అందరిలాగా నేను ఆంగ్ల కొత్త సంవత్సరం పురస్కరించుకుని కొన్ని తీర్మానాలు చేసుకున్నాను. సుజాత గారు చెప్పినట్టు అతి సామాన్యమయిన, సర్వ సాధారణమయిన బరువు తగ్గడం అందులో ఒకటి. నా ఎక్సెస్ సైజు ని తగ్గించుకోడానికి ఎక్షర్సైజ్ మార్గమని తేల్చు కున్నాను. అందు కోసం ఉదయాన్నే లేవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను (రెండవ తీర్మానం) . ఒకటో తారీఖు శుక్రవారం కావడం ఈ తీర్మానాలకి ఆదిలోనే ఎసరు పెట్టింది. ఎంత పట్టువదలిన విక్రమార్కుడయినా మరీ వారాంతం లో వ్యాయామం అంటే ససేమిరా అంటాడు. దానితో నా కార్యక్రమం మూడు రోజులు వాయిదా పడింది. ఆ తరువాత వాతావరణం పుణ్యమా అని జలుబు, దగ్గు, 98 F డిగ్రీల జ్వరం తో ఇంకో మూడు రోజులు సాకు దొరికింది. ఇంతలో నా స్నేహితుడు క్రమం తప్పకుండా తన తీర్మానం ఆచరిస్తున్నాడని తెలిసి మొదట ఆనందం (వాడి గురించి), తరువాత బాధ కలిగింది నా గురించి. నా మీద నాకే అసహ్యం వేసింది (నాకు కూడా అనకండి మీరు ). రోజుకి రెండు సార్లు టీవీ 9, వారానికి రెండు సార్లు చాలెంజ్ (టీవీ స్టార్ యాంకర్ ఓంకార్ ఆధ్వర్యంలో మా టీవీ కే మకుటాయమానమయిన కార్యక్రమం ) చూడగలిగిన నేను, ఈ చిన్న పనిని చెయ్యలేనా క్రమం తప్పకుండా అని నిశ్చయించుకుని, అన్నీ సిద్ధం చేసుకోబూనాను మర్నాడు వ్యాయామశాల (జిం) కి వెళ్ళడానికి.
రెండు నెలల క్రితం వ్యాయామశాల లో జేరినప్పుడు సద్దుకున్న బ్యాగ్ ని బూజు దులిపి, ఐపాడ్ , మంచి నీళ్ళ బాటిల్, రెండు సెట్ల ఇయర్ ఫోన్లు (ఒకటి పని చెయ్యకపోతే ఇంకొకటి ముందు జాగ్రత్త) ఒక తుండు గుడ్డ పెట్టుకున్నాను. షూస్, సాక్స్ రెడీ చేసుకున్నాను. నా సెల్ లో అలారం ఏడింటికి, నా శ్రీమతి సెల్ లో ఏడు పదికి, టేబుల్ క్లాక్ లో ఏడు అయిదుకి పెట్టి నాకు దూరంగా వాటిని వేరు వేరు చోట్ల పెట్టాను (ఎందుకు మీరు ఊహించి ఉంటారు). రేపు ఉదయం చెయ్యాలి వ్యాయామం అని గట్టిగా తలుచుకుని పడుకున్నాను. ఉదయాన్నే నా సెల్ మోగింది. అలారం అనుకుని లేచి సమయం చూసాను. 6: 55 . ఇదేంటి నా సెల్ నాకంటే వేగంగా ఉంది అని అనుకునేలోపు అది ఈస్ట్ కోస్ట్ నించి కాల్ అని గ్రహించాను. కళ్ళు విదిల్చుకుని గొంతు సవరించుకుని (ఇది అనవసరం), చెవులు విదిల్చుకుని విన్నాను. రెండే మాటలు. ఇంకో అరగంట లో అనుకోకుండా కాల్ పెట్టాల్సి వచ్చింది. అది నేను హాజరు ఐతే చాలా సంతోషిస్తాను అని చెప్పాడు అవతల తెల్లోడు. పని చెయ్యమని చెప్పీ చెప్పకుండా చేయించుకోవడం తెల్లోల్లకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు. తీర్మానం గురించి ఆలోచిస్తూ దిగాలుగా 7:30 కాల్ తీసుకున్నాను. అది అనుకున్న దానికంటే అరగంట ఎక్కువ అయింది. ఆ పైన అసలు పని, దానితో ఆ రోజు ఉదయం వ్యాయామం కుదరలేదు. కానీ ఏదో విధంగా ఒక్క తీర్మానం అయినా అమలు పరిచా అని ఆనందించాను - అదే ఉదయం లేవడం. ఆ మిశ్రమ స్పందన తో రోజు మొదలెట్టాను. అది జనవరి ఏడవ తారీఖు ఉదయం. సూరీడు ఖరీదయిన రెస్టారంట్ లో లైట్ లాగా డింగా వెలుగు తున్నాడు . ఆ వెలుతురుని కూడా మేఘాల తెరల పొరలు మిన్గేస్తున్నాయి. గడియారం చూస్తే కానీ సమయం పది అయిందని తెలియదు. పని లో నిమగ్నమయి ఉండగా ఒక ఒక పెద్ద ట్రక్కు గోడ పక్కనే పడినట్టు పెద్ద కుదుపు వచ్చింది. వెంటనే ఇంకోసారి. ఒక్కసారిగా బయటకి వచ్చాం అందరం. అది భూకంపం అని గ్రహించాం.కొంత సేపు ఆగి అంతర్జాలం లో అది భూకంపమని నిర్దారించుకున్నాం. రిక్టర్ స్కేల్ మీద 4.2. మరీ పెద్దది కాకపోయినా మరీ చిన్నది మాత్రం కాదు. ఒక్కసారి బే ఏరియా లైన్ అఫ్ ఫాల్ట్ మీద ఉందని, ఇలాటివి సాధారణం అని జ్ఞప్తికి వచ్చింది. కొంచం భయం వేసింది . వెంటనే ఇంకొక విషయం గుర్తొచ్చింది. నా తీర్మానాల్లో ఒకటి ఒక్క రోజు పాటించడం వల్ల కాబోసు ఈ భూకంపం అని మనసులో అనుకున్నాను.
ఆ రోజు రాత్రి మళ్ళీ యధావిధిగా అన్నీ సిద్ధంగా ఉన్నాయో లేదో చూశా మర్నాటి వ్యాయామానికి. అలారంలతో సహా . ఉదయాన్నే లేచి తయారయ్యి, వాటర్ బాటిల్,తుండు, ఐపాడ్,ఇయర్ ఫోన్ సమేతుండ నయి వ్యాయామా శాలకి బయల్దేరా. అదృష్టవసాత్తు ఇంకేం అవాంతరాలు లేక ఆ రోజు వ్యాయామం పూర్తయింది. ఏడాది లో ఒక్కసారి అయినా పాటించాను నా తీర్మానాన్ని అని నా శరీరం స్వేద బాష్పాలు, నా కళ్ళు ఆనంద బాష్పాలు ఒకేసారి కార్చాయి. తుండు గుడ్డ తో ఆ గండి పూడ్చి ఇంటికి బయల్దేరాను.
అదే రోజు ఉదయం ఒంటి గంట ప్రాంతం లో మళ్ళీ తీవ్రమయిన కుదుపు. బాబోయ్ ఇంకో భూకంపం. ఇక కారణం వెంటనే స్ఫురనకొచ్చింది. ఒక్కడి ఆరోగ్యం కంటే సమాజ శ్రేయస్సు ముఖ్యమని నా అంతరాత్మ డి టి ఎస్ లో ఘోషించింది.రుద్రవీణ లో శ్రీశ్రీ వాక్యాలు బాలు గొంతులో వినపడ్డాయి. అంతే నేను సైతం ఈ నేలకోసం నా కార్యదీక్షను దారపోస్తాను నేను సైతం ఈ ప్రజలకోసం నా రెజల్యూషన్ వదిలివేస్తాను
అని అనుకుని నా తీర్మానాలకి తిలోదకాలు ఇచ్చేసాను కేవలం లోక కళ్యాణాని కే . నా లో సంఘ సేవకుడు ఉవ్వెత్తున ఉప్పొంగిపోయాడు నా త్యాగనిరతికి, మానవత్వానికి. వచ్చే ఏడాది నోబెల్ బహుమతికి నా పేర ఉంటుందేమో చూస్తూ ఉండండి.
ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.
ఈ న్యూ ఇయర్స్ ఈవ్ మనం చేసుకోవడమేంటి అని ఒక్కొక్క సారి అనిపించినా, మిగతావన్నీ (క్యాలెండర్, పుట్టిన రోజు ఆంగ్ల తేదీ ప్రకారం జరుపుకోవడం, కొన్ని అలవాట్లు) ఓన్ చేసుకున్నప్పుడు ఇది మాత్రం వదిలి పెట్టడం ఎందుకని నాకనిపిస్తుంది. ఇలా ఫిక్స్ అయ్యి ప్రతీ యేడూ శక్తి కొలదీ :) బానే జరుపుకుంటున్నాం ఇది కూడా.
ఇక ఈ మధ్య త్రీ ఈడియట్స్ సినిమా చూసాను. అద్భుతంగా ఉంది. మున్నా భాయి, లగే రహో మున్నా భాయి తీసిన రాజ్కుమార్ హిరాణి హైప్ కి తగ్గ (ఇంకా చెప్పాలంటే దాని కంటే ఎక్కువ ) సినిమాని అందించాడు.ఆమిర్ ఖాన్ సినిమా సినిమాకి తనలోని నటనని సాన బెట్టే విబిన్నమయిన పాత్రలు చేస్తూ తనకు పోటీ ఎవరూ లేరని నిరూపిస్తున్నాడు. ఇక సినిమా చేతన్ భగత్ నవల ఫైవ్ పాయింట్ సంవన్ (Five Point Someone) ఆధారంగా తీసినది. ఆ నవల నాకు బాగా నచ్చిన వాటిలో ఒకటి.నవలని సినిమా లోని ప్రధాన పాత్రలు, కొన్ని సన్నివేశాలు, కొంత కథ వరకే వాడుకున్నారు. ఆ పైన అంతా రాజ్కుమార్ హిరాణి రచనా పటిమ, దర్శకత్వ ప్రతిభే. భారతీయ విద్య విధానంలో కొట్టొచ్చినట్టు కనిపించే లోపాలు ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా చెప్పే కథ. ఆ ముగ్గురిలో ఒకడు మిగతా ఇద్దరి జీవితాలను ఎలా ప్రభావితం చేసాడు, వారితో పాటు తోటి విద్యర్తులని ఎలా ఆకట్టుకున్నాడో ,వారి కాలేజీ డీన్ ని ఎలా మార్చాడు అన్న విషయాన్ని తనదయిన శైలిలో మంచి కథనం తో, మంచి హాస్యంతో, హృద్యంగా మలిచాడు హిరాణి.
ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి వాళ్ళకిచ్చిన పాత్రలలో పరకాయ ప్రవేశం చేసారు. బోమన్ ఇరానీ ఎప్పటిలాగే చించేసాడు. శంతను మొయిత్రా సంగీతం చక్కగా సమకూర్చాడు. ముఖ్యంగా నాకు "बहती हवा सा था वो ", Give me some Sunshine (ఈ పాట గురించి నీ రాసిన టపా ఇక్కడ చూడచ్చు) చాలా చాలా నచ్చాయి. ఎటొచ్చి(సినిమా టైటిల్స్ లో ) చేతన్ భగత్ క్రెడిట్ మీద జరుగుతున్న గొడవ చూస్తే విదు వినోద్ చోప్రా, అతని తో పాటు హిరాణి కూడా అతి చేసారనిపించింది. ఈ విషయం లో ఇక్కడ చెప్పింది నిజమనిపించింది.
గత వారాంతం Los Angeles కి వెళ్లాం. క్రిస్మస్ వారాంతమేమో జనం జాతర లా ఉన్నారు. ఒక రోజు యూనివర్సల్ స్టూడియోస్ కి , ఇంకొక రోజు డిస్నీ కి వెళ్లాం. మొదటిది బానే పూర్తీ చేసాం కానీ, డిస్నీ మాత్రం సగం కూడా చూడటం కుదరలేదు. విపరీతమయిన జన ప్రవాహం, ఎక్కడ చూసినా పొడవాటి క్యూలూనూ. ఇంకెప్పుడూ వారంతం అందులో ఇలాటి పొడవు వారంతం (long weekend :)) లో వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం. చాలా మంది డిస్నీ వరల్డ్, కాలిఫోర్నియా అడ్వెంచర్ (రెండు పార్క్లు ఎదురెదురుగా ఉంటాయ్, ఒకే టికెట్ కూడా తీసుకోవచ్చు) రెండూ చూడటానికి రెండు రోజులుండాలి అంటారు కానీ సరిగ్గా ప్లాన్ చేస్తే ఒక్కరోజులో ముగించచ్చు అనిపించింది. కాకపోతే కాస్త పెందరాడే వెళ్ళాలి. వీటిలో మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఐతే రెండు షోస్ (ఏడింటికి ఒక పార్క్ లో ఎనిమిదింటికి ఒక దాంట్లో అనుకుంటా) , ఇండియానా జోన్స్, స్ప్లాష్ మౌంటైన్, సోరింగ్ ఓవర్ కాలిఫోర్నియా , టవర్ అఫ్ టెర్రర్, స్పేస్ మౌంటైన్ తప్పకుండా చూడాల్సినవి.
ఈ రోజు ఒక మంచి కార్యక్రమం చూసా టీవీ 9 లో. మీరు సరిగ్గానే విన్నారు టీవీ ౯ లోనే. అరుణ్ సాగర్ గారి "మేల్ కొలుపు" మీద పుస్తక సమీక్ష . నాకు టీవీ ౯ వారు ఇలాటి కార్యక్రమాలు కూడా చేస్తారని తెలియదు. ఇంతకు ముందు ఈ పుస్తకం గురించి పుస్తకం డాట్ నెట్ లో కత్తి మహేష్ గారు రాసినది చూసా. ఈ కార్యక్రమం కూడా చూసాక ఎలాగయినా చదవాలనిపించింది. తనికెళ్ళ భరణి గారు అద్భుతంగా చెప్పారు ఈ పుస్తకం గురించి. హోస్ట్ బద్రి కాకుండా కొంచం పుస్తక పరిజ్ఞానం ఉన్న వాళ్ళైతే (అసలు టీవీ ౯ లో ఉంటే ) ఇంకా బావుండేది.
ఈ మధ్య ఒక బ్లాగ్మిత్రుడి పుణ్యమా అని నేను శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారి మార్గదర్శి , వడ్లగింజలు చదువుతున్నాను. త్వరలో నా ఆ అనుభూతి (శ్రీపాది వారి కథలు చదవలేం అనుభవించాలి అంతే ) గురించి రాయాలని ఉంది. అన్నట్టు పద్యాలంటే చెవి కోసుకునే వాళ్ళకి , రాయాలని ఉత్సాహ పడేవాళ్ళకి ఆంధ్రామృతం అనే ఒక అద్భుతమయిన బ్లాగ్ నిర్వహిస్తున్నారు మా రామకృష్ణ మాష్టారు. బ్లాగ్లోకంలో ఈయన చిరపరిచితులనుకోండి. పద్యాలంటే ఆసక్తి ఉన్నవారు ఎవరన్నా పొరపాటున మిస్ అయ్యి ఉంటే తప్పక చూడాల్సిన బ్లాగ్ ఇది .
మూడు ముప్పులూ, ఆరు తప్పులతో వేగాస్ కి మా ప్రాయాణం మొదలైంది.
లేట్ గా ఎక్కావేమో ఆఖరు సీట్లు వచ్చాయి ( ఇంకో నిమిషం ఆలస్యమయితే నిల్చుని ప్రయాణం చేయాల్సి వచ్చేదేమో). బ్యాగ్లు సర్దుకుని , అనౌన్స్మెంట్ అయ్యాక, ఫోన్ ఆఫ్ చేసి, జూస్ తాగి, గ్లాస్ ఇచ్చేసే లోపు వేగాస్ ఎయిర్ పోర్ట్ వచ్చేసింది. దిగీ దిగగానే, ఎయిర్ పోర్ట్ లోనే వేగాస్ వాసనలు (కేసినో లు, కాక్టైల్లు) కొట్టొచ్చినట్టు కనిపించాయి. కార్ రెంట్ చేస్తే దగ్గర్లో ఉన్న హోవర్ డ్యాం చూడచ్చని, కార్ రెంట్ చేద్దామని వెళ్ళాము. అది జూలై 4th వీకెండ్ ఏమో తెగ జనం . కార్ రెంట్ చేసే సరికే మధ్యాహ్నం ఐపోయింది. అక్కడ్నించీ, పని చేయని జి పి ఎస్, ఛార్జ్ అయిపోయిన ఐ ఫోన్ తో, ముందు రోజు రాత్రి లేని నిద్రతో, ఉదయం నుండి తిండి లేక ఆకలితో, భీభత్సమైన ట్రాఫిక్ లో ఎడారి ఎండలో (వేగాస్ డిసర్ట్ లో ఉంది) ౩ ఇంటికి హోటల్ చేరుకున్నాం. అసలే చిర్రెత్తి ఉన్న మాకు ఆ హోటల్ రిసెప్షనిస్టు మా రిజర్వేషన్ సిస్టం లో కనపడట్లేదని వళ్ళు మండే సమాచారం చెప్పింది. ఆ రిసెప్షనిస్టు అంత అందంగా ఉండకపోయినా, తప్పు మాది కాకపోయినా, లాగి రెండు పీకే వాడినేమో. చేసేదిలేక పక్కనున్న హోటల్ లో రూమ్స్ తీసుకుని ఎంగిలి పడడానికి బయల్దేరాం. కాలే కడుపుకి మండే బూదిదలాగా ఏదో కాస్త తిని, రూం కెళ్ళి తన్నిపెట్టి పడుకున్నాం. ముందు రెండు రోజులు సరిగ్గా నిద్రలేదేమో, లేచేసరికి అయిదైంది టైం. ఆ రోజు బానే తిని తిరిగి సాఫీ గా గడిచిపోయింది.
మేము వెళ్ళింది మాంచి ఎండలో. ఎంత వేడి అంటే, పోయ్యలేకుండా పప్పు ఉడికించవచ్చు . మేము మొదటిసారేమో వెళ్ళడం, తెలియక వేగాస్ డౌన్ టౌన్ లో హోటల్ తీసుకున్నాం. అక్కడ్నించి స్ట్రిప్ ఒక రెండు మైల్లే అయినా వెళ్ళడానికి ముప్పావు గంట దాకా పట్టేది. ఆ రోజు బెల్లాజియో లో ఎక్కువ సేపు గడిపాము ప్రశాంతంగా . మా ప్రకృతికి విరుద్ధంగా మిగిలన రోజంతా అన్నీ సాఫీ గా సాగిపోతున్నాయి, మంచి రోజులు మళ్ళీ వచ్చాయా ఏంటి, కొత్త కొత్తగా ఉన్నది అని కేసినో లో ఆట ఆడుతూ పాట పాడుతుంటే నేను కొంత గెలిచాను బ్లాక్ జాక్ లో. (పోయిన బోలెడు ఆటలకన్నా గెలిచినది ఒకటీ గుర్తుండిపోతుంది కదా) . నేను పరిగెత్తు కుంటూ, లక్కీ 7 దగ్గర నీరసం గా ఉన్న నా శ్రీమతి దగ్గరికెళ్ళి డార్లింగ్ పది డాలర్లు వచ్చాయి అనగానే, పర్సు పోయింది అని నీరసంగా చెప్పింది. తీర్థం లా ఉండే ఆ జనం, దొరకడం అసాధ్యం అని తెలిసినా ఆశ చావక లంచ్ చేసిన బెల్లాజియో కెళ్ళి వెతికి, రిపోర్ట్ చేసి వచ్చేసాం. మామూలుగా ఐతే ఇక్కడ (అమెరికా లో ) పర్సు పోయినా పెద్ద విషయం కాదు అన్నీ కార్డ్సే కాబట్టి కాన్సుల్ చెయ్యచ్చు. కానీ అందులో ఒక ఖరీదయిన గిఫ్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి. పోనీ సొమ్ము పోయిందని ఊరకున్నా, ఆ డ్రైవర్స్ లై సెన్స్ లేకుండా తిరుగు ప్రయాణం అనుమానమే. కాల్ చేసి కనుక్కుంటే ఏదో ఒక ఐడి ఉండాలని చెప్పారు . మా దగ్గరా ఇంకోటి లేదు. సర్లే ప్రయత్నిద్దాం. లేకపోతె డ్రైవ్ చేద్దాం అని నిర్ణయించుకున్నాం (సంతోషం ఏంటంటే మేము ఈస్ట్ కోస్ట్ లో లేము ).
మిగతా రెండు రోజులూ హాయిగానే గడిచిపోయాయి. మేము ఒకటి మాత్రం నిర్ణయించుకున్నాం. ఇంకెప్పుడూ వేగాస్ కి వెళ్ళకూడదు అని, వేసవి లో. ఇంచుమించు మూడు రోజులూ 110 F ఉంది . బయటకొస్తే మసే. ఎక్కువ సేపు ఆ స్ట్రిప్ మీద హోటల్లలోనే ఉండేవాళ్ళం. షో స్ అన్నీ బానే చూసాం. బెల్లాజియో, వెనిస్ హోటల్లు చాలా బావున్నాయి. మేము విన్ లాస్ వేగాస్ లో "లే రెవ్" షో కెళ్ళాం. ఎక్కువ మంది బెల్లాజియో లో "ఓ" షో కి వెళ్తారుట. షో బావుంది చాలా. వేరే ప్రపంచానికి తీసుకెళ్ళినట్టు ఉంది లైటింగ్, ఎఫ్ఫెక్ట్స్ , సంగీతం తో. కథ, వాళ్ళ బాధ అర్థం ఐతే ఇంకా బావుండేది అనిపించింది. నాకు అన్నిటికంటే దేదీప్యామానమయిన వేగాస్ రాత్రిలో బెల్లాజియో ఫౌంటైన్ ని ఈఫిల్ టవర్ మీద నుంచి చూడడం అద్భుతమైన అనుభూతి. అదీ మేము ఆఖరు చూసినది అదే .
మేము పూటకొక సారి పర్స్ పారేసుకున్న హోటల్ కి కాల్ చేసేవాళ్ళం, నేను నీళ్ళు వదిలేసినా నా శ్రీమతి పట్టుపట్టడం వల్ల. అదే క్రమం లో ఒకసారి ఆ హోటల్ కెళ్ళి అడిగాం. అక్కడ రిసెప్షనిస్ట్ శ్రియ గోశల్ ఇళయరాజా సంగీతం లో పాట పాడినట్టు ఒక తియ్యని వార్త చెప్పింది. పర్స్ చేతికిచ్చింది. శతం తక్కువగా అన్నీ ఉన్నాయి. హమ్మయ్య అనుకుని ఆ రోజు మా స్నేహితులకి ఓ చిన్న పార్టీ ఇచ్చాం కూడా. ఇక ఫ్లైట్ ప్రయాణానికి దోకా లేదని . మర్నాడు ఉదయం మా తిరుగు ప్రయాణం. ఈ సారి చాలా జాగ్రత్తగా ఏడింటి ఫ్లైట్ కి ఉదయం అయిదింటికే బయల్దేరాం. ఎయిర్ పోర్ట్ కెళ్ళే దారిలో ఒకసారి దారి తప్పినా సద్దుకుని, మొత్తానికి చేరుకున్నాం. ఎయిర్ పోర్ట్ కి shuttle పట్టుకునేటప్పుడు ఊరికే ఒకసారి టికెట్స్ చూసుకున్నాం. దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఫ్లైట్ 6:30 కి (వేగాస్ కి వచ్చేటప్పుడు ఫ్లైట్ టైమింగ్ వెళ్ళేటప్పుడు టైమింగ్ గా పొరబడ్డాము అలవాటులో ). Shuttle దిగి పరుగో పరుగు ఫ్లైట్ కౌంటర్ కి. ఆలస్యమయినా కిందా మీద పెట్టి మొత్తానికి బోర్డింగ్ పాస్ లు ఇచ్చింది అక్కడున్న పెద్దావిడ. ఆ పైన మా అదృష్టానికి తగ్గట్టు చెక్ ఇన్ దగ్గర బ్లాక్ ఫ్రైడే కి electronics కొట్ల దగ్గర ఉండేంత క్యూ. అది త్వరగానే అయిపోయినా, అక్కడనించీ రెండు టెర్మినల్ ల అవతల మా ఫ్లైట్. ట్రాం పట్టుకున్నాం కానీ మా స్నేహితులు వెనక ఉండి పోయారు. సర్లే మనం వెళ్లి ముందు అక్కడ ఫ్లైట్ ఆపుదాం అని వెళ్ళిపోయాం. అక్కడ బోఅర్దింగ్ దగ్గర ఎయిర్ లైన్స్ ఉద్యోగి మా కంటే కంగారుగా ఉన్నాడు. అప్పటికే మిగతా బోర్డింగ్ అయిపొయింది. కేవలం ఒక 5 నిమిషాలు చూద్దామని ఆగాడు. మా స్నేహితులు ఇంకా రాలేదు. నిమిషానికో సారి కంగారు పెట్టేవాడు వస్తున్నారా అని . మొత్తానికి ఇంకా సరిగ్గా బోర్డింగ్ ఆపేసి తలుపు మూసేయ్యబోతుండగా మా వాళ్ళు వచ్చారు. మా దగ్గర ఉన్న బ్యాగ్ లు గేటు చెక్ చేసాడు (అవి క్యారీ ఆన్ లు మా దగ్గర ఉండాల్సినవి). ఏది అయితే అది అయింది అని దొరికిన ఆఖరు సీట్లలో కూర్చున్నాం. బెల్టు పెట్టుకుని హమ్మయ్యా అనుకుని, ఫ్లైట్ ఎప్పుడు కదులుతుందా అని వేచి ఉన్నాం. ఇంతలో పరుగు పరుగున వచ్చాడు ఆ కంగారు మనిషి (మమ్మల్ని ఎక్కించిన వాడు ). మా నలుగురుని దిగమన్నాడు. ఇదేం గొడవరా బాబు అనుకున్నాం. బోర్డింగ్ పాస్ లు ఇచ్చిన మహా తల్లి మమ్మల్ని వెయిటింగ్ లిస్టు లో పెట్టిందిట. మమ్మల్ని వేరే నలుగురు అనుకుని ఈ తికమక మనిషి ఎక్కిన్చేసాడు. వాడిని తిట్టడానికి నా దగ్గరున్నవి కాదు కదా పూరీ జగన్నాథ్ గారు సినిమాలలో వాడే బండ బూతులన్నీ కూడా సరిపోవు. మా తప్పు కూడా ఉంది కాబట్టి వాడిని విసుక్కోవడం తప్ప ఏం చెయ్యలేకపోయాం. వాడు వేరే ఫ్లైట్ కి పాస్ లు ఇచ్చి, బ్యాగ్లు దిగేచోట చోట తీసుకోవచ్చని చెప్పాడు. అవి వేరే ఫ్లైట్ లో ఉన్నాయి కదా అని చాలా సార్లు అడిగినా వాడు ఏం ఫర్లేదు మై హూ నా వచ్చేస్తాయని భరోసా ఇచ్చాడు. సర్లే ఇంకా చేసేదేముంది అని ఫ్లైట్ ఎక్కి బెల్టు పెట్టుకుని కూర్చున్నాం. ఇంతలో మళ్ళీ దింపే శారు, మాతో పాటు అందరినీ. కంగారు పడకండి మా ఊరు వచ్చేసింది (అరగంటే ప్రయాణం ).
బే ఏరియా హాయి వాతావరణం లో చల్ల గాలి పీల్చుకోడానికి తహతహ లాడుతూ లగేజీ తీసుకుందామని వెళ్లాం. ఏదో అవకతవక వల్ల మా బ్యాగ్లు రాలేదని, ఎక్కడో మెక్సికో కి వెళ్లి పోయాయని చెప్పింది అక్కడ ఓ పొగరు బోతు. అప్పుడే నా శ్రీమతి ఒక తాజా వార్త చెప్పింది. తన బంగారు వస్తువులు కొన్ని క్యారీ ఆన్ కదా అని ఆ బ్యాగ్ లో పెట్టానని. మూల్గే నక్క మీద తాటిపండు సామెత కి అర్థం అప్పుడు తెలిసింది నాకు. ఆగ్రహం లో రాజశేఖర్ అంత కోపం, పుర్సూట్ అఫ్ హ్యాపీ నెస్ లో విల్ స్మిత్ అంత బాధ, నిస్సహాయత కలిపి వచ్చాయి. కానీ ఏం చెయ్యను, ఒక కంప్లైంట్ రాసి ఇంటికి బయల్దేరాం.విచిత్రం ఏంటంటే మా స్నేహితుల లగేజీ వచ్చేసింది అందరం ఒకేసారి గేటు చెక్ చేసినా.
ఇక ఎయిర్లైన్స్ వాడు రోజుకొక కథ చెప్పేవాడు ఒకసారి మెక్సికో కి వెళ్లిందని , ఒకసారి మిన్నెసోటా అని, ఒక సారి కరీబియన్ అని. వారమయినా బ్యాగ్స్ రాలేదు. ఇక క్లైం చెయ్యడానికో ఉత్తరం కూడా పంపాను. ఆరోజే ఒక దేవదూత మా ఇంటికి వచ్చాడు. భక్తా విచారించకు. నిన్న పోయింది అనుకున్నది నేడు దొరకచ్చు అని చెప్పి ఒక రెండు బ్యాగ్లు చేతిలో పెట్టాడు. బ్యాగ్ లో అన్నీ ఉన్నాయో లేదో చూసి ఆయనకీ దండం పెడదామని వెనక్కి తిరిగాను. ఆయన కంటికి దూరంగా గాలిలో అదృశ్యం అయిపోయాడు.
ఆ సమయం లో అతి కష్టం మీద ఆయన వస్త్రం మీద అస్పష్టంగా మూడు అక్షరాలూ కనపడ్డాయి. U P S అని
నేను తొమ్మిదవ తరగతి లో ఉన్నప్పుడు అనుకుంటా, మా సోషల్ టీచర్ సెకండ్ వరల్డ్ వార్, హిట్లర్ గురించి చెబుతూ, వీటి మీద షిండ్లర్స్ లిస్టు అనే అద్భుతమయిన సినిమా ఉంది స్పీల్బర్గ్ (జుర్రాసిక్ పార్క్ పుణ్యమా అని ఆయన పేరు విన్నా అప్పటికి). దాంట్లో హిట్లర్ చేసిన అరాచకం గురించి బాగా చెప్తాడు అని చెప్పినట్టు చూచాయి గా గుర్తుంది. ఎన్నో సార్లు చూద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మొత్తానికి ఆ శుభ తరుణం నిన్న ఆసన్న మయినది.
ఆంగ్ల సినిమాలు చూసే వారు ఇది మిస్ అయ్యి ఉండరు. కానీ అయి ఉంటే వెంటనే అద్దెకో, డౌన్లోడ్ చేసో, ఆఖరికి కొని అయినా చూడాల్సిన సినిమా. కథ - రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల అరాచకత్వానికి దారుణంగా బలి అవుతున్న జూస్ తో ఒక పరిశ్రమను ప్రారంబించి (మొదట్లో కేవలం లాభాల కోసమే) మెల్లగా వాళ్ళని ఆదుకునే నాథుడుగా ఎదిగిన షిండ్లర్ కథ. ఒక పక్క నాజీల అరాచాకత్వాన్ని, ఉన్మాదాన్ని, జూస్ నిస్సహాయతని, షిండ్లర్ మానవత్వాన్ని అత్యద్భుతంగా చిత్రకరించాడు స్పీల్బర్గ్.
చూస్తున్నంత సేపు ఆ సమయంలో మనమక్కడ ఉన్నట్టే, ఆ అమానుషం మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉంటుంది. ఒకసారి బాధతో కళ్ళల్లో నీళ్ళు తిరిగితే, ఒకసారి కోపంతో గుండె రగిలిపోతుంది. ఒకసారి జాలితో గుండె కరిగిపోతే, ఒకసారి మానవత్వానికి ఉప్పొంగిపోతుంది.సినిమా మొత్తం హిట్లర్ ని, జూస్ ని ఊచకోత కోసిన నాజీలని బతుకుంటే వెంటనే గొంతు నులుమి చంపెయ్యలనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను చూసిన, విన్న చరిత్రలో ఇంత దారుణంగా, ఎందుకు చంపుతున్నారో కూడా తెలియకుండా ఇన్ని లక్షల మందిని చంపిన ఉదంతం లేదు. అన్నిటికంటే బాధపెట్టినవి రెండు ప్రశ్నలు , ఇంత జరుగుతుంటే, ప్రపంచమంతా చూస్తూ ఎలా ఊరుకుంది. ఇంత దారుణాన్ని ఆరేళ్ళు ఎలా ఉపేక్షించింది. ఇంత చేసినా బరిస్తూ ఎందుకు ఉన్నారు జూస్, కనీసం కొంత మంది అయినా ఎందుకు తిరగబడలేదు (అలా తిరగ బడ్డట్టు నేను ఎక్కడ చదవలేదు).
నన్ను కలిచివేసిన, నా గుండెలు బరువెక్కిన, నన్నింకా haunt చేస్తున్న కొన్ని సీన్లు ఈ సినిమాలో..
పోలాండ్ (క్రకవ్) జూస్ అందరినీ కలిపి ఒక చిన్నపాటి ప్రదేశంలో (ఘెట్టో లంటారు) పడేస్తారు నాజీలు. అక్కడ నించీ వారి చేత రకరకాల పనులు చేయిస్తూ ఉంటారు. ఒక సరి ఏదో ఒక నిర్మాణం జరుగుతూ ఉంటే ఒక జూ సివిల్ ఇంజనీర్ (స్త్రీ) వచ్చి నాజి కమాండర్ (అమాన్) తో అలా కడితే ఇది పడిపోతుంది. మళ్ళీ ఫౌండేషన్ వేసి కట్టాలి అని చెప్తుంది. అన్నీ కనుక్కుని అమాన్ ఆమెని కల్చేయ్యమంటాడు. ఆ స్త్రీ నేనేం తప్పు చేసాను, ఇది నా పని అంటే, అమాన్ ఆమెని షూట్ చేసి ఇది నా పని అంటాడు.
అమాన్ పొద్దున్నే లేచి బాల్కనీ లోకి వచ్చి వొళ్ళు విరుచుకుంటాడు. సిగరెట్ వెలిగిస్తాడు. ఘెట్టో దగ్గర చాలా మంది జూస్ పని చేస్తుంటారు. కూర్చుని ఉన్న ఇద్దరు జూస్ ని షూట్ చేస్తాడు. లోపలి వచ్చి మూత్ర విసర్జన చేస్తూ పెళ్ళాం ని కాఫీ నువ్వే పెట్టు అంటాడు. నాజీలు జూస్ ని చంపడం వారి దినచర్య లో ఎంత సర్వ సాధారనమో, వాళ్ళకి ఇది ఎంత తేలికో ఇంత కంటే బాగా ఎవరు చెప్పగలరు.
షిండ్లర్ హెలెన్ అనే జూ (నాజీ కమాండర్ అమాన్ కి సేవకురాలు ) స్త్రీని ఓదారుస్తూ ఉంటాడు అమాన్ ఆమెని చంపడని. దానికి ఆమె "నాకు నమ్మకం లేదు. ఈ రోజు మేము చూస్తుండగా దారిన పోతున్న ఒకామెని గొంతులో షూట్ చేసాడు. ఆమె మిగతా వారికంటే మెల్లాగా వెళ్ళట్లేదు, తొందరగా వెళ్ళట్లేదు, ఆమె సన్నగా లేదు లావుగానూ లేదు. ఆమె చేసిందేమీ లేదు అలా వెళ్తోంది. అమాన్ నేను ఇవి పాటిస్తే చంపడు అనుకోడానికి లేదు" అని నిస్సహాయంగా వాపోతుంది.
కొత్తగా వర్కర్స్ వేరే దేశాల నించీ వచ్చినప్పుడు, నాజీలకి తోచినప్పుడు, కొందరి జూస్ ని ఏరి (కూరలు, రాళ్ళూ, రప్పలు లాగ ) ట్రైన్లలో తీసుకెళ్ళి సెల్లలో సామూహికంగా చంపేస్తుంటారు నాజీలు (కొందరికి విషవాయువులు ఇచ్చి, కొందరిని కాల్చేసి, కొందరి మీద ప్రాణాంతక పరీక్షలు చేసి). అలా తీసుకెళ్ళే వాళ్ళని గూడ్స్ బండి లాటి దాంట్లో (గాలాడడానికి పెట్టె మొత్తానికి ఒక చిన్న కిటికీ ఉంటుంది) పంపుతూ ఉంటారు. ఆ పెట్టెలలో గాలాడక, దాహంతో ప్రాణాలు పోయేడట్టు ఉంటుంది లోపల ఇరుక్కుని నించున్న జూస్కి . అప్పుడు షిండ్లర్ నాజీ కమాండర్ లతో మాట్లాడి, ఫైర్ హోస్ తో పెట్టలకి నీళ్ళు కొట్టిస్తాడు. ఆ కిటికీలలో నించీ, రూఫ్ నించీ కారే నీళ్ళతో ఎండిన గొంతులు తడుపు కుంటారు జూస్.
సినిమా అంతా బ్లాకు అండ్ వైట్. కానీ కొన్ని సన్నివేశాలలో ఒక పాప డ్రెస్ ని మాత్రం ఎరుపు లో చూపిస్తారు. ఎందుకో అర్థం కాలేదు. ఈ పాప బ్రతుకుందేమో అనుకున్నాను.అలా చిన్న ఆశ కలుగుతుంది . చివరికి ఆ ఆశ కూడా నిరాశే అని తేలుతుంది. అక్కడున్న జూస్ బతుకుతామని ఆశ పడడం వృధా అని నొక్కి చెప్తుంది.
ఇక గుండెలు పిండేసే క్లైమాక్స్. కిందామీదా నానా తంటాలు పడి, అతి కష్టం మీద తనకున్నదంతా వెచ్చించి ఒక పదకుండు వందల యాభై మంది జూస్ ని కాపాడతాడు షిండ్లర్. వారికి ఏడు నెలలు పాటు తల దాచుకోడానికి చోటివ్వడానికే తన పుట్టినూరులో ఫ్యాక్టరీని పెడతాడు. చివరికి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి, సోవియట్ రష్యా చేతిలో నాజీలు ఓడిపోతారు. అప్పుడు ఈ జూస్ (షిండ్లర్ కాపాడిన జూస్ ) కి విముక్తి కలుగుతుంది. నాజి పార్టీ వారిని అర్రెస్ట్ చేస్తారు. ఇతను నాజీ పార్టీ వదవ్వడం వల్ల దేశం వదిలి వెళ్ళే షిండ్లర్ ని జూస్ అందరూ సాగానంప వస్తారు. వాళ్ళని చూసి నేను ఇంకా కొంత మందిని కాపాడుండ వలసింది. కపాదగాలిగీ కాపడలేదు. బోలెడు డబ్బు వృధా చేసాను. ఈ కార్ ఎందుకు - ఇది ఒక ఇంకో పడి మందిని కపాడేదేమో, ఈ బంగారపు బ్యాడ్జు ఎందుకు ఇది ఇంకో ఒక్కరినైనా కపాడేదేమో అని చాలా బాధపడతాడు. అక్కడ అప్రయత్నంగా గుండె కరిగి గొంతులోకి వచ్చేస్తుంది ప్రేక్షకులకి (నాకైతే జరిగింది)
ఈ మారణహోమం (holocast) విన్న ఎవరికయినా గుండె రగిలిపోతుంది. అందులో స్పీల్బర్గ్ దర్శకుడు, అందునా జూ.ఇంకెంత రగిలిపోయి ఉంటాడు, ఎంత వేదన చెంది ఉంటాడు. ఆ బాధ ప్రతీ ప్రేక్షకుడికి గుండెలో పలికించ గలగడం, ప్రతీ మనిషిని ఒక ఘడియ ఆపి ఆలోచింప చెయ్యడం, ఒక కన్నీటి బొట్టు నివాళిగా రాల్చ గలిగేలా చెయ్యడం లో స్పీల్బర్గ్ కృత కృత్యుడు అయ్యాడని నా నమ్మకం.
P.S.
ఈ సినిమాకి స్పీల్బర్గ్ ఒక్క డాలర్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు
సినిమా అంతా నాజీల అరాచకం గురించి అయినా, ఎక్కడా హిట్లర్ కనపడడు, అతని గొంతు వినపడదు.
ఈ మధ్య నేను చూసిన హోటల్ రవాండా కూడా ఇలాటి మారణహోమాన్ని, అందులో ఒక సామాన్యుడు పరిస్తుతలని బట్టి, కొన్ని వందల మంది జనాల పాలిట రియల్ హీరోగా ఎలా పరిణత చెందుతాడో చూపెడుతుంది. దారుణ మరణ హోమాన్ని కళ్ళకు కట్టినట్టు చూపెడుతూనే, ఆ ప్రతికూల పరిస్థితులని పోరాడే మానవత్వాన్ని, ఆశావాదాన్ని చాటుతుంది.
జేమ్స్ కామెరూన్, భారీ బడ్జెట్, కొత్త టెక్నాలజీ , ఆరు నెలల ముందు నించి ఇచ్చిన హైప్ ఇవన్నీ చూసి చాలా అనుకున్నా ఈ సినిమా గురించి. రివ్యూలు కూడా కొంచం పాజిటివ్ గ ఉండే సరికి, ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహ లాడాను. IMAX లో అదీ 3D లో చూడాలని రెండు రోజులు ముందు బుక్ చేసి టికెట్లు, గంట డ్రైవ్ చేసి, రెండు గంటలు లైన్ లో వెయిట్ చేసి (మంచి సీట్ల కోసం) చాలా ఆత్రంగా ఈ సినిమాకి వెళ్లాను.
సినిమా నేను అనుకున్నంత కాకపోయినా బానే ఉంటే ఇంత గోల పెట్టేవాడిని కాను. సినిమాకి ఇచ్చిన హైప్ కి, నేను చూడడానికి వెచ్చించిన సమయానికి, టికెట్కుకు పెట్టిన వెలకి (19$) సినిమా న్యాయం చెయ్యలేదని నిస్సంకోచంగా చెప్పగలను. అలాని సినిమా అసల బావోలేదు అని అనను. కామెరూన్ ఊహా శక్తికి, కార్యాచరణకి, సృష్టించిన కొత్త ప్రపంచానికి సలాం కొట్టాలి.
ఇక నాన్చకుండా నాకు నచ్చనివి చెప్పేస్తా. ఇవి మరీ చిన్న విషయాలు అనిపించవచ్చు కొందరికి. కానీ నాకు మాత్రం సినిమాలో ఏదో వెలితి, అవి వీటి వల్లనేమో అనిపించింది.
సినిమా ఇంట్రడక్షన్, మొదటి సీన్లు పేలవంగా ఉన్నాయి . నేనింకా సినిమా మొదలు కాలేదు అనుకున్నా ఆ సీన్లు అయ్యేవరకు. హీరో వాయిస్ narration కి అసల సూట్ కాలేదు.
హీరో అసల నచ్చలేదు. ఎనర్జీ లేదు, నటన అంతంత మాత్రం. ఎంత అవతార్ నే ముఖ్యంగా చూపించినా, ఇతను ఉన్న సీన్లలో ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లా ఉన్నాడు
కొంత మంది నావి లు (నెయ్తిరి ముఖ్యంగా ) మొదటి సీన్ నుండే ఆంగ్లంలో మాట్లాడతారు . ఆ మాత్రం దానికి నావి భాష మాట్లాడినట్టు చూపెట్టడం ఎందుకు ఇంక.
ఎమోషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళ బాధ మనకి బాధ కలిగించేడట్టు చూపించలేక పోయాడని పించింది (ఒకటి రెండు సీన్లు మినహా)
మంచి ఇంగ్లీష్ సినిమా అంటే నా వరకు నాకు, సినిమా అయిపోయినా బుర్రలో తిరుగుతూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. (It should haunt me). అలా ఉంటుంది అనుకున్నా కానీ అసల లేదు. చూసి రెండు గంటలైంది. ఒక్క సీన్ కూడా స్ఫురణ కి రావట్లేదు విషువల్గా.
పండోర లో చాలా భాగం లార్డ్ అఫ్ ది రింగ్స్ లో చూసినట్టు అనిపించింది. దాని వల్ల ఒక కొత్త ప్రపంచాన్ని చూసే ఆనందం పూర్తిగా పొందలేదు.
3D ని పెద్దగా వాడుకున్నట్టు అనిపించలేదు. ఉదాహరణకి ఫైనల్ డెస్టినేషన్ లో ఇంకా బాగా వాడుకున్నాడు ౩D ని. యాక్షన్ లో మనం అక్కడున్న ఫీలింగ్ కలగలేదు.
ఉన్నవి రెండో మూడో యాక్షన్ సీక్వెన్స్ లు అవి కూడా వాళ్ళు గగురు పోడిచేడట్టు ఏం లేవు. ఆ విధంగా కూడా నిరుత్సాహ పరిచింది.
కామెరూన్ గారు అంత ఖర్చెందుకు పెట్టారు అన్న విషయం (అని అడగాలని ఉన్నా) పక్కన పెట్టినా, నా టికెట్ కి పైసా వసూల్ మాత్రం కాలేదు.
ముఖ్యం గా జనాలు చెప్పినంత ఏం లేదు సినిమాలో. నేను రామ్ గోపాల్ వర్మ టపా చూసి అసల తెగ ఊహించుకున్నా సినిమాని. అంత లేదు. నాకు దీని కంటే ఈ ఏడాది వచ్చిన అప్, 2012 (ఇల్లోజికాల్ అయినా ) ఎక్కువ నచ్చింది.
నిన్న టీవీ 9 లో స్టార్ నైట్ చూస్తూ కూర్చున్నాం. తెలుగు సినిమా పరిశ్రమ కి పెద్ద దిక్కు (అని ఆయనే చెప్పుకునే) దాసరి నారాయణ రావు గారు ఒంటి చేత్తో కార్యక్రమాన్ని సజావుగా జరగనివ్వకుండా చేసారు. మైక్ చేతిలో ఉంటె ఆయన భూమ్మీద ఉండరు కదా. ఆయన ఇంగ్లీష్ వింటే మనసు పులకించింది. మైదకూరు లో స్కూల్ పిల్లలకి I never speak in Telugu అని పలక మెడలో వేసినట్టు, ఈయనకి I will never speak in English అని మెడలో వేయించాలనిపించింది. సంగీత విభావరులు బానే ఉన్నాయి కానీ, మధ్య మధ్య లో దాసరి గారు, జస్ట్ వన్ సాంగ్, థాంక్స్ యు అని వాళ్ళని కట్ చెయ్యడం చాలా బాధేసింది. సభ మర్యాద కూడా లేకుండా, పాడుతుంటే మధ్యలో ఆపెయించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
సుశీల గారి జనని శివకామిని పాటతో మొదలు పెట్టారు కార్యక్రమాన్ని. సుశీల గారు పాడడానికి కొంచం కష్టపడ్డారు. ఆవిడ గొంతు ఉన్నంత నిండుగా ఇంకెవరిదీ లేదు ఆ స్టేజి మీద (బయట కూడా) . ఆవిడ కూడా లత గారి లాగా ఇంకొన్నాళ్ళు పాడగలిగి ఉంటే ఎంత బావుండేదో అనిపించింది. సుశీల గారి పాట తరువాత కోటి, కీరవాణి, మణిశర్మ తదితరులు సంగీత విభావరి కొనసాగించారు.
కీరవాణి గారు 'బంగారు కోడి పెట్ట సాంగ్' గురించ చెప్తూ, 'అప్ అప్ హాండ్స్ అప్' అని ఎవరూ మీలాగా అనలేకపోయారు అందుకే మీరు పాడినదే ఈ కొత్త పాటలో(మగధీర లో ) పెట్టాం అని బాలు గారికి చెప్పారు. దానికి బాలు ఇలా నేను పాడినవి పెట్టి, నన్ను పిలవడం మానేయకండి అని చురక వేసారు. నాకు నచ్చని విషయం ఏంటంటే, తెలుగు లో కొన్ని పాటలని పాడడానికి అనర్హాం ( సూపర్ లో మిల మిల మెరిసిన కనులకి పాట గురించి క్లాసు పీకరులెండి ఒక షో లో ) అన్న రీతిలో తిట్టిపోసిన బాలు గారు బంగారు కోడి పెట్ట పాటని అదేదో కీర్తన లాగ పోటి పడి మరీ పాడారు. అప్పట్లో (ఒరిజినల్ పాడిన టైం లో ) ఐతే వేరే విషయం అనుకోండి. ఇప్పుడు కూడా (స్టార్ నైట్) లో పాడవలసిన అవసరమేముంది.
దేవిశ్రీ ఎప్పటిలాగే పాడలేకపోయినా హడావుడి చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దేవిశ్రీ పెద్ద గాయకుడు కాదు కానీ మాంచి స్టేజి పెర్ఫోర్మేర్. ఊపు తీసుకొస్తాడు ఏ షో లో అయినా సరే. Excuse me Mr. Mallannaa పాటని సుహాసిని చాలా బాగా పాడింది. అల్లు అర్జున్, దేవి శ్రీ , మమత మోహన్దాస్ డాన్స్ కూడా బావుంది. ఇంకోటి విద్యాసాగర్ గారు ఈ విభావరి లో కనిపించలేదు. కారణాలు నాకు తెలియవు కానీ, తమిళులు ఎంతో గౌరవించి, అవకాశాలు ఇచ్చే ఆయనని మన తెలుగు సినిమా వాళ్ళు ఎందుకు పట్టించుకోరో నాకర్థం కాదు.
ఆ తరువాత డాన్స్ లు, స్కిట్లు చాలానే ఉన్నాయి. ఒకటి రెండు తప్ప స్కిట్లు పెద్ద గొప్పగా లేవు. కుక్క- టి వి ఛానల్ మీద స్కిట్ కొన్ని బ్లాగ్లలో చదివిన టపాకి దగ్గరగా ఉన్నా బానే నవ్వించింది. భువన విజయం స్కిట్ మిస్ అయ్యాను. కార్యక్రమం చివరిలో దాసరి ఇదే అదును చూసుకుని, మోహన్ బాబు ని, బాల కృష్ణ ను బాగా ఎత్తేసారు. మోహన్ బాబుకి మైక్, మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం నన్ను చాలా నిరశాపరించింది . వజ్రోత్సవాలలో లాగ ఆయన కొంచం వేడి పుట్టిస్తే బావుండేది. చాలా రోజులు చెప్పుకోడానికి. ఇంకొక విషయం గమనించాను. రజనీ కాంత్ ప్రత్యేక అతిధి గా హాజరు అయ్యారు. ఆయన వచ్చేసరికి రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున ఒక చోట కూర్చుని ఉన్నారు. రజని కాంత్ రాగానే, గౌరవంగా నాగార్జున లేచి ఆయన సీట్ ఇచ్చి వేరే చోట కూర్చున్నారు.అక్కడే ఉన్న రామ్ చరణ్ లేచి ఆయనకు గౌరవం ఇచ్చి వేరే చోట కూర్చవాలన్న ఇంగిత గ్న్యానం లేదేంటా అనుకున్నాను. అయినా ఒక పక్కన అల్లు అర్జున్ వాళ్ళ వయసు వాళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తుంటే పెద్దవాళ్ళ దగ్గర రామ్ చరణ్ కూర్చోవాల్సిన అవసరం ఏంటి? చూడబోతే ఈయన కూడా పెద్దగ కలవదేమో ఎవరోతోనూ. చిరంజీవి ఉన్నంత సేపు ఏదో తప్పక వచ్చినట్టు కూర్చున్నారు. నాకైతే మోహన్ బాబు ఎప్పుడు వచ్చి ఏమంటాడో అన్న కంగారు తో కూర్చున్నవాడిలా అనిపించారు. మహేష్ బాబు ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి కూడా రాలేదు. ఊరంతా ఒక దారయితే ఉలిపిగడ్డ దొక దారని అసల ఎక్కడా దర్శనమివ్వడు బాబు. మహేష్ బాబు కి బొత్తిగా PR లేదు(లేవు).
ఈ రోజు రామ్ గోపాల్ వర్మా 'అజ్ఞాత్' అనే కళాఖండం చూసి తరించాను. పచ్చగా ఉన్న అడవి, పిచ్చి పిచ్చి శబ్దాలు, నితిన్ సిక్స్ ప్యాక్ , నిషా కొఠారి (ఇప్పుడు ప్రియాంక ఏమో) ఎక్ష్పోసింగ్ తప్ప సినిమాలో ఏం లేదనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ చెత్తగా ఉంది (అజ్ఞ్యాత్ ౨ కి ట్రైలర్ లాగా ). డైరెక్టర్ ప్రేక్షకులు ఫూల్స్ అని అస్స్యూం చేసుకుని తీసినట్టు ఉంది (నిజానికి అతను లాభ నష్టాలు, ఆడియన్స్ ఇష్టైష్టాలు అవన్నీ పట్టించుకోడుట. తనకి నచ్చింది తీసేస్తాడుట) . రామ్ గోపాల్ వర్మ కి ఎప్పుడూ చూడనంత భయానకమయిన అడవి శ్రీ లంక లో కనపడిందిట. అందుకని ఒక సినిమా తీసేసి మన మీదకి వేదిలేసారు. పోనీ భయపెట్తిందా అంటే అదీ లేదు. నేను రామ్ గోపాల్ వర్మ అభిమానినే అలా అని ప్రతీ చెత్త సినిమాను సమర్థించాను . ఈ సినిమాకిచ్చిన హైప్ కి హాల్ లో చూద్దాం అనుకున్నా కానీ US లో రిలీజ్ కాలేదు అదృష్టవశాత్తు.
లాస్ట్ వీక్ హాలోవీన్ కి పిల్లలోస్తారేమో లైట్స్ పెట్టి, క్యాండిలు అవీ రెడీ గా పెట్టుకున్నాం. ఒక్కళ్ళూ రాలేదు. గత యేడాది బోలెడు మంది పిల్లలు వచ్చారు. ఈ సారేంటో అసల రాలేదు. వస్తే బోలెడు ఫోటోలు తీద్దాం అనుకున్నా. కాలిఫోర్నియా లో చలి బానే పెరిగింది. థాంక్స్గివింగ్ దగ్గర పడుతోంది కదా. సాయంత్రం కూడా ఇంటి దగ్గరే ఉండాల్సోస్తోంది యాక్టివిటీ ఏం లేకుండా. ఇంక పాపం ఈస్ట్ కోస్ట్ వాళ్ళ పరిస్తితి ఏంటో.
అన్నట్టు మా ఫ్రెండ్స్ హాలోవీన్ కని ఈ స్కేరీ వీడియో పంపారు.చూసి భయపడకుండా ధైర్యంగా ఉన్నవాళ్లు చెయ్యి ఎత్తండి.
భయపడినవాళ్ళు కామెంటండి.
కార్తీక మాసం అనగానే తెలియని ఆనందం కలుగుతుంది నాకు . ఇండియా లో ఉంటే ఈ మాసం లో ప్రతీ సోమవారం ఉదయాన అభిషేకం, ఉపవాసం భలే ఉండేది. నాకు కార్తీక మాసం మొత్తం పండగ లా అనిపించేది. ముఖ్యంగా ఉపవాసం ఉన్నప్పుడు, సాయంత్రం వరకు వేచి వేచి తినడం భలే ఆనందం గా ఉండేది. (అన్నట్టు ఉపవాసం అంటే దగ్గరగా (ఉప ) ఉండటం (వాసం) దేవుడికి దగ్గరా ఉండటంట). అందులో కార్తీక మాసం లో ఉదయాన చలి ఎక్కువగా ఉంటుందేమో, ఆ చలిలో తెల్లవారకుండా తల స్నానం, సూర్యుడి తొలి కిరణాలు కూడా రాకుండా గుడి వరకు నడక, గుడిలో అభిషేకం, అది అయ్యాక అప్పుడప్పుడే వస్తున్నా వెచ్చని కిరణాల వేడికి చలి కాచుకుంటూ ఇంటికి రావడం, శివ స్తుతి వినడం, సాయంత్రం వరకు ఉపవాసం చేసి, సాయంత్రం పూజ చేసి, చంద్రుణ్ణి , నక్షత్రాలని చూసి, వేడి వేడి పులిహోర, కంద బచ్చలి కూర (నాకు ఇదంటే ప్రాణం) తినడం - ఒక చక్కని అనుభూతి. దీంట్లో ఏది తక్కువైనా అసంపూర్ణంగా ఉన్నట్టు అనిపించేది (ముఖ్యంగా కందా బచ్చలి :) ). ఇక్కడికొచ్చాక ఉపవాసం ఐతే కుదురుతోంది కాని, మిగతావన్నీ కష్టమే. అయినా వీలున్నంత లో చేసి మమ అనిపిస్తున్నాం. ఇక ఇవి కాకుండా, వన భోజనాలు. ఈ సారి కనీసం దీనికైనా ప్లాన్ చెయ్యాలి మేము.
ఈ మధ్య టివి పెడితే (తెలుగు చానళ్ళు ) తెగ చిరాకోస్తోంది. ఒకటి రెండు మినహా అన్ని కార్యక్రమాలు కాంపిటీషన్ - ఎలిమినషన్ - డేంజర్ జోన్ లేదా డబ్బు- సినిమాలు. నిన్న యు ట్యూబ్ లో మాల్గుడి డేస్ కంట పడింది. అది చూస్తే చిన్నప్పుడే, ఒక్క డి డి ఉన్నప్పుడే ఎంత మెరుగ్గా ఉన్నాయి కార్యక్రమాలు అనిపించింది. దానికి తొడు నిన్న నాకు తెలిసిన ఓ బ్లాగ్ లో వీటి గురించి చదువుతుంటే చిన్నప్పటి వన్నీ మరీ ఎక్కువగా గుర్తొచ్చి నెమరు వేసుకుంటున్నాను. వారాంతం లో వచ్చే సినిమా కోసం వేచి చూడడం, శుక్రవారం ఐతే చిత్రలహరి, బుధవారం చిత్రహార్, ఆది వారం రంగోలి. ఇంకా సురభి, ఉడాన్, తెహ్కికాత్, గుల్ గుల్షన్ గుల్ఫా, చాణక్య, మహాభారత్, రామాయణ్ ఇలా బోలెడు, అన్ని చూసి ఆనందించగలిగేవే. ఆఖరికి మధ్యలో వచ్చే యాడ్స్ కూడా చాలా చక్కగా ఉండేవి . ముఖ్యంగా ఏక్ తిత్లీ, మిలే సుర్ మేరా ఇప్పుడు చూసినా ఎంత బావున్నాయో అనిపిస్తాయ్.పుట్ట గొడుగుల్లా వస్తున్నా చానల్స్, హాయిగా చూడగల కార్యక్రమాలు అసల లేవనిపిస్తుంది. ఉప్పెక్కువై రుచి చెడినట్టు, చానల్స్ ఎక్కువై నాణ్యత పోయింది.
నిన్న మై కజిన్ విన్నీ అనే ఒక సినిమా చూసాను. పేరు కూడా వినలేదు ఇంతకూ ముందెప్పుడూ నేను. మిత్రుడొకడు మరీ మరీ చెప్తే చూసాను. భలే ఉంది. ఆద్యంతమూ హాస్యం, అలా అని కథ, కథనం గాలికి వదిలెయ్యలేదు. చిన్న కథ, ఆసక్తికరమైన కథనం. చిన్న దొంగతనం చేసిన ఇద్దరిని పొరపాటున హంతకులనుకుని అరెస్టు చేస్తారు. వాళ్ళలో ఒకడి కజిన్ (విన్నీ) ని అటార్నీ కింద పెట్టుకుంటారు. అతని చేష్టలు, జడ్జి కి అతనికి మధ్య కోర్టు సన్నివేశాలు, అతను పడే పాట్లు, చేసే ఫీట్లు - ప్రతీ సీన్ భలే నవ్వు తెప్పిస్తుంది . చివరికి కేసు ను వాదించడం కూడా చాలా బాగా చిత్రీకరించాడు దర్శకుడు . కుదిరితే తప్పక చూడండి.తరువాత మీరే ఇది ఎలా మిస్ అయ్యానా అనుకుంటారు. ప్రస్తుతానికి ఇంతే సంగతులు. మళ్ళీ కలుద్దాం. P.S. ఈ టపాకి (ఇక పై ఈ బ్లాగ్ లో ఈ క్రమం లో, ఈ పేరుతొ వచ్చే టపాలకి) కొత్తపాళీ గారి కబుర్లు ప్రేరణ. ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు.