Wednesday, December 23, 2009

లాస్ వేగాస్ తీర్థ యాత్ర - 2

ఈ యాత్ర మొదటి భాగం ఇక్కడ. 

మూడు ముప్పులూ, ఆరు తప్పులతో వేగాస్ కి మా ప్రాయాణం మొదలైంది. 


లేట్ గా ఎక్కావేమో ఆఖరు సీట్లు వచ్చాయి ( ఇంకో నిమిషం ఆలస్యమయితే నిల్చుని ప్రయాణం చేయాల్సి వచ్చేదేమో). బ్యాగ్లు సర్దుకుని , అనౌన్స్మెంట్ అయ్యాక, ఫోన్ ఆఫ్ చేసి, జూస్ తాగి, గ్లాస్ ఇచ్చేసే లోపు వేగాస్ ఎయిర్ పోర్ట్ వచ్చేసింది. దిగీ దిగగానే, ఎయిర్ పోర్ట్ లోనే వేగాస్ వాసనలు (కేసినో లు, కాక్టైల్లు) కొట్టొచ్చినట్టు కనిపించాయి. కార్ రెంట్ చేస్తే దగ్గర్లో ఉన్న హోవర్ డ్యాం చూడచ్చని, కార్ రెంట్ చేద్దామని వెళ్ళాము. అది జూలై 4th వీకెండ్ ఏమో తెగ జనం . కార్ రెంట్ చేసే సరికే మధ్యాహ్నం ఐపోయింది. అక్కడ్నించీ, పని చేయని జి పి ఎస్, ఛార్జ్ అయిపోయిన ఐ ఫోన్ తో, ముందు రోజు రాత్రి లేని నిద్రతో, ఉదయం నుండి తిండి లేక ఆకలితో, భీభత్సమైన ట్రాఫిక్ లో ఎడారి ఎండలో (వేగాస్ డిసర్ట్ లో ఉంది) ౩ ఇంటికి హోటల్ చేరుకున్నాం. అసలే చిర్రెత్తి ఉన్న మాకు ఆ హోటల్ రిసెప్షనిస్టు మా రిజర్వేషన్ సిస్టం లో కనపడట్లేదని వళ్ళు మండే సమాచారం చెప్పింది. ఆ రిసెప్షనిస్టు అంత అందంగా ఉండకపోయినా, తప్పు మాది కాకపోయినా, లాగి రెండు పీకే వాడినేమో. చేసేదిలేక పక్కనున్న హోటల్ లో రూమ్స్ తీసుకుని ఎంగిలి పడడానికి బయల్దేరాం. కాలే కడుపుకి మండే బూదిదలాగా ఏదో కాస్త తిని, రూం కెళ్ళి తన్నిపెట్టి పడుకున్నాం. ముందు రెండు రోజులు సరిగ్గా నిద్రలేదేమో, లేచేసరికి అయిదైంది టైం. ఆ రోజు బానే తిని తిరిగి సాఫీ గా గడిచిపోయింది.


మేము వెళ్ళింది మాంచి ఎండలో. ఎంత వేడి అంటే, పోయ్యలేకుండా పప్పు ఉడికించవచ్చు . మేము మొదటిసారేమో వెళ్ళడం, తెలియక వేగాస్ డౌన్ టౌన్ లో హోటల్ తీసుకున్నాం. అక్కడ్నించి స్ట్రిప్ ఒక రెండు మైల్లే అయినా వెళ్ళడానికి ముప్పావు గంట దాకా పట్టేది. ఆ రోజు బెల్లాజియో లో ఎక్కువ సేపు గడిపాము ప్రశాంతంగా . మా ప్రకృతికి విరుద్ధంగా మిగిలన రోజంతా అన్నీ సాఫీ గా సాగిపోతున్నాయి, మంచి రోజులు మళ్ళీ వచ్చాయా ఏంటి, కొత్త కొత్తగా ఉన్నది అని కేసినో లో ఆట ఆడుతూ పాట పాడుతుంటే నేను కొంత గెలిచాను బ్లాక్ జాక్ లో.  (పోయిన బోలెడు ఆటలకన్నా గెలిచినది ఒకటీ గుర్తుండిపోతుంది కదా) . నేను పరిగెత్తు కుంటూ, లక్కీ 7 దగ్గర నీరసం గా ఉన్న నా శ్రీమతి దగ్గరికెళ్ళి డార్లింగ్ పది డాలర్లు వచ్చాయి అనగానే, పర్సు పోయింది అని నీరసంగా చెప్పింది. తీర్థం లా ఉండే ఆ జనం, దొరకడం అసాధ్యం అని తెలిసినా ఆశ చావక లంచ్ చేసిన బెల్లాజియో కెళ్ళి వెతికి, రిపోర్ట్ చేసి వచ్చేసాం. మామూలుగా ఐతే ఇక్కడ (అమెరికా లో ) పర్సు పోయినా పెద్ద విషయం కాదు అన్నీ కార్డ్సే కాబట్టి కాన్సుల్ చెయ్యచ్చు. కానీ అందులో ఒక ఖరీదయిన గిఫ్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి. పోనీ సొమ్ము పోయిందని ఊరకున్నా, ఆ డ్రైవర్స్ లై సెన్స్ లేకుండా తిరుగు ప్రయాణం అనుమానమే. కాల్ చేసి కనుక్కుంటే ఏదో ఒక ఐడి ఉండాలని చెప్పారు . మా దగ్గరా ఇంకోటి లేదు. సర్లే ప్రయత్నిద్దాం. లేకపోతె డ్రైవ్ చేద్దాం అని నిర్ణయించుకున్నాం (సంతోషం ఏంటంటే మేము ఈస్ట్ కోస్ట్ లో లేము ).


మిగతా రెండు రోజులూ హాయిగానే గడిచిపోయాయి. మేము ఒకటి మాత్రం నిర్ణయించుకున్నాం. ఇంకెప్పుడూ వేగాస్ కి వెళ్ళకూడదు అని, వేసవి లో. ఇంచుమించు మూడు రోజులూ 110 F ఉంది . బయటకొస్తే మసే. ఎక్కువ సేపు ఆ స్ట్రిప్ మీద హోటల్లలోనే ఉండేవాళ్ళం. షో స్ అన్నీ బానే చూసాం. బెల్లాజియో, వెనిస్ హోటల్లు చాలా బావున్నాయి. మేము విన్ లాస్ వేగాస్ లో "లే రెవ్" షో కెళ్ళాం. ఎక్కువ మంది బెల్లాజియో లో "ఓ" షో కి వెళ్తారుట. షో బావుంది చాలా. వేరే ప్రపంచానికి తీసుకెళ్ళినట్టు ఉంది లైటింగ్, ఎఫ్ఫెక్ట్స్ , సంగీతం తో. కథ, వాళ్ళ బాధ అర్థం ఐతే ఇంకా బావుండేది అనిపించింది. నాకు అన్నిటికంటే దేదీప్యామానమయిన వేగాస్ రాత్రిలో బెల్లాజియో ఫౌంటైన్ ని ఈఫిల్ టవర్ మీద నుంచి చూడడం అద్భుతమైన అనుభూతి. అదీ మేము ఆఖరు చూసినది అదే .


మేము పూటకొక సారి పర్స్ పారేసుకున్న హోటల్ కి కాల్ చేసేవాళ్ళం, నేను నీళ్ళు వదిలేసినా నా శ్రీమతి పట్టుపట్టడం వల్ల. అదే క్రమం లో ఒకసారి ఆ హోటల్ కెళ్ళి అడిగాం. అక్కడ రిసెప్షనిస్ట్ శ్రియ గోశల్ ఇళయరాజా సంగీతం లో పాట పాడినట్టు ఒక తియ్యని వార్త చెప్పింది. పర్స్ చేతికిచ్చింది. శతం తక్కువగా అన్నీ ఉన్నాయి. హమ్మయ్య అనుకుని ఆ రోజు మా స్నేహితులకి ఓ చిన్న పార్టీ ఇచ్చాం కూడా. ఇక ఫ్లైట్ ప్రయాణానికి దోకా లేదని .

మర్నాడు ఉదయం మా తిరుగు ప్రయాణం. ఈ సారి చాలా జాగ్రత్తగా ఏడింటి ఫ్లైట్ కి ఉదయం అయిదింటికే బయల్దేరాం. ఎయిర్ పోర్ట్ కెళ్ళే దారిలో ఒకసారి దారి తప్పినా సద్దుకుని, మొత్తానికి చేరుకున్నాం. ఎయిర్ పోర్ట్ కి shuttle పట్టుకునేటప్పుడు ఊరికే ఒకసారి టికెట్స్ చూసుకున్నాం. దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఫ్లైట్ 6:30 కి (వేగాస్ కి వచ్చేటప్పుడు ఫ్లైట్ టైమింగ్ వెళ్ళేటప్పుడు టైమింగ్ గా పొరబడ్డాము అలవాటులో ). Shuttle దిగి పరుగో పరుగు ఫ్లైట్ కౌంటర్ కి. ఆలస్యమయినా కిందా మీద పెట్టి మొత్తానికి బోర్డింగ్ పాస్ లు ఇచ్చింది అక్కడున్న పెద్దావిడ. ఆ పైన మా అదృష్టానికి తగ్గట్టు చెక్ ఇన్ దగ్గర బ్లాక్ ఫ్రైడే కి electronics కొట్ల దగ్గర ఉండేంత క్యూ. అది త్వరగానే అయిపోయినా, అక్కడనించీ రెండు టెర్మినల్ ల అవతల మా ఫ్లైట్. ట్రాం పట్టుకున్నాం కానీ మా స్నేహితులు వెనక ఉండి పోయారు. సర్లే మనం వెళ్లి ముందు అక్కడ ఫ్లైట్ ఆపుదాం అని వెళ్ళిపోయాం. అక్కడ బోఅర్దింగ్ దగ్గర ఎయిర్ లైన్స్ ఉద్యోగి మా కంటే కంగారుగా ఉన్నాడు. అప్పటికే మిగతా బోర్డింగ్ అయిపొయింది. కేవలం ఒక 5 నిమిషాలు చూద్దామని ఆగాడు. మా స్నేహితులు ఇంకా రాలేదు. నిమిషానికో సారి కంగారు పెట్టేవాడు వస్తున్నారా అని . మొత్తానికి ఇంకా సరిగ్గా బోర్డింగ్ ఆపేసి తలుపు మూసేయ్యబోతుండగా మా వాళ్ళు వచ్చారు. మా దగ్గర ఉన్న బ్యాగ్ లు గేటు చెక్ చేసాడు (అవి క్యారీ ఆన్ లు మా దగ్గర ఉండాల్సినవి). ఏది అయితే అది అయింది అని దొరికిన ఆఖరు సీట్లలో కూర్చున్నాం. బెల్టు పెట్టుకుని హమ్మయ్యా అనుకుని, ఫ్లైట్ ఎప్పుడు కదులుతుందా అని వేచి ఉన్నాం. ఇంతలో పరుగు పరుగున వచ్చాడు ఆ కంగారు మనిషి (మమ్మల్ని ఎక్కించిన వాడు ). మా నలుగురుని దిగమన్నాడు. ఇదేం గొడవరా బాబు అనుకున్నాం. బోర్డింగ్ పాస్ లు ఇచ్చిన మహా తల్లి మమ్మల్ని వెయిటింగ్ లిస్టు లో పెట్టిందిట. మమ్మల్ని వేరే నలుగురు అనుకుని ఈ తికమక మనిషి ఎక్కిన్చేసాడు. వాడిని తిట్టడానికి నా దగ్గరున్నవి కాదు కదా పూరీ జగన్నాథ్ గారు సినిమాలలో వాడే బండ బూతులన్నీ కూడా సరిపోవు. మా తప్పు కూడా ఉంది కాబట్టి వాడిని విసుక్కోవడం తప్ప ఏం చెయ్యలేకపోయాం. వాడు వేరే ఫ్లైట్ కి పాస్ లు ఇచ్చి, బ్యాగ్లు దిగేచోట చోట తీసుకోవచ్చని చెప్పాడు. అవి వేరే ఫ్లైట్ లో ఉన్నాయి కదా అని చాలా సార్లు అడిగినా వాడు ఏం ఫర్లేదు మై హూ నా వచ్చేస్తాయని భరోసా ఇచ్చాడు. సర్లే ఇంకా చేసేదేముంది అని ఫ్లైట్ ఎక్కి బెల్టు పెట్టుకుని కూర్చున్నాం. ఇంతలో మళ్ళీ దింపే శారు, మాతో పాటు అందరినీ. కంగారు పడకండి మా ఊరు వచ్చేసింది (అరగంటే ప్రయాణం ). 


బే ఏరియా హాయి వాతావరణం లో చల్ల గాలి పీల్చుకోడానికి తహతహ లాడుతూ లగేజీ తీసుకుందామని వెళ్లాం. ఏదో అవకతవక వల్ల మా బ్యాగ్లు రాలేదని, ఎక్కడో మెక్సికో కి వెళ్లి పోయాయని చెప్పింది అక్కడ ఓ పొగరు బోతు. అప్పుడే నా శ్రీమతి ఒక తాజా వార్త చెప్పింది. తన బంగారు వస్తువులు కొన్ని క్యారీ ఆన్ కదా అని ఆ బ్యాగ్ లో పెట్టానని. మూల్గే నక్క మీద తాటిపండు సామెత కి అర్థం అప్పుడు తెలిసింది నాకు. ఆగ్రహం లో రాజశేఖర్ అంత కోపం, పుర్సూట్ అఫ్ హ్యాపీ నెస్ లో విల్ స్మిత్ అంత బాధ, నిస్సహాయత కలిపి వచ్చాయి. కానీ ఏం చెయ్యను, ఒక కంప్లైంట్ రాసి ఇంటికి బయల్దేరాం.విచిత్రం ఏంటంటే మా స్నేహితుల లగేజీ వచ్చేసింది అందరం ఒకేసారి గేటు చెక్ చేసినా.


ఇక ఎయిర్లైన్స్ వాడు రోజుకొక కథ చెప్పేవాడు ఒకసారి మెక్సికో కి వెళ్లిందని , ఒకసారి మిన్నెసోటా అని, ఒక సారి కరీబియన్ అని. వారమయినా బ్యాగ్స్ రాలేదు. ఇక క్లైం చెయ్యడానికో ఉత్తరం కూడా పంపాను. ఆరోజే ఒక దేవదూత మా ఇంటికి వచ్చాడు. భక్తా విచారించకు. నిన్న పోయింది అనుకున్నది నేడు దొరకచ్చు అని చెప్పి ఒక రెండు బ్యాగ్లు చేతిలో పెట్టాడు. బ్యాగ్ లో అన్నీ ఉన్నాయో లేదో చూసి ఆయనకీ దండం పెడదామని వెనక్కి తిరిగాను. ఆయన కంటికి దూరంగా గాలిలో అదృశ్యం అయిపోయాడు.


ఆ సమయం లో అతి కష్టం మీద ఆయన వస్త్రం మీద అస్పష్టంగా మూడు అక్షరాలూ కనపడ్డాయి. U P S అని 


---------------------------------------------------- శుభం -- --------------------------------------------------------------

3 comments:

  1. అవును కదా, ఎయిర్ పోర్ట్ లోనే వేరే ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుంది! :-)
    ఈసారి మాత్రం వింటర్లో వెళ్ళండి.. ఎంత హాయిగా ఉంటుందో.. సూర్యుడు అరడుగు దూరంలో ఉన్నాడా అన్నట్టుండే ప్లేస్ లో ఉన్న మేము వేగస్ సమ్మర్లో వెళ్తే అస్సలు తట్టుకోలేకపోయాము.. అదే వింటర్లో రోజంతా నడుస్తూనే ఉన్నా అలసట అనేది కలగలేదు.. ఇంకో విషయం నాకు బాగా నచ్చింది, స్ట్రిప్ లో ఆల్మోస్ట్ అన్ని హోటల్స్ లో ఒకదాని నించి ఇంకో దానికి లోపలినించే వెళ్ళిపోవచ్చు..

    ReplyDelete
  2. (సంతోషం ఏంటంటే మేము ఈస్ట్ కోస్ట్ లో లేము ) ??? అర్థం కాలే :((

    ReplyDelete
  3. @ నిషిగంధ : వెళ్ళాలి మళ్ళీ. వింటర్ లో చలి ఎక్కువే ఉంటుందేమో అనుకున్నా. బానే ఉంటుందన్న మాట. ఒక దాని నించి ఇంకోదానికి వెళ్ళే మార్గమే కాదు, ట్రైన్ కూడా ఉందిట ముఖ్యమయిన కాసినోలన్నీ కలుపుతూ (స్ట్రిప్ కి MGM, ప్లానెట్ హాలీవుడ్ హోటళ్ళు ఉండే వైపు ఉంటుంది) మేము వాడుకోలేక పోయాం అనుకోండి.


    @ మంచుపల్లకీ: ఈస్ట్ కోస్ట్ లో ఉంటె డ్రైవ్ కూడా చెయ్యలేం కదా వేగాస్ నించి . ఐ.డి లేకపోతె మరీ కష్టం పరిస్థితి అప్పుడు.

    ReplyDelete