గమ్యం సినిమా నాకు పెద్ద గొప్ప సినిమాలాగా అనిపించలేదు. కొంచం విభిన్నంగా ఉన్నఒక మామూలు సినిమా.
ఎందుకు ఈ దర్శకుడిని ఇంత ఎత్తేస్తున్నారు? బహుశా అతనికి సినిమా వాళ్లతో ఉన్న పరిచయం వల్లనేమో అనుకున్నాను. సాధారణంగా మొదటి సినిమా తో పైకెగిరి రెండవ సినిమాకి చతికిల పడే దర్శకుల్లో చేరిపోతాడేమో అనుకున్నాను. కానీ వేదం చూశాక ఇతను మంచి విషయం ఉన్న దర్శకుడు అని తెలిసింది.
అయిదు పాత్రలు, వారి కథలు ఒక చోట కలవడం. అది వారి జీవితాలని మలుపు తిప్పడం వేదం కథ అని చూచాయిగా తెలిసింది మీడియా లో సినిమా గురించి ఊదరకొట్టడం వల్ల. ఆడియో నాకు వినగానే బాగా నచ్చింది ముఖ్యంగా "మళ్ళీ పుట్టనీ", "ఏ చీకటీ" పాటలు. సాహిత్యం కూడా చాలా చక్కగా ఉంది. సరిగ్గా వాడుకుంటారా సినిమాకి అన్న అనుమానం మొదలైంది.
రకరకాల సమీక్షల ద్వారా పాజిటివ్ టాక్ చూసి సినిమా బానే ఉంటుందిలే అనుకునే బయల్దేరాం. బే ఏరియా లో తెలుగు సినిమాకి హాలు నిండడం, టికెట్ లు అయిపోయాయని ఇంకో ఎక్స్ట్రా షో వెయ్యడం మగధీర తరువాత ఇదేనేమో.
సినిమా మొదలైంది. ఒక్కొక్క పాత్రని ప్రవేశపెట్టడం మెల్లగా కథని ఆవిష్కరించడం బావుంది. మనోజ్ పాత్రకి ఇంకెవరి నయినా పెట్టాల్సింది. ఇంటర్వల్ సమయానికి బాగా తీసాడు, ఎక్కడా బోర్ కొట్టలేదు అనుకున్నాం (ఈ మధ్య ఇది కూడా కష్టం అయిపోయింది తెలుగు సినిమాలలో). ఇంటర్వల్ తరువాత ఇక కథలో లీనమయిపోయాం.క్లైమాక్స్ కి జనం నించి మంచి రెస్పాన్స్ వచ్చింది.
పాత్రలు తప్ప నటులు కనపడలేదు. ముఖ్యంగా అనుష్కా, అల్లు అర్జున్ బాగా చేశారు. అనుష్కా కి స్నేహితురాలి(/స్నేహితుడి)గా చేసిన నటుడు అద్భుతంగా చేశాడు. నాకు మధుర్ బండార్కర్ సినిమాలలో కనిపించే పాత్రలు గుర్తొచ్చాయ్. ఇంచు మించు అందరు నటులు తమ పాత్రలకి ప్రాణం పోశారు.
ఈ సినిమాకి నిజమయిన హీరో క్రిష్. ఇతను ఇలాటి కొత్త రకం తెలుగు సినిమాలు తీసి మున్ముందు కొత్త శకం తెలుగు సినిమాకి ప్రతినిధి అవుతాడని ఒక ఆశ కలిగింది. నాకు కొత్త వారిలో (గత దశాబ్దం అనుకోండి) శేఖర్ కమ్ముల, సుకుమార్, చంద్ర శేఖర్ యేలేటి సినిమాలు నచ్చుతాయ్. కానీ అన్నిటిలోనూ ఏదో వెలితి ఉంటుంది. శేఖర్ కమ్ముల సినిమాలలో టెక్నికల్ గా పర్ఫెక్షన్ ఉండదు. సినిమా మాధ్యమాన్ని బాగా వాడుకుని కథని ఎలివేట్ చేసే శక్తి లేదు కమ్ములకి. సుకుమార్ టెక్నికల్ గా పెర్ఫెక్షన్ ఉంటుంది, టేకింగ్ స్టైలిష్గా ఉంటుంది కానీ కథ లో ఏదో లోపం , వెలితి కనిపిస్తాయ్.లేకపోతె ఏదో ఎక్కడో తేడా చేసేస్తాడు. ఇక చంద్రశేఖర్ యేలేటి. నాకు అనుకోకుండా ఒక రోజు చూసి మైండ్ బ్లాక్ ఐంది. తెగ నచ్చింది. ఇతని సినిమాలు ప్రయాణం తప్ప అన్నీ ఇష్టం నాకు. కాకపోతే కొంచం స్లో గా ఉంటాయ్.
వేదం లో మాత్రం క్రిష్ అనీ బాగా బ్యాలెన్స్ చేసాడు అనిపించింది. టెక్నికల్ గా పేరు పెట్టడానికి ఏం లేదు. కథ, కథనం, మాటలు చక్కగా రాసాడు. ఆర్ట్ ఫిలిం లా కాకుండా కమర్షియల్ సినిమా తీసాడు కొత్త కథ అయినా. ఇలాటి సినిమాలు మున్ముందు బోలెడు వచ్చి ఆరు పాటలు ఏడు ఫైటులు, పాత చింతకాయ పచ్చాడి కథలు, తాతల నాటి కథనాల నించీ తెలుగు సినిమాలు బయటపడాలని ఆశిస్తున్నాను.
నేను తొమ్మిదవ తరగతి లో ఉన్నప్పుడు అనుకుంటా, మా సోషల్ టీచర్ సెకండ్ వరల్డ్ వార్, హిట్లర్ గురించి చెబుతూ, వీటి మీద షిండ్లర్స్ లిస్టు అనే అద్భుతమయిన సినిమా ఉంది స్పీల్బర్గ్ (జుర్రాసిక్ పార్క్ పుణ్యమా అని ఆయన పేరు విన్నా అప్పటికి). దాంట్లో హిట్లర్ చేసిన అరాచకం గురించి బాగా చెప్తాడు అని చెప్పినట్టు చూచాయి గా గుర్తుంది. ఎన్నో సార్లు చూద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మొత్తానికి ఆ శుభ తరుణం నిన్న ఆసన్న మయినది.
ఆంగ్ల సినిమాలు చూసే వారు ఇది మిస్ అయ్యి ఉండరు. కానీ అయి ఉంటే వెంటనే అద్దెకో, డౌన్లోడ్ చేసో, ఆఖరికి కొని అయినా చూడాల్సిన సినిమా. కథ - రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల అరాచకత్వానికి దారుణంగా బలి అవుతున్న జూస్ తో ఒక పరిశ్రమను ప్రారంబించి (మొదట్లో కేవలం లాభాల కోసమే) మెల్లగా వాళ్ళని ఆదుకునే నాథుడుగా ఎదిగిన షిండ్లర్ కథ. ఒక పక్క నాజీల అరాచాకత్వాన్ని, ఉన్మాదాన్ని, జూస్ నిస్సహాయతని, షిండ్లర్ మానవత్వాన్ని అత్యద్భుతంగా చిత్రకరించాడు స్పీల్బర్గ్.
చూస్తున్నంత సేపు ఆ సమయంలో మనమక్కడ ఉన్నట్టే, ఆ అమానుషం మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉంటుంది. ఒకసారి బాధతో కళ్ళల్లో నీళ్ళు తిరిగితే, ఒకసారి కోపంతో గుండె రగిలిపోతుంది. ఒకసారి జాలితో గుండె కరిగిపోతే, ఒకసారి మానవత్వానికి ఉప్పొంగిపోతుంది.సినిమా మొత్తం హిట్లర్ ని, జూస్ ని ఊచకోత కోసిన నాజీలని బతుకుంటే వెంటనే గొంతు నులుమి చంపెయ్యలనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను చూసిన, విన్న చరిత్రలో ఇంత దారుణంగా, ఎందుకు చంపుతున్నారో కూడా తెలియకుండా ఇన్ని లక్షల మందిని చంపిన ఉదంతం లేదు. అన్నిటికంటే బాధపెట్టినవి రెండు ప్రశ్నలు , ఇంత జరుగుతుంటే, ప్రపంచమంతా చూస్తూ ఎలా ఊరుకుంది. ఇంత దారుణాన్ని ఆరేళ్ళు ఎలా ఉపేక్షించింది. ఇంత చేసినా బరిస్తూ ఎందుకు ఉన్నారు జూస్, కనీసం కొంత మంది అయినా ఎందుకు తిరగబడలేదు (అలా తిరగ బడ్డట్టు నేను ఎక్కడ చదవలేదు).
నన్ను కలిచివేసిన, నా గుండెలు బరువెక్కిన, నన్నింకా haunt చేస్తున్న కొన్ని సీన్లు ఈ సినిమాలో..
పోలాండ్ (క్రకవ్) జూస్ అందరినీ కలిపి ఒక చిన్నపాటి ప్రదేశంలో (ఘెట్టో లంటారు) పడేస్తారు నాజీలు. అక్కడ నించీ వారి చేత రకరకాల పనులు చేయిస్తూ ఉంటారు. ఒక సరి ఏదో ఒక నిర్మాణం జరుగుతూ ఉంటే ఒక జూ సివిల్ ఇంజనీర్ (స్త్రీ) వచ్చి నాజి కమాండర్ (అమాన్) తో అలా కడితే ఇది పడిపోతుంది. మళ్ళీ ఫౌండేషన్ వేసి కట్టాలి అని చెప్తుంది. అన్నీ కనుక్కుని అమాన్ ఆమెని కల్చేయ్యమంటాడు. ఆ స్త్రీ నేనేం తప్పు చేసాను, ఇది నా పని అంటే, అమాన్ ఆమెని షూట్ చేసి ఇది నా పని అంటాడు.
అమాన్ పొద్దున్నే లేచి బాల్కనీ లోకి వచ్చి వొళ్ళు విరుచుకుంటాడు. సిగరెట్ వెలిగిస్తాడు. ఘెట్టో దగ్గర చాలా మంది జూస్ పని చేస్తుంటారు. కూర్చుని ఉన్న ఇద్దరు జూస్ ని షూట్ చేస్తాడు. లోపలి వచ్చి మూత్ర విసర్జన చేస్తూ పెళ్ళాం ని కాఫీ నువ్వే పెట్టు అంటాడు. నాజీలు జూస్ ని చంపడం వారి దినచర్య లో ఎంత సర్వ సాధారనమో, వాళ్ళకి ఇది ఎంత తేలికో ఇంత కంటే బాగా ఎవరు చెప్పగలరు.
షిండ్లర్ హెలెన్ అనే జూ (నాజీ కమాండర్ అమాన్ కి సేవకురాలు ) స్త్రీని ఓదారుస్తూ ఉంటాడు అమాన్ ఆమెని చంపడని. దానికి ఆమె "నాకు నమ్మకం లేదు. ఈ రోజు మేము చూస్తుండగా దారిన పోతున్న ఒకామెని గొంతులో షూట్ చేసాడు. ఆమె మిగతా వారికంటే మెల్లాగా వెళ్ళట్లేదు, తొందరగా వెళ్ళట్లేదు, ఆమె సన్నగా లేదు లావుగానూ లేదు. ఆమె చేసిందేమీ లేదు అలా వెళ్తోంది. అమాన్ నేను ఇవి పాటిస్తే చంపడు అనుకోడానికి లేదు" అని నిస్సహాయంగా వాపోతుంది.
కొత్తగా వర్కర్స్ వేరే దేశాల నించీ వచ్చినప్పుడు, నాజీలకి తోచినప్పుడు, కొందరి జూస్ ని ఏరి (కూరలు, రాళ్ళూ, రప్పలు లాగ ) ట్రైన్లలో తీసుకెళ్ళి సెల్లలో సామూహికంగా చంపేస్తుంటారు నాజీలు (కొందరికి విషవాయువులు ఇచ్చి, కొందరిని కాల్చేసి, కొందరి మీద ప్రాణాంతక పరీక్షలు చేసి). అలా తీసుకెళ్ళే వాళ్ళని గూడ్స్ బండి లాటి దాంట్లో (గాలాడడానికి పెట్టె మొత్తానికి ఒక చిన్న కిటికీ ఉంటుంది) పంపుతూ ఉంటారు. ఆ పెట్టెలలో గాలాడక, దాహంతో ప్రాణాలు పోయేడట్టు ఉంటుంది లోపల ఇరుక్కుని నించున్న జూస్కి . అప్పుడు షిండ్లర్ నాజీ కమాండర్ లతో మాట్లాడి, ఫైర్ హోస్ తో పెట్టలకి నీళ్ళు కొట్టిస్తాడు. ఆ కిటికీలలో నించీ, రూఫ్ నించీ కారే నీళ్ళతో ఎండిన గొంతులు తడుపు కుంటారు జూస్.
సినిమా అంతా బ్లాకు అండ్ వైట్. కానీ కొన్ని సన్నివేశాలలో ఒక పాప డ్రెస్ ని మాత్రం ఎరుపు లో చూపిస్తారు. ఎందుకో అర్థం కాలేదు. ఈ పాప బ్రతుకుందేమో అనుకున్నాను.అలా చిన్న ఆశ కలుగుతుంది . చివరికి ఆ ఆశ కూడా నిరాశే అని తేలుతుంది. అక్కడున్న జూస్ బతుకుతామని ఆశ పడడం వృధా అని నొక్కి చెప్తుంది.
ఇక గుండెలు పిండేసే క్లైమాక్స్. కిందామీదా నానా తంటాలు పడి, అతి కష్టం మీద తనకున్నదంతా వెచ్చించి ఒక పదకుండు వందల యాభై మంది జూస్ ని కాపాడతాడు షిండ్లర్. వారికి ఏడు నెలలు పాటు తల దాచుకోడానికి చోటివ్వడానికే తన పుట్టినూరులో ఫ్యాక్టరీని పెడతాడు. చివరికి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి, సోవియట్ రష్యా చేతిలో నాజీలు ఓడిపోతారు. అప్పుడు ఈ జూస్ (షిండ్లర్ కాపాడిన జూస్ ) కి విముక్తి కలుగుతుంది. నాజి పార్టీ వారిని అర్రెస్ట్ చేస్తారు. ఇతను నాజీ పార్టీ వదవ్వడం వల్ల దేశం వదిలి వెళ్ళే షిండ్లర్ ని జూస్ అందరూ సాగానంప వస్తారు. వాళ్ళని చూసి నేను ఇంకా కొంత మందిని కాపాడుండ వలసింది. కపాదగాలిగీ కాపడలేదు. బోలెడు డబ్బు వృధా చేసాను. ఈ కార్ ఎందుకు - ఇది ఒక ఇంకో పడి మందిని కపాడేదేమో, ఈ బంగారపు బ్యాడ్జు ఎందుకు ఇది ఇంకో ఒక్కరినైనా కపాడేదేమో అని చాలా బాధపడతాడు. అక్కడ అప్రయత్నంగా గుండె కరిగి గొంతులోకి వచ్చేస్తుంది ప్రేక్షకులకి (నాకైతే జరిగింది)
ఈ మారణహోమం (holocast) విన్న ఎవరికయినా గుండె రగిలిపోతుంది. అందులో స్పీల్బర్గ్ దర్శకుడు, అందునా జూ.ఇంకెంత రగిలిపోయి ఉంటాడు, ఎంత వేదన చెంది ఉంటాడు. ఆ బాధ ప్రతీ ప్రేక్షకుడికి గుండెలో పలికించ గలగడం, ప్రతీ మనిషిని ఒక ఘడియ ఆపి ఆలోచింప చెయ్యడం, ఒక కన్నీటి బొట్టు నివాళిగా రాల్చ గలిగేలా చెయ్యడం లో స్పీల్బర్గ్ కృత కృత్యుడు అయ్యాడని నా నమ్మకం.
P.S.
ఈ సినిమాకి స్పీల్బర్గ్ ఒక్క డాలర్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు
సినిమా అంతా నాజీల అరాచకం గురించి అయినా, ఎక్కడా హిట్లర్ కనపడడు, అతని గొంతు వినపడదు.
ఈ మధ్య నేను చూసిన హోటల్ రవాండా కూడా ఇలాటి మారణహోమాన్ని, అందులో ఒక సామాన్యుడు పరిస్తుతలని బట్టి, కొన్ని వందల మంది జనాల పాలిట రియల్ హీరోగా ఎలా పరిణత చెందుతాడో చూపెడుతుంది. దారుణ మరణ హోమాన్ని కళ్ళకు కట్టినట్టు చూపెడుతూనే, ఆ ప్రతికూల పరిస్థితులని పోరాడే మానవత్వాన్ని, ఆశావాదాన్ని చాటుతుంది.
జేమ్స్ కామెరూన్, భారీ బడ్జెట్, కొత్త టెక్నాలజీ , ఆరు నెలల ముందు నించి ఇచ్చిన హైప్ ఇవన్నీ చూసి చాలా అనుకున్నా ఈ సినిమా గురించి. రివ్యూలు కూడా కొంచం పాజిటివ్ గ ఉండే సరికి, ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహ లాడాను. IMAX లో అదీ 3D లో చూడాలని రెండు రోజులు ముందు బుక్ చేసి టికెట్లు, గంట డ్రైవ్ చేసి, రెండు గంటలు లైన్ లో వెయిట్ చేసి (మంచి సీట్ల కోసం) చాలా ఆత్రంగా ఈ సినిమాకి వెళ్లాను.
సినిమా నేను అనుకున్నంత కాకపోయినా బానే ఉంటే ఇంత గోల పెట్టేవాడిని కాను. సినిమాకి ఇచ్చిన హైప్ కి, నేను చూడడానికి వెచ్చించిన సమయానికి, టికెట్కుకు పెట్టిన వెలకి (19$) సినిమా న్యాయం చెయ్యలేదని నిస్సంకోచంగా చెప్పగలను. అలాని సినిమా అసల బావోలేదు అని అనను. కామెరూన్ ఊహా శక్తికి, కార్యాచరణకి, సృష్టించిన కొత్త ప్రపంచానికి సలాం కొట్టాలి.
ఇక నాన్చకుండా నాకు నచ్చనివి చెప్పేస్తా. ఇవి మరీ చిన్న విషయాలు అనిపించవచ్చు కొందరికి. కానీ నాకు మాత్రం సినిమాలో ఏదో వెలితి, అవి వీటి వల్లనేమో అనిపించింది.
సినిమా ఇంట్రడక్షన్, మొదటి సీన్లు పేలవంగా ఉన్నాయి . నేనింకా సినిమా మొదలు కాలేదు అనుకున్నా ఆ సీన్లు అయ్యేవరకు. హీరో వాయిస్ narration కి అసల సూట్ కాలేదు.
హీరో అసల నచ్చలేదు. ఎనర్జీ లేదు, నటన అంతంత మాత్రం. ఎంత అవతార్ నే ముఖ్యంగా చూపించినా, ఇతను ఉన్న సీన్లలో ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లా ఉన్నాడు
కొంత మంది నావి లు (నెయ్తిరి ముఖ్యంగా ) మొదటి సీన్ నుండే ఆంగ్లంలో మాట్లాడతారు . ఆ మాత్రం దానికి నావి భాష మాట్లాడినట్టు చూపెట్టడం ఎందుకు ఇంక.
ఎమోషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళ బాధ మనకి బాధ కలిగించేడట్టు చూపించలేక పోయాడని పించింది (ఒకటి రెండు సీన్లు మినహా)
మంచి ఇంగ్లీష్ సినిమా అంటే నా వరకు నాకు, సినిమా అయిపోయినా బుర్రలో తిరుగుతూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. (It should haunt me). అలా ఉంటుంది అనుకున్నా కానీ అసల లేదు. చూసి రెండు గంటలైంది. ఒక్క సీన్ కూడా స్ఫురణ కి రావట్లేదు విషువల్గా.
పండోర లో చాలా భాగం లార్డ్ అఫ్ ది రింగ్స్ లో చూసినట్టు అనిపించింది. దాని వల్ల ఒక కొత్త ప్రపంచాన్ని చూసే ఆనందం పూర్తిగా పొందలేదు.
3D ని పెద్దగా వాడుకున్నట్టు అనిపించలేదు. ఉదాహరణకి ఫైనల్ డెస్టినేషన్ లో ఇంకా బాగా వాడుకున్నాడు ౩D ని. యాక్షన్ లో మనం అక్కడున్న ఫీలింగ్ కలగలేదు.
ఉన్నవి రెండో మూడో యాక్షన్ సీక్వెన్స్ లు అవి కూడా వాళ్ళు గగురు పోడిచేడట్టు ఏం లేవు. ఆ విధంగా కూడా నిరుత్సాహ పరిచింది.
కామెరూన్ గారు అంత ఖర్చెందుకు పెట్టారు అన్న విషయం (అని అడగాలని ఉన్నా) పక్కన పెట్టినా, నా టికెట్ కి పైసా వసూల్ మాత్రం కాలేదు.
ముఖ్యం గా జనాలు చెప్పినంత ఏం లేదు సినిమాలో. నేను రామ్ గోపాల్ వర్మ టపా చూసి అసల తెగ ఊహించుకున్నా సినిమాని. అంత లేదు. నాకు దీని కంటే ఈ ఏడాది వచ్చిన అప్, 2012 (ఇల్లోజికాల్ అయినా ) ఎక్కువ నచ్చింది.
నిన్న టీవీ 9 లో స్టార్ నైట్ చూస్తూ కూర్చున్నాం. తెలుగు సినిమా పరిశ్రమ కి పెద్ద దిక్కు (అని ఆయనే చెప్పుకునే) దాసరి నారాయణ రావు గారు ఒంటి చేత్తో కార్యక్రమాన్ని సజావుగా జరగనివ్వకుండా చేసారు. మైక్ చేతిలో ఉంటె ఆయన భూమ్మీద ఉండరు కదా. ఆయన ఇంగ్లీష్ వింటే మనసు పులకించింది. మైదకూరు లో స్కూల్ పిల్లలకి I never speak in Telugu అని పలక మెడలో వేసినట్టు, ఈయనకి I will never speak in English అని మెడలో వేయించాలనిపించింది. సంగీత విభావరులు బానే ఉన్నాయి కానీ, మధ్య మధ్య లో దాసరి గారు, జస్ట్ వన్ సాంగ్, థాంక్స్ యు అని వాళ్ళని కట్ చెయ్యడం చాలా బాధేసింది. సభ మర్యాద కూడా లేకుండా, పాడుతుంటే మధ్యలో ఆపెయించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
సుశీల గారి జనని శివకామిని పాటతో మొదలు పెట్టారు కార్యక్రమాన్ని. సుశీల గారు పాడడానికి కొంచం కష్టపడ్డారు. ఆవిడ గొంతు ఉన్నంత నిండుగా ఇంకెవరిదీ లేదు ఆ స్టేజి మీద (బయట కూడా) . ఆవిడ కూడా లత గారి లాగా ఇంకొన్నాళ్ళు పాడగలిగి ఉంటే ఎంత బావుండేదో అనిపించింది. సుశీల గారి పాట తరువాత కోటి, కీరవాణి, మణిశర్మ తదితరులు సంగీత విభావరి కొనసాగించారు.
కీరవాణి గారు 'బంగారు కోడి పెట్ట సాంగ్' గురించ చెప్తూ, 'అప్ అప్ హాండ్స్ అప్' అని ఎవరూ మీలాగా అనలేకపోయారు అందుకే మీరు పాడినదే ఈ కొత్త పాటలో(మగధీర లో ) పెట్టాం అని బాలు గారికి చెప్పారు. దానికి బాలు ఇలా నేను పాడినవి పెట్టి, నన్ను పిలవడం మానేయకండి అని చురక వేసారు. నాకు నచ్చని విషయం ఏంటంటే, తెలుగు లో కొన్ని పాటలని పాడడానికి అనర్హాం ( సూపర్ లో మిల మిల మెరిసిన కనులకి పాట గురించి క్లాసు పీకరులెండి ఒక షో లో ) అన్న రీతిలో తిట్టిపోసిన బాలు గారు బంగారు కోడి పెట్ట పాటని అదేదో కీర్తన లాగ పోటి పడి మరీ పాడారు. అప్పట్లో (ఒరిజినల్ పాడిన టైం లో ) ఐతే వేరే విషయం అనుకోండి. ఇప్పుడు కూడా (స్టార్ నైట్) లో పాడవలసిన అవసరమేముంది.
దేవిశ్రీ ఎప్పటిలాగే పాడలేకపోయినా హడావుడి చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దేవిశ్రీ పెద్ద గాయకుడు కాదు కానీ మాంచి స్టేజి పెర్ఫోర్మేర్. ఊపు తీసుకొస్తాడు ఏ షో లో అయినా సరే. Excuse me Mr. Mallannaa పాటని సుహాసిని చాలా బాగా పాడింది. అల్లు అర్జున్, దేవి శ్రీ , మమత మోహన్దాస్ డాన్స్ కూడా బావుంది. ఇంకోటి విద్యాసాగర్ గారు ఈ విభావరి లో కనిపించలేదు. కారణాలు నాకు తెలియవు కానీ, తమిళులు ఎంతో గౌరవించి, అవకాశాలు ఇచ్చే ఆయనని మన తెలుగు సినిమా వాళ్ళు ఎందుకు పట్టించుకోరో నాకర్థం కాదు.
ఆ తరువాత డాన్స్ లు, స్కిట్లు చాలానే ఉన్నాయి. ఒకటి రెండు తప్ప స్కిట్లు పెద్ద గొప్పగా లేవు. కుక్క- టి వి ఛానల్ మీద స్కిట్ కొన్ని బ్లాగ్లలో చదివిన టపాకి దగ్గరగా ఉన్నా బానే నవ్వించింది. భువన విజయం స్కిట్ మిస్ అయ్యాను. కార్యక్రమం చివరిలో దాసరి ఇదే అదును చూసుకుని, మోహన్ బాబు ని, బాల కృష్ణ ను బాగా ఎత్తేసారు. మోహన్ బాబుకి మైక్, మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం నన్ను చాలా నిరశాపరించింది . వజ్రోత్సవాలలో లాగ ఆయన కొంచం వేడి పుట్టిస్తే బావుండేది. చాలా రోజులు చెప్పుకోడానికి. ఇంకొక విషయం గమనించాను. రజనీ కాంత్ ప్రత్యేక అతిధి గా హాజరు అయ్యారు. ఆయన వచ్చేసరికి రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున ఒక చోట కూర్చుని ఉన్నారు. రజని కాంత్ రాగానే, గౌరవంగా నాగార్జున లేచి ఆయన సీట్ ఇచ్చి వేరే చోట కూర్చున్నారు.అక్కడే ఉన్న రామ్ చరణ్ లేచి ఆయనకు గౌరవం ఇచ్చి వేరే చోట కూర్చవాలన్న ఇంగిత గ్న్యానం లేదేంటా అనుకున్నాను. అయినా ఒక పక్కన అల్లు అర్జున్ వాళ్ళ వయసు వాళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తుంటే పెద్దవాళ్ళ దగ్గర రామ్ చరణ్ కూర్చోవాల్సిన అవసరం ఏంటి? చూడబోతే ఈయన కూడా పెద్దగ కలవదేమో ఎవరోతోనూ. చిరంజీవి ఉన్నంత సేపు ఏదో తప్పక వచ్చినట్టు కూర్చున్నారు. నాకైతే మోహన్ బాబు ఎప్పుడు వచ్చి ఏమంటాడో అన్న కంగారు తో కూర్చున్నవాడిలా అనిపించారు. మహేష్ బాబు ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి కూడా రాలేదు. ఊరంతా ఒక దారయితే ఉలిపిగడ్డ దొక దారని అసల ఎక్కడా దర్శనమివ్వడు బాబు. మహేష్ బాబు కి బొత్తిగా PR లేదు(లేవు).
ఈ రోజు రామ్ గోపాల్ వర్మా 'అజ్ఞాత్' అనే కళాఖండం చూసి తరించాను. పచ్చగా ఉన్న అడవి, పిచ్చి పిచ్చి శబ్దాలు, నితిన్ సిక్స్ ప్యాక్ , నిషా కొఠారి (ఇప్పుడు ప్రియాంక ఏమో) ఎక్ష్పోసింగ్ తప్ప సినిమాలో ఏం లేదనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ చెత్తగా ఉంది (అజ్ఞ్యాత్ ౨ కి ట్రైలర్ లాగా ). డైరెక్టర్ ప్రేక్షకులు ఫూల్స్ అని అస్స్యూం చేసుకుని తీసినట్టు ఉంది (నిజానికి అతను లాభ నష్టాలు, ఆడియన్స్ ఇష్టైష్టాలు అవన్నీ పట్టించుకోడుట. తనకి నచ్చింది తీసేస్తాడుట) . రామ్ గోపాల్ వర్మ కి ఎప్పుడూ చూడనంత భయానకమయిన అడవి శ్రీ లంక లో కనపడిందిట. అందుకని ఒక సినిమా తీసేసి మన మీదకి వేదిలేసారు. పోనీ భయపెట్తిందా అంటే అదీ లేదు. నేను రామ్ గోపాల్ వర్మ అభిమానినే అలా అని ప్రతీ చెత్త సినిమాను సమర్థించాను . ఈ సినిమాకిచ్చిన హైప్ కి హాల్ లో చూద్దాం అనుకున్నా కానీ US లో రిలీజ్ కాలేదు అదృష్టవశాత్తు.
లాస్ట్ వీక్ హాలోవీన్ కి పిల్లలోస్తారేమో లైట్స్ పెట్టి, క్యాండిలు అవీ రెడీ గా పెట్టుకున్నాం. ఒక్కళ్ళూ రాలేదు. గత యేడాది బోలెడు మంది పిల్లలు వచ్చారు. ఈ సారేంటో అసల రాలేదు. వస్తే బోలెడు ఫోటోలు తీద్దాం అనుకున్నా. కాలిఫోర్నియా లో చలి బానే పెరిగింది. థాంక్స్గివింగ్ దగ్గర పడుతోంది కదా. సాయంత్రం కూడా ఇంటి దగ్గరే ఉండాల్సోస్తోంది యాక్టివిటీ ఏం లేకుండా. ఇంక పాపం ఈస్ట్ కోస్ట్ వాళ్ళ పరిస్తితి ఏంటో.
అన్నట్టు మా ఫ్రెండ్స్ హాలోవీన్ కని ఈ స్కేరీ వీడియో పంపారు.చూసి భయపడకుండా ధైర్యంగా ఉన్నవాళ్లు చెయ్యి ఎత్తండి.
భయపడినవాళ్ళు కామెంటండి.
- వాసు అప్పుడప్పుడు మన తెలుగు సినీ పరిశ్రమని చూస్తే జాలి వేస్తుంది, తెలుగు ప్రచార మాధ్యమాలని చూస్తే భయం వేస్తుంది.
తెలుగు సినీ పరిశ్రమ లో కొంత మంది దర్శక నిర్మాతలకు భాషాభిమానం, ఆత్మాభిమానం లాంటివి చాలా పెద్ద పదాలు, అసల తెలుగు వాళ్ళమని గుర్తుందా అనిపిస్తుంది. యేటా వచ్చే చిత్రాల్లో మూడో వంతు తమిళానువాద చిత్రాలుఉన్నాయంటే ఆందోళన పడాల్సిన సమయం, అలోచించవలసిన అవసరం ఉన్నాయని తేటతెల్లమవుతోంది. శంకర్, మణిరత్నం లాటి పెద్ద దర్శకుల చిత్రాలే కాక కొత్తవారి చిత్రాలకు (డబ్బింగ్) తమిళ నాడు కంటే మన రాష్ట్రం పెద్ద మార్కెట్అంటే మనవారి విశాల హృదయానికి ఆనంద పడాలొ, మన తెలుగు పరిశ్రమ కొల్పోతున్న అవకాశాలకు బాధ పడాలోఅర్థం కావట్లేదు.
ఏ మాత్రం బావున్నా వచ్చిన ప్రతీ అనువాద చిత్రాన్ని హిట్ చేసే మన తెలుగు వాళ్ళు, మన చిత్రాలు పక్క రాష్త్రంలోఆడడం పక్కన పెట్టండి, కనీసం డబ్బింగ్ కి కూడా నోచుకొవట్లేదని అలోచించరెందుకో? కారణం మనకు లేనిది, వాళ్ళకిఉన్నది - భాషాభిమానం. మంచి సినిమాని ఆదరించడం తప్పని నేననట్లేదు, కాని మనం వారి చిత్రాన్ని ఎలా ఉన్నాచూసేస్తాం అని వారనుకునే స్థాయికి దిగజారడం ముమ్మాటికి మంచిది కాదు.
ఈ వాదన అసమంజసం అని అనుకునే వారికి రెండు ఉదాహరణలు. మొన్న నేను దశావతారం సినెమాకి వెళ్ళాను. సినిమా పేర్లు మొత్తం తమిళం లో ఉన్నాయి. పొరపాటున తమిళ సినిమా వేసారేమో అని కనుక్కుంటే, ఇంతకీ అదితెలుగు దే. ఇక ఆ సినిమాలో ఒక పాత్ర సినిమా పొడవునా తమిళం లోనే మట్లాడుతుంటాడు, చూసేది తెలుగుసినిమానా తమిళ సినిమానా అని అర్థం కానంతగా. ఇది మనం సినిమా ఎలా వేసినా ఎం తీసిన చూసేస్తామనే చులకనభావం అనడానికి ఏం సందేహం లేదు.
ఇది చాలనట్టు, మన దర్శక నిర్మాతలే తొలుత తమిళం లో తీసి తెలుగు లొకి అనువదించడం ఈ పరిణామానికి పరాకష్ట. ఎ.ఎం రత్నం గారు తెలుగు వారయ్యుండి తమిళం లో సినిమాలు తీసి తెలుగు లోకి అనువదించాల్సిన అగత్యమేంటి? తమిళ ప్రేక్షకుల మీద అభిమానమా, తెలుగు వారి మీద హేయ భావమా?? దీనికి తోడు మన దర్శకులు కొందరికి కొత్తపైత్యం మొదలైంది. బుజ్జిగాడు సినిమానే తీసుకోండి. సినిమాలొ హీరో సగం మాటలు తమిళం లోనే ఉంటాయి. ఇదిచలదన్నట్టు ఏకంగా ఒక తమిళ పాట. ఈయనకి అంతకు ముందు తీసిన అమ్మ నాన్న ఒక తమిళమ్మాయి నించే ఈపైత్యం ఉన్నట్టుంది. పూరీ గారు! మీరు మరీ అంత తమిళ వీరాభిమనులైతే, తమిళ సినిమాలే తీసుకోంది. మీ పైత్యాన్నిమా మీద రుద్దకండి.
సమయం ఉన్నప్పుడు, సమావేశాళ్ళో మైకు దొరికినప్పుడు తెలుగు భాషాభ్యున్నతికి నడుం బిగించాలని గుక్కతిప్పుకొకుండా ఉపన్యాసాలిచ్చే సినీరంగ ప్రముఖులు, ఆ పనికి ఏ మాత్రం పూనుకున్నారో ప్రస్తుతం వస్తున్న సినిమాలుచూస్తేనే తెలుస్తోంది.
ఇది కేవలం సినీ రంగానికే పరిమితం కాదు. అన్ని రకాల ప్రసార మాధ్యమాళ్ళో ఈ దుస్థితి దాపురించింది. ఉదాహరణకిమన నిరంతర వార్తా స్రవంతి టివి9 నే తీసుకోండి.
పస లేని కథనాలని, వార్తలు కాని వార్తలని పక్కన పెట్టినా, వార్తల్లో వాడే భాషని వింటే జన్మ ధన్యమైపోతుంది . ఒక్కళ్ళకీళ ' , 'ణ ' ఉచ్ఛరించడం రాదు. ఇక రచన కర్ణ కఠోరం. "ఇరగదీసాడు", "బాక్సు బద్దలయ్యింది" ఇలాటి పదాలుధారాళంగా, గర్వంగా వాడడం వీరి ప్రత్యేకత. ఇక కార్యక్రమాల పేర్లంటారా - భూతద్దంతో వెతికినా ఒక్క తెలుగు పేరూకనపడదు. ఇవన్నీ ఈ ఛానల్ లొపాలు కాదు, టి.ఆర్.పి లలొ ప్రథమ స్థనం లొ ఉండడానికి కారణాలు.
ఇప్పుడు చెప్పండి తప్పెవరిది? ఏం చెప్తే అది విని, ఏం చూపెడితే చూసి, ఏం మాట్లాడని మనదా, మనకు కావల్సింది ఇదేఅని చూపెడుతున్న వాళ్ళదా?? '