Saturday, March 20, 2010

కారం చట్నీ (అయినాపురం కథలు)

నలభీమ పాకం అంటారు కానీ మా అమ్మమ్మ వంట కంటే అది గొప్పగా అయితే ఉండదని  నా  నమ్మకం. ఏ వంట అయినా అలవోకగా చేసేస్తుంది అమ్మమ్మ.  అద్భుతంగా ఉంటుంది. అది గుత్తొంకాయ అయినా , గుమ్మడి వడియాలయినా, కందా బచ్చలయినా.. కందిపొడి అయినా సరే.  ఇంత విద్య ఊరికే పోతోందే అమ్మమ్మా  అంటే,"ఊరి కే పోతోంది రా " అని చమత్కరించేది.  ఒక కుక్ బుక్ తయారుచేస్తే బావుంటుంది అనిపిస్తుంది నాకు.కానీ అంత వంట వచ్చిన మా  అమ్మమ్మ చేసే ఇడ్లీ మాత్రం మా సూరయ్య హోటల్ ఇడ్లీ.. కాదు కారం చట్నీవిత్ ఇడ్లీ (క్రమం కరెక్టే)  ముందు దిగదిడుపు.
మా వీధి చివర కుట్టు మిషను కాంతారావు కొట్టుకి ఎదురుగా పాకలో చిన్న హోటల్ సూరయ్యది. అయినాపురం మొత్తానికి ఏకైక హోటల్. అయినాపురం వచ్చినప్పుడు అది వెతకకండే.. దానికి బోర్డు గట్రా ఏమీ ఉండవు. ఊరిలో ఎవరినయినా  అడిగితే  మాత్రం జబ్బట్టుకుని తీసుకొచ్చేస్తారు. బోర్డు మీద పేరు లేకపోయినా ఊరిలో మాత్రం తెగ పేరుంది ఆ హోటల్ కి. అందరూ సూరయ్య హోటల్ (కొంత మంది ముద్దుగా సూరి గాడి హోటల్) అని అంటారు. హైదరాబాది బిరియానీకి ప్యారడైస్, బావర్చి లాగ మా ఊరిలో టిఫిన్లకి అది పెట్టింది పేరు.
నాలుగు చక్క బల్లలు, పాత సినిమా పోస్టర్లు (ఎక్కువగా ఎన్టీ వోడివే) కప్పుకున్న గోడలు,  ఒక బుల్లి వంట గది, బోలెడు జనం దాని ట్రేడ్ మార్క్.  ఉదయం అయిదు నించీ ఏడింటి వరకే తెరిచి ఉంటుంది. తాతయ్య తో వెళ్తే అక్కడే తినేవాళ్ళం. కానీ తాతయ్యేమో ఉదయాన్నే వెళ్ళిపోతాడు తినడానికి. మేము లేచేసరికి ఆయన తిని రావడం కూడా అయిపోయేది. అందుకని ఇంటికే తెచ్చుకునే వాళ్ళం.హోటల్ ఎప్పుడూ కిక్కిరిసి ఉన్నా మేము వెళ్ళగానే సూరయ్య పలకరించే వాడు. మేము ఏమీ చెప్పకుండానే "వాయవుతోంది బాబూ. యేడి యేడి గా యేసిస్తాను. కూకోండి" అని మేము తెచ్చిన స్టీల్ బకెట్, గ్లాసులు లాక్కునేవాడు. దేవత పోస్టర్ మీద పేర్లన్నీ చదివే లోపు బకెట్ నిండా ఇడ్లీలు, దాని మీద విస్తరాకులు, గ్లాసుల నిండా చట్నీలు నింపి తెచ్చేవాడు. ఇడ్లీల కన్నా ముందు చట్నీ ఉందో  లేదో చూసుకుని అతను  "మీ తాతయ్య ఖాతా లో వేసుకుంటా బాబూ" అని  అనగానే  ఇంటికి పరుగు తీసేవాళ్ళం. ఇలాటి ఇడ్లీలు రూపాయికి నాలుగా అని ఆశ్చర్యంగా ఉండేది.
ఇంటికి పరుగెడుతుంటే, ఒక్కోసారి పక్కింటి అరుగు మీద ఆయన సిగ్నేచర్ పంచెతో అర్థ దిగంబరంగా కూర్చునే రాజు గారు ఆపేవారు. "ఏంటి హోటల్ నించీ వస్తున్నారా. అచ్చియ్య (ఆయన భార్య) ఏమీ చెయ్యలేదు.  శివగాడు గోల పెడుతున్నాడు..............." అని ఆయన ఏడ్పుల చిట్టా విప్పేలోపు ఓ నాలుగు ఇడ్లీలు విస్తరాకులో పెట్టి ఆయనకిచ్చి శివకి ఇమ్మనేవాళ్ళం.ఒక్కోసారి మా టైం బావుంటే అయన పిలిచినా వినిపించుకోకుండా ఇంటికి పరిగెత్తే వాళ్ళం.
ఇంటికి రాగానే పెరటి అరుగు మీద కూర్చుని విస్తరాకులో ఇడ్లీ, దాని పక్కన కారపు చట్నీపెట్టుకుని ప్రారంభించే వాళ్ళం.మొదటి ఇడ్లీ ముక్క - నోట్టో పెట్టుకోగానే వేడి ఇడ్లీతో చల్లని పచ్చడి కలిసి నాలుక మీద ఒక రుచి, నాట్యం చేసేది. గాలిలో తెలిపోయే వాడిని. రెండవ ముక్క - చేతిలో ఉండగానే నాలుక ఆ రుచి కోసం తహతహలాడుతూ అర అడుగు బయటకి వచ్చి గబాలున లాక్కునేది. అది కరిగిపోయే లోపు త్రిశంకు స్వర్గం దాటేసేవాడిని. మూడవ ముక్క - ఎక్కడ..ఏది .. అప్పుడే గొంతులో - నేను స్వర్గపుటంచులో.
అలా ఆ రుచిని ఆస్వాదించే లోపు ఆకులో అరడజను ఇడ్లీలు, గ్లాసులో సగం చట్నీ అయిపోయేవి. నేనే తిన్నానా నేనెప్పుడు తిన్నాను ..అనుకునేవాడిని. మిగలిన కారం చట్నీని ఆకు మీద వేసి కొంచం కొంచం తింటుంటే ఆహా నా రాజా..  స్వర్గం లో ఇంద్రుడు పక్కన కూర్చుని కత్రీనా, కరీనా, తమన్నా,ఇలియానా రెహమాన్ సంగీతానికి నాట్యం చేస్తుంటే చూస్తున్నట్టు ఉండేది.
సూరయ్యా!.. ఈ కారం చట్నీలో ఏం కలిపావయ్య.. కుబేరుడి భార్య ఆడిన కారమా, ఇంద్రుడి ఇంట్లో వాడిన పచ్చిమిర్చా, వరుణుడు వేయించిన పోపా అని సూరయ్య మీద కారం చట్నీ కీర్తన ఒకటి పాడాలనిపించేది. నా సాహిత్యం చూసి, గొంతు విని మా ఊళ్ళో వాళ్ళంతా ఉప్పరి  డాక్టరుకి  పేషంట్లు అయిపోతారని ఆగిపోయాను.
ఇలా రోజూ ప్లేట్ ఇడ్లీ తో సీప్ గా స్వర్గానికి వెళ్ళే దారి తెలిసాక వదిలి పెట్టలేక పోయాను.చద్దనం లో ఆవకాయా, కారం చట్నీ తో ఇడ్లీనా  అంటే తేల్చుకోవడం కొంచం కష్టం అయినా ఎక్కువగా ఇడ్లీ చట్నీకే వోటు పడేది.
"అమ్మమ్మ శుభ్రంగా మడి కట్టుకుని రోట్లో పిండి రుబ్బి వేడి వేడి ఇడ్లీలు, కమ్మగా చట్నీ చేసి పెడితే ఎక్కదు మనకి. అక్కడ సూరయ్య వారం నుండీ పులిసిపోయిన పిండిని... ఏమేం పిండులు కలిసాయో.. ఏమేం చేతులు పడ్డాయో ... ఇడ్లీ వేస్తే నాక్కుంటూ తింటారు." అని మావయ్య, అమ్మ ఇడ్లీ తెచ్చినప్పుడల్లా అష్టోత్తరం చదివేవాళ్ళు. ఆ రుచి వీళ్ళకేం తెలుసు అని మనసులో నవ్వుకుని, మర్నాడు ఎప్పుడు తెరుస్తాడా సూరయ్య హోటల్.. ఎప్పుడెప్పుడా కారం చట్నీ .... అని ఆలోచిస్తూ ఉండేవాడిని

15 comments:

 1. ఇది చదివిన తర్వాత ఇడ్లీ మీద మరింత మనసైపోయింది. మాములుగానే నేను ఇడ్లీ అభిమానిని. మీ ఊర్లోది సూరయ్య హోటల్ అయితే మా అమ్మమ్మ గారి ఊరు ఊబలంకలో ఉన్నది సత్యం హోటల్. వేడి ఇడ్లీ అరిటాకులో వేసి పొట్లం కట్టేవాడు. ఇప్పుడు అతను లేడు. ఆ రుచి లేదు.

  ReplyDelete
 2. @ శ్రీవాసుకి - నెనర్లు. అరిటాకా. మరింకనే .అది ఐతే పదార్థం ఏదయినా సరే చూడగానే తినాలనిపిస్తుంది.

  పి.వే - ఆ ఆకుపచ్చరంగు ఎపటైట్ పెంచుతుందని ఎక్కడో చదివినట్టు గుర్తు.

  ReplyDelete
 3. అహా నోరూరుపొతోంది :-))

  ReplyDelete
 4. ఆయ్.. సూపరండి.. మా సాయిత్రమ్మ ఒటేలూ, నీలయ్య పెసరట్టూ గుర్తొచ్చి నోరూరతందండి.. అయ్ బాబోయ్.. ఇప్పుడెలాగండీ..

  ReplyDelete
 5. ఆహా!! ఇడ్లీ కారం చట్నీ కమ్మదనం అదిరిపోయాయండీ :-) మరే మరే అఱిటాకుపచ్చరంగు ఆకలి పెంచడమే కాదు. వేడి వేడి టిఫిన్లు ఆ ఆకురసం పీల్చుకుని మరింత కమ్మదనాన్ని తమసొంతం చేసుకుంటాయ్.

  ReplyDelete
 6. ఆహా! భలే ఉన్నాయండి మీ ఊరి ఇడ్లీ-కారంచట్నీ అనుభవాలు.. ఈసారి టపాలో చమత్కారం తెగ చిందులు వేస్తోంది :-)
  పైన వేణూ గారు చెప్పినట్టు లేత అరిటాకు ఆ ఇడ్లీ కమ్మదనం మరింత పెంచుతుందనుకుంటా!

  "రెండవ ముక్క - చేతిలో ఉండగానే నాలుక ఆ రుచి కోసం తహతహలాడుతూ అర అడుగు బయటకి వచ్చి గబాలున లాక్కునేది."
  :)))

  ReplyDelete
 7. నిజంగా ఆ ఇడ్లీ-కారం చట్నీ తిన్న ఫీలింగ్ కలిగింది. మీ శైలి చాలా బాగుంది. ఇవన్నీ రాసాక తొందరగా పుస్తక రూపంలో వేయండి..

  ReplyDelete
 8. @ స్వప్న - నెనర్లు . గబుక్కున చూసి.. ఇడ్లీ కథకి కి ఇది కథా ( ఐ కనపడక ) అని చదివా. ఇదేంటి నేను ఎవరన్న అడుగుతారేమో అని భయపడ్డ మాటని ఈవిడ టపీమని అనేసారు అని ఉలిక్కిపడ్డాను :) .

  @మురళి - యాండేయ్! ఇసిత్రమేంటంటే అంత సూపరుగా ఉన్న హోటలు ఇప్పుడు కొట్టు కట్టేసారండీ .. ఆయ్ . ఇంకోటి తెరిసినా ఆ రుసెక్కడండీ బాబూ. మరి మీ ఊరో.. ఇంకా ఉన్నాయేటన్డీ ??

  @ వేణూ శ్రీకాంత్ - ధన్యవాదాలు. అదన్నమాట అసల రుచి కి కొసరు రుచి అరిటాకు భోజనానికి.

  @ నిషిగందా - థాంక్స్. నేను ఎప్పట్నించో చూస్తున్నాను మీ కామెంట్స్ చాలా బ్లాగ్స్ లో . చాలా డీటెయిల్డ్ గా శ్రద్ధగా చదివి పెడతారు. కృతఙ్ఞతలు.

  @ కెక్యూబ్ - మరే అంత లేదేమో .. కాదు లేదండీ ఈ కథలకి. నాకు కథ రాయడం రాదు ..ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా (అతడు స్టైల్ లో ) అయినా మీ అభిమానానికి థాంక్సులు.

  ReplyDelete
 9. Vasu, Suuper Guru...I luv ur posts. In fact, my father has started reading your blog of late and he is enjoying it a lot.

  Ippudu Daddy naaku valla oorloni 'Chittemma' hotel, 'Bullayamma' hotel gurinchi lecture istunnaru :)

  ReplyDelete
 10. @శ్రీరాం - థాంక్స్. అంకుల్ కి నచ్చిందా. చాలా సంతోషం. అంకుల్ వాళ్ళ ఊరులో హోటళ్ళ పేర్లు బావున్నాయి.

  ReplyDelete
 11. ఇంత వరకు ఏ బ్లాగ్ లొనూ ఇడ్లీ గురించి రాయలేదు , ఇడ్లీ కారం చట్నీ.. చదువుతుంటేనే నోరూరుతుంది.. ఇంకా Taste చేస్తే MMMMM....... అనాలి...
  ఆ సూరయ్య కొట్టుకి దారేది ???.

  ReplyDelete
 12. Hi Vasu,

  Bhale raasavu ga assalu! Idlila meeda inta andanga, noroorincherakanga raayachchani ippude telusukunnanu. I couldn't stop chuckling!

  Mukhyanga ... ikkada ... assalu navvu aapukolekapoyanu!
  మొదటి ఇడ్లీ ముక్క - నోట్టో పెట్టుకోగానే వేడి ఇడ్లీతో చల్లని పచ్చడి కలిసి నాలుక మీద ఒక రుచి, నాట్యం చేసేది. గాలిలో తెలిపోయే వాడిని. రెండవ ముక్క - చేతిలో ఉండగానే నాలుక ఆ రుచి కోసం తహతహలాడుతూ అర అడుగు బయటకి వచ్చి గబాలున లాక్కునేది. అది కరిగిపోయే లోపు త్రిశంకు స్వర్గం దాటేసేవాడిని. మూడవ ముక్క - ఎక్కడ..ఏది .. అప్పుడే గొంతులో - నేను స్వర్గపుటంచులో.

  All throughout the post, there is a sense of nostalgia and homeliness ... I will keep coming back for more idli and khaarapu chutney! :)

  ReplyDelete
 13. @ శ్రీవిద్య - థాంక్స్. నచ్చినందుకు సంతోషం.

  ReplyDelete
 14. @ విద్య - సూరయ్య కొట్టు ఇప్పుడు లేదు సారీ. అలాటిది ఇంకోటి ఉంది తీసుకెళ్తాలే ఈ సారి

  ReplyDelete