ. చెరువుకి ఒక వైపు గ్రామ దేవత నీలాలమ్మ గుడి, ఇంకో వైపు విష్ణాలయం, శివాలయం  చూడ ముచ్చటగా ఉంటుంది. ఇక మా తాతయ్య వాళ్ళ ఇల్లు ఇదిగో ఇంత చూడ ముచ్చటగా ఉంటుంది. వచ్చే ఏడాది వజ్రోత్సవాలు జరుపుకునే హోదా వస్తుంది ఈ ఇంటికి.


మేము వెళ్ళే ప్పటికే   మా పెద్దమ్మ, మావయ్యలు,పిన్నిలు  కుటుంబ సమేతంగా వచ్చేసారు.
కాఫీ నోట్లో పోసుకుని, బావలతో కలిసి ఊరుమీద పడ్డాను నేను . ఇంటి బయటకి రాగానే మా పక్కింటి  రాజు గారు దర్శనమిచ్చారు .
"ఏం బాబు ఎలా ఉన్నారు. మీకేంటి మీరు బాగా చదువుతారు.  ఫష్టుగా  మార్కులు తెచ్చుకుంటారు. మా అబ్బాయి చూడు .. ఏమీ లాభం లేదు..  మేమేదో ఇలా గడిపెస్తున్నాం. పోనిలే పోనిలే మీరు బావున్నారు." అని ప్రశ్న సమాధానం ఆయనే చెప్పేసుకున్నారు.

మా ఇంటి దగ్గరే కాఫీ పోడెం పంతులు గారు ఉండేవారు. ఆయనకీ ఇద్దరు పిల్లలు. వాళ్ళావిడ సత్య ఆంటీ. రోజూ రాత్రి  అయ్యేసరికి వాళ్ళ పిల్లలిద్దరికీ పెరడులో అరుగు మీద కూర్చోపెట్టుకుని కథలు చెబుతూ అన్నం తినిపించేవారు. కథలు వినడానికి మేమూ వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడు మాకు కూడా ముద్దలు కలిపి పెట్టేవారు ఆంటీ.  వాళ్ళిద్దరి పిల్లలూ మా ఈడు వాళ్ళే. మా గ్యాంగ్ తోనే ఉండేవాళ్ళు.
ఇంకో నాలుగు రోజులలో భోగి. సత్య ఆంటీ వాళ్ళ పిల్లలు, తొరకల రాజు  అప్పుడే భోగి దండలు కూడా తయారు చేసేసుకున్నారు. ఇక మేము కూడా త్వరపడాలి అని నిర్ణయించుకున్నాం  . ఆవు పేడ వెతికి పట్టుకుని, పిడకల తయారీ కి నడుం కట్టాం. పేడ ని ముట్టుకోవడం, దాని వాసన   కొంచం చికాకుగా అనిపించినా, భోగి మంట సరదా ముందు అది పేద్ద లెక్కలోకి రాలేదు. మా తాతయ్య వాళ్ల ఇంటి చుట్టూ  కోట గోడలాటి పేద్ద గోడ ఉండేది. దాని మీద రకరకాల ఆకారాలతో పిడకలు వెయ్యడం మొదలెట్టాం.  దండ కట్టడానికి కావాల్సిన గారిలాగా కన్నం ఉండే పిడకలతో పాటు, అరటి పండు, బస్సు , యాపిల్ పండు, హరి కృష్ణ, టి. రాజేందర్ ఇలా మా ఊహా శక్తికి  పదును పెట్టి రకరకాల పిడకలతో గోడను నింపాము.  ఇక రోజూ మూడు పూటలా పిడకల  పర్యవేక్షణ చేసేవాళ్ళం. ఎండ బాగా రావాలని పూజలు చేసేవాళ్ళం. అవి  ఎందుకు త్వరగా ఎండట్లేదో కోర్ కమిటి తో సమావేశాలు జరిపేవాళ్ళం. రాత్రిళ్ళు వర్షం పడి పిడకలు కరిగిపోయినట్టు పీడకలలు కూడా వచ్చేవి. ఇలా అవి మా ఇంటెన్సివ్ కేర్ లో మూడొంతులు ఎండాయి భోగి ముందు రోజుకి. ఆ తరువాత వాటిని మంట మీద వేడి చేసి ఇంచు మించి ఎండాకా దండ కట్టి దాచిపెట్టుకున్నాం మర్నాటి మంటకి.


మర్నాడే భోగి. ఊళ్ళల్లో భోగి ఎంత బాగా చేస్తారంటే, ముందు రోజు రాతిరి ఊళ్ళో ఉన్న బళ్ళు, పాకల్లో  వాసాలు (పక్కింటి, పొరుగింటి  వాళ్ళవి లెండి) ఇవన్నీ లేపేసి పోగేసి భోగేస్తారు. అందుకని ఆ రాత్రంతా పెరట్లో పాకకి, ఎడ్ల బళ్ళకి బోలెడు కాపలా. అందువలన ఆ రాత్రి మా తాతయ్య నైట్ షిఫ్ట్ చెయ్యాల్సొచ్చింది అన్నమాట. మేము కూడా మహా  సరదాపడి (దూల అని కూడా చదువుకోవచ్చు) మా తాతయ్యతో పాటు పెరటి అరుగు మీద  గూర్ఖాగిరి లో ఉత్సాహంగా  పాల్గొన్నాం. సాధారణంగా కథలు చెప్పడం లో  బామ్మలు, అమ్మమ్మలు ప్రసిద్ది. కానీ మా తాతయ్య  అదంతా స్త్రీ ఆధిక్య సమాజం చేసిన కుట్ర అని నిరూపించేన్త బాగా కథలు చెప్పేవాడు. కాకపోతే ఒకటే షరత్తు, చెప్తూ ఉన్నంత సేపు  ఆయన కాళ్ళు పట్టాలి.  ఆయన చెప్పే కథలకి, చెప్పే తీరుకి వీరభిమానులమయిన మేము అవి వినడానికి ఏం  చేయడానికయినా  సిద్ధపడే వాళ్ళం .  ఇక కాశీమజిలీ కథలైతే ఒక్క కథే  మా వేసవి శెలవలు మొత్తం ఆక్రమించేది. సాయంత్రం వీధి అరుగు మీద కూర్చుని, మా చేతులరిగిపోయేలా  కథలు చెప్పించుకునేవాళ్ళం. భోగి ముందు రోజు రాత్రి కూడా అలాగే కథలు వింటూ మెలకువ  ఉండచ్చులే అనుకున్నాం. కానీ ఆయన మాకు ఒక కొత్త విద్య నేర్పించారు. అదే మన జాతీయ క్రీడ - హాకీ అనుకునేరు (సినిమా పరిజ్ఞానం బొత్తిగా లేదు సుమీ మీకు) , కాదండీ బాబూ - చతుర్ముఖ పారాయణం. దీన్నే కొంత మంది సీప్ గా పేక అనికూడా అంటారు. ఆ రోజు మాకు సీక్వెన్స్ (రమ్మీ), క్లియరెన్స్ లాటి జీవితానికి పనికొచ్చే ఆటలన్నీ నేర్పారు. దాంట్లో మాకు నేర్పు వచ్చేసింది  కానీ సమయం గడవట్లేదు.  సూరీడు ఇంకా డీప్ స్లీప్ లో ఉన్నాడు  చంద్రుడి షిఫ్ట్ కదా అని. ఇంకా ఆయన నిదురలేవాలి, బయల్దేరాలి, రావాలి. మాకు విముక్తి కలగాలి.
"శ్రీ సూర్య నారాయణ మేలుకో" అని సాఫ్ట్ గా మొదలెట్టి "రా దిగి రా  దివి నుండి భువికి దిగిరా" రేంజ్ వరకూ మా నిరీక్షణ సాగింది సూరీడు కోసం. ఆయన రాలేదు కానీ మాకు నిద్దర కుమ్ముకుంటూ వచ్చేసింది. లేచి చూసే సరికి బారెడు పొద్దెక్కింది. పక్కన చూస్తే పక్కలో మత్తుగా పడుకున్న మా బావలు . తాతయ్య ఎప్పుడో వెళ్ళిపోయి స్నానం చేసి  పూజ కూడా చేసేసుకున్నారు. మా బావలని నాలుగు తన్ని లేపి, పరుగు పరుగున భోగి మంట వెయ్యడానికి బయల్దేరాం. పిడకల దండలు, ఒక లీటరు కిరోసిను, అగ్గిపెట్టె తీసుకుని మా  పే.... ద్ద  పెరట్లోకి వెళ్ళాం.


అన్నీ సిద్ధం చేసుకుని మంటెయ్య బోతుంటే మా తాతయ్య అక్కడ వద్దు, అసలే తాటాకు పాక నిప్పంటుకుంటే ఇంకేం లేదని చెప్పాడు. సరే కదా అని ఇంకో వైపు కెళ్ళాం. అక్కడేమో గడ్డిమేట్లు నిప్పంటు కుంటే ఇంకేమన్నా ఉందా అని ఆ మంట మీద నీళ్ళు చల్లారు. కానీ మాకు మంటెత్తి, పక్కింటి రాజు గారింటి కెళ్ళాం. ఆయన మమ్మల్ని "బాబూ! నాది అసలే చిన్న పాక, ఒకటే ఆవు, చిన్న గడ్డిమేటు, ఒకర్తే  భార్య, ఒకడే పిల్లాడు"  అని ఏడుపు మొదలెట్టాడు. ఇలా కాదని రోడ్డు మీద కెళ్ళాం అక్కడ  వేద్దాం అని అక్కడ అప్పటికే మంటలు చల్లారి, జన సంచారం మొదలైపాయింది. మా నాలుగు రోజులు శ్రమ వృధా కానివ్వం. మా టి రాజేందర్ పిడక కి నిప్పంటించే దాక నిద్రపోమని డిసైడ్ జేసి మా తాతయ్య తో పెద్ద యుద్ధం చేస్తే, ఇంట్లో ఒక గాడిపొయ్య చూపించి - అందులో వెయ్యండి, భోగి మంట ఐపోయాక నీళ్ళు కూడా కాచుకోవచ్చు ఎంచక్కా అని సద్ది చెప్పాడు. చేసేది లేక అయిష్టంగా అందులోనే వేశాం మా దండలు. చెప్తే నమ్మరు అవి ఏకంగా గంట  మండాయి ముఖ్యంగా టి రాజేందర్ పిడక.

పోనీ ఇది ఇలా అయ్యింది మిగతా రోజన్నా సరదాగా గడుపుదాం అని అనుకున్నాం. ఇంతలోనే తలంటు పోయించుకోవాలని మా గొంతులో వెల్లక్కాయ వేసారు అమ్మ వాళ్ళు . దానికి ముందు నలుగు. ఏంటో అపురూపంగా పెంచుకున్న మా వంటిని అయిష్టంగా మా పాలేరు వెంకటరత్నం చేతిలో పెట్టాం. అతను  గేదెల్ని  పీచెట్టి తోమినట్టు మమ్మల్ని తెగ తోమేసాడు (పెద్దగా తేడా తెలియలేదేమో పాపం). అతని చేతి నలుగులో మేము నలుగురం నలిగిపోయాం. మేము గోల పెడుతుంటే మా అమ్మ వాళ్ళు  "శుభ్రంగా నలుగు పెట్టించుకోండి , మట్టంతా పోయి వళ్ళు నిగనిగలాడే రంగొస్తుంది" అంటూ మా వెంకతరత్నానికి ఊపుని, మాకు సలుపుని పెంచారు. మట్టిపోయి రంగు కాదు, తోలు పోయి రక్తం వచ్చేడట్టు ఉంది అని నసుగుకున్నాం.   మాకైతే గత ఏడాది చేసిన అల్లరంతటికీ ఒకే సారి పగ తీర్చుకుంటున్న ఫీలింగ్ వచ్చింది. ఆ పగకి ఫినిషింగ్ టచ్ ఆ తరువాత కుంకుడు రసంతో తలంటు. పరిగెడుతున్న మమ్మల్ని  బలి ఇచ్చే పశువులా కాళ్ళు చేతులు తలొకరూ  పట్టుకుని బలవంతంగా కుంకుడు పులుసుతో తలంటే శారు.  పైగా తల వెనక్కిపెట్టండి లేకపోతె పులుసు కళ్ళల్లో పడుతుందని ముందు జాగ్రత్త లొకటి. కళ్ళల్లోకి పడకుండా పులుసు పొయ్యడం, చంద్రబోస్ మాంచి పాటలు రాయడం, టీవీ 9 లో తప్పులు లేకుండా చదవడం  సాధ్యమేనా చెప్పండి మీరసల ? ఆ తంతు పూర్తి కాగానే, ఉప్పురాళ్ళ*  తో సిద్ధంగా ఉన్నాడు మా మావయ్య, ఆర్య 2 లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తో ఉన్న అర్జున్ లాగ.

ఎరుపెక్కిన కళ్ళతో, ఉప్పెక్కిన నోటితో , బరువెక్కిన హృదయంతో కొత్త బట్టలేసుకుని మత్తుగా నిదరపోయాం మేమందరం. ఆ కొత్త బట్టలు మాకు అతికినట్టు సరిపోయాయి (స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కాస్ట్యూమ్ లాగ  అన్నమాట).    అన్నట్టు ఆ బట్టలు కుట్టింది మా ఊరిలో ఏకైక (లేడీస్ ) టైలర్ కాంతారావు. ఇంట్లో ఉన్న  ఆడ లేడీస్ అక్కడే కుట్టించేవారు, వాటితో పాటు పనిలో పని మావి కూడా అక్కడే కుట్టించేసేవారు డెడ్ సీప్ అని.  
ఆ గాఢ నిద్రలో  పులిహోర, బొబ్బట్లు తింటునట్టు  ఒకటే మెరుపు కలలు. ఉలిక్కిపడి లేచాను. పులిహోర ఘాటు, నేతి బొబ్బట్టు కలగలిపిన  ఒక కమ్మటి సువాసన నను పిలిచింది రా రమ్మంటూ. పట్టాను  ఒక పట్టు. వంటలో మా అమ్మమ్మ కి సాటి లేదంటూ. కవిత్వం పొంగింది కదూ నాలో దాన్ని తలుచుకుంటూ.
ఆ రోజు మా ఇల్లు చుట్టాలతో, మా పెరటి సావిడి పేకాట రాయుళ్ళతో నిండిపోయింది. మీరు పేకాట సరదాగా ఆడేవాళ్ళు చూసుంటారు, డబ్బులకి ఆడే వాళ్ళని చూసుంటారు, క్లబ్బుల్లో ఆడే వాళ్ళనీ చూసుంటారు. కానీ నేను పేకాటే  వృత్తిగా  ఆడే వాళ్ళని చూసాను. వాళ్ళు కేవలం పేకే ఆడతారు. అదే వారి జీవిత లక్ష్యం, ఆశయం, కర్తవ్యం. ఈ బ్యాచ్ మా ఊరిలో ఏ  శుభకార్యానికెళ్ళినా, చుట్టాలు దండిగా ఉన్న  ఏ ఇంటికెళ్ళినా  కనపడేది. ఇలా పండగలు, పెళ్ళిళ్ళు  ఏవీ  లేనప్పుడు వీళ్ళ   పరిస్థితి ఏంటని నాకు బోలెడు జాలి వేసేది. ప్రభుత్వం పేకాటని స్వయం ఉపాది పధకంగా ఎప్పుడు గుర్తిస్తుందో, పావలా వడ్డీ రుణాలు ఎప్పుడిస్తుందో  అని నేను బెంగ పెట్టుకునే వాడిని.
ఆ .. ఎక్కడున్నాను... ఆ .. నేను నిద్ర లేచి, కాస్త ఎంగిలి పడి, మా గ్యాంగ్ తో కలిసి, గుడికి బయల్దేరా. అరుగు దిగుతూండగానే ఎక్కడినించో ఒక ఘాటయిన సువాసన ముక్కులదిరిపోయేలా వచ్చింది.  ఈడెవడ్రా బాబూ   అత్తరులో బట్టలుతుకున్నట్టు ఉన్నాడు. ఇంత ఘాటేంటి రా అనుకునేంత లోపు మా తాతయ్య స్నేహితుడు సూర్యనారాయణ గారు ప్రత్యక్షమయ్యారు. ముసలోడే కానీ మహా రసికుడు అనుకుని అరుగు దిగుతున్నాం.
ఆయన నన్ను చూసి " ఏరా అబ్బీ , ఎలా ఉన్నావ్రా. మీ నాన్న నా కళ్ళ  ముందు పెరిగిన వాడు. నేనంటే మహా గౌరవం. ఎరుగుదువా" అని అడిగాడు. ఆయన వ్యవహారం, పిలుపు కూడా నాకు నచ్చలేదు. నాకు వళ్ళు మండి "అయితే మీరు ఈ శతాబ్దం లో పుట్టలేదా తాతయ్యా" అని అన్నాను. ఆయనకీ చిర్రెత్తి "ఔన్రా అబ్బీ నీ బట్టలేంటి బాగా బిగ్గా ఉన్నాయి, మీ తమ్ముడివా " అనడిగి తిక్క కుదిరిందా అన్నట్టు నవ్వుతున్నారు. నాకు మా కాంతారావు టైలర్ గాడిని కాలికింద పురుగులా నలిపేయాలనిపించింది. మా అమ్మ మీద కూడా పీకల దాకా  కోపం వచ్చింది.
ఆ కోపంలో  అరుగు మెట్లు గబా గబా దిగుతున్నా. ఆఖరి మెట్టు దిగగానే స్కేట్ బోర్డు మీద కాలేసినట్టు రోడ్డుమీద జారడం మొదలెట్టాను . ఆ జారడం జారడం మా పక్కింటి కర్ణం గారింటి దగ్గర ఆగాను...కాదు పడ్డాను.. ఇంచు మించు నడ్డి విరిగేడట్టు పడ్డాను .  ఒకపక్క నే తొక్కిన గొబ్బిళ్ళు, ఇంకోపక్క మా వీధిలో వాళ్ళ నవ్వులు. గుండె భోగి మంట మండింది. అప్పుడు తెలిసింది నాకు, కాలు జారిన మగాడంటే ఈ సంఘానికి ఎంత కామెడీనో. సిగ్గుతో మొహం చొక్కాలో దాచుకుని, కాలికున్న గొబ్బిల్లను తుడుచుకుని ఇంటికి పరిగెత్తాను.అవమానంతో, ఇంటికెళ్ళగానే కాంతారావు కుట్టిన ప్యాంటు ని గాడిపోయ్యలో  పడేసి, బెడ్రూం కి  గడేసి ఆ రోజంతా అక్కడే పడుకున్నాను.అయినా అవమానం మర్చిపోలేక రాత్రికి ఆత్మహత్యా యత్నం కూడా చేశా.
ఆ ప్రయత్నమే - నేను రాజశేఖర్ నటించిన "మొరటోడే  నా మొగుడు"  సినిమా చూడడం.
* కుంకుడు పులుసుతో తలంటు ఎరుగని అదృష్టవంతులు, అజ్ఞానుల కోసం  --

 ఉప్పురాళ్ళు కుంకుడు రసం కంట్లో పడిన వాళ్ళకి ఇస్తారు. అవి  నోట్లో పెట్టుకుంటే కళ్ళ మంట, కంట్లో నలుసులు పోతాయని  ఒక నమ్మకం. నిజానికి ఉప్పరాయిని చప్పలిస్తే ఆ ఉప్పుని తట్టుకోలేక ఆ బాధలోకి డైవర్ట్ అయ్యి కంట్లో బాధను మర్చిపోతాం అని నా నమ్మకం.అసల  వేమన చెప్పులో రాయి, కంటిలో నలుసు కాదు - నోటిలో రాయి  కంటిలో పులుసు అని రాసుంటే బావుండేది.


19th Jan సవరణ : అసల ఈ టపా రాయాలని ఆలోచన మొలకెత్తించినది నెమలికన్నులో టపా. నెమలికన్ను మురళి గారికి ప్రత్యేక కృతజ్ఞ్యతలు.