Monday, August 19, 2013

కొక్కురు వానచినుకులు






నిశి మిత్రమా నీతో మళ్లీ మాట్లాడాలని వచ్చా
ఒక్క అందమైన స్వప్నం మెల్లగా నా మనసు మీద తన పాద ముద్రలు వేసి చీకట్లోకి జారుకుంది
పాద ముద్రలింకా మౌన రాగంలో పదిలంగా ఉన్నాయి నా మనసులో

మధన పడు ఆ స్వప్నాల్లో
నేను ఒంటరిగా ఇరుకు సందులలో
ఉరకలేస్తున్నాను వీధి దీపాల వెలుగులో
చిక్కగా కురుస్తున్న చీకటిలో 
మంచు పడిన వాకిట్లో 
చలికి చెవులను కప్పుకుంటుంటే
రాతిరిని చీల్చే తొలి వేకువ రేఖలు
కళ్ళను తట్టి ఈ మౌనమేంటి అని  ప్రశ్నించాయి

వెలుతురులో వేల  మందిని చూశాను
మాట్లాడుతున్నారు కాని ఏం చెప్పట్లేదు
వింటున్నారు కానీ అర్థం చేసుకోవట్లేదు
పాటలు రాస్తున్నారు కానీ పాడి వినిపించట్లేదు
ఎందుకంటే ఎవరికీ మౌనాన్ని భంగపరిచే ధైర్యం లేదు

మూర్ఖులారా నా మాట వినండి 
మౌనం వ్యాధిలా సోకుతోంది 
చాచిన నా చేతులు అందుకోండి
నాతో చేయి కలపండి అన్నాను కానీ
నా మాటలు కొక్కురు వాన చినుకుల్లా కురిసి కిక్కిరిసిన రాతిరి లో కలిసాయి  

కొందరు కనపడని దేవుడిని వెతుకుతున్నారు
కొందరు కనపడిన రాయిని దేవుడని మొక్కుతున్నారు
కొందరు మనిషిగా ఎదిగిన వాడినల్లా దేవుడిని చేసేస్తున్నారు
పచ్చి నిజాన్ని భరించలేక పిచ్చి 'ఇజా'లని పట్టుకు వేలాడుతున్నారు
తీర్థాన్ని వదిలేసి శంఖం కోసం వెంపర్లాడుతున్నారు
అందుకే నా మాటలు కొక్కురు మంచు తునకల్లా కురిసి కిక్కిరిసిన రాతిరి లో కలిసాయి

P.S.ఒక ప్రసిద్ధ ఆంగ్ల గీతానికి (బహుశా) ఒక పేలవమైన స్వేచ్ఛానువాదం .

P.S 2: కొక్కురు (నిశ్శబ్దం) అనే దేశ్య పదానికి విశేషణ పదం ఏదన్నా ఉందా ? నే వాడినట్టు కొక్కురునే   విశేషణ పదం కింద వాడచ్చా 


P.S 3: నిశ్శబ్ద వాన చినుకులు రాక్షస సమాసం కదా ?





No comments:

Post a Comment