"వారిని! ఇవేనా అలిపి బ్యాక్ వాటర్స్ అంటే. మా
అయినాపురం లో మురిక్కాలువ అంత ఉంది దీని వెడల్పు . దీనికి పదకొండు వేలు, పెద్ద హడావుడి. కోనసీమ లో ఇలాటి బోట్లు పెడితేనా "God's own county" అనేస్తార" న్నాను
"అయితే ఈసారి తీసుకెళ్ళరా. మేమూ చాలా విన్నాం"
"సరే ఐతే ఈసారి అక్కడికే. మీరు కోనసీమ చూడలేదు. నేను పాపి కొండలు చూడలేదు. ఒకే ట్రిప్పుకి రెండు ... "
"సర్లే. ట్రై చేసింది చాలు. ఈ సారి సరిగ్గా ప్లాన్ చెయ్యి. " చిరాగ్గా సెలవిచ్చాడు కిరణ్.
ఆ కేరళ ట్రిప్ ఐపోయాకా,లీవ్ తీసుకున్న నేరానికి నాకు ఆర్నెల్లు కఠిన క్యూబికల్ శిక్ష పడి పనిలో మునిగి తేలి, యత్రాలంటే భయం, లీవంటే వణుకు పట్టుకున్నాయి.
శిక్షా కాలం ముగిసాకా ఒకనాడు స్నేహితులతో కలిసి అనుకోకుండా గోదావరి సినిమాకి వెళ్లాను.
కట్ చెయ్యకుండానే ... నెలలో ఒక లాంచీ యజమాని కాంటాక్ట్ దొరకడం అతను మమ్మల్ని బ్రహ్మి (సా. ఇ ) అని తెలిసి వాయించి వదలడం, రాజమండ్రి నించి భద్రాచలం కి లాంచీ కుదరడం చక చకా జరిగి పోయాయి.
**********************************************
రెండు వారాల తరువాత...
మా ప్రయాణం రోజు రానే వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్ లో మేము ఏడుగురం స్నేహితులం కలుసుకున్నాం.
గౌతమీకీ గార్డ్ సిగ్నల్ ఇచ్చాడు. రైలు బయల్దేరింది.
కానీ ముందు ఏదో జరగబోతోంది అన్నట్టు ట్రైన్ స్లో మోషన్ లో కదలలేదు, ఆకాశం మేఘావృతం కాలేదు, మెరుపులు మెరవలేదు, ఉరుములు ఉరమలేదు. ప్రకృతి బొత్తిగా ఏ క్లూ ఇవ్వలేదు.
మర్నాటి ఉదయం
మాలతి గారి ఊరిలో దిగాం. అదేనండీ నిడదవోలు.
అక్కడికి మా పెదనాన్న పంపిన సూమో ( ఈ మాట వినగానే ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అనేసుకోవడమే. ఇది కోనసీమ. రాయలసీమ కాదు.) ఎక్కి అరగంట లో చాగల్లు చేరుకున్నాం. ఈ ఊరు షుగర్ ఫ్యాక్టరీ కి ప్రసిద్ది మా అమ్మమ్మ వాళ్ళ వంశం లాగా. సీజన్ అనుకుంటా ఎక్కడ చూసినా చెరుకు కనపడుతోంది.
ఇంటికి చేరగానే మా గ్యాంగ్కి ఇంటి టూర్ ఇచ్చి, కాఫీలిచ్చి, టిపినీలు పెట్టింది మా దొడ్డమ్మ. వేడి వేడి పెసరట్టుని ఉప్మా తో ఒక పట్టు పట్టాం అందరం. బుద్ధిగా స్నానం చేసి, శ్రద్ధగా దండం పెట్టుకుని పట్టి సీమకి బయల్దేరాం.
ఆ రోజు ప్రయాణం ...పట్టి సీమ, గోదావరి మీద లాంచీ, పాపి కొండలు, భద్రాచలం.. తలుచుకుంటే కడుపు నిండి ఆ తిండి ఆకర్లేదని పించింది.
పట్టిసీమ ఇవతల ఒడ్డుకి చేరుకున్నాం. అక్కడే మా లాంచీ, దాని యజమాని/మా టూర్ గైడ్ తాతాజీ కనిపించాడు. దగ్గరలో ఉన్న ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహానికి దండం పెట్టించి, లాంచీ ఎక్కించాడు (ఇందులో మతలబు బోధపడలేదు అప్పుడు ). ఈ లాంచీ మొత్తం మీ కోసం, ఎవరిని ఎక్కించం, ఇందులో మీకు అన్నీ రెడీ - కాఫీలు, టిపినీలు, భోజనం అని చెప్పుకొచ్చాడు. మేము అనుకున్నంత కాకపోయినా బానే ఉందనిపించింది. ఫోటోలు తీసుకున్నాకా, లాంచీ రయ్యంది, అయిదు నిమిషాలలో అవతలి ఒడ్డున ఉన్న పట్టి సీమకి చేరుకున్నాం. ఆ ఇసుక తెన్నెల్లో దిగగానే శంకరభరణం, వంశీ సినిమాలు గుర్తొచ్చాయి. అద్భుతంగా ఉంది, గోదారి వడిలో, నీటి చప్పుడులో, సేద తీరడానికి భలే స్పాట్ సెలెక్ట్ చేసుకున్నావు కదయ్యా వీరేశ్వరా అనుకున్నాను.
దర్శనం చేసుకుని లాంచీ చేరుకున్నాం. వాడిచ్చాడు కదా అని టిపినీ కొంచం టేస్ట్ చేసి లాంచీ పైకెక్కి సై అన్నాం. క్లీనర్ రై రై అన్నాడు. లాంచీ నీటి తెరలను చీల్చుకుంటూ ముందు కెళ్ళింది. సూత్రధారులు సినిమాలో సత్య నారాయణ లాగా కూర్చిలో కూర్చుని గోదావరిని చూస్తూ కూర్చున్నాం. చూడడానికి ఇంకో రెండు కళ్లుంటే బావుండనిపిచింది. కొంత సేపయ్యాక కిందకు దిగి, లాంచీ వంచ మీద కాళ్ళు నీళ్ళల్లో పెట్టి కూర్చుంటే, ఆ వడికి, నీటి తుంపరలు ఎగిరి పడుతుంటే, చల్లని ఏటి గాలి తడుతుంటే స్వర్గం దీనికి దిగదుడుపేమో అనిపించింది.
ఆ హాయిలో గంటలు నిమిషాలు లా గడిచిపోయాయి. సుమారు ఒంటి గంటకి పాపి కొండల దర్శనం ఐంది. "అల పాపి కొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా" అని వేటూరి చెప్పినట్టు, గోదారి నవ్వుతున్నంత ఆహ్లాదంగా ఉంటుంది, ఆ కొండలను కడుగుతునట్టే ఉంటుంది. చాలా సేపు చూడనిచ్చాక తాతాజీ లాంచీ ని ఒక తాండా దగ్గర ఆపాడు. అక్కడే మా మధ్యాహ్న భోజన పధకం అన్నమాట. అసల ఒక్క పదార్ధం కూడా తినలేక పోయాము. కొంత సేపు ఆ వ్యూ పాయింట్ నించీ గోదారిని తనివి తీరా చూసి బయల్దేరాం.
గోదావరి లో నీరు అంత ఎక్కువగా లేకపోవడం వల్ల, భద్రాచలం వరకూ లాంచీ వెళ్ళదని చావు కబురు చల్లగా సెలవిచ్చాడు తాతాజీ. అందువల్ల మా ప్రయాణానికి చిన్న మార్పులు చేర్పులూ చేసి మమ్మల్ని పోచవరం లో దింపుతా అన్నాడు. అక్కడి నించీ బస్సు పట్టుకుంటే కూనవరం, అక్కడ ఇంకో బస్సు పట్టుకుంటే భద్రాచలం.
ఓస్ ఇంతేగా అనుకున్నా, మా గత ప్రయాణాల అనుభవాల వల్ల ఏదో తేడా కొట్టింది. భారం రాముడి మీద వేసి బయల్దేరాం.
పోచవరం చేరే సరికి సాయంత్రం ఆరయ్యింది. అదో చిన్న పల్లె. ఒక డజను ఇల్లుంటాయేమో. ఇక్కడికి బస్సు కూడా వస్తుందా అని ఆశ్చర్య పోయాం. కానీ మా ఆశ్చర్యాన్ని పటాపంచలు చేస్తూ మాకు భయం కలిగించే విషయం చెప్పాడు తాతాజీ - ఆఖరి బస్సు మూడింటికే వెళ్ళిపోయిందని. గుండెలో రాయపడినా, తాతాజీ ఏదో మార్గం చూస్తాడులే అని ధైర్యం. ఆటోలు ఎమన్నా ఉన్నాయేమో అని కనుకున్నాడు. ఆటో కాదు కదా కనీసం ద్విచక్ర వాహనం కూడా ఎవరికీ లేదు ఆ పల్లెలో. వాళ్ళనీ వీళ్ళని కనుక్కొని అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఇంకో ఊరుందని, అక్కడ ఆటో లేమన్నా దొరకచ్చని, లాంచీ లో ఉన్న మా సామాను తీసుకోమని సెలవిచ్చాడు తాతాజీ.
మాకొచ్చిన కోపానికి తాతాజీ ని కాలు కిందేసి తొక్కేయాలని పించింది. కంట్రోల్ చేసుకుని, సమస్య సామరస్యం గా చర్చించి, భద్రాచలానికి ఏదో ఒక వాహనం దొరికే ఊరి వరకూ మాకు తను షెల్టర్ ఇవ్వడానికి, అతనికి మేము కంపెనీ ఇవ్వడానికీ ఒప్పందం చేసుకున్నాం.
ఈలోపు మా పరిస్థితికి సింబాలిక్ గా చీకటి పడింది. గోదావరి ఉదయం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో రాత్రి అంత భయపెడుతుందని మాకు అప్పుడే తెలిసింది. కనుచూపుమేర జనాలు లేరు. చిక్కటి రాత్రిలో నల్లటి ఆకాశం లో డిమ్ గా వెలుగుతున్న చుక్కల వెలుతురులో బోటు సాగుతోంది, భయం పెరుగుతోంది, గుండె వణుకుతోంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు రా సాగాయి. ఈత రాని మేము నీటిలో పడితే, ఇంధనం లేక పడవ ఆగిపోతే, మమ్మల్ని వీడు ఇక్కడే వదిలిపోతే.... గోదావరిలో హైదరాబాద్ పిల్లలు గల్లంతు అనే న్యూస్ .. వరకూ వెళ్ళిపోయాయి ఆలోచనలు.
ఈలోపు ఇంకో చిన్న పల్లె వచ్చింది (అనుకున్నాం). తాతాజీ పడవని ఒడ్డు దాకా పోనివ్వడం, టార్చీ లైట్ ఊపడం, అక్కడినించీ ఎవరన్నా సిగ్నల్ ఇస్తారేమో అని. నాకైతే అన్వేషణ సినిమా గుర్తొచ్చింది. ఇలా రెండు మూడు చోట్ల ఆపగా ఒక చోట అటు నించీ సిగ్నల్ వచ్చింది. తాతాజీ, ఇంకో ఇద్దరం వెళ్లి కన్నుక్కోగా, ఆ ఊరు జీడికుప్పని, ఒకే ఆటో ఉందని, అక్కడినించీ కూనవరం ఒక గంట పడుతుందని తెలిసింది. చిన్న ఆశ చిగురించింది. ఆరుగురు మంది లగేజీ తో ఆటో లో ఎలా పడతాం అని కూడా ఆలోచించలేదు. తాతాజీ ని ఏం చేసినా పాపం లేదని అనుకుని ఎలాగో సద్దుకున్నాం. ఆ ఆటో వాడు ఒక పిల్లాడిని కూడా తెచ్చుకున్నాడు. తోడుకేమోలె అనుకున్నాం. కానీ టార్చీ లైట్ పట్టుకోడానికాని ఆ తరువాత తెలిసింది - ఆ ఆటోకి హెడ్ లైట్ లేదు.
ఆటో బయల్దేరింది. చిమ్మ చీకటిలో, కారడివిలో (అదంతా ఏజెన్సీ ప్రాంతం), ఆ పిల్లాడు వేస్తున్న టార్చీ లైట్ వెలుగులో, దారి పొడవునా గుంటలు పడిన ఆ రోడ్డు మీద ఆటో సాగిపోతోంది. అసలే బెదిరి పోయిన మమ్మల్ని ఆ ఆటో వాడు, ఇక్కడ కూంబింగ్ జరుగుతోందని, అన్నలు, పోలీసులు తెగ తిరుగుతున్నారని చెప్పి ఇంకా భయపెట్టాడు. పక్కనే ఉన్న పిల్లాడు దానికి వత్తాసుగా అప్పుడప్పుడు పులులు కూడా వస్తూ ఉంటాయని గుండెలో రైళ్ళు పరిగెత్తించాడు.
ఈ లోపు వెనకన కూర్చున్న నాకు తల మీద, ఆటో పైన ఏదో కదులుతూ ఉన్నట్టనిపించింది. నా బ్రహ్మేమో, చెప్తే నవ్వుతారని ఏమీ మాట్లాడలేదు. ఇంతలో రోడ్డు మీద ఒక గతుకొచ్చింది. అంతే గబాలున ఎవరో నెత్తి మీదకి ఉరికారు.కెవ్వున కేక వెయ్యబోయి, భయాన్ని గొంతులోకి మింగి, ఆటో ఆపమని అరిచాను. డ్రైవర్ అదో రకం లుక్ ఇచ్చి బ్రేక్ వేసాడు ..
.............. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాం.....