అందరిలాగా నేను ఆంగ్ల కొత్త సంవత్సరం పురస్కరించుకుని కొన్ని తీర్మానాలు చేసుకున్నాను. సుజాత గారు చెప్పినట్టు అతి సామాన్యమయిన, సర్వ సాధారణమయిన బరువు తగ్గడం అందులో ఒకటి. నా ఎక్సెస్ సైజు ని తగ్గించుకోడానికి ఎక్షర్సైజ్ మార్గమని తేల్చు కున్నాను. అందు కోసం ఉదయాన్నే లేవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను (రెండవ తీర్మానం) . ఒకటో తారీఖు శుక్రవారం కావడం ఈ తీర్మానాలకి ఆదిలోనే ఎసరు పెట్టింది. ఎంత పట్టువదలిన విక్రమార్కుడయినా మరీ వారాంతం లో వ్యాయామం అంటే ససేమిరా అంటాడు. దానితో నా కార్యక్రమం మూడు రోజులు వాయిదా పడింది. ఆ తరువాత వాతావరణం పుణ్యమా అని జలుబు, దగ్గు, 98 F డిగ్రీల జ్వరం తో ఇంకో మూడు రోజులు సాకు దొరికింది. ఇంతలో నా స్నేహితుడు క్రమం తప్పకుండా తన తీర్మానం ఆచరిస్తున్నాడని తెలిసి మొదట ఆనందం (వాడి గురించి), తరువాత బాధ కలిగింది నా గురించి. నా మీద నాకే అసహ్యం వేసింది (నాకు కూడా అనకండి మీరు ). రోజుకి రెండు సార్లు టీవీ 9, వారానికి రెండు సార్లు చాలెంజ్ (టీవీ స్టార్ యాంకర్ ఓంకార్ ఆధ్వర్యంలో మా టీవీ కే మకుటాయమానమయిన కార్యక్రమం ) చూడగలిగిన నేను, ఈ చిన్న పనిని చెయ్యలేనా క్రమం తప్పకుండా అని నిశ్చయించుకుని, అన్నీ సిద్ధం చేసుకోబూనాను మర్నాడు వ్యాయామశాల (జిం) కి వెళ్ళడానికి.
రెండు నెలల క్రితం వ్యాయామశాల లో జేరినప్పుడు సద్దుకున్న బ్యాగ్ ని బూజు దులిపి, ఐపాడ్ , మంచి నీళ్ళ బాటిల్, రెండు సెట్ల ఇయర్ ఫోన్లు (ఒకటి పని చెయ్యకపోతే ఇంకొకటి ముందు జాగ్రత్త) ఒక తుండు గుడ్డ పెట్టుకున్నాను. షూస్, సాక్స్ రెడీ చేసుకున్నాను. నా సెల్ లో అలారం ఏడింటికి, నా శ్రీమతి సెల్ లో ఏడు పదికి, టేబుల్ క్లాక్ లో ఏడు అయిదుకి పెట్టి నాకు దూరంగా వాటిని వేరు వేరు చోట్ల పెట్టాను (ఎందుకు మీరు ఊహించి ఉంటారు). రేపు ఉదయం చెయ్యాలి వ్యాయామం అని గట్టిగా తలుచుకుని పడుకున్నాను. ఉదయాన్నే నా సెల్ మోగింది. అలారం అనుకుని లేచి సమయం చూసాను. 6: 55 . ఇదేంటి నా సెల్ నాకంటే వేగంగా ఉంది అని అనుకునేలోపు అది ఈస్ట్ కోస్ట్ నించి కాల్ అని గ్రహించాను. కళ్ళు విదిల్చుకుని గొంతు సవరించుకుని (ఇది అనవసరం), చెవులు విదిల్చుకుని విన్నాను. రెండే మాటలు. ఇంకో అరగంట లో అనుకోకుండా కాల్ పెట్టాల్సి వచ్చింది. అది నేను హాజరు ఐతే చాలా సంతోషిస్తాను అని చెప్పాడు అవతల తెల్లోడు. పని చెయ్యమని చెప్పీ చెప్పకుండా చేయించుకోవడం తెల్లోల్లకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు. తీర్మానం గురించి ఆలోచిస్తూ దిగాలుగా 7:30 కాల్ తీసుకున్నాను. అది అనుకున్న దానికంటే అరగంట ఎక్కువ అయింది. ఆ పైన అసలు పని, దానితో ఆ రోజు ఉదయం వ్యాయామం కుదరలేదు. కానీ ఏదో విధంగా ఒక్క తీర్మానం అయినా అమలు పరిచా అని ఆనందించాను - అదే ఉదయం లేవడం. ఆ మిశ్రమ స్పందన తో రోజు మొదలెట్టాను.
అది జనవరి ఏడవ తారీఖు ఉదయం. సూరీడు ఖరీదయిన రెస్టారంట్ లో లైట్ లాగా డింగా వెలుగు తున్నాడు . ఆ వెలుతురుని కూడా మేఘాల తెరల పొరలు మిన్గేస్తున్నాయి. గడియారం చూస్తే కానీ సమయం పది అయిందని తెలియదు. పని లో నిమగ్నమయి ఉండగా ఒక ఒక పెద్ద ట్రక్కు గోడ పక్కనే పడినట్టు పెద్ద కుదుపు వచ్చింది. వెంటనే ఇంకోసారి. ఒక్కసారిగా బయటకి వచ్చాం అందరం. అది భూకంపం అని గ్రహించాం.కొంత సేపు ఆగి అంతర్జాలం లో అది భూకంపమని నిర్దారించుకున్నాం. రిక్టర్ స్కేల్ మీద 4.2. మరీ పెద్దది కాకపోయినా మరీ చిన్నది మాత్రం కాదు. ఒక్కసారి బే ఏరియా లైన్ అఫ్ ఫాల్ట్ మీద ఉందని, ఇలాటివి సాధారణం అని జ్ఞప్తికి వచ్చింది. కొంచం భయం వేసింది . వెంటనే ఇంకొక విషయం గుర్తొచ్చింది. నా తీర్మానాల్లో ఒకటి ఒక్క రోజు పాటించడం వల్ల కాబోసు ఈ భూకంపం అని మనసులో అనుకున్నాను.
ఆ రోజు రాత్రి మళ్ళీ యధావిధిగా అన్నీ సిద్ధంగా ఉన్నాయో లేదో చూశా మర్నాటి వ్యాయామానికి. అలారంలతో సహా . ఉదయాన్నే లేచి తయారయ్యి, వాటర్ బాటిల్,తుండు, ఐపాడ్,ఇయర్ ఫోన్ సమేతుండ నయి వ్యాయామా శాలకి బయల్దేరా. అదృష్టవసాత్తు ఇంకేం అవాంతరాలు లేక ఆ రోజు వ్యాయామం పూర్తయింది. ఏడాది లో ఒక్కసారి అయినా పాటించాను నా తీర్మానాన్ని అని నా శరీరం స్వేద బాష్పాలు, నా కళ్ళు ఆనంద బాష్పాలు ఒకేసారి కార్చాయి. తుండు గుడ్డ తో ఆ గండి పూడ్చి ఇంటికి బయల్దేరాను.
అదే రోజు ఉదయం ఒంటి గంట ప్రాంతం లో మళ్ళీ తీవ్రమయిన కుదుపు. బాబోయ్ ఇంకో భూకంపం. ఇక కారణం వెంటనే స్ఫురనకొచ్చింది. ఒక్కడి ఆరోగ్యం కంటే సమాజ శ్రేయస్సు ముఖ్యమని నా అంతరాత్మ డి టి ఎస్ లో ఘోషించింది.రుద్రవీణ లో శ్రీశ్రీ వాక్యాలు బాలు గొంతులో వినపడ్డాయి. అంతే
నేను సైతం ఈ నేలకోసం నా కార్యదీక్షను దారపోస్తాను
నేను సైతం ఈ ప్రజలకోసం నా రెజల్యూషన్ వదిలివేస్తాను
అని అనుకుని నా తీర్మానాలకి తిలోదకాలు ఇచ్చేసాను కేవలం లోక కళ్యాణాని కే .
నా లో సంఘ సేవకుడు ఉవ్వెత్తున ఉప్పొంగిపోయాడు నా త్యాగనిరతికి, మానవత్వానికి.
వచ్చే ఏడాది నోబెల్ బహుమతికి నా పేర ఉంటుందేమో చూస్తూ ఉండండి.
శెలవు.
-- లోకాసమస్తాత్ సుఖినోభవంతు --
అయ్యొ మిస్స్ అయిపొయానే.. ఇప్పటివరకు నేను భూకంపం , సునామి లాంటివి చూడలేదు.. బాబ్బబు ఒక్కసారి మార్చి 8 తరువాత జిం కి వెళ్ళగలరా.. కావాలంటే నేను మీకు ఫొన్ చేసి మరీ లేపుతా..
ReplyDeleteఇదేం సరదా అండీ బాబూ. భూకంపం, సునామీ ఇలాటివి చూడాలని. నాకు 2012 లో వుడి హర్రెల్సన్ గుర్తొచ్చాడు. :)
ReplyDeleteతప్పకుండా ట్రై చేస్తా మీరు రాగానే జిం కి వెళ్ళడానికి.
వాసుగారూ... (పాత సినిమాల్లో బాబుగారూలా చదువుకోండి).. మీదెంత విశాల హృదయం వాసుగారూ.. యెంత విశాల హృదయం.. మీ త్యాగానికి తగ్గ గుర్తింపు వచ్చి తీరుతుందండీ.. వచ్చి తీరుతుంది.. ఖళ్..ఖళ్.. (ఇది స్పెషల్ అఫెక్ట్ కోసం)
ReplyDelete@ నెమలి కన్ను : హి హి హి. ఏమ్హిటండీ ఈ వెర్రి (అష్టా చెమ్మా స్టైల్ లో)
ReplyDeleteబాగుంది, చాలా చాలా బాగుంది (నాటక ఫక్కీ లో అనుకోండి...)
ReplyDeleteఖరీదైన రెస్టారెంట్ లో లైట్ లాగా......డిం గా...
శరీరం స్వేదభాష్పాలు - కళ్ళు ఆనందభాష్పాలు
గుడ్....
నెనర్లు మై డైరీ. ఆ రెండు పోలికలు గురించి ఎవరూ రాయలేదేంటి (బా వోలేదా ఏంటీ) అని తెగ బాధ పడుతున్నాను.
ReplyDeleteభలే రాసారు. చాలా నచ్చింది నాకీ టపా!
ReplyDeleteమై డయరీ చెప్పినవి నాకూ నచ్చాయి. కానీ హైలైటు మాత్రం "98 F డిగ్రీల జ్వరం"! :)
వారం పాటు ఎలా చూళ్ళేదో ఈ టపాను!!
@ చదువరి: థాంక్సండీ.
ReplyDeleteహేవిటో... ఇలా మర్చిపోయిన రిజల్యూషన్స్ గుర్తు చేసి బాధ పెడుతున్నారు. మీరు చేస్తే మీ పక్క భూకంపం వచ్చింది నేను చేస్తే ఈ పక్క నే వస్తుందేమో.... మంచుపల్లకి గారు వెస్ట్ కోస్ట్ వెళ్ళనక్కర్లేకుండానే ఈస్ట్ కోస్ట్ లో తెప్పించ్చొచ్చు. హ్మ్మ్ గుండెపట్టేసినట్లుంది రిజల్యూషన్స్ అనుకుంటే.. మీకిది తగునా అహ తగునా అని అడుగుతున్నాము.
ReplyDeleteబై ది వే చాలా మీ పోస్ట్. నవ్వి నవ్వి మీ పోస్ట్ ఆఫీస్ లో చదవకూడదని రిజల్యూషన్ తీసుకున్నా నేను.
ReplyDeleteగమనిక: మీరు రాసిన పోలికలన్నీ గమనించి నవ్వటం జరిగింది, ప్రత్యేకం గా గమనించలేదని బాధపడవద్దని విన్నపం. :-)
@ భావన: హి హి హి. లేట్ గా అయినా లేటెస్ట్ గా ఇచ్చారు కామెంట్. మీ ప్రోత్సాహానికి బోలెడు థాంక్సులు.
ReplyDeleteకొంపదీసి మీరు అలాటి ప్రయత్నాలేమీ చెయ్యకండి. అసలే ఈస్ట్ కోస్ట్ అంతా పెద పే...ద్ద భవనాలు.