Tuesday, August 6, 2013

నిశివర్నోదకం

      ట నైమిశారణ్యములో కొలువు తీరిన సూతునికి శౌనకాదిమహర్షులు సకల మర్యాదలు చేసి యిట్లడిగిరి. "ఓ పౌరాణిక శేఖరా ! మానవుల దుఃఖము రోజు రోజుకీ  పెరిగి పోతున్నది. వారి పరిస్థితి చూడనలవి కాకున్నది . అంతకంతకీ వారి జీవితం దుర్భరం అవుతున్నది. మోక్షం మీద మోజు ఎపుడో పోయింది. పూజలు,వ్రతాలు, హోమాలు , యజ్ఞాలు మొదలగు వాటిని - చేసి మర్చిపోయే ఫిక్స్డ్ డిపాసిట్ లా వదిలెయ్యకుండా, చేసినప్పటి నించీ ఎప్పుడు రిటర్న్ వస్తుందా అని చూసుకునే స్టాక్ లా తయారుచేసేసారు. భగవంతుడి మీద కంటే వరాల మీద దృష్టి ఎక్కువైపోయింది. వీళ్ళకి ఎప్పుడో వచ్చే మోక్షం మీద నమ్మకం పోయింది. అశాశ్వతం అయినా పర్లేదు సూక్ష్మం లో వీళ్ళ బాధ తీర్చే మార్గమే లేదా. సంపద ఉన్నవాడూ లేనివాడూ  ఏడ్చే వాడే. వీళ్ళ ఏడుపు మొహాలు చూడలేకపోతున్నాం. ఏదన్నా మార్గముంటే చెప్పు స్వామీ!" అని ప్రాధేయ పడ్డారు  

         
సూతుడు చిరు మందహాసంతో "ఋషివరేణ్యులారా! మీ స్వాగత సత్కారాలకి సంతోషం. మానవుడి బాధ ఇప్పటిది కాదు. ఎప్పటి నించో ఉన్నది. ఎప్పుడూ ఉండేది. "ఇది నాది" అనేది ఈ బాధకు మూల బీజం. అది మానవ నైజం. "అది" నిజం కాదు అనేది తెలుసుకున్నవాడు జ్ఞ్యాని. ఆ జ్ఞ్యాన జిజ్ఞ్యాస కాలక్రమేనా సన్నగిల్లుతోంది. అజ్ఞాన అంధకారం అతనిలో అలుముకుంటోంది. అది కలి ప్రభావమో మానవుడి తీరని ఆకలి ప్రభావమో మరి. ప్రతి వాడికి "Instant Karma" కావాలి. అందుకని మీరన్నట్టు రోజూ చచ్చేవాడికి ఎప్పుడో వచ్చేదాని మీద దృష్టి ఉండదు. అందుకని ఎప్పటికప్పుడు ఎంతో కొంత ఉత్తేజ పరిచేది ఈ మానవ జాతికి అవసరం. అలాటి ఉపాయమూ లేకపోలేదు. అలనాడు క్షీరసాగరమథనం లో గరళం ఉద్భవిస్తే బోళా శంకరుడు అది ఒక పాత్రలో పోసుకుని గుటుక్కున మింగి పాత్రని అక్కడే వదిలేశాడు. ఆ పైన క్షీర సాగర మథనం లో వచ్చిన అమృతాన్ని మోహినీ అవతారం లో ఉన్న విష్ణువు పంచుతూ ఉండగా కేతువు సమయానికి వేరే పాత్ర దొరకక అక్కడే ఉన్న ఆ గరళం పాత్రని పట్టుకెళ్ళి దేవతల పక్కన కూర్చున్నాడు. కొంత తాగగానే చక్రధారి రాహు కేతువుల శిరఛ్చేదన చేసేశాడు.

కేతువు చేజారిన ఆ పాత్ర ఆకాశ మర్గాన పయనించి భూమ్మీద భారతానికి పశ్చిమంగా వెయ్యి యోజనాల దూరంలో పడింది. ఆ పాత్ర లోంచి ఒక బొట్టు భూమిలోకి జారింది. క్రమేణా అది గింజగా పరిణామం చెంది ఆ పై మొక్కగా మొలిచింది. ఆ మొక్క మొక్కలై కొండల్లో కోనల్లో యోజనాల కొలదీ విస్తరించింది. ఆ మొక్కలలో ఏదో ఉత్తేజకర గుణం ఉందని అక్కడి ప్రజలు గ్రహించారు . రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి ఆ గింజలు తీసి, వేయించి, దంచి, నీటిలో కాస్తే ఒక చిక్కటి నల్లటి ద్రవం తయారవుతుందని తెలుసుకున్నారు. గరళం పాత్రలో ఉన్నందున కొంత చేదు ఉన్నప్పటికీ అందులో ఉన్న దివ్య ఔషద గుణాలు ఉత్సాహ కణాలు ఆ పనీయానికి బహుళాదరణ కలిగించాయి. పైగా పాలు కలిపితే ఉన్న చిరు చేదు కూడా పోయి ఒక చిక్కని అమృతప్రాయమైన ఉష్ణపానీయం అవతరిస్తుందని కొందరు గ్రహించారు. దాన్నే ముద్దుగా కాఫీ అని పిలుచుకోవడం మొదలు పెట్టారు.


                                        


ఈ పానీయం అమృత సంపాతము, క్షీరసాగర సంప్రాప్తము, పూర్వజన్మ సుకృత సంపాకము, తక్షణ ఉత్తేజ కారకము, మధురాతి మధురము. అది సంపద ఉన్నవాడిని లేని వాడిని ఒకే చూపుగా కరుణిస్తుంది." అని శెలవిచ్చాడు

ఇది విన్న శౌనకాదులు కళ్ళలో ఆనందంతో ఇది ఎవరు సేవించవచ్చు, ఎప్పుడు సేవించ వచ్చు దీని ఉపయోగాలేమి అని సూతుడిని ప్రశించారు.

అప్పుడు సూతుడు "ఇది కుల మతాల కతీతంగా, కలిమి లేములకు సంబంధం లేకుండా, స్త్రీ పురుషులని ఆంక్ష లేకుండా, పిల్లలు పెద్దలు అని వివక్ష లేకుండా అందరూ త్రాగవచ్చు. ఇది సోమరులకి నిదుర పోగొట్టీది, పని లో ఉన్నవాడికి ఆలోచన పెంచేది, వత్తిడి లో ఉన్నవాడికి ఆనందం పంచేది, అలసట కోపం చిరాకు బాధ తుడిచి పెట్టేది. ఆకలి తో ఉన్నవాడికి ఆకలి మరిపించేది. ఆయాసం గా ఉన్నవాడిని తేలిక పరిచేది. ఎల్లప్పుడూ మానవుడి ప్రియ నేస్తం, అభయ హస్తం, సమస్తం.

ఇది సమయం సందర్భం లేకుండా ఎప్పుడన్నా త్రాగవచ్చు . పక్కలోంచి లేవలేనని వొళ్ళు బద్ధకిస్తున్నప్పుడు, స్ట్రెస్ ఎక్కువై బుర్ర పని చెయ్యనపుడు, వంటికి సరిపడని ఆటలు ఆడి వచ్చినపుడు, మనసు దిగాలుగా ఉనప్పుడు, కోపంగా ఉనప్పుడు , ఉపవాసం లో ఆకలిగా ఉనప్పుడు, ఏకాకిగా ఏమీ తోచనపుడు , డబ్బింగ్ సీరియల్స్ భరించలేనప్పుడు వార్తా చానెళ్ళ తలనొప్పి తట్టుకోలేనప్పుడు, మోర్నింగ వాక్ లో , రైటర్స్ బ్లాక్ లో, వసంతకాల ప్రశాంత ఉషోదయం లో,  సాగరతీరంలో గ్రీష్మ సాయంకాలం లో, 
శరద్పున్నమి పండువెన్నెల్లలో,  ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అని తేడ లేకుండా సర్వ కాల సర్వావస్థల యందు ఈ పానీయాన్ని సేవించవచ్చు.  మనిషికి అండా దండా తోడూ నీడా ఈ కాఫీ. 

'ఇతి నిశి వర్నోదకం సర్వమంగళ కరం సర్వలోక ప్రియం
పియతే పండిత పామరై నిత్యం సర్వదు:ఖాతిగో భవేత్'

అనగా  ఇది రోజూ తాగిన వారికి బాధలు చుట్టు  ముట్టవు . ముట్టినా పెద్దగా పట్టవు. బాధలకి భయాలకి కష్టాలకి నష్టాలకి ఇది మంచి ఉపశమనం . ఇది సర్వ లోక ప్రియసుధాధారిని,  సర్వ దు:ఖ నివారిణి, సర్వ మంగళ కారిణి" అని చెప్పి ముగించాడు.

శౌనకాది మునుల ఆనందానికి అవధులు లేవు.సూతుడికి భక్తితో నమస్కరించి ఇంకోసారి సత్కరించి ఇంటికి సాగనంపారు . ఆ రోజు మొదలుకుని ఈ వృత్తాంతాన్ని ఆ మునులు తమ శిష్య ప్రశిష్య గణానికి చెప్పి మానవ కళ్యాణానికి ఈ కాఫీని బహుళ ప్రాచుర్యం లోకి తీసుకురావాలని వారిని అజ్ఞాపించారు. వారి శిష్యులు ఆ మాట కా . ఫీ . తప్పకుండా పాటించారు. తద్వారా భారతావనిలో కాఫీ అవతరించింది , ప్రతీ నోటినీ పలకరించింది. ప్రతి ఇంటా ఆనందం చిలకరించింది.


11 comments:

  1. హహహహ బాగుందండీ కాఫీలోని చేదుకు భలే కారణం చెప్పారుగా :-) నిజమండీ అమృతం కలిసే ఉంటుంది నో డౌట్ :) అర్జంట్ గా వెళ్ళి ఓ కప్పుతాగేసొస్తా..

    ReplyDelete
  2. నిజం నిజం అమృతం కలిసే ఉంటుంది :-)

    ReplyDelete
  3. "ఇది సర్వ లోక ప్రియసుధాధారిని, సర్వ దు:ఖ నివారిణి, సర్వ మంగళ కారిణి"

    అస్తు అస్తు

    ReplyDelete
  4. Superb అండి...భలే రాసారు!
    ఇప్పుడే ఒక కప్పు కాఫీ తాగి, ఈ టపా చదివా....కాఫీ నిజంగా అమృతమే నాకు.

    ReplyDelete
  5. Thank you Pappu garu, Sravya garu and Jalataru vennela garu

    ReplyDelete
  6. సర్వకాల సర్వావస్థల యందు సేవించవచ్చును. అవునండీ! అందుకే బాగా నచ్చింది. మద్యపాన నిషేధం లా ..కాఫీ పాన నిషేధం అమలు చేస్తామంటున్నారు ఇంట్లో. మళ్ళీ ఓ..కప్ కాఫీ తాగి వచ్చి ఈ పోస్ట్ సాక్షిగా హక్కుల పోరాటం చేస్తాను.

    ReplyDelete
  7. :))బాగుందండి ..నేనూ కాఫీకి పేద్ద ఫాన్,ఏసీ అన్నీను .కాఫీ త్రాగని వాళ్లకి ఏమి తెలుస్తుందండీ దాని విలువ !

    ReplyDelete
    Replies
    1. "కాఫీ త్రాగని వాళ్లకి ఏమి తెలుస్తుందండీ దాని విలువ ! "

      Exactly!!

      Delete
  8. Vwey Nice post ...but I love tea :)

    ReplyDelete