Monday, April 8, 2024

ఎన్నికల ఉగాది పచ్చడి

 

విసిరేసి శిశిరాన్ని ముసిరేసిన వసంతానికి మురిసిపోతూ అడుగిడింది 
 క్రోధి ఈ ఉగాది ఉదయాన  
శశిలేని నిశిలో దిశలేమీ తెలయక, పయనం ప్రగతి వెలుగు రేఖుల వైపో ; మరింత చీకటి రేపో  అలజడి జనాల హృదయాన
మసి బారిన జీవితాలలో చిరు నవ్వులు చిందుతాయని గుప్పెడు ఆశ గంపెడు నిరాశ ఎన్నికల భయాన

ఉచితంగా కలర్టీవీలు , వడ్డీలు లేని ఋణాలు - అనుచితంగా పార్టీల వాగ్దానాలు వెఱ్ఱి జనాలకు తీపి చెఱుకు గెడలు
మారని కులతత్వ ప్రేరేపణలు, మతతత్వ ప్రచారాలు ప్రజా జీవన జిహ్వను పొక్కించే వగరు మావిళ్ళు
తమకు నచ్చిన పార్టీ రంగు కళ్ళద్దాలతో లోకాన్ని చూపించే న్యూస్ చానళ్ళు కంటిన మంటలు రేపే మిరప పళ్ళు
తీరని సమస్యలతో, తీర్చని ప్రభుత్వాలతో, తీర్చాలని లేని పార్టీలతో బతకలేని పేదవాడి గుండె రంపపు కోత చేదు వేప పూత
సినీ తారల ప్రచారాలు, సభాముఖ సవాళ్ళు, పరస్పర దూషణ భూషణలు రాజకీయ పార్టీలు వండిన అందమైన అబద్ధాలకు రుచినిచ్చే ఉప్పురాళ్ళు
స్వచ్ఛమయిన పార్టీకి పట్టం కట్టకపోతే, అభివృద్ధి - ఆరోగ్యం, విద్య - వ్యవసాయం, గ్రామ స్వరాజ్యం ఇవన్నీ ఇక అందని పుల్లని ద్రాక్ష పళ్ళు

వెఱసి మన ఎన్నికలు విగానే కంట తడి పెట్టించి సామాన్యుడి 
అన్ని కలలూ కరిగించే షడ్రుచుల  ఉగాది పచ్చడి


- వాసు

No comments:

Post a Comment