Saturday, August 30, 2014

షికాగో సౌత్ లూప్ లో ఆ రోజు ....



         


              దవ అంతస్తు లో పరాగ్గా పడుకున్న నన్ను రవి కిరణాలు బ్లైండ్స్ ని పొడుచుకుంటూ వచ్చి గుచ్చి గుచ్చి లేపాయి  చిరాగ్గా. తప్పక లేచి ఫోన్ దేవుడికి దండం పెట్టుకుని ఈ మెయిల్స్ ఫేస్బుక్ ట్విట్టర్ చెక్ చేసి బ్లైండ్స్ పూర్తిగా తెరిచా. కిటికీ నుంచీ డియర్ బార్న్ స్టేషన్ లో ఎర్రని క్లాక్ టవర్ ఉదయ కాంతిలో మెరిసిపోతోంది. టైం పది. కిందకి చూస్తే ఎటు చూస్తే అటు మంచు అటు షవెళ్ళు ఇటు స్నో ప్లవర్లు  ఎండిన మానులు విరిగిన కొమ్మలు శీతల పీడితులారా మిడ్ వెస్ట్ బాధితులారా మీ బాధలు నేనెరుగుదును అని శ్రీశ్రీ రేంజ్ లో ఆవేశం పొంగింది . అప్పుడే కాఫీ తాగాలని గుర్తొచ్చింది. శనివారం కూడా తెల్లవారు జామునే లేపితే గొడవలై పోతాయని రాత్రి ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి స్టార్ బక్స్ కి పరిగెత్తాను.. ఈ మంచు లో ఆ సంబడం కూడానా..  ముందు కళ్ళు తప్ప అన్ని అవయవాలను అరడుగు మందం కోట్లలో ఉన్నిలో గిన్నెలా గిఫ్ట్ ప్యాక్ చేసి,  తెలుపు-నలుపు సినిమాలలో బంది పోటు దొంగలా కాఫీ ప్రియుల పుణ్య క్షేత్రం స్టార్ బక్స్ కి బయల్దేరాను.


ఉండడానికి రెండు బ్లాక్లు దూరం కానీ  ఆచి తూచి మంచు చూసుకుంటూ నడవడానికి పావుగంట పట్టింది. వెళ్లేసరికి కోలాహలం గా ఉంది. జానాలు గుమిగూడారు. కొంప దీసి ఇది హ్యాపీ అవర్ కాదు కదా అని వాకబు చేశాను. ఈ అమెరికన్లు 
మనకంటే పరమ బద్దకిస్ట్లు అని తిట్టుకుంటూ తిరుపతి దర్శనం కోసం వేచి వున్న భక్తుడిలా వెయిట్ చేశాను. అరగంట లో నా వంతు రానే వచ్చింది. డబల్ టాల్ ఎక్స్ట్రా హాట్ హోల్ మిల్క్  కారమెల్  మాకియాటో అని ఎక్స్ట్రాలు పోతూండగా జేబు తడిమి చూసుకున్నాను. ఫోన్ లేదని తెలుసుకున్నాను. ఎవడినన్నా అడుగుదామంటే ముష్టివాడి కింద జమ కడతారు మన మొహం చూసి అని చచ్చినట్టు లైన్ తప్పించుకుని ఇంటికొచ్చాను. ఫోన్ తీసుకుని చక చకా మళ్ళీ వెళ్లాను. ఈ సారి కొంచం లైన్ తగ్గింది. త్వరగానే ఆర్డర్ ఇవ్వడానికి రెడీ అయ్యాను. ఇచ్చి ఫోన్ తీసి చూస్తే  స్టార్ బక్స్ కార్డు లో నిల్ బాలెన్స్. పర్స్ లేదని గ్రహించాను. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళే ఓపిక లేక, ఫోన్ చేసి శ్రీమతిని నిద్ర లేపి, బాలెన్స్ యాడ్ చెయ్యమంటే. అయిదు డాలర్లు పెట్టి ఇప్పుడు అక్కడ తాగాలా. మొన్న డికాషన్ ఫ్రిడ్జ్ లో ఫ్రెష్ గా ఉంది ఇంటికి రమ్మని ఆర్డర్ వేసింది. చేసి చచ్చేది లేక ఆ షాప్ వాడు నన్ను తిట్టుకోక ముందే బయట పడ్డాను. కాళ్ళీడ్చు కుంటూ ఇంటికి వచ్చి పడ్డాను. రెండు వారల కిందటి చక్కటి ఫ్రెష్ పాలు మైక్రో వేవ్ చేసి, మొన్నటి డికాషన్ లో పోసి, పొగలు కక్కుతున్న చల్లటి కాఫీ ఇచ్చింది. శ్రీమతి అంటే ప్రేమ ఉన్నవారు కాఫీ ఎలా ఉన్నా ఎలా కాదన గలరు అని అనుకుని అయినాపురం ఆయుర్వేదం డాక్టర్ గారి మందులా గుటుక్కున మింగేసా.

క్లాక్ టవరు లో టైం పన్నెండు.

ఇప్పుడు ఇక్కడే ఉంటే బ్రంచ్ కాదు లిన్నరే అని తేల్చుకుని, కూరగాయలు తేవాలని వంక పెట్టి డెవాన్ కి ప్రయాణమయ్యాను.  ఈ సారి మరిచిపోకుండా వాలెట్ , ఫోన్, కార్ తాళాలు గుర్తు పెట్టుకున్నాను. వాటితో పాటు ఒక షవెల్, స్నో మెల్టింగ్ లిక్విడ్ పట్టుకుని పని కెళ్తున్న సానిటరీ వర్కర్ లా మా ఇంటికి అర మైలు అవతలున్న పార్కింగ్ లాట్ కి పయనమయ్యాను. రెండు రెస్ట్ స్టాప్లు మూడు పిట్ స్టాప్ల తరువాత పార్కింగ్ లాట్ కి చేరాను. తీరా  చూస్తే నా కార్ పార్క్ చేసిన స్పాట్ లో కనపడలేదు. వేరే ఎక్కడన్నా పెట్టనేమో అని కలయతిరిగాను. కీ నొక్కితే ఎక్కడో సన్నగా చిన్నగా ఒక మూలుగు లాటి కూత వినిపించింది. షెర్లాక్ హోమ్స్ లా ఫీల్ అయిపోయి నా శబ్ద భేరి విద్యనంతా  ఉపయోగించి స్పాట్ పట్టుకుని పురావస్తుశాఖలా షవెల్తో తవ్వడం ఆరంభించా. తవ్వగా తవ్వగా టన్ను మంచు పక్కకి పోగా, నేను కేజీ బరువు తగ్గగా, నా కామ్రీ కంట పడింది. నా కళ్ళు ఆనంద బాష్పాలతో, చొక్కా చెమటతో తడిసిపోయింది ఆరు డిగ్రీల చలిలో కూడా. ఐస్ మెల్టింగ్  లిక్విడ్ కామ్రీ మీద పోశాను. మంచు కరిగి, మట్టి విరిగి తలంటిన తమన్నాలా మెరిసిపోయింది.

షికాగో ని తిట్టుకుంటూ, చెమట కంపు కొట్టుకుంటూ, ఎప్పుడో కారు కొన్న కొత్తలో పెట్టిన పాటలు వింటూ లేక్ షోర్ ఎక్కాను. గడ్డ కట్టిన మిషిగన్ సరస్సు పక్కన మెలికెలు తిరుగుతూ షెరిడన్ దగ్గర ముడుచుకుంది లేక షోర్ రోడ్. అక్కడినించి ఒకటే ట్రాఫిక్. నిమిషానికి నాలుగడుగుల చప్పున కార్ దూసుకెళ్తోంది ఈ మధ్య బ్లాక్బస్టర్ తెలుగు సినిమాలలా. ముప్పావుగంట లో డెవాన్ ఎవెన్యూ మీదకి చేరుకున్నా. ఇక్కడికి రాగానే హైదరాబాద్ వచ్చినట్టు నాస్టాల్జిక్ గా ఫీల్ అవుతారో ఏమో మునిసిపాలిటీ బళ్ళలా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు కార్లు. హార్న్ కొట్టి కొట్టి విసుగొచ్చి కూర్చున్నాను. చెత్త చెదారం దాటుకుంటూ నత్త నడకన ఎలాగో సాయంత్రం లోపు  డెవాన్ సెంటర్ కి జేరాను. ఫ్రెష్ ఫార్మ్స్ వెనకాల పార్కింగ్ ఉంది కదా అని తల్మా అవెన్యూ మీదకి టర్న్ తీసుకున్నాను. అక్కడ నా ముందు మూడు కార్లు గోతి కాడ నక్కలా పార్కింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక పావు గంట ఆగితే నానో కార్ సరిపోయేంత పార్కింగ్ స్పాట్ దొరికింది. అందులో నా కామ్రీ ని ఎలాగో అతి కష్టం మీద ఇరికించా. నా డోర్ తీసేలోపు సివిక్ సెన్స్ లేకుండా ఎవడో సివిక్ లో వచ్చి సందు లేకుండా పార్క్ చేసేశాడు. వాడి వెనక రెండు కార్లు. ఇంకా చేసేది లేక మూన్ రూఫ్ తెరిచి బంకర్ నించి తప్పించుకున్న భారతీయుడిలా బయటకి వచ్చా. 


(సశేషం)


ఇది లాజికల్ బ్రేక్ కాదని తెలుసు కానీ ఇది లాజికల్ కథ కాదు కామికల్ సొద. 

అదీ కాక నేనొక  బద్దకిస్టు . 

అందుకే ఎప్పుడో మొదలెట్టినది  ఇప్పటి దాక పోస్ట్ చెయ్యలేదు బద్దకిస్తూ.    

2 comments:

  1. మాకా భూతాల సొరగం లో మీరెంత సుకపడిపోతున్నారో మీలాటోళ్ళు ఇడమరిసి సెప్పకపోతే ఎట్టా తెలుస్ది? కసింత ఓపిక దెచ్చుకుని కొరవా కత కూడా సెప్పెయ్యండి సామీ.

    ReplyDelete
    Replies
    1. త్వరలో చెప్పేస్తానండీ ..

      Delete