Sunday, July 26, 2020

రైతన్న

దప్పి తీర్చే తీరులేక దాహతిచ్చే నీరులేక 

ఎండ తగిలి మండిపోయే ఎండుకట్టై మిగిలినాడే 

గుండె రగిలి గొంతు మండి పొగిలి పొగిలి యేడ్చినాడే 

దిక్కులేక మొక్కులేక దిగులుతోనే సచ్చినాడే 




నీరులేని మట్టిగడ్డ దున్నలేని రైతుబిడ్డ 

కంటనీటిని చూడలేక 

నేలతల్లీ నింగినైనకు 

బోరుమంటూ పోరుపెడితే 

గుండె బరువై కళ్ళు చెరువై 

మబ్బులన్నీ ముసురుకోని 

ఉరుములైనయ్ మెరుపులైనై కసురుకోని 

చుక్కలన్నీ ముక్కలాయే

వాననీటి చుక్కలాయే

పొద్దుగుంక రాత్రిదంక

ఏరులంక వాగులంక

చెరువలంక నదులవంక

పారిపారి 

ఎండిపోయిన బీడులన్నీ

ఆరిపోయిన గొంతులన్నీ

ఇరిగిపోయిన గుండెలన్నీ

ఇగిరిపోయిన ఆశలన్నీ

తడిసి తడిసి మురిసినాయే 


మొలకలొచ్చి పొలములెల్ల 

పులకరించి పువ్వు రెమ్మ 


కొమ్మ కొమ్మ చెట్టు గట్టు పచ్చ పచ్చగా పూసినాయే 


పాలపిట్ట కోయిలమ్మ మావి కొమ్మ 


గూడు కట్టి వెచ్చ వెచ్చగా కూసినాయే 


పైరులన్నీ చేతికొచ్చి 

గాదెలన్నీ నిండినాయే 

వెతలుపోయి మెతుకులొచ్చే బతుకులన్నీ పూసినాయని 

కన్న కలలు పండినాయని ఖుషీ చేసే లోపే - 


గాదెలేమో కౌలుకిచ్చిన దొరలవాయే 

రైతులేమో కరువులోనే మిగిలిపాయే



Saturday, July 25, 2020

లాలి పాట


బుజి బుజి  రేకుల బుజ్జాయి 

బుజ్జా రేకుల బుజ్జాయి 

బజ్జోవేమే పాపాయి 

బొజ్జ నిండ పాలుతాగి 


బుడిబుడి అడుగుల నడకలతో 

చిటిపొటి మాటల మూటలతో 

గజిబిజి ఆటల పాటలతో 

అలసిపోవా పన్నెండైనా 

బజ్జుకోవే బుజ్జిదానా


చుక్కలన్నీ మిన్ను దుప్పట్లో

బజ్జుకున్నాయ్ ఎపుడో ఎప్పట్లా

చందమామ తరిమి చీకట్లు

వెన్నెల కురిసే వాకిట్లో

బజ్జుకోవే బుజ్జిదానా



కొమ్మా రెమ్మా ఉయ్యాల్లో 

గాలి లాలి పాటలతో 

చిట్టీ పొట్టీ చిలకమ్మా

పిట్ట కోయిల కాకమ్మా

గుర్రుపెట్టి నిద్దరోయె

బజ్జుకోవే బుజ్జిదానా



వీధి చివర నుంటాడు

ఎర్రటి కళ్ళ తెల్లోడు

నల్లటి పళ్ల ఎర్రోడు

బుర్ర మీసాల బూచాడు

బాబోయ్ ఇంటికి వస్తాడు

బజ్జోపొతే నువ్వికనైనా


Monday, July 13, 2020

శ్రావణ మేఘ రాగాలాపన




దీర్ఘ నిద్ర నుండి ఉలిక్కిపడి లేచింది చెట్టు చేమా 

గాలి పరిమళాన్ని ఆకుల నాసికలతో అఘ్రానిస్తూ 

మౌన ముద్రని వీడి హాయిగా నవ్వింది నేల 

చల్ల గాలి స్పర్శకు పులకించి పరవశిస్తూ 

మేఘాల రాకను పసిగట్టి 

ఆనందంగా ఎగసిన నుసిని రెమ్మ చేతుల పట్టి 

ఆకు ఆకుకి నలుగు పెట్టి 

మంగళ స్నానానికి ఎదురు చూసింది ప్రతీ చెట్టూ 

మెరుపు అరుపుల వల్ల కొద్దిగా భయం ఉన్నా 


The Magic of Monsoon- Top 5 places in India that are a MUST-VISIT ...


ఇంతలో .. 

ఆకాశం ఆనందంగా నవ్వింది 

నల్లని మేఘాల చెంపల మీద మెరుపు కాంతులీనాయి

పుడమి మెడలో హరివిల్లు హారమై అమరింది 

వర్షానంద బాష్పాలు హోరుగా కురిసాయి

హర్షాతిరేకాలతో చెట్లు స్నానాలు చేసాయి 

కురిసిన నీరు తో తడిసిన నేల చెట్లకి మట్టి గంధాలు పూసి 

నీటి పన్నీటిని జల్లింది 

రెమ్మ రెమ్మకి కొమ్మ కొమ్మకీ  సువాసనలు పరిచింది

పులకరించిన  ప్రతీ చెట్టు కొత్త రాగాలాలపించింది 

పరవశించిన ప్రతీ పక్షికి ఆహ్వానాలు పంపింది 

శ్రావణ మేఘాలు సంబరాలకి స్వాగతాలు పలికాయి