Wednesday, December 23, 2009

లాస్ వేగాస్ తీర్థ యాత్ర - 2

ఈ యాత్ర మొదటి భాగం ఇక్కడ. 

మూడు ముప్పులూ, ఆరు తప్పులతో వేగాస్ కి మా ప్రాయాణం మొదలైంది. 


లేట్ గా ఎక్కావేమో ఆఖరు సీట్లు వచ్చాయి ( ఇంకో నిమిషం ఆలస్యమయితే నిల్చుని ప్రయాణం చేయాల్సి వచ్చేదేమో). బ్యాగ్లు సర్దుకుని , అనౌన్స్మెంట్ అయ్యాక, ఫోన్ ఆఫ్ చేసి, జూస్ తాగి, గ్లాస్ ఇచ్చేసే లోపు వేగాస్ ఎయిర్ పోర్ట్ వచ్చేసింది. దిగీ దిగగానే, ఎయిర్ పోర్ట్ లోనే వేగాస్ వాసనలు (కేసినో లు, కాక్టైల్లు) కొట్టొచ్చినట్టు కనిపించాయి. కార్ రెంట్ చేస్తే దగ్గర్లో ఉన్న హోవర్ డ్యాం చూడచ్చని, కార్ రెంట్ చేద్దామని వెళ్ళాము. అది జూలై 4th వీకెండ్ ఏమో తెగ జనం . కార్ రెంట్ చేసే సరికే మధ్యాహ్నం ఐపోయింది. అక్కడ్నించీ, పని చేయని జి పి ఎస్, ఛార్జ్ అయిపోయిన ఐ ఫోన్ తో, ముందు రోజు రాత్రి లేని నిద్రతో, ఉదయం నుండి తిండి లేక ఆకలితో, భీభత్సమైన ట్రాఫిక్ లో ఎడారి ఎండలో (వేగాస్ డిసర్ట్ లో ఉంది) ౩ ఇంటికి హోటల్ చేరుకున్నాం. అసలే చిర్రెత్తి ఉన్న మాకు ఆ హోటల్ రిసెప్షనిస్టు మా రిజర్వేషన్ సిస్టం లో కనపడట్లేదని వళ్ళు మండే సమాచారం చెప్పింది. ఆ రిసెప్షనిస్టు అంత అందంగా ఉండకపోయినా, తప్పు మాది కాకపోయినా, లాగి రెండు పీకే వాడినేమో. చేసేదిలేక పక్కనున్న హోటల్ లో రూమ్స్ తీసుకుని ఎంగిలి పడడానికి బయల్దేరాం. కాలే కడుపుకి మండే బూదిదలాగా ఏదో కాస్త తిని, రూం కెళ్ళి తన్నిపెట్టి పడుకున్నాం. ముందు రెండు రోజులు సరిగ్గా నిద్రలేదేమో, లేచేసరికి అయిదైంది టైం. ఆ రోజు బానే తిని తిరిగి సాఫీ గా గడిచిపోయింది.


మేము వెళ్ళింది మాంచి ఎండలో. ఎంత వేడి అంటే, పోయ్యలేకుండా పప్పు ఉడికించవచ్చు . మేము మొదటిసారేమో వెళ్ళడం, తెలియక వేగాస్ డౌన్ టౌన్ లో హోటల్ తీసుకున్నాం. అక్కడ్నించి స్ట్రిప్ ఒక రెండు మైల్లే అయినా వెళ్ళడానికి ముప్పావు గంట దాకా పట్టేది. ఆ రోజు బెల్లాజియో లో ఎక్కువ సేపు గడిపాము ప్రశాంతంగా . మా ప్రకృతికి విరుద్ధంగా మిగిలన రోజంతా అన్నీ సాఫీ గా సాగిపోతున్నాయి, మంచి రోజులు మళ్ళీ వచ్చాయా ఏంటి, కొత్త కొత్తగా ఉన్నది అని కేసినో లో ఆట ఆడుతూ పాట పాడుతుంటే నేను కొంత గెలిచాను బ్లాక్ జాక్ లో.  (పోయిన బోలెడు ఆటలకన్నా గెలిచినది ఒకటీ గుర్తుండిపోతుంది కదా) . నేను పరిగెత్తు కుంటూ, లక్కీ 7 దగ్గర నీరసం గా ఉన్న నా శ్రీమతి దగ్గరికెళ్ళి డార్లింగ్ పది డాలర్లు వచ్చాయి అనగానే, పర్సు పోయింది అని నీరసంగా చెప్పింది. తీర్థం లా ఉండే ఆ జనం, దొరకడం అసాధ్యం అని తెలిసినా ఆశ చావక లంచ్ చేసిన బెల్లాజియో కెళ్ళి వెతికి, రిపోర్ట్ చేసి వచ్చేసాం. మామూలుగా ఐతే ఇక్కడ (అమెరికా లో ) పర్సు పోయినా పెద్ద విషయం కాదు అన్నీ కార్డ్సే కాబట్టి కాన్సుల్ చెయ్యచ్చు. కానీ అందులో ఒక ఖరీదయిన గిఫ్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి. పోనీ సొమ్ము పోయిందని ఊరకున్నా, ఆ డ్రైవర్స్ లై సెన్స్ లేకుండా తిరుగు ప్రయాణం అనుమానమే. కాల్ చేసి కనుక్కుంటే ఏదో ఒక ఐడి ఉండాలని చెప్పారు . మా దగ్గరా ఇంకోటి లేదు. సర్లే ప్రయత్నిద్దాం. లేకపోతె డ్రైవ్ చేద్దాం అని నిర్ణయించుకున్నాం (సంతోషం ఏంటంటే మేము ఈస్ట్ కోస్ట్ లో లేము ).


మిగతా రెండు రోజులూ హాయిగానే గడిచిపోయాయి. మేము ఒకటి మాత్రం నిర్ణయించుకున్నాం. ఇంకెప్పుడూ వేగాస్ కి వెళ్ళకూడదు అని, వేసవి లో. ఇంచుమించు మూడు రోజులూ 110 F ఉంది . బయటకొస్తే మసే. ఎక్కువ సేపు ఆ స్ట్రిప్ మీద హోటల్లలోనే ఉండేవాళ్ళం. షో స్ అన్నీ బానే చూసాం. బెల్లాజియో, వెనిస్ హోటల్లు చాలా బావున్నాయి. మేము విన్ లాస్ వేగాస్ లో "లే రెవ్" షో కెళ్ళాం. ఎక్కువ మంది బెల్లాజియో లో "ఓ" షో కి వెళ్తారుట. షో బావుంది చాలా. వేరే ప్రపంచానికి తీసుకెళ్ళినట్టు ఉంది లైటింగ్, ఎఫ్ఫెక్ట్స్ , సంగీతం తో. కథ, వాళ్ళ బాధ అర్థం ఐతే ఇంకా బావుండేది అనిపించింది. నాకు అన్నిటికంటే దేదీప్యామానమయిన వేగాస్ రాత్రిలో బెల్లాజియో ఫౌంటైన్ ని ఈఫిల్ టవర్ మీద నుంచి చూడడం అద్భుతమైన అనుభూతి. అదీ మేము ఆఖరు చూసినది అదే .


మేము పూటకొక సారి పర్స్ పారేసుకున్న హోటల్ కి కాల్ చేసేవాళ్ళం, నేను నీళ్ళు వదిలేసినా నా శ్రీమతి పట్టుపట్టడం వల్ల. అదే క్రమం లో ఒకసారి ఆ హోటల్ కెళ్ళి అడిగాం. అక్కడ రిసెప్షనిస్ట్ శ్రియ గోశల్ ఇళయరాజా సంగీతం లో పాట పాడినట్టు ఒక తియ్యని వార్త చెప్పింది. పర్స్ చేతికిచ్చింది. శతం తక్కువగా అన్నీ ఉన్నాయి. హమ్మయ్య అనుకుని ఆ రోజు మా స్నేహితులకి ఓ చిన్న పార్టీ ఇచ్చాం కూడా. ఇక ఫ్లైట్ ప్రయాణానికి దోకా లేదని .

మర్నాడు ఉదయం మా తిరుగు ప్రయాణం. ఈ సారి చాలా జాగ్రత్తగా ఏడింటి ఫ్లైట్ కి ఉదయం అయిదింటికే బయల్దేరాం. ఎయిర్ పోర్ట్ కెళ్ళే దారిలో ఒకసారి దారి తప్పినా సద్దుకుని, మొత్తానికి చేరుకున్నాం. ఎయిర్ పోర్ట్ కి shuttle పట్టుకునేటప్పుడు ఊరికే ఒకసారి టికెట్స్ చూసుకున్నాం. దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఫ్లైట్ 6:30 కి (వేగాస్ కి వచ్చేటప్పుడు ఫ్లైట్ టైమింగ్ వెళ్ళేటప్పుడు టైమింగ్ గా పొరబడ్డాము అలవాటులో ). Shuttle దిగి పరుగో పరుగు ఫ్లైట్ కౌంటర్ కి. ఆలస్యమయినా కిందా మీద పెట్టి మొత్తానికి బోర్డింగ్ పాస్ లు ఇచ్చింది అక్కడున్న పెద్దావిడ. ఆ పైన మా అదృష్టానికి తగ్గట్టు చెక్ ఇన్ దగ్గర బ్లాక్ ఫ్రైడే కి electronics కొట్ల దగ్గర ఉండేంత క్యూ. అది త్వరగానే అయిపోయినా, అక్కడనించీ రెండు టెర్మినల్ ల అవతల మా ఫ్లైట్. ట్రాం పట్టుకున్నాం కానీ మా స్నేహితులు వెనక ఉండి పోయారు. సర్లే మనం వెళ్లి ముందు అక్కడ ఫ్లైట్ ఆపుదాం అని వెళ్ళిపోయాం. అక్కడ బోఅర్దింగ్ దగ్గర ఎయిర్ లైన్స్ ఉద్యోగి మా కంటే కంగారుగా ఉన్నాడు. అప్పటికే మిగతా బోర్డింగ్ అయిపొయింది. కేవలం ఒక 5 నిమిషాలు చూద్దామని ఆగాడు. మా స్నేహితులు ఇంకా రాలేదు. నిమిషానికో సారి కంగారు పెట్టేవాడు వస్తున్నారా అని . మొత్తానికి ఇంకా సరిగ్గా బోర్డింగ్ ఆపేసి తలుపు మూసేయ్యబోతుండగా మా వాళ్ళు వచ్చారు. మా దగ్గర ఉన్న బ్యాగ్ లు గేటు చెక్ చేసాడు (అవి క్యారీ ఆన్ లు మా దగ్గర ఉండాల్సినవి). ఏది అయితే అది అయింది అని దొరికిన ఆఖరు సీట్లలో కూర్చున్నాం. బెల్టు పెట్టుకుని హమ్మయ్యా అనుకుని, ఫ్లైట్ ఎప్పుడు కదులుతుందా అని వేచి ఉన్నాం. ఇంతలో పరుగు పరుగున వచ్చాడు ఆ కంగారు మనిషి (మమ్మల్ని ఎక్కించిన వాడు ). మా నలుగురుని దిగమన్నాడు. ఇదేం గొడవరా బాబు అనుకున్నాం. బోర్డింగ్ పాస్ లు ఇచ్చిన మహా తల్లి మమ్మల్ని వెయిటింగ్ లిస్టు లో పెట్టిందిట. మమ్మల్ని వేరే నలుగురు అనుకుని ఈ తికమక మనిషి ఎక్కిన్చేసాడు. వాడిని తిట్టడానికి నా దగ్గరున్నవి కాదు కదా పూరీ జగన్నాథ్ గారు సినిమాలలో వాడే బండ బూతులన్నీ కూడా సరిపోవు. మా తప్పు కూడా ఉంది కాబట్టి వాడిని విసుక్కోవడం తప్ప ఏం చెయ్యలేకపోయాం. వాడు వేరే ఫ్లైట్ కి పాస్ లు ఇచ్చి, బ్యాగ్లు దిగేచోట చోట తీసుకోవచ్చని చెప్పాడు. అవి వేరే ఫ్లైట్ లో ఉన్నాయి కదా అని చాలా సార్లు అడిగినా వాడు ఏం ఫర్లేదు మై హూ నా వచ్చేస్తాయని భరోసా ఇచ్చాడు. సర్లే ఇంకా చేసేదేముంది అని ఫ్లైట్ ఎక్కి బెల్టు పెట్టుకుని కూర్చున్నాం. ఇంతలో మళ్ళీ దింపే శారు, మాతో పాటు అందరినీ. కంగారు పడకండి మా ఊరు వచ్చేసింది (అరగంటే ప్రయాణం ). 


బే ఏరియా హాయి వాతావరణం లో చల్ల గాలి పీల్చుకోడానికి తహతహ లాడుతూ లగేజీ తీసుకుందామని వెళ్లాం. ఏదో అవకతవక వల్ల మా బ్యాగ్లు రాలేదని, ఎక్కడో మెక్సికో కి వెళ్లి పోయాయని చెప్పింది అక్కడ ఓ పొగరు బోతు. అప్పుడే నా శ్రీమతి ఒక తాజా వార్త చెప్పింది. తన బంగారు వస్తువులు కొన్ని క్యారీ ఆన్ కదా అని ఆ బ్యాగ్ లో పెట్టానని. మూల్గే నక్క మీద తాటిపండు సామెత కి అర్థం అప్పుడు తెలిసింది నాకు. ఆగ్రహం లో రాజశేఖర్ అంత కోపం, పుర్సూట్ అఫ్ హ్యాపీ నెస్ లో విల్ స్మిత్ అంత బాధ, నిస్సహాయత కలిపి వచ్చాయి. కానీ ఏం చెయ్యను, ఒక కంప్లైంట్ రాసి ఇంటికి బయల్దేరాం.విచిత్రం ఏంటంటే మా స్నేహితుల లగేజీ వచ్చేసింది అందరం ఒకేసారి గేటు చెక్ చేసినా.


ఇక ఎయిర్లైన్స్ వాడు రోజుకొక కథ చెప్పేవాడు ఒకసారి మెక్సికో కి వెళ్లిందని , ఒకసారి మిన్నెసోటా అని, ఒక సారి కరీబియన్ అని. వారమయినా బ్యాగ్స్ రాలేదు. ఇక క్లైం చెయ్యడానికో ఉత్తరం కూడా పంపాను. ఆరోజే ఒక దేవదూత మా ఇంటికి వచ్చాడు. భక్తా విచారించకు. నిన్న పోయింది అనుకున్నది నేడు దొరకచ్చు అని చెప్పి ఒక రెండు బ్యాగ్లు చేతిలో పెట్టాడు. బ్యాగ్ లో అన్నీ ఉన్నాయో లేదో చూసి ఆయనకీ దండం పెడదామని వెనక్కి తిరిగాను. ఆయన కంటికి దూరంగా గాలిలో అదృశ్యం అయిపోయాడు.


ఆ సమయం లో అతి కష్టం మీద ఆయన వస్త్రం మీద అస్పష్టంగా మూడు అక్షరాలూ కనపడ్డాయి. U P S అని 


---------------------------------------------------- శుభం -- --------------------------------------------------------------

Tuesday, December 22, 2009

షిండ్లర్స్ లిస్ట్ - నా అనుభవం


                            నేను తొమ్మిదవ తరగతి లో ఉన్నప్పుడు అనుకుంటా, మా సోషల్ టీచర్ సెకండ్ వరల్డ్ వార్, హిట్లర్ గురించి చెబుతూ, వీటి మీద షిండ్లర్స్ లిస్టు అనే అద్భుతమయిన సినిమా ఉంది స్పీల్బర్గ్ (జుర్రాసిక్ పార్క్ పుణ్యమా అని ఆయన పేరు విన్నా  అప్పటికి). దాంట్లో హిట్లర్ చేసిన అరాచకం గురించి బాగా చెప్తాడు అని చెప్పినట్టు చూచాయి గా గుర్తుంది. ఎన్నో సార్లు చూద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మొత్తానికి ఆ శుభ తరుణం నిన్న ఆసన్న మయినది.
ఆంగ్ల సినిమాలు చూసే వారు ఇది మిస్ అయ్యి ఉండరు. కానీ అయి ఉంటే వెంటనే అద్దెకో, డౌన్లోడ్ చేసో, ఆఖరికి కొని అయినా చూడాల్సిన సినిమా.
కథ - రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల అరాచకత్వానికి దారుణంగా బలి అవుతున్న జూస్ తో ఒక పరిశ్రమను ప్రారంబించి  (మొదట్లో కేవలం లాభాల కోసమే) మెల్లగా వాళ్ళని ఆదుకునే నాథుడుగా  ఎదిగిన షిండ్లర్ కథ. ఒక పక్క నాజీల అరాచాకత్వాన్ని,  ఉన్మాదాన్ని, జూస్ నిస్సహాయతని, షిండ్లర్ మానవత్వాన్ని అత్యద్భుతంగా చిత్రకరించాడు స్పీల్బర్గ్.


చూస్తున్నంత సేపు ఆ సమయంలో మనమక్కడ ఉన్నట్టే, ఆ అమానుషం మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉంటుంది. ఒకసారి బాధతో కళ్ళల్లో నీళ్ళు తిరిగితే, ఒకసారి కోపంతో గుండె రగిలిపోతుంది. ఒకసారి జాలితో గుండె కరిగిపోతే, ఒకసారి మానవత్వానికి ఉప్పొంగిపోతుంది.సినిమా మొత్తం  హిట్లర్ ని, జూస్ ని ఊచకోత కోసిన నాజీలని  బతుకుంటే వెంటనే గొంతు నులుమి చంపెయ్యలనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను చూసిన, విన్న చరిత్రలో ఇంత దారుణంగా, ఎందుకు చంపుతున్నారో కూడా తెలియకుండా ఇన్ని లక్షల మందిని  చంపిన ఉదంతం లేదు. అన్నిటికంటే బాధపెట్టినవి రెండు  ప్రశ్నలు ,  ఇంత జరుగుతుంటే, ప్రపంచమంతా చూస్తూ ఎలా ఊరుకుంది. ఇంత దారుణాన్ని ఆరేళ్ళు ఎలా ఉపేక్షించింది.  ఇంత చేసినా బరిస్తూ ఎందుకు ఉన్నారు జూస్, కనీసం కొంత మంది అయినా  ఎందుకు తిరగబడలేదు (అలా తిరగ బడ్డట్టు నేను ఎక్కడ చదవలేదు).
 నన్ను కలిచివేసిన, నా గుండెలు బరువెక్కిన, నన్నింకా  haunt చేస్తున్న కొన్ని సీన్లు ఈ సినిమాలో..




  • పోలాండ్ (క్రకవ్) జూస్ అందరినీ కలిపి ఒక చిన్నపాటి  ప్రదేశంలో (ఘెట్టో లంటారు) పడేస్తారు నాజీలు. అక్కడ నించీ వారి చేత రకరకాల పనులు చేయిస్తూ ఉంటారు. ఒక సరి ఏదో ఒక నిర్మాణం జరుగుతూ ఉంటే ఒక జూ సివిల్ ఇంజనీర్ (స్త్రీ) వచ్చి నాజి కమాండర్ (అమాన్) తో అలా కడితే ఇది పడిపోతుంది. మళ్ళీ ఫౌండేషన్ వేసి కట్టాలి అని చెప్తుంది. అన్నీ కనుక్కుని అమాన్ ఆమెని కల్చేయ్యమంటాడు. ఆ స్త్రీ నేనేం తప్పు చేసాను, ఇది నా పని అంటే, అమాన్ ఆమెని షూట్ చేసి ఇది నా పని అంటాడు.
  • అమాన్ పొద్దున్నే లేచి బాల్కనీ లోకి వచ్చి వొళ్ళు  విరుచుకుంటాడు. సిగరెట్ వెలిగిస్తాడు.  ఘెట్టో దగ్గర చాలా మంది జూస్ పని చేస్తుంటారు. కూర్చుని ఉన్న  ఇద్దరు జూస్ ని షూట్ చేస్తాడు. లోపలి వచ్చి మూత్ర విసర్జన చేస్తూ పెళ్ళాం ని కాఫీ నువ్వే పెట్టు అంటాడు.  నాజీలు జూస్ ని చంపడం వారి దినచర్య లో ఎంత సర్వ సాధారనమో, వాళ్ళకి ఇది ఎంత తేలికో ఇంత కంటే బాగా ఎవరు చెప్పగలరు. 
  • షిండ్లర్ హెలెన్ అనే జూ (నాజీ కమాండర్ అమాన్ కి సేవకురాలు ) స్త్రీని ఓదారుస్తూ ఉంటాడు అమాన్ ఆమెని చంపడని. దానికి ఆమె "నాకు నమ్మకం లేదు. ఈ రోజు మేము చూస్తుండగా దారిన పోతున్న ఒకామెని గొంతులో షూట్ చేసాడు. ఆమె మిగతా వారికంటే మెల్లాగా వెళ్ళట్లేదు, తొందరగా వెళ్ళట్లేదు, ఆమె సన్నగా లేదు లావుగానూ లేదు. ఆమె చేసిందేమీ లేదు అలా వెళ్తోంది. అమాన్ నేను ఇవి పాటిస్తే  చంపడు అనుకోడానికి లేదు" అని నిస్సహాయంగా వాపోతుంది.
  • కొత్తగా వర్కర్స్ వేరే దేశాల నించీ వచ్చినప్పుడు, నాజీలకి  తోచినప్పుడు, కొందరి జూస్ ని ఏరి (కూరలు, రాళ్ళూ, రప్పలు లాగ ) ట్రైన్లలో తీసుకెళ్ళి  సెల్లలో సామూహికంగా చంపేస్తుంటారు నాజీలు (కొందరికి విషవాయువులు ఇచ్చి, కొందరిని కాల్చేసి, కొందరి మీద ప్రాణాంతక పరీక్షలు చేసి). అలా తీసుకెళ్ళే వాళ్ళని గూడ్స్ బండి లాటి దాంట్లో (గాలాడడానికి  పెట్టె మొత్తానికి ఒక చిన్న కిటికీ ఉంటుంది) పంపుతూ ఉంటారు. ఆ పెట్టెలలో గాలాడక, దాహంతో ప్రాణాలు పోయేడట్టు ఉంటుంది లోపల ఇరుక్కుని నించున్న జూస్కి . అప్పుడు షిండ్లర్ నాజీ కమాండర్ లతో మాట్లాడి, ఫైర్ హోస్ తో పెట్టలకి నీళ్ళు కొట్టిస్తాడు. ఆ కిటికీలలో నించీ, రూఫ్ నించీ  కారే నీళ్ళతో ఎండిన గొంతులు తడుపు  కుంటారు జూస్.
  • సినిమా అంతా బ్లాకు అండ్ వైట్. కానీ కొన్ని సన్నివేశాలలో ఒక పాప డ్రెస్ ని మాత్రం ఎరుపు లో చూపిస్తారు. ఎందుకో అర్థం కాలేదు. ఈ పాప బ్రతుకుందేమో  అనుకున్నాను.అలా చిన్న ఆశ కలుగుతుంది  .  చివరికి ఆ ఆశ కూడా నిరాశే అని తేలుతుంది. అక్కడున్న జూస్ బతుకుతామని  ఆశ పడడం వృధా అని నొక్కి చెప్తుంది.
  • ఇక గుండెలు పిండేసే క్లైమాక్స్. కిందామీదా నానా  తంటాలు పడి, అతి కష్టం మీద తనకున్నదంతా వెచ్చించి ఒక పదకుండు వందల    యాభై మంది జూస్ ని కాపాడతాడు షిండ్లర్. వారికి  ఏడు నెలలు పాటు తల దాచుకోడానికి చోటివ్వడానికే తన పుట్టినూరులో    ఫ్యాక్టరీని  పెడతాడు. చివరికి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి, సోవియట్ రష్యా చేతిలో నాజీలు ఓడిపోతారు. అప్పుడు ఈ జూస్ (షిండ్లర్ కాపాడిన జూస్ ) కి విముక్తి కలుగుతుంది. నాజి పార్టీ వారిని అర్రెస్ట్ చేస్తారు. ఇతను నాజీ పార్టీ వదవ్వడం వల్ల  దేశం వదిలి వెళ్ళే షిండ్లర్ ని జూస్ అందరూ  సాగానంప వస్తారు. వాళ్ళని చూసి నేను ఇంకా కొంత మందిని కాపాడుండ వలసింది. కపాదగాలిగీ  కాపడలేదు. బోలెడు డబ్బు వృధా చేసాను. ఈ కార్ ఎందుకు - ఇది ఒక ఇంకో పడి మందిని కపాడేదేమో, ఈ బంగారపు బ్యాడ్జు ఎందుకు ఇది ఇంకో ఒక్కరినైనా కపాడేదేమో  అని చాలా బాధపడతాడు. అక్కడ అప్రయత్నంగా గుండె కరిగి గొంతులోకి వచ్చేస్తుంది ప్రేక్షకులకి (నాకైతే జరిగింది)
             ఈ మారణహోమం (holocast) విన్న ఎవరికయినా గుండె రగిలిపోతుంది. అందులో స్పీల్బర్గ్ దర్శకుడు, అందునా జూ.ఇంకెంత రగిలిపోయి ఉంటాడు, ఎంత వేదన చెంది ఉంటాడు. ఆ బాధ ప్రతీ ప్రేక్షకుడికి గుండెలో పలికించ గలగడం, ప్రతీ మనిషిని ఒక ఘడియ ఆపి ఆలోచింప చెయ్యడం, ఒక కన్నీటి బొట్టు నివాళిగా రాల్చ గలిగేలా చెయ్యడం లో స్పీల్బర్గ్ కృత కృత్యుడు అయ్యాడని నా నమ్మకం.
P.S.



  • ఈ సినిమాకి స్పీల్బర్గ్ ఒక్క డాలర్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు
  • సినిమా అంతా   నాజీల అరాచకం గురించి అయినా, ఎక్కడా హిట్లర్ కనపడడు, అతని గొంతు వినపడదు.
  • ఈ మధ్య నేను చూసిన హోటల్ రవాండా కూడా ఇలాటి మారణహోమాన్ని, అందులో ఒక సామాన్యుడు  పరిస్తుతలని బట్టి, కొన్ని వందల మంది జనాల పాలిట రియల్  హీరోగా ఎలా పరిణత చెందుతాడో చూపెడుతుంది. దారుణ మరణ హోమాన్ని కళ్ళకు కట్టినట్టు చూపెడుతూనే, ఆ ప్రతికూల పరిస్థితులని  పోరాడే  మానవత్వాన్ని, ఆశావాదాన్ని చాటుతుంది. 

Sunday, December 20, 2009

అవతార్ - పెద్ద గొప్ప సినిమా కాదు - నాకు నచ్చనివి


జేమ్స్ కామెరూన్, భారీ బడ్జెట్, కొత్త టెక్నాలజీ , ఆరు నెలల ముందు నించి ఇచ్చిన హైప్ ఇవన్నీ చూసి చాలా అనుకున్నా ఈ సినిమా గురించి. రివ్యూలు కూడా కొంచం పాజిటివ్ గ ఉండే సరికి, ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహ లాడాను. IMAX లో అదీ 3D లో చూడాలని రెండు రోజులు ముందు బుక్ చేసి టికెట్లు, గంట డ్రైవ్ చేసి, రెండు గంటలు  లైన్ లో వెయిట్ చేసి   (మంచి సీట్ల కోసం) చాలా ఆత్రంగా ఈ సినిమాకి వెళ్లాను.
సినిమా నేను అనుకున్నంత కాకపోయినా బానే ఉంటే ఇంత గోల పెట్టేవాడిని కాను. సినిమాకి  ఇచ్చిన హైప్ కి, నేను చూడడానికి వెచ్చించిన సమయానికి, టికెట్కుకు  పెట్టిన  వెలకి (19$) సినిమా న్యాయం చెయ్యలేదని నిస్సంకోచంగా చెప్పగలను. అలాని సినిమా అసల బావోలేదు అని అనను. కామెరూన్ ఊహా శక్తికి, కార్యాచరణకి, సృష్టించిన కొత్త ప్రపంచానికి సలాం కొట్టాలి.
ఇక నాన్చకుండా నాకు నచ్చనివి చెప్పేస్తా. ఇవి మరీ చిన్న విషయాలు అనిపించవచ్చు కొందరికి.  కానీ నాకు మాత్రం సినిమాలో ఏదో వెలితి, అవి వీటి వల్లనేమో అనిపించింది.


  • సినిమా ఇంట్రడక్షన్, మొదటి సీన్లు పేలవంగా ఉన్నాయి . నేనింకా సినిమా మొదలు కాలేదు అనుకున్నా ఆ సీన్లు  అయ్యేవరకు. హీరో వాయిస్ narration కి అసల సూట్ కాలేదు. 
  • హీరో అసల నచ్చలేదు. ఎనర్జీ లేదు, నటన అంతంత మాత్రం. ఎంత అవతార్ నే ముఖ్యంగా చూపించినా, ఇతను ఉన్న సీన్లలో ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లా ఉన్నాడు
  • కొంత మంది నావి లు (నెయ్తిరి ముఖ్యంగా ) మొదటి సీన్ నుండే ఆంగ్లంలో మాట్లాడతారు  . ఆ మాత్రం దానికి నావి భాష మాట్లాడినట్టు చూపెట్టడం ఎందుకు ఇంక.
  • ఎమోషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళ బాధ మనకి బాధ కలిగించేడట్టు చూపించలేక పోయాడని పించింది (ఒకటి రెండు సీన్లు మినహా)
  • మంచి ఇంగ్లీష్ సినిమా అంటే నా వరకు నాకు, సినిమా అయిపోయినా బుర్రలో తిరుగుతూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. (It should haunt me). అలా ఉంటుంది అనుకున్నా కానీ అసల లేదు. చూసి రెండు గంటలైంది. ఒక్క సీన్ కూడా స్ఫురణ కి రావట్లేదు విషువల్గా. 
  • పండోర లో చాలా భాగం లార్డ్ అఫ్ ది రింగ్స్ లో చూసినట్టు అనిపించింది. దాని వల్ల ఒక కొత్త ప్రపంచాన్ని చూసే ఆనందం పూర్తిగా పొందలేదు.
  • 3D ని పెద్దగా వాడుకున్నట్టు అనిపించలేదు. ఉదాహరణకి ఫైనల్ డెస్టినేషన్ లో ఇంకా బాగా వాడుకున్నాడు ౩D ని. యాక్షన్ లో మనం అక్కడున్న ఫీలింగ్ కలగలేదు. 
  • ఉన్నవి రెండో మూడో యాక్షన్ సీక్వెన్స్ లు అవి కూడా వాళ్ళు గగురు పోడిచేడట్టు ఏం లేవు. ఆ విధంగా కూడా నిరుత్సాహ పరిచింది.
  • కామెరూన్ గారు అంత ఖర్చెందుకు పెట్టారు అన్న విషయం (అని అడగాలని ఉన్నా) పక్కన పెట్టినా, నా టికెట్ కి పైసా వసూల్ మాత్రం కాలేదు. 
  • ముఖ్యం గా జనాలు చెప్పినంత ఏం లేదు సినిమాలో. నేను రామ్ గోపాల్ వర్మ టపా చూసి అసల తెగ ఊహించుకున్నా సినిమాని. అంత లేదు. నాకు దీని కంటే ఈ ఏడాది వచ్చిన అప్, 2012  (ఇల్లోజికాల్ అయినా )  ఎక్కువ నచ్చింది. 

Monday, November 9, 2009

కబుర్లు - నవంబర్ 9


నిన్న టీవీ 9 లో స్టార్ నైట్ చూస్తూ కూర్చున్నాం. తెలుగు సినిమా పరిశ్రమ కి పెద్ద దిక్కు (అని ఆయనే చెప్పుకునే) దాసరి నారాయణ రావు గారు ఒంటి చేత్తో కార్యక్రమాన్ని సజావుగా జరగనివ్వకుండా చేసారు. మైక్ చేతిలో ఉంటె ఆయన భూమ్మీద ఉండరు కదా. ఆయన ఇంగ్లీష్ వింటే మనసు పులకించింది. మైదకూరు  లో స్కూల్  పిల్లలకి I never speak in Telugu అని  పలక మెడలో వేసినట్టు, ఈయనకి  I will never speak in English  అని మెడలో వేయించాలనిపించింది. సంగీత విభావరులు బానే ఉన్నాయి కానీ, మధ్య మధ్య లో దాసరి గారు, జస్ట్ వన్  సాంగ్, థాంక్స్ యు అని వాళ్ళని కట్ చెయ్యడం చాలా బాధేసింది. సభ మర్యాద కూడా లేకుండా, పాడుతుంటే  మధ్యలో ఆపెయించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

సుశీల గారి జనని శివకామిని పాటతో మొదలు పెట్టారు కార్యక్రమాన్ని. సుశీల గారు పాడడానికి కొంచం కష్టపడ్డారు. ఆవిడ  గొంతు ఉన్నంత నిండుగా ఇంకెవరిదీ లేదు ఆ స్టేజి మీద (బయట  కూడా)  . ఆవిడ కూడా లత గారి లాగా ఇంకొన్నాళ్ళు పాడగలిగి   ఉంటే ఎంత బావుండేదో అనిపించింది.  సుశీల గారి పాట  తరువాత కోటి, కీరవాణి, మణిశర్మ తదితరులు  సంగీత విభావరి కొనసాగించారు.

కీరవాణి గారు 'బంగారు కోడి పెట్ట సాంగ్' గురించ చెప్తూ, 'అప్ అప్ హాండ్స్ అప్' అని ఎవరూ మీలాగా అనలేకపోయారు అందుకే మీరు పాడినదే ఈ కొత్త పాటలో(మగధీర లో ) పెట్టాం అని బాలు గారికి చెప్పారు. దానికి బాలు ఇలా నేను పాడినవి పెట్టి, నన్ను పిలవడం మానేయకండి అని చురక వేసారు. నాకు నచ్చని విషయం ఏంటంటే, తెలుగు లో కొన్ని పాటలని పాడడానికి అనర్హాం ( సూపర్ లో  మిల మిల మెరిసిన కనులకి  పాట గురించి క్లాసు పీకరులెండి ఒక షో లో ) అన్న రీతిలో తిట్టిపోసిన బాలు గారు  బంగారు కోడి పెట్ట పాటని అదేదో కీర్తన లాగ పోటి పడి మరీ పాడారు. అప్పట్లో (ఒరిజినల్ పాడిన టైం లో ) ఐతే వేరే విషయం అనుకోండి. ఇప్పుడు కూడా (స్టార్ నైట్) లో పాడవలసిన అవసరమేముంది.

దేవిశ్రీ ఎప్పటిలాగే పాడలేకపోయినా హడావుడి చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దేవిశ్రీ పెద్ద గాయకుడు కాదు కానీ మాంచి స్టేజి పెర్ఫోర్మేర్. ఊపు తీసుకొస్తాడు ఏ  షో లో అయినా సరే. Excuse me Mr. Mallannaa పాటని  సుహాసిని చాలా బాగా పాడింది. అల్లు అర్జున్, దేవి శ్రీ , మమత మోహన్దాస్ డాన్స్ కూడా బావుంది.  ఇంకోటి విద్యాసాగర్ గారు  ఈ విభావరి లో కనిపించలేదు. కారణాలు నాకు తెలియవు   కానీ, తమిళులు ఎంతో గౌరవించి, అవకాశాలు ఇచ్చే ఆయనని   మన తెలుగు సినిమా వాళ్ళు ఎందుకు పట్టించుకోరో నాకర్థం కాదు.

ఆ తరువాత డాన్స్ లు,  స్కిట్లు చాలానే ఉన్నాయి. ఒకటి రెండు తప్ప స్కిట్లు పెద్ద గొప్పగా లేవు. కుక్క- టి వి ఛానల్  మీద స్కిట్ కొన్ని బ్లాగ్లలో  చదివిన టపాకి  దగ్గరగా  ఉన్నా బానే నవ్వించింది.  భువన విజయం స్కిట్ మిస్ అయ్యాను. కార్యక్రమం చివరిలో దాసరి ఇదే అదును చూసుకుని, మోహన్ బాబు ని, బాల కృష్ణ ను బాగా  ఎత్తేసారు. మోహన్ బాబుకి మైక్, మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం  నన్ను చాలా నిరశాపరించింది  . వజ్రోత్సవాలలో లాగ ఆయన కొంచం వేడి పుట్టిస్తే బావుండేది. చాలా రోజులు చెప్పుకోడానికి. ఇంకొక విషయం గమనించాను. రజనీ కాంత్ ప్రత్యేక అతిధి గా  హాజరు అయ్యారు. ఆయన వచ్చేసరికి రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున  ఒక చోట కూర్చుని ఉన్నారు. రజని కాంత్ రాగానే, గౌరవంగా నాగార్జున లేచి ఆయన సీట్ ఇచ్చి వేరే చోట కూర్చున్నారు.అక్కడే ఉన్న రామ్ చరణ్ లేచి ఆయనకు గౌరవం ఇచ్చి వేరే చోట కూర్చవాలన్న ఇంగిత గ్న్యానం లేదేంటా అనుకున్నాను. అయినా ఒక పక్కన అల్లు అర్జున్ వాళ్ళ వయసు వాళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తుంటే పెద్దవాళ్ళ దగ్గర రామ్ చరణ్ కూర్చోవాల్సిన అవసరం ఏంటి? చూడబోతే ఈయన కూడా పెద్దగ కలవదేమో ఎవరోతోనూ. చిరంజీవి ఉన్నంత సేపు ఏదో తప్పక వచ్చినట్టు కూర్చున్నారు. నాకైతే మోహన్ బాబు ఎప్పుడు వచ్చి ఏమంటాడో అన్న కంగారు తో కూర్చున్నవాడిలా అనిపించారు. మహేష్ బాబు ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి కూడా రాలేదు. ఊరంతా ఒక దారయితే ఉలిపిగడ్డ దొక దారని అసల ఎక్కడా దర్శనమివ్వడు బాబు. మహేష్ బాబు కి  బొత్తిగా PR లేదు(లేవు).

ఈ రోజు రామ్ గోపాల్ వర్మా  'అజ్ఞాత్'  అనే కళాఖండం చూసి తరించాను. పచ్చగా ఉన్న అడవి, పిచ్చి పిచ్చి శబ్దాలు, నితిన్ సిక్స్ ప్యాక్ , నిషా కొఠారి (ఇప్పుడు ప్రియాంక ఏమో) ఎక్ష్పోసింగ్  తప్ప సినిమాలో ఏం లేదనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్  చెత్తగా ఉంది (అజ్ఞ్యాత్ ౨ కి ట్రైలర్  లాగా ). డైరెక్టర్ ప్రేక్షకులు  ఫూల్స్ అని అస్స్యూం  చేసుకుని తీసినట్టు ఉంది (నిజానికి అతను లాభ నష్టాలు, ఆడియన్స్ ఇష్టైష్టాలు  అవన్నీ పట్టించుకోడుట. తనకి నచ్చింది తీసేస్తాడుట) . రామ్ గోపాల్ వర్మ కి ఎప్పుడూ చూడనంత భయానకమయిన  అడవి శ్రీ లంక లో కనపడిందిట. అందుకని ఒక సినిమా తీసేసి మన మీదకి వేదిలేసారు. పోనీ భయపెట్తిందా అంటే అదీ లేదు. నేను రామ్ గోపాల్ వర్మ అభిమానినే అలా అని ప్రతీ చెత్త సినిమాను సమర్థించాను  . ఈ సినిమాకిచ్చిన హైప్ కి హాల్ లో చూద్దాం అనుకున్నా కానీ US  లో రిలీజ్ కాలేదు అదృష్టవశాత్తు.

లాస్ట్ వీక్ హాలోవీన్ కి పిల్లలోస్తారేమో లైట్స్ పెట్టి,  క్యాండిలు అవీ  రెడీ గా  పెట్టుకున్నాం. ఒక్కళ్ళూ రాలేదు. గత యేడాది బోలెడు మంది  పిల్లలు వచ్చారు. ఈ సారేంటో అసల రాలేదు.  వస్తే బోలెడు ఫోటోలు తీద్దాం అనుకున్నా.  కాలిఫోర్నియా లో చలి బానే పెరిగింది.  థాంక్స్గివింగ్ దగ్గర పడుతోంది కదా.  సాయంత్రం కూడా ఇంటి దగ్గరే ఉండాల్సోస్తోంది యాక్టివిటీ ఏం లేకుండా. ఇంక పాపం ఈస్ట్ కోస్ట్ వాళ్ళ పరిస్తితి ఏంటో.

అన్నట్టు  మా ఫ్రెండ్స్ హాలోవీన్ కని ఈ స్కేరీ వీడియో పంపారు.చూసి భయపడకుండా ధైర్యంగా ఉన్నవాళ్లు చెయ్యి  ఎత్తండి.
భయపడినవాళ్ళు కామెంటండి.


Monday, November 2, 2009

ఇవీ సంగతులు - నవంబర్ 2



కార్తీక మాసం అనగానే తెలియని ఆనందం కలుగుతుంది నాకు . ఇండియా లో ఉంటే ఈ మాసం లో ప్రతీ సోమవారం ఉదయాన అభిషేకం, ఉపవాసం భలే ఉండేది. నాకు కార్తీక మాసం మొత్తం పండగ లా అనిపించేది. ముఖ్యంగా ఉపవాసం ఉన్నప్పుడు, సాయంత్రం వరకు వేచి వేచి తినడం భలే ఆనందం గా ఉండేది. (అన్నట్టు ఉపవాసం అంటే దగ్గరగా (ఉప ) ఉండటం (వాసం) దేవుడికి దగ్గరా ఉండటంట). అందులో కార్తీక మాసం లో ఉదయాన చలి ఎక్కువగా ఉంటుందేమో, ఆ చలిలో తెల్లవారకుండా తల స్నానం, సూర్యుడి తొలి కిరణాలు కూడా రాకుండా గుడి వరకు నడక, గుడిలో అభిషేకం, అది అయ్యాక అప్పుడప్పుడే వస్తున్నా వెచ్చని కిరణాల వేడికి చలి కాచుకుంటూ ఇంటికి రావడం, శివ స్తుతి వినడం, సాయంత్రం వరకు ఉపవాసం చేసి, సాయంత్రం పూజ చేసి, చంద్రుణ్ణి , నక్షత్రాలని చూసి, వేడి వేడి పులిహోర, కంద బచ్చలి కూర (నాకు ఇదంటే ప్రాణం) తినడం - ఒక చక్కని అనుభూతి. దీంట్లో ఏది తక్కువైనా అసంపూర్ణంగా ఉన్నట్టు అనిపించేది (ముఖ్యంగా కందా బచ్చలి :) ). ఇక్కడికొచ్చాక ఉపవాసం ఐతే కుదురుతోంది కాని, మిగతావన్నీ కష్టమే. అయినా వీలున్నంత లో చేసి మమ అనిపిస్తున్నాం. ఇక ఇవి కాకుండా, వన భోజనాలు. ఈ సారి కనీసం దీనికైనా ప్లాన్ చెయ్యాలి మేము.  

మధ్య టివి పెడితే (తెలుగు చానళ్ళు ) తెగ చిరాకోస్తోంది. ఒకటి రెండు మినహా అన్ని కార్యక్రమాలు కాంపిటీషన్ - ఎలిమినషన్ - డేంజర్ జోన్ లేదా డబ్బు- సినిమాలు. నిన్న యు ట్యూబ్ లో మాల్గుడి డేస్ కంట పడింది. అది చూస్తే చిన్నప్పుడే, ఒక్క డి డి ఉన్నప్పుడే ఎంత మెరుగ్గా ఉన్నాయి కార్యక్రమాలు అనిపించింది. దానికి తొడు నిన్న నాకు తెలిసిన ఓ బ్లాగ్ లో వీటి గురించి చదువుతుంటే చిన్నప్పటి వన్నీ మరీ ఎక్కువగా గుర్తొచ్చి నెమరు వేసుకుంటున్నాను. వారాంతం లో వచ్చే సినిమా కోసం వేచి చూడడం, శుక్రవారం ఐతే చిత్రలహరి, బుధవారం చిత్రహార్, ఆది వారం రంగోలి. ఇంకా సురభి, ఉడాన్, తెహ్కికాత్, గుల్ గుల్షన్ గుల్ఫా, చాణక్య, మహాభారత్, రామాయణ్ ఇలా బోలెడు, అన్ని చూసి ఆనందించగలిగేవే. ఆఖరికి మధ్యలో వచ్చే యాడ్స్ కూడా చాలా చక్కగా ఉండేవి . ముఖ్యంగా ఏక్ తిత్లీ, మిలే సుర్ మేరా ఇప్పుడు చూసినా ఎంత బావున్నాయో అనిపిస్తాయ్.పుట్ట గొడుగుల్లా వస్తున్నా చానల్స్, హాయిగా చూడగల కార్యక్రమాలు అసల లేవనిపిస్తుంది. ఉప్పెక్కువై రుచి చెడినట్టు, చానల్స్ ఎక్కువై నాణ్యత పోయింది.





నిన్న మై కజిన్ విన్నీ అనే ఒక సినిమా చూసాను. పేరు కూడా వినలేదు ఇంతకూ ముందెప్పుడూ నేను. మిత్రుడొకడు మరీ మరీ చెప్తే చూసాను. భలే ఉంది. ఆద్యంతమూ హాస్యం, అలా అని కథ, కథనం గాలికి వదిలెయ్యలేదు. చిన్న కథ, ఆసక్తికరమైన కథనం. చిన్న దొంగతనం చేసిన ఇద్దరిని పొరపాటున హంతకులనుకుని అరెస్టు చేస్తారు. వాళ్ళలో ఒకడి కజిన్ (విన్నీ) ని అటార్నీ కింద పెట్టుకుంటారు. అతని చేష్టలు, జడ్జి కి అతనికి మధ్య కోర్టు సన్నివేశాలు, అతను పడే పాట్లు, చేసే ఫీట్లు - ప్రతీ సీన్ భలే నవ్వు తెప్పిస్తుంది . చివరికి కేసు ను వాదించడం కూడా చాలా బాగా చిత్రీకరించాడు దర్శకుడు . కుదిరితే తప్పక చూడండి.తరువాత మీరే ఇది ఎలా మిస్ అయ్యానా అనుకుంటారు.
ప్రస్తుతానికి ఇంతే సంగతులు. మళ్ళీ కలుద్దాం.
P.S. ఈ టపాకి (ఇక పై ఈ బ్లాగ్ లో ఈ క్రమం లో, ఈ పేరుతొ వచ్చే టపాలకి) కొత్తపాళీ గారి కబుర్లు ప్రేరణ. ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు.

Friday, October 30, 2009

సంఘర్షణ



ఏవేవో ఆలోచనలు.. 
ఏవేవో ఆవేదనలు .. 

నరాలు తెగిపోతున్నాయి స్వరాలు విడిపోతున్నాయి 
మెదడు అగ్ని పర్వతంలా బద్దలవుతోంది 
ఆలోచనలు లావాలా పొంగుతున్నాయి  


నాకూ మనసుకు జరిగే పోరులో మాటలు మర ఫిరంగుల్లా పేలుతున్నాయి
చెవిలో శబ్దాలు రింగుమంటున్నాయి 
కలల్లో పొగలా కమ్ముకుంటున్నాయి 
కనుల్లో నదిలా పొంగిపోతున్నాయి  


ఆధీనంలో లేవు ఏవి 
చెబితే వినదు ఏదీ 
నిరంతరం జరిగే సంఘర్షణలో మనసు గెలిచినా మెదడు గెలిచినా మనిషిగా నేనే ఓడిపోతున్నాను

Wednesday, October 28, 2009

టి వి చానళ్ళ అత్యుత్సాహం - కొత్తగా పుట్టుకొచ్చిన భాషాభిమానం

ప్రసార మాధ్యమాల పుణ్యమా అని ఈ పాటికి మైదకూరు లో జరిగిన ఉదంతం, దాని మీద చేసిన రాగ్దాంతం చూసి ఉంటారు. తెలుగులో మాట్లాడిన విద్యార్థులు మెడలో I never speak in telugu అని రాసి ఒక బిళ్ళ తగిలించడం.  


ఈ టీవి చానల్లు తెలుగు భాషను ఉద్ధరించేస్తున్నట్టు, తెగ బాధ పడిపోతున్నాయి. ఇప్పుడే టి వి 9 ఒక కార్యక్రమం చూసాను (అమ్మకి అవమానం) కొంచం చూసి ఇంత సిగ్గులేకుండా ఎలా మాట్లాడతారా అనిపించింది. ప్రతీది రచ్చ చెయ్యడం వీళ్ళకి అలవాటైపోయింది. ముందు ఎవరన్న వీళ్ళ మీద ఒక ఉద్యమం మొదలెట్టాలి. పరబాష లో కార్యక్రమాలు, వాటి పేర్లు ఉండకూడదని. ఒక్కళ్ళకి 'ళ' 'ణ' పలకడం రాదు. ఒక వాక్యం మాట్లాడితే దాంట్లో 90% ఆంగ్ల పదాలే. టీవీ 9 లో ఐతే బూతద్దం పెట్టి వెతికినా ఒక్క తెలుగు కార్యక్రమం పేరుండదు.  


ఇక ఆ పాఠశాలలో జరిగిన విషయమైతే చాలా శోచనీయం. కానీ అలాటివి బోళ్ళు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ పిల్లలు తెలుగులో మాట్లాడాలని తల్లి తండ్రులకు ఉంటే తప్ప చెయ్యకలిగిందేమి లేదనిపిస్తుంది నాకు. వాళ్ళేమో ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే, ఫ్యూచర్ లో కష్టం అని అంటారు. మైదుకూరు లాటి సంఘటనలు జరిగే సరికి, జనాల్లో రగ్గు కప్పుకుని నిదరపోతున్న భాషాభిమానం, మాతృ బాష మీద ప్రేమ పొంగుకొచ్చేస్తాయ్ . సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఏవేవో ప్రతిపాదించేస్తారు . ఆంగ్లం రద్దు చెయ్యాలి, తెలుగు ని ముద్దు చెయ్యాలి అని. తెలుగు నేర్చుకోడానికి , కేవలం తెలుగు లో బోధన, ఆంగ్లం వాడకపోవడం కాదు కావాల్సింది. తెలుగు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగచెయ్యాలి పిల్లలకి. ఇష్టంగా పిల్లలు చదివేడట్టు పుస్తకాలు, లేక సి డి లు (ఇవి కొన్ని ఇప్పటికే ఉన్నాయి కానీ ఇంకా ఎక్కువగా) రావాలి. చందమామ లాటివి చదవడం అలవాటు చేస్తే, వాటి కంటే మేలు చేసేవి ఉండవు భాషా వికాసానికి. పెదబాల శిక్ష ఉంటే బూజు దులిపి, లేకపోతె కొని, పిల్లలకి చదివి చెప్పాలి, చదివించాలి. హ్యారీ పాటర్ (నేను చదవలేదు, మంచి పుస్తకమని విన్నాను)ని తలదన్నే పుస్తాకాలు తెలుగులో ఉండి ఉంటాయ్. కాకపొతే ఇంగ్లీష్ పుస్తకాల మీద ఉన్నంత ఆసక్తి తెలుగు పుస్తకాల మీద ఉండేడట్టు తల్లి తండ్రులు చెయ్యాలి. ఈ భాషా సంఘాలు,తెలుగు విశ్వవిద్యాలయాలు నిజంగా ఎమన్నా చేయదల్చుకుంటే, కొంత డబ్బు వెచ్చించి, బాలల సాహిత్యాన్ని మంచి నాణ్యతతో, ప్రమాణాలతో ప్రచురించాలి. (తినాలంటే రుచి తో పాటు రూపు కూడా అవసరం కదా ). వీలయితే పాఠశాలలకి ఉచితంగా కాపీలని ఇవ్వాలి. తరచూ పిల్లల కోసం తెలుగు భాష కి సంబంధించిన  వినోద కార్యక్రమాలు నిర్వహించాలి . ముఖ్యంగా ఇలాటి వాటిలో సుదీర్ఘ ఉపన్యాసాలు అవి ఇచ్చి బెదరగొట్టకుండా , వారికి నచ్చే రీతిలో చెయ్యాలి. వాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండేడట్టు చూడాలి. నాకు టీవీ లో పాటల పోటీలు అవి చూసినప్పుడు, తెలుగు భాషకేం ఢోకా లేదు అనిపిస్తుంది, అంత స్పష్టంగా పాడుతున్నారు, మాట్లాడుతున్నారు. కాకపోతే ఈ సంఖ్య తక్కువనుకోండి.  


మాతృ భాషలో విద్యా బోధన ఇవన్ని ఇప్పటి కాలమాన పరిస్థితులలో అసాధ్యం కానీ, కనీసం తెలుగు ఖచ్చితంగా తీసుకోవాలి అని హైస్కూల్ వరకు అన్నా పెడితే బావుంటుంది (ఇది ఇప్పటికే ఉందేమో నాకు తెలియదు. ఉంటే పాటించట్లేదని మాత్రం చెప్పగలను .)  


మైదకూరు ఉదంతం వల్ల జరిగిన మంచి ఎమన్నా ఉంటే, అది జనాలు ఓ నాలుగు రోజులు తెలుగు గురించి మాట్లాడుకుంటారు. ఆ తరువాత మల్లి మామూలే, మర్చిపోతారు.  


ఈ సందర్భం లో నేను రాసిన పాత టపా ఒకటి గుర్తుకొచ్చింది. టి వి చానల్లు, సినిమాలలో తెలుగు గురించి. http://maanasasanchara.blogspot.com/2008/06/blog-post.html




P.S. రాము గారు ఈ అతిని ఇంకా బాగా ఎండగట్టారు. చూడండి.
http://apmediakaburlu.blogspot.com/2009/10/blog-post_2



Saturday, October 24, 2009

ప్రేమంటే!




నేను ఎప్పుడో నా కాలేజీ రోజుల్లో (ఒక 7 ఏళ్ళు అయిఉంటుందేమో) రాసుకున్న కవిత. పాత పుస్తకాలు తిరగేస్తుంటే కనపడింది.


పూలన్నవి పూయకపోతే మొక్కకు అందం లేదు
ప్రేమన్నది విరియకపోతే మనసుకు అర్థం లేదు
బ్రతుకే వ్యర్థం కాదూ!

చివురించిన వసంతంలో చిగురాకుల గుండెల్లో చినుకులకై ఆలాపన ప్రేమ
గుబురైన పొదల్లో వికసించిన పూయదల్లో తుమ్మెద కై తపనే ప్రేమ
విరియని కలువ కనుల్లో చంద్రుడి కై ఆవేదన ప్రేమ
విరిసిన కమలం హృది లో సూర్యుడి కై ఆ వేదన ప్రేమ

ఎగిసే అల కోసం నీటి కన్నీటి ధార ప్రేమ
కురిసే వానలో ఒరిసే ఎండకి పుట్టే హరివిల్లు ప్రేమ
శిల మదిలో నిదురించే శిల్పం కనుల్లో యమయాతన ప్రేమ
తన యదనే చుంబించే ఉలి కోసం విరహాలాపన ప్రేమ

Monday, October 12, 2009

ఎన్నాళ్ళయింది


- వాసు


ఎన్నాళ్లైంది..
కమ్మని అమ్మ వంట తిని
నాన్నతో తీరికగా కబుర్లు చెప్పి
నా మేనకోడలు ముద్దు మాటలు విని
ఇష్టమ్లేని హిందీ సీరియల్స్ మా అక్కతో, తెలుగు సీరియల్స్ మా అమ్మతో సీరియస్గా చూసి ఎన్నాళ్లైంది

ఇరుకైన రోడ్లలో ఉరకలేస్తున్న బైక్ నడిపి
బారులు తీరిన లైన్లలో గంటల తరబడి నించుని సినిమా చూసి
అర్థ రాత్రులు నిద్ర పట్టక విరబూసిన వెన్నెలలో వూరంతా షికారు చేసి
కాలనీ చివర మా గ్యాంగ్తో మూడింటికి ఐస్ క్రీమ్ తిని ఎన్నాళ్లైంది


వాన తుమ్పరలో వీధి చివర బొగ్గుల్లో కాలుతున్న మొక్క జొన్న కండి
వేడి వేడి చాట్ ని వేళ్ళు ముంచి వేసిన పానీ పూరీని రుచిగా వడ్డించే బండి చూసి ఎన్నాళ్లైంది


గ్రూప్ స్టడీలని గ్యాప్ లేకుండా కబుర్లు చెప్పుకుని
గుడుంబా గాడి రూమ్ లో రాత్రంతా పేకాడి
మేడ మీద, ఆకాశం కింద తీరిగ్గా పడుకుని చుక్కలని లెక్కెట్టి
పోరుల గురించి సినిమాల గురించి డిస్కషన్లు పెట్టి
ఎన్నాళ్లైంది

పెద్దగా పని లేకపోయినా క్షణం కూడా తీరికలేని
జేబులో పది లేకపోయినా కొంచం కూడా బాధలేని
నడిచేది ఎంత దూరమైనా కాళ్ళకు నొప్పి రాని
నేస్తాలతో నడిచే ఆనందాన్ని
చవిచూచి ఎన్నాళ్లైంది












Friday, September 11, 2009

పుట్టినరోజు - చెణుకులు




వాల్ క్లాక్ లో పన్నెండు
క్రీం కేక్ తో నా ఫ్రెండు
ఒకేసారి వచ్చారు

గడియారం లో ముల్లు కొద్దిగా కదిలింది
నా జీవితం లో ఇంకో సంవత్సరం కరిగింది

ఉన్న కాసేపు ఇతురలకి వెలుగునివ్వడమే జీవిత పరమార్థం
ఆరే కొవ్వొత్తి లో ఎంత వేదాంతం


రెస్టారంట్ లో బ్యారర్ కి టిప్ ఇరవై డాలర్లు.
మా ఊళ్ళో కూలివాడి తలసరి నెల ఆదాయం.


(సశేషం)

Saturday, May 16, 2009

జె. పి. గారూ ! కె.పి మీ చేతుల్లో

నెల రోజుల నిరీక్షణ నేటితో ముగిసింది. ఫలితాలు వెల్లడి ఇంకో ఐదేళ్ళ మజిలీకి తెరతీసింది. ఈ సారి ఎన్నికలకి ఎప్పుడూలేనంత ఉత్సాహం. ఫలితాల కోసం ఆతృత.

ముఖ్యంగా మా నియోజికవర్గంలో ఒక మంచి నాయకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ నిలబడినందుకు నాకుగర్వంగా ఉంది. కానీ వోట్ వెయ్యలేకపోయినందుకు చాలా బాధ పడ్డాను నిన్నటి వరకు. ఈ రోజు ఆయన గెలిచారన్నశుభవార్త చెవిలో పడేవరకు నిద్ర పట్టలేదు. ఇప్పుడు
కొంత ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

నిజానికి ఆశించిన దానితో పోలిస్తే ఇది తక్కువ అయినా, మా నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజికవర్గంగాతీర్చిదిద్దడానికి లోక సత్తాకి అవకాశం వచ్చినందుకు, లోక సత్తాని గెలిపించే అవకాశం మా నియోజకవర్గానికివచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.

జె. పి గారూ ! శుభాకాంక్షలు. లోక సత్తా రాజకీయ ప్రయాణం మొదలైంది. స్వచ్చమైన కొత్త రాజకీయాలకి ఇది నాందికావాలని ఆశిస్తున్నాను.

కూకట్ పల్లి ఒక ఆదర్శ నియోజకవర్గంగా మీ నాయకత్వం
లో రూపు దిద్దుకోవాలని, మున్ముందు లోక సత్తాతీసుకు రాబోయే ఉత్తమ రాజకీయ ప్రమాణాలకి తొలి మలుపు కావాలని ఆకాంక్షిస్తూ..

లోక సత్తా అభిమాని,
వాసు

Thursday, April 16, 2009

రెస్ట్ లెస్

వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా - పాక్ మ్యాచ్ ఉంటే ఆ రోజు ఎలా ఉంటుంది?
EAMCET రాసే రోజు ఎలా ఉంటుంది ?
ఉద్యోగం ఫైనల్ ఇంటర్వ్యూ రోజు ఎలా ఉంటుంది?

నాకైతే పిచ్చెక్కినట్టు ఏదో తెలియని బాధ, ఆనందం, ఉత్సాహం,ఆతృత అన్నీ కలగలిపి ఒక వింత అనుభవం కలుగుతుంది. సరిగ్గా నిన్న అలాగే ఉంది చాలా రోజుల తరువాత. నా జీవితం లో ఎన్నికలు గురించి ఇంత అలోచించినది, ఫాలో ఐనది ఇదే
మొదటిసారి. ఇంకా రెండవ విడత ఉంది, ఫలితాలు ఎప్పుడో నెల తరువాత , అయినా ఏంటో తెలియదు నిన్నంతా అలాగేఉన్నా. ఈ నెల త్వరగా గడిస్తే బావుండు అనిపిస్తోంది.

Friday, April 3, 2009

తునకలు


౧. తీపి జ్ఞాపకాల షవర్లో
తీరిగ్గా తడుస్తోంది మనసు
వర్తమానం బట్టలిప్పి
బాధలన్నీ కడిగేస్తోంది.

౨. మెదడు సెల్ ఫోన్లో ఆలోచనల అన్నోన్ కాల్లు
కలం ఎత్తేలోపే కట్ అవుతున్నాయి

౩. ప్రతీ ముక్కలోనూ ప్రశ్నిస్తోంది పగిలిన అద్దం - మనస్సాక్షి
అమ్మ నాన్నను అక్కడ వదిలి ఏం చేస్తున్నావ్ ఇక్కడ?

౪. ఎక్కడికెగిరినా మనసు
విహంగం
నిలకడలేని ఆకాశం ఎత్తు కంటే
స్థిరమైన సొంత గూడునే ప్రేమిస్తోంది

౫. మెదడు సిడి లో ఆలోచనల డేటా
ఎంత ఎక్కిన్చినా ఇంకా చోటుంది
ఏం చేసినా చెరగదు.

- వాసు

Monday, March 30, 2009

ఓటును నేను !!

నోట్: ఈ కవిత సుజనరంజని డిసంబర్ సంచిక లో ప్రచురితమయింది.



తలుచుకుంటే మీ చేతిలో తూటును నేను
తుచ్ఛ నాయకులకు పోటును నేను

మీరెన్నుకునే నేతను, మీ ఐదేళ్ళ తలరాతను, అమ్ముకుంటే గుండె కోతను నేను .
మీ గుండె గొంతుల మాటను, మీ జీవన వీణ మీటను,
మీ కలల మూటను, మీ భవిష్యత్తుకు బాటను నేను

మీ బతుకు రాతలు మార్చే కలాన్ని, మీ బలాన్ని నేను
మీ ఆశను నేను , ప్రజాస్వామ్యానికి శ్వాసని నేను
మీ కోపం నేను, మీ తీర్పుకి రూపం నేను
మీ కోసం నేను, వాడుకోకపోతే క్లేశం నేను

భయం వదిలి ఇళ్ళు కదిలి రండి ఓటేద్దాం
మనం కదిలి కుళ్ళు కడిగి ప్రగతికి రూటేద్దాం
ఓటంటే నోటు కాదు, అమ్మకండి నమ్ముకోండని చాటేద్దాం
మాటలతో మార్పు రాదు, ముందు మనం పాటిద్దాం
జనం గళం వినిపిద్దాం, జగం చెవులు రింగుమన సత్తా చూపిద్దాం.



అర్హత ఉండి ఓటు లేకపొతే రోజే తెచ్చుకోడానికి ప్రయత్నించండి
ఓటు గురించి తెలుసుకోండి అపోహలు తొలగించుకోండి (http://jaagore.com
)
ఓటు ఉంటే ఏప్రిల్ ౧౬,౨౩ (April 16,23) వెయ్యడం మర్చిపోకండి
మీకు తెలిసిన వారందరూ ఓటు వేసేంత వరకూ వరకూ నిద్రపోకండి


రండి ఓటేద్దాం మన బాధ్యత నిర్వర్తిద్దాం.


Vote is not just your right . Its your DUTY.

ఉగాది బూరెలు


మొన్న ఉగాదికి చేసింది మా ఆవిడ బూరి
కొని తెచ్చిన బ్యాటర్ లో కొబ్బరిని కూరి
ఉడికించిన శెనగపప్పు పాకం లో ఊరి
బహు రుచిగా ఉంది తెగ తిన్నా నోరూరి

ోజంతా ఒకటే ఫోన్లు
వదలకుండా ఈటీవీ, టివి నైన్లు
మీ ఆవిడేనా చేసినది
కనపడట్లేదు ఆ సైన్లు



ఏం చెప్పినా నమ్మలేదు
ఎంత చెప్పినా వినలేదు
రుచి చూశాక నా స్నేహితులు
నాకొక్కటీ వదలలేదు

మా అత్తా మావయ్య మా అమ్మా నాన్న
అమ్మలులో ఎంత మార్పు అన్నన్నన్నా
నమ్మలేక పోతున్నాం ఇది నిజమేనా
అంటుంటే పొంగి పోయింది తను నిన్నా మొన్నా




Saturday, March 28, 2009

నేను - శీను - లోక్ సత్తా

నేను: Hi ra శీను
శీను: ఎలా ఉన్నావ్ mama. ఏం నడుస్తోంది.
నేను: office లో పని వాస్తోంది. ఈ recession మరీ bad time లో వచ్చింది.
శీను: Recession వల్లే bad time వచ్చింది (నవ్వుతూ). ఆయినా మన batch ఎక్కడ లెగ్గెడితే అక్కడ మటాష్ కదా.
నేను: నీదెలా ఉంది? సేఫా?
శీను: తియ్యనంత వరకూ. సో weekends కూడా తప్పట్లేదా పని? ఔను, ఐతే ఫాలో అవ్వట్లేదా elections?
నేను: వీకెండ్స్ లేదులే work. Elections - serious గా follow అవుతున్నాను. బహుశా మొదటి సారేమో ఇంతగాఫాలో అవ్వడం.
శీను: లోక్ సత్తా గురించా అంత ఉత్సాహం.
నేను: ఎప్పుడూ bilateral series లా ఉండే ఆంధ్రా రాజకీయాలు ఈ సారి వరల్డ్ కప్ అంత ఆసక్తికరంగా ఉన్నాయి. కానీఅందుకని కాదు ఈ ఉత్సాహం. న్యాయంగా ఆడే టీం ఒక్కటైనా ఉందని ఈ ఉత్సాహం
శీను: ఉత్సాహం సరే ఎమన్నా చేస్తున్నావా?
నేను: చెయ్యగలిగింది చేస్తున్నా.
శీను: మొన్న నేను రాజేష్ గాడిని కలిసాన్రా. వాడు అడిగినది నాకు చాలా సబబుగా అనిపించింది.
నేను: ఏంటది?
శీను: ఇప్పటి వరకు లోక్ సత్తా ఎం చెయ్యలేదు కదా. చేస్తుందని గ్యారంటీ ఏంటి? అనుభవం ఏముంది?
నేను: లోక్ సత్తా సభ్యులు ఇంకా ప్రజా ప్రతినిధులుగా (MLA, MP etc) ఎన్నిక అయ్యుండకపోవచ్చు . కానీ కొన్నిమంచి పనులు చేసిన అనుభవం, ఇంకా చాలా చెయ్యగలమన్న నమ్మకం దండిగా ఉన్నాయి. కారణం లోక్ సత్తా లక్ష్యంఅధికారం కాదు. స్వచ్చమైన రాజకీయం. ప్రస్తుతం మెరుగైన పాలనా, స్వచమైన రాజకీయం అందించే ఒక్కప్రత్యామ్నాయం ఉన్నా లోక్ సత్తా ఇంత గాబరా పడాల్సిన అవసరం ఉండేది కాదు. కాని దురదృష్టవశాత్తు ఇప్పుడు అలాటివి ఎక్కడా కనపడట్లేదు. అందుకని ఈ రాజకీయాలలో మార్పూ తేవాలని క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చింది లోక్ సత్తా. వచినప్పటి నుంచి పదువుల కోసం పాకులాడడం లేదు అధికారం కోసం వేచి చూడటం లేదు. కొన్ని మంచి పనులకి శ్రీకారం చుట్టుంది. దీక్షతోచేస్తోంది. ఉదాహరణకి Vote Mumbai, Vote India, Combat Corruption, NRI Voting rights లాంటి Initiatives. ఇంక J.P ప్రభుత్వ అధికారిగా ఎంత చేశారో చెప్పక్కర్లేదు.
శీను: ఆ .. అదే. లోక్ సత్తా అంటే JP, JP అంటే లోక్ సత్తా. కానీ ఇప్పుడు ఆయ ప్రాంతాల్లో నిలబడే candidates కి face value ఉండాలి కదా, జనాలు వోట్ వెయ్యాలంటే. నాకు, నిజానికి చాలా మందికి, లోక్ సత్తా లో JP తప్ప ఇంకొక్క పేరు కూడా తెలియదు.
నేను: అది నిజమే కానీ మనకి ప్రజా సమస్యలంటే అవగాహన ఉండి, ప్రజలకి ఏదో చెయాలని తపనున్నవాళ్ళు ముఖ్యం. అంతే తప్ప చేతికొచ్చిన పార్టీ జండా పుచ్చుకుని, నోటికొచ్చిన డైలాగులు నాలుగు చెప్పి కేవలం ఎన్నికల టైం లోనే కనిపించేవాళ్ళు కాదు కదా. మనకి కావాల్సింది రీల్ హీరోస్ కాదు రియల్ హీరోస్.
శీను: నువ్వు మరీ లోక్ సత్తా లో తప్ప ఇంకెక్కడా మంచి నాయకులే లేనట్టు చెప్తున్నావ్.
నేను: నా ఉదేశ్యం అది కాదు. నేనూ అందరూ అలాటి వాళ్ళు అనట్లేదు కానీ అధికశాతం అంతే. నా అభిప్రాయం - ఎన్నికలలో నిలబడే వ్యక్తి జనానికి ఏం చేస్తాడు, చెయ్యగలడు అన్నది చూడాలి కానీ అతనికి ఎంత పాపులారిటీ ఉందని కాదు.
శీను: కానీ పాపులారిటీ లేకపోతె అసలా వ్యక్తే తెలియదు. ఇంక వోటేం వేస్తాం.
నేను: నేనొప్పుకుంటా. వ్యక్తి తెలియాలి వోటు వెయ్యాలంటే. దానికి లోక్ సత్తా తనకున్న limited resources తో సాయ శక్తుల ప్రయత్నిస్తోంది. ప్రచారానికి, ఎన్నికలకి కొంత ధనం, జన బలం అవసరం. ఇక్కడ మనలాటి వాళ్ళు సాయపడచ్చు. మనమేం చెయ్యగలం అని కాంగా కూర్చోకుండా ఏదో విధంగా సాయం చెయ్యడానికి నడుం బిగించాలి. అయినా ఇది సాయం కాదు మన బాధ్యత అని నేను అనుకుంటున్నాను.
శీను: ఏ విధంగా?
నేను: పార్టీ లో జేరి ప్రచారం చేయచ్చు. విరాళాలు ఇచ్చి సపోర్ట్ చేయచ్చు. స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి, తెలిసిన వారందరికీ లోక్ సత్తా గురించి చెప్పచ్చు.లోక్ సత్తాలో చేరి ఫండ్స్ సమకూర్చడం, కామ్పయినింగ్ చెయ్యడం లాటివి చెయ్యచ్చు. కొంత మంది తమ ఉద్యోగాలకి శెలవలు పెట్టి మరీ గర్వంగా పని చేస్తున్నారు లోక్ సత్తా లో . రేపు ప్రజలందరికీ పల్లిచ్చే మహా వృక్షానికి తమ వంతు నీళ్లు ఈరోజే పోస్తున్నారు.
శీను: కానీ మన ఫ్రెండ్స్ ఎక్కువగా వేరే దేశాల్లో ఉన్నారు. వాళ్ళకి చెయ్యాలని ఆసక్తి ఉంది కానీ. చెయ్యడం ఎలా?
నేను: చాలా చెయ్యచ్చు. Mailing lists, orkut ,facebook, chats, youtube ఇవన్నీ వాడుకుని బాగా publicise చెయ్యచ్చు. విరాళాలు ఇవ్వచ్చు.ఇంకా ఉత్సాహం ఉంటే లోక్ సత్తా local chapter ని తయారుచేసి ప్రవాసులలోకి ఇంకా తీసుకెళ్ళచ్చు. కుదిరితే శెలవు పెట్టి ఇండియా కెళ్ళి పని కూడా చేయచ్చు(కొంత మంది ఇలా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు).
శీను: బావుంద్రా. వీటిలో కొన్ని నేను try చేశా కానీ, నేను మరీ lobbying చేస్తున్నట్టుంది, మరీ పార్టీ పిచ్చి పట్టింది నాకు అంటున్నారురా.
నేను: రేయ్ నువ్వేమి కేవలం నీ కోసం చెయ్యట్లేదు. ఒక dutiful citizen లా పని నువ్వు చేస్తున్నావు. నువ్వు గర్వపడాలి. ఇదేమీ నువ్వు నీ కోసం పనిచేసే business scheme కాదు. ఇది లోక్ సత్తా ఆరంభించిన స్వరాజ్యోద్యమం. నువ్వు స్వరాజ్య పోరాట యోధుడివి. రెండవ స్వాతంత్ర సమర సైనికుడివి.
శీను: నువ్వు నన్ను మరీ HERO ni చేసేస్తున్నావ్ రా.
నేను: కేవలం వాడి కోసం కాకుండా నలుగురికీ ఎంతో కొంత ఉపయోగపడే పనిచేసే ప్రతీ వాడు నా దృష్టి లో
HERO ---- REAL HERO.
P.S. లోక్ సత్తా గురించి నా సందేహాలు తీర్చి , ఎన్నో కొత్త విషయాలు (ఇందులో చర్చించనవి) చెప్పిన మిత్రుడు శ్రీరాంకి, నాతో వాదించి, నన్ను అలోచింపచేసి కొత్త విషయాలు తెలుసుకునేలా చేసిన మిత్రులకి ధన్యవాదాలతో.


లోక్ సత్తాకి మీ వోటు. మంచి పరిపాలనకి రూటు



Tuesday, March 24, 2009

నేను - శీను - పాలిటిక్స్


నేను: ఈ రోజు న్యూస్ చూసావా? ఎన్నికలు ఊపందుకున్నాయ్
శీను: నాకు పాలిటిక్స్ అంటే allergy.
నేను: ఎందుకు?
శీను: ఆ question చాలా Stupid ga ఉంది. ఏం పాలిటిక్స్రా ఇవి. సగం మందికి ప్రజల సమస్యల అవగాహన లేదు. ఉన్నవారికి చెయ్యాలని ఉద్దేశ్యం లేదు. వాడిని వీడు వీడిని వాడు తిట్టుకోవడం తప్ప వేరొకటి లేదు. న్యూస్ పెట్టాలంటేభయం వేస్తోంది ఏ పార్టీ వాడు ఏం తిట్లు వాడతాడో మా చిన్నుగాడు విని ఏం అర్థం అడుగుతాడేమో అని.
నేను: మరీ అంత pessimistic గా మాట్లాడకురా.
శీను: Pessimistic కాదురా practical. Politics are rotten. ఎవడు గెలిచినా మనమే ఓడిపోతున్నాం రా.
నేను: ప్రజా సమస్యలంటే అవగాహన. వాటికి అనువైన పరిష్కారాలు. ప్రజలకేదో చెయ్యాలన్నా తపన. స్వయంగా చేసిచూపించిన అనుభవం. ఇవన్నీ ఉంటే? ఇంకా మార్పుకి అవకాశం ఉందని నమ్ముతావా? నీ వంతు నువ్వు చేస్తావా?
శీను: ఏంటి లోక్ సత్తా నా ??
నేను: నా ప్రశ్నకు బదులు చెప్పు ముందు.
శీను: రేయ్ నాకు JP అంటే గౌరవం ఉంది. లోక్సత్తా ideals definite గా బానే ఉండుంటాయి . కానీ.
నేను: కానీ .. ఏంటి?
శీను: నీలా నాలా ఆలోచించే వాళ్ళెంత మంది ఉంటార్రా. Mass కి రీచ్ అవ్వగలుగుతుందా? చాల మందికి ఆ పార్టీఉందనే తెలియదు. ఏళ్ళ తరబడి జీర్ణమయిపోయిన అవినీతిని, రాజకీయ సంస్కృతిని మార్చి నీగ్గుకు రావడం foolishly romantic అనిపిస్తోంది.
నేను: రేయ్ problem రాజకీయం లోనో, నాయకులైన రౌడీలు, గుండాలలోనో లేదు. నీ so called mass లో లేదు. నీలో ఉంది. నీలాటి వాళ్ళ pessimism లో ఉంది. ఇది ఇంతే అని ఇది మారదు అనుకునే నిరాశలో ఉంది. విమర్శించడంతప్ప దాన్ని అడ్డుకోని indifference లో ఉంది. Complain చెయ్యడం నా right. మార్చడం, at least మార్చాలనిఆలోచించడం నా duty కాదు అనుకునే నీ escapism లో ఉంది.
శీను: అంటే ఇప్పుడు నేను లోక్ సత్తా కి వోట్ వేస్తె problems అన్ని solve ఐపోతాయా.
నేను: అని నేను అనడం లేదు. వోట్ కూడా చేయని నీకు పాలిటిక్స్ ని, leaders ని విమర్శించే అర్హత లేదుఅంటున్నాను. And నీ ప్రశ్నకు - లోక్సత్తా కి వోట్ వెయ్యగానే వెంటనే change వచ్చేస్తుంది. That will solve all the problems అని నేను అనటం లేదు. But that will be definitely the first step towards the solution. ప్రతీప్రజా సమస్యకి లోక్సత్తా దగ్గర ఒక అమలు చెయ్యదగ్గ పరిష్కారం ఉంది. అవి కార్య రూపం దాల్చడానికి నిర్విరామంగాకృషి చేసే నిజాయితీ పరులైన నాయకులు ఉన్నారు. డబ్బున్న వాళ్ళు, పేరు పలుకుబడి ఉన్నవాళ్లు, MLA, MP లకొడుకులు కాకుండా మన లాటి వాళ్ళని నిలబెట్టే అసలు సిసలైన ప్రజాస్వామ్యం ఉంది. In fact నేను నిజంగా full time devote చేసే ఉద్దేశ్యం ఉంటే నేను నువ్వూ కూడా candidate గ నిలబడచ్చు. ఆ నిలబెట్టే దమ్ము కేవలం
లోక్ సత్తాకే ఉంది.
శీను: అలా ఐతే ఇప్పటి వరకు ఎవరూ ఎందుకు నెగ్గలేదు లోక్ సత్తా నుంచి. ఆ మధ్య ఏవో elections జరిగాయి కదా..
నేను: అది లోక్సత్తా first ఎలెక్షన్ అయినా కూడా తన ఉనికిని చాటుకుంది. అప్పుడున్నది పిల్లకాలువైతే ఇప్పుడన్నదిమహా సముద్రం. అంత ఊపందుకుంది లోక్సత్తా ఇప్పుడు.
శీను: ఐతే ఇప్పుడేమంటావ్. లోక్ సత్తా కి వోట్ వేయమంటావ్?
నేను: కాదు. వోట్ వెయ్యడం నీ బాధ్యత అంటున్నా. నువ్వు చెప్పిన సమస్యలకు పరిష్కారం ఉంది అంటున్నా- లోక్సత్తా రూపం లో. నువ్వు నాగురించి కాదు నీ గురించి వోట్ వెయ్యి.
శీను: నాకు కావలసినది మంచి రాజకీయం. నేను కోరుకునేది మార్పు. ఈ రెండూ ఉన్నా లోక్ సత్తా కి వోట్వెయ్యడానికి ఎందుకు ఇంత ఆలోచించానో నాకే తెలియట్లేదు.
నేను:మనం మార్పును కోరుకుంటాం. కానీ అది మనతో మొదలవ్వాలని మర్చిపోతాం.
మీలో చాలా మంది శీనులు ఉన్నారు. నిజానికి కొన్నాళ్ళ క్రితం వరకు నేను శీను నే. కానీ లోక్ సత్తా గురించి అవగాహనా పెరిగాక, లోక్ సత్తా లో యువ ప్రభంజనం చూశాక నా అనుమానాలు పటాపంచలయ్యాయి. తమఉద్యోగాలు మాని మరీ ఈ మహా యజ్ఞం లో తామూ సైతం సమిధలవుతాము అంటూ లోక్ సత్తా కి కొత్త ఊపిరులు నింపుతున్న యువ రక్తాన్ని ఈ రోజు చూశాక నేను దీంట్లో బాగం కాలేకపోతున్నానని చాలా చాలా బాధగా ఉంది. ఏవిధంగా నైనా ఈ బతుకు బాటకి గొంతు కలపాలని చిన్న ప్రయత్నం.
శ్రీ శ్రీ గారి మాటల్లో ..
పదండి ముందుకు పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పై కి
కదం త్రొక్కుతూ పదం పాడుతూ, హృదంత రాళం గర్జిస్తూ పదండి పోదాం


వోటు వెయ్యడానికి ఆలోచించకండి - ఆలోచించకుండా ఎవరికీ వోటు వెయ్యకండి
లోక్ సత్తా ఇది మీ సత్తా


ఈ టపాకి ప్రేరణ:
http://www.youtube.com/watch?v=qxw-YqVICz4&feature=related

http://www.youtube.com/watch?v=9OlkeQOdKgo&feature=related 


మీ సూచనలు, ప్రశ్నలు, చివాట్లు తప్పక ఇక్కడే తెలియచేయండి.