Thursday, July 20, 2017

షికాగో సౌత్ లూప్ లో ఆ రోజు ....రెండో పూట
ఇంక చేసేది లేక మూన్ రూఫ్ తెరిచి బంకర్ నించి తప్పించుకున్న భారతీయుడిలా బయటకి వచ్చా.
ఎక్కడినించీ బయటికి వచ్చా ఏం కథా తెలుసుకోవాలంటే ముందు మొదటి పూట ఏం జరిగిందో మొదటి పుట లో చదివి రండి.నేరుగా ఫ్రెష్ ఫార్మ్స్ పక్కనే ఉన్న పటేల్ బ్రదర్స్ అనే గుజ్జూ కొట్టు ముంగిట్లోకి చేరుకున్నా. కొట్టు నిండా పెళ్ళాలు వదిలేసిన మొగుళ్ళే. మీరు పెడార్థం తియ్యక ముందే మీకొక యదార్థం చెప్పాలి. డెవాన్ లో బ్యూటీ పార్లర్ సేవలు మహా అప్రియమని, భలే మంచి చౌక బేరమని బోరుమని ఏడ్చే పిల్లలని, మొగుళ్ళని (మళ్ళీ పెడార్థం, ఎవరి మొగుడిని వారు) గంటల తరబడి పచారీ కొట్లలో వదిలేసి క్యూలు కట్టి మరీ సేవలు పొందుతారు మహిళలు.

అందుచేత పిల్లలని చూడవలిసి వచ్చిందని చిరాకు, భార్య పక్కన లేదని ఆనందం, పచారీ సామాను కొనాలని బాధ కలగలసిన మిశ్రమ స్పందన తో కనిపిస్తారు ఎక్కువగా మగంగులు. అన్నట్టు ఎక్కడున్నాను.. ఆ .. పటేల్ బ్రదర్స్ మునివాకిట్లో. మొత్తానికి జనాలను తోసుకుంటూ కావాల్సినవి తీసుకున్నాను. సేల్ లో ఉన్న రైస్, ఎక్ష్పైరీకి దగ్గరలో ఉన్న మ్యాగీ, ఆగస్టు పదేహేను న ఒక స్కూలు మొత్తానికి పంచడానికి సరిపోయే బిస్కెట్స్, ఫిలిపినో కొబ్బరికాయలు , మెక్సికో మావిడి పళ్ళు, ఎండిపోవడానికి అరడుగు దూరంలో ఉన్న కరివేపాకు, పండిపోయిన పచ్చిమిర్చి , అరటి కాయకి పండుకి మధ్యస్థంగా ఉన్న అరిటికాయలు, ఆవు నెయ్యి, అగ్గిపెట్టెలు, అగరబత్తి , పత్తి వత్తి, పూల గుత్తి ఇలా నానా విధ ఫల పుష్ప తోయ ద్రవ్య ద్రవ , ఘన పదార్థాలతో కదులుతున్న రైతు బజార్ లా బయటకి వచ్చాను. కార్ట్ ని కార్ దాకా పట్టికెళ్ళడానికి క్యాష్ డిపాజిట్ చెయ్యాలి. నా దగ్గర సమయానికి క్యాష్ లేక , నా ఐ డి కార్డు , లైసెన్స్, విజిటింగ్ కార్డ్, క్రెడిట్ కార్డ్ గట్రా ఇచ్చి, జనాలని తోసుకుంటూ , తప్పించుకుంటూ కార్ కేసి పరుగెత్తాను. హమ్మయ్య బయటపడ్డాను అనుకునే లోపు అక్కడ కార్ కనపడలేదు. నా మతిమరుపు తో వేరే ఎక్కడన్నా పెట్టానా అని కీ నొక్కి చూస్తే ఎక్కడి నించో చిన్న కోత విన్పించింది. అది కూడా నా నించి దూరంగా వెడుతున్నట్టు మూలుగు లోకి పరివర్తనం చెండుతూండడం చూసి అటు వైపు చూశాను. అల్లారు ముద్దుగా చూసుకున్న నా కామ్రీని కామన్ సెన్స్ లేకుండా కాలర్ (అదే బంపర్) పట్టుకుని కాళ్ళీడ్చు(అదే టైర్లీడ్చు) కుంటూ టవింగ్ ట్రక్ తీసుకెళ్తుంటే కడుపు తరుక్కు పోయింది. ఎగసిపడుతున్న అల , ఎగురుతున్న పక్షి , నడుస్తున్న జనం, కురుస్తున్న మంచు అన్నీ స్తంబించి పోయాయి (అనిపించింది). ఆ బాధ లోంచి తేరుకుని కార్ట్ కొట్టులోకి ఈడ్చుకెళ్ళి, అక్కడ వదిలేసి, ఆ టవింగ్ ట్రక్ వెనక వసంత కోకిల చివరి సీన్ లో కమల్ హాసన్ లా పరిగెత్తాను.


నన్ను చూసాడో ఏమో ఆ డ్రైవర్ ఇంకా వేగంగా పోనిచ్చాడు . చేసేది లేక క్యాబ్ తీసుకుని ఆ ట్రాక్ ని ఫాలో అయ్యా. అక్షరాల రెండు వందల.. డాలర్లే.. జరిమానా కట్టి నా కార్ ని చర విడిపించా. ఈ సారి పార్కింగ్ స్పేస్ వెతికి రెండు గంటలకి టికెట్ తీసుకుని కొట్టు లో వదిలేసిన కార్ట్ తీసుకుని సామాన్లు తీసుకుని ఇంటికి పరిగెట్టించాను. టోరీ లో "నువ్వేమి చేసావు నేరం " పాట వస్తోంది.

డెవాన్ స్ట్రీట్ ని పార్కింగ్ స్పేస్ లా చేసిన దేశీ కార్లని తప్పించుకుని లేక్ షోర్ ఎక్కి గడ్డ కట్టిన మిషిగన్ సరస్సు ను చూసుకుంటూ గంట లో ఇల్లు చేరుకున్నాను. మూడు తాళాలతో ఆరు తలుపులు తీసి మూవింగ్ కార్ట్ ఒకటి తెచ్చుకున్నాను లోపలి స్టోర్ రూం నించి. అండర్ గ్రౌండ్ పార్కింగ్ నించి లిఫ్ట్ లేదు మరి. పార్కింగ్ లైట్స్ వేసి గబా గబా రైతు బజార్ ని కార్ లోంచి కార్ట్ లోకి ఎక్కించా. మళ్ళీ ఒక్కొక్కటే తలుపు తీసుకుని లిఫ్ట్ లో చేర్చి, తొమ్మిదో ఫ్లోర్ లో నా ఇంటికి చేర్చే సరికి తల ప్రాణం తోకకి వచ్చింది.
అంతర్యామి అలసితి సొలసితి అనుకుంటూ నిదుర లోకి జారుకున్నా. సౌందర్య లహరి .. స్వప్న సుందరీ .. పాట బాక్గ్రౌండ్ లో వినిపిస్తోంది. ఆ అమ్మాయి ట్రాలీ మీద కాకుండా కార్ మీద నించుని అటూ ఇటూ నడుస్తోంది . ఒక్కసారి కిందకు చూశా తాళాల గుత్తి వేలాడుతోంది .. దగ్గరికి వెళ్లి చటుక్కున తీప్పా .. కార్ డోర్ తో పాటు కళ్ళు తెరిచాను. ఎదో మరిచాను ..

పరుగు పరుగున కింద ఎమర్జెన్సీ పార్కింగ్ దగ్గరికెళ్ళా .. కార్ లేదు ..
డోర్ మాన్ ని అడిగా .. చావు కబురు చల్లగా చెప్పాడు. .. ఆ పార్కింగ్ 15 నిమిషాలకే.. అది దాటితే ఫోన్ వస్తుందని , ఎత్తకపోతే టికెట్ అతికిస్తారని, చూసుకోకపోతే tow చేస్తారని ..
ఇంకా నయం జైల్ లో పెడతారని కోర్టుకి తీసుకెళ్తారని చెప్పలేదనుకుని .. ఈ అతి రూల్స్ కో దండం పెట్టి, స్వదేశం లో స్వేఛ్చని తలుచుకుని కన్నీరు తుడుచుకుని నీరసం స్వాశగా షికాగో సౌత్ సైడ్ కి సాగిపోయా.. క్యాబ్ లో .. అక్కడ సొట్టపడ్డ , విరిగిపోయి, వదిలించుకోడానికే పార్కింగ్ లో పెట్టినట్టున్న కార్ల మధ్య Orange is the new black లో హీరోయిన్ లా బిక్కు బిక్కు మంటూ పిచ్చి చూపులు చూస్తోంది నా cute క్యామ్రీ. బాధ, కోపం తో పాటు ధ్వని, కన్నీరు తో కూడిన ఏడుపొకటి వచ్చింది.. ఆ tow mater మొహాన రెండొందల డాలర్లు కొట్టి మళ్ళీ విడిపించి నా క్యామ్రీ ని ఇంటికి నడిపించాను.. పార్కింగ్ దగ్గరికొచ్ఛేసరికి ఆకలి భగ్గుమంది.
హడావుడిగా కార్ పార్కింగ్ లో పెట్టి, లిఫ్ట్ లో ఇంటికి పరుగెత్తాను

అప్పటికే ఇంగువ ఘాటు లిఫ్ట్ లోకి వస్తోంది. మావిడికాయ పప్పు, బంగాళా దుంప వేపుడు, పెరుగన్నం లాగించి మళ్ళీ ఓ కునుకు తీసా..
                              

లేచేసరికి ఉదయం ఆరు. త్వరగా ముస్తాబై ఆఫీస్ కని కిందకు పరిగెత్తాను. నా పార్కింగ్ స్పాట్ లో కారు లేదు. covered పార్కింగ్ లో కారు ఎవరు ఎత్తుకెళ్లారు? ఎలా మాయమైంది ? నీకు తెలుసా ? అని డోర్ మాన్ ని నిలదీస్తే వాడు నా చెమటలు తుడుచుకోడానికి ఒక కర్చీఫ్ ఇచ్చి , లాగ్ రిజిస్టర్ తెచ్చి చూపించాడు.. నాది పార్కింగ్ 26 పక్కది 28.. నాదనుకుని 28 లో పెట్టాను. బోల్తా కొట్టాను ..

ఇంకేముంది .. శ్రీ మద్రమణ గోవిందో హరి అనుకుని .. రెండొందల ఫైన్ కట్టడానికి towmater దగ్గరికి పరిగెత్తాను ..

No comments:

Post a Comment