Showing posts with label వేటూరి. Show all posts
Showing posts with label వేటూరి. Show all posts

Tuesday, September 2, 2014

అక్కడ బాపు - రమణ


అల 
వైకుంఠ పురంబున

జయ విజయులు వైకుంఠ ద్వారం దగ్గర ఆయనకి ఘన స్వాగతం పలికారు


శేష తల్పం మీద శయన ముద్ర లో ఉన్న స్వామి వారి దగ్గరికి ఆయనని తీసుకెళ్ళారు.   లక్ష్మీదేవి నారాయణుడి పాదాలొత్తుతోంది.

స్వామి వారు లోపలికి  వస్తున్న ఆయనని చూసి..  అదేమిటి బాపు. అప్పుడే వచ్చేశావన్నారు

ఏం చెప్పను రామయ్యా.. (స్వామి వారి పాదాల వంక ఆశ్చర్యంగా చూస్తూ)

ఇంకా రామయ్య ఏంటి ? ఆ అవతారం చాలించాను కదయ్యా

అంతా విష్ణు మాయ. నాకు నువ్వెప్పుడూ రామయ్యవేనయ్యా

అది సరే. ఏంటి అప్పుడే ?

అప్పుడే ఏంటి రామయ్యా ? వెంకట్రావు వచ్చి మూడున్నరేళ్ళయింది. రోజు కలలోకి వచ్చి ఏమిటి ఎప్పటికీ రావు. నాకు ఏమీ తోచట్లేదు అంటాడు. అక్కడ నాకు అంతే. చక్కబెట్టాల్సిన పనులు ఉండి ఎలాగో కష్టపడి ఉన్నా ఇన్నాళ్ళు. (ఇంకా పాదాల వంక ఆదిశేషు పడగల వంక చూస్తూ)

మరి నా పరిస్థితి ఏంటి బాపు?

నీకేమయ్యా. ఆ తల్లి తోడు ఉండగా. లక్ష్మ నీడ ఉండగా.  హనుమ వంటి బంటు ఉండగా.

నా బొమ్మలు ఎవరు గీస్తారు.  కథలు ఎవరు తీస్తారు. ఈ మనుషులని  దారిలో ఎవరు పెడతారు.

నీ దయ ఉంటే ఎవరైనా చేయగలరు. అది సరే మా వెంకట్రావు ఏడి. ఎక్కడా కనపడడే.  పాపం చిన్నప్పుడు ఎప్పుడో నా దగ్గర అప్పు చేసాడని శిక్ష వేసారా ఏంటి ?






అదేమీ లేదు బాపు. వాణి మీ వాణ్ణి అసలు ఇటు రానిస్తేగా. మా వెంకట్రావు మా వెంకట్రావు అని అక్కడే అట్టే పెట్టేసుకుంది. గోరు ముద్దలు తినిపిస్తూ చిన్న పిల్లాడిలా చూసుకుంటోంది. పొద్దస్తమానూ పోతనతో సాహిత్య గోష్టి, త్యాగయ్యతో సంగీత చర్చలు, మధ్యాహ్నం వేటూరితో పాటల కబుర్లు.  సాయంత్రం అయితే దేవతల మీద సటైర్లు వేస్తూ అందరికీ కాలక్షేపం చేస్తున్నాడుట.

మా వెంకట్రావు అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా ఒకటే. నన్ను అక్కడికి పంపించే మార్గం చూడు  స్వామీ. ఆనక వచ్చి నీతో మాట్లాడతా.


సరే. పంపుతా గానీ. వచ్చినప్పటి నుంచీ ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి ఆదిశేషుడి  వంక. 

అదే అడుగుదామనుకుంటున్నాస్వామీ. అన్ని పురాణాల్లో మీరు ఆదిశేషు పడగల కింద తలాంచి శయనిస్తారు అని చదివాను. అక్కడ మీ పాదాలు ఉన్నాయేంటి చెప్మా. 

ఇంకా గుర్తు రాలేదా. ఇది నీ చలవేనయ్యా.  నీ కొంటె ఆలోచనల  పుణ్యమా అని సిరి కోరినది ఈ విధంగా నెరవేరినది.  

చిరు మందహాసంతో బాపు వైకుంఠం లో సెలవు తీసుకున్నాడు. 


సత్య లోకం 

వెంకట్రావు అమ్మ పక్కన కూర్చుని అప్పుడే ఏదో చెప్తున్నాడు. అందరూ గొల్లుమన్నారు.




వెంకట్రావు ని చూడగానే బాపుకి కళ్ళ నీళ్ళు తిరిగాయి. మాట మూగబోయింది.  వెంకట్రావు వేరే వైపు తిరిగి ఉన్నా బాపు వచ్చినట్టు తెలిసిపోయింది . బాపు ని చూసి చమ్మగిల్లిన కళ్ళతో వచ్చి కౌగిలించు కున్నాడు వెంకట్రావు.

ఏం? ఇన్నాళ్ళు?

నువ్వేమో రామ కథ మొదలెట్టి మధ్యలో వచ్చేశావు. పూర్తి చెయ్యద్దూ. నువ్వు వచ్చేసాకా ఒకటే ఏడుపులు తెలుగు లోకమంతా. బుడుగుని బుజ్జగించి, సీగాన పసూనాంబ ని ఊరుకోబెట్టి, అప్పులప్పారావుకి అప్పులిప్పిచ్చి 
అందరికీ సర్ది చెప్పి, మిగతా పనులన్నీ చక్కబెట్టి వచ్చేసరికి ఇదిగో.. ఈ వేళైంది. రోజూ రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాను తెలుసా.

ఇంతలో వెంకట్రావు ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు

ఏమిటి ?

మేము ఇదే మాట్లాడు కుంటున్నాం.

ఏమని ?

అదే ఈ సంతాప సభలు. చర్చలు. ఎలిజీలు. టి వి ల లో నిన్న పోగిడేవాళ్ళు.వగైరా   రా.. కూర్చో. అని వేటూరి పక్కన ఒక కుర్చీ చూపించాడు.

వాగ్దేవి కి పాదాభివందనం చేసి, పోతనకి, త్యాగయ్య , వేటూరి తడితురలకి  నమస్కారం చేసి కూర్చున్నాడు బాపు.

"ఏం బాపు. ఎప్పుడూ మీ రామయ్య నేనా. నా  మీద కథలు తియ్యలేదు. బొమ్మలు కూడా పెద్దగా గీసినట్టు లేవ" నడిగింది శారదాంబ

అదేమిటమ్మా. అమ్మను తలుచుకోకుండా ఉంటామా. అయినా నేను ఏం గీసినా వెంకట్రావు ఏం రాసినా మొదటి దండం నీకేగా.

అవునులే. మా పోతన కూడా ఇదే అన్నాడు. సరే. మీ వెంకట్రావు నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఏం కబుర్లు చెప్పినా పక్కన వెతుక్కుంటూ ఉంటాడు.  పేరుకి నవ్వుతున్నా నువ్వు లేవని చిన్నబోతాడు.


బాపు వెంకట్రావులు కళ్ళు తుడుచుకున్నారు.

ఇంతలో పోతన  "భావగావతాన్ని దృశ్య రూపకంగా మలిచావని, ఇంతింతై వటుడింతై అద్భుతంగా మలచి పామరులకి కూడా నారాయణుడిని ప్రత్యక్షం చేసావని విన్నాన" న్నాడు.

అంతా మీ దయ.  మీరు రాసినది వెంకట్రావు చెప్పినది నా శక్తి మేర చూపించా. అంతే . 


లవకుశుల కథని మళ్ళీ తెరకెక్కించి ధన్యుడి వయ్యావు బాపు. సీతమ్మ వారికెన్ని కష్టాలయ్యా అని గద్గదమైంది వేటూరి గొంతు. హనుమను సహాయానికి రప్పించి కొంతైనా ఊరట కలిగించి, అపర వాల్మీకివయ్యావు రమణ. 

"వాల్మీకి ముందు నేనెంత. సీతమ్మ కష్టాలు చూడలేక నా వంతు చేశా. ఆపై రామభద్రుడి దయ. "

మౌనం అలుముకుంది. బాపు తేలిక పరచడానికి "ఔను వెంకట్రావు. ఇందాక ఏదో చెప్తున్నావ." న్నాడు.  

వెంకట్రావు కళ్ళు తుడుచుకుని ఏం లేదు బాపు. సంతాప సభలు, నివాళ్ల  గురించి. నువ్వున్నావని  కూడా ఎప్పుడూ తలుచుకోనివాళ్ళు, కలుసుకోనివాళ్ళు నీకో..  నివాళ్ళు  అర్పించేస్తూ ఉంటే అవి చూసి విని నవ్వుకుంటున్నాం ఇందాకా .

బాపు తేలికగా నవ్వాడు.

జనవరి 30న అందరికీ గాంధీ గారు గుర్తొచ్చినట్టు. ఎక్కడెక్కడ టెల్గూస్ కి నువ్వు గుర్తొచ్చేసావు. నన్ను అప్పట్లో ఎలిజీల తో వదిలిపెట్టారు. నువ్వు కార్టూన్లు, బొమ్మలు వేశావ్ కదా. నిన్ను ఆ రోజు టివి లలో, పేపర్లలో, జాతీయ వార్తల్లో, ఇంటర్నెట్ లో ఆకాశానికి ఎత్తేసి మర్నాటికి  మరిచిపోయారు. భరించలేని దు:ఖంతో నిద్ర పట్టలేదు, ఆకలి పుట్టలేదు అని చెప్పి, మరు నిమిషం మరేదో చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అది తప్పు కాదు లే. కానీ ఈ ఎలిజీలు మరీనూ.

బాపు ఎదో చెప్ప బోయి ఆగిపోయాడు.

ఎక్కువగా ఈ ఎలిజీలు ఇంచు మించు ఒకే లా ఉంటున్నాయి. పేరు మనది పెడతారు. ఏదో బానే మొదలెడతారు. మూడు లైన్లు అవ్వగానే విషయమంతా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. రాసింది మన గురించో వాళ్ళ గురించో అర్థం కాదు. విశ్వనాథ వారు వాళ్ళ గురువుగారిని పొగిడినట్టు ఉంటుంది.
కొందరైతే వాళ్ళెంత గొప్ప వాళ్ళో వాళ్ళ అతి విలువైన సమయాన్ని మనకి వెచ్చించి మనల్ని ఎంత ధన్యులని చేసారో సంక్షిప్తంగా సవివరిస్తారు.

(అందరూ ఫక్కున నవ్వేశారు)

నాకు భయమేస్తోంది అన్నాడు బాపు

ఏం ?

ఈ ఊపు లో నాకు పద్మ విభూషణో భారత రత్నో ఇచ్చేస్తారేమోనని.

నాకూ అదే భయం.

ఎందుకు.

నీతో పాటు నాకు పద్మశ్రీనో పద్మ విభుషణో  ఇస్తారేమో నని.

అందరూ గొల్లుమన్నారు.

( ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదు. బాపు రమణలు అక్కడ ఏమనుకుంటున్నారోనని ఊహించి రాసినది. ఎక్కువ మటుకు నేను రాద్దాం అని మొదలెట్టి ఆపేసిన ఎలిజీని ఉద్దేశించినది. బాపు - రమణ గారు తెలుగు వారికి నేర్పిన వాటిలో మొదటిది మన మీద మనం జోకులేసుకోవడం. ఆ ఆనవాయితీని పాటించే  ప్రయత్నం ఇది. అంతే!!)

Sunday, March 20, 2011

ఎవడో రాజమండ్రి - భద్రాచలం లాంచీ లో వెళ్ళచ్చన్నాడు.. వాడిని !#%^^!@%& - మొదటి భాగం


"వారిని! ఇవేనా అలిపి బ్యాక్ వాటర్స్ అంటే. మా అయినాపురం లో మురిక్కాలువ అంత ఉంది దీని  వెడల్పు  . దీనికి పదకొండు వేలు, పెద్ద హడావుడి. కోనసీమ లో ఇలాటి బోట్లు  పెడితేనా "God's own county" అనేస్తార" న్నాను  

"అయితే ఈసారి తీసుకెళ్ళరా. మేమూ చాలా విన్నాం"

"సరే ఐతే ఈసారి అక్కడికే. మీరు కోనసీమ చూడలేదు. నేను పాపి కొండలు చూడలేదు. ఒకే ట్రిప్పుకి రెండు ... "

"సర్లే. ట్రై చేసింది చాలు. ఈ సారి సరిగ్గా ప్లాన్ చెయ్యి. " చిరాగ్గా సెలవిచ్చాడు కిరణ్.

ఆ కేరళ ట్రిప్ ఐపోయాకా,లీవ్ తీసుకున్న నేరానికి నాకు ఆర్నెల్లు కఠిన క్యూబికల్ శిక్ష పడి పనిలో మునిగి తేలి, యత్రాలంటే భయం, లీవంటే  వణుకు పట్టుకున్నాయి.

శిక్షా కాలం ముగిసాకా ఒకనాడు స్నేహితులతో  కలిసి అనుకోకుండా గోదావరి సినిమాకి వెళ్లాను.

కట్ చెయ్యకుండానే ... నెలలో ఒక లాంచీ యజమాని కాంటాక్ట్ దొరకడం అతను మమ్మల్ని బ్రహ్మి (సా. ఇ ) అని తెలిసి వాయించి వదలడం, రాజమండ్రి నించి భద్రాచలం కి లాంచీ కుదరడం  చక చకా జరిగి  పోయాయి.

                          
                  **********************************************


రెండు వారాల తరువాత...

మా ప్రయాణం రోజు రానే వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్ లో మేము ఏడుగురం స్నేహితులం కలుసుకున్నాం.

గౌతమీకీ గార్డ్ సిగ్నల్  ఇచ్చాడు. రైలు  బయల్దేరింది.

కానీ ముందు ఏదో జరగబోతోంది అన్నట్టు ట్రైన్ స్లో మోషన్ లో కదలలేదు, ఆకాశం మేఘావృతం కాలేదు, మెరుపులు మెరవలేదు, ఉరుములు ఉరమలేదు. ప్రకృతి బొత్తిగా ఏ క్లూ ఇవ్వలేదు.

మర్నాటి ఉదయం  మాలతి గారి ఊరిలో దిగాం. అదేనండీ నిడదవోలు.

అక్కడికి మా పెదనాన్న పంపిన సూమో ( ఈ మాట వినగానే ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అనేసుకోవడమే. ఇది కోనసీమ. రాయలసీమ కాదు.) ఎక్కి అరగంట లో చాగల్లు చేరుకున్నాం. ఈ ఊరు షుగర్ ఫ్యాక్టరీ కి ప్రసిద్ది మా అమ్మమ్మ వాళ్ళ వంశం లాగా. సీజన్ అనుకుంటా ఎక్కడ చూసినా చెరుకు కనపడుతోంది.
ఇంటికి చేరగానే మా గ్యాంగ్కి  ఇంటి టూర్ ఇచ్చి, కాఫీలిచ్చి, టిపినీలు పెట్టింది మా దొడ్డమ్మ. వేడి వేడి పెసరట్టుని  ఉప్మా తో ఒక పట్టు పట్టాం  అందరం. బుద్ధిగా స్నానం చేసి, శ్రద్ధగా దండం పెట్టుకుని పట్టి సీమకి  బయల్దేరాం.

ఆ రోజు ప్రయాణం ...పట్టి సీమ, గోదావరి మీద లాంచీ, పాపి కొండలు, భద్రాచలం.. తలుచుకుంటే కడుపు నిండి ఆ తిండి ఆకర్లేదని పించింది.

పట్టిసీమ ఇవతల ఒడ్డుకి చేరుకున్నాం. అక్కడే మా లాంచీ, దాని యజమాని/మా టూర్ గైడ్ తాతాజీ కనిపించాడు.    దగ్గరలో ఉన్న  ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహానికి  దండం పెట్టించి, లాంచీ ఎక్కించాడు (ఇందులో మతలబు బోధపడలేదు అప్పుడు ).  ఈ లాంచీ మొత్తం మీ కోసం, ఎవరిని ఎక్కించం, ఇందులో మీకు అన్నీ రెడీ - కాఫీలు, టిపినీలు, భోజనం అని చెప్పుకొచ్చాడు. మేము అనుకున్నంత కాకపోయినా బానే ఉందనిపించింది. ఫోటోలు తీసుకున్నాకా, లాంచీ రయ్యంది, అయిదు నిమిషాలలో అవతలి ఒడ్డున ఉన్న పట్టి సీమకి  చేరుకున్నాం. ఆ ఇసుక తెన్నెల్లో దిగగానే శంకరభరణం, వంశీ సినిమాలు గుర్తొచ్చాయి.  అద్భుతంగా ఉంది, గోదారి వడిలో, నీటి చప్పుడులో, సేద తీరడానికి భలే స్పాట్ సెలెక్ట్ చేసుకున్నావు కదయ్యా వీరేశ్వరా అనుకున్నాను.  

దర్శనం చేసుకుని లాంచీ చేరుకున్నాం. వాడిచ్చాడు కదా అని టిపినీ కొంచం టేస్ట్  చేసి లాంచీ పైకెక్కి  సై అన్నాం. క్లీనర్ రై రై అన్నాడు. లాంచీ నీటి తెరలను చీల్చుకుంటూ ముందు కెళ్ళింది. సూత్రధారులు సినిమాలో సత్య నారాయణ లాగా కూర్చిలో కూర్చుని గోదావరిని చూస్తూ కూర్చున్నాం. చూడడానికి ఇంకో రెండు కళ్లుంటే బావుండనిపిచింది. కొంత సేపయ్యాక కిందకు దిగి, లాంచీ వంచ మీద  కాళ్ళు నీళ్ళల్లో పెట్టి కూర్చుంటే, ఆ వడికి, నీటి తుంపరలు ఎగిరి పడుతుంటే, చల్లని ఏటి గాలి తడుతుంటే స్వర్గం దీనికి దిగదుడుపేమో  అనిపించింది.


ఆ హాయిలో గంటలు నిమిషాలు లా గడిచిపోయాయి. సుమారు ఒంటి గంటకి పాపి కొండల దర్శనం ఐంది.  "అల పాపి కొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా" అని వేటూరి చెప్పినట్టు, గోదారి నవ్వుతున్నంత ఆహ్లాదంగా ఉంటుంది, ఆ కొండలను కడుగుతునట్టే ఉంటుంది. చాలా సేపు చూడనిచ్చాక తాతాజీ లాంచీ ని  ఒక తాండా దగ్గర ఆపాడు. అక్కడే మా మధ్యాహ్న భోజన పధకం అన్నమాట. అసల ఒక్క పదార్ధం కూడా తినలేక పోయాము. కొంత సేపు ఆ వ్యూ పాయింట్ నించీ గోదారిని తనివి తీరా చూసి బయల్దేరాం.



గోదావరి లో నీరు అంత ఎక్కువగా లేకపోవడం వల్ల, భద్రాచలం వరకూ లాంచీ వెళ్ళదని చావు కబురు చల్లగా సెలవిచ్చాడు తాతాజీ. అందువల్ల మా ప్రయాణానికి చిన్న మార్పులు చేర్పులూ చేసి మమ్మల్ని పోచవరం లో దింపుతా  అన్నాడు.  అక్కడి నించీ బస్సు పట్టుకుంటే కూనవరం, అక్కడ ఇంకో  బస్సు పట్టుకుంటే భద్రాచలం.
ఓస్ ఇంతేగా అనుకున్నా, మా గత ప్రయాణాల అనుభవాల వల్ల ఏదో తేడా కొట్టింది. భారం రాముడి మీద వేసి  బయల్దేరాం.

పోచవరం చేరే సరికి సాయంత్రం ఆరయ్యింది. అదో చిన్న పల్లె. ఒక డజను ఇల్లుంటాయేమో. ఇక్కడికి బస్సు కూడా వస్తుందా అని ఆశ్చర్య పోయాం. కానీ మా ఆశ్చర్యాన్ని పటాపంచలు చేస్తూ మాకు భయం కలిగించే విషయం చెప్పాడు తాతాజీ - ఆఖరి బస్సు మూడింటికే వెళ్ళిపోయిందని. గుండెలో రాయపడినా, తాతాజీ ఏదో మార్గం చూస్తాడులే అని ధైర్యం. ఆటోలు ఎమన్నా ఉన్నాయేమో అని కనుకున్నాడు. ఆటో కాదు కదా కనీసం ద్విచక్ర వాహనం కూడా ఎవరికీ లేదు ఆ పల్లెలో. వాళ్ళనీ వీళ్ళని కనుక్కొని  అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఇంకో ఊరుందని, అక్కడ ఆటో లేమన్నా దొరకచ్చని, లాంచీ లో ఉన్న మా సామాను తీసుకోమని సెలవిచ్చాడు తాతాజీ.
మాకొచ్చిన కోపానికి తాతాజీ ని కాలు కిందేసి తొక్కేయాలని పించింది. కంట్రోల్ చేసుకుని, సమస్య సామరస్యం గా చర్చించి, భద్రాచలానికి ఏదో ఒక వాహనం దొరికే ఊరి వరకూ మాకు తను షెల్టర్ ఇవ్వడానికి, అతనికి మేము  కంపెనీ ఇవ్వడానికీ  ఒప్పందం చేసుకున్నాం.

ఈలోపు మా పరిస్థితికి సింబాలిక్ గా చీకటి పడింది. గోదావరి ఉదయం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో రాత్రి అంత భయపెడుతుందని మాకు అప్పుడే తెలిసింది. కనుచూపుమేర జనాలు లేరు. చిక్కటి రాత్రిలో నల్లటి ఆకాశం లో డిమ్ గా వెలుగుతున్న చుక్కల వెలుతురులో బోటు సాగుతోంది, భయం పెరుగుతోంది, గుండె వణుకుతోంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు రా సాగాయి. ఈత రాని మేము నీటిలో పడితే, ఇంధనం లేక పడవ ఆగిపోతే, మమ్మల్ని వీడు ఇక్కడే  వదిలిపోతే.... గోదావరిలో హైదరాబాద్ పిల్లలు గల్లంతు అనే న్యూస్ .. వరకూ వెళ్ళిపోయాయి ఆలోచనలు.

ఈలోపు ఇంకో చిన్న పల్లె వచ్చింది (అనుకున్నాం). తాతాజీ పడవని ఒడ్డు దాకా పోనివ్వడం, టార్చీ లైట్ ఊపడం, అక్కడినించీ ఎవరన్నా సిగ్నల్ ఇస్తారేమో అని. నాకైతే అన్వేషణ సినిమా గుర్తొచ్చింది. ఇలా రెండు మూడు చోట్ల ఆపగా ఒక చోట అటు నించీ సిగ్నల్ వచ్చింది. తాతాజీ, ఇంకో ఇద్దరం వెళ్లి కన్నుక్కోగా, ఆ ఊరు జీడికుప్పని,  ఒకే  ఆటో ఉందని, అక్కడినించీ కూనవరం ఒక గంట పడుతుందని తెలిసింది. చిన్న ఆశ చిగురించింది. ఆరుగురు మంది లగేజీ తో ఆటో లో ఎలా పడతాం అని కూడా ఆలోచించలేదు. తాతాజీ ని ఏం చేసినా పాపం లేదని అనుకుని ఎలాగో సద్దుకున్నాం. ఆ ఆటో వాడు ఒక పిల్లాడిని కూడా తెచ్చుకున్నాడు. తోడుకేమోలె అనుకున్నాం. కానీ  టార్చీ లైట్ పట్టుకోడానికాని   ఆ తరువాత తెలిసింది - ఆ ఆటోకి హెడ్ లైట్ లేదు.

ఆటో బయల్దేరింది. చిమ్మ చీకటిలో, కారడివిలో (అదంతా  ఏజెన్సీ ప్రాంతం), ఆ పిల్లాడు వేస్తున్న టార్చీ లైట్  వెలుగులో, దారి పొడవునా గుంటలు పడిన ఆ రోడ్డు మీద ఆటో సాగిపోతోంది.   అసలే బెదిరి పోయిన మమ్మల్ని ఆ ఆటో వాడు, ఇక్కడ కూంబింగ్ జరుగుతోందని, అన్నలు, పోలీసులు తెగ తిరుగుతున్నారని చెప్పి ఇంకా భయపెట్టాడు. పక్కనే ఉన్న పిల్లాడు దానికి వత్తాసుగా అప్పుడప్పుడు పులులు కూడా వస్తూ ఉంటాయని గుండెలో రైళ్ళు పరిగెత్తించాడు.


ఈ లోపు వెనకన కూర్చున్న నాకు తల మీద, ఆటో పైన ఏదో కదులుతూ ఉన్నట్టనిపించింది. నా బ్రహ్మేమో, చెప్తే నవ్వుతారని  ఏమీ మాట్లాడలేదు. ఇంతలో రోడ్డు మీద ఒక గతుకొచ్చింది. అంతే గబాలున ఎవరో నెత్తి మీదకి ఉరికారు.కెవ్వున కేక వెయ్యబోయి, భయాన్ని గొంతులోకి మింగి, ఆటో ఆపమని అరిచాను. డ్రైవర్ అదో రకం లుక్ ఇచ్చి బ్రేక్ వేసాడు ..



.............. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాం.....

రెండవ భాగం  - ఇక్కడ