Monday, August 19, 2013

కొక్కురు వానచినుకులు






నిశి మిత్రమా నీతో మళ్లీ మాట్లాడాలని వచ్చా
ఒక్క అందమైన స్వప్నం మెల్లగా నా మనసు మీద తన పాద ముద్రలు వేసి చీకట్లోకి జారుకుంది
పాద ముద్రలింకా మౌన రాగంలో పదిలంగా ఉన్నాయి నా మనసులో

మధన పడు ఆ స్వప్నాల్లో
నేను ఒంటరిగా ఇరుకు సందులలో
ఉరకలేస్తున్నాను వీధి దీపాల వెలుగులో
చిక్కగా కురుస్తున్న చీకటిలో 
మంచు పడిన వాకిట్లో 
చలికి చెవులను కప్పుకుంటుంటే
రాతిరిని చీల్చే తొలి వేకువ రేఖలు
కళ్ళను తట్టి ఈ మౌనమేంటి అని  ప్రశ్నించాయి

వెలుతురులో వేల  మందిని చూశాను
మాట్లాడుతున్నారు కాని ఏం చెప్పట్లేదు
వింటున్నారు కానీ అర్థం చేసుకోవట్లేదు
పాటలు రాస్తున్నారు కానీ పాడి వినిపించట్లేదు
ఎందుకంటే ఎవరికీ మౌనాన్ని భంగపరిచే ధైర్యం లేదు

మూర్ఖులారా నా మాట వినండి 
మౌనం వ్యాధిలా సోకుతోంది 
చాచిన నా చేతులు అందుకోండి
నాతో చేయి కలపండి అన్నాను కానీ
నా మాటలు కొక్కురు వాన చినుకుల్లా కురిసి కిక్కిరిసిన రాతిరి లో కలిసాయి  

కొందరు కనపడని దేవుడిని వెతుకుతున్నారు
కొందరు కనపడిన రాయిని దేవుడని మొక్కుతున్నారు
కొందరు మనిషిగా ఎదిగిన వాడినల్లా దేవుడిని చేసేస్తున్నారు
పచ్చి నిజాన్ని భరించలేక పిచ్చి 'ఇజా'లని పట్టుకు వేలాడుతున్నారు
తీర్థాన్ని వదిలేసి శంఖం కోసం వెంపర్లాడుతున్నారు
అందుకే నా మాటలు కొక్కురు మంచు తునకల్లా కురిసి కిక్కిరిసిన రాతిరి లో కలిసాయి

P.S.ఒక ప్రసిద్ధ ఆంగ్ల గీతానికి (బహుశా) ఒక పేలవమైన స్వేచ్ఛానువాదం .

P.S 2: కొక్కురు (నిశ్శబ్దం) అనే దేశ్య పదానికి విశేషణ పదం ఏదన్నా ఉందా ? నే వాడినట్టు కొక్కురునే   విశేషణ పదం కింద వాడచ్చా 


P.S 3: నిశ్శబ్ద వాన చినుకులు రాక్షస సమాసం కదా ?





Tuesday, August 6, 2013

నిశివర్నోదకం

      ట నైమిశారణ్యములో కొలువు తీరిన సూతునికి శౌనకాదిమహర్షులు సకల మర్యాదలు చేసి యిట్లడిగిరి. "ఓ పౌరాణిక శేఖరా ! మానవుల దుఃఖము రోజు రోజుకీ  పెరిగి పోతున్నది. వారి పరిస్థితి చూడనలవి కాకున్నది . అంతకంతకీ వారి జీవితం దుర్భరం అవుతున్నది. మోక్షం మీద మోజు ఎపుడో పోయింది. పూజలు,వ్రతాలు, హోమాలు , యజ్ఞాలు మొదలగు వాటిని - చేసి మర్చిపోయే ఫిక్స్డ్ డిపాసిట్ లా వదిలెయ్యకుండా, చేసినప్పటి నించీ ఎప్పుడు రిటర్న్ వస్తుందా అని చూసుకునే స్టాక్ లా తయారుచేసేసారు. భగవంతుడి మీద కంటే వరాల మీద దృష్టి ఎక్కువైపోయింది. వీళ్ళకి ఎప్పుడో వచ్చే మోక్షం మీద నమ్మకం పోయింది. అశాశ్వతం అయినా పర్లేదు సూక్ష్మం లో వీళ్ళ బాధ తీర్చే మార్గమే లేదా. సంపద ఉన్నవాడూ లేనివాడూ  ఏడ్చే వాడే. వీళ్ళ ఏడుపు మొహాలు చూడలేకపోతున్నాం. ఏదన్నా మార్గముంటే చెప్పు స్వామీ!" అని ప్రాధేయ పడ్డారు  

         
సూతుడు చిరు మందహాసంతో "ఋషివరేణ్యులారా! మీ స్వాగత సత్కారాలకి సంతోషం. మానవుడి బాధ ఇప్పటిది కాదు. ఎప్పటి నించో ఉన్నది. ఎప్పుడూ ఉండేది. "ఇది నాది" అనేది ఈ బాధకు మూల బీజం. అది మానవ నైజం. "అది" నిజం కాదు అనేది తెలుసుకున్నవాడు జ్ఞ్యాని. ఆ జ్ఞ్యాన జిజ్ఞ్యాస కాలక్రమేనా సన్నగిల్లుతోంది. అజ్ఞాన అంధకారం అతనిలో అలుముకుంటోంది. అది కలి ప్రభావమో మానవుడి తీరని ఆకలి ప్రభావమో మరి. ప్రతి వాడికి "Instant Karma" కావాలి. అందుకని మీరన్నట్టు రోజూ చచ్చేవాడికి ఎప్పుడో వచ్చేదాని మీద దృష్టి ఉండదు. అందుకని ఎప్పటికప్పుడు ఎంతో కొంత ఉత్తేజ పరిచేది ఈ మానవ జాతికి అవసరం. అలాటి ఉపాయమూ లేకపోలేదు. అలనాడు క్షీరసాగరమథనం లో గరళం ఉద్భవిస్తే బోళా శంకరుడు అది ఒక పాత్రలో పోసుకుని గుటుక్కున మింగి పాత్రని అక్కడే వదిలేశాడు. ఆ పైన క్షీర సాగర మథనం లో వచ్చిన అమృతాన్ని మోహినీ అవతారం లో ఉన్న విష్ణువు పంచుతూ ఉండగా కేతువు సమయానికి వేరే పాత్ర దొరకక అక్కడే ఉన్న ఆ గరళం పాత్రని పట్టుకెళ్ళి దేవతల పక్కన కూర్చున్నాడు. కొంత తాగగానే చక్రధారి రాహు కేతువుల శిరఛ్చేదన చేసేశాడు.

కేతువు చేజారిన ఆ పాత్ర ఆకాశ మర్గాన పయనించి భూమ్మీద భారతానికి పశ్చిమంగా వెయ్యి యోజనాల దూరంలో పడింది. ఆ పాత్ర లోంచి ఒక బొట్టు భూమిలోకి జారింది. క్రమేణా అది గింజగా పరిణామం చెంది ఆ పై మొక్కగా మొలిచింది. ఆ మొక్క మొక్కలై కొండల్లో కోనల్లో యోజనాల కొలదీ విస్తరించింది. ఆ మొక్కలలో ఏదో ఉత్తేజకర గుణం ఉందని అక్కడి ప్రజలు గ్రహించారు . రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి ఆ గింజలు తీసి, వేయించి, దంచి, నీటిలో కాస్తే ఒక చిక్కటి నల్లటి ద్రవం తయారవుతుందని తెలుసుకున్నారు. గరళం పాత్రలో ఉన్నందున కొంత చేదు ఉన్నప్పటికీ అందులో ఉన్న దివ్య ఔషద గుణాలు ఉత్సాహ కణాలు ఆ పనీయానికి బహుళాదరణ కలిగించాయి. పైగా పాలు కలిపితే ఉన్న చిరు చేదు కూడా పోయి ఒక చిక్కని అమృతప్రాయమైన ఉష్ణపానీయం అవతరిస్తుందని కొందరు గ్రహించారు. దాన్నే ముద్దుగా కాఫీ అని పిలుచుకోవడం మొదలు పెట్టారు.


                                        


ఈ పానీయం అమృత సంపాతము, క్షీరసాగర సంప్రాప్తము, పూర్వజన్మ సుకృత సంపాకము, తక్షణ ఉత్తేజ కారకము, మధురాతి మధురము. అది సంపద ఉన్నవాడిని లేని వాడిని ఒకే చూపుగా కరుణిస్తుంది." అని శెలవిచ్చాడు

ఇది విన్న శౌనకాదులు కళ్ళలో ఆనందంతో ఇది ఎవరు సేవించవచ్చు, ఎప్పుడు సేవించ వచ్చు దీని ఉపయోగాలేమి అని సూతుడిని ప్రశించారు.

అప్పుడు సూతుడు "ఇది కుల మతాల కతీతంగా, కలిమి లేములకు సంబంధం లేకుండా, స్త్రీ పురుషులని ఆంక్ష లేకుండా, పిల్లలు పెద్దలు అని వివక్ష లేకుండా అందరూ త్రాగవచ్చు. ఇది సోమరులకి నిదుర పోగొట్టీది, పని లో ఉన్నవాడికి ఆలోచన పెంచేది, వత్తిడి లో ఉన్నవాడికి ఆనందం పంచేది, అలసట కోపం చిరాకు బాధ తుడిచి పెట్టేది. ఆకలి తో ఉన్నవాడికి ఆకలి మరిపించేది. ఆయాసం గా ఉన్నవాడిని తేలిక పరిచేది. ఎల్లప్పుడూ మానవుడి ప్రియ నేస్తం, అభయ హస్తం, సమస్తం.

ఇది సమయం సందర్భం లేకుండా ఎప్పుడన్నా త్రాగవచ్చు . పక్కలోంచి లేవలేనని వొళ్ళు బద్ధకిస్తున్నప్పుడు, స్ట్రెస్ ఎక్కువై బుర్ర పని చెయ్యనపుడు, వంటికి సరిపడని ఆటలు ఆడి వచ్చినపుడు, మనసు దిగాలుగా ఉనప్పుడు, కోపంగా ఉనప్పుడు , ఉపవాసం లో ఆకలిగా ఉనప్పుడు, ఏకాకిగా ఏమీ తోచనపుడు , డబ్బింగ్ సీరియల్స్ భరించలేనప్పుడు వార్తా చానెళ్ళ తలనొప్పి తట్టుకోలేనప్పుడు, మోర్నింగ వాక్ లో , రైటర్స్ బ్లాక్ లో, వసంతకాల ప్రశాంత ఉషోదయం లో,  సాగరతీరంలో గ్రీష్మ సాయంకాలం లో, 
శరద్పున్నమి పండువెన్నెల్లలో,  ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అని తేడ లేకుండా సర్వ కాల సర్వావస్థల యందు ఈ పానీయాన్ని సేవించవచ్చు.  మనిషికి అండా దండా తోడూ నీడా ఈ కాఫీ. 

'ఇతి నిశి వర్నోదకం సర్వమంగళ కరం సర్వలోక ప్రియం
పియతే పండిత పామరై నిత్యం సర్వదు:ఖాతిగో భవేత్'

అనగా  ఇది రోజూ తాగిన వారికి బాధలు చుట్టు  ముట్టవు . ముట్టినా పెద్దగా పట్టవు. బాధలకి భయాలకి కష్టాలకి నష్టాలకి ఇది మంచి ఉపశమనం . ఇది సర్వ లోక ప్రియసుధాధారిని,  సర్వ దు:ఖ నివారిణి, సర్వ మంగళ కారిణి" అని చెప్పి ముగించాడు.

శౌనకాది మునుల ఆనందానికి అవధులు లేవు.సూతుడికి భక్తితో నమస్కరించి ఇంకోసారి సత్కరించి ఇంటికి సాగనంపారు . ఆ రోజు మొదలుకుని ఈ వృత్తాంతాన్ని ఆ మునులు తమ శిష్య ప్రశిష్య గణానికి చెప్పి మానవ కళ్యాణానికి ఈ కాఫీని బహుళ ప్రాచుర్యం లోకి తీసుకురావాలని వారిని అజ్ఞాపించారు. వారి శిష్యులు ఆ మాట కా . ఫీ . తప్పకుండా పాటించారు. తద్వారా భారతావనిలో కాఫీ అవతరించింది , ప్రతీ నోటినీ పలకరించింది. ప్రతి ఇంటా ఆనందం చిలకరించింది.


Tuesday, February 26, 2013

తెలుగు పాట వ్రాయడం ఎలా For Dummies


ఈ టపా లోని పాత్రలు , పాటలు , పేర్లు ఎవరినో ఉద్దేశించినవే అని మీకు అనిపిస్తే మీకు కనీస తెలుగు సినిమా నాలెడ్జ్ ఉన్నట్టే 


ఒక్క ఛాన్స్ వస్తే చాలు తనేంటో నిరూపించేసుకుని, సినిమా క్రెడిట్స్ లో పాటలు అన్న మాట కింద తన పేరుని చూసేసుకుని, సింగల్ కార్డ్ గా ఎదిగి , తెలుగు గేయ రచయితగా స్థిర పడిపోవాలని పగటి కలలు కంటున్నాడు మన వాడు (రాత్రి రాతలతో నిద్ర లేక పొద్దున్నే పడుకుంటున్నాడు మరి ) . ఒకడు  చేసేది ఏదైనా, అందులో వాడి భవిష్యత్తు ఉన్నా లేకపోయినా  వాడిని ప్రోత్సహించే స్నేహితుడు ఒకడు ఉంటాడు.  అలాటి వాడే మనవాడి స్నేహితుడు ..  మన వాడి బాధ చూడలేక ఎవరెవరివో కాళ్ళు , గడ్డం, చేతులు , మెడ   పట్టుకుని ప్రముఖ గేయ రచయిత ఇంద్ర హాస్ అపాయింట్ మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళాడు .

అప్పుడే  నోకియా వరస్ట్ సింగర్  కార్యక్రమం గ్రాండ్ సెమీ క్వార్టర్ ఫైనల్ షూటింగ్ ముగించుకుని వస్తున్నారు ఇంద్ర హాస్. అమెరికా టూర్ వెళ్ళినపుడు తెచ్చుకున్న ఆబర్కాంబీ టీషర్టు చూసి ఆయనే అని నిర్దారించుకున్నాడు మన వాడి ఫ్రెండ్ .

ఆయన్ని కలిసి మా వాడు గీత రచయిత గా ప్రయత్నాలు చేస్తున్నాడు  సార్ . అందరూ వీడి పాటలు బావున్నాయి అంటున్నారు కానీ ఎవరూ తీసుకోవట్లేదు ..  బోలెడు భవిష్యత్తు ఉంది అంటున్నారు కానీ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అని బోరుమన్నాడు  . మన వాడు అయిష్టంగా వచ్చాడు, అయినా ఇంద్రహాస్  ఏం చెప్తాడో అయిష్టం గానే వింటున్నాడు .

ఇంద్రహాస్ నవ్వి .. "తెలుగు పాట అన్నారు కదా అని నీకు వచ్చిన తెలుగంతా ఉపయోగించేస్తే ఎలాగయ్యా!
అసల నన్నడిగితే తెలుగు పాట రాయడానికి తెలుగే  అక్కర్లేదు , తెలివీ అక్కర్లేదు , ఊహ అక్కర్లేదు , వ్యాకరణం అక్కర్లేదు.. కాకపోతే కిటుకు తెలియాలి .. కాన్ఫిడెన్స్ ఉండాలి .. ఉత్తరం ముక్కో, ఇంటి పద్దో రాసినా అదొక మహా కావ్యం లాగ ప్రెసెంట్ చెయ్యగల కాన్ఫిడెన్స్ .. నువ్వు రాసేది ప్రతీది కావ్యం లా ముందు నువ్వు ఫీల్ అవ్వాల"న్నాడు.


మనవాడు అయోమయంగా కొంచం ఇబ్బందిగా చూశాడు ..








ఇంద్రహాస్ అవేమీ పట్టించుకోకుండా..
కిటుకు విషయానికొస్తే ముందుగా నేనెక్కువ వాడే, హంసధ్వని గారు అతిగా ఇష్టపడే , వినగానే ఎగిరి గంతేసే లిస్టు కాన్సెప్ట్ చెప్తా ..అంటూ ఫ్లో లో చెప్పుకుంటూ పోయాడు ..

"ఇచ్చిన సన్నివేశం ఒక సెంట్రల్ థీమ్ గా అనుకో దాని మీద లిస్టు అల్లుకుంటూ పో అంతే
ఉదాహరణకి నిన్ను ఏదో పిల్లల పాట ఏదో పుట్టిన రోజుకి పాటో  రాయమన్నారు అనుకో .. అప్పుడు ముఖ్యంగా ఇచ్చేది ఆశీర్వాదం , తీసేది  దిష్టి . ఇందులో ఏదో ఒకటి తీసుకుని .. అల్లెయ్యడమే "

ఒక్కొక్కళ్ళ ఆశీర్వాదం అలా ఉండాలి ఇలా ఉండాలి అప్పుడు ఉండాలి ఇప్పుడు ఉండాలి అని రాసుకుంటూ పొతే అయిదారు పేజీలు అవుతుంది .. చిన్న పాట  అనుకో ముఖ్యమైన వాళ్ళవి పెట్టు .. పెద్దది అనుకో ..వీటితో పాటు ప్రకృతివి, జంతువులవి , పక్షులవి కూడా కలుపు ..అంతే ... నేనెన్ని రాయలేదు ఇలా ..లిస్టు కాన్సెప్ట్ తో రాసినవన్నీ చెబితే ఒక దర్శకచంద్రుడి సినిమా పాటలకి (కనీసం పదయినా  ఉంటాయి కదా) సరిపోయేంత  లిస్టు అవుతుంది .

నేను చెన్నై మొగుడు సినిమా నించి నిన్న యమునోత్రి నేటి కేదార్నాథ్ సినిమా వరకూ ఈ టెక్నిక్కే వాడాను ..

మనవాడి  ముఖ కవళికలు ఇబ్బంది లోంచి కోపం లోకి పరిణతి చెందుతున్నాయి ..
ఇంద్రహాస్ మాత్రం అంతులేని తన పాటలా .. అదే పనిగా చెబుతున్నాడు ..

అదే దేశం మీద రాయమన్నారు అనుకో ..
ఒక రెండు మూడు నెలల పేపర్లు తిరగేసి ముఖ్యాంశాలు పట్టుకో .. వాటికి  నీకు తెలిసినవి కలిపి .. బావోలేని విషయాలైతే దేశం అంటే అది కాదు అని  రాసేయ్ ..మంచి విషయాలనుకో దేశమంటే అదే అని రాసేయ్ ..ఫినిష్ .
మన హంసధ్వని గారి ట్యూన్ వేయించి ఏ బాలూ  చేతో  పాడిస్తే అవార్డు సాంగ్ అయి కూర్చుంటుంది ..

నేను మొన్న వ్రాసిన  "సయ్యంది పాదం" సినిమా పాట వినలేదా .అది అలా రాసిందే ..

ఒక్కోసారి ఈ మాత్రం కూడా అవసరం ఉండదు. మాస్ పాట రాయమన్నారు అనుకో .. నీ ఇష్టం .. ఒక మంచి నాటు పదం పట్టుకో దానికి అంత్య ప్రాస పెట్టుకుంటూ పో .అంత్యప్రాస అంటే అదే రైమింగ్.. అది  ఉంటే చాలు ఆంధ్ర జ్యోతి ఆర్టికల్ ని కూడా అందమైన పాటగా ట్యూన్ కట్టేస్తారు మన హంసధ్వని గారు, అందులో ఈ మధ్య ఆఫ్రికా, అంటార్క్టికా, నార్వీజియన్ , ఐస్లాండిక్ ఆల్బమ్స్ కూడా వదిలిపెట్టకుండా వింటున్నారు. చేతిలో మన వాళ్ళు కాపీ అని కనిపెట్టలేని బోలెడు ట్యూన్స్ ..

గుడ్డి , బడ్డీ , బుడ్డీ , వడ్డీ ..; ఈక - మేక - తోక - పాక ..ఇలా అన్నమాట .. నావి ఇలా ఎన్ని సూపర్ డూపర్ హిట్లు అవ్వలేదు ..కావాలంటే అప్పట్లో నేను వృషబాద్రి సినిమాకి రాసిన పాట ఇంకో పది సార్లు విను .

మనవాడి ఫ్రెండ్ కి కూడా ముఖం శాంతం నించి బీబత్సానికి మారిపోయింది .

ఇంద్ర హాస్  మాత్రం  ఇంకా అద్భుతం (రసం )  లోనే ఉన్నాడు .

కవితకి కాదేది అనర్హం అని ఊరుకున్నాడు కానీ శ్రీ శ్రీ .. పాటకు కూడా అది వర్తిస్తుంది ..నేను ఈ విషయం లో ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను ..పాటలు కట్టాను పాడాను ... కేవలం తిట్లు బండ బూతులతో  ఒక పొడవాటి పాట రాశాను.. ఒకటో నెంబర్ ఓబులేసు సినిమాకనుకుంటా ..  అది ఒక ట్రెండ్ సెట్ చేసి .. హీరో హీరోయిన్లు అలాగే పిలుచుకోవడం ఫాషన్ అయ్యి .కూర్చుంది . ఇది టి వి లకి కూడా పాకి ఇప్పుడు తెలుగు మాటలకంటే తిట్లు ఎక్కువ వినపడ్తున్నాయి ఎక్కడవిన్నా . మరి అదంతా నా ప్రతిభే ..

ఇంద్రహాస్ ఇంకా ఏదో చెప్పేలోపే  పాటల గురించి పెద్దగా తెలియని  మనవాడి ఫ్రెండ్ కి కూడా అసహ్యమేసి ..
గబాలున లేచి ,  "కోడ్తే దిమ్మ దిరిగి బొమ్మ కనపడుతుంది" అన్నట్టు లుక్కిచ్చ్చి మనవాడితో  కలిసి బయటకి వచ్చేసాడు ..

తొలాట ఇంటర్వెల్ బ్లాక్ దగ్గరే శుభం కార్డనుకుని వెళ్ళిపోతున్న ప్రేక్షకులను చూసిన తొలి సినిమా దర్శకుడిలా బిక్క మొహం వేశాడు, బాధగా చూశాడు .. వెంటనే .మనసులో బాధ యెదలో దురద మట్టిలో బురద అది గోక్కో ఇది కడుక్కో అని ఏదో పాట తట్టింది .. హంసధ్వని కి ఫోన్ కొట్టి ..మూతి అదోలా పెట్టి పాడడం మొదలు పెట్టాడు ..

(...చదివే వాళ్ళు ఉంటే ఇంకా ఉంటుంది ..)

Thursday, February 14, 2013

వాలెంటైన్స్ డే


ఆర్చీస్ లో 
అటు చూస్తే టెడ్డీ బేరూ ఇటు చూస్తే తాజ్ మహలు 
ఏది కొనాలో సమస్య తగిలిందొక యువ ప్రేమికుడికి 

ఆమెని 
స్పైస్ జెట్ లో గోవా కో 
లాంగ్ డ్రైవ్ లో కూర్గ్ కో 
తేల్చుకోలేని సమస్య ఒక నవవరుడికి 

ఆవిడతో 
మల్టీప్లెక్స్ లో మహేష్ సినిమా కో 
ఒహ్రీస్ లో డిన్నర్ బఫేకో 
ఎటు పోవాలో సమస్య కలిగిందొక మధ్య వయస్కుడికి 

ఆయన కిష్టమైన అల్లం ఉప్మా? నాకు నచ్చే పూరీ కూరా? 
ఆవిడ చూసే వసంత కోకిలా నే చూసే టి వి న్యూసా 
ఆలోచించే సమస్య లేదు ఆ వృద్ధ మిథునానికి 



శ్రీ శ్రీ గారికి క్షమాపణలతో






Saturday, January 12, 2013

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు


"సినిమా ఎలా ఉంది రా ?"

" రకరకాలుగా ఉంది "

"అంటే బావుందా బాలేదా "

" మరీ గొప్పగా లేదు అలా అని చెత్తగా లేదు "

"నాకైతే చాలా రోజుల తరువాత చాలా నాచురల్ గా ఉందనిపించింది . వయోలెన్స్ , అక్కర్లేని డాన్సు లు, ఐటెం సాంగ్స్ లేకుండా రొటీన్ కమర్షియల్ తెలుగు సినిమా నించి రిలీఫ్ లా ఉంది ఈ సినిమా "

" ఇవన్నీ లేకుండా కూడా ఇంకా బాగా తియచ్చు కదరా . మరీ సీరియల్ లా సాగ తీసాడు సెకండ్ హాఫ్ "



"అవుననుకో కానీ ఫస్ట్ హాఫ్  చాలా బావుంది .. బాపు సినిమా లా ఎక్కడా ఆర్భాటం లేకుండా కాస్ట్యూమ్స్ , ఇల్లు , మాటలు అన్నీ చాలా సహజంగా ఉన్నాయి .. సినిమా లో పాత్రల్లా కాకుండా ఏదో మన పక్కింట్లో జరిగే కథలా ఉంది "

" మన పక్కింట్లో ఉన్నంత సహజంగా ఉంటే పదిహేను డాలర్లు పెట్టి సినిమా హాల్ కెళ్ళి  చూడడం ఎందుకు రా., పది నిమిషాలు కిటికీ తీస్తే సరి .. పోనీ మనమంటే అలాటి వాతావరణం ఇక్కడ ఉండదు కాబట్టి పదిహేను డాలర్లు ఖర్చు పెట్టి అన్నీ గుర్తు తెచ్చుకుని  గా nostalgic గా   ఫీల్ అవ్వచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు ఈ సినిమా చూడడానికి  హాల్ కి రావడం ఎందుకు అనేడట్టు  లేదు. సినిమాకి  కాస్ట్యూమ్ డిజైనర్ కూడా పెట్టలేదేమో :)   "

" ఆహా .. హీరో కాబట్టి గుడిసెలో ఉన్నా సూట్ వెయ్యాలి అంటావ్ .. మధ్య తరగతి వాడైనా  హైటెక్స్ లో పెళ్లి చేసుకున్నట్టు , స్విస్ లో హనీమూన్ చేసుకున్నట్టు చూపెట్టాలి కదా ..

" లేకపోతె నాలాంటి కామన్ ఆడియన్ (:)) ఎలా ఎంజాయ్ చెయ్యగలుగుతాడు సినిమాని "

" ఎడిసావ్ లే ..అది సరే.. మహేష్ మాత్రం బా చేసాడు కదా. "

"మహేష్ ఇరగదీసాడెహే. అసలా ఈ మధ్య భలే చేస్తున్నాడు రా .. ఇది వరకు ఏదో ఆ ముక్కు ఎగపీల్చే ఎక్స్ప్రెషన్ తప్ప ఇంకోటి ఉండేది కాదు .మరీ చెట్టు చేమ లా ఎమోషన్స్ లేకుండా ఉండడం హీరోయిజం అనుకునేవాడు ఒక్కడు పుణ్యమా అని .. అండర్ ప్లే చేసేవాడు .ఖలేజా నించి  సినిమా హిట్ అయినా ఫట్ అయినా యాక్టింగ్ మాత్రం భలే చేస్తున్నాడు . ఈ సినిమా లో గోదావరి యాస భలే పట్టుకున్నాడు .. సినిమా నిలబడితే అది మహేష్ వల్లే . పొతే డైరెక్టర్ వల్ల  అన్నట్టుంది ఈ సినిమా .."

"సమంతా కూడా బావుంది మహేష్ పక్కన"




" సమంతా డార్లింగ్ కేకెహే.. తెగ మొద్దొచ్చేసింది .. మహేష్ కి భలే పెయిర్ రా ..  "


" మిగతా వాళ్ళు కూడా బానే  చేసారు .. వెంకీ , అంజలి .ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్ "

"
వెంకీ కి ఏడవడం సెంటిమెంట్ పిండడం వెన్నతో పెట్టిన విద్య .. బా చేశాడు .. అంజలి జర్నీ సినిమా లో అమ్మాయి కదా భలే సరిపోయింది ఆ రోల్ కి ..
ఇంక ఆ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏంటో నాకర్థం కాలేదు . అతనేం చేస్తాడో  బతకడానికి నవ్వడం కాకుండా  .. డబ్బెలా వస్తోందో  వాళ్ళకి .. ఇవన్నీ దేవుడి కెరుక .. హీరో పాత్రలు  కూడా ఏదో వాక్యూం లో ఉంటాయి  .. వాళ్ళ చదువు ఏంటి  ఉద్యోగం ఏంటి ఏదీ తెలియదు ..   ఇక మిగతా వాళ్ళంతా ఏదో వాళ్ళ పరిమితి  లో బానే చేశారు .. రావు రమేష్ మాత్రం చాలా బాగా సరిపోయాడు రోల్ కి .. అతి లేకుండా బాలెన్సడ్  గా చేసాడు .

"

" ప్రకాష్ రాజ్ క్యారెక్టకి డబ్బంటావా  ..  అమ్మాయి పెళ్లి అయ్యాక చూపిస్తాడు గా ఊర్లో వాడెవడో  ఇది నేను సెటిల్ చేస్తా అంటాడు  .. ఆ విధంగా తలొకరు సహాయం చేస్తూ ఉంటారేమో వాళ్ళ కుటుంబానికి .. ".

"ఆహా ..నాకు మరీ అంత దూరాలచన లేదు బాబు.  తెలుగు సినిమాకి కూడా అంత  ఊహించి అర్థం చేసుకోవాడం   నా వల్ల  కాదు. "

" నా ఉద్దేశ్యం వాళ్ళకి డబ్బు ఎలా వచ్చింది అనేది  పెద్ద పాయింట్ కాదు అని "

"నేనొప్పుకోను .. అదీ కాకుండా  చివర్లో కూడా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినట్టా రానట్టా  నాకర్థం కాలేదు . బామ్మకి గాజులు చేయించే డబ్బెలా వచ్చింది .. అది కూడా ఊర్లో వాళ్ళే  ఇచ్చారా   "

"వాళ్ళ మంచితనం చూసి పిల్లనిచ్చి పెళ్లి చేసి, కట్నంగా డబ్బు ఇచ్చి ఉండచ్చు కదా "

"వామ్మో ఆ డైరెక్టర్ కూడా ఇంత అలోచించి ఉండదేమో .. ఫాన్స్ ఎలా కావాలంటే అలా ఊహించుకోవచ్చు .
సో నీ లెక్క ప్రకారం నాకర్థం ఐంది ఏంటంటే సినిమా కథ ఇది - ఇద్దరు డబ్బు , ఆస్తి , ఉద్యోగాలు లేని అన్నదమ్ములు వాళ్ళ నాన్న మంచితనం తో గొప్పింటి అమ్మాయిలని లైన్ లో పెట్టి ఎలా పెళ్లి చేసుకున్నారు ..సో మంచితనం ఉంటే డబ్బు , ఆస్తి , ఉద్యోగం ఏమక్కరలేదు (కుర్రాడు మహేష్ బాబంత  అందంగా ఉండకపోయినా ) అని దర్శకుడి ఉవాచ.  "



" నువ్వు మరీ అలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేనేం చెప్పలేను "

" మరి నువ్వు అలా ఏవేవో ఊహించుకుని కథలు అల్లెసుకుంటే .. నేనేం చెప్పలేను ."

"ఎన్ని సినిమాలోస్తున్నాయ్ రా ఇలా .. ఎప్పుడు చూడు ఒకటే రకం - అయితే యాక్షన్, లేకపోతె ప్రేమ కథ . వచ్చే ఒకటీ అరా డిఫరెంట్ సినిమాలు కూడా ఆదరించకపోతే ఎలా .."

"అదే ప్రాబ్లం అయిపొయింది .. డిఫరెంట్ అని పేరు చెప్పి ట్రైలర్ లో ఊదర గొట్టేయ్యడం తీరా చూస్తే   పస ఉండట్లేదు సినిమా లో . చాలా హాలీవుడ్ సినిమాలు ట్రైలర్ కొత్త సినిమా చెత్త , అదే తరహా ఇప్పుడు బాలీవుడ్ కి మన తెలుగు కి కూడా పాకుతోంది ..ఏదో ఒక చిన్న ఐడియా పట్టుకోవడం .. దాన్ని రెండున్నర గంటలకి సరిపడా పెంచలేకపోవడం . పోనీ నిడివి తగ్గిస్తారా అంటే అదీ లేదు రెండున్నరా మూడు గంటలు ఉండాల్సిందే ..  అరగంట  అయ్యేసరికి వాళ్ళు కొత్తగా అనుకున్న ఆరు సీన్లు అయిపోతాయి  .. తరువాత ఏదో చెత్త ."

" ఫార్ములా కంటే ఇది నయం కదా .. అయినా  టాపిక్ కి Tangential గా వెళ్తున్నాం. .ఎవరైనా అడిగితే  సినిమా చూడమని చెప్తావా  చూడద్దని చెప్తావా "

"నయమే లే అందుకే పదిహేను డాలర్లు పోయినా  బాధ పడట్లేదు కదా . డైరెక్టర్ ని మూడు విషయాల్లో మాత్రం మెచ్చుకోవాలి - మంచి సాహిత్యం , చక్కని మాటలు , గుండెల్ని హత్తుకునే కొన్ని సీన్స్, ఆత్మ వంచన లేకుండా  అనుకున్నట్టు సినిమా తియ్యడం (ఇది  దిల్ రాజు సపోర్ట్ వల్ల ).
ఇక వేరే వాళ్ళకి చెప్పడం అంటావా అందరినీ  చూడమనే  చెప్తా ."

"సో అటు ఇటు గా నీకు సినిమా నచ్చినట్టే.. నువ్వు నా గ్రూప్ లోకి వచ్చినట్టే  "

"కాదెహే . నాతో   పాటు ఇంకో నలుగురు బాధ పడితే అదో తుత్తి ."

"నువ్వు మారవెహే "

"నవ్వుతాలికి అన్నా గానీ, అమృతాంజన్ రాసుకునే అంత  తలనొప్పి రాకుండా , సినిమా మధ్యలో లేచెయ్య కుండా  సినిమాని సర్వైవ్ అయ్యానంటే  .. అది ఇంకోళ్ళని   చూడమని చెప్తా. అది నా పాలిసీ .. తెలుగు సినిమాల వరకు  "

"నువ్వు ఇంకో సారి చూస్తావా మరి ."

"నీకో దండం రా సామీ ! "

"ఇంకో సారి చూసే ప్రశ్నే లేదంటావ్  "

"రెండో సగం లో ఓ సగం కత్తిరించి రెండు పాటలు తీసేసి ఓ మూడు మంచి పాటలు (రెహమాన్ వో కనీసం దేవిశ్రీ వో )  పెడితే ఇంకోసారి  డి వి డి లో చూస్తా .."

"పాటలు కొత్త బంగారు లోకం అంత బాగా ఇస్తాడ నుకున్నా ..చాలా  disappoint చేశాడు  "

" లిరిక్స్ బావున్నాయి లే .. ఓ మూడు పాటలు మ్యూజిక్  కూడా బావుంది .. ఆ వెంకీ పాట మాత్రం ఘోరమయా.. "

" అది ఒప్పుకుంటా .. కానీ వినగా వినగా బావున్నాయి రా. బహుశా సాహిత్యం వల్లేమో . నువ్వు విను నచ్చుతాయ్. నేను రేపు షో కి టికెట్స్ బుక్ చేసుకుంటున్నా .. నీకు డి వి డి వచ్చాక చెప్తా :) "

" జిహ్వకో రుచి .. మనిషికో పిచ్చి .. అలాక్కానీ .."


(Images - Courtesy: Google images, idlebrain.com )