Monday, April 8, 2024

ఎన్నికల ఉగాది పచ్చడి

 

విసిరేసి శిశిరాన్ని ముసిరేసిన వసంతానికి మురిసిపోతూ అడుగిడింది 
 క్రోధి ఈ ఉగాది ఉదయాన  
శశిలేని నిశిలో దిశలేమీ తెలయక, పయనం ప్రగతి వెలుగు రేఖుల వైపో ; మరింత చీకటి రేపో  అలజడి జనాల హృదయాన
మసి బారిన జీవితాలలో చిరు నవ్వులు చిందుతాయని గుప్పెడు ఆశ గంపెడు నిరాశ ఎన్నికల భయాన

ఉచితంగా కలర్టీవీలు , వడ్డీలు లేని ఋణాలు - అనుచితంగా పార్టీల వాగ్దానాలు వెఱ్ఱి జనాలకు తీపి చెఱుకు గెడలు
మారని కులతత్వ ప్రేరేపణలు, మతతత్వ ప్రచారాలు ప్రజా జీవన జిహ్వను పొక్కించే వగరు మావిళ్ళు
తమకు నచ్చిన పార్టీ రంగు కళ్ళద్దాలతో లోకాన్ని చూపించే న్యూస్ చానళ్ళు కంటిన మంటలు రేపే మిరప పళ్ళు
తీరని సమస్యలతో, తీర్చని ప్రభుత్వాలతో, తీర్చాలని లేని పార్టీలతో బతకలేని పేదవాడి గుండె రంపపు కోత చేదు వేప పూత
సినీ తారల ప్రచారాలు, సభాముఖ సవాళ్ళు, పరస్పర దూషణ భూషణలు రాజకీయ పార్టీలు వండిన అందమైన అబద్ధాలకు రుచినిచ్చే ఉప్పురాళ్ళు
స్వచ్ఛమయిన పార్టీకి పట్టం కట్టకపోతే, అభివృద్ధి - ఆరోగ్యం, విద్య - వ్యవసాయం, గ్రామ స్వరాజ్యం ఇవన్నీ ఇక అందని పుల్లని ద్రాక్ష పళ్ళు

వెఱసి మన ఎన్నికలు విగానే కంట తడి పెట్టించి సామాన్యుడి 
అన్ని కలలూ కరిగించే షడ్రుచుల  ఉగాది పచ్చడి


- వాసు

సత్యాన్వేషి

వెన్నెల వానల్లో 
వన్నెల వాగుల్లో 
నీలి మేఘాలలో 
తారా తీరాల్లో 
సాగర తీరాలలో 
సాయం సమయాల్లో 
ఆటలాడుకునే గాజు కెరటాలలో 
అందాలు వెదికే 


ఆమని పవనాల్లో
మేఘ గమనాల్లో 
హరివిల్లు జిలుగులో 
మెరుపు వెలుగులో 
అర్థాలు వెతికే 


చినుకు చిటపటలో 
చివురుటాకు  వణుకులో 
పక్షుల కిలకిలలో 
కోయిల కుహుకుహులలో 
తుమ్మెద ఝున్కారాలలో  
వీచే చిరుగాలిలో 
పసిపాప కేరింతలో 
రతికేళి నిట్టూర్పులలో 
సంగీతం వినే 


నిశబ్ద రాత్రుల్లో 
నిస్సత్తువ నీడల్లో 
విశాలమైన భవనాల్లో 
ఇరుకు గుండెల్లో 
సంపాదన పరుగులో 
సంసారం ఊబిలో 
యాంత్రిక మైన జీవనంలో 
కర్కశమవుతున్న మనసులలో  
పేరుకుపోతున్న  ఆశలతో 
పేలవమవుతున్న బంధాల్లో 


మనిషి తనం జాడలు వెదికే 
నిత్యాన్వేషిని సత్యాన్వేషిని 

త్వమేవ శరణం మమ


నిస్పృహ వాకిట్లో నిరాశ చీకట్లలో ఆశా మిణుగురు కాంతి 
చింతలజడివానలో నా కన్నీరు తుడిచే  అదృశ్య శక్తి 
నిర్వికార నిరామయ నిరంజన మూర్తి 
చెంచల మదిలో అచంచల భక్తి 
కలిగించే దివ్య  భవ్య దీప్తి 
చీకాకులలో లో చేయూత నిచ్ఛే  దివ్య స్ఫూర్తి 


సంశయాలు సుడిగుండాల్లో 
జీవన భవసాగరంలో 
ఆపన్నహస్తమై నన్ను ఆదరిస్తావు

భయం కర్కశ రక్కసి కరాళదంష్ట్రలు చూసి నేనుకేకలేసి
సంచలిస్తుంటే ఒక్కఊరుకున వచ్చినాకు ఊతమిస్తావు
గుబులులన్నీమాపి గుండె దిటవుచేస్తావు

కష్టాలలో  కన్నీటివాగులు ఉప్పొంగుతుంటే
ఆపన్నహస్తమై నన్ను ఆదరిస్తావు
ఆపాత నేస్తమై నాకు ఆశ్రయమిస్తావు

అందుకే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

పుష్ప విన్నపము

 తోటమాలి వాడకోయి 


నన్ను దేశనాయకుల స్వాగత సత్కారాల్లో 

హంగులు  డబ్బులు విరజిమ్మే పెళ్లి తోరణాల్లో 

పండుగ వాతావరణాలలో 

వాడకు నన్ను 

పూజా మండపాల్లో 

దేవతల అలంకారాల్లో 

స్వాముల బాబాల సేవలలో 

సెలెబ్రిటీల శవ పేటికలలో 

అత్తరులలో అగరత్తులలో 


తోటమాలి !  నేను కోరుకునేదొక్కటే నిన్ను 


అహర్నిశలు

మాతృభూమి రక్షణకై 

దేశప్రజల సంరక్షణకై 

నిద్రాకలలు మరచి 

సొంత ఊరు ఉన్నఇల్లు వదిలి 

తనను కన్నవాళ్ళు 

తాను కనవాళ్లను కాదనుకొని

మరఫిరంగుల చప్పుడు 

చెవిలో రింగుమంటున్నా 

కోరలుచాచిన   మృత్యువు కనపడుతున్నా 

తనవారి కన్నీళ్లు, మసిబారిన  కలలు  మస్తిష్కంలో మెదులుతున్న 

సాహసమే శ్వాసగా 

ధైర్యమే  ఊపిరిగా 

ప్రాణం తృణప్రాయంగా 

కదనభూమికి కదిలివెళ్తున్న 

వీర సిపాయిల కాలిబాటలో 

తోటమాలి ! తుంచి పారవేయి  నన్ను 

ఆ వీరుల పాదస్పర్శతో పునీతం కానీ నన్ను  


ఒక హిందీ కవితకి స్వేచ్ఛనువాదం 




ఏకాకి

 ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు 

నాడు విరిసిన స్నేహ కుసుమాలు 
బాధ తెలియని సాయం సమయాలు 
అలుపు తెలియని ధీర్ఘ ప్రయాణాలు 
లెక్కలేనన్ని అడ్డంకులను లెక్కచెయ్యని తనపు లెక్కపెట్టలేని నవ్వులు 
కష్టాలనన్నీ బాపు ఆపన్న హస్తాలు 
కన్నీరు తుడిచే ఆపాత నేస్తాలు 
మధురానుభూతులు 
తీపి క్షణాలు 
ముళ్ల బాటలలో రాళ్ళ రాదారిలో తెలియని గమ్యపు నడకలో సేద తీర్చే బాధ మరిపించే ధైర్యాన్ని పెంచే ఆనందాన్ని పంచే ప్రియ వచనాలు 
అన్నీ మూన్నాళ్ళ ముచ్చటేనా 
భవ సాగరాల ఈత ఒంటరి ఆటేనా 
జీవితం ఏకాకి బాటేనా 
ఒంటి స్వరం పాటేనా 

నాన్నకు ప్రేమతో

నాన్నా !

నాకు బాగా గుర్తు పదేళ్ల కింద నీకొక ఐఫోన్ కొని నీ కళ్ళల్లో ఆనందం చూసి నేను భలే సంతోషపడ్డాను.  అదొక చిన్న అచీవ్మెంట్ నాకు


ఫోన్ తప్ప వేరే ఆప్ వాడడం రావట్లేదు అంటే యూట్యూబ్ ఎలా వాడాలో చెప్పాను నీకు గుర్తుందో లేదో 

మెల్ల మెల్లగా నువ్వు కొత్త వెర్షన్ లకి అప్డేట్ అయ్యావు. నేను బోర్ కొట్టి  outdate అయ్యాను 
యూట్యూబ్ తో మొదలైన నీ ప్రస్థానం ఇప్పుడు విస్తరించి నీకు తెలియని అప్ లేదు వాడని ఫీచర్ లేదు 

బావుంది టెక్నాలజీ తో పాటు ముందుకు సాగడం మంచిదే 

కానీ ఏంటి నాన్న మరీ నువ్వు ఇంత అడిక్ట్ అయిపోయావ్ 

ఎప్పుడు చూసిన అది మూడవ చెయ్యిలా నీ దగ్గరే ఉంటుంది . 

ఒక టీవీ చూడవు మనుషలతో మాట్లాడవు మనవలతో ఆడుకోవు 

ఎప్పుడు చూడు యూట్యూబ్ లో పాటలు , వాట్సాప్ లో ఫార్వార్డులు . 

ఫేస్బుక్ లో షేర్లు నెట్ఫ్లిక్స్ లో సినిమాలు 

 పొరబాటున ఎవరన్నా ఊరు గురించో అడ్రస్ గురించో ప్రస్తావిస్తే 

గూగుల్ మ్యాప్స్ లో గంటల తరబడి రీసెర్చ్ చేస్తావ్. నువ్వు గమనించావో లేదో నీకు నోటి మీద ఉండే  బస్సు నుంబర్లు రూట్లు మ్యాప్స్ లో తప్ప మామూలుగా గుర్తులేవు 

పిల్లల్ని ఆడించడానికి అప్. బ్యాంకు పనికి ఆప్ . ఇన్కమ్ టాక్స్ కి , కరెంటు బిల్ కి 

అన్నిటికీ ఇంటినుంచి చేసి . మంచిదే. 

నాతో మాటాడు నాన్నా అని చెప్పినా నువ్వు  phone lone ఉంటున్నావ్ అందుకే ఇది కూడా ఆన్లైన్ లోనే పెడుతున్న 


యూట్యూబ్ కాకుండా కాలక్షేపం 

వాట్సాప్ కాకుండా కమ్యూనికేషన్ 

ఇంటర్నెట్ కాకుండా ప్రపంచం ఉందని గుర్తించు  


మన చుట్టాలు నిన్ను కలవాలంటే ఫేస్బుక్ లో వెతుకున్నటున్నారు ఫోన్ లో దొరకట్లేదని ఇంట్లో ఉండట్లేదని 

పిల్లలైతే మందలిస్తాం తోటివారైతే శాసిస్తాం నీతో  ఏం చేయగలం ఏడ్చేయ్యడం తప్ప 

అందుకే నీకిష్టమైన ఇంటర్నెట్ లో అర్థిస్తున్నాను 

మాతో మాటాడు నాన్న . మనవులతో ఆటలాడు నాన్న 

అమ్మతో కబుర్లు చెప్పు స్నేహితులను కలువు నాన్న 

టెక్నాలజీ లేని లోకంలో, స్మార్ట్ఫోన్ లేని కాలంలో కులాసాగా స్నేహితులతో తిరిగే మాతో హుషారుగా మాట్లాడే ఆటలాడే 

మా నాన్నను మాకు వెనక్కివ్వు నాన్నా !


నాన్నకు ప్రేమతో 

ఇట్లు 

నీ 'నాని' 












బేబీ

 మనసు ఊహల రెక్కల సీతాకోక చిలక

తప్పేదో ఒప్పేదో తెలియక
హద్దూ పొద్దూ ఎరుగక    
ప్రేమ పూదోటలో విహరించే మాట వినక 

బతుకొక హరివిల్లు  
ప్రాయమొక విరిజల్లు 
అని మురిసి కన్న కలలు 
క్షణంలో చెదరెను ఆశల బొమ్మరిల్లు 
వదిలిపోయెను వెతల తీపి ఆనవాళ్లు 
మిగిలిపోయెను గుండెలో జ్ఞాపాకాల ముళ్ళు 

ఐనా 
కొన్ని బాధలు మరువకపొతేనే 
కొన్ని గాయాలు  మానకపోతేనే 
బావుంటుందేమో