Thursday, August 19, 2010

కౌముది లో నా కథ

                          

              మొన్నోరోజు మా బంధువులు  కౌముది లో నా కథ చదివాం అని చెప్పారు. అప్పటి దాకా నాకు ఆ కథను కౌముది వారు ప్రచురించారని తెలియదు. వంగూరి ఫౌండేషన్ ఉగాది పోటి లో బహుమతి పొందిన కథలు కౌముది లో వేస్తారని విన్నాను కానీ నా కథ  గత  సంచికలో రాకపోయేసరికి ప్రసంశా పత్రం వచ్చినవి వెయ్యరేమో అని సరిపెట్టుకున్నాను.

నేను  రాసిన  మొదటి కథకి (రాసినప్పుడు కథో కాదో కూడా నాకు తెలియదు)  గుర్తింపు రావడం ఆనందంగా  ఉంది. ఇంకా రాయాలని ఊపొచ్చింది.

ఈ కథని కౌముది ఆగస్టు సంచికలో  చదవచ్చు.

అన్నట్టు నా బ్లాగ్ లోని భోగి పిడక కథే ఇది.  ముగింపు మార్చి  పోటీకి పంపాను.

ఏది బావుందో చెప్పాలి మరి మీరు.

మనలోమన మాట. ఏదీ బావోకపోయినా చెప్పండి. మరేం  పర్లేదు.

.

Sunday, June 6, 2010

వేదం - ఇలాటి సినిమా తెలుగులో రాలేదు


గమ్యం సినిమా నాకు పెద్ద గొప్ప సినిమాలాగా అనిపించలేదు. కొంచం విభిన్నంగా ఉన్నఒక మామూలు సినిమా.
ఎందుకు ఈ దర్శకుడిని ఇంత ఎత్తేస్తున్నారు? బహుశా అతనికి సినిమా వాళ్లతో ఉన్న పరిచయం వల్లనేమో అనుకున్నాను. సాధారణంగా మొదటి సినిమా తో పైకెగిరి రెండవ సినిమాకి చతికిల పడే దర్శకుల్లో చేరిపోతాడేమో అనుకున్నాను. కానీ వేదం చూశాక ఇతను మంచి విషయం ఉన్న దర్శకుడు అని తెలిసింది.
అయిదు పాత్రలు, వారి కథలు ఒక చోట కలవడం. అది వారి జీవితాలని మలుపు తిప్పడం వేదం కథ అని చూచాయిగా తెలిసింది మీడియా లో సినిమా గురించి ఊదరకొట్టడం వల్ల. ఆడియో నాకు వినగానే బాగా నచ్చింది ముఖ్యంగా "మళ్ళీ పుట్టనీ", "ఏ చీకటీ" పాటలు. సాహిత్యం కూడా చాలా చక్కగా ఉంది. సరిగ్గా వాడుకుంటారా సినిమాకి అన్న అనుమానం మొదలైంది.
రకరకాల సమీక్షల  ద్వారా పాజిటివ్ టాక్ చూసి సినిమా బానే ఉంటుందిలే అనుకునే బయల్దేరాం. బే ఏరియా లో తెలుగు సినిమాకి  హాలు నిండడం, టికెట్ లు అయిపోయాయని ఇంకో ఎక్స్ట్రా షో వెయ్యడం మగధీర తరువాత ఇదేనేమో. 



సినిమా మొదలైంది. ఒక్కొక్క పాత్రని ప్రవేశపెట్టడం మెల్లగా కథని ఆవిష్కరించడం బావుంది. మనోజ్ పాత్రకి ఇంకెవరి నయినా పెట్టాల్సింది.  ఇంటర్వల్ సమయానికి బాగా తీసాడు, ఎక్కడా బోర్ కొట్టలేదు అనుకున్నాం (ఈ మధ్య ఇది కూడా కష్టం అయిపోయింది తెలుగు సినిమాలలో). ఇంటర్వల్ తరువాత ఇక కథలో లీనమయిపోయాం.క్లైమాక్స్ కి జనం నించి మంచి రెస్పాన్స్ వచ్చింది.

పాత్రలు తప్ప నటులు కనపడలేదు. ముఖ్యంగా అనుష్కా, అల్లు అర్జున్ బాగా చేశారు. అనుష్కా కి స్నేహితురాలి(/స్నేహితుడి)గా చేసిన నటుడు అద్భుతంగా చేశాడు. నాకు మధుర్ బండార్కర్ సినిమాలలో కనిపించే పాత్రలు గుర్తొచ్చాయ్. ఇంచు మించు అందరు నటులు తమ పాత్రలకి ప్రాణం పోశారు.
ఈ సినిమాకి నిజమయిన హీరో క్రిష్. ఇతను ఇలాటి కొత్త రకం తెలుగు సినిమాలు తీసి మున్ముందు కొత్త శకం తెలుగు సినిమాకి ప్రతినిధి అవుతాడని ఒక ఆశ కలిగింది. నాకు కొత్త వారిలో (గత దశాబ్దం అనుకోండి) శేఖర్ కమ్ముల, సుకుమార్, చంద్ర శేఖర్  యేలేటి  సినిమాలు నచ్చుతాయ్. కానీ  అన్నిటిలోనూ ఏదో వెలితి ఉంటుంది.    శేఖర్ కమ్ముల సినిమాలలో టెక్నికల్ గా పర్ఫెక్షన్ ఉండదు. సినిమా మాధ్యమాన్ని బాగా వాడుకుని కథని ఎలివేట్ చేసే శక్తి లేదు కమ్ములకి. సుకుమార్ టెక్నికల్ గా పెర్ఫెక్షన్ ఉంటుంది, టేకింగ్ స్టైలిష్గా  ఉంటుంది   కానీ కథ లో ఏదో లోపం , వెలితి కనిపిస్తాయ్.లేకపోతె ఏదో ఎక్కడో తేడా చేసేస్తాడు.  ఇక చంద్రశేఖర్ యేలేటి. నాకు అనుకోకుండా ఒక రోజు చూసి మైండ్ బ్లాక్ ఐంది. తెగ నచ్చింది. ఇతని సినిమాలు ప్రయాణం తప్ప అన్నీ ఇష్టం నాకు. కాకపోతే కొంచం స్లో గా ఉంటాయ్.
వేదం లో మాత్రం క్రిష్ అనీ బాగా బ్యాలెన్స్ చేసాడు అనిపించింది. టెక్నికల్ గా పేరు పెట్టడానికి ఏం లేదు. కథ, కథనం, మాటలు చక్కగా రాసాడు. ఆర్ట్ ఫిలిం లా కాకుండా కమర్షియల్ సినిమా తీసాడు కొత్త కథ అయినా. ఇలాటి సినిమాలు మున్ముందు బోలెడు వచ్చి ఆరు పాటలు ఏడు ఫైటులు, పాత చింతకాయ పచ్చాడి కథలు, తాతల నాటి కథనాల నించీ తెలుగు సినిమాలు బయటపడాలని ఆశిస్తున్నాను.

Friday, March 26, 2010

పవర్ కట్




ఒక శనివారం 1992,
హైదరాబాద్ 
"అక్కా బయిటికి వెళ్దాం  రావే. ఎంచక్కా ఆడుకోవచ్చు. కరెంట్ వచ్చేవరకు"
"వద్దులేరా తెలుగు వార్తలు అయిపోయాయి. ఉర్దూ వార్తలు కూడా ఐపోవచ్చాయి. మనం వచ్చే లోపు కరెంటు వచ్చేస్తే సినిమా కొంచం మిస్ ఐపోతాంరా"
"కరెంటు అప్పుడే రాదే. పెద్ద మంట వచ్చింది ట్రాన్స్ ఫార్మర్ నించీ. ఎలెక్ట్రిక్  అంకుల్ రావడానికే గంట పడుతుంది."
"నీకెన్ని సార్లు చెప్పాను. ఎలెక్ట్రిక్ కాదు లైన్మెన్ అంకుల్ అని"
"అలా ఐతే నాన్న రోజూ రిక్షవాడిని. ఆటో వాడిని, షాపు వాడిని అందరినీ అంకుల్ అనకూడదు అని చెప్తే నువ్వు విన్నావేంటి. ఇప్పుడదంతా ఎందుకు. పక్కింటి ప్రియాంకా, ఎదురింటి తేజా కూడా వస్తారు. పద త్వరగా. రాత్రి 'కరెంట్ షాక్' ఆడితే భలే ఉంటుంది."
----- 



ఒక వేసవి రాత్రి , 1997
ఐనాపురం 
"అప్పుడే మొదలెట్టేశారా.. రాత్రైతే చాలు. కరెంటు పోయి చీకటిలో మొహాలు కనపడవేమో ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో కూడా ఆలోచించకుండా, మరీ ధైర్యంగా పాడేస్తున్నారు.  ఈ అంతాక్షరీ తో హడల కొట్టేస్తున్నారు. హాయిగా పెందరాడే పడుకోవచ్చు కదా. మేమైతే తాతయ్య పొలం నించి వచ్చేసరికి పడుకునే వాళ్ళం తెలుసా. ఇక మా అమ్మమ్మా వాళ్ళింట్లో ఐతే అయిదింటికి రాత్రి భోజనాలు. ఆరింటికి పడక."
"మావయ్యా. మీకు అదే  అలవాటు ఐపోయినట్టుంది. ఏడైతే  చాలు తెగ తూలిపోతారు. రాత్రి నిద్రకు ఆగలేరు. పొద్దున్నే మమ్మల్ని లేపకుండా ఉండలేరు. కనీసం ఎనిమిదింటి వరకూ కూడా పడుకోనీకుండా ఏంటిది."
"బాబయ్యా. మీ ఊళ్ళో సగం సేపు కరెంటు ఉండదు. మేము వచ్చినప్పటి నించీ ఒక్క రాత్రి అయినా కరెంటు ఉందా. టీవీ చూడలేం. బయటకెళ్ళి ఆడలేం. పోనీ ఊరంతా షికారు కెల్దామంటే మీ భయం తో మమ్మల్ని భయపెట్టేస్తున్నారు. మర్రిచెట్టు వరకూ వెళ్ళేలోపు వెతకడం మొదలెట్టేస్తావ్ ఎక్కడున్నామా అని."
"నాన్నా ఆకోనీ..  నువ్వు యెల్లి పో. 

బావా ఇప్పుడు ప తొ పాదాలి నువ్వు "
------ 



ఒక బ్యాడ్ డే కి ముందు డే, 2001 
హైదరాబాద్ 
"రేయ్. ఏంట్రా ఇది. సిరాకు దొబ్బుతోంది. మొన్నటి దాకా ర్యాగింగ్. ఫ్రెషర్స్ ఐంది కాస్త ఎంజాయ్ చేద్దాం అనేలోపు ఈ ఎగ్జామ్స్ ."
"ఔన్రా. అయినా ఈ తొక్కలో ఇంజనీరింగ్ లో చేరకూడదు రా . చేరినా జే ఎన్ టి యు లో అసల జేర కూడదు. ఏడాదికి ఆరు ఇంటర్నల్సా. మొదలెట్టింది డిసెంబర్లో, ఆగష్టు లో ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్. అంటే ప్రతీ నేలా ఏదోకటి రాస్తూనే ఉన్నాం. ఇక నెక్స్ట్ సెం మరీ ఘోరం."
"మీరిద్దరూ ఆపండిరా. తొక్కలో డిస్కషన్. నేను రాజు గాడు ఎప్పుడు వస్తాడా అని వెయిటింగ్."
"ఎందుకు రా.. ఆడు అసలే  పరమ ఐరన్ లెగ్గు కదా"
"అందుకేరా. మనం చేసేదే వన్  డే బ్యాటింగ్. రేపు ఎగ్జాం పెట్టుకుని ఈ రోజు కూడా చదవకపోతే ఎదవ గిల్టీ ఫీలింగ్. పైగా మా నాన్న ఇదే పాయింట్ మీద ఏడాది దెప్పు తాడు. అదే కరెంట్ పొతే ఒక తొక్కలో ఎక్స్క్యూస్ అయినా ఉంటుంది."
"ఏడిసావ్లే. నీ తొక్కలో రీసనింగ్ నువ్వూ. మీ నాన్న జెనరేటర్ అద్దెకి తెచ్చి అయినా ఈ రోజు మీ ఇంట్లో కరెంట్ ఉంచుతాడు."
"రేయ్. రాజు గాడొచ్చాడు!!"
"కరెంట్ పోయింది"
"పదండ్రా.. నాకు బుర్ర హీటెక్కి పోయింది. చాయ్ పడాలి. అలా ఒక రౌండ్ ఏసోద్దాం."
-------- 



ఒక కరెంటు పోయిన రాత్రి, 2010 
బే  ఏరియా (కాలిఫోర్నియా)లో అమెరికన్లకంటే తెలుగు వారు ఎక్కువగా  ఉండే ఒకానొక నగరం.  
"వాట్. కరెంటు పోయిందా. నీ మొహం. ఆ ఫ్యూజ్ ట్రిప్ అయ్యి ఉంటుంది. సరిగ్గా చూడు"
"లేదు ఎవరికీ లేదు. జంక్షన్ లో ట్రాఫిక్ లైట్స్ కూడా పని చెయ్యట్లేదు. తెలుసా"
"ఔనా. Strange. ఇది నేనిక్కడికి వచ్చినప్పటి నించీ జస్ట్ రెండవ సారి అనుకుంటా. మూడేళ్ళలో "
"నేనొచ్చాకా అసల ఇదే మొదటి సారి"
"కాల్ చేసావా"
" గంట వరకూ రాక పోవచ్చని చెప్పారు. ఏం  చేద్దాం."
"వాక్  కెల్దామా?"
"నువ్వేనా ఆ మాటన్నది.. :)... ఓకే "
"అబ్బ.. ఎన్నాళ్ళయిందో.. చీకట్లో.. కటిక చీకట్లో.. ఇలా ..ఆకాశాన్ని చూసి.  పాలవిల్లుకి కట్టిన పళ్ళలా వేలాడుతున్నాయి కదూ నక్షత్రాలు. చంద్రుడు మరీ ముద్దొచ్చేస్తున్నాడు. బ్లాకు డ్రెస్ లో ఉన్న తమన్నాలా..  ఎపుడో  చదువుకునే రోజుల్లో చూసా."
"ఎవరిని?"

"కంగారు పడకు. తమన్నా అప్పటికి  సినిమాలలో రాలేదులే..






.. ఔను.. రోజూ ఇలాగే ఉంటుందా?"

" హ్మ్..  ఏమో. అవి ఆకాశంలోకి వచ్చేలోపు నువ్వు ఇంటికి రావు. నువ్వు వచ్చాక మనం బయటకి వెళ్ళం."
"ఛ. రోజూ ఒక గంట కరెంటు పోకూడదూ.."
"అబ్బా. ఎంతాశో.. ఇది అమెరికా. ఇప్పటికే టీవీ లో ఇదో పెద్ద న్యూస్ అయిపోయి ఉంటుంది. "
"ఏంటి మనం వాక్ కి రావడమా..??"
"హ్మ. $!@#$&#*($)_)(_)"
------
P.S. బే  ఏరియా  లో మొన్న రెండు నగరాలలో 85 నిమిషాలపాటు ఏక బిగిన పవర్ కట్.

Wednesday, March 24, 2010

శ్రీ రామ నవమి అనగానే....


శ్రీరామ నవమి అనగానే గుళ్ళలో పందిళ్ళు, వడపప్పు పానకాలు, సీతారామ కళ్యాణం, ముఖ్యంగా ఊళ్ళల్లో ఐతే పండగ అనే కంటే ఒక పెళ్లి వాతావరణం ఉంటుంది. పెళ్లన్నా, పెళ్లి హడావుడి అన్నా ఇష్టం లేని వాళ్ళెవరు? బహుశా అందుకేనేమో నాకు శ్రీ రామ నవమి అంటే పండగలలో ప్రత్యేకమయిన ఇష్టం. శ్రీ రాముడు దేవుడన్న విషయం పక్కన పెట్టినా, రాముడు ఆదర్శ పురుషుడికి ప్రతిరూపం. రామాయణం - మనిషి ఎలా బతికితే మనిషి అనిపించుకుంటాడో చెప్పే ఒక గైడ్. సమాజం సవ్యంగా నడవడానికి ఒక మార్గం. దానిలోని సారాన్ని గ్రహించి ప్రస్తుత పరిస్థితులకి అన్వయించి వాడుకుంటే రామాయణ పరమార్థం అవపోసన పట్టినట్టే అని నా ఉద్దేశ్యం.
సీతారాముల శుభ చరితం రస భరితం ఇది నిరితం
కమనీయం రమణీయం అనుదినము స్మరణీయం


అందుకే అనుకుంటా ఎన్ని రామాయణాలు వచ్చినా, రామాయణం లోంచి ఎన్ని కథలు వచ్చినా అతి మధురంగా ఉంటాయి. ఎన్ని సార్లు చూసినా విన్నా తరగని సుధలా మనసుకు విందు చేస్తుంటాయి. అన్నమయ్య రామచంద్రుడితడు అన్నా, త్యాగయ్య జగదానంద కారకా అన్నా- రామదాసు అంతా రామమయమన్నా మది పారవశ్యంతో పులకిస్తుంది. భక్తితో ఆనంద తాండవం చేస్తుంది. రామగానామృతం లో ఆర్తిగా తడుస్తుంది.



శ్రీ రామ నవమి రాముడి పుట్టినరోజు అయినా ఆ రోజు సీతారామ కళ్యాణానికే ప్రాముఖ్యత (ఎందుకా అని అడిగాను కొంతమందిని. కొంతవరకూ తెలిసింది. పెద్దలు ఎవరన్నా ఇంకా విపులంగా వివరిస్తే తెలుసుకోవాలని ఉంది). భద్రాద్రి లో కళ్యాణం కనులపండువుగా జరుగుతుందని వినడం, టీవీ లలో చూడడమే కానీ ఎప్పుడూ అక్కడ చూసే అదృష్టం ఇంకా కలగలేదు. నవమికి కాకపోయినా గోదావరి మీద (లాంచీ లో) ఒకసారి భద్రాచలం వెళ్లి దర్శించుకున్న తృప్తి మాత్రం ఉంది.


అమెరికాలో శ్రీ రామ నవమి అనగానే నాకు, చాలా మందికి పడమటి సంధ్యారాగంలో ఒక సన్నివేశం స్ఫురణకొస్తుంది. అందులో, ఆ రోజు శ్రీ రామ నవమని కూడా తెలియలేదని, స్వదేశం లో ఉంటే ఎంతో బాగా జరుపుకునేవాడినని ఒక ప్రవాసాంధ్రుడి బాధ. అదృష్టవశాత్తు గత దశాబ్ద కాలంలో ఇక్కడ మన జనాభా పెరగడం వల్లనైతే నేమి, మారిన ప్రచార మాధ్యమాల వల్లనైతేనేమి అలాటి అవస్థ లేదు. వారం ముందు నించే పండగ గురించి తెలిసిపోతోంది. గత ఏడాది లాగా వారంతం లో వస్తే ఇంకా అద్భుతంగా ఉండేది నవమి. ప్రశాంతంగా రాముడిని స్మరించుకోడానికి, పానకం, వడపప్పు , చలివిడి సావకాశంగా తినడానికి వీలు చిక్కుండేది. 


శ్రీరామ నవమి అనగానే సీతారాముల కళ్యాణం, అది తలుచుకున్నప్పుడు ఎన్ టి ఆర్ గారి సీతా రామ కళ్యాణమో బాపు గారి సీత కళ్యాణమో గుర్తుకు రాకమానదు. రెండూ నాకు భలే ఇష్టం. అందులో సీత కళ్యాణం ముఖ్యంగా రామాయణం మొత్తం ఒక నృత్య రూపకం లా చిత్రించడం నాకు భలే ఇష్టం. సీత రాముల బాల్యం, దశావతారాలు (ముఖ్యంగా వామనావతారం), విశ్వామిత్రుడు చెప్పే కథలు , సీతా రాముల కళ్యాణం అంత అందంగా తియ్యడం నేనే సినిమాలోనూ చూడలేదు. నేను ప్రతీ నవమికి ఆనవాయతీగా ఈ సినిమా చూస్తాను. రేపు సాయంత్రం కుదరకపోతే కనీసం వారంతమయినా చూడాలి.


మాకింకా నవమి రాలేదు కాబట్టి గత నవమి పానకం,వడపప్పు (ఫోటో మాత్రమే) ఇదిగో మీ కోసం.
అసల విషయం మర్చిపోయా.. మీకందరికీ  
                                            శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 








P.S.  రామ కీర్తనలు (సినిమలలోనివి కానివి కూడా) వినాలంటే పైన వినచ్చు.

                                                      ---    లోకాస్సమస్తాత్ సుఖినో భవంతు  ---

Saturday, March 20, 2010

కారం చట్నీ (అయినాపురం కథలు)





నలభీమ పాకం అంటారు కానీ మా అమ్మమ్మ వంట కంటే అది గొప్పగా అయితే ఉండదని  నా  నమ్మకం. ఏ వంట అయినా అలవోకగా చేసేస్తుంది అమ్మమ్మ.  అద్భుతంగా ఉంటుంది. అది గుత్తొంకాయ అయినా , గుమ్మడి వడియాలయినా, కందా బచ్చలయినా.. కందిపొడి అయినా సరే.  ఇంత విద్య ఊరికే పోతోందే అమ్మమ్మా  అంటే,"ఊరి కే పోతోంది రా " అని చమత్కరించేది.  ఒక కుక్ బుక్ తయారుచేస్తే బావుంటుంది అనిపిస్తుంది నాకు.కానీ అంత వంట వచ్చిన మా  అమ్మమ్మ చేసే ఇడ్లీ మాత్రం మా సూరయ్య హోటల్ ఇడ్లీ.. కాదు కారం చట్నీవిత్ ఇడ్లీ (క్రమం కరెక్టే)  ముందు దిగదిడుపు.
మా వీధి చివర కుట్టు మిషను కాంతారావు కొట్టుకి ఎదురుగా పాకలో చిన్న హోటల్ సూరయ్యది. అయినాపురం మొత్తానికి ఏకైక హోటల్. అయినాపురం వచ్చినప్పుడు అది వెతకకండే.. దానికి బోర్డు గట్రా ఏమీ ఉండవు. ఊరిలో ఎవరినయినా  అడిగితే  మాత్రం జబ్బట్టుకుని తీసుకొచ్చేస్తారు. బోర్డు మీద పేరు లేకపోయినా ఊరిలో మాత్రం తెగ పేరుంది ఆ హోటల్ కి. అందరూ సూరయ్య హోటల్ (కొంత మంది ముద్దుగా సూరి గాడి హోటల్) అని అంటారు. హైదరాబాది బిరియానీకి ప్యారడైస్, బావర్చి లాగ మా ఊరిలో టిఫిన్లకి అది పెట్టింది పేరు.
నాలుగు చక్క బల్లలు, పాత సినిమా పోస్టర్లు (ఎక్కువగా ఎన్టీ వోడివే) కప్పుకున్న గోడలు,  ఒక బుల్లి వంట గది, బోలెడు జనం దాని ట్రేడ్ మార్క్.  ఉదయం అయిదు నించీ ఏడింటి వరకే తెరిచి ఉంటుంది. తాతయ్య తో వెళ్తే అక్కడే తినేవాళ్ళం. కానీ తాతయ్యేమో ఉదయాన్నే వెళ్ళిపోతాడు తినడానికి. మేము లేచేసరికి ఆయన తిని రావడం కూడా అయిపోయేది. అందుకని ఇంటికే తెచ్చుకునే వాళ్ళం.హోటల్ ఎప్పుడూ కిక్కిరిసి ఉన్నా మేము వెళ్ళగానే సూరయ్య పలకరించే వాడు. మేము ఏమీ చెప్పకుండానే "వాయవుతోంది బాబూ. యేడి యేడి గా యేసిస్తాను. కూకోండి" అని మేము తెచ్చిన స్టీల్ బకెట్, గ్లాసులు లాక్కునేవాడు. దేవత పోస్టర్ మీద పేర్లన్నీ చదివే లోపు బకెట్ నిండా ఇడ్లీలు, దాని మీద విస్తరాకులు, గ్లాసుల నిండా చట్నీలు నింపి తెచ్చేవాడు. ఇడ్లీల కన్నా ముందు చట్నీ ఉందో  లేదో చూసుకుని అతను  "మీ తాతయ్య ఖాతా లో వేసుకుంటా బాబూ" అని  అనగానే  ఇంటికి పరుగు తీసేవాళ్ళం. ఇలాటి ఇడ్లీలు రూపాయికి నాలుగా అని ఆశ్చర్యంగా ఉండేది.
ఇంటికి పరుగెడుతుంటే, ఒక్కోసారి పక్కింటి అరుగు మీద ఆయన సిగ్నేచర్ పంచెతో అర్థ దిగంబరంగా కూర్చునే రాజు గారు ఆపేవారు. "ఏంటి హోటల్ నించీ వస్తున్నారా. అచ్చియ్య (ఆయన భార్య) ఏమీ చెయ్యలేదు.  శివగాడు గోల పెడుతున్నాడు..............." అని ఆయన ఏడ్పుల చిట్టా విప్పేలోపు ఓ నాలుగు ఇడ్లీలు విస్తరాకులో పెట్టి ఆయనకిచ్చి శివకి ఇమ్మనేవాళ్ళం.ఒక్కోసారి మా టైం బావుంటే అయన పిలిచినా వినిపించుకోకుండా ఇంటికి పరిగెత్తే వాళ్ళం.
ఇంటికి రాగానే పెరటి అరుగు మీద కూర్చుని విస్తరాకులో ఇడ్లీ, దాని పక్కన కారపు చట్నీపెట్టుకుని ప్రారంభించే వాళ్ళం.మొదటి ఇడ్లీ ముక్క - నోట్టో పెట్టుకోగానే వేడి ఇడ్లీతో చల్లని పచ్చడి కలిసి నాలుక మీద ఒక రుచి, నాట్యం చేసేది. గాలిలో తెలిపోయే వాడిని. రెండవ ముక్క - చేతిలో ఉండగానే నాలుక ఆ రుచి కోసం తహతహలాడుతూ అర అడుగు బయటకి వచ్చి గబాలున లాక్కునేది. అది కరిగిపోయే లోపు త్రిశంకు స్వర్గం దాటేసేవాడిని. మూడవ ముక్క - ఎక్కడ..ఏది .. అప్పుడే గొంతులో - నేను స్వర్గపుటంచులో.
అలా ఆ రుచిని ఆస్వాదించే లోపు ఆకులో అరడజను ఇడ్లీలు, గ్లాసులో సగం చట్నీ అయిపోయేవి. నేనే తిన్నానా నేనెప్పుడు తిన్నాను ..అనుకునేవాడిని. మిగలిన కారం చట్నీని ఆకు మీద వేసి కొంచం కొంచం తింటుంటే ఆహా నా రాజా..  స్వర్గం లో ఇంద్రుడు పక్కన కూర్చుని కత్రీనా, కరీనా, తమన్నా,ఇలియానా రెహమాన్ సంగీతానికి నాట్యం చేస్తుంటే చూస్తున్నట్టు ఉండేది.
సూరయ్యా!.. ఈ కారం చట్నీలో ఏం కలిపావయ్య.. కుబేరుడి భార్య ఆడిన కారమా, ఇంద్రుడి ఇంట్లో వాడిన పచ్చిమిర్చా, వరుణుడు వేయించిన పోపా అని సూరయ్య మీద కారం చట్నీ కీర్తన ఒకటి పాడాలనిపించేది. నా సాహిత్యం చూసి, గొంతు విని మా ఊళ్ళో వాళ్ళంతా ఉప్పరి  డాక్టరుకి  పేషంట్లు అయిపోతారని ఆగిపోయాను.
ఇలా రోజూ ప్లేట్ ఇడ్లీ తో సీప్ గా స్వర్గానికి వెళ్ళే దారి తెలిసాక వదిలి పెట్టలేక పోయాను.చద్దనం లో ఆవకాయా, కారం చట్నీ తో ఇడ్లీనా  అంటే తేల్చుకోవడం కొంచం కష్టం అయినా ఎక్కువగా ఇడ్లీ చట్నీకే వోటు పడేది.
"అమ్మమ్మ శుభ్రంగా మడి కట్టుకుని రోట్లో పిండి రుబ్బి వేడి వేడి ఇడ్లీలు, కమ్మగా చట్నీ చేసి పెడితే ఎక్కదు మనకి. అక్కడ సూరయ్య వారం నుండీ పులిసిపోయిన పిండిని... ఏమేం పిండులు కలిసాయో.. ఏమేం చేతులు పడ్డాయో ... ఇడ్లీ వేస్తే నాక్కుంటూ తింటారు." అని మావయ్య, అమ్మ ఇడ్లీ తెచ్చినప్పుడల్లా అష్టోత్తరం చదివేవాళ్ళు. ఆ రుచి వీళ్ళకేం తెలుసు అని మనసులో నవ్వుకుని, మర్నాడు ఎప్పుడు తెరుస్తాడా సూరయ్య హోటల్.. ఎప్పుడెప్పుడా కారం చట్నీ .... అని ఆలోచిస్తూ ఉండేవాడిని

Thursday, January 28, 2010

పరిమళం

1.
రాలినవి విరులు
సవరించుకుంటే తరులు
సెలయేటి ముకురాల తమ కురులు


రాలిన ఆ విరులు
చుంబించి సెలయేటి అలలు
రేపాయి ప్రేమ ఆవిరులు
పొంగాయి మత్తు అత్తరులు


చల్ల గాలి బోయీలు
పండుటాకు పల్లకీలో
మోసుకెళ్ళాయి ఆ అత్తరులు
మురిసిపోయాయి అత్తరులు

2.
చినుకు నేలని తట్టింది
ఆకాశం ముద్దుపెట్టింది
ఆ స్పర్శకి చెమట పట్టింది
ఆ స్వేదం లో ఏమి సుగంధం

3.
శిశిరమంతా నగ్నంగా
నిలుచున్నది దీనంగా
వీధి చివర ఒంటరి చెట్టు
వసంతం వస్తుందని
పచ్చటాకుల కొత్త కోకను తెస్తుందని.
తనకి కొత్త కోక వాసనంటే భలే ఇష్టం.

Tuesday, January 26, 2010

నేను హిందువుని కానీ పిరికివాడిని

నేను హిందువుని. అలా చెప్పుకోడానికే సిగ్గు పడుతూ ఉంటాను, ఎందుకంటే ఈ మధ్య మతమంటే బూతు మాట ఐపోయింది.  


నేను హిందువుని. పరమ దైవ భక్తుడిని. కానీ పిరికి వాడిని. దేవుడిని గాడంగా నమ్ముతాను. నేనుండే ప్రదేశం లో , రాష్టం లో వీలయితే దేశంలో నా దేవుడిని కొలుచు కోడానికి ఎన్ని వ్యయ ప్రయాసలకోర్చి అయినా వెళ్తాను.ప్రతీ పండగకి గుడికి వెళ్తాను. ఉగాది నించి సంక్రాంతి దాకా ఏది వదిలిపెట్టను. రోజూ పూజ చేస్తాను. గుళ్ళకి విరాళాలు ఇస్తాను. భక్తి కార్యక్రమాలని శ్రద్ధగా వీలైనన్ని చూస్తాను. నాకు బోలెడు భక్తీ. నా దేవుడంటే యనలేని విశ్వాసం. కానీ ఎవడన్నా నా నమ్మకం మీద దెబ్బకొడుతూ పిచ్చి రాతలు రాస్తే మాత్రం చేతికానివడిలా నోరుమూసుకుని కూర్చుంటాను. నా మతం పరమ పవిత్రంగా చూసుకునే గ్రంథాన్ని అవహేళన చేస్తే నేను మౌన ప్రేక్షకుడిలా ఉండిపోతా. నా సిగ్గుమాలిన తనాన్ని రచయిత భావ స్వేచ్చ అని సరిపెట్టుకుంటాను. సాహిత్య అకాడెమి అవార్డులిచ్చి సత్కరించుకుంటాను. సన్మాన సభలు చేసి ఆకాశానికి ఎత్తేస్తాను.


నేను రోజూ పూజించే దేవతలను నగ్నంగా, అసభ్యకరంగా చిత్రాలు గీస్తే, సెక్యూలరిజం ముసుగు లో నా చేతకాని తనాన్ని దాచుకుంటాను. ఇంకా ఇలాటివి బోలెడు గియ్యాలని ప్రోత్సహిస్తాను. వీలయితే భారత రత్న ఇచ్చి సత్కరించుకుంటా. గుండెలు రగిలిపోయినా ఎవరినీ ప్రతిఘటించను. నా దేవుడిని ఎవడన్నా తూలనాడినా నేను ఎదిరించను. నా రాముడిని ఏ కాలేజీ లో చదివాడని హేళన చేస్తే నేను మౌనంగా బాధ పడ్డానే కానీ ఎవరినన్నా ఎదిరించానా. ఎందుకు? అలా చేస్తే నన్ను మతోన్మాది అంటారని భయం. ఎందుకంటే నా మతం వరకు (కేవలం నా మతం వరకే వర్తిస్తుంది) మతాన్ని కాపాడుకోవడం కేవలం కాపాడుకోవడమే మిగతా వారికి .. కాదు కాదు నా మతం వారికే మతోన్మాదం లాగ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మేధావులు వేల సంవత్సరాల నా మత చరిత్ర అంతా అవపోసన పట్టారు మరి. పుక్కిలించేసారు. వేదాలను ఆమూలాగ్రం చదివి జాతికి ఉపయోగపడే బోలెడు సంపదను చేకూర్చిన మేధావులు, పరమాచార్యులు పామరులని తేల్చేసారు. నా మత గ్రంథాలు పుక్కిట పురాణాలని సెలవిచ్చ్చారు. అయినా నేను ఏం మాట్లాడగలిగాను.
మీడియా లో నా మతాన్ని వెక్కిరిస్తూ, అవహేళన చేస్తూ రాతలు రాసినా, మాట్లాడినా నేను పట్టించుకోను .. కాదు పట్టించుకోనట్టు నటిస్తాను. నోటికొచ్చినట్టు నా మతం గురించి మాట్లాడితే కళ్ళప్పగించి చదువుతాను, గుడ్లప్పగించి చూస్తాను. కానీ నోరువిప్పి మాట్లాడను. అన్యాయమని చెప్పను. రోడ్డు మీద ...ఉహు.. కనీసం నా ఇంటి ముందు కూడా నా నిరసన వ్యక్తం చెయ్యను.
అంతర్జాలం లో నేను నమ్మిన దేవుళ్ళను, పురాణాలను హేళన చేస్తుంటే గుండె చివుక్కుమన్నా, కట్టెలు తెంచుకునే కోపం వచ్చినా, భరించలేని బాధ కలిగినా నేను బయట పడను. స్త్రీ వాదం, సామ్య వాదం, హేతు వాదం పేరుతో నా నోరేక్కడ నోక్కేస్తారో, నన్ను తిరోగమన వాది, ఛాందసవాది అని ఎక్కడ ముద్ర వేస్తారో అని. పురాణాల్లో ఏదో ఒక చిన్న వాక్యం తీసుకుని, వక్రీకరించి నా మత గ్రంథాల నెక్కడ తూలనాడుతారో అని నేను మాట్లాడను. ఆ సందర్భానికి,యుగకాల మాన పరిస్థితుల దృష్ట్యా దాన్ని అర్థం చేసుకోవాలి, పోనీ అది ఇబ్బందికరమైతే కనీసం ఈ మేధావులు దానిలో ఉన్న మంచిని తీసుకోవచ్చు కదా అని నా మనసు గగ్గోలు పెడుతుంది. అయినా నేను దాన్ని గొంతు నోక్కేస్తాను. ఎందుకంటే నేను దేవుడున్నాడు, ఇవి పుక్కిట పురాణాలు కాదు అని ఆధారాలు చూపలేక కాదు. శ్రీ కృష్ణుడు ఉన్నాడని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కూడా నిర్దారించారు. అంత మాత్రాన నేను వీరితో వాదించ గలిగానా. అయినా అది అనుభావించాలి నమ్మించ లేము.నమ్మించడం నా పనీ కాదు ఉద్దేశ్యం కాదు. నేను నా మతాన్ని కూడా ఎవడి మీదకీ రుద్దట్లేదు. కానీ నా మతాన్ని కించపరిచే అధికారం, నా sensitivities ని దెబ్బతీసే అధికారం వీరికి ఎవరిచ్చారు. ఈ స్వేచ్చ వీరికి ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించాలని ఉంటుంది. కానీ నాది ఒంటరి గొంతు అయిపోతుందేమో అని భయం.అందుకే మౌనంగా బాధ పడతాను.

కనీసం నా అభ్యంతరం తెలియచేద్దమన్నా భయమే. ఏకాకి నైపోతానేమో అని. అందుకే నిశ్శబ్దంగా బాధ పడతా. ఎవరన్నా ఒక్కడయినా గొంతెత్తి దీన్ని ఖండిస్తాడేమో అని వేచి చూస్తా. రోజూ అలాటి వాడు ఒక్కడైనా ఉంటాడేమో అని వెతుకుతూ ఉంటా . అలాటి వాడు కనపడగానే సంబర పడతా కానీ అది కూడా మౌనంగానే, పబ్లిక్ గా సంతోషం వ్యక్తం చేస్తే so called intellectual society నన్ను ఎక్కడ వెలి వేస్తుందో, నా మీద ఏం ముద్ర వేస్తుందో అని భయం .
కొన్ని దేశాల లో ఐతే వాళ్ల మత విశ్వాసాలని , నమ్మకాలని దాడి చేస్తే ఖండిస్తారు, శిక్షిస్తారు కొందరైతే ఉరి తీస్తారు అని విన్నాను, చదివాను. ఎందుకంటే వారి మతం కాపాడుకోవడం వాళ్ళకి గౌరవం గా భావిస్తారు. మతం మీద దాడి తమ మీద దాడి గా భావిస్తారు. కానీ నా మతం అభిమతం వేరు. ఎవరన్నా దాడి చేస్తే వారిని మేధావులుగా గుర్తిస్తారు ఆకాశానికి ఎత్తేస్తారు, అవార్డులు ఇస్తారు. ఏమన్నా అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్చ అంటారు. నాకు పెద్దగా లోక జ్ఞానం లేదు కానీ భావ వ్యక్తీకరణ స్వేచ్చ అంటే ఇంకోడి మతం మీద నోటి కొచ్చినది రాయడమా,చేతికోచ్చినది గీయడమా అని ప్రశించాలని ఉంటుంది. కానీ భయం.. కాదు అసమర్థత.


తన వ్యాసం లో ప్రముఖ రచయిత శ్రీ గొల్లపూడి మారుతీ రావుగారు (ఎమ్. ఎఫ్ హుస్సేన్ గారి బొమ్మలు నుద్దేశించి) మా దేవుళ్ళ చిత్రాలు ఇలా వేయడం సబబా? కొన్ని కోట్లమంది sensitivities ని దెబ్బకొట్టిన మీకు ముఖం చెల్లడంలేదంటే తప్పా? మా లక్ష్మీ దేవి, సరస్వతి మీ అమ్మపాటి మర్యాదకి నోచుకోలేదా?’అని ఆ సాయిబుగారి ఒక్క వెంట్రుకయినా పీకరేం?....................... ఏం దరిద్రం పట్టింది మన స్వాభిమానానికి? Intellectual hypocrisy is taken for granted as permissiveness to bigotry- in this country. నేను తెలుగు దేశంలో లేనందుకు ఇన్నాళ్ళూ ఆనందించాను. ఇప్పుడిప్పుడు ఇంకా భారత దేశంలో ఉండక తప్పనందుకు విచారిస్తున్నాను." అని వాపోయారు.
నా దేశంలో అన్ని మతాలూ సమానమే. కానీ నాది తప్ప మిగతావి కొంచం ఎక్కువ సమానం. అది అన్యాయం అనిపించినా సరే. నా దేవుళ్ళని, దేవతలని అవమానించి అయినా సరే , నా మతాన్ని పణంగా పెట్టయినా సరే కళాకారుల భావ స్వేచ్చ, సో కాల్డ్ మేధావుల వాక్స్వాతంత్ర్యాన్ని మాత్రం కాపాడాలి. ఇది అన్యాయం అని ప్రతిఘటించే శక్తి ఎప్పుడో కోల్పోయా, నా స్వాభిమానాన్ని ఎప్పుడో తాకట్టు పెట్టేసా, ఇప్పుడు కేవలం మౌనంగా బాధ పడడమే. అది కూడా తగ్గిపోతోంది. మెల్లాగా వీటన్నిటికీ అలవాటు పడిపోతున్నాను. కొన్నాళ్ళయితే నా మతం కూడా మర్చిపోతానేమో.ఒక్కోసారి అదే మంచిదేమో అనిపిస్తుంది . అప్పుడు ఏ గొడవా ఉండదు. ఈ బాధ, నిస్సాహాయత కూడా ఉండవు.
గమనిక  - వ్యాఖ్యలు చేసేటప్పుడు బ్లాగర్లు తమ విజ్ఞ్యత ప్రదర్శించమని  మనవి. విపరీత వ్యాఖ్యలు , అభ్యంతరకరంగా ఉన్నవి ప్రచురించబడవని  మీకు తెలుసనీ, తదనుగుణంగా  వ్యాఖ్యలు చేస్తారని ఆశిస్తున్నాను. 

Thursday, January 21, 2010

సుజనరంజని (సిలికాన్ ఆంధ్రా) లో నా కవిత

సిలికాన్ ఆంధ్ర వారి అంతర్జాల మాస పత్రిక సుజనరంజని లో నా కవిత ప్రచురిత మయ్యింది. ఈ దిగువ లంకె లో చూడచ్చు.

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec2009/kavita-4.html

సిరివెన్నెల - నా కన్నుల





నేను కూడలి లో జేరక మునుపు రాసుకున్న కవితని మీ మీదకి వదులుతున్నాను. మీ అక్షింతలు వెయ్యండి మరి.




అంబర నీలంబరమున అద్దిన శశాంక శ్వేత వజ్రకాంతులో
కాలమెల్ల వేచి చూచి అలసి సొలసిన చకోరములకు ఊరడింపులో
కలయిక కల ఇక యని విరియని కలువలకు ఓదార్పులో
కవి డెందము స్పందింపజేయు శశి కందర్పుడు సంధించు సుమశరములో
గాన గంధర్వుల గళముల మృదు స్వర మాధురులు నింపు సుధాపాతములో
ప్రేమికుల హృదయాల విరహాగ్ని జ్వాలలు రేపు శృంగార అగ్ని కణములో
ముత్యాల దొంతరలో శ్వేత సుమ మాలికలో మల్లియలో మకరంద మాధురులో
హిమకరములో చర్మచక్షువులు చూడనలవి కాని శ్వేత రాసులో కానీ
ఈ రేయినెల్ల దివము చేసె శశి మయూఖ కాంతులు



ఇది తెలుగు పీపుల్ డాట్ కామ్ లో అప్పుడెప్పుడో ప్రచురితమైంది.
Click here to see this post in telugupeople.com



Sunday, January 17, 2010

భోగి పిడక (అయినాపురం కథలు)


"వచ్చారా ! ప్రయాణం బాగా జరిగిందా." అరుగెక్కుతున్న  మమ్మల్ని ఆప్యాయంగా అడిగింది మా  అమ్మమ్మ.
"ఆ పెట్టెలు అవీ లోపల పెట్టు" అని మా  పాలేరు వెంకతరత్నాన్ని ఆజ్ఞాపించి అందరినీ  చెయ్యిపట్టుకుని లోపలకి తీసుకెళ్ళాడు తాతయ్య  " బోలెడు ప్రయాణం చేసొచ్చారు. మొహం కడుక్కుని కాఫీలు తాగుదిరిగాని. " అంటూ
కుశల ప్రశ్నలయ్యాకా   అందరికీ కాఫీలు పట్టుకొచ్చి,  "నువ్వు వంకలు పెడతావని నీకు మాత్రం మీ అమ్మమ్మే  పెట్టారు." అని  నన్ను  చూసి నవ్వుతూ అంది మా అత్తయ్య .


నాకు   ఊహ తెలిసినప్పటినించీ  ఏ ఏడాదీ సంక్రాంతికి ఊరెళ్ళకుండా లేను. పుట్టినూరు కావడం వల్ల  ఏడాది తిరిగేసరికి మనసు పీకేస్తుంది ఎప్పుడు వెళదామా అని. కోనసీమ లో అయినాపురమని అదొక   చిన్న పల్లెటూరు. పచ్చని పంట పొలాలు, వాటి గట్టు వార కొబ్బరి చెట్లు, సైడ్  కాలువలు,  చెరువు, చెరువు ఒడ్డున  పెద్ద మర్రి చెట్టు, దాని కింద రచ్చబండ. చెరువుకి ఒక వైపు గ్రామ దేవత నీలాలమ్మ గుడి, ఇంకో వైపు విష్ణాలయం, శివాలయం  చూడ ముచ్చటగా ఉంటుంది. ఇక మా తాతయ్య వాళ్ళ ఇల్లు ఇదిగో ఇంత చూడ ముచ్చటగా ఉంటుంది. వచ్చే ఏడాది వజ్రోత్సవాలు జరుపుకునే హోదా వస్తుంది ఈ ఇంటికి.


మేము వెళ్ళే ప్పటికే   మా పెద్దమ్మ, మావయ్యలు,పిన్నిలు  కుటుంబ సమేతంగా వచ్చేసారు.
కాఫీ నోట్లో పోసుకుని, బావలతో కలిసి ఊరుమీద పడ్డాను నేను . ఇంటి బయటకి రాగానే మా పక్కింటి  రాజు గారు దర్శనమిచ్చారు .
"ఏం బాబు ఎలా ఉన్నారు. మీకేంటి మీరు బాగా చదువుతారు.  ఫష్టుగా  మార్కులు తెచ్చుకుంటారు. మా అబ్బాయి చూడు .. ఏమీ లాభం లేదు..  మేమేదో ఇలా గడిపెస్తున్నాం. పోనిలే పోనిలే మీరు బావున్నారు." అని ప్రశ్న సమాధానం ఆయనే చెప్పేసుకున్నారు.

మా ఇంటి దగ్గరే కాఫీ పోడెం పంతులు గారు ఉండేవారు. ఆయనకీ ఇద్దరు పిల్లలు. వాళ్ళావిడ సత్య ఆంటీ. రోజూ రాత్రి  అయ్యేసరికి వాళ్ళ పిల్లలిద్దరికీ పెరడులో అరుగు మీద కూర్చోపెట్టుకుని కథలు చెబుతూ అన్నం తినిపించేవారు. కథలు వినడానికి మేమూ వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడు మాకు కూడా ముద్దలు కలిపి పెట్టేవారు ఆంటీ.  వాళ్ళిద్దరి పిల్లలూ మా ఈడు వాళ్ళే. మా గ్యాంగ్ తోనే ఉండేవాళ్ళు.
ఇంకో నాలుగు రోజులలో భోగి. సత్య ఆంటీ వాళ్ళ పిల్లలు, తొరకల రాజు  అప్పుడే భోగి దండలు కూడా తయారు చేసేసుకున్నారు. ఇక మేము కూడా త్వరపడాలి అని నిర్ణయించుకున్నాం  . ఆవు పేడ వెతికి పట్టుకుని, పిడకల తయారీ కి నడుం కట్టాం. పేడ ని ముట్టుకోవడం, దాని వాసన   కొంచం చికాకుగా అనిపించినా, భోగి మంట సరదా ముందు అది పేద్ద లెక్కలోకి రాలేదు. మా తాతయ్య వాళ్ల ఇంటి చుట్టూ  కోట గోడలాటి పేద్ద గోడ ఉండేది. దాని మీద రకరకాల ఆకారాలతో పిడకలు వెయ్యడం మొదలెట్టాం.  దండ కట్టడానికి కావాల్సిన గారిలాగా కన్నం ఉండే పిడకలతో పాటు, అరటి పండు, బస్సు , యాపిల్ పండు, హరి కృష్ణ, టి. రాజేందర్ ఇలా మా ఊహా శక్తికి  పదును పెట్టి రకరకాల పిడకలతో గోడను నింపాము.  ఇక రోజూ మూడు పూటలా పిడకల  పర్యవేక్షణ చేసేవాళ్ళం. ఎండ బాగా రావాలని పూజలు చేసేవాళ్ళం. అవి  ఎందుకు త్వరగా ఎండట్లేదో కోర్ కమిటి తో సమావేశాలు జరిపేవాళ్ళం. రాత్రిళ్ళు వర్షం పడి పిడకలు కరిగిపోయినట్టు పీడకలలు కూడా వచ్చేవి. ఇలా అవి మా ఇంటెన్సివ్ కేర్ లో మూడొంతులు ఎండాయి భోగి ముందు రోజుకి. ఆ తరువాత వాటిని మంట మీద వేడి చేసి ఇంచు మించి ఎండాకా దండ కట్టి దాచిపెట్టుకున్నాం మర్నాటి మంటకి.


మర్నాడే భోగి. ఊళ్ళల్లో భోగి ఎంత బాగా చేస్తారంటే, ముందు రోజు రాతిరి ఊళ్ళో ఉన్న బళ్ళు, పాకల్లో  వాసాలు (పక్కింటి, పొరుగింటి  వాళ్ళవి లెండి) ఇవన్నీ లేపేసి పోగేసి భోగేస్తారు. అందుకని ఆ రాత్రంతా పెరట్లో పాకకి, ఎడ్ల బళ్ళకి బోలెడు కాపలా. అందువలన ఆ రాత్రి మా తాతయ్య నైట్ షిఫ్ట్ చెయ్యాల్సొచ్చింది అన్నమాట. మేము కూడా మహా  సరదాపడి (దూల అని కూడా చదువుకోవచ్చు) మా తాతయ్యతో పాటు పెరటి అరుగు మీద  గూర్ఖాగిరి లో ఉత్సాహంగా  పాల్గొన్నాం. సాధారణంగా కథలు చెప్పడం లో  బామ్మలు, అమ్మమ్మలు ప్రసిద్ది. కానీ మా తాతయ్య  అదంతా స్త్రీ ఆధిక్య సమాజం చేసిన కుట్ర అని నిరూపించేన్త బాగా కథలు చెప్పేవాడు. కాకపోతే ఒకటే షరత్తు, చెప్తూ ఉన్నంత సేపు  ఆయన కాళ్ళు పట్టాలి.  ఆయన చెప్పే కథలకి, చెప్పే తీరుకి వీరభిమానులమయిన మేము అవి వినడానికి ఏం  చేయడానికయినా  సిద్ధపడే వాళ్ళం .  ఇక కాశీమజిలీ కథలైతే ఒక్క కథే  మా వేసవి శెలవలు మొత్తం ఆక్రమించేది. సాయంత్రం వీధి అరుగు మీద కూర్చుని, మా చేతులరిగిపోయేలా  కథలు చెప్పించుకునేవాళ్ళం. భోగి ముందు రోజు రాత్రి కూడా అలాగే కథలు వింటూ మెలకువ  ఉండచ్చులే అనుకున్నాం. కానీ ఆయన మాకు ఒక కొత్త విద్య నేర్పించారు. అదే మన జాతీయ క్రీడ - హాకీ అనుకునేరు (సినిమా పరిజ్ఞానం బొత్తిగా లేదు సుమీ మీకు) , కాదండీ బాబూ - చతుర్ముఖ పారాయణం. దీన్నే కొంత మంది సీప్ గా పేక అనికూడా అంటారు. ఆ రోజు మాకు సీక్వెన్స్ (రమ్మీ), క్లియరెన్స్ లాటి జీవితానికి పనికొచ్చే ఆటలన్నీ నేర్పారు. దాంట్లో మాకు నేర్పు వచ్చేసింది  కానీ సమయం గడవట్లేదు.  సూరీడు ఇంకా డీప్ స్లీప్ లో ఉన్నాడు  చంద్రుడి షిఫ్ట్ కదా అని. ఇంకా ఆయన నిదురలేవాలి, బయల్దేరాలి, రావాలి. మాకు విముక్తి కలగాలి.
"శ్రీ సూర్య నారాయణ మేలుకో" అని సాఫ్ట్ గా మొదలెట్టి "రా దిగి రా  దివి నుండి భువికి దిగిరా" రేంజ్ వరకూ మా నిరీక్షణ సాగింది సూరీడు కోసం. ఆయన రాలేదు కానీ మాకు నిద్దర కుమ్ముకుంటూ వచ్చేసింది. లేచి చూసే సరికి బారెడు పొద్దెక్కింది. పక్కన చూస్తే పక్కలో మత్తుగా పడుకున్న మా బావలు . తాతయ్య ఎప్పుడో వెళ్ళిపోయి స్నానం చేసి  పూజ కూడా చేసేసుకున్నారు. మా బావలని నాలుగు తన్ని లేపి, పరుగు పరుగున భోగి మంట వెయ్యడానికి బయల్దేరాం. పిడకల దండలు, ఒక లీటరు కిరోసిను, అగ్గిపెట్టె తీసుకుని మా  పే.... ద్ద  పెరట్లోకి వెళ్ళాం.


అన్నీ సిద్ధం చేసుకుని మంటెయ్య బోతుంటే మా తాతయ్య అక్కడ వద్దు, అసలే తాటాకు పాక నిప్పంటుకుంటే ఇంకేం లేదని చెప్పాడు. సరే కదా అని ఇంకో వైపు కెళ్ళాం. అక్కడేమో గడ్డిమేట్లు నిప్పంటు కుంటే ఇంకేమన్నా ఉందా అని ఆ మంట మీద నీళ్ళు చల్లారు. కానీ మాకు మంటెత్తి, పక్కింటి రాజు గారింటి కెళ్ళాం. ఆయన మమ్మల్ని "బాబూ! నాది అసలే చిన్న పాక, ఒకటే ఆవు, చిన్న గడ్డిమేటు, ఒకర్తే  భార్య, ఒకడే పిల్లాడు"  అని ఏడుపు మొదలెట్టాడు. ఇలా కాదని రోడ్డు మీద కెళ్ళాం అక్కడ  వేద్దాం అని అక్కడ అప్పటికే మంటలు చల్లారి, జన సంచారం మొదలైపాయింది. మా నాలుగు రోజులు శ్రమ వృధా కానివ్వం. మా టి రాజేందర్ పిడక కి నిప్పంటించే దాక నిద్రపోమని డిసైడ్ జేసి మా తాతయ్య తో పెద్ద యుద్ధం చేస్తే, ఇంట్లో ఒక గాడిపొయ్య చూపించి - అందులో వెయ్యండి, భోగి మంట ఐపోయాక నీళ్ళు కూడా కాచుకోవచ్చు ఎంచక్కా అని సద్ది చెప్పాడు. చేసేది లేక అయిష్టంగా అందులోనే వేశాం మా దండలు. చెప్తే నమ్మరు అవి ఏకంగా గంట  మండాయి ముఖ్యంగా టి రాజేందర్ పిడక.

పోనీ ఇది ఇలా అయ్యింది మిగతా రోజన్నా సరదాగా గడుపుదాం అని అనుకున్నాం. ఇంతలోనే తలంటు పోయించుకోవాలని మా గొంతులో వెల్లక్కాయ వేసారు అమ్మ వాళ్ళు . దానికి ముందు నలుగు. ఏంటో అపురూపంగా పెంచుకున్న మా వంటిని అయిష్టంగా మా పాలేరు వెంకటరత్నం చేతిలో పెట్టాం. అతను  గేదెల్ని  పీచెట్టి తోమినట్టు మమ్మల్ని తెగ తోమేసాడు (పెద్దగా తేడా తెలియలేదేమో పాపం). అతని చేతి నలుగులో మేము నలుగురం నలిగిపోయాం. మేము గోల పెడుతుంటే మా అమ్మ వాళ్ళు  "శుభ్రంగా నలుగు పెట్టించుకోండి , మట్టంతా పోయి వళ్ళు నిగనిగలాడే రంగొస్తుంది" అంటూ మా వెంకతరత్నానికి ఊపుని, మాకు సలుపుని పెంచారు. మట్టిపోయి రంగు కాదు, తోలు పోయి రక్తం వచ్చేడట్టు ఉంది అని నసుగుకున్నాం.   మాకైతే గత ఏడాది చేసిన అల్లరంతటికీ ఒకే సారి పగ తీర్చుకుంటున్న ఫీలింగ్ వచ్చింది. ఆ పగకి ఫినిషింగ్ టచ్ ఆ తరువాత కుంకుడు రసంతో తలంటు. పరిగెడుతున్న మమ్మల్ని  బలి ఇచ్చే పశువులా కాళ్ళు చేతులు తలొకరూ  పట్టుకుని బలవంతంగా కుంకుడు పులుసుతో తలంటే శారు.  పైగా తల వెనక్కిపెట్టండి లేకపోతె పులుసు కళ్ళల్లో పడుతుందని ముందు జాగ్రత్త లొకటి. కళ్ళల్లోకి పడకుండా పులుసు పొయ్యడం, చంద్రబోస్ మాంచి పాటలు రాయడం, టీవీ 9 లో తప్పులు లేకుండా చదవడం  సాధ్యమేనా చెప్పండి మీరసల ? ఆ తంతు పూర్తి కాగానే, ఉప్పురాళ్ళ*  తో సిద్ధంగా ఉన్నాడు మా మావయ్య, ఆర్య 2 లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తో ఉన్న అర్జున్ లాగ.

ఎరుపెక్కిన కళ్ళతో, ఉప్పెక్కిన నోటితో , బరువెక్కిన హృదయంతో కొత్త బట్టలేసుకుని మత్తుగా నిదరపోయాం మేమందరం. ఆ కొత్త బట్టలు మాకు అతికినట్టు సరిపోయాయి (స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కాస్ట్యూమ్ లాగ  అన్నమాట).    అన్నట్టు ఆ బట్టలు కుట్టింది మా ఊరిలో ఏకైక (లేడీస్ ) టైలర్ కాంతారావు. ఇంట్లో ఉన్న  ఆడ లేడీస్ అక్కడే కుట్టించేవారు, వాటితో పాటు పనిలో పని మావి కూడా అక్కడే కుట్టించేసేవారు డెడ్ సీప్ అని.  
ఆ గాఢ నిద్రలో  పులిహోర, బొబ్బట్లు తింటునట్టు  ఒకటే మెరుపు కలలు. ఉలిక్కిపడి లేచాను. పులిహోర ఘాటు, నేతి బొబ్బట్టు కలగలిపిన  ఒక కమ్మటి సువాసన నను పిలిచింది రా రమ్మంటూ. పట్టాను  ఒక పట్టు. వంటలో మా అమ్మమ్మ కి సాటి లేదంటూ. కవిత్వం పొంగింది కదూ నాలో దాన్ని తలుచుకుంటూ.
ఆ రోజు మా ఇల్లు చుట్టాలతో, మా పెరటి సావిడి పేకాట రాయుళ్ళతో నిండిపోయింది. మీరు పేకాట సరదాగా ఆడేవాళ్ళు చూసుంటారు, డబ్బులకి ఆడే వాళ్ళని చూసుంటారు, క్లబ్బుల్లో ఆడే వాళ్ళనీ చూసుంటారు. కానీ నేను పేకాటే  వృత్తిగా  ఆడే వాళ్ళని చూసాను. వాళ్ళు కేవలం పేకే ఆడతారు. అదే వారి జీవిత లక్ష్యం, ఆశయం, కర్తవ్యం. ఈ బ్యాచ్ మా ఊరిలో ఏ  శుభకార్యానికెళ్ళినా, చుట్టాలు దండిగా ఉన్న  ఏ ఇంటికెళ్ళినా  కనపడేది. ఇలా పండగలు, పెళ్ళిళ్ళు  ఏవీ  లేనప్పుడు వీళ్ళ   పరిస్థితి ఏంటని నాకు బోలెడు జాలి వేసేది. ప్రభుత్వం పేకాటని స్వయం ఉపాది పధకంగా ఎప్పుడు గుర్తిస్తుందో, పావలా వడ్డీ రుణాలు ఎప్పుడిస్తుందో  అని నేను బెంగ పెట్టుకునే వాడిని.
ఆ .. ఎక్కడున్నాను... ఆ .. నేను నిద్ర లేచి, కాస్త ఎంగిలి పడి, మా గ్యాంగ్ తో కలిసి, గుడికి బయల్దేరా. అరుగు దిగుతూండగానే ఎక్కడినించో ఒక ఘాటయిన సువాసన ముక్కులదిరిపోయేలా వచ్చింది.  ఈడెవడ్రా బాబూ   అత్తరులో బట్టలుతుకున్నట్టు ఉన్నాడు. ఇంత ఘాటేంటి రా అనుకునేంత లోపు మా తాతయ్య స్నేహితుడు సూర్యనారాయణ గారు ప్రత్యక్షమయ్యారు. ముసలోడే కానీ మహా రసికుడు అనుకుని అరుగు దిగుతున్నాం.
ఆయన నన్ను చూసి " ఏరా అబ్బీ , ఎలా ఉన్నావ్రా. మీ నాన్న నా కళ్ళ  ముందు పెరిగిన వాడు. నేనంటే మహా గౌరవం. ఎరుగుదువా" అని అడిగాడు. ఆయన వ్యవహారం, పిలుపు కూడా నాకు నచ్చలేదు. నాకు వళ్ళు మండి "అయితే మీరు ఈ శతాబ్దం లో పుట్టలేదా తాతయ్యా" అని అన్నాను. ఆయనకీ చిర్రెత్తి "ఔన్రా అబ్బీ నీ బట్టలేంటి బాగా బిగ్గా ఉన్నాయి, మీ తమ్ముడివా " అనడిగి తిక్క కుదిరిందా అన్నట్టు నవ్వుతున్నారు. నాకు మా కాంతారావు టైలర్ గాడిని కాలికింద పురుగులా నలిపేయాలనిపించింది. మా అమ్మ మీద కూడా పీకల దాకా  కోపం వచ్చింది.
ఆ కోపంలో  అరుగు మెట్లు గబా గబా దిగుతున్నా. ఆఖరి మెట్టు దిగగానే స్కేట్ బోర్డు మీద కాలేసినట్టు రోడ్డుమీద జారడం మొదలెట్టాను . ఆ జారడం జారడం మా పక్కింటి కర్ణం గారింటి దగ్గర ఆగాను...కాదు పడ్డాను.. ఇంచు మించు నడ్డి విరిగేడట్టు పడ్డాను .  ఒకపక్క నే తొక్కిన గొబ్బిళ్ళు, ఇంకోపక్క మా వీధిలో వాళ్ళ నవ్వులు. గుండె భోగి మంట మండింది. అప్పుడు తెలిసింది నాకు, కాలు జారిన మగాడంటే ఈ సంఘానికి ఎంత కామెడీనో. సిగ్గుతో మొహం చొక్కాలో దాచుకుని, కాలికున్న గొబ్బిల్లను తుడుచుకుని ఇంటికి పరిగెత్తాను.అవమానంతో, ఇంటికెళ్ళగానే కాంతారావు కుట్టిన ప్యాంటు ని గాడిపోయ్యలో  పడేసి, బెడ్రూం కి  గడేసి ఆ రోజంతా అక్కడే పడుకున్నాను.అయినా అవమానం మర్చిపోలేక రాత్రికి ఆత్మహత్యా యత్నం కూడా చేశా.
ఆ ప్రయత్నమే - నేను రాజశేఖర్ నటించిన "మొరటోడే  నా మొగుడు"  సినిమా చూడడం.
* కుంకుడు పులుసుతో తలంటు ఎరుగని అదృష్టవంతులు, అజ్ఞానుల కోసం  --

 ఉప్పురాళ్ళు కుంకుడు రసం కంట్లో పడిన వాళ్ళకి ఇస్తారు. అవి  నోట్లో పెట్టుకుంటే కళ్ళ మంట, కంట్లో నలుసులు పోతాయని  ఒక నమ్మకం. నిజానికి ఉప్పరాయిని చప్పలిస్తే ఆ ఉప్పుని తట్టుకోలేక ఆ బాధలోకి డైవర్ట్ అయ్యి కంట్లో బాధను మర్చిపోతాం అని నా నమ్మకం.అసల  వేమన చెప్పులో రాయి, కంటిలో నలుసు కాదు - నోటిలో రాయి  కంటిలో పులుసు అని రాసుంటే బావుండేది.


19th Jan సవరణ : అసల ఈ టపా రాయాలని ఆలోచన మొలకెత్తించినది నెమలికన్నులో టపా. నెమలికన్ను మురళి గారికి ప్రత్యేక కృతజ్ఞ్యతలు.



Friday, January 8, 2010

బే ఏరియా లో రెండు భూకంపాలు


                     అందరిలాగా నేను ఆంగ్ల కొత్త సంవత్సరం పురస్కరించుకుని కొన్ని తీర్మానాలు చేసుకున్నాను. సుజాత గారు చెప్పినట్టు అతి సామాన్యమయిన, సర్వ సాధారణమయిన  బరువు తగ్గడం అందులో ఒకటి. నా ఎక్సెస్ సైజు ని తగ్గించుకోడానికి ఎక్షర్సైజ్ మార్గమని తేల్చు కున్నాను.   అందు  కోసం  ఉదయాన్నే లేవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను  (రెండవ తీర్మానం) . ఒకటో తారీఖు శుక్రవారం కావడం ఈ తీర్మానాలకి  ఆదిలోనే ఎసరు పెట్టింది. ఎంత పట్టువదలిన విక్రమార్కుడయినా మరీ వారాంతం లో వ్యాయామం అంటే ససేమిరా అంటాడు.   దానితో నా కార్యక్రమం  మూడు రోజులు వాయిదా పడింది. ఆ తరువాత వాతావరణం పుణ్యమా అని జలుబు, దగ్గు, 98 F డిగ్రీల జ్వరం తో ఇంకో మూడు రోజులు సాకు దొరికింది. ఇంతలో నా స్నేహితుడు క్రమం తప్పకుండా తన తీర్మానం ఆచరిస్తున్నాడని తెలిసి మొదట ఆనందం (వాడి గురించి), తరువాత బాధ కలిగింది నా గురించి. నా మీద నాకే అసహ్యం వేసింది (నాకు కూడా అనకండి మీరు ). రోజుకి రెండు సార్లు టీవీ 9, వారానికి రెండు సార్లు చాలెంజ్ (టీవీ స్టార్ యాంకర్ ఓంకార్ ఆధ్వర్యంలో మా టీవీ కే మకుటాయమానమయిన కార్యక్రమం  )   చూడగలిగిన నేను, ఈ చిన్న పనిని చెయ్యలేనా క్రమం తప్పకుండా అని నిశ్చయించుకుని, అన్నీ సిద్ధం చేసుకోబూనాను  మర్నాడు  వ్యాయామశాల (జిం) కి వెళ్ళడానికి.



రెండు నెలల క్రితం వ్యాయామశాల  లో జేరినప్పుడు సద్దుకున్న బ్యాగ్ ని బూజు దులిపి, ఐపాడ్ , మంచి నీళ్ళ బాటిల్, రెండు సెట్ల ఇయర్ ఫోన్లు (ఒకటి పని చెయ్యకపోతే ఇంకొకటి ముందు జాగ్రత్త) ఒక తుండు గుడ్డ పెట్టుకున్నాను. షూస్, సాక్స్ రెడీ చేసుకున్నాను. నా సెల్ లో అలారం  ఏడింటికి, నా శ్రీమతి సెల్ లో ఏడు పదికి, టేబుల్ క్లాక్ లో ఏడు అయిదుకి పెట్టి నాకు దూరంగా వాటిని వేరు వేరు చోట్ల పెట్టాను (ఎందుకు మీరు ఊహించి ఉంటారు).   రేపు ఉదయం చెయ్యాలి వ్యాయామం అని గట్టిగా తలుచుకుని పడుకున్నాను. ఉదయాన్నే నా సెల్  మోగింది. అలారం అనుకుని లేచి సమయం చూసాను. 6: 55 . ఇదేంటి నా సెల్ నాకంటే వేగంగా ఉంది అని అనుకునేలోపు అది ఈస్ట్ కోస్ట్ నించి  కాల్ అని గ్రహించాను. కళ్ళు విదిల్చుకుని గొంతు సవరించుకుని (ఇది అనవసరం), చెవులు విదిల్చుకుని విన్నాను.  రెండే మాటలు. ఇంకో అరగంట లో అనుకోకుండా కాల్ పెట్టాల్సి వచ్చింది. అది  నేను హాజరు ఐతే  చాలా సంతోషిస్తాను అని చెప్పాడు అవతల తెల్లోడు. పని చెయ్యమని  చెప్పీ  చెప్పకుండా చేయించుకోవడం తెల్లోల్లకి  తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు. తీర్మానం గురించి ఆలోచిస్తూ దిగాలుగా 7:30 కాల్  తీసుకున్నాను. అది అనుకున్న దానికంటే అరగంట ఎక్కువ అయింది. ఆ పైన అసలు పని, దానితో ఆ రోజు ఉదయం వ్యాయామం కుదరలేదు. కానీ ఏదో విధంగా ఒక్క తీర్మానం అయినా అమలు పరిచా అని ఆనందించాను - అదే ఉదయం లేవడం. ఆ మిశ్రమ స్పందన తో రోజు మొదలెట్టాను.

అది జనవరి ఏడవ తారీఖు ఉదయం. సూరీడు ఖరీదయిన రెస్టారంట్ లో లైట్ లాగా డింగా వెలుగు తున్నాడు . ఆ వెలుతురుని కూడా మేఘాల తెరల పొరలు మిన్గేస్తున్నాయి. గడియారం చూస్తే  కానీ  సమయం  పది అయిందని తెలియదు. పని లో నిమగ్నమయి ఉండగా ఒక ఒక పెద్ద ట్రక్కు గోడ పక్కనే పడినట్టు పెద్ద కుదుపు  వచ్చింది. వెంటనే ఇంకోసారి. ఒక్కసారిగా  బయటకి వచ్చాం అందరం. అది భూకంపం అని గ్రహించాం.కొంత సేపు ఆగి అంతర్జాలం లో అది భూకంపమని నిర్దారించుకున్నాం.  రిక్టర్ స్కేల్ మీద 4.2. మరీ పెద్దది కాకపోయినా మరీ చిన్నది మాత్రం కాదు. ఒక్కసారి బే ఏరియా లైన్ అఫ్ ఫాల్ట్ మీద ఉందని, ఇలాటివి  సాధారణం అని  జ్ఞప్తికి వచ్చింది. కొంచం భయం వేసింది . వెంటనే ఇంకొక విషయం గుర్తొచ్చింది. నా తీర్మానాల్లో ఒకటి  ఒక్క రోజు పాటించడం వల్ల కాబోసు ఈ     భూకంపం అని మనసులో అనుకున్నాను.


ఆ రోజు రాత్రి మళ్ళీ యధావిధిగా అన్నీ సిద్ధంగా ఉన్నాయో లేదో చూశా మర్నాటి వ్యాయామానికి. అలారంలతో సహా  . ఉదయాన్నే లేచి తయారయ్యి, వాటర్ బాటిల్,తుండు, ఐపాడ్,ఇయర్ ఫోన్  సమేతుండ నయి వ్యాయామా శాలకి బయల్దేరా. అదృష్టవసాత్తు ఇంకేం అవాంతరాలు లేక ఆ రోజు వ్యాయామం పూర్తయింది. ఏడాది లో ఒక్కసారి అయినా పాటించాను నా తీర్మానాన్ని అని నా శరీరం స్వేద బాష్పాలు, నా కళ్ళు ఆనంద బాష్పాలు ఒకేసారి కార్చాయి. తుండు గుడ్డ తో ఆ గండి పూడ్చి ఇంటికి బయల్దేరాను.

అదే రోజు ఉదయం ఒంటి గంట ప్రాంతం లో మళ్ళీ తీవ్రమయిన  కుదుపు. బాబోయ్ ఇంకో భూకంపం. ఇక కారణం వెంటనే స్ఫురనకొచ్చింది. ఒక్కడి ఆరోగ్యం కంటే సమాజ శ్రేయస్సు ముఖ్యమని నా అంతరాత్మ డి టి ఎస్ లో ఘోషించింది.రుద్రవీణ లో శ్రీశ్రీ వాక్యాలు బాలు గొంతులో వినపడ్డాయి. అంతే
నేను సైతం ఈ నేలకోసం  నా కార్యదీక్షను దారపోస్తాను  
నేను సైతం ఈ ప్రజలకోసం నా రెజల్యూషన్  వదిలివేస్తాను 
అని అనుకుని నా తీర్మానాలకి తిలోదకాలు ఇచ్చేసాను కేవలం లోక కళ్యాణాని కే . 

నా లో సంఘ సేవకుడు ఉవ్వెత్తున ఉప్పొంగిపోయాడు నా త్యాగనిరతికి, మానవత్వానికి. 
వచ్చే ఏడాది నోబెల్ బహుమతికి నా పేర  ఉంటుందేమో చూస్తూ ఉండండి.


శెలవు.
                                  --    లోకాసమస్తాత్ సుఖినోభవంతు     --

Sunday, January 3, 2010

కబుర్లు - జనవరి 3, 2010


ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.
ఈ న్యూ ఇయర్స్ ఈవ్ మనం చేసుకోవడమేంటి అని ఒక్కొక్క సారి అనిపించినా, మిగతావన్నీ (క్యాలెండర్, పుట్టిన రోజు ఆంగ్ల తేదీ ప్రకారం జరుపుకోవడం, కొన్ని అలవాట్లు)  ఓన్ చేసుకున్నప్పుడు ఇది మాత్రం వదిలి పెట్టడం ఎందుకని నాకనిపిస్తుంది. ఇలా ఫిక్స్ అయ్యి ప్రతీ యేడూ  శక్తి కొలదీ :) బానే జరుపుకుంటున్నాం  ఇది కూడా.
ఇక ఈ మధ్య  త్రీ ఈడియట్స్   సినిమా చూసాను. అద్భుతంగా ఉంది. మున్నా భాయి, లగే రహో మున్నా భాయి  తీసిన రాజ్కుమార్ హిరాణి హైప్   కి తగ్గ (ఇంకా చెప్పాలంటే దాని కంటే ఎక్కువ ) సినిమాని అందించాడు.ఆమిర్ ఖాన్ సినిమా సినిమాకి తనలోని నటనని సాన బెట్టే విబిన్నమయిన పాత్రలు చేస్తూ తనకు పోటీ ఎవరూ లేరని నిరూపిస్తున్నాడు. ఇక సినిమా చేతన్ భగత్ నవల ఫైవ్ పాయింట్ సంవన్ (Five Point Someone) ఆధారంగా తీసినది. ఆ నవల నాకు బాగా నచ్చిన వాటిలో ఒకటి.నవలని  సినిమా లోని  ప్రధాన పాత్రలు, కొన్ని సన్నివేశాలు, కొంత కథ వరకే వాడుకున్నారు. ఆ పైన అంతా  రాజ్కుమార్ హిరాణి రచనా పటిమ, దర్శకత్వ ప్రతిభే. భారతీయ విద్య విధానంలో కొట్టొచ్చినట్టు కనిపించే లోపాలు ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా చెప్పే కథ. ఆ ముగ్గురిలో ఒకడు మిగతా ఇద్దరి జీవితాలను  ఎలా ప్రభావితం చేసాడు, వారితో పాటు తోటి విద్యర్తులని ఎలా ఆకట్టుకున్నాడో ,వారి కాలేజీ డీన్ ని ఎలా మార్చాడు  అన్న విషయాన్ని    తనదయిన శైలిలో  మంచి కథనం తో,  మంచి హాస్యంతో,  హృద్యంగా మలిచాడు హిరాణి.
ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి వాళ్ళకిచ్చిన  పాత్రలలో పరకాయ ప్రవేశం చేసారు.  బోమన్ ఇరానీ ఎప్పటిలాగే చించేసాడు.    శంతను మొయిత్రా  సంగీతం చక్కగా సమకూర్చాడు. ముఖ్యంగా నాకు "बहती हवा सा था वो ", Give me some Sunshine (ఈ పాట గురించి నీ రాసిన టపా ఇక్కడ చూడచ్చు)  చాలా చాలా నచ్చాయి. ఎటొచ్చి(సినిమా టైటిల్స్ లో ) చేతన్ భగత్ క్రెడిట్ మీద  జరుగుతున్న గొడవ చూస్తే విదు వినోద్ చోప్రా, అతని తో పాటు హిరాణి కూడా అతి చేసారనిపించింది. ఈ విషయం లో  ఇక్కడ  చెప్పింది నిజమనిపించింది.
గత వారాంతం Los Angeles కి వెళ్లాం. క్రిస్మస్ వారాంతమేమో జనం జాతర లా ఉన్నారు. ఒక  రోజు యూనివర్సల్ స్టూడియోస్ కి , ఇంకొక రోజు డిస్నీ కి వెళ్లాం. మొదటిది బానే పూర్తీ చేసాం కానీ, డిస్నీ మాత్రం సగం కూడా చూడటం కుదరలేదు. విపరీతమయిన జన ప్రవాహం, ఎక్కడ చూసినా పొడవాటి క్యూలూనూ. ఇంకెప్పుడూ వారంతం అందులో ఇలాటి పొడవు వారంతం (long weekend :))  లో వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం. చాలా మంది డిస్నీ వరల్డ్, కాలిఫోర్నియా అడ్వెంచర్ (రెండు పార్క్లు ఎదురెదురుగా ఉంటాయ్, ఒకే  టికెట్ కూడా తీసుకోవచ్చు)   రెండూ చూడటానికి రెండు రోజులుండాలి అంటారు కానీ సరిగ్గా ప్లాన్ చేస్తే ఒక్కరోజులో ముగించచ్చు అనిపించింది. కాకపోతే కాస్త పెందరాడే వెళ్ళాలి. వీటిలో మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఐతే రెండు షోస్ (ఏడింటికి ఒక పార్క్ లో ఎనిమిదింటికి ఒక దాంట్లో అనుకుంటా) , ఇండియానా జోన్స్, స్ప్లాష్ మౌంటైన్, సోరింగ్ ఓవర్ కాలిఫోర్నియా , టవర్ అఫ్ టెర్రర్, స్పేస్ మౌంటైన్ తప్పకుండా చూడాల్సినవి.
ఈ రోజు ఒక మంచి కార్యక్రమం చూసా టీవీ 9 లో. మీరు సరిగ్గానే విన్నారు టీవీ ౯ లోనే. అరుణ్ సాగర్ గారి "మేల్ కొలుపు" మీద పుస్తక సమీక్ష . నాకు టీవీ ౯ వారు   ఇలాటి కార్యక్రమాలు  కూడా చేస్తారని తెలియదు. ఇంతకు ముందు  ఈ పుస్తకం గురించి పుస్తకం డాట్ నెట్ లో కత్తి మహేష్ గారు రాసినది చూసా. ఈ కార్యక్రమం కూడా చూసాక ఎలాగయినా చదవాలనిపించింది.  తనికెళ్ళ భరణి గారు అద్భుతంగా  చెప్పారు ఈ పుస్తకం గురించి. హోస్ట్ బద్రి కాకుండా కొంచం పుస్తక పరిజ్ఞానం ఉన్న వాళ్ళైతే   (అసలు  టీవీ ౯ లో ఉంటే ) ఇంకా బావుండేది.
ఈ మధ్య ఒక బ్లాగ్మిత్రుడి పుణ్యమా అని నేను శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారి మార్గదర్శి , వడ్లగింజలు చదువుతున్నాను. త్వరలో నా ఆ  అనుభూతి  (శ్రీపాది వారి కథలు చదవలేం అనుభవించాలి అంతే ) గురించి రాయాలని ఉంది.  అన్నట్టు పద్యాలంటే చెవి కోసుకునే వాళ్ళకి , రాయాలని ఉత్సాహ పడేవాళ్ళకి ఆంధ్రామృతం అనే ఒక అద్భుతమయిన బ్లాగ్ నిర్వహిస్తున్నారు మా రామకృష్ణ మాష్టారు. బ్లాగ్లోకంలో ఈయన చిరపరిచితులనుకోండి. పద్యాలంటే ఆసక్తి ఉన్నవారు ఎవరన్నా  పొరపాటున మిస్ అయ్యి ఉంటే  తప్పక చూడాల్సిన బ్లాగ్ ఇది .