ఈ యాత్ర మొదటి భాగం ఇక్కడ.
మూడు ముప్పులూ, ఆరు తప్పులతో వేగాస్ కి మా ప్రాయాణం మొదలైంది.
లేట్ గా ఎక్కావేమో ఆఖరు సీట్లు వచ్చాయి ( ఇంకో నిమిషం ఆలస్యమయితే నిల్చుని ప్రయాణం చేయాల్సి వచ్చేదేమో). బ్యాగ్లు సర్దుకుని , అనౌన్స్మెంట్ అయ్యాక, ఫోన్ ఆఫ్ చేసి, జూస్ తాగి, గ్లాస్ ఇచ్చేసే లోపు వేగాస్ ఎయిర్ పోర్ట్ వచ్చేసింది. దిగీ దిగగానే, ఎయిర్ పోర్ట్ లోనే వేగాస్ వాసనలు (కేసినో లు, కాక్టైల్లు) కొట్టొచ్చినట్టు కనిపించాయి. కార్ రెంట్ చేస్తే దగ్గర్లో ఉన్న హోవర్ డ్యాం చూడచ్చని, కార్ రెంట్ చేద్దామని వెళ్ళాము. అది జూలై 4th వీకెండ్ ఏమో తెగ జనం . కార్ రెంట్ చేసే సరికే మధ్యాహ్నం ఐపోయింది. అక్కడ్నించీ, పని చేయని జి పి ఎస్, ఛార్జ్ అయిపోయిన ఐ ఫోన్ తో, ముందు రోజు రాత్రి లేని నిద్రతో, ఉదయం నుండి తిండి లేక ఆకలితో, భీభత్సమైన ట్రాఫిక్ లో ఎడారి ఎండలో (వేగాస్ డిసర్ట్ లో ఉంది) ౩ ఇంటికి హోటల్ చేరుకున్నాం. అసలే చిర్రెత్తి ఉన్న మాకు ఆ హోటల్ రిసెప్షనిస్టు మా రిజర్వేషన్ సిస్టం లో కనపడట్లేదని వళ్ళు మండే సమాచారం చెప్పింది. ఆ రిసెప్షనిస్టు అంత అందంగా ఉండకపోయినా, తప్పు మాది కాకపోయినా, లాగి రెండు పీకే వాడినేమో. చేసేదిలేక పక్కనున్న హోటల్ లో రూమ్స్ తీసుకుని ఎంగిలి పడడానికి బయల్దేరాం. కాలే కడుపుకి మండే బూదిదలాగా ఏదో కాస్త తిని, రూం కెళ్ళి తన్నిపెట్టి పడుకున్నాం. ముందు రెండు రోజులు సరిగ్గా నిద్రలేదేమో, లేచేసరికి అయిదైంది టైం. ఆ రోజు బానే తిని తిరిగి సాఫీ గా గడిచిపోయింది.
మేము వెళ్ళింది మాంచి ఎండలో. ఎంత వేడి అంటే, పోయ్యలేకుండా పప్పు ఉడికించవచ్చు . మేము మొదటిసారేమో వెళ్ళడం, తెలియక వేగాస్ డౌన్ టౌన్ లో హోటల్ తీసుకున్నాం. అక్కడ్నించి స్ట్రిప్ ఒక రెండు మైల్లే అయినా వెళ్ళడానికి ముప్పావు గంట దాకా పట్టేది. ఆ రోజు బెల్లాజియో లో ఎక్కువ సేపు గడిపాము ప్రశాంతంగా . మా ప్రకృతికి విరుద్ధంగా మిగిలన రోజంతా అన్నీ సాఫీ గా సాగిపోతున్నాయి, మంచి రోజులు మళ్ళీ వచ్చాయా ఏంటి, కొత్త కొత్తగా ఉన్నది అని కేసినో లో ఆట ఆడుతూ పాట పాడుతుంటే నేను కొంత గెలిచాను బ్లాక్ జాక్ లో. (పోయిన బోలెడు ఆటలకన్నా గెలిచినది ఒకటీ గుర్తుండిపోతుంది కదా) . నేను పరిగెత్తు కుంటూ, లక్కీ 7 దగ్గర నీరసం గా ఉన్న నా శ్రీమతి దగ్గరికెళ్ళి డార్లింగ్ పది డాలర్లు వచ్చాయి అనగానే, పర్సు పోయింది అని నీరసంగా చెప్పింది. తీర్థం లా ఉండే ఆ జనం, దొరకడం అసాధ్యం అని తెలిసినా ఆశ చావక లంచ్ చేసిన బెల్లాజియో కెళ్ళి వెతికి, రిపోర్ట్ చేసి వచ్చేసాం. మామూలుగా ఐతే ఇక్కడ (అమెరికా లో ) పర్సు పోయినా పెద్ద విషయం కాదు అన్నీ కార్డ్సే కాబట్టి కాన్సుల్ చెయ్యచ్చు. కానీ అందులో ఒక ఖరీదయిన గిఫ్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి. పోనీ సొమ్ము పోయిందని ఊరకున్నా, ఆ డ్రైవర్స్ లై సెన్స్ లేకుండా తిరుగు ప్రయాణం అనుమానమే. కాల్ చేసి కనుక్కుంటే ఏదో ఒక ఐడి ఉండాలని చెప్పారు . మా దగ్గరా ఇంకోటి లేదు. సర్లే ప్రయత్నిద్దాం. లేకపోతె డ్రైవ్ చేద్దాం అని నిర్ణయించుకున్నాం (సంతోషం ఏంటంటే మేము ఈస్ట్ కోస్ట్ లో లేము ).
మిగతా రెండు రోజులూ హాయిగానే గడిచిపోయాయి. మేము ఒకటి మాత్రం నిర్ణయించుకున్నాం. ఇంకెప్పుడూ వేగాస్ కి వెళ్ళకూడదు అని, వేసవి లో. ఇంచుమించు మూడు రోజులూ 110 F ఉంది . బయటకొస్తే మసే. ఎక్కువ సేపు ఆ స్ట్రిప్ మీద హోటల్లలోనే ఉండేవాళ్ళం. షో స్ అన్నీ బానే చూసాం. బెల్లాజియో, వెనిస్ హోటల్లు చాలా బావున్నాయి. మేము విన్ లాస్ వేగాస్ లో "లే రెవ్" షో కెళ్ళాం. ఎక్కువ మంది బెల్లాజియో లో "ఓ" షో కి వెళ్తారుట. షో బావుంది చాలా. వేరే ప్రపంచానికి తీసుకెళ్ళినట్టు ఉంది లైటింగ్, ఎఫ్ఫెక్ట్స్ , సంగీతం తో. కథ, వాళ్ళ బాధ అర్థం ఐతే ఇంకా బావుండేది అనిపించింది. నాకు అన్నిటికంటే దేదీప్యామానమయిన వేగాస్ రాత్రిలో బెల్లాజియో ఫౌంటైన్ ని ఈఫిల్ టవర్ మీద నుంచి చూడడం అద్భుతమైన అనుభూతి. అదీ మేము ఆఖరు చూసినది అదే .
మేము పూటకొక సారి పర్స్ పారేసుకున్న హోటల్ కి కాల్ చేసేవాళ్ళం, నేను నీళ్ళు వదిలేసినా నా శ్రీమతి పట్టుపట్టడం వల్ల. అదే క్రమం లో ఒకసారి ఆ హోటల్ కెళ్ళి అడిగాం. అక్కడ రిసెప్షనిస్ట్ శ్రియ గోశల్ ఇళయరాజా సంగీతం లో పాట పాడినట్టు ఒక తియ్యని వార్త చెప్పింది. పర్స్ చేతికిచ్చింది. శతం తక్కువగా అన్నీ ఉన్నాయి. హమ్మయ్య అనుకుని ఆ రోజు మా స్నేహితులకి ఓ చిన్న పార్టీ ఇచ్చాం కూడా. ఇక ఫ్లైట్ ప్రయాణానికి దోకా లేదని .
మర్నాడు ఉదయం మా తిరుగు ప్రయాణం. ఈ సారి చాలా జాగ్రత్తగా ఏడింటి ఫ్లైట్ కి ఉదయం అయిదింటికే బయల్దేరాం. ఎయిర్ పోర్ట్ కెళ్ళే దారిలో ఒకసారి దారి తప్పినా సద్దుకుని, మొత్తానికి చేరుకున్నాం. ఎయిర్ పోర్ట్ కి shuttle పట్టుకునేటప్పుడు ఊరికే ఒకసారి టికెట్స్ చూసుకున్నాం. దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఫ్లైట్ 6:30 కి (వేగాస్ కి వచ్చేటప్పుడు ఫ్లైట్ టైమింగ్ వెళ్ళేటప్పుడు టైమింగ్ గా పొరబడ్డాము అలవాటులో ). Shuttle దిగి పరుగో పరుగు ఫ్లైట్ కౌంటర్ కి. ఆలస్యమయినా కిందా మీద పెట్టి మొత్తానికి బోర్డింగ్ పాస్ లు ఇచ్చింది అక్కడున్న పెద్దావిడ. ఆ పైన మా అదృష్టానికి తగ్గట్టు చెక్ ఇన్ దగ్గర బ్లాక్ ఫ్రైడే కి electronics కొట్ల దగ్గర ఉండేంత క్యూ. అది త్వరగానే అయిపోయినా, అక్కడనించీ రెండు టెర్మినల్ ల అవతల మా ఫ్లైట్. ట్రాం పట్టుకున్నాం కానీ మా స్నేహితులు వెనక ఉండి పోయారు. సర్లే మనం వెళ్లి ముందు అక్కడ ఫ్లైట్ ఆపుదాం అని వెళ్ళిపోయాం. అక్కడ బోఅర్దింగ్ దగ్గర ఎయిర్ లైన్స్ ఉద్యోగి మా కంటే కంగారుగా ఉన్నాడు. అప్పటికే మిగతా బోర్డింగ్ అయిపొయింది. కేవలం ఒక 5 నిమిషాలు చూద్దామని ఆగాడు. మా స్నేహితులు ఇంకా రాలేదు. నిమిషానికో సారి కంగారు పెట్టేవాడు వస్తున్నారా అని . మొత్తానికి ఇంకా సరిగ్గా బోర్డింగ్ ఆపేసి తలుపు మూసేయ్యబోతుండగా మా వాళ్ళు వచ్చారు. మా దగ్గర ఉన్న బ్యాగ్ లు గేటు చెక్ చేసాడు (అవి క్యారీ ఆన్ లు మా దగ్గర ఉండాల్సినవి). ఏది అయితే అది అయింది అని దొరికిన ఆఖరు సీట్లలో కూర్చున్నాం. బెల్టు పెట్టుకుని హమ్మయ్యా అనుకుని, ఫ్లైట్ ఎప్పుడు కదులుతుందా అని వేచి ఉన్నాం. ఇంతలో పరుగు పరుగున వచ్చాడు ఆ కంగారు మనిషి (మమ్మల్ని ఎక్కించిన వాడు ). మా నలుగురుని దిగమన్నాడు. ఇదేం గొడవరా బాబు అనుకున్నాం. బోర్డింగ్ పాస్ లు ఇచ్చిన మహా తల్లి మమ్మల్ని వెయిటింగ్ లిస్టు లో పెట్టిందిట. మమ్మల్ని వేరే నలుగురు అనుకుని ఈ తికమక మనిషి ఎక్కిన్చేసాడు. వాడిని తిట్టడానికి నా దగ్గరున్నవి కాదు కదా పూరీ జగన్నాథ్ గారు సినిమాలలో వాడే బండ బూతులన్నీ కూడా సరిపోవు. మా తప్పు కూడా ఉంది కాబట్టి వాడిని విసుక్కోవడం తప్ప ఏం చెయ్యలేకపోయాం. వాడు వేరే ఫ్లైట్ కి పాస్ లు ఇచ్చి, బ్యాగ్లు దిగేచోట చోట తీసుకోవచ్చని చెప్పాడు. అవి వేరే ఫ్లైట్ లో ఉన్నాయి కదా అని చాలా సార్లు అడిగినా వాడు ఏం ఫర్లేదు మై హూ నా వచ్చేస్తాయని భరోసా ఇచ్చాడు. సర్లే ఇంకా చేసేదేముంది అని ఫ్లైట్ ఎక్కి బెల్టు పెట్టుకుని కూర్చున్నాం. ఇంతలో మళ్ళీ దింపే శారు, మాతో పాటు అందరినీ. కంగారు పడకండి మా ఊరు వచ్చేసింది (అరగంటే ప్రయాణం ).
బే ఏరియా హాయి వాతావరణం లో చల్ల గాలి పీల్చుకోడానికి తహతహ లాడుతూ లగేజీ తీసుకుందామని వెళ్లాం. ఏదో అవకతవక వల్ల మా బ్యాగ్లు రాలేదని, ఎక్కడో మెక్సికో కి వెళ్లి పోయాయని చెప్పింది అక్కడ ఓ పొగరు బోతు. అప్పుడే నా శ్రీమతి ఒక తాజా వార్త చెప్పింది. తన బంగారు వస్తువులు కొన్ని క్యారీ ఆన్ కదా అని ఆ బ్యాగ్ లో పెట్టానని. మూల్గే నక్క మీద తాటిపండు సామెత కి అర్థం అప్పుడు తెలిసింది నాకు. ఆగ్రహం లో రాజశేఖర్ అంత కోపం, పుర్సూట్ అఫ్ హ్యాపీ నెస్ లో విల్ స్మిత్ అంత బాధ, నిస్సహాయత కలిపి వచ్చాయి. కానీ ఏం చెయ్యను, ఒక కంప్లైంట్ రాసి ఇంటికి బయల్దేరాం.విచిత్రం ఏంటంటే మా స్నేహితుల లగేజీ వచ్చేసింది అందరం ఒకేసారి గేటు చెక్ చేసినా.
ఇక ఎయిర్లైన్స్ వాడు రోజుకొక కథ చెప్పేవాడు ఒకసారి మెక్సికో కి వెళ్లిందని , ఒకసారి మిన్నెసోటా అని, ఒక సారి కరీబియన్ అని. వారమయినా బ్యాగ్స్ రాలేదు. ఇక క్లైం చెయ్యడానికో ఉత్తరం కూడా పంపాను. ఆరోజే ఒక దేవదూత మా ఇంటికి వచ్చాడు. భక్తా విచారించకు. నిన్న పోయింది అనుకున్నది నేడు దొరకచ్చు అని చెప్పి ఒక రెండు బ్యాగ్లు చేతిలో పెట్టాడు. బ్యాగ్ లో అన్నీ ఉన్నాయో లేదో చూసి ఆయనకీ దండం పెడదామని వెనక్కి తిరిగాను. ఆయన కంటికి దూరంగా గాలిలో అదృశ్యం అయిపోయాడు.
ఆ సమయం లో అతి కష్టం మీద ఆయన వస్త్రం మీద అస్పష్టంగా మూడు అక్షరాలూ కనపడ్డాయి. U P S అని
---------------------------------------------------- శుభం -- --------------------------------------------------------------
Wednesday, December 23, 2009
Tuesday, December 22, 2009
షిండ్లర్స్ లిస్ట్ - నా అనుభవం
నేను తొమ్మిదవ తరగతి లో ఉన్నప్పుడు అనుకుంటా, మా సోషల్ టీచర్ సెకండ్ వరల్డ్ వార్, హిట్లర్ గురించి చెబుతూ, వీటి మీద షిండ్లర్స్ లిస్టు అనే అద్భుతమయిన సినిమా ఉంది స్పీల్బర్గ్ (జుర్రాసిక్ పార్క్ పుణ్యమా అని ఆయన పేరు విన్నా అప్పటికి). దాంట్లో హిట్లర్ చేసిన అరాచకం గురించి బాగా చెప్తాడు అని చెప్పినట్టు చూచాయి గా గుర్తుంది. ఎన్నో సార్లు చూద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మొత్తానికి ఆ శుభ తరుణం నిన్న ఆసన్న మయినది.
ఆంగ్ల సినిమాలు చూసే వారు ఇది మిస్ అయ్యి ఉండరు. కానీ అయి ఉంటే వెంటనే అద్దెకో, డౌన్లోడ్ చేసో, ఆఖరికి కొని అయినా చూడాల్సిన సినిమా.
కథ - రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల అరాచకత్వానికి దారుణంగా బలి అవుతున్న జూస్ తో ఒక పరిశ్రమను ప్రారంబించి (మొదట్లో కేవలం లాభాల కోసమే) మెల్లగా వాళ్ళని ఆదుకునే నాథుడుగా ఎదిగిన షిండ్లర్ కథ. ఒక పక్క నాజీల అరాచాకత్వాన్ని, ఉన్మాదాన్ని, జూస్ నిస్సహాయతని, షిండ్లర్ మానవత్వాన్ని అత్యద్భుతంగా చిత్రకరించాడు స్పీల్బర్గ్.
చూస్తున్నంత సేపు ఆ సమయంలో మనమక్కడ ఉన్నట్టే, ఆ అమానుషం మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉంటుంది. ఒకసారి బాధతో కళ్ళల్లో నీళ్ళు తిరిగితే, ఒకసారి కోపంతో గుండె రగిలిపోతుంది. ఒకసారి జాలితో గుండె కరిగిపోతే, ఒకసారి మానవత్వానికి ఉప్పొంగిపోతుంది.సినిమా మొత్తం హిట్లర్ ని, జూస్ ని ఊచకోత కోసిన నాజీలని బతుకుంటే వెంటనే గొంతు నులుమి చంపెయ్యలనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను చూసిన, విన్న చరిత్రలో ఇంత దారుణంగా, ఎందుకు చంపుతున్నారో కూడా తెలియకుండా ఇన్ని లక్షల మందిని చంపిన ఉదంతం లేదు. అన్నిటికంటే బాధపెట్టినవి రెండు ప్రశ్నలు , ఇంత జరుగుతుంటే, ప్రపంచమంతా చూస్తూ ఎలా ఊరుకుంది. ఇంత దారుణాన్ని ఆరేళ్ళు ఎలా ఉపేక్షించింది. ఇంత చేసినా బరిస్తూ ఎందుకు ఉన్నారు జూస్, కనీసం కొంత మంది అయినా ఎందుకు తిరగబడలేదు (అలా తిరగ బడ్డట్టు నేను ఎక్కడ చదవలేదు).
నన్ను కలిచివేసిన, నా గుండెలు బరువెక్కిన, నన్నింకా haunt చేస్తున్న కొన్ని సీన్లు ఈ సినిమాలో..
- పోలాండ్ (క్రకవ్) జూస్ అందరినీ కలిపి ఒక చిన్నపాటి ప్రదేశంలో (ఘెట్టో లంటారు) పడేస్తారు నాజీలు. అక్కడ నించీ వారి చేత రకరకాల పనులు చేయిస్తూ ఉంటారు. ఒక సరి ఏదో ఒక నిర్మాణం జరుగుతూ ఉంటే ఒక జూ సివిల్ ఇంజనీర్ (స్త్రీ) వచ్చి నాజి కమాండర్ (అమాన్) తో అలా కడితే ఇది పడిపోతుంది. మళ్ళీ ఫౌండేషన్ వేసి కట్టాలి అని చెప్తుంది. అన్నీ కనుక్కుని అమాన్ ఆమెని కల్చేయ్యమంటాడు. ఆ స్త్రీ నేనేం తప్పు చేసాను, ఇది నా పని అంటే, అమాన్ ఆమెని షూట్ చేసి ఇది నా పని అంటాడు.
- అమాన్ పొద్దున్నే లేచి బాల్కనీ లోకి వచ్చి వొళ్ళు విరుచుకుంటాడు. సిగరెట్ వెలిగిస్తాడు. ఘెట్టో దగ్గర చాలా మంది జూస్ పని చేస్తుంటారు. కూర్చుని ఉన్న ఇద్దరు జూస్ ని షూట్ చేస్తాడు. లోపలి వచ్చి మూత్ర విసర్జన చేస్తూ పెళ్ళాం ని కాఫీ నువ్వే పెట్టు అంటాడు. నాజీలు జూస్ ని చంపడం వారి దినచర్య లో ఎంత సర్వ సాధారనమో, వాళ్ళకి ఇది ఎంత తేలికో ఇంత కంటే బాగా ఎవరు చెప్పగలరు.
- షిండ్లర్ హెలెన్ అనే జూ (నాజీ కమాండర్ అమాన్ కి సేవకురాలు ) స్త్రీని ఓదారుస్తూ ఉంటాడు అమాన్ ఆమెని చంపడని. దానికి ఆమె "నాకు నమ్మకం లేదు. ఈ రోజు మేము చూస్తుండగా దారిన పోతున్న ఒకామెని గొంతులో షూట్ చేసాడు. ఆమె మిగతా వారికంటే మెల్లాగా వెళ్ళట్లేదు, తొందరగా వెళ్ళట్లేదు, ఆమె సన్నగా లేదు లావుగానూ లేదు. ఆమె చేసిందేమీ లేదు అలా వెళ్తోంది. అమాన్ నేను ఇవి పాటిస్తే చంపడు అనుకోడానికి లేదు" అని నిస్సహాయంగా వాపోతుంది.
- కొత్తగా వర్కర్స్ వేరే దేశాల నించీ వచ్చినప్పుడు, నాజీలకి తోచినప్పుడు, కొందరి జూస్ ని ఏరి (కూరలు, రాళ్ళూ, రప్పలు లాగ ) ట్రైన్లలో తీసుకెళ్ళి సెల్లలో సామూహికంగా చంపేస్తుంటారు నాజీలు (కొందరికి విషవాయువులు ఇచ్చి, కొందరిని కాల్చేసి, కొందరి మీద ప్రాణాంతక పరీక్షలు చేసి). అలా తీసుకెళ్ళే వాళ్ళని గూడ్స్ బండి లాటి దాంట్లో (గాలాడడానికి పెట్టె మొత్తానికి ఒక చిన్న కిటికీ ఉంటుంది) పంపుతూ ఉంటారు. ఆ పెట్టెలలో గాలాడక, దాహంతో ప్రాణాలు పోయేడట్టు ఉంటుంది లోపల ఇరుక్కుని నించున్న జూస్కి . అప్పుడు షిండ్లర్ నాజీ కమాండర్ లతో మాట్లాడి, ఫైర్ హోస్ తో పెట్టలకి నీళ్ళు కొట్టిస్తాడు. ఆ కిటికీలలో నించీ, రూఫ్ నించీ కారే నీళ్ళతో ఎండిన గొంతులు తడుపు కుంటారు జూస్.
- సినిమా అంతా బ్లాకు అండ్ వైట్. కానీ కొన్ని సన్నివేశాలలో ఒక పాప డ్రెస్ ని మాత్రం ఎరుపు లో చూపిస్తారు. ఎందుకో అర్థం కాలేదు. ఈ పాప బ్రతుకుందేమో అనుకున్నాను.అలా చిన్న ఆశ కలుగుతుంది . చివరికి ఆ ఆశ కూడా నిరాశే అని తేలుతుంది. అక్కడున్న జూస్ బతుకుతామని ఆశ పడడం వృధా అని నొక్కి చెప్తుంది.
- ఇక గుండెలు పిండేసే క్లైమాక్స్. కిందామీదా నానా తంటాలు పడి, అతి కష్టం మీద తనకున్నదంతా వెచ్చించి ఒక పదకుండు వందల యాభై మంది జూస్ ని కాపాడతాడు షిండ్లర్. వారికి ఏడు నెలలు పాటు తల దాచుకోడానికి చోటివ్వడానికే తన పుట్టినూరులో ఫ్యాక్టరీని పెడతాడు. చివరికి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి, సోవియట్ రష్యా చేతిలో నాజీలు ఓడిపోతారు. అప్పుడు ఈ జూస్ (షిండ్లర్ కాపాడిన జూస్ ) కి విముక్తి కలుగుతుంది. నాజి పార్టీ వారిని అర్రెస్ట్ చేస్తారు. ఇతను నాజీ పార్టీ వదవ్వడం వల్ల దేశం వదిలి వెళ్ళే షిండ్లర్ ని జూస్ అందరూ సాగానంప వస్తారు. వాళ్ళని చూసి నేను ఇంకా కొంత మందిని కాపాడుండ వలసింది. కపాదగాలిగీ కాపడలేదు. బోలెడు డబ్బు వృధా చేసాను. ఈ కార్ ఎందుకు - ఇది ఒక ఇంకో పడి మందిని కపాడేదేమో, ఈ బంగారపు బ్యాడ్జు ఎందుకు ఇది ఇంకో ఒక్కరినైనా కపాడేదేమో అని చాలా బాధపడతాడు. అక్కడ అప్రయత్నంగా గుండె కరిగి గొంతులోకి వచ్చేస్తుంది ప్రేక్షకులకి (నాకైతే జరిగింది)
P.S.
- ఈ సినిమాకి స్పీల్బర్గ్ ఒక్క డాలర్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు
- సినిమా అంతా నాజీల అరాచకం గురించి అయినా, ఎక్కడా హిట్లర్ కనపడడు, అతని గొంతు వినపడదు.
- ఈ మధ్య నేను చూసిన హోటల్ రవాండా కూడా ఇలాటి మారణహోమాన్ని, అందులో ఒక సామాన్యుడు పరిస్తుతలని బట్టి, కొన్ని వందల మంది జనాల పాలిట రియల్ హీరోగా ఎలా పరిణత చెందుతాడో చూపెడుతుంది. దారుణ మరణ హోమాన్ని కళ్ళకు కట్టినట్టు చూపెడుతూనే, ఆ ప్రతికూల పరిస్థితులని పోరాడే మానవత్వాన్ని, ఆశావాదాన్ని చాటుతుంది.
Sunday, December 20, 2009
అవతార్ - పెద్ద గొప్ప సినిమా కాదు - నాకు నచ్చనివి
జేమ్స్ కామెరూన్, భారీ బడ్జెట్, కొత్త టెక్నాలజీ , ఆరు నెలల ముందు నించి ఇచ్చిన హైప్ ఇవన్నీ చూసి చాలా అనుకున్నా ఈ సినిమా గురించి. రివ్యూలు కూడా కొంచం పాజిటివ్ గ ఉండే సరికి, ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహ లాడాను. IMAX లో అదీ 3D లో చూడాలని రెండు రోజులు ముందు బుక్ చేసి టికెట్లు, గంట డ్రైవ్ చేసి, రెండు గంటలు లైన్ లో వెయిట్ చేసి (మంచి సీట్ల కోసం) చాలా ఆత్రంగా ఈ సినిమాకి వెళ్లాను.
సినిమా నేను అనుకున్నంత కాకపోయినా బానే ఉంటే ఇంత గోల పెట్టేవాడిని కాను. సినిమాకి ఇచ్చిన హైప్ కి, నేను చూడడానికి వెచ్చించిన సమయానికి, టికెట్కుకు పెట్టిన వెలకి (19$) సినిమా న్యాయం చెయ్యలేదని నిస్సంకోచంగా చెప్పగలను. అలాని సినిమా అసల బావోలేదు అని అనను. కామెరూన్ ఊహా శక్తికి, కార్యాచరణకి, సృష్టించిన కొత్త ప్రపంచానికి సలాం కొట్టాలి.
ఇక నాన్చకుండా నాకు నచ్చనివి చెప్పేస్తా. ఇవి మరీ చిన్న విషయాలు అనిపించవచ్చు కొందరికి. కానీ నాకు మాత్రం సినిమాలో ఏదో వెలితి, అవి వీటి వల్లనేమో అనిపించింది.
- సినిమా ఇంట్రడక్షన్, మొదటి సీన్లు పేలవంగా ఉన్నాయి . నేనింకా సినిమా మొదలు కాలేదు అనుకున్నా ఆ సీన్లు అయ్యేవరకు. హీరో వాయిస్ narration కి అసల సూట్ కాలేదు.
- హీరో అసల నచ్చలేదు. ఎనర్జీ లేదు, నటన అంతంత మాత్రం. ఎంత అవతార్ నే ముఖ్యంగా చూపించినా, ఇతను ఉన్న సీన్లలో ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లా ఉన్నాడు
- కొంత మంది నావి లు (నెయ్తిరి ముఖ్యంగా ) మొదటి సీన్ నుండే ఆంగ్లంలో మాట్లాడతారు . ఆ మాత్రం దానికి నావి భాష మాట్లాడినట్టు చూపెట్టడం ఎందుకు ఇంక.
- ఎమోషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళ బాధ మనకి బాధ కలిగించేడట్టు చూపించలేక పోయాడని పించింది (ఒకటి రెండు సీన్లు మినహా)
- మంచి ఇంగ్లీష్ సినిమా అంటే నా వరకు నాకు, సినిమా అయిపోయినా బుర్రలో తిరుగుతూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. (It should haunt me). అలా ఉంటుంది అనుకున్నా కానీ అసల లేదు. చూసి రెండు గంటలైంది. ఒక్క సీన్ కూడా స్ఫురణ కి రావట్లేదు విషువల్గా.
- పండోర లో చాలా భాగం లార్డ్ అఫ్ ది రింగ్స్ లో చూసినట్టు అనిపించింది. దాని వల్ల ఒక కొత్త ప్రపంచాన్ని చూసే ఆనందం పూర్తిగా పొందలేదు.
- 3D ని పెద్దగా వాడుకున్నట్టు అనిపించలేదు. ఉదాహరణకి ఫైనల్ డెస్టినేషన్ లో ఇంకా బాగా వాడుకున్నాడు ౩D ని. యాక్షన్ లో మనం అక్కడున్న ఫీలింగ్ కలగలేదు.
- ఉన్నవి రెండో మూడో యాక్షన్ సీక్వెన్స్ లు అవి కూడా వాళ్ళు గగురు పోడిచేడట్టు ఏం లేవు. ఆ విధంగా కూడా నిరుత్సాహ పరిచింది.
- కామెరూన్ గారు అంత ఖర్చెందుకు పెట్టారు అన్న విషయం (అని అడగాలని ఉన్నా) పక్కన పెట్టినా, నా టికెట్ కి పైసా వసూల్ మాత్రం కాలేదు.
- ముఖ్యం గా జనాలు చెప్పినంత ఏం లేదు సినిమాలో. నేను రామ్ గోపాల్ వర్మ టపా చూసి అసల తెగ ఊహించుకున్నా సినిమాని. అంత లేదు. నాకు దీని కంటే ఈ ఏడాది వచ్చిన అప్, 2012 (ఇల్లోజికాల్ అయినా ) ఎక్కువ నచ్చింది.
Subscribe to:
Posts (Atom)