ఒక శనివారం 1992,
హైదరాబాద్
"అక్కా బయిటికి వెళ్దాం రావే. ఎంచక్కా ఆడుకోవచ్చు. కరెంట్ వచ్చేవరకు"
"వద్దులేరా తెలుగు వార్తలు అయిపోయాయి. ఉర్దూ వార్తలు కూడా ఐపోవచ్చాయి. మనం వచ్చే లోపు కరెంటు వచ్చేస్తే సినిమా కొంచం మిస్ ఐపోతాంరా"
"కరెంటు అప్పుడే రాదే. పెద్ద మంట వచ్చింది ట్రాన్స్ ఫార్మర్ నించీ. ఎలెక్ట్రిక్ అంకుల్ రావడానికే గంట పడుతుంది."
"నీకెన్ని సార్లు చెప్పాను. ఎలెక్ట్రిక్ కాదు లైన్మెన్ అంకుల్ అని"
"అలా ఐతే నాన్న రోజూ రిక్షవాడిని. ఆటో వాడిని, షాపు వాడిని అందరినీ అంకుల్ అనకూడదు అని చెప్తే నువ్వు విన్నావేంటి. ఇప్పుడదంతా ఎందుకు. పక్కింటి ప్రియాంకా, ఎదురింటి తేజా కూడా వస్తారు. పద త్వరగా. రాత్రి 'కరెంట్ షాక్' ఆడితే భలే ఉంటుంది."
-----
ఒక వేసవి రాత్రి , 1997
ఐనాపురం
"అప్పుడే మొదలెట్టేశారా.. రాత్రైతే చాలు. కరెంటు పోయి చీకటిలో మొహాలు కనపడవేమో ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో కూడా ఆలోచించకుండా, మరీ ధైర్యంగా పాడేస్తున్నారు. ఈ అంతాక్షరీ తో హడల కొట్టేస్తున్నారు. హాయిగా పెందరాడే పడుకోవచ్చు కదా. మేమైతే తాతయ్య పొలం నించి వచ్చేసరికి పడుకునే వాళ్ళం తెలుసా. ఇక మా అమ్మమ్మా వాళ్ళింట్లో ఐతే అయిదింటికి రాత్రి భోజనాలు. ఆరింటికి పడక."
"మావయ్యా. మీకు అదే అలవాటు ఐపోయినట్టుంది. ఏడైతే చాలు తెగ తూలిపోతారు. రాత్రి నిద్రకు ఆగలేరు. పొద్దున్నే మమ్మల్ని లేపకుండా ఉండలేరు. కనీసం ఎనిమిదింటి వరకూ కూడా పడుకోనీకుండా ఏంటిది."
"బాబయ్యా. మీ ఊళ్ళో సగం సేపు కరెంటు ఉండదు. మేము వచ్చినప్పటి నించీ ఒక్క రాత్రి అయినా కరెంటు ఉందా. టీవీ చూడలేం. బయటకెళ్ళి ఆడలేం. పోనీ ఊరంతా షికారు కెల్దామంటే మీ భయం తో మమ్మల్ని భయపెట్టేస్తున్నారు. మర్రిచెట్టు వరకూ వెళ్ళేలోపు వెతకడం మొదలెట్టేస్తావ్ ఎక్కడున్నామా అని."
"నాన్నా ఆకోనీ.. నువ్వు యెల్లి పో.
బావా ఇప్పుడు ప తొ పాదాలి నువ్వు "
------
ఒక బ్యాడ్ డే కి ముందు డే, 2001
హైదరాబాద్
"రేయ్. ఏంట్రా ఇది. సిరాకు దొబ్బుతోంది. మొన్నటి దాకా ర్యాగింగ్. ఫ్రెషర్స్ ఐంది కాస్త ఎంజాయ్ చేద్దాం అనేలోపు ఈ ఎగ్జామ్స్ ."
"ఔన్రా. అయినా ఈ తొక్కలో ఇంజనీరింగ్ లో చేరకూడదు రా . చేరినా జే ఎన్ టి యు లో అసల జేర కూడదు. ఏడాదికి ఆరు ఇంటర్నల్సా. మొదలెట్టింది డిసెంబర్లో, ఆగష్టు లో ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్. అంటే ప్రతీ నేలా ఏదోకటి రాస్తూనే ఉన్నాం. ఇక నెక్స్ట్ సెం మరీ ఘోరం."
"మీరిద్దరూ ఆపండిరా. తొక్కలో డిస్కషన్. నేను రాజు గాడు ఎప్పుడు వస్తాడా అని వెయిటింగ్."
"ఎందుకు రా.. ఆడు అసలే పరమ ఐరన్ లెగ్గు కదా"
"అందుకేరా. మనం చేసేదే వన్ డే బ్యాటింగ్. రేపు ఎగ్జాం పెట్టుకుని ఈ రోజు కూడా చదవకపోతే ఎదవ గిల్టీ ఫీలింగ్. పైగా మా నాన్న ఇదే పాయింట్ మీద ఏడాది దెప్పు తాడు. అదే కరెంట్ పొతే ఒక తొక్కలో ఎక్స్క్యూస్ అయినా ఉంటుంది."
"ఏడిసావ్లే. నీ తొక్కలో రీసనింగ్ నువ్వూ. మీ నాన్న జెనరేటర్ అద్దెకి తెచ్చి అయినా ఈ రోజు మీ ఇంట్లో కరెంట్ ఉంచుతాడు."
"రేయ్. రాజు గాడొచ్చాడు!!"
"కరెంట్ పోయింది"
"పదండ్రా.. నాకు బుర్ర హీటెక్కి పోయింది. చాయ్ పడాలి. అలా ఒక రౌండ్ ఏసోద్దాం."
--------
ఒక కరెంటు పోయిన రాత్రి, 2010
బే ఏరియా (కాలిఫోర్నియా)లో అమెరికన్లకంటే తెలుగు వారు ఎక్కువగా ఉండే ఒకానొక నగరం.
"వాట్. కరెంటు పోయిందా. నీ మొహం. ఆ ఫ్యూజ్ ట్రిప్ అయ్యి ఉంటుంది. సరిగ్గా చూడు"
"లేదు ఎవరికీ లేదు. జంక్షన్ లో ట్రాఫిక్ లైట్స్ కూడా పని చెయ్యట్లేదు. తెలుసా"
"ఔనా. Strange. ఇది నేనిక్కడికి వచ్చినప్పటి నించీ జస్ట్ రెండవ సారి అనుకుంటా. మూడేళ్ళలో "
"నేనొచ్చాకా అసల ఇదే మొదటి సారి"
"కాల్ చేసావా"
" గంట వరకూ రాక పోవచ్చని చెప్పారు. ఏం చేద్దాం."
"వాక్ కెల్దామా?"
"నువ్వేనా ఆ మాటన్నది.. :)... ఓకే "
"అబ్బ.. ఎన్నాళ్ళయిందో.. చీకట్లో.. కటిక చీకట్లో.. ఇలా ..ఆకాశాన్ని చూసి. పాలవిల్లుకి కట్టిన పళ్ళలా వేలాడుతున్నాయి కదూ నక్షత్రాలు. చంద్రుడు మరీ ముద్దొచ్చేస్తున్నాడు. బ్లాకు డ్రెస్ లో ఉన్న తమన్నాలా.. ఎపుడో చదువుకునే రోజుల్లో చూసా."
"ఎవరిని?"
"కంగారు పడకు. తమన్నా అప్పటికి సినిమాలలో రాలేదులే..
.. ఔను.. రోజూ ఇలాగే ఉంటుందా?"
" హ్మ్.. ఏమో. అవి ఆకాశంలోకి వచ్చేలోపు నువ్వు ఇంటికి రావు. నువ్వు వచ్చాక మనం బయటకి వెళ్ళం."
"ఛ. రోజూ ఒక గంట కరెంటు పోకూడదూ..""అబ్బా. ఎంతాశో.. ఇది అమెరికా. ఇప్పటికే టీవీ లో ఇదో పెద్ద న్యూస్ అయిపోయి ఉంటుంది. "
"ఏంటి మనం వాక్ కి రావడమా..??"
"హ్మ. $!@#$&#*($)_)(_)"
------
P.S. బే ఏరియా లో మొన్న రెండు నగరాలలో 85 నిమిషాలపాటు ఏక బిగిన పవర్ కట్.