Monday, June 4, 2012

పుట్టినరోజు శుభాకాంక్షలు బాలు!!






నా చిన్నప్పుడు రేడియో ఎప్పుడు పెట్టినా - పాట పాడినవారు - అయితే బాలు , సుశీల ; బాలు, చిత్ర  లేదా బాలు , జానకి ..ఏ పాట విన్నా బాలు కామన్ .. (అప్పట్లో ఆలిండియా  రేడియో కాదు బాలిండియా రేడియో అని అనేవారని బాలు ఒకసారి చెప్పారు)  అప్పుడు గాయకుడు అంటే ఘంటసాల , బాలు .. ఇంకొకళ్ళు తెలియదు నాకు  ..
పాతది అంతా గొప్ప అన్న అభిప్రాయం పాతుకుపోయిన అప్పటి తరం వారు (మా నాన్న తరం) బాలు ఎంత , గాయకుడు అంటే ఘంటసాలే .. అనేవారు .. నేనూ అదే అనుకునేవాడిని ..

సాహిత్యం సంగీతం కొంచం అర్థం అయ్యే వయసు వచ్చాకా బాలు ఎంతటి గాయకుడో అర్థం అయింది , ఆయన గాయక విశ్వరూప దర్శనమైంది .. పాట అర్థం చెడకుండా , సినిమా పాటకు ఉన్న పరిమితులలో ఇంత గొప్పగా, ఇన్నాళ్ళు  పాడగల గాయకుడు లేడు , ఇక రాడు అనిపించింది , అనిపిస్తుంది ...

సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమాటోగ్రఫీ  భలే ఉందే అనిపిస్తే ఆ సినిమాటోగ్రాఫర్ ఫెయిల్ అయినట్టే అని ఎక్కడో చదివా. సినిమాటోగ్రఫీ  సినిమాలో అంతర్లీనంగా ఉండాలి ప్రేక్షుడిని డైవెర్ట్ చేయకుండా.. అలాగే పాట చూస్తునప్పుడు గాయకుడు  గుర్తుకు రాకూడదు నటుడే కనిపించాలి ... అలా అని అనుకరించి నట్టూ  ఉండకూడదు.. ఇది బాలు చేయగలిగినట్టు ఇంకెవరూ చెయ్యలేరు . .. అదే బాలు స్పెషాలిటీ .. విజయ రహస్యమేమో కూడా ..

ఏ  పాటైనా భాషనూ, భావాన్ని అర్థం చేసుకుని , స్వంతం చేసుకుని, అనుభవించి పాడడం అది ఎలాటి పాటైనా సరే బాలూకే సాధ్యం . ఇక బాలు భాష ఉచ్ఛారణ - ఈ విషయం లో ఒక పుస్తకం రాయచ్చు బాలు మీద .. తెలుగే కాదు ఏ భాష పాడినా ఇతను మనవాడే అనుకునేడట్టు పాడడం ఆయనకి  భాష మీద ఉన్న గౌరవానికి నిదర్శనం ..వంద పాటలు పాడినా తెలుగు కర్ణ కఠోరంగా ఉచ్ఛరించే  కొంత మంది పరభాషా గాయకులు ఎప్పుడు వంట పట్టిచుకుంటారో ఈ విషయం ..  బాలు కన్నడం  లో పాడుతా తీయగా మొదలెట్టాకా ఆయన భాషనే ప్రామాణికంగా వ్యవహరిస్తున్నారని కన్నడిగులు కొంత మంది చెప్పగా విన్నాను. ఇక తమిళులైతే ఆయన తెలుగు వారనే సంగతి ఎప్పుడో మరిచిపోయారు.

బాలు గాన ప్రస్థానం ఒక ఎత్తైతే , పాడుతా తీయగా లాటి కార్యక్రమాల నిర్వహణ ఇంకొక ఎత్తు .. ఆ తరువాత ఎన్ని పాటల పోటీలు వచ్చినా ఆ కార్యక్రమం కాలి గోటికి కూడా సరితూగ లేదు. పాడుతా తీయగా ఎంత  మంది గాయకులకి బాట వేసిందో వేరే చెప్పక్కర్లేదు .. పిచ్చి పైత్యాలు లేకుండా ఓడడం గెలవడం కంటే పాడడం ముఖ్యం అన్న రీతి లో ఈ కార్యక్రమాన్ని నడపడం బాలు కే చెల్లు . పాల్గొనే వారు నొచ్చుకోకుండా వారి తప్పులను చెప్పడం, వారిని ప్రోత్సహించడం  మిగతా నిర్వాహకులు ఈ కార్యక్రమం నించి నేర్చుకోవాల్సిన అతి ముఖ్య  విషయాలు ..
కేవలం బాలు కోసం ఈ కార్యక్రమం చూసే లక్షలాది ప్రేక్షకులలో నేనూ ఒకడిని ..


ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఏంటో బాలు ని చూస్తే తెలుస్తుంది .. ఆయన మొన్నీ మధ్య కే . బాలచందర్ తో చేసిన పాడుతా తీయగా బాలు వినయ విధేయతలకి మచ్చు తునక .


తెలుగు వంట అంటే గుత్తి వంకాయ ; తెలుగు పండగంటే ఉగాది ; తెలుగు పాటంటే బాలు.

బాలుకి ప్రభుత్వం నుండి పెద్దగా గుర్తింపు రాకపోతే ఏం? కోట్ల అభిమానులు , లక్షల అనుచరులు (followers), వేల భక్తులు ఉన్నారు.  అది చాలదూ .. బాలు ఇంట్లో వాడిగా ఫీల్ అయ్యేవాళ్ళు , ఆయన పుట్టినరోజుకి పూజలు చేసేవాళ్ళు , పుట్టినరోజుని పండగలా జరుపుకునే వాళ్ళు  కోకొల్లలు ..

పండగలూ పూజలు జరపకపోయినా బాలు పుట్టినరోజుకి సంబర పాడే వాళ్ళల్లో నేనూ ఒకడిని ..

అందుకే అందుకో పుట్టినరోజు శుభాకాంక్షలు బాలూ!!!!

మీరు మంచి పాటలు పాడుతూనే ఉండాలని , కలకాలం ఆరోగ్యంగా ఉండాలని , మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు కట్టు - బొట్టు , తెలుగు మాట - పాటలని  ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటూ ..

మీ ఒకానొక అభిమాని

Photo Courtesy: Google/ spbindia.com

4 comments:

  1. okati matram nijam.Balu,susheela,Janaki,Yesudas
    ila legends naluguru oke sari ravadam matram arudu.Malli mana lifetimelo alanti legends vastarani nammakam ledu
    (except chitra .shreya to some extent)
    Balu is balu.

    ReplyDelete
  2. బాలు గొప్పతనం .. ఇన్ని సంవత్సరాలుగా పాడడమే కాకుండా..
    రాజేశ్వరరావు, పెండ్యాల మొదలైన తొలితరం సంగీత దర్శకులనుంచి, నేటివారి వరకూ...
    NTR, ANR, MGR, Shivaji, Rajkumar, Prem Nazir, నుంచి నేటి హీరోల వరకూ..
    పాతతరం గాయకులనుండి..నేటివారితో కూడా
    శంకర్-జైషన్, లక్ష్మీ-ప్యారే, OPనయ్యర్ నుండి నేటి వారి వరకూ...
    పలు భాషల్లో, పలు పాత్రలకి..
    National level Awards తెలుగు తెచ్చిన మొదటివాడిగా..

    అంతే కాదు..పద్మభూషణ్ లాంటి బిరుదులకి తెలుగు ప్రభుత్వాల్ని కష్టపెట్టకుండా..తమిళనాడు చేతే తెప్పించుకుని..

    ఒకటేమిటి..చాలా చాలా..ఇన్ని చేసినా తెలుగు చలన చిత్ర వజ్రోత్సవాల్లో..Legend అవలేకపోయాడు..
    సాహో తెలుగువాళ్ళల్లారా!!!!

    ReplyDelete
    Replies
    1. వజ్రోత్సవాల గురించి పెద్ద పట్టించుకోవక్కర్లేదు . పద్మ అవార్డు లు లేట్ గా రావడం దురదృష్ట కరం .

      అయినా మన ప్రభుత్వానికి అంత ఆత్మ గౌరవం లేదు . తమిళులలా కళాకారులని పూజించే సంస్కృతీ లేదు .

      Delete
  3. బాలు గొప్పతనం .. ఇన్ని సంవత్సరాలుగా పాడడమే కాకుండా..
    రాజేశ్వరరావు, పెండ్యాల మొదలైన తొలితరం సంగీత దర్శకులనుంచి, నేటివారి వరకూ...
    NTR, ANR, MGR, Shivaji, Rajkumar, Prem Nazir, నుంచి నేటి హీరోల వరకూ..
    పాతతరం గాయకులనుండి..నేటివారితో కూడా
    శంకర్-జైషన్, లక్ష్మీ-ప్యారే, OPనయ్యర్ నుండి నేటి వారి వరకూ...
    పలు భాషల్లో, పలు పాత్రలకి..
    National level Awards తెలుగు తెచ్చిన మొదటివాడిగా..

    అంతే కాదు..పద్మభూషణ్ లాంటి బిరుదులకి తెలుగు ప్రభుత్వాల్ని కష్టపెట్టకుండా..తమిళనాడు చేతే తెప్పించుకుని..

    ఒకటేమిటి..చాలా చాలా..ఇన్ని చేసినా తెలుగు చలన చిత్ర వజ్రోత్సవాల్లో..Legend అవలేకపోయాడు..
    సాహో తెలుగువాళ్ళల్లారా!!!!

    ReplyDelete