"వచ్చారా ! ప్రయాణం బాగా జరిగిందా." అరుగెక్కుతున్న మమ్మల్ని ఆప్యాయంగా అడిగింది మా అమ్మమ్మ.
"ఆ పెట్టెలు అవీ లోపల పెట్టు" అని మా పాలేరు వెంకతరత్నాన్ని ఆజ్ఞాపించి అందరినీ చెయ్యిపట్టుకుని లోపలకి తీసుకెళ్ళాడు తాతయ్య " బోలెడు ప్రయాణం చేసొచ్చారు. మొహం కడుక్కుని కాఫీలు తాగుదిరిగాని. " అంటూ
కుశల ప్రశ్నలయ్యాకా అందరికీ కాఫీలు పట్టుకొచ్చి, "నువ్వు వంకలు పెడతావని నీకు మాత్రం మీ అమ్మమ్మే పెట్టారు." అని నన్ను చూసి నవ్వుతూ అంది మా అత్తయ్య .
మేము వెళ్ళే ప్పటికే మా పెద్దమ్మ, మావయ్యలు,పిన్నిలు కుటుంబ సమేతంగా వచ్చేసారు.
కాఫీ నోట్లో పోసుకుని, బావలతో కలిసి ఊరుమీద పడ్డాను నేను . ఇంటి బయటకి రాగానే మా పక్కింటి రాజు గారు దర్శనమిచ్చారు .
"ఏం బాబు ఎలా ఉన్నారు. మీకేంటి మీరు బాగా చదువుతారు. ఫష్టుగా మార్కులు తెచ్చుకుంటారు. మా అబ్బాయి చూడు .. ఏమీ లాభం లేదు.. మేమేదో ఇలా గడిపెస్తున్నాం. పోనిలే పోనిలే మీరు బావున్నారు." అని ప్రశ్న సమాధానం ఆయనే చెప్పేసుకున్నారు.
మా ఇంటి దగ్గరే కాఫీ పోడెం పంతులు గారు ఉండేవారు. ఆయనకీ ఇద్దరు పిల్లలు. వాళ్ళావిడ సత్య ఆంటీ. రోజూ రాత్రి అయ్యేసరికి వాళ్ళ పిల్లలిద్దరికీ పెరడులో అరుగు మీద కూర్చోపెట్టుకుని కథలు చెబుతూ అన్నం తినిపించేవారు. కథలు వినడానికి మేమూ వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడు మాకు కూడా ముద్దలు కలిపి పెట్టేవారు ఆంటీ. వాళ్ళిద్దరి పిల్లలూ మా ఈడు వాళ్ళే. మా గ్యాంగ్ తోనే ఉండేవాళ్ళు.
ఇంకో నాలుగు రోజులలో భోగి. సత్య ఆంటీ వాళ్ళ పిల్లలు, తొరకల రాజు అప్పుడే భోగి దండలు కూడా తయారు చేసేసుకున్నారు. ఇక మేము కూడా త్వరపడాలి అని నిర్ణయించుకున్నాం . ఆవు పేడ వెతికి పట్టుకుని, పిడకల తయారీ కి నడుం కట్టాం. పేడ ని ముట్టుకోవడం, దాని వాసన కొంచం చికాకుగా అనిపించినా, భోగి మంట సరదా ముందు అది పేద్ద లెక్కలోకి రాలేదు. మా తాతయ్య వాళ్ల ఇంటి చుట్టూ కోట గోడలాటి పేద్ద గోడ ఉండేది. దాని మీద రకరకాల ఆకారాలతో పిడకలు వెయ్యడం మొదలెట్టాం. దండ కట్టడానికి కావాల్సిన గారిలాగా కన్నం ఉండే పిడకలతో పాటు, అరటి పండు, బస్సు , యాపిల్ పండు, హరి కృష్ణ, టి. రాజేందర్ ఇలా మా ఊహా శక్తికి పదును పెట్టి రకరకాల పిడకలతో గోడను నింపాము. ఇక రోజూ మూడు పూటలా పిడకల పర్యవేక్షణ చేసేవాళ్ళం. ఎండ బాగా రావాలని పూజలు చేసేవాళ్ళం. అవి ఎందుకు త్వరగా ఎండట్లేదో కోర్ కమిటి తో సమావేశాలు జరిపేవాళ్ళం. రాత్రిళ్ళు వర్షం పడి పిడకలు కరిగిపోయినట్టు పీడకలలు కూడా వచ్చేవి. ఇలా అవి మా ఇంటెన్సివ్ కేర్ లో మూడొంతులు ఎండాయి భోగి ముందు రోజుకి. ఆ తరువాత వాటిని మంట మీద వేడి చేసి ఇంచు మించి ఎండాకా దండ కట్టి దాచిపెట్టుకున్నాం మర్నాటి మంటకి.
"శ్రీ సూర్య నారాయణ మేలుకో" అని సాఫ్ట్ గా మొదలెట్టి "రా దిగి రా దివి నుండి భువికి దిగిరా" రేంజ్ వరకూ మా నిరీక్షణ సాగింది సూరీడు కోసం. ఆయన రాలేదు కానీ మాకు నిద్దర కుమ్ముకుంటూ వచ్చేసింది. లేచి చూసే సరికి బారెడు పొద్దెక్కింది. పక్కన చూస్తే పక్కలో మత్తుగా పడుకున్న మా బావలు . తాతయ్య ఎప్పుడో వెళ్ళిపోయి స్నానం చేసి పూజ కూడా చేసేసుకున్నారు. మా బావలని నాలుగు తన్ని లేపి, పరుగు పరుగున భోగి మంట వెయ్యడానికి బయల్దేరాం. పిడకల దండలు, ఒక లీటరు కిరోసిను, అగ్గిపెట్టె తీసుకుని మా పే.... ద్ద పెరట్లోకి వెళ్ళాం.
అన్నీ సిద్ధం చేసుకుని మంటెయ్య బోతుంటే మా తాతయ్య అక్కడ వద్దు, అసలే తాటాకు పాక నిప్పంటుకుంటే ఇంకేం లేదని చెప్పాడు. సరే కదా అని ఇంకో వైపు కెళ్ళాం. అక్కడేమో గడ్డిమేట్లు నిప్పంటు కుంటే ఇంకేమన్నా ఉందా అని ఆ మంట మీద నీళ్ళు చల్లారు. కానీ మాకు మంటెత్తి, పక్కింటి రాజు గారింటి కెళ్ళాం. ఆయన మమ్మల్ని "బాబూ! నాది అసలే చిన్న పాక, ఒకటే ఆవు, చిన్న గడ్డిమేటు, ఒకర్తే భార్య, ఒకడే పిల్లాడు" అని ఏడుపు మొదలెట్టాడు. ఇలా కాదని రోడ్డు మీద కెళ్ళాం అక్కడ వేద్దాం అని అక్కడ అప్పటికే మంటలు చల్లారి, జన సంచారం మొదలైపాయింది. మా నాలుగు రోజులు శ్రమ వృధా కానివ్వం. మా టి రాజేందర్ పిడక కి నిప్పంటించే దాక నిద్రపోమని డిసైడ్ జేసి మా తాతయ్య తో పెద్ద యుద్ధం చేస్తే, ఇంట్లో ఒక గాడిపొయ్య చూపించి - అందులో వెయ్యండి, భోగి మంట ఐపోయాక నీళ్ళు కూడా కాచుకోవచ్చు ఎంచక్కా అని సద్ది చెప్పాడు. చేసేది లేక అయిష్టంగా అందులోనే వేశాం మా దండలు. చెప్తే నమ్మరు అవి ఏకంగా గంట మండాయి ముఖ్యంగా టి రాజేందర్ పిడక.
పోనీ ఇది ఇలా అయ్యింది మిగతా రోజన్నా సరదాగా గడుపుదాం అని అనుకున్నాం. ఇంతలోనే తలంటు పోయించుకోవాలని మా గొంతులో వెల్లక్కాయ వేసారు అమ్మ వాళ్ళు . దానికి ముందు నలుగు. ఏంటో అపురూపంగా పెంచుకున్న మా వంటిని అయిష్టంగా మా పాలేరు వెంకటరత్నం చేతిలో పెట్టాం. అతను గేదెల్ని పీచెట్టి తోమినట్టు మమ్మల్ని తెగ తోమేసాడు (పెద్దగా తేడా తెలియలేదేమో పాపం). అతని చేతి నలుగులో మేము నలుగురం నలిగిపోయాం. మేము గోల పెడుతుంటే మా అమ్మ వాళ్ళు "శుభ్రంగా నలుగు పెట్టించుకోండి , మట్టంతా పోయి వళ్ళు నిగనిగలాడే రంగొస్తుంది" అంటూ మా వెంకతరత్నానికి ఊపుని, మాకు సలుపుని పెంచారు. మట్టిపోయి రంగు కాదు, తోలు పోయి రక్తం వచ్చేడట్టు ఉంది అని నసుగుకున్నాం. మాకైతే గత ఏడాది చేసిన అల్లరంతటికీ ఒకే సారి పగ తీర్చుకుంటున్న ఫీలింగ్ వచ్చింది. ఆ పగకి ఫినిషింగ్ టచ్ ఆ తరువాత కుంకుడు రసంతో తలంటు. పరిగెడుతున్న మమ్మల్ని బలి ఇచ్చే పశువులా కాళ్ళు చేతులు తలొకరూ పట్టుకుని బలవంతంగా కుంకుడు పులుసుతో తలంటే శారు. పైగా తల వెనక్కిపెట్టండి లేకపోతె పులుసు కళ్ళల్లో పడుతుందని ముందు జాగ్రత్త లొకటి. కళ్ళల్లోకి పడకుండా పులుసు పొయ్యడం, చంద్రబోస్ మాంచి పాటలు రాయడం, టీవీ 9 లో తప్పులు లేకుండా చదవడం సాధ్యమేనా చెప్పండి మీరసల ? ఆ తంతు పూర్తి కాగానే, ఉప్పురాళ్ళ* తో సిద్ధంగా ఉన్నాడు మా మావయ్య, ఆర్య 2 లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తో ఉన్న అర్జున్ లాగ.
ఆ గాఢ నిద్రలో పులిహోర, బొబ్బట్లు తింటునట్టు ఒకటే మెరుపు కలలు. ఉలిక్కిపడి లేచాను. పులిహోర ఘాటు, నేతి బొబ్బట్టు కలగలిపిన ఒక కమ్మటి సువాసన నను పిలిచింది రా రమ్మంటూ. పట్టాను ఒక పట్టు. వంటలో మా అమ్మమ్మ కి సాటి లేదంటూ. కవిత్వం పొంగింది కదూ నాలో దాన్ని తలుచుకుంటూ.
ఆ రోజు మా ఇల్లు చుట్టాలతో, మా పెరటి సావిడి పేకాట రాయుళ్ళతో నిండిపోయింది. మీరు పేకాట సరదాగా ఆడేవాళ్ళు చూసుంటారు, డబ్బులకి ఆడే వాళ్ళని చూసుంటారు, క్లబ్బుల్లో ఆడే వాళ్ళనీ చూసుంటారు. కానీ నేను పేకాటే వృత్తిగా ఆడే వాళ్ళని చూసాను. వాళ్ళు కేవలం పేకే ఆడతారు. అదే వారి జీవిత లక్ష్యం, ఆశయం, కర్తవ్యం. ఈ బ్యాచ్ మా ఊరిలో ఏ శుభకార్యానికెళ్ళినా, చుట్టాలు దండిగా ఉన్న ఏ ఇంటికెళ్ళినా కనపడేది. ఇలా పండగలు, పెళ్ళిళ్ళు ఏవీ లేనప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటని నాకు బోలెడు జాలి వేసేది. ప్రభుత్వం పేకాటని స్వయం ఉపాది పధకంగా ఎప్పుడు గుర్తిస్తుందో, పావలా వడ్డీ రుణాలు ఎప్పుడిస్తుందో అని నేను బెంగ పెట్టుకునే వాడిని.
ఆ .. ఎక్కడున్నాను... ఆ .. నేను నిద్ర లేచి, కాస్త ఎంగిలి పడి, మా గ్యాంగ్ తో కలిసి, గుడికి బయల్దేరా. అరుగు దిగుతూండగానే ఎక్కడినించో ఒక ఘాటయిన సువాసన ముక్కులదిరిపోయేలా వచ్చింది. ఈడెవడ్రా బాబూ అత్తరులో బట్టలుతుకున్నట్టు ఉన్నాడు. ఇంత ఘాటేంటి రా అనుకునేంత లోపు మా తాతయ్య స్నేహితుడు సూర్యనారాయణ గారు ప్రత్యక్షమయ్యారు. ముసలోడే కానీ మహా రసికుడు అనుకుని అరుగు దిగుతున్నాం.
ఆయన నన్ను చూసి " ఏరా అబ్బీ , ఎలా ఉన్నావ్రా. మీ నాన్న నా కళ్ళ ముందు పెరిగిన వాడు. నేనంటే మహా గౌరవం. ఎరుగుదువా" అని అడిగాడు. ఆయన వ్యవహారం, పిలుపు కూడా నాకు నచ్చలేదు. నాకు వళ్ళు మండి "అయితే మీరు ఈ శతాబ్దం లో పుట్టలేదా తాతయ్యా" అని అన్నాను. ఆయనకీ చిర్రెత్తి "ఔన్రా అబ్బీ నీ బట్టలేంటి బాగా బిగ్గా ఉన్నాయి, మీ తమ్ముడివా " అనడిగి తిక్క కుదిరిందా అన్నట్టు నవ్వుతున్నారు. నాకు మా కాంతారావు టైలర్ గాడిని కాలికింద పురుగులా నలిపేయాలనిపించింది. మా అమ్మ మీద కూడా పీకల దాకా కోపం వచ్చింది.
ఆ కోపంలో అరుగు మెట్లు గబా గబా దిగుతున్నా. ఆఖరి మెట్టు దిగగానే స్కేట్ బోర్డు మీద కాలేసినట్టు రోడ్డుమీద జారడం మొదలెట్టాను . ఆ జారడం జారడం మా పక్కింటి కర్ణం గారింటి దగ్గర ఆగాను...కాదు పడ్డాను.. ఇంచు మించు నడ్డి విరిగేడట్టు పడ్డాను . ఒకపక్క నే తొక్కిన గొబ్బిళ్ళు, ఇంకోపక్క మా వీధిలో వాళ్ళ నవ్వులు. గుండె భోగి మంట మండింది. అప్పుడు తెలిసింది నాకు, కాలు జారిన మగాడంటే ఈ సంఘానికి ఎంత కామెడీనో. సిగ్గుతో మొహం చొక్కాలో దాచుకుని, కాలికున్న గొబ్బిల్లను తుడుచుకుని ఇంటికి పరిగెత్తాను.అవమానంతో, ఇంటికెళ్ళగానే కాంతారావు కుట్టిన ప్యాంటు ని గాడిపోయ్యలో పడేసి, బెడ్రూం కి గడేసి ఆ రోజంతా అక్కడే పడుకున్నాను.అయినా అవమానం మర్చిపోలేక రాత్రికి ఆత్మహత్యా యత్నం కూడా చేశా.
ఆ ప్రయత్నమే - నేను రాజశేఖర్ నటించిన "మొరటోడే నా మొగుడు" సినిమా చూడడం.
* కుంకుడు పులుసుతో తలంటు ఎరుగని అదృష్టవంతులు, అజ్ఞానుల కోసం --
ఉప్పురాళ్ళు కుంకుడు రసం కంట్లో పడిన వాళ్ళకి ఇస్తారు. అవి నోట్లో పెట్టుకుంటే కళ్ళ మంట, కంట్లో నలుసులు పోతాయని ఒక నమ్మకం. నిజానికి ఉప్పరాయిని చప్పలిస్తే ఆ ఉప్పుని తట్టుకోలేక ఆ బాధలోకి డైవర్ట్ అయ్యి కంట్లో బాధను మర్చిపోతాం అని నా నమ్మకం.అసల వేమన చెప్పులో రాయి, కంటిలో నలుసు కాదు - నోటిలో రాయి కంటిలో పులుసు అని రాసుంటే బావుండేది.
19th Jan సవరణ : అసల ఈ టపా రాయాలని ఆలోచన మొలకెత్తించినది నెమలికన్నులో టపా. నెమలికన్ను మురళి గారికి ప్రత్యేక కృతజ్ఞ్యతలు.