Tuesday, September 2, 2014

అక్కడ బాపు - రమణ


అల 
వైకుంఠ పురంబున

జయ విజయులు వైకుంఠ ద్వారం దగ్గర ఆయనకి ఘన స్వాగతం పలికారు


శేష తల్పం మీద శయన ముద్ర లో ఉన్న స్వామి వారి దగ్గరికి ఆయనని తీసుకెళ్ళారు.   లక్ష్మీదేవి నారాయణుడి పాదాలొత్తుతోంది.

స్వామి వారు లోపలికి  వస్తున్న ఆయనని చూసి..  అదేమిటి బాపు. అప్పుడే వచ్చేశావన్నారు

ఏం చెప్పను రామయ్యా.. (స్వామి వారి పాదాల వంక ఆశ్చర్యంగా చూస్తూ)

ఇంకా రామయ్య ఏంటి ? ఆ అవతారం చాలించాను కదయ్యా

అంతా విష్ణు మాయ. నాకు నువ్వెప్పుడూ రామయ్యవేనయ్యా

అది సరే. ఏంటి అప్పుడే ?

అప్పుడే ఏంటి రామయ్యా ? వెంకట్రావు వచ్చి మూడున్నరేళ్ళయింది. రోజు కలలోకి వచ్చి ఏమిటి ఎప్పటికీ రావు. నాకు ఏమీ తోచట్లేదు అంటాడు. అక్కడ నాకు అంతే. చక్కబెట్టాల్సిన పనులు ఉండి ఎలాగో కష్టపడి ఉన్నా ఇన్నాళ్ళు. (ఇంకా పాదాల వంక ఆదిశేషు పడగల వంక చూస్తూ)

మరి నా పరిస్థితి ఏంటి బాపు?

నీకేమయ్యా. ఆ తల్లి తోడు ఉండగా. లక్ష్మ నీడ ఉండగా.  హనుమ వంటి బంటు ఉండగా.

నా బొమ్మలు ఎవరు గీస్తారు.  కథలు ఎవరు తీస్తారు. ఈ మనుషులని  దారిలో ఎవరు పెడతారు.

నీ దయ ఉంటే ఎవరైనా చేయగలరు. అది సరే మా వెంకట్రావు ఏడి. ఎక్కడా కనపడడే.  పాపం చిన్నప్పుడు ఎప్పుడో నా దగ్గర అప్పు చేసాడని శిక్ష వేసారా ఏంటి ?






అదేమీ లేదు బాపు. వాణి మీ వాణ్ణి అసలు ఇటు రానిస్తేగా. మా వెంకట్రావు మా వెంకట్రావు అని అక్కడే అట్టే పెట్టేసుకుంది. గోరు ముద్దలు తినిపిస్తూ చిన్న పిల్లాడిలా చూసుకుంటోంది. పొద్దస్తమానూ పోతనతో సాహిత్య గోష్టి, త్యాగయ్యతో సంగీత చర్చలు, మధ్యాహ్నం వేటూరితో పాటల కబుర్లు.  సాయంత్రం అయితే దేవతల మీద సటైర్లు వేస్తూ అందరికీ కాలక్షేపం చేస్తున్నాడుట.

మా వెంకట్రావు అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా ఒకటే. నన్ను అక్కడికి పంపించే మార్గం చూడు  స్వామీ. ఆనక వచ్చి నీతో మాట్లాడతా.


సరే. పంపుతా గానీ. వచ్చినప్పటి నుంచీ ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి ఆదిశేషుడి  వంక. 

అదే అడుగుదామనుకుంటున్నాస్వామీ. అన్ని పురాణాల్లో మీరు ఆదిశేషు పడగల కింద తలాంచి శయనిస్తారు అని చదివాను. అక్కడ మీ పాదాలు ఉన్నాయేంటి చెప్మా. 

ఇంకా గుర్తు రాలేదా. ఇది నీ చలవేనయ్యా.  నీ కొంటె ఆలోచనల  పుణ్యమా అని సిరి కోరినది ఈ విధంగా నెరవేరినది.  

చిరు మందహాసంతో బాపు వైకుంఠం లో సెలవు తీసుకున్నాడు. 


సత్య లోకం 

వెంకట్రావు అమ్మ పక్కన కూర్చుని అప్పుడే ఏదో చెప్తున్నాడు. అందరూ గొల్లుమన్నారు.




వెంకట్రావు ని చూడగానే బాపుకి కళ్ళ నీళ్ళు తిరిగాయి. మాట మూగబోయింది.  వెంకట్రావు వేరే వైపు తిరిగి ఉన్నా బాపు వచ్చినట్టు తెలిసిపోయింది . బాపు ని చూసి చమ్మగిల్లిన కళ్ళతో వచ్చి కౌగిలించు కున్నాడు వెంకట్రావు.

ఏం? ఇన్నాళ్ళు?

నువ్వేమో రామ కథ మొదలెట్టి మధ్యలో వచ్చేశావు. పూర్తి చెయ్యద్దూ. నువ్వు వచ్చేసాకా ఒకటే ఏడుపులు తెలుగు లోకమంతా. బుడుగుని బుజ్జగించి, సీగాన పసూనాంబ ని ఊరుకోబెట్టి, అప్పులప్పారావుకి అప్పులిప్పిచ్చి 
అందరికీ సర్ది చెప్పి, మిగతా పనులన్నీ చక్కబెట్టి వచ్చేసరికి ఇదిగో.. ఈ వేళైంది. రోజూ రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాను తెలుసా.

ఇంతలో వెంకట్రావు ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు

ఏమిటి ?

మేము ఇదే మాట్లాడు కుంటున్నాం.

ఏమని ?

అదే ఈ సంతాప సభలు. చర్చలు. ఎలిజీలు. టి వి ల లో నిన్న పోగిడేవాళ్ళు.వగైరా   రా.. కూర్చో. అని వేటూరి పక్కన ఒక కుర్చీ చూపించాడు.

వాగ్దేవి కి పాదాభివందనం చేసి, పోతనకి, త్యాగయ్య , వేటూరి తడితురలకి  నమస్కారం చేసి కూర్చున్నాడు బాపు.

"ఏం బాపు. ఎప్పుడూ మీ రామయ్య నేనా. నా  మీద కథలు తియ్యలేదు. బొమ్మలు కూడా పెద్దగా గీసినట్టు లేవ" నడిగింది శారదాంబ

అదేమిటమ్మా. అమ్మను తలుచుకోకుండా ఉంటామా. అయినా నేను ఏం గీసినా వెంకట్రావు ఏం రాసినా మొదటి దండం నీకేగా.

అవునులే. మా పోతన కూడా ఇదే అన్నాడు. సరే. మీ వెంకట్రావు నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఏం కబుర్లు చెప్పినా పక్కన వెతుక్కుంటూ ఉంటాడు.  పేరుకి నవ్వుతున్నా నువ్వు లేవని చిన్నబోతాడు.


బాపు వెంకట్రావులు కళ్ళు తుడుచుకున్నారు.

ఇంతలో పోతన  "భావగావతాన్ని దృశ్య రూపకంగా మలిచావని, ఇంతింతై వటుడింతై అద్భుతంగా మలచి పామరులకి కూడా నారాయణుడిని ప్రత్యక్షం చేసావని విన్నాన" న్నాడు.

అంతా మీ దయ.  మీరు రాసినది వెంకట్రావు చెప్పినది నా శక్తి మేర చూపించా. అంతే . 


లవకుశుల కథని మళ్ళీ తెరకెక్కించి ధన్యుడి వయ్యావు బాపు. సీతమ్మ వారికెన్ని కష్టాలయ్యా అని గద్గదమైంది వేటూరి గొంతు. హనుమను సహాయానికి రప్పించి కొంతైనా ఊరట కలిగించి, అపర వాల్మీకివయ్యావు రమణ. 

"వాల్మీకి ముందు నేనెంత. సీతమ్మ కష్టాలు చూడలేక నా వంతు చేశా. ఆపై రామభద్రుడి దయ. "

మౌనం అలుముకుంది. బాపు తేలిక పరచడానికి "ఔను వెంకట్రావు. ఇందాక ఏదో చెప్తున్నావ." న్నాడు.  

వెంకట్రావు కళ్ళు తుడుచుకుని ఏం లేదు బాపు. సంతాప సభలు, నివాళ్ల  గురించి. నువ్వున్నావని  కూడా ఎప్పుడూ తలుచుకోనివాళ్ళు, కలుసుకోనివాళ్ళు నీకో..  నివాళ్ళు  అర్పించేస్తూ ఉంటే అవి చూసి విని నవ్వుకుంటున్నాం ఇందాకా .

బాపు తేలికగా నవ్వాడు.

జనవరి 30న అందరికీ గాంధీ గారు గుర్తొచ్చినట్టు. ఎక్కడెక్కడ టెల్గూస్ కి నువ్వు గుర్తొచ్చేసావు. నన్ను అప్పట్లో ఎలిజీల తో వదిలిపెట్టారు. నువ్వు కార్టూన్లు, బొమ్మలు వేశావ్ కదా. నిన్ను ఆ రోజు టివి లలో, పేపర్లలో, జాతీయ వార్తల్లో, ఇంటర్నెట్ లో ఆకాశానికి ఎత్తేసి మర్నాటికి  మరిచిపోయారు. భరించలేని దు:ఖంతో నిద్ర పట్టలేదు, ఆకలి పుట్టలేదు అని చెప్పి, మరు నిమిషం మరేదో చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అది తప్పు కాదు లే. కానీ ఈ ఎలిజీలు మరీనూ.

బాపు ఎదో చెప్ప బోయి ఆగిపోయాడు.

ఎక్కువగా ఈ ఎలిజీలు ఇంచు మించు ఒకే లా ఉంటున్నాయి. పేరు మనది పెడతారు. ఏదో బానే మొదలెడతారు. మూడు లైన్లు అవ్వగానే విషయమంతా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. రాసింది మన గురించో వాళ్ళ గురించో అర్థం కాదు. విశ్వనాథ వారు వాళ్ళ గురువుగారిని పొగిడినట్టు ఉంటుంది.
కొందరైతే వాళ్ళెంత గొప్ప వాళ్ళో వాళ్ళ అతి విలువైన సమయాన్ని మనకి వెచ్చించి మనల్ని ఎంత ధన్యులని చేసారో సంక్షిప్తంగా సవివరిస్తారు.

(అందరూ ఫక్కున నవ్వేశారు)

నాకు భయమేస్తోంది అన్నాడు బాపు

ఏం ?

ఈ ఊపు లో నాకు పద్మ విభూషణో భారత రత్నో ఇచ్చేస్తారేమోనని.

నాకూ అదే భయం.

ఎందుకు.

నీతో పాటు నాకు పద్మశ్రీనో పద్మ విభుషణో  ఇస్తారేమో నని.

అందరూ గొల్లుమన్నారు.

( ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదు. బాపు రమణలు అక్కడ ఏమనుకుంటున్నారోనని ఊహించి రాసినది. ఎక్కువ మటుకు నేను రాద్దాం అని మొదలెట్టి ఆపేసిన ఎలిజీని ఉద్దేశించినది. బాపు - రమణ గారు తెలుగు వారికి నేర్పిన వాటిలో మొదటిది మన మీద మనం జోకులేసుకోవడం. ఆ ఆనవాయితీని పాటించే  ప్రయత్నం ఇది. అంతే!!)

7 comments:

  1. Chala baaga rasavu ra bava...ee haasya dvayam ekkada unna ilane untaremo!! Padma Sri churaka adirindi po..

    ReplyDelete

  2. ఈ విష్ణు మాయ అన్న మాట రాసేరు చూడండీ , అది మరి నాకు మరీ నచ్చేసిందండోయ్ !!

    జిలేబి

    ReplyDelete
  3. బాపురమణల గురించి ఎంతో బాగా తెలిసినట్టు,అర్థం చేసుకున్నట్టు రాశారు. ముఖ్యంగా వారిద్దరి మధ్య ఉన్న విడదీయలేని బంధాన్ని, నవ్వులు పూయించే వారి వైఖరిని, హాస్యం వెనక ఉన్న అంతరంగాన్ని చక్కగా చెప్పారు. ఎలిజీ మీద సటితే వేయడంలో వారి అంతేవాసి అనిపించారు. ధన్యవాదాలు

    ReplyDelete