దీర్ఘ నిద్ర నుండి ఉలిక్కిపడి లేచింది చెట్టు చేమా
గాలి పరిమళాన్ని ఆకుల నాసికలతో అఘ్రానిస్తూ
మౌన ముద్రని వీడి హాయిగా నవ్వింది నేల
చల్ల గాలి స్పర్శకు పులకించి పరవశిస్తూ
మేఘాల రాకను పసిగట్టి
ఆనందంగా ఎగసిన నుసిని రెమ్మ చేతుల పట్టి
ఆకు ఆకుకి నలుగు పెట్టి
మంగళ స్నానానికి ఎదురు చూసింది ప్రతీ చెట్టూ
మెరుపు అరుపుల వల్ల కొద్దిగా భయం ఉన్నా

ఇంతలో ..
ఆకాశం ఆనందంగా నవ్వింది
నల్లని మేఘాల చెంపల మీద మెరుపు కాంతులీనాయి
పుడమి మెడలో హరివిల్లు హారమై అమరింది
వర్షానంద బాష్పాలు హోరుగా కురిసాయి
హర్షాతిరేకాలతో చెట్లు స్నానాలు చేసాయి
కురిసిన నీరు తో తడిసిన నేల చెట్లకి మట్టి గంధాలు పూసి
నీటి పన్నీటిని జల్లింది
రెమ్మ రెమ్మకి కొమ్మ కొమ్మకీ సువాసనలు పరిచింది
పులకరించిన ప్రతీ చెట్టు కొత్త రాగాలాలపించింది
పరవశించిన ప్రతీ పక్షికి ఆహ్వానాలు పంపింది
Superb
ReplyDelete