-------------------------- ఒక యదార్థ కథ ----------------------------------
జూలై 2,2009;
ఉదయం ఆరింటి నించి ఆకాశంలో అలిసిపోయిన సూరీడు ఓవర్ టైం చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాడు. అలాటి విషయాల్లో నేనైతే ఆలోచించను. నేనెక్కిన United ఫ్లైట్ అమెరికా అంతా తిరిగి, San Fransisco లో దిగింది. నేను ఫ్లైట్ దిగి, పిక్ అప్ చేసుకునే నా స్నీహితుడు ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తున్నాను. ఇంతలొ నా సతీమణి ఫోన్. ఫ్లైట్ దిగారా, లగేజి వచ్చిందా, ఎయిర్ హోస్టెస్ బావుందా, పక్కన సీట్లో అమ్మాయి కూర్చుందా, ఫ్లైట్ లో సీట్లెన్ని, ఇతరత్రా ప్రశ్నలకు బదులిచ్చి (ఫోన్ లో అవసరమైన విషయాలు మాట్లాడేవాళ్ళు అరుదు. మేము ఆ అరుదైన వారిలో లేము) గంట లో ఇంటికొస్తానని చెప్పాను. నా స్నేహితుడు రాగానే ఇంటికి బయల్దేరాను. ప్రయాణం లో గత వారం విషయాలు గిర్రున తిరిగాయి.
అది గురువారం సాయంత్రం.
రాత్రికి నా ఫ్లైట్ ఇంటికి ఈస్ట్ కోస్ట్ నించి. ఇంతలో ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు, మా బాస్, మా క్లైంట్ వాదించుకుని, నేను ఆ వారాంతం అక్కడే ఉండాలని డిసైడ్ చేసారు. చేసేది లేక అక్కడే ఉన్నాను. శుక్రవారం అక్కడ దగ్గర్లో మా బావగాడు ఉంటే కలుద్దామని బయల్దేరాను. నేను బస చేసిన ప్రదేశం Hershey (Hershey Chocolates పుట్టినూరు). అక్కడ నా దురదృష్టం కొద్దీ దేశి మేనేజర్ అవ్వడం వల్ల, ఆయన తనతో పాటు నన్ను గాడిద చాకిరీ చేయించి, సాయంత్రం ఆరున్నరకి వదిలిపెట్టాడు. నేను ఆ ఉదయాన్నే రెంట్ చేసిన, కారులో జోరుగా హుషారుగా మా బావగాడింటికి బయల్దేరాను.
వాడింటికి రూట్ చాలా ఈజీ అని నాకనిపించి రెండు గూగెల్ మ్యాప్ లు పట్టుకుని, జి పి ఎస్ లేకుండా ధైర్యంగా బయల్దేరాను. అది నేను చేసిన మొదటి తప్పు. ఆకాశం మేఘావృతమై చినుకులతో చిన్న సంకేతం పంపింది కానీ నేను లెక్కచెయ్యలేదు. మ్యాప్ జాగ్రత్తగా చూసుకుంటూ, మధ్య మధ్యలో ఇంటికి కాల్ చేసి confirm చేసుకుంటూ జాగ్రత్తగానే వెళ్లాను. మధ్యలో ఏదో నేను ఆలోచనలో పడి కార్ పరిగెత్తింది. కట్ చేస్తే నేను రూట్ తప్పాను, కానీ నాకింకా తెలియలేదు. సెల్ లో సిగ్నల్ లేదు. కార్ లో జి పి ఎస్ లేదు. పరిస్తితి ఏం బాలేదని, అక్కడ ఒక కొట్టు దగ్గర ఆపి, కాఫీ తాగి తాపీ గా ఉన్న మీ బోటి పెద్ద మనిషిని రూట్ అడిగా. అది నేను చేసిన రెండో తప్పు. ఆయన పుణ్యమా అని ఆ తప్పుదారంపటే ఇంకో అరగంట వెళ్లాను. తప్పు తెలుసుకుని, రూట్ కనుక్కుని ఒక మూడు గంటలు పైగా పడుతుంది ఇల్లు చేరేసరికి అనుకొని గుండె నిబ్బరం చేసుకున్నాను.
కిందా మీద పడి ట్రై చేస్తున్నాను కానీ కరెక్ట్ రూట్ లో పడలేదు. ఒక పక్క విపరీతంగా వర్షం. దారిలో చాలా చోట్ల ఎన్నో కొట్ల దగ్గర ఆగాను కాని జి పి ఎస్ దొరికలేదు ఎక్కడా. చేసేది లేక సాహసం శ్వాసగా సాగిపోయాను. ఇంచు మించు అర్థ రాత్రి అయినా తూలకుండా కారు తోలుతున్నాను. ఏదో ఆలోచిస్తుంటే సడన్ గా రెడ్ లైట్ పడింది. సర్రున బ్రేకేసా (ఇది నేను చేసిన మూడో తప్పు). అంతే హెడ్ లైట్ పగిలింది. నా ఫ్రంట్ బంపర్, ముందు కారు బ్యాక్ బంపర్ ఊడి రోడ్డుని ముద్దాడాయి. ముందు బ్రేకేసున్న కార్ ఆమడ దూరం ముందు జరిగింది(అన్నట్టు మర్చిపోయా నేను రెంట్ చేసిన కార్ ఆ రోజే కొత్తగా దిగిన పోనియాక్ ౫. దిష్టి బాగా తగిలినట్టుంది ) . నా గుండెలో బాంబు పేలింది. వెంటనే దిగి పరుగు పరుగున వెళ్లి, ముందు కార్ లో ఉన్నవాళ్లు ఎలా ఉన్నారో చూసాను. ఇద్దరు తెల్ల పండు ముసలమ్మలు 60 కి దూరంగా 70 కి దగ్గరగా (నా దురదృష్టానికి దగ్గరగా) ఉన్నారు. నా అదృష్టం కొద్ది ఎవరికీ ఏం కాలేదు. దురదృష్టం కొద్దీ కార్లకి damage బాగా ఐంది. ఈ లోపు కాప్స్ (పోలీసు లకి ) ఎవడో ఉత్తముడు కాల్ చేసాడు. చిన్న ఊరు రాకరాక వచ్చిన ఫోన్ ఏమో 5 నిమిషాలలో వచ్చేసారు . వాళ్ళు వచ్చి రకరకాల ప్రశ్నలు వేసి, ఏం చెయ్యాలో చెప్పి, తప్పు నాదని నిర్దారణ చేసి (అది తేటతెల్లమని మీకు నాకు తెలుసనుకోండి) సంతకాలు తీసుకుని, ధైర్యం చెప్పి, ఇది చాలా మామూలు విషయం, ఆ రోజుల్లో ఇలాటివి మేము ఎన్ని చేసామో, నువ్వేం బాధ పడకు అని ఓదార్చి, నా బంపర్ ని తాడుతో కట్టి, నా భుజం తట్టి, వీధి చివరి వరకూ వచ్చి సాగనంపారు (కాప్స్ ఇక్కడ ఇంత మంచి వాళ్ళని నాకప్పుడు తెలిసింది. ఆ అనుభవం తెలియడానికైనా మీరు ఒక్క accident చెయ్యాలి. ఇది నా మనవి, డిమాండ్ ). ఇంకో మూడు గంటలు, నాలుగైదు స్టేట్ లు తిరిగి, పక్క స్టేట్ లో (న్యూ జెర్సీ ) లో ఉన్న మా బావగాడింటికి , రాత్రి మూడింటికి చేరుకున్నా. మా వాడితో న్యూ యార్క్ అవి తిరిగి మల్లి వర్క్ కి వచ్చేసా. ఆ తరువాత అంత విశేషాలు ఏం లేవు కాబట్టి ప్రెసెంట్ కి వచ్చేద్దాం.
రీకాప్ : ఎయిర్ పోర్ట్ నించి ఇంటికి వస్తున్నాను.
మర్నాడే మా వేగాస్ ప్రయాణం. ఎప్పుడో రెండు నెలల ముందు ప్లాన్ చేసినది. నేను ఇంటి కొచ్చి, ౩ వారాలుగా చప్ప తిండి తో చచ్చుపడిన నోటికి ఆంధ్ర వంట రుచి చూపించా. ప్రాణం లేచొచ్చింది. ప్రయాణం బడలిక తీరి, మర్నాటి ప్రయాణానికి ఊపోచ్చింది. ఇంకో 5 గంటలలో (7:30 కి ) ఫ్లైట్ (అని అనుకున్నాం - 4 వ తప్పు). బట్టలన్నీ సద్దుకుని, కబుర్లు చెప్పుకుని, కునుకు తీసేసరికి, ౫వ గంట మోగింది. త్వరగా తయారయ్యి , మా ఫ్రెండ్స్ తో కలిసి ఎయిర్ పోర్ట్ కి బయల్దేరాం. ఎక్కడో ఊరవతల పార్క్ చేసి, ఎయిర్ పోర్ట్ వాన్ లో టెర్మినల్ చేరుకున్నాం. తీరా చూస్తే మేము వెళ్ళాల్సిన దానికి (American Airlines కి) కాకుండా (United కి ) వేరే టెర్మినల్ లో దిగాం (5 వ తప్పు) . అప్పుడే తెలిసిన ఇంకో విషయమేమిటంటే ఎక్కాల్సిన ఫ్లైట్ ఇంకో 30 నిమిషాలలో ఎగిరిపోతోంది. వేరే టెర్మినల్ నించి (అంటే మేము అనుకున్న దాని కంటే అరగంట ముందు - 6 వ తప్పు ). చేసేది లేక పరుగు పరుగున పరుగెత్తాం. 10 నిమిషాలలో చేరుకున్నాం. కానీ అక్కడ అరగంటే కంటే తక్కువ ఉంది take off కి ససేమిరా పంపమని నొక్కి వక్కానించింది అక్కడున్న తెల్లావిడ . మేము కాళ్ళు జడ, చేతులు మెడ పట్టుకుని బతిమాలితే, మొత్తానికి చెకిన్ చేసి పంపింది. సెక్యూరిటీ చెక్ అన్ని అయ్యి, బోర్డింగ్ చేసాం. మూడు ముప్పులూ, ఆరు తప్పులతో వేగాస్ కి మా ప్రయాణం మొదలైంది.
రెండవ భాగం లో.