Sunday, March 20, 2011

ఎవడో రాజమండ్రి - భద్రాచలం లాంచీ లో వెళ్ళచ్చన్నాడు.. వాడిని !#%^^!@%& - మొదటి భాగం


"వారిని! ఇవేనా అలిపి బ్యాక్ వాటర్స్ అంటే. మా అయినాపురం లో మురిక్కాలువ అంత ఉంది దీని  వెడల్పు  . దీనికి పదకొండు వేలు, పెద్ద హడావుడి. కోనసీమ లో ఇలాటి బోట్లు  పెడితేనా "God's own county" అనేస్తార" న్నాను  

"అయితే ఈసారి తీసుకెళ్ళరా. మేమూ చాలా విన్నాం"

"సరే ఐతే ఈసారి అక్కడికే. మీరు కోనసీమ చూడలేదు. నేను పాపి కొండలు చూడలేదు. ఒకే ట్రిప్పుకి రెండు ... "

"సర్లే. ట్రై చేసింది చాలు. ఈ సారి సరిగ్గా ప్లాన్ చెయ్యి. " చిరాగ్గా సెలవిచ్చాడు కిరణ్.

ఆ కేరళ ట్రిప్ ఐపోయాకా,లీవ్ తీసుకున్న నేరానికి నాకు ఆర్నెల్లు కఠిన క్యూబికల్ శిక్ష పడి పనిలో మునిగి తేలి, యత్రాలంటే భయం, లీవంటే  వణుకు పట్టుకున్నాయి.

శిక్షా కాలం ముగిసాకా ఒకనాడు స్నేహితులతో  కలిసి అనుకోకుండా గోదావరి సినిమాకి వెళ్లాను.

కట్ చెయ్యకుండానే ... నెలలో ఒక లాంచీ యజమాని కాంటాక్ట్ దొరకడం అతను మమ్మల్ని బ్రహ్మి (సా. ఇ ) అని తెలిసి వాయించి వదలడం, రాజమండ్రి నించి భద్రాచలం కి లాంచీ కుదరడం  చక చకా జరిగి  పోయాయి.

                          
                  **********************************************


రెండు వారాల తరువాత...

మా ప్రయాణం రోజు రానే వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్ లో మేము ఏడుగురం స్నేహితులం కలుసుకున్నాం.

గౌతమీకీ గార్డ్ సిగ్నల్  ఇచ్చాడు. రైలు  బయల్దేరింది.

కానీ ముందు ఏదో జరగబోతోంది అన్నట్టు ట్రైన్ స్లో మోషన్ లో కదలలేదు, ఆకాశం మేఘావృతం కాలేదు, మెరుపులు మెరవలేదు, ఉరుములు ఉరమలేదు. ప్రకృతి బొత్తిగా ఏ క్లూ ఇవ్వలేదు.

మర్నాటి ఉదయం  మాలతి గారి ఊరిలో దిగాం. అదేనండీ నిడదవోలు.

అక్కడికి మా పెదనాన్న పంపిన సూమో ( ఈ మాట వినగానే ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అనేసుకోవడమే. ఇది కోనసీమ. రాయలసీమ కాదు.) ఎక్కి అరగంట లో చాగల్లు చేరుకున్నాం. ఈ ఊరు షుగర్ ఫ్యాక్టరీ కి ప్రసిద్ది మా అమ్మమ్మ వాళ్ళ వంశం లాగా. సీజన్ అనుకుంటా ఎక్కడ చూసినా చెరుకు కనపడుతోంది.
ఇంటికి చేరగానే మా గ్యాంగ్కి  ఇంటి టూర్ ఇచ్చి, కాఫీలిచ్చి, టిపినీలు పెట్టింది మా దొడ్డమ్మ. వేడి వేడి పెసరట్టుని  ఉప్మా తో ఒక పట్టు పట్టాం  అందరం. బుద్ధిగా స్నానం చేసి, శ్రద్ధగా దండం పెట్టుకుని పట్టి సీమకి  బయల్దేరాం.

ఆ రోజు ప్రయాణం ...పట్టి సీమ, గోదావరి మీద లాంచీ, పాపి కొండలు, భద్రాచలం.. తలుచుకుంటే కడుపు నిండి ఆ తిండి ఆకర్లేదని పించింది.

పట్టిసీమ ఇవతల ఒడ్డుకి చేరుకున్నాం. అక్కడే మా లాంచీ, దాని యజమాని/మా టూర్ గైడ్ తాతాజీ కనిపించాడు.    దగ్గరలో ఉన్న  ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహానికి  దండం పెట్టించి, లాంచీ ఎక్కించాడు (ఇందులో మతలబు బోధపడలేదు అప్పుడు ).  ఈ లాంచీ మొత్తం మీ కోసం, ఎవరిని ఎక్కించం, ఇందులో మీకు అన్నీ రెడీ - కాఫీలు, టిపినీలు, భోజనం అని చెప్పుకొచ్చాడు. మేము అనుకున్నంత కాకపోయినా బానే ఉందనిపించింది. ఫోటోలు తీసుకున్నాకా, లాంచీ రయ్యంది, అయిదు నిమిషాలలో అవతలి ఒడ్డున ఉన్న పట్టి సీమకి  చేరుకున్నాం. ఆ ఇసుక తెన్నెల్లో దిగగానే శంకరభరణం, వంశీ సినిమాలు గుర్తొచ్చాయి.  అద్భుతంగా ఉంది, గోదారి వడిలో, నీటి చప్పుడులో, సేద తీరడానికి భలే స్పాట్ సెలెక్ట్ చేసుకున్నావు కదయ్యా వీరేశ్వరా అనుకున్నాను.  

దర్శనం చేసుకుని లాంచీ చేరుకున్నాం. వాడిచ్చాడు కదా అని టిపినీ కొంచం టేస్ట్  చేసి లాంచీ పైకెక్కి  సై అన్నాం. క్లీనర్ రై రై అన్నాడు. లాంచీ నీటి తెరలను చీల్చుకుంటూ ముందు కెళ్ళింది. సూత్రధారులు సినిమాలో సత్య నారాయణ లాగా కూర్చిలో కూర్చుని గోదావరిని చూస్తూ కూర్చున్నాం. చూడడానికి ఇంకో రెండు కళ్లుంటే బావుండనిపిచింది. కొంత సేపయ్యాక కిందకు దిగి, లాంచీ వంచ మీద  కాళ్ళు నీళ్ళల్లో పెట్టి కూర్చుంటే, ఆ వడికి, నీటి తుంపరలు ఎగిరి పడుతుంటే, చల్లని ఏటి గాలి తడుతుంటే స్వర్గం దీనికి దిగదుడుపేమో  అనిపించింది.


ఆ హాయిలో గంటలు నిమిషాలు లా గడిచిపోయాయి. సుమారు ఒంటి గంటకి పాపి కొండల దర్శనం ఐంది.  "అల పాపి కొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా" అని వేటూరి చెప్పినట్టు, గోదారి నవ్వుతున్నంత ఆహ్లాదంగా ఉంటుంది, ఆ కొండలను కడుగుతునట్టే ఉంటుంది. చాలా సేపు చూడనిచ్చాక తాతాజీ లాంచీ ని  ఒక తాండా దగ్గర ఆపాడు. అక్కడే మా మధ్యాహ్న భోజన పధకం అన్నమాట. అసల ఒక్క పదార్ధం కూడా తినలేక పోయాము. కొంత సేపు ఆ వ్యూ పాయింట్ నించీ గోదారిని తనివి తీరా చూసి బయల్దేరాం.



గోదావరి లో నీరు అంత ఎక్కువగా లేకపోవడం వల్ల, భద్రాచలం వరకూ లాంచీ వెళ్ళదని చావు కబురు చల్లగా సెలవిచ్చాడు తాతాజీ. అందువల్ల మా ప్రయాణానికి చిన్న మార్పులు చేర్పులూ చేసి మమ్మల్ని పోచవరం లో దింపుతా  అన్నాడు.  అక్కడి నించీ బస్సు పట్టుకుంటే కూనవరం, అక్కడ ఇంకో  బస్సు పట్టుకుంటే భద్రాచలం.
ఓస్ ఇంతేగా అనుకున్నా, మా గత ప్రయాణాల అనుభవాల వల్ల ఏదో తేడా కొట్టింది. భారం రాముడి మీద వేసి  బయల్దేరాం.

పోచవరం చేరే సరికి సాయంత్రం ఆరయ్యింది. అదో చిన్న పల్లె. ఒక డజను ఇల్లుంటాయేమో. ఇక్కడికి బస్సు కూడా వస్తుందా అని ఆశ్చర్య పోయాం. కానీ మా ఆశ్చర్యాన్ని పటాపంచలు చేస్తూ మాకు భయం కలిగించే విషయం చెప్పాడు తాతాజీ - ఆఖరి బస్సు మూడింటికే వెళ్ళిపోయిందని. గుండెలో రాయపడినా, తాతాజీ ఏదో మార్గం చూస్తాడులే అని ధైర్యం. ఆటోలు ఎమన్నా ఉన్నాయేమో అని కనుకున్నాడు. ఆటో కాదు కదా కనీసం ద్విచక్ర వాహనం కూడా ఎవరికీ లేదు ఆ పల్లెలో. వాళ్ళనీ వీళ్ళని కనుక్కొని  అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఇంకో ఊరుందని, అక్కడ ఆటో లేమన్నా దొరకచ్చని, లాంచీ లో ఉన్న మా సామాను తీసుకోమని సెలవిచ్చాడు తాతాజీ.
మాకొచ్చిన కోపానికి తాతాజీ ని కాలు కిందేసి తొక్కేయాలని పించింది. కంట్రోల్ చేసుకుని, సమస్య సామరస్యం గా చర్చించి, భద్రాచలానికి ఏదో ఒక వాహనం దొరికే ఊరి వరకూ మాకు తను షెల్టర్ ఇవ్వడానికి, అతనికి మేము  కంపెనీ ఇవ్వడానికీ  ఒప్పందం చేసుకున్నాం.

ఈలోపు మా పరిస్థితికి సింబాలిక్ గా చీకటి పడింది. గోదావరి ఉదయం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో రాత్రి అంత భయపెడుతుందని మాకు అప్పుడే తెలిసింది. కనుచూపుమేర జనాలు లేరు. చిక్కటి రాత్రిలో నల్లటి ఆకాశం లో డిమ్ గా వెలుగుతున్న చుక్కల వెలుతురులో బోటు సాగుతోంది, భయం పెరుగుతోంది, గుండె వణుకుతోంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు రా సాగాయి. ఈత రాని మేము నీటిలో పడితే, ఇంధనం లేక పడవ ఆగిపోతే, మమ్మల్ని వీడు ఇక్కడే  వదిలిపోతే.... గోదావరిలో హైదరాబాద్ పిల్లలు గల్లంతు అనే న్యూస్ .. వరకూ వెళ్ళిపోయాయి ఆలోచనలు.

ఈలోపు ఇంకో చిన్న పల్లె వచ్చింది (అనుకున్నాం). తాతాజీ పడవని ఒడ్డు దాకా పోనివ్వడం, టార్చీ లైట్ ఊపడం, అక్కడినించీ ఎవరన్నా సిగ్నల్ ఇస్తారేమో అని. నాకైతే అన్వేషణ సినిమా గుర్తొచ్చింది. ఇలా రెండు మూడు చోట్ల ఆపగా ఒక చోట అటు నించీ సిగ్నల్ వచ్చింది. తాతాజీ, ఇంకో ఇద్దరం వెళ్లి కన్నుక్కోగా, ఆ ఊరు జీడికుప్పని,  ఒకే  ఆటో ఉందని, అక్కడినించీ కూనవరం ఒక గంట పడుతుందని తెలిసింది. చిన్న ఆశ చిగురించింది. ఆరుగురు మంది లగేజీ తో ఆటో లో ఎలా పడతాం అని కూడా ఆలోచించలేదు. తాతాజీ ని ఏం చేసినా పాపం లేదని అనుకుని ఎలాగో సద్దుకున్నాం. ఆ ఆటో వాడు ఒక పిల్లాడిని కూడా తెచ్చుకున్నాడు. తోడుకేమోలె అనుకున్నాం. కానీ  టార్చీ లైట్ పట్టుకోడానికాని   ఆ తరువాత తెలిసింది - ఆ ఆటోకి హెడ్ లైట్ లేదు.

ఆటో బయల్దేరింది. చిమ్మ చీకటిలో, కారడివిలో (అదంతా  ఏజెన్సీ ప్రాంతం), ఆ పిల్లాడు వేస్తున్న టార్చీ లైట్  వెలుగులో, దారి పొడవునా గుంటలు పడిన ఆ రోడ్డు మీద ఆటో సాగిపోతోంది.   అసలే బెదిరి పోయిన మమ్మల్ని ఆ ఆటో వాడు, ఇక్కడ కూంబింగ్ జరుగుతోందని, అన్నలు, పోలీసులు తెగ తిరుగుతున్నారని చెప్పి ఇంకా భయపెట్టాడు. పక్కనే ఉన్న పిల్లాడు దానికి వత్తాసుగా అప్పుడప్పుడు పులులు కూడా వస్తూ ఉంటాయని గుండెలో రైళ్ళు పరిగెత్తించాడు.


ఈ లోపు వెనకన కూర్చున్న నాకు తల మీద, ఆటో పైన ఏదో కదులుతూ ఉన్నట్టనిపించింది. నా బ్రహ్మేమో, చెప్తే నవ్వుతారని  ఏమీ మాట్లాడలేదు. ఇంతలో రోడ్డు మీద ఒక గతుకొచ్చింది. అంతే గబాలున ఎవరో నెత్తి మీదకి ఉరికారు.కెవ్వున కేక వెయ్యబోయి, భయాన్ని గొంతులోకి మింగి, ఆటో ఆపమని అరిచాను. డ్రైవర్ అదో రకం లుక్ ఇచ్చి బ్రేక్ వేసాడు ..



.............. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాం.....

రెండవ భాగం  - ఇక్కడ 

22 comments:

  1. కెవ్వు! ఇంత సస్పెన్స్ లో ఇప్పుడు బ్రేకు తీసుకోవటమేంటి? మాదింకో భయంకరమైన అనుభవం. మూడు నాలుగేళ్ళ క్రితం అక్టోబర్ లో వరద తగ్గిన నాలుగు రోజులకు వెళ్ళాం.ఎర్రటి నీళ్ళతో ఉరుకులు పరుగులు పెడుతూ మిడిసిపడుతోంది గోదారి. మేము సందేహించినా లాంచీ వాళ్ళు "ఇంకెక్కడి వరద? ఎప్పుడో ముగిసింది ఎక్కండి" అని ఎక్కించారు. సగం దూరం వెళ్ళాక వరద పోటు పెరుగుతోందనీ అందుకే నీటి ఉధృతికి స్లోగా వెళుతోందనీ చెప్పారు. గుండె ఆగిపోయింది. మాక్కూడా బ్రేకింగ్ న్యూస్ లో "గోదారి లాంచీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన __________మంది గల్లంతు" అనే వార్తలు కళ్ళ ముందు కనపడ్డాయి. అందరం ఒక్క చోటే కూచున్నాం లేని పోని సెంటిమెంట్ తెచ్చి పెట్టుకుని. పేరంటాల పల్లి వరకే వెళ్ళింది లాంచీ ఆ రోజు.

    ఎలాగో కథ సుఖాంతమై గల్లంతు కాకుండానే సాయంత్రానికి మళ్ళీ పట్టి సీమ చేరామనుకోండి

    వచ్చే సంచికలో త్వరగా మిగతా భాగం రాయండి

    ReplyDelete
  2. @ సుజాత: అమ్మో! అలాటి సందర్భాల్లో ఏమీ చెయ్యలేని నిస్సహాయత. వరద గోదారి అయితే ఇంకా భయమేస్తుంది.
    నీటి మీదకి వెళ్ళినప్పుడు ఈత వచ్చుంటే బావుండు అనిపిస్తుంది.

    ReplyDelete
  3. అయ్యో !ఎంతో ఉత్కంటతో చదువుతుంటే అలా మధ్యలో ఆపేయడం ఏమి బాగోలేదు .....

    ReplyDelete
  4. అందరూ అనుకునేంత రొమాన్సు లేదన్నమాట. ఫుటోలు మీరు తీసినయేనాండీ..

    ReplyDelete
  5. బాగా వ్రాశారు. మంచి శైలి.

    ఇంకా నయం ఈసారి విజయవాడ వెళ్ళినప్పుదు రాజమండ్రి వెళ్ళి అక్కడనుంచి లాంచిలో భద్రాచలం వెళ్తూ ఆనందిద్దాం అనుకున్నాం.మీరు చెప్పినవి, సుజాతగారు చెప్పినవి చూస్తుంటే, అలా వెళ్ళటం రిస్క్ తీసుకోవటమే అని తెలుస్తున్నది.

    ఇలాంటి చెత్త ట్రిప్ లు వేసే లాంచి వాళ్ళను. దొంగ మాటలతో ప్రజలను ఎక్కించుకుని, చివరకు టూరిజం అంటేనే వైముఖ్యం కలిగేట్టుగా చేసే ఇలాంటివాళ్ళను ఎమి చెయ్యాలి? మన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఏమి చేస్తున్నారో? ఏమున్నది తన పదవి కాపాడుకుంటూ అందరు రాజకీయ నాయకులు చేస్తున్నదే చెస్తూ ఉండే ఉంటారు.

    ReplyDelete
  6. రింగులు తిప్పితే, మా కాలంలో 1998-2002 నేను రాజమండ్రి లో ఇంజనీరింగ్ చదువుతున్నపుడు, చాల సార్లు వెలదమనుకున్నాను. కాని కుదరలేదు.

    మీరు చెపుతుంటే ఇపుడు అంతా ఇంటరెస్టింగ్ గ లేదు అనిపిస్తుంది.

    కాని, ఇపుడు చాల వేడిగా, ఆవిరిగా ఉంటుంది ప్రయాణం. కొంచెం వానలు పడితే గోదావరి కి భలే కళ వస్తుంది. అపుడు బావుంటుందేమో.

    ReplyDelete
  7. @ శివ : మన టూరిసం వాళ్ళు పాపి కొండల వరకే వేస్తారు. కానీ మాకు ఆ తాతాజీ టూరిసం వాడే అని చెప్పి, వాడి సొంత బోటు ఎక్కించి ముంచేసాడు.

    @ సాధారణ పౌరుడు: పాపి కొండలు వరకూ అయితే బావుంటుంది అండీ. బోలెడు మంది జనం, టూరిసం ట్రిప్స్ ఉంటాయి. నేను ప్రతీ ఏడాది ఇంచు మించు రాజమండ్రి పరిసర ప్రాంతాలకి వెళ్తూ, పాపి కొండలకి వెళ్లకపోవడం ఏంటి అని పట్టు బట్టి వెళ్లాను. విధి వక్రించింది :)

    @ అనఘ : మరీ పొడవైతే చదవరని, బద్దకించి ఆపేశాను అంతకంటే ఏం లేదు. వచ్చే వారం లోపు రాసేస్తా.


    @ బుడుగోయ్: అంటే రాజముండ్రి - భద్రాచలం వరకూ ఐతే నాకు తెలిసి వెళ్ళిన వాళ్ళు లేరు . పాపి కొండల వరకే ఉంటాయి ట్రిప్స్. మేము మొత్తం లాంచీ ని కుదుర్చుకుంటే ఇలా జరిగింది. నీరు ఎక్కువ ఉండి, ఉదయమే బయల్దేరితే పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఫోటోలు గూగిలించి పట్టుకున్నవి. మేము తీసినవి దొరకలేదు టైం కి వెళ్లి ఐదేళ్ళు ఐంది.

    ReplyDelete
  8. hmmmm.. nenu plan chesthunna same trip ki in the month of Oct or Nov lo...oka post kooda petta. Now with your experiance I have to really think about it.

    ReplyDelete
  9. రెండో భాగం విశేషాలతో వుంటుందని ఆశిస్తున్నాను. తాతాజీ పుణ్యమా అని మీకు వైల్డ్ గోదావరి సాహసిక అనుభవాలు, తక్కువ ఖర్చులో సంప్రాప్తం అయ్యాయి. ఆ తాతాజీ అడ్రస్ చెబితే, ఆ లాంచిలోనే ప్రయాణిస్తాము. :)
    --------
    /ఇలాంటి చెత్త ట్రిప్ లు వేసే లాంచి వాళ్ళను. ..మన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఏమి చేస్తున్నారో? ఏమున్నది తన పదవి కాపాడుకుంటూ అందరు రాజకీయ నాయకులు చేస్తున్నదే చెస్తూ ఉండే ఉంటారు/
    అవునవును. టూరిజం మంత్రి తక్షణం రాజీనామా చేసి, వ్యాసకర్తకు క్షమాపణ చెప్పాల్సిందే. పనిలో పనిగా... ఆ అద్వానీ కూడా క్షమాపణ చెప్పేస్తే... ఓ పనైపోతుంది.:D

    ReplyDelete
  10. రాజేష్: సరిగ్గా ప్లాన్ చేసుకుంటే (అన్నీ ఖచ్చితంగా కనుక్కుని, ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళ రెఫెరెన్సు లవీ తీసుకుని, లాంచీ వాడి పుట్టు పోర్వోత్తరాలు తెలుసుకుని) ఏ గొడవా ఉండదు. పాపి కొండల వరకే అయితే అసల ఇబ్బంది ఉండదు.
    తప్పక వెళ్ళండి.

    శంకర్: గోదావరి అనుభవాలు తాతాజీ పుణ్యమే కానీ తక్కువ ఖర్చులో మాట మాత్రం ఖండిస్తున్నాను .
    తాతాజీ నంబర్ తప్పకుండా చెబుతానండీ :)

    //అవునవును. టూరిజం మంత్రి తక్షణం రాజీనామా చేసి, వ్యాసకర్తకు క్షమాపణ చెప్పాల్సిందే. పనిలో పనిగా... ఆ అద్వానీ కూడా క్షమాపణ చెప్పేస్తే... ఓ పనైపోతుంది.//
    :))))))))

    ReplyDelete
  11. ఇంకోటి...టిఫిన్లూ, భోజనాలూ అన్నీ లాంచీలోనే అంటారు కానీ అవి వంశీ కథల్లో ఉన్నంత రుచిగా ఉండవు. మాకైతే గట్టిగా బిగిసి చల్ల బడిపోయిన ఇడ్లీలు, కాస్త ఉప్మా ముద్ద, పులిసిపోయిన చెట్నీ పడేశారు. భోజనం కూడా ఏమీ బాగా లేదు.

    ఐతే పిల్లలు ఉండటం వల్ల మా జాగ్రత్తలో మేముండి, జంతికలూ వగైరాలు పట్టుకెళ్ళడం వల్ల అంతగా ఆకలితో మాడలేదు. ఇవన్నీ పట్టించుకోకుండా ఉంటే గోదారి అందాలు మాత్రం మర్చిపోలేనివి.

    ReplyDelete
  12. "వరద గోదారి అయితే ఇంకా భయమేస్తుంది.
    నీటి మీదకి వెళ్ళినప్పుడు ఈత వచ్చుంటే బావుండు అనిపిస్తుంది."

    ఏంటండీ ఎంత ఈతోచ్చినా వరద గోదారిలో, అదీ సుడిగుండాలు ఎక్కువగా ఉండే ఆ ఏరియాలో ఈదేయ్యడమే? కాలు చేయి ఆడించేలోపే కైలాసం కళ్ళముందు కనిపిస్తుంది.

    ఏ.పి. టూరిజం వాడి పాకేజీ లో వెళ్లి ఉండాల్సింది. కనీస సదుపాయాలైనా ఉండేవి. ప్రైవేటు లాంచీలవాళ్ళు ఎక్కేదాకా అరచేతిలో స్వర్గం చూపిస్తారు, ఆ తర్వాత గోదారి లోతులేదు లాంటి కబుర్లు చెప్పి అక్కడ దింపేసి ఇంకో బేరం కోసం వెళ్ళిపోతారు. :)

    ReplyDelete
  13. @ సుజాత: మేము పిల్లలమని మాకూ మా దొడ్డమ్మ స్వీట్లు, హాట్లు గట్రా ఇచ్చిందండీ కానీ అన్ని గంటల ప్రయాణం లో తోచుబాటుకి అవి మధ్యాహ్ననానికే ఐపోయాయి :)

    @ శంకర్ : అవి వేరు వేరు వాక్యాలు కలిపి చదివితే వేరే అర్థం వచ్చింది. మామూలు గోదావరిలోనే ఈతొచ్చిన వాడే జంకుతాడు. ఇక వరద గోదారిలో ఈతా ! శాల్తీ గల్లంతే.

    ఏ పి టూరిజం వాళ్ళది పాపి కొండల వరకే ప్యాకేజీ. అందుకే కదా ఈ బాధలన్నీ.
    గోదావరి సినిమా చూసి మోస పోయాం :(

    ReplyDelete
  14. We went to papi kondalu trip last december it was great. I suggest to go with A.P Tourism the food is also good.

    ReplyDelete
  15. రెండవ భాగం ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నా. ముందే చెపితే నేను మీతో కలసి వచ్చేవాడిని

    ReplyDelete
  16. గోదావరి సినిమా నిజంగా అందరినీ ఇలా ముంచేస్తోందనమాట :-) నేను ఈ జూన్ జూలైలో అనుకుంటున్నాను మన దేశం వచ్చీ రాగానే అనుకున్న మొదటి సెలవు దినాలు దీనికే. కొంచం బాగా ప్లాన్ చేసి వెళ్లాలన్నది తెలిసింది.

    భద్రాచలం వరకూ ట్రిప్ వెయ్యాలనే ఉంది. ఏ మాసాలలో అయితే బావుంటుందో చెపుతారా?

    మీ టపా భలే ఊరిస్తోంది....రెండో వాయి కోసం కంచం పట్టుకుని ఆవురావురుమంటూ కూర్చున్నా ......:-)

    ReplyDelete
  17. @ రహ్మానుద్దీన్ షేక్ - :)

    అప్పుడు కొంచం భయం వేసినా, ఒక మధుర స్మృతి లాగ గుర్తుండి పోతాయ్ ఇలాటి ప్రయాణాలు.


    @ భావకుడన్ :

    గోదావరి (సినిమా) ముంచేస్తోంది. యాప్ట్ గా ఉంది చాలా :)

    //రెండో వాయి కోసం కంచం పట్టుకుని ఆవురావురుమంటూ కూర్చున్నా //
    ఇడ్లీ కంటే పచ్చడి బావుండడం అంటే ఇదే.

    నాకైతే నా టపా కంటే వ్యాఖ్యలే బావున్నాయి.

    మేము వెళ్ళింది జులైలో. అదీ అయిదేళ్ళు ఐంది . ఇంకా లేట్ గా ఐతే బావుంటుందేమో. తరచుగా వెళ్ళే వాళ్ళెవరన్న చెబితే బావుంటుంది.

    ReplyDelete
  18. ఆ భద్రాద్రి రాముడు కరుణించాడనీ, మీరు క్షేమంగా తిరిగొచ్చారనీ మీ టపా చూస్తే తెలిసిపోతుంది. ఇంకేం సస్పెన్స్ . అయినా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తే మీరో సస్పెన్స్ త్రిల్లర్ టపా రాయగలిగేవారా చెప్పండి
    చాగల్లు గురించి మీరో విషయం చెప్పటం మర్చిపోయారు . సుమో డైరెక్టర్ వి.వి. వినాయక్ సొంత ఊరు చాగల్లు .( ఒహో అందుకేనా మీకోసం సుమో వచ్చింది)

    ReplyDelete
  19. భలే గ్రిప్పింగ్ గా ఉందండీ స్టోరీ.. (కొంచం సినిమా భాష...) ...మా (మన) గోదారి గురించి చదివిన కొద్దీ ఆనందమే.. అవునూ.. రెండో భాగం రాయకుండా మరేదో టపా రాసినట్టున్నారు? ఇలా అయితే ఎలా???

    ReplyDelete
  20. నేను పుట్టింది నిడవోలులో అయినా ఎలిమెంటరీ స్కూలు వరకూ పట్టిసీమలోనూ, 9వ తరగతివరకూ పోలవరంలోనూ గడిచింది.

    మీరు హాస్యంగా రాస్తూనే మిరు చూసిన అద్భుతమైన సౌందర్యాన్ని మాపైకి అక్షరాలతో వేస్తున్నారని అర్థం అవుతుంది.
    నిజానికి రాజమండ్రినుంచి ఒక లాంచీ సర్కులతో భద్రాచలం వరకూ, రాజమండృఇలో ఉదయాన్ని ఒకటి, మద్యాహ్నం (సుమారు 10గంటలప్పుదూ) బయలు దేరతాయి. ఆ వొడ్డూ ఈ వొడ్డూ రేవులలో ఆపుజుంటూ పోతాడు. ఈ మద్య నేను వెళ్ళలేదండోయ్!
    ఆ రేవుల్లోని సౌదర్యాన్ని కూడా మీరు వర్ణించివుంటే బాగుండెదనిపించింది.
    పూడీప్ల్లి, పోసమ్మ గండి, లంక (రాఘవేంద్రరావు బిందెలతో సెట్టింగు వేసిన చోటు) పేరు గుర్తు రావటం లేదు. టేకూరు, కొడమొదలు, శివగిరి......ఇలా

    ఏదిఏమైమనా బాగా రాసారు అభినందనలు.

    ReplyDelete
  21. @ లలిత గారు: అంటే ఏదో అయ్యి ఉంటే తప్ప ఊరుకునే డట్టు లేరు మీరు :)
    చాగల్లు లో వి వి వినాయక్ ఇల్లు చూసా. తరచూ వస్తూ ఉంటాడుష.

    @ మురళి:థాంక్స్. రెండవ భాగం బాగా లేట్ ఐంది. అయినా మీరు చదివేసారుగా.

    @ జాన్ హైడ్ గారు: థాంక్స్. ఇది ఏదో సరదాగా రాశాను. అయినా కూడా ప్రకృతి పరంగా వీలైనంత వర్ణించడానికి ప్రయత్నించాను. మీరు చెప్పిన రేవుల్లో ఆపలేదు. నాకు ఆ పేర్లు కూడా తెలియదు. మేము ఆగిన ప్రదేశాలన్నీ కవర్ చేశాను.

    ReplyDelete
  22. వాసు గారు బాగుంది .మాది ప.గో .జిల్లానే .మేం రెండు సార్లెల్లాం పాపికొండలు .ఓసారి మాకూ కాస్త భయంకరమైన అనుభమే జరిగింది
    http://saisatyapriya.blogspot.in/2013_04_01_archive.html

    ReplyDelete